సెప్టెంబర్ 5 వతేదీ మదర్ థెరీసా వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
మానవత్వం మూర్తీభవించిన మహిమాన్విత, అభాగ్యులను, అన్నార్తులను, రోగార్తులను, అనాథలను తన చల్లని చేతులతో చేరదీసి, సేవ చేసిన మాతృమూర్తి ఆమె. మానవసేవే మాధవ సేవగా భావించి ఆ సందేశానికి ప్రతీకగా నిలిచిన మానవతామూర్తి ఆమె.
శాంతి, స్నేహం, దయ, ప్రేమ, సహానుభూతులే ధ్యేయమైన అమృతమూర్తి, త్యాగమయి, స్నేహశీలి, ప్రేమమయి ఆమె.
అనాథలు, రోగిష్టులు, దివ్యాంగులు, వృద్ధులు, అంటువ్యాధుల భాదితులు, మరణించే సమయానికి చేరువయిన వారికి ఆపన్న హస్తం అందించిన ‘విశ్వమాత’ – ‘భారతరత్న’ ఆమె.
ఈమె నేటి మాసిడోనియా నాటి యుగోస్లేవియాలోని స్కోప్జేలో 1910 ఆగష్టు 26వ తేదీన జన్మించారు. పుట్టిన మరునాడే తల్లిదండ్రులు బాప్టిజమ్ (జ్ఞాన స్నానం) చేయించారు. తల్లిదండ్రులు నికోల్లె, డ్రాన బొజాక్షిహ్యూలు. ఆమె 3వ ఏట తండ్రి మరణించారు.
తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆగ్నేస్ గోంక్షా బొజాక్షి హ్యూ (Anjezë Gonxhe Bojaxhiu) బాల్యం నుండీ క్రైస్తవమత ప్రచారకుల జీవితకథలు, సేవలు ఈమెను ఆకర్షించాయి. రోమన్ కేథలిక్ మతాన్ని స్వీకరించారు. మతానికి జీవితాన్ని అంకితం చేయాలనుకున్నారు. కొంతకాలం తరువాత పద్దెనిమిదేళ్ళ వయసులో ‘సిస్టర్స్ ఆఫ్ లొరెటో’ సంస్థలో చేరారు.
తరువాత ఈ సంస్థలో ఉపాధ్యాయినిగా చేరడం కోసం సన్నద్ధమయ్యారు. భారతదేశ విద్యార్థులకు ఇంగ్లీషు భాషను నేర్పించడం కోసం ఐర్లాండ్ లోని రాత్ ఫార్న్ హామ్ లోని శిక్షణా సంస్థలో శిక్షణ తీసుకున్నారు. ఈ సంస్థ ‘లోరెటో అబ్బే’లో ఉంది. దీని పేరు ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది బ్లెస్ వర్జిన్ మేరీ’. ఇక్కడ శిక్షణ పూర్తయ్యాక 1929లో డార్జిలింగ్ చేరుకున్నారు. అక్కడి పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయినిగా పని చేశారు. సన్యాసినిగా ప్రతిజ్ఞ చేశారు. ఆ తరువాత తన కుటుంబ సభ్యులను కలవలేదు. అంత నిబద్ధత, నియమాలని పాటించారు.
కలకత్తా ఆమె కార్యక్షేత్రంగా మారింది. ఆమె సుమారు 20 సంవత్సరాలు ఈ నగరంలోని ఎంటల్లీలోని లోరెటో పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేసిన తరువాత ప్రధానోపాధ్యాయురాలయ్యారు. తన పేరుని ‘థెరీసా’గా మార్చుకున్నారు.
1943 నాటికి బెంగాల్లో కరువు విలయ తాండవం చేసింది. కరువు, కాటకాలు ఏర్పడ్డాయి. కలకత్తాలోని పేదరికం ఆమె మనసును కలచివేసింది. 1946 నాటికి హిందూ, ముస్లిం పరిస్థితిని మరింత దిగజార్చాయి.
