[సూర్యదీప్తి గారు రచించిన ‘ఎవరన్నారు?’ అనే కవితని అందిస్తున్నాము.]


ఎవరన్నారు..
నేను ఏమీ సాధించలేని ఆడదాన్నని
ఎవరన్నారు
నేను నాలుగు గోడల నడుమ బతికేదాన్నని
ఎవరన్నారు
అడుగు బయట పెట్టి
ఒంటరిగా బతికే ధైర్యం లేనే లేదని
ఎవరన్నారు
చిన్నపాటి కష్టానికే రాలి కూలిపోతానని
ఇతరుల ఆసరాకై ఆరాటపడుతానని..
లేదు.. లేదు..
అది నిజం కాదు
నేను ఏమైనా చేయగలను
ఏదైనా సాధించగలను..
అవనిపై స్వేచ్ఛా విహంగమై ఎగురగలను
అంతరిక్షంలో ఆత్మవిశ్వాస వీచికనై వీయగలను
ప్రతికూల పరిస్థితుల్లో ప్రతిభను కనబరిచే శక్తి ప్రతీకను
విపత్కర పరిస్థితుల్లోనూ విజయాన్ని పొందే వినయాన్ని
మరో గ్రహంలోనూ ఇమిడిపోగల మేటి మహిళను
అంతిమ విజయం కోసం
అలుపెరుగక కృషిచేసే
అధునాతన మహిళను..
ప్రాంతం ఏదైనా నన్ను నేను అవలీలగా
అక్కడి స్థితిగతులకు అన్వయించుకోగల స్త్రీ శక్తిని..
నన్నిలా మలచుకున్న శిల్పిని.. నేను..
ఖగోళం వదిలి భూగోళం పై
మీ ముందు నన్ను నేను నిలబెట్టుకునే
నా ఈ విజయానికి సృష్టికర్త ను.. నేనే..
(సునీత విలియమ్స్ గారికి అక్షరాభినందనగా)