డిసెంబర్ 25 రాణి వేలు నాచియార్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
భారత స్వాతంత్ర పోరాటం వివిధ సందర్భాలలో వైవిధ్యభరితంగా జరిగింది. స్త్రీ, పురుష భేదం లేకుండా కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలతో ప్రమేయం లేకుండా జరిగింది. శాంతియుత పద్ధతులలోనే కాదు, యుద్ధాలలోనూ మహిళల పాత్ర దర్శనమిస్తుంది. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో యుద్ధం చేసి గెలిచి రాజ్యపాలనను కొనసాగించిన రాణులున్నారు. వారికి సహాయంగా ఆత్మాహుతితో ప్రాణత్యాగం చేసిన అపర వీరనారీమణులూ ఉన్నారు. ఇటువంటి రాణులలో ‘శివగంగ’ రాణి వీరగంగై (వీరవనిత)గా పేరు పొందిన ‘రాణి వేలు నాచియార్’ ఒకరు.
ఈమె 1730 జనవరి 3వ తేదీన రామనాథపురం రాజ్యంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు రాణి శఖంది మతత్తల్ నాచియార్, చెళ్ళముత్తు విజయ రఘునాథ సేతుపతిలు. గణపతి దేవుడు రుద్రమదేవిని పెంచినట్లు ఈ దంపతులు కూడా కుమార్తెను మగపిల్లవాడిని పెంచినట్లే పెంచారు.
ఈమె బాల్యం నుండి యుద్ధవిద్యలయిన గుర్రపుస్వారీ, విలువిద్య, కర్రసాము, మల్లయుద్ధం వంటి వాటితో పాటు సేతుపతుల సాంప్రదాయ యుద్ధవిద్యలను అభ్యసించారు. పరిపాలనా నైపుణ్యాన్ని సంపాదించారు. న్యాయ శాస్త్రం, తర్కము, మీమాంసలలో కూడా ప్రావీణ్యురాలు.
ఆ రోజులలో మహిళలు బయటకు రావడానికి చాలా ఆంక్షలుండేవి. చదువుకునే అవకాశాలు తక్కువగానే ఉండేవి. అయినప్పటికీ ఈమె చదువుకున్నారు. అంతే కాదు, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంలతో పాటు ఉర్దూ, ఆంగ్లం, ఫ్రెంచి భాషలలోను పట్టు సంపాదించడం అద్వితీయం, అపురూపం, అబ్బురం, ఆశ్చర్యం, ఆనందకరం. మహిళాలోకానికి గర్వకారణం.
తమిళ భాషలో ప్రాచీనమైన గొప్పదైన సంగమ సాహిత్యాన్ని చదివారు. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలను ఔపోసన పట్టారు. కవులను, పండితులను, కళాకారులను ప్రోత్సహించిన కళాపోషకురాలీమె. గురుకులాలని ఏర్పాటు చేశారు.
‘శివగంగ’ని రాజకుమారుడు ముత్తువడుగనాథ పెరియవ ఉదయథేవర్ పరిపాలించేవారు. వీరితో వేలు నాచియార్ వివాహం జరిగింది. అప్పుడప్పుడే భారతదేశంలోని ప్రాంతాలను ఆక్రమించుకునే పనిలో నిమగ్నమయ్యారు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీవారు. వీరి కన్ను ‘శివగంగ’ రాజ్యం మీద కూడా పడింది.
ఈ కంపెనీవారు తమ కీలుబొమ్మ అయిన ఆర్కాట్ నవాబుతో కలిసి ఉదయథేవర్తో తలపడ్డారు. కలైయకోయల్ వద్ద జరిగిన యుద్ధంలో ఉదయథేవర్ మరణించారు. ఈ సమయంలో వేలు నాచియార్ కూడా బ్రిటిష్ వారితో యుద్ధం చేయాలనుకున్నారు కాని అందుకు తగిన సైన్యం ఆమె దగ్గర లేదు. ఈమె కుమార్తె విళ్ళాచ్చి.
కుమార్తెను తీసుకుని దిండిగల్ సమీపంలోని నిరూపాక్షకి వెళ్ళి తలదాచుకున్నారు. తమ రాజ్యాన్ని తిరిగి తమ చేతులలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
పాలయకారర్ గోపాల నాయకర్ ఈమెకు రక్షణనిచ్చారు. వీరితోను, శ్రీరంగపట్నం సుల్తాను హైదరాలీలతోను స్నేహ ఒప్పందాలని కుదుర్చుకున్నారు. గెరిల్లా సైన్యాన్ని తయారు చేశారు. ఈమె అనుసరించిన యుద్ధతంత్రాలకు, రాజనీతికి ప్రతిఫలం లభించింది. ఆర్కాట్ నవాబు ఈమెను, ఈమెకు సహకరిస్తున్న మరుదు సోదరులకు ‘శివగంగ’ రాజ్యంలో ప్రవేశించేటందుకు అనుమతించాడు. సామంతుల లాగా కప్పం చెల్లించాలని కోరాడు.
ఈమె ఉర్దూ భాషా ప్రావీణ్యానికి, ఈస్టిండియా కంపెనీతో యుద్ధం చేయవలసిన అవసరాన్ని విశ్లేషించిన తీరుకి హైదరాలీ ముగ్గులయ్యాడు. నెలకు 400 పౌండ్ల ధనాన్ని సాయంగా అందించారు. 5000 కాల్బలాన్ని, 5000 అశ్విక దళాన్ని సహాయంగా పంపించారు. కావలసిన ఆయుధాలని అందించారు. వీటిని అత్యంత నైపుణ్యంగా ఉపయోగించుకున్నారు నాచియార్. సుమారు 20,000 వేల మంది సైన్యంతో యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు.
మంచి నైపుణ్యం గల గూఢచారి దళాన్ని తయారు చేశారు. చీటికీ మాటికీ తమ స్థావరాలని మార్చుకుంటూ శత్రువులకి పక్కలో బల్లెంలా మారారు. బ్రిటిష్ వారి ఆయుధాగార ఆచూకీ తెలుసుకున్నారు.
గూఢచారిణులలో ఈమెకు దత్తపుత్రికలున్నారు. మహిళా సైన్యాన్ని తయారు చేశారు. వీరు కుయిలీ అనే మహిళ నేతృత్వంలో గ్రామీణ స్త్రీల వేషధారణలో కోటలో ప్రవేశించారు. పూజలు చేసుకునే అమ్మాయిలలా నటించారు. తరువాత చూపించారు తమ ప్రతాపాన్నీ, తెలివితేటలనీ. కత్తులతో దాడి చేసి కాపలాదారులని చంపారు.
కుయిలీ తన శరీరం మీద నెయ్యి పోసుకుని ఆయుధాగారం లోకి ప్రవేశించింది. నిప్పంటించుకుని ఆయుధాగారాన్ని పేల్చివేసింది. ఈ విధంగా తొలి ఆత్మాహుతి యోధురాలిగా చరిత్రను సృష్టించింది. ఈమె వేలు నాచ్చి అని భ్రమించారు బ్రిటిష్ వారు.
ఉదైవల్ అనే మరోమహిళా యోధురాలు కూడా ఆయుధాలని పేల్చివేసింది. ఆ తరువాత ఉదైవల్ పేరుతో మహిళా సైన్యాన్ని నడిపారు వేలు నాచ్చి.
ఈ విధంగా మహిళామణులు తమ వీరత్వాన్ని, దేశభక్తిని చాటారు. ప్రాణత్యాగం చేశారు. 1780 నాటికి తన కుమార్తెకు పట్టాభిషేకం చేసి పరిపాలన కొనసాగించారు. వేలునాచ్చి శివగంగను ప్రజారంజకంగా పరిపాలించారు. కాలువలు, చెరువులు త్రవ్వించి వ్యవసాయాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. రహదారులు వేయించి వ్యాపారాభివృద్ధికి పూనుకున్నారు. వివిధ మతాలకు చెందిన ఆలయాలను నిర్మించి పరమత సహనాన్ని చాటారు.
‘అయనార్’ అనే దేవతకి పూజలు చేసేవారు. వీరశైవులు, వైష్ణవులను సమానంగా ఆదరించేవారు. కాశీ విశ్వనాథునికి తమ రాజ్యం తరపున నిధులను అందించారు. ప్రయాణీకుల కోసం మఠాలు, సత్రాలను కట్టించారు.
తనకు సాయం చేసిన వారిని ఎవరినీ మరిచపోలేదామె. హైదరాలీ తన రాజ భవనంలో దేవాలయాన్ని నిర్మించారు. వేలు నాచియార్ తన సంస్థానంలో మసీదుని, చర్చిని కూడా నిర్మించారు. ఈ విధంగా ఆ రోజులో పరమత సహనం వెల్లివిరిసింది.
హైదరాలీ తనకందించిన సహాయానికి ప్రతిగా ఆయన కుమారుడు టిప్పుసుల్తాన్కు బంగారపు పులిని బహుమతిగా అందించి కృతజ్ఞతను తెలియజేసుకున్నారామె.
అంతా ప్రశాంతంగా, ఆనందంగా జరుగుతున్న సమయంలో కుమార్తె విళ్ళాచ్చి మరణించింది. ఈమె మానసికంగా క్రుంగిపోయారు. శారీరకంగా బలహీనులయ్యారు.
అప్పటివరకు మరుదు సోదరులు ఈమె పరిపాలనా భారాన్ని పంచుకున్నారు. చిన్న మరుదు మంత్రిగా, పెద్ద మరుదు కమాండర్-ఇన్-చీఫ్గా బాధ్యతలను నిర్వహించేవారు. 1780లో ఈ ఇద్దరికి రాజ్యపరిపాలనా భారాన్ని అప్పజెప్పారు. కొంతకాలం తరువాత మరుదు సోదరులు కూడా మరణించారు.
1796 డిశంబర్ 25వ తేదీన రాణి వేలు నాచియార్ గుండెజబ్బుతో మరణించారు. ఫ్రాన్సుదేశం వెళ్ళి గుండెకు చికిత్స పొందారని ఒక కథనం. ‘జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా’ అని పేరు పొందారు.
ఈ విధంగా 18వ శతాబ్ది లోనే బహుభాషాకోవిదురాలు, రాజనీతిజ్ఞురాలు, యుద్ధతంత్ర నిపుణురాలు, ఆత్మాహుతికి సిద్ధమై ప్రాణత్యాగం చేసిన దత్తపుత్రికల తల్లి, సమయస్ఫూర్తి గల రాణి, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని ఎదిరించిన తొలి రాణిగా పేరు పొందిన వేలు నాచియార్ గొప్ప మహిళామూర్తి.
ఈమె జ్ఞాపకార్థం 2008 డిసెంబర్ 31 వ తేదీన 5 రూపాయల విలువ గల స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. రాజ భవన నేపథ్యంలో గంభీరమైన, రాజసంతో నిండిన ధైర్యసాహసాలతో దర్శనమిస్తారీమె. చేతితో కత్తిని ఝళిపిస్తూ రాణి వేషంలో కళకళలాడుతూవున్న ఆ రూపాన్ని అలా చూస్తూనే ఉండాలనిస్తుందీ ఈ స్టాంపు.


డిసెంబర్ 25 వ తేదీ ఈమె వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

11 Comments
P.Usha Rani
Velu nachiyar gari gurinchi adbhutham ga vivarincharu madam … First time vintunna …avida peru. East india company ni edhirinchina toli rani ni parichayam chesinanduku dhanyavaadamulu andi


పుట్టి. నాగలక్ష్మి
Thanq usha garu
gdkyyprml@gmail.com
ధైర్య సాహసము,రాజనీతిజ్ఞత, చక్కని పరిపాలన, సమయస్ఫూర్తి గల రాణీ వేలు నాచియార్ గొప్ప ఆదర్శ మహిళ.మన దేశానికే గర్వకారణం


పుట్టి. నాగలక్ష్మి
ధన్యవాదాలు ప్రమీల గారూ!
కొల్లూరి సోమ శంకర్
Rani Velunachiyar was a warrior and destroyed the ammunition of British through her lady detectives.
A well written and interesting essay. Thank you for sharing.
A. Raghavendra Rao
పుట్టి. నాగలక్ష్మి
Thanq Raghavendra Rao garu
Jhansi Lakshmi
రాణీ వేలు నాచియార్ అద్బుత వీరగాధ అబ్బురపరిచింది… ఎంతటి స్ఫూర్తిదాయక జీవితం..వీరత్వం,సమానత్వం, కృతజ్ఞత,సుపరిపాలన,జ్ఞాన సంపాదన, బహుముఖ ప్రావీణ్యం ఆవిడ జీవితం నుంచి
అర్డంచేసుకోవాలి.. మీరు అటువంటి గొప్ప వ్యక్తి జీవిత కథ మా ముందుకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు..
లేనట్లయితే వారు తెరమరుగైపోతారు
పుట్టి. నాగలక్ష్మి
ధన్యవాదాలు ఝాన్సీ గారూ
కొల్లూరి సోమ శంకర్
బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడిన రాణి వేలు నాచియార్ గురించి చదువుతుంటే ఎంతో గర్వంగా అనిపించింది.చరిత్ర పుటల్లో ఎంత గొప్ప స్త్రీ లున్నారో కదా! ..నాగలక్ష్మి కి ధన్యవాదాలు..
Alluri Gouri Lakshmi
పుట్టి. నాగలక్ష్మి
ధన్యవాదాలు గౌరీలక్ష్మి గారూ
కొల్లూరి సోమ శంకర్
రాణీ వేలు నాచియార్ గారి గురించి మీ రచన వలన తెలుసుకోగలిగాను. ధన్య వాదాలు.వీరవనిత,సుందరారూపి, బహుభాషవేత్త,మహిళా సేనను తయారుచేసిన నాయకురాలు, పరమత సహనం కలది, స్వాతంత్ర్య సమరురాలు అయిన ధీర వనిత గురించి చదివి అబ్బురపడ్డాను.చరిత్రలో ఉత్తమ స్థానం పొందిన ఇలాంటి మహనీయురాలికి జోతలు.
వి. జయవేణి