[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వంశీకృష్ణ గారి ‘గాంధీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


గోలి రామాంజనేయులు మహా ముదురు. ముదినేపల్లి సెంటర్లో అతడి గురించి ఎవరిని అడిగినా అదే మాట చెపుతారు. మీరు గనుక అతడికి ఎదురుగా నిలబడి ఉంటే, మీ షర్ట్‌కి తెలియకుండా మీ ప్యాంటునూ, మీ ప్యాంట్‌కి తెలియకుండా షర్టునూ దోచేసి మిమ్మల్ని ముదినేపల్లి సెంటర్లో బరిబాతల నిలబెట్టేయగలడు. ఆ సంగతి ఎవరో చెపితే కానీ మీకు తెలియదు.
గోలి రామాంజనేయులు మహా మాయగాడు. మీరు ముదినేపల్లి సెంటర్లో నిలబడి ఉంటే, అది ముదినేపల్లి కాదని, కైకలూరు అని మీ చేతనే చెప్పించగలడు. అలాంటి మహా ముదురు, మాయగాడు మూడురోజులనుండీ నన్ను తప్పించుకుని తిరుగుతూ “దమ్ముంటే నన్ను పట్టుకో” అని మహా సవాల్ లాంటిది ఒకటి విసరి ముదినేపల్లికి నాలుగు వైపులా ఉన్న చేపల చెరువుల నీళ్లు తాగించి మరీ చంపేస్తున్నాడు.
నా మానాన నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్. బి. నగర్ శాఖలో కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే, జూనియర్ మేనేజ్మెంట్ క్యాడర్ స్కేల్ నెంబర్ 2 అని నాకో ప్రమోషన్ పడేసి నన్ను ముదినేపల్లి తరిమేసింది మా బ్యాంకు. పుట్టి బుద్ధి ఎరిగాక హయత్ నగరూ ఎల్. బి. నగరూ, వనస్థలిపురం తప్ప మరేమీ తెలియని నేను ఎక్కడో గుడివాడ దగ్గర ఉన్న ముదినేపల్లి వెళ్ళను గాక వెళ్ళను అని భీష్మించుకు కూర్చుంటే మా యూనియన్ “ప్రమోషన్ కనుక వెళ్లి తీరాల్సిందే. ఎంత? ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకుంటే ఎల్. బి. నగర్ డీ మార్ట్ దగ్గరి బ్రాంచ్‌కే తీసుకురామూ?” అంటూ నెట్టేసింది.
పిల్లా జెల్లాని హైదరాబాద్ లోనే ఉంచేసి, పెట్టె బేడా సర్దుకుని ఒక ఉదయం తొలి వెలుగు రేఖలు మెల్లమెల్లగా కళ్ళు విప్పుకుని నెమలి పింఛం లాగా విరబూస్తున్నప్పుడు భీమవరం బస్సులో నుండి ముదినేపల్లి గడ్డ మీద అడుగుపెట్టాను.
చేపల చెరువుల మీద నుండి వచ్చే ఉప్పు నీటి గాలి శరీరాన్ని తాకి, ఏదో చెప్పీ చెప్పలేని హడావిడి పని వున్నట్టుగా పక్కకి వెళ్ళిపోయి చెట్టు దగ్గరగా సిమెంట్ నేల మీద ముడుచుకుని పడుకున్న ముసలమ్మ తల మీద వెండి తారాజువ్వల్లాగా ఎగురుతున్న రెండంటే రెండేరెండు పొడవాటి వెంట్రుకలను ముద్దు పెట్టుకుంది.
వస్తూ వస్తూ తెచ్చుకున్న బ్యాంకు స్టాఫ్ రెండు సెల్ నంబర్లకీ పదీ ఇంటూ రెండు ఇరవై సార్లు ఫోన్ చేసినా జవాబు రాక, దారీ తెన్నూ దొరకక అలాగే తొమ్మిది గంటల దాకా ఆ బస్టాండ్ లోనే ఉండి నెమ్మదిగా బ్యాంకుకి చేరుకున్నాను.
అలా మేనేజర్ ఛాంబర్ తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి ప్రమోషన్ కాయితం, రిలీవింగ్ ఆర్డర్ చూపిస్తే, పెద్ద సీట్లో చిన్న గుమ్మడికాయ లాగా ఉన్న మా మేనేజర్ కూర్చోమని చెప్పి, ఎదురుగా ఉన్న పురాతన కాలం నాటి బెల్ నొక్కి “రమణా! కొత్త ఆఫీసర్ గారొచ్చారు చూడు” అని పెద్దగా కేకేసి చెప్పారు.
మొదటి రోజు రికవరీ సెక్షన్ లో కూర్చుని పెండింగ్ ఖాతాలు చూస్తున్నప్పుడు కనిపించింది నాకు గోలి రామాంజనేయులు ఖాతా. కంప్యూటర్ స్క్రీన్ మీద ఖాతాను కిందకీ, మీదకూ స్క్రోల్ చేసి చూస్తుంటే అన్నీ డెబిట్లు తప్పిస్తే క్రెడిట్ ఒక్కటీ కనపడటం లేదు. నా లెక్క ప్రకారం అయితే అది ఎప్పుడో ‘రాని బకాయి’ కింద కనిపించాలి కానీ కనిపించడం లేదు. ఆ సాయంత్రం మా మేనేజర్ నన్ను ప్రత్యేకంగా పిలిచి ఆ బకాయి వసూలు చేసే గురుతరమైన బాధ్యత నా మీద వేసేశారు. అలా పరిచయం అయ్యాడు గోలి రామాంజనేయులు అప్రత్యక్షంగా!
ఆ సాయంత్రం నేనూ, మా సబ్ స్టాఫ్ పండరినాథ సాయి గోలి వీరాంజనేయులు ఇంటికి వెళ్ళాము. తలుపులు ఓరగా వేసి వున్నాయి. ఇంట్లో ఎవరూ ఉన్న జాడ కనపడటం లేదు. నొక్కుదామంటే కాలింగ్ బెల్ కూడా లేదు.
“వీరాంజనేయులు, వీరాంజనేయులు గారూ!” అంటూ ఒకటికి పది సార్లు పిలిచి, ఆ తరువాతో రెండు సార్లు అరిచాక లోపలినుండి ఒక మధ్య వయసు స్త్రీ బయటకు వచ్చి, “ఆయన లేరండీ” అన్నది.
“ఎక్కడకు వెళ్ళాడు? బ్యాంకు నుండి కొత్త సార్ వచ్చారు. ఆయన్ని కలవాలి అంటున్నారు?” అన్నాడు పండరీనాథ్.
కొత్త సార్ అనగానే ఆమె నావంక ఒకసారి ఎగాదిగా చూసి “ఎక్కడకు వెళ్ళాడో తెలియదండీ!” అన్నది.
ఆమె నా వంక చూసిన విధానం చూస్తే “పో పోవోయ్ నీలాంటి వాళ్ళను సవా లక్షమందిని చూశాను” అని లోపల అనుకుని ఆ భావం కళ్ళలో కనపడకుండా అతి కష్టం మీద ఆపుకున్నట్టు అనిపించింది.
“పోనీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఇప్పుడు మాట్లాడాలి. మా దగ్గర వున్న నెంబర్‌కి చేస్తే లిఫ్ట్ చేయడం లేదు” అన్నాడు పండరినాథ్.
“ఫోన్ కొత్తది మార్చారండి. నాకు నంబర్ తెలీదు” అన్నది. తెలిసినా ఆమె ఇచ్చేలా లేదు, ఆ వాలకం చూస్తూ ఉంటే.
“సరే! రేపొకసారి బ్యాంక్‌కి రమ్మని చెప్పండి!” అని చెప్పి ఆ రోజుకు వెళ్ళిపోయాము. అలా రెండు మూడు రోజులు వరుసగా రామాంజనేయులు ఇంటికి వెళ్లినా తన దర్శన భాగ్యం మాత్రం మాకు కలగలేదు.
మేము రోజూ సాయంత్రం వెళ్లి “రేప్పొద్దున్నే బ్యాంకుకి రమ్మని చెప్పండి!” అని చెప్పడమూ ఆమె సరే అనడమూ జరుగుతున్నది కానీ రామాంజనేయులు మాత్రం నా కంటికి కనపడలేదు. రామాంజనేయులుకి లేని లక్షణం లేదు. దానికి తోడు దేశదిమ్మరి తత్వం కూడా అతడిలో జీర్ణించుకునిపోయింది. ఇల్లు వదిలి బయటకు వెళితే ఎప్పుడు వస్తాడో ఎవరూ చెప్పలేరు. ఒకసారి గంటకే వస్తాడు. మరొక సారి వారం, పదీ, నెలరోజులైనా ఇంటి మొహం చూడడు. ఒక్కొక్కసారి బయటినుండి వచ్చేటప్పుడు డబ్బు తీసుకుని వస్తాడు. మరొకసారి ఇంట్లో డబ్బంతా ఎత్తుకుని ఎటో వెళ్ళిపోతాడు. మనిషి ఎదురైతే మాత్రం ఎవరితోనైనా జన్మ జన్మల బంధం ఉన్నట్టు అల్లుకుపోతాడు. మంచి మాటకారి, మహా మాయగాడు. ఈ లక్షణాలతోనే మా పాత మేనేజర్‌ను పడేసి ఉంటాడు. ఆయన ఇచ్చిన అప్పు ఇప్పుడు మా ప్రాణానికి వచ్చింది. భార్య రోజూ కూలికి వెళుతుంది. వున్న ఒక్క పిల్లాడూ, ఏ హద్దూ, అదుపూ లేకపోవడంతో తన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉంటాడు.
మా మేనేజర్ మాత్రం అక్షరాలా పదిహేను వేల రూపాయలు రామాంజనేయులు దగ్గర వసూలు చేయవలసిందే అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు.
‘ఏం చేయాలా?’ అని ఆలోచిస్తున్నప్పుడు మా పండరీనాథ్ “సార్! రామాంజనేయులు రోజూ సాయంత్రం ఐదూ, ఆరు గంటల మధ్య సీతామహాలక్ష్మీ ఫుడ్ కోర్ట్ వెనుక ఉన్న బార్ కోస్తున్నాడట” అని ఒక వార్త పట్టుకుని వచ్చాడు.
“సరే అడ్రెస్ దొరికింది కదా! ఇవాళ అక్కడీకే వెళదాం!” అని కూడా పలుక్కుని సాయంత్రం నాలుగున్నరకే ముదినేపల్లి గాంధీ సెంటర్‌కి చేరుకున్నాము నేనూ, పండరినాథూ.
గాంధీ సెంటర్లో గాంధీ లేడు. అంతకు ముందు ఎప్పుడో ఒక చిన్న విగ్రహం అక్కడ ఉండేదట. రహదారుల విస్తరణలో భాగంగా ఆ విగ్రహాన్ని తొలిగించారట. ఆ స్థానంలో మళ్ళీ ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టాలని అనుకుని అందుకోసం ఒక పెద్ద దిమ్మ మాత్రం కట్టి ఆ తరువాత గాంధీ విగ్రహాన్ని పెట్టే ఆలోచన మరచిపోయారట. ఇప్పుడా దిమ్మె ఒక్కటే అక్కడ కాస్త ప్రత్యేకంగా కనపడుతూ జాతీయ పర్వదినాలలో జెండాలను నిలబెట్టడానికి ఉపయోగపడుతూ ఉంది. అప్పుడప్పుడూ ఒకటో రెండో కుక్కలు కూడా ఆ దిమ్మ మీదకు ఎక్కి హాయిగా విశ్రాంతి తీసుకున్నంత సేపు విశ్రాంతి తీసుకుని, అలసట తీరాక కిందకు ఒక్క దూకు దూకి కాలెత్తి ఆ దిమ్మను అభిషేకం చేస్తూ ఉంటాయి.
మేమా సీతామహాలక్ష్మీ ఫుడ్ కోర్ట్ దగ్గర నిలబడి ముదినేపల్లికే ప్రత్యేకమైన, మద్రాస్ ఫిల్టర్ కాఫీ, తెలంగాణా ఇలాచీ చాయ్ కలగలసిన ఒకానొక కాషాయ రంగు ఉష్ణ ద్రావకాన్ని ఆవురావురు అంటూ సిప్ చేస్తూ కూర్చుని ఉండగా పది పన్నెండేళ్ల పిల్లాడు ఒకడు ఒంటి నిండా సిల్వర్ పూసుకుని, అద్దాలు లేని కళ్ళజోడు ఒకటి ముఖానికి తగిలించుకుని, అష్ట వంకరలు తిరిగిన కర్రనొకదానిని నేల మీద తాటించుకుంటూ వెళ్లి ఆ దిమ్మ దగ్గరకు వెళ్ళాడు. ముందు ఒక తెల్లటి గుడ్డ పరచి దిమ్మ ఎక్కి నడుం వంచుకుని గాంధీ విగ్రహం లాగా నిలబడ్డాడు. గాంధీ విగ్రహాన్ని నిలబెడదామని కట్టిన దిమ్మ మీద బాల గాంధీ నిలబడిపోయాడు. ఆ పిల్లాడి వంక దీక్షగా చూసిన పండరినాథ సాయి “సార్! వీడు రామాంజనేయులు కొడుకు సార్” అన్నాడు. ఒక్క క్షణం పాటు ఉలిక్కి పడ్డాను.
చేపల వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన వ్యాపారుల సౌకర్యార్థం, భీమవరం నుండి విజయవాడకు వేసిన ఎయిర్ కండిషన్డ్ బస్సు వచ్చి సెంటర్లో ఆగింది. దాని వెనుకే రెండు పల్లె వెలుగు బస్సులు ఒకటి బంటుమిల్లి పోవడానికీ, మరొకటి కైకలూరు చేరడానికి అదే సమయంలో వచ్చి సెంటర్లో ఆగడంతో గాంధీ సెంటర్ ఒక్కసారిగా కోమా నుండి స్పృహ లోకి వచ్చిన రోగి బంధువులు చేసే హడావిడిలా