ఉపాధ్యాయులుగా పని చేసేవారు చాలామంది ఉంటారు. కాని సమాజసేవకు త్వరగా ఎవరూ ముందుకు రారు. కాని ఉద్యోగం మానేసి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారీమె.
రోమ్‌లో పోప్ అనుమతిని తీసుకున్నారు. 1950లో ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ సంస్థను స్థాపించారు. అంతకు ముందు కొంతకాలం పాట్నాలోని హోలీ హాస్పటల్లో ప్రాథమిక చికిత్సాపద్దతులను నేర్చుకున్నారు. భారతీయ సంస్కృతి పట్ల గౌరవం ప్రదర్శించడం కోసం చీరను ధరించడం మొదలు పెట్టారు. అది నీలిరంగు అంచు తెల్లచీర.
1952లో కలకత్తాలోని శిథిలమైన కాళీఘాట్ని సంస్థ నిర్వహణ కోసం తీసుకున్నారు. దానికి ‘నిర్మల హృదయ్’ అని పేరు పెట్టారు. తన పేరును ‘మదర్ థెరీసా’ గా మార్చుకున్నారు. నాడు 13 మంది సభ్యులతో ఈ సంస్థ మొదలయింది. ఆమె మరణించేనాటికి 4000 మంది సభ్యులు దేశ, విదేశాలలో ఈ సంస్థల ద్వారా సేవలందించడం చారిత్రక నిజం.
మానవులకు మరణించే ముందు తన వారితో ప్రశాంతంగా గడపాలని, తమ ఆవేదనని వారి సాంగత్యంలో మరచిపోవాలని, మనశ్శాంతిగా మరణించాలనే ఆశ ఉంటుంది. అయితే కొంత మందికి ఈ కోరిక తీరే పరిస్థితులు ఉండవు.
ఒక రోజు కలకత్తాలో రోడ్డు పక్కన ఒక అనాథ వృద్ధులు చాలా హీన పరిస్థితులలో థెరీసాకి కనిపించారు. ఆమె తన ఇంటికి తీసుకుని వచ్చి శుశ్రూషలు చేశారు. ఆప్యాయంగా లాలించి, ప్రశాంతంగా మరణించేట్లు సేవలు చేశారు. అప్పుడు ఆమె చనిపోయేవారిని ఆదరించి, ఆహ్లాదపరిచి, తాము అనాథలం కాదని, తమ కోసం బాధపడి పరితపించేవారున్నారని చెప్పడం కోసం అటువంటి వారందరినీ ఒక చోట చేర్చాలని ఆకాంక్షించారు. ఈ సంకల్పబలమే 1952లో ‘హోమ్ ఫర్ ది డైయింగ్’ సంస్థను స్థాపించేందుకు దోహదపడింది.
అనాథలు, నిరాశ్రయులయిన పిల్లల కోసం 1955లో ‘శిశుభవన్’లను ఏర్పాటు చేశారు. వృద్ధుల కోసమే కాక వివిధ రకాల వ్యాధులు, వైకల్యము, మానసిక వేదనలతో బాధపడే బాధితుల కోసం కొన్ని సంస్థలను స్థాపించారు.
కుష్టువ్యాధి బాధితుల కోసం శాంతినగర్ అనే ధర్మశాలను స్థాపించారు. వారికి డ్రెస్సింగ్ చేయడం కోసం నర్లను నియమించారు. మందులందించే ఏర్పాటు చేశారు.
వారు వీరు అనే తేడా లేకుండా అంధులు, అనాథలు, వికలాంగులు, నిరాశ్రయులు, మానసిక రోగులు, అనాథ పిల్లలు, వృద్ధుల కోసం ఎన్నో శరణాలయాలను స్థాపించారు.
వివిధ దేశాల నుండి అమితమైన నిధులు ఈ సంస్థలకు అందడం గొప్ప విశేషం. ఆ నిధులతోనే విశ్వవ్యాప్తంగా వేలాది సంస్థల ద్వారా సేవలందించగలిగారామె.
అంతర్జాతీయంగా సేవలను అందించడం కోసం 1963లో సోదరుల కోసం, 1976లో సిస్టర్స్ కోసం సంస్థల శాఖలను స్థాపించారు.
1960ల నాటికి ఈ సేవలను విదేశాలకు కూడా విస్తరింపజేశారు. వెనిజులా, ఇటలీ, టాంజానియా, ఆస్ట్రియా, అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలలోని అనేక దేశాలలో థెరీసా స్థాపించిన సంస్థలు సేవ చేయడంలో ముందున్నాయి.
1970ల నాటికి అమన్, జోర్డాన్, ఇంగ్లండ్, అమెరికాలలో సేవలను మరింత విస్తృత పరిచారు. 1979 నాటికి 25 దేశాలలో సుమారు 200 రకాల సేవలను తమ సంస్థల ద్వారా అందించారు.
1980ల నాటికి తనని వ్యతిరేకించే కమ్యూనిస్ట్ దేశాలయిన క్యూబా, రష్యాలలో కూడా సేవా సంస్థలను స్థాపించి సేవలను అందించడం విశేషం.
1990ల కాలంలో ప్రపంచమంతా వ్యాపించిన HIV (AIDS) వ్యాధి బాధితుల కోసం కూడా ప్రత్యేక శరణాలయాలను స్థాపించారు. ఈ సంస్థలలో ఈ వ్యాధి బాధితులు ప్రశాంతంగా, జీవితాన్ని గడపటానికి ఏర్పాట్లు చేశారు. వారి మానసిక వేదనని అర్థం చేసుకుని సానుభూతిని, సహానుభూతిని అందించారు. ఈ అన్ని రకాల ఆశ్రమాలు, సంస్థలలో ఆమె సిద్ధాంతాలను ఆచరించి, సేవలందించిన మానవతామూర్తులెందరో? వేలాదిమంది మానవీయ కోణంలో సేవలను అందించారు. మదర్ థెరిసా మాటే వారికి వేదం. ఆమె చెప్పిన పనులు చేయడం, అవసరమయిన వారికి అన్ని విధాలుగా చేయూతనందించడం వారి విధి. సేవ చేయడంలో ఆనందాన్ని పొందేవారు.
1991లో తన జన్మభూమి ఆల్బేనియాలోని ‘టిరానా’లో ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్రదర్స్ హోమ్’ను స్థాపించి ఋణం తీర్చుకున్నారు.
విశ్వవ్యాప్తంగా వివిధ సంస్థల ద్వారా వివిధ రంగాలలో అభాగ్యులు, అనాథలు, వ్యాధి పీడితులు, వృద్ధులు, మానసిక శారీరక దివ్యాంగులు మొదలైన వారికి ఈమె అందించిన సేవలు చిరస్మరణీయం. అందుకే ప్రపంచం ఆమెను ‘విశ్వమాత’ అని ఆప్యాయతతో పిలుచుకున్నారు.
ఈమెకు చాలా పురస్కారాలు లభించాయి. భారత ప్రభుత్వం 1962లో పద్మశ్రీ, 1980లో భారతదేశంలో అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’లతో ఈ రత్నాన్ని గౌరవించింది. 1972లో జవహర్లాల్ నెహ్రూ పేరిట ‘అంతర్జాతీయ అవగాహన’ పురస్కారాన్ని అందించింది. 1962లో ఫిలిప్పీన్స్ వారి ‘రామన్ మేగసేసే పురస్కారం అందుకున్నారు. 1971లో మొదటి పోప్ జాన్ XXIII ‘శాంతి బహుమతి’ని అందించారు. 1973లో ‘టెంపుల్టన్ బహుమతి’ని అందుకున్నారు. 1983లో యునైటెడ్ కింగ్డమ్ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను, అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1996లో అమెరికా గౌరవ పౌరసత్వాన్ని అందించారు.
1979వ సంవత్సరంలో ‘నోబెల్ శాంతి బహుమతి’ని అందుకున్నారు.
“ఆమే ఐకరాజ్యసమితి. ఆమే ప్రపంచంలోని శాంతి” అని ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధానకార్యదర్శి పెరిజ్ డిక్యులర్ ప్రశంసించారు. అమెరికాలోని ఒక సర్వేలో “20వ శతాబ్దిలో అత్యధిక అభిమానం పొందిన ‘వ్యక్తి'”గా ఎంపిక చేయబడ్డారు.
1983లో ఈమె పోప్ జాన్ II ని దర్శించడం కోసం రోమ్ నగరానికి వెళ్ళారు. అక్కడ గుండెపోటు వచ్చింది. రోజు రోజుకీ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. 1989లో 2వ సారి గుండెపోటుకి గురయ్యారు. 1996లో మెడ ఎముక విరిగింది.
ఈమె అనారోగ్యం పాలయినపుడు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అధినేత పదవికి రాజీనామా చేస్తానన్నారు. అయితే సభ్యులు అంగీకరించలేదు. చివరకు 1997 మార్చి 13వ తేదీన పదవిని త్యజించారు. 1997 సెప్టెంబర్ 5 వ తేదీన కలకత్తాలో మరణించారు.
ఈమె మరణించిన తరువాత పోప్ జాన్‌పాల్ II బీటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. బీటిఫికేషన్ కోసం మోటికా బెర్కేసును గుర్తించారు. బీటిఫికేషన్ తరువాత కాననైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2002లో దీనికి సంబంధించిన ఉత్తర్యులను ధృవీకరించారు. 2003 అక్టోబర్ 19 వ తేదీన పోప్ మదర్ థెరీసా కు దీవెనలందించారు. రెండు వైద్యకేసులను ఈమె నయం చేశారనడానికి సాక్ష్యాలు లభించినట్లు అంగీకరించింది వాటికన్ చర్చి.
చివరకు 2016 సెప్టెంబర్ 4 వ తేదీన మదర్ థెరీసాను సెయింట్ (సన్యాసినిగా) ప్రకటించారు. ఆ నాటి నుండి మదర్ థెరీసా’ సెయింట్ థెరీసా’ గా మారారు.
ఈమె జ్ఞాపకార్థం 4 సార్లు స్టాంపులను విడుదల చేసింది భారత తపాలాశాఖ.
1980 ఆగష్టు 27 వ తేదీన 30 పైసల విలువతో తొలిస్టాంపు విడుదలయింది. ఎడమ వైపున నోబెల్ శాంతి బహుమతికి ఇచ్చే మెడల్ చిత్రం, కుడివైపున విశ్వమాత మదర్ థెరీసా ఆ మెడల్ని మురిపెంగా చూస్తున్నట్లుగా అ(కనిపిస్తుంది). ఊదారంగులో ముద్రించిన స్టాంపు అందంగా దర్శనమిస్తుంది.


1997 డిశంబర్ 15వ తేదీన ‘INDEPEX97’ (INTERNATIONAL STAMP EXHIBITION, NEW DELHI) ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ స్టాంపుల ప్రదర్శనలో ‘మదర్ థెరీసా- మీని యేచర్ షీటు’ ను విడుదల చేసింది తపాలాశాఖ.


నలభై ఐదు రూపాయల విలువగల ఈ షీటు మీద ఎడమ వైపున నమస్కరిస్తున్న మదర్ థెరీసా చిత్రం, దాని పైన భారతస్వాతంత్ర్య స్వర్ణోత్సవ లోగోలు కనిపిస్తాయి. దాని క్రింద SPEED POST అని వ్రాసి ఉంటుంది. కుడి వైపున అభాగ్యుడయిన శిశువుని అక్కున చేర్చుకున్న దయామయి థెరీసా చిత్రం, దాని క్రింద STAMPS EXHIBITION EMBLEM (INDEPEX97) కనిపిస్తాయి.
2008 డిశంబర్ 12 వ తేదీన ‘అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన’ దినోత్సవం సందర్భంగా రూ 5-00ల విలువగల స్టాంపు విడుదలయింది. ఈ స్టాంపు మీద విశ్వవ్యాప్తి పొందిన నలుగురు మానవీయమూర్తులు మహాత్మాగాంధీ, అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్‌లతో పాటు మదర్ థెరీసా చిత్రాన్ని ముద్రించి మానవతా మూర్తిలను గౌరవించింది భారత తపాలాశాఖ.


మదర్ థెరీసాను ‘సెయింట్’ గా ప్రకటించిన సందర్భంగా 2016 సెప్టెంబర్ 4వ తేదీన రూ.5-00ల విలువతో ఒక మీనియేచర్ షీటును విడుదల చేసింది మన తపాలాశాఖ. ఈ స్టాంపు మీద ఎడమవైపున లోకానికి రెండు చేతులెత్తి అభివాదం చేస్తున్న చిత్రం, కుడివైపున మదర్ థెరీసా చిత్రంతో స్టాంపు కనిపిస్తుంది. ఈ చిత్రాల వెనుక వాటికన్ సిటీలోని కట్టడాలు కనిపిస్తాయి.


మొత్తం మీద ఈ స్టాంపులు, మీనియేచర్ షీట్ల మీద ఉన్న థెరీసా చిత్రాలన్నీ వారి సంస్థ ఏకరూప దుస్తులయిన ‘నీలిరంగు అంచు తెల్లచీర’లో ప్రశాంత వదనంతో అభయమిస్తున్నట్లు ముద్రించింది. ఆమె మానవత, మానవీయ విలువలకు భారత తపాలాశాఖ ఈ విధంగా అంజలి ఘటించింది.
ఈమె వర్థంతి సెప్టెంబర్ 5వ తేదీ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

5 Comments
Prameela
మూర్తీభవించిన మానవత్వం, సేవాదృక్పథం కలిగిన విశ్వమాత సెయింట్ ధెరిస్సా రోగులకు, వృద్ధులకు, చిన్నారులకు చేసిన సేవలు అసామాన్యం. ఆమెకు నా హృదయపూర్వక నివాళులు.


Jhansi Lakshmi
ఆ కరుణామూర్తి గురించి ఎం చెప్పగలం..
మనం జీవించిన కాలంలో అవిడ జీవించారని గర్వపడటం తప్ప..! అద్బుత స్త్రీ మూర్తి,గొప్ప మానవి, సమాజసేవకురాలు, శాంత స్వరూపిణీ.పేడలపాలిటి పెన్నిధి.విదేశాల్లో పుట్టి మన దేశానికి వచ్చి సేవ చెయ్యటం మన దేశం చేసుకున్న అదృష్టం..ఆవిడ గురించి ఎన్ని సార్లు చదివినా తనివితీరదు..Thank you mam
మరోసారి ఆ మహనీయుిరాలుని గుర్తు చేశారు.. స్టాంపులతో సహా ఆవిడ జీవితాన్ని మా ముందుంచారు..మా మనసు తడి చేశారు.. కుడోస్
కొల్లూరి సోమ శంకర్
Vyasam adirindi. Mother naa favourite woman. Ippudu amenu gurinchi saantam telisindi. Maa grandmother achhu amelaage undevaaru..90 yella paine batikasru..endarno saakaaru.
Congrats! Facebook lo pettanu.
A. Raghavendra Rao, Hyd
Alluri Gouri Lakshmi
Mother Theresa నిజంగా విశ్వమాత.నొబెల్ శాంతి బహుమతి పొందిన భారతరత్న ఆమె..మన బాపూజీ ఆమే కారణ జన్ములు..వారికి నమస్సులు..నాగలక్ష్మి గారికి ప్రత్యేక అభినందనలు.
కొల్లూరి సోమ శంకర్
మాత థెరిస్సా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.మీరు అలాంటి దివ్యమూర్తి గురించి తెలియజేసి ధన్యులయ్యారు.

నాగలక్ష్మి గారూ, ఇలాంటి కారణజన్ముల గురించి పరిశోధించి వారి గురించి వ్రాసే అవకాశం లభించిన మీకు ధన్యవాదములు.నిజంగా ఈ ఆణిముత్యాలను , ప్రాతఃస్మరణీయులను మీ ద్వారా ఇంకా మరికొంత తెలుసుకుంటున్నాము.
వి. జయవేణి