ఏప్రిల్ 3వ తేదీ మణిబెన్ పటేల్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
బాపూజీ పిలుపును అందుకుని ఆయన సిద్ధాంతాలు ఆశయాల మేరకు స్త్రీ – పురుష/ పేద-ధనిక/కుల-మత-ప్రాంతీయ భేదాలు లేకుండా లక్షలాది మంది ఉద్యమించారు. గాంధీజీ నెలకొల్పిన విద్యాపీఠంలో విద్యను అభ్యసించి, ఆయన పిలుపునందుకుని అన్ని ఉద్యమాలలో పాలు పంచుకుని విజయంవంతం చేశారో మహిళామణి. జైలు శిక్షను అనుభవిస్తూ అక్కడ కూడా ఆశ్రమ కార్యకలాపాలను కొనసాగించిన కార్యశీలి.
స్వతంత్ర్య భారతంలో కూడా పార్లమెంటు సభ్యురాలిగా నిరాడంబర జీవితం గడిపి, నమ్మిన ఆశయాల కోసం పని చేశారు. అనేక స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సేవా కార్యకలాపాలను కొనసాగించారు. అత్యవసర పరిస్థితులను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఆమె ఎవరో కాదు. చిన్న చిన్న సంస్థానాలు, రాజ్యాలుగా ఛిద్రమై ఉన్న భారతదేశాన్ని ఏకం చేసిన రూపశిల్పి సర్దార్ వల్లభై భాయ్ పటేల్ కుమార్తె మణిబెన్ పటేల్.
ఈమె 1903వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన నాటి బొంబాయి ప్రెసిడెన్సీ లోని కరంసాద్లో జన్మించారు. ఈమె తల్లి జవర్బా పటేల్. తండ్రి ఉక్కుమనిషి, బిస్మార్క్ ఆఫ్ ఇండియా, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మన దేశ ప్రథమ ఉపప్రధాన మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్.
ఈమె ఆరేళ్ళ వయసులో తల్లి మరణించారు. మేనమామ విఠల్ భాయ్ పటేల్ ఈమెని పెంచి పెద్ద చేశారు. బొంబాయిలోని ది క్వీన్ మేరీ హైస్కూలులో చదివారు.
జాతీయోద్యమంలో భాగంగా ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టిన బ్రిటిష్ ప్రభుత్వ విధానం ప్రకారం నడిచే పాఠశాలలను బహిష్కరించమని పిలుపునిచ్చారు నాయకులు. ఈ సందర్భంలో వివిధ ప్రదేశాలలో జాతీయ విద్యాలయాలను స్థాపించారు. గాంధీజీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠంలో విద్యను అభ్యసించి డిగ్రీని తీసుకున్నారు.
ఈమె ఆంగ్ల, గుజరాతీ భాషా సాహిత్యాలను అధ్యయనం చేశారు. బెంగాలీ భాషలోనూ ప్రావీణ్యాన్ని సంపాదించారు. తరువాత గోపాలకృష్ణ గోఖలే మహాశయుడు స్థాపించిన ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ’ లో పని చేశారు. వార్ధాలో జానకీదేవి, జమునాలాల్ బజాజ్ వద్ద శిష్యరికం చేశారు.
ఈ కార్యకలాపాల వల్ల, వివిధ భాషా సాహిత్యాల అధ్యయనాల వల్ల మనదేశానికి స్వాతంత్ర్యం అవసరమని ఆమె గ్రహించారు.
1918 నుండి గాంధీజీ సిద్ధాంతాలు, ఆలోచనల పట్ల ప్రభావితులయ్యారు. వాటిని గురించి కూడా అధ్యయనం చేశారు. తండ్రితో పాటు గాంధేయురాలిగా మారారు.
అహమ్మదాబాద్ లోని గాంధీ ఆశ్రమంలో చేరారు. కస్తూర్బా గాంధీ ప్రక్కగదిలో ఉండేవారు. కస్తూర్బాతో ఈమె అనుబంధం ఎనలేనిది. ఆశ్రమ నిర్వహణ కార్యకలాపాలలో కస్తూర్బాకు అన్నివేళల తోడునీడగా ఉండి సహాయ సహకారాలను అందించేవారు.
బాపూజీ పిలుపును అందుకుని అన్ని ఉద్యమాలలోను పాల్గొన్నారు. అన్ని ఉద్యమాలలో సామాన్య కార్యకర్తగా కంటె గొప్ప ఉద్యమకారిణిగా ఉద్యమించారు.
1923-24లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల మీద భారీస్థాయిలో పన్నులను విధించింది. పన్ను చెల్లించనివారి కొద్దిపాటి ఆస్తులను పశువులతో సహా జప్తు చేసి స్వాధీన పర్చుకుంది. గాంధీ పిలుపు ఇచ్చిన ఈ పన్ను నిరాకరణోద్యమంలో మహిళలు పాల్గొనేట్లుగా చేశారు మణిబెన్. 1928లో బార్డోలీ సత్యాగ్రహానికి సర్దార్ పటేల్ నాయకత్వం వహించారు. బార్డోలీ సత్యాగ్రహామంటేనే పటేల్ సత్యాగ్రహమని పేరు. ఈ ఉద్యమంలో కూడా మహిళల భాగస్వామ్యం కోసం కృషి చేసి విజయం సాధించారు మణిబెన్. 1938లో రాజ్‌కోట్ సంస్థానంలో ప్రజలకు ఇబ్బందులను కల్పించింది ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా కస్తూర్బాతో కలిసి ఉద్యమాన్ని నడిపించారు ఈమె. ఈ విధంగా వివిధ ఉద్యమాలలో పాల్గొని గొప్ప పోరాట యోధురాలనిపించుకున్నారు. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ బహిష్కరణోద్యమంలతో పాటు ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొని పలుసార్లు జైలు శిక్షని అనుభవించారు.
1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఈమె అరెస్టయ్యారు. 1945 వరకు ఎఱవాడ సెంట్రల్ జైలులో నిర్బంధించబడ్డారు. నిజం చెప్పాలంటే ఈమె జైలునే గాంధీజీ ఆశ్రమంగా మార్చారనడం అతిశయోక్తి కాదు. ఉదయం నిద్రలేవడం తోనే ప్రార్థన చేసి చేయించేవారు. నూలు వడకడం, వ్యాయామం, యోగాభ్యాసం, పరిశుభ్రతా, కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనడం, చదవడం, నిరక్షరాస్యులకి చదువు నేర్పించడం, ఖైదీలలోని రోగులకు సపర్యలు చేయడం మొదలయిన వాటిని ఆచరణలో చూపారు. నిజమైన గాంధేయురాలిగా, నిరాడంబరురాలిగా చరిత్రలో నిలిచారు.
ఈమెకి తండ్రితో బాల్యంలో అంత అనుబంధం లేదు. కాని తను పెద్దదయి విద్యావంతురాలవుతున్న సమయంలో తండ్రితో అనుబంధాన్ని, ఆత్మీయతని పంచుకున్నారు. 1930ల నుండి తండ్రికి సహాయకురాలిగా వెళ్ళేవారు. ఆయన కార్యకలాపాలలో పాలు పంచుకునేవారు.
ఆయన చేసే పనుల దగ్గరుండి చూసుకునేవారు. పర్యవేక్షించేవారు. ఆయన రాజకీయ వ్యవహారాలు; వివిధ పదవులలో నియమితులైనప్పుడు నిర్వహించిన విధులు, ఉద్యమాలు అవి ఇవి అనేమిటి? అన్ని పనులను డైరీలో నమోదు చేశారీమె. ఆయనకు సన్నిహితంగా మెలిగి తల్లిలా సేవలను అందించారు.
కార్యదర్శినిగా బాధ్యతలను నిర్వహించారు. భారత్ పునర్నిర్మాణంలో తండ్రితో పాటు నిజాయితీ, క్రమశిక్షణలతో పని చేశారు. ఈమె వినయ విధేయతలు అద్వితీయమైనవి. దేశం పట్ల క్రమశిక్షణాయుత నిబద్ధతతో పని చేశారు.
1950లో సర్దార్ పటేల్ మరణం తరువాత అప్పుటి ప్రథమ భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూని కలిశారు. తన తండ్రి నెహ్రూకి అందించమని ఆదేశించినట్లు 35 లక్షల రూపాయలను, కాంగ్రెస్ పార్టీ ఖాతాల పుస్తకాన్ని ఆయనకు అందించారు. నెహ్రూ వాటిని తీసుకుని మౌనంగా ఉండిపోయారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా మన దేశ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. తన స్వరాష్ట్రం గుజరాత్ కాంగ్రెస్‌కి విశిష్ఠమైన సేవలను అందించారు. సుమారు ఏడేళ్ళపాటు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగాను, సుమారు మూడేళ్ళపాటు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శినిగా సేవలను అందించారు. గుజరాత్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి అద్వితీయమైన సేవలను అందించారామె.
మొదటి లోక్‌సభకి జరిగిన ప్రథమ సాధారణ ఎన్నికలలో గుజరాత్ లోని ‘ఖైరా’ నియోజక వర్గం నుండి ఎన్నికయ్యారు. రెండవ లోకసభకి జరిగిన ద్వితీయ సార్వత్రిక ఎన్నికలలో ‘ఆనంద్’ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 1964 నుండి 1970 వరకు ఎగువసభ రాజ్యసభ సభ్యురాలిగా సేవలను అందించారు.
1969లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విడిపోయినప్పుడు ఈమె ఇందిరాగాంధీని విడిచి పెట్టారు. కాంగ్రెస్ ‘O’ అభ్యర్థిగా 1973లో సబరకాంత నియోజకవర్గ ఉప ఎన్నికలలో విజయం సాధించారు.
1976లో మన దేశంలో అత్యవసర పరిస్థితులను ప్రకటించినపుడు అనేక మంది ప్రముఖ ప్రతిపక్షనాయకులు, పాత్రికేయులతో పాటు ఈమె కూడా అరెస్టయ్యారు.
1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ లోక్‌దళ్ పార్టీ తరపున మెహసానా నియోజకవర్గం నుంచి లోకసభకి ఎన్నికయ్యారు.
ఈమె తన కార్యక్షేత్రాన్ని బొంబాయి నగరానికి మార్చుకున్నారు. తన తండ్రి సంస్మరణార్థం ‘సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మెమోరియల్ ట్రస్టు’ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అనేక విధాలుగా సేవలను అందించారు. ఈమె ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలను అందించారు. వీటిలో గుజరాత్ విద్యాపీఠ, వల్లభ విద్యానగర్, బార్డోలి స్వరాజ్ ఆశ్రమ్, నవజీవన్ ట్రస్ట్ కొన్ని. ఈ సంస్థల ఆధ్వర్యంలో 1990 వరకూ సేవలను అందించారు. అనేక విద్యాసంస్థలతో అనుబంధాన్ని పెంచుకున్నారు తన సేవలను అందించారు.
1936 జూన్ 8వ తేదీ నుండి 1950 డిసెంబర్ 15వరకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిత్యజీవితానికి ఈమె డైరీ అద్దం పడుతుంది (ఈమె జైలు జీవితం సమయం, తండ్రి వద్దలేని పమయంలో తప్పించి).
ఈమె తండ్రి జీవిత చరిత్రని గ్రంథస్థం చేసి ‘ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ సర్దార్ పటేల్: ది డైరీ ఆఫ్ మణిబెన్ పటేల్ 1936-50’ పేరుతో భారత జాతికి అందించారు. ఈ విధంగా కన్నతండ్రి ఋణాన్ని, తద్వారా జన్మభూమి ఋణాన్ని తీర్చుకున్న గొప్ప మహిళా రత్నం. నాలుగు సార్లు పార్లమెంటు సభ్యురాలైనా ఎటువంటి ప్రలోభాలకూ లోనవలేదు. చాలా చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఇప్పటి రాజకీయ నాయకులకి ఈమె రాజకీయ జీవితానికి చాల వైరుధ్యం కనిపిస్తుంది. రైలులో మూడవతరగతి బోగీలోనే ప్రయాణించేవారు. పేద ప్రజల పెన్నిధిగా నిలిచారు. ఈనాటి రాజకీయ నాయకులు ఆమెని చూసి నిజంగా సిగ్గుతో తలలు వంచుకోవాలంటే అతిశయం కాదు.
భారతదేశ తొలి ఉప ప్రధాని, హోమ్ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి మహామనిషి కుమార్తె/స్వయంగా 4 సార్లు లోక్‌సభకి, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయిన పార్లమెంటు సభ్యురాలు/వివిధ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలందించిన సేవామూర్తి అతి నిరాడంబరురాలు, ఎల్లప్పుడూ రైలులో 3వ తరగతిలోనే ప్రయాణించే సామాన్యురాలు ఈమె. తమ రాజకీయ పదవులను స్వార్థానికి ఉపయోగించుకోని చరితార్థురాలు ‘మణిబెన్ పటేల్ గొప్ప మహిళా మణి రత్నం’.
ఈమె జ్ఞాపకార్థం భారత తపాలాశాఖ ది. 13-10-2021వ తేదీన ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్’ సందర్భంగా ఒక ప్రత్యేక కవర్‌ను విడుదల చేసి గౌరవించింది.


ఈ కవర్‌పై నేలమీద కూర్చుని నవ్వుతూ పుస్తకం చదువుకుంటున్న మణిబెన్ కనిపిస్తారు. ఆమెకి కుడివైపున పై భాగంలో ఆమె ఫోటో కనిపిస్తుంది.
ఏప్రిల్ 3వ తేదీన ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

4 Comments
P.Usha Rani
నిజమైన గాంధేయవాది అయిన Maniben gaari jeevitha charithranu chusi ee tharam politicians chalaa nerchukovali….chala bagundhi madam meeru vrasina vyaasam.


కొల్లూరి సోమ శంకర్
Excellent article on Maniben Patel



ఈమని శివనాగిరెడ్డి
కొల్లూరి సోమ శంకర్
I have no idea about the great lady. You have enlightened me. Thank you very much.Excellent events narration.
A. Raghavendra Rao
Jhansi Lakshmi
స్ఫూర్తిదాయకమైన జీవితాలు..
జీవనంలో సరళత , నిస్వార్ధత , దేశభక్తి వారిని మహోన్నతులను చేశాయి..విలువలతో కూడిన వారి జీవితం మనకు విలువైన పాఠం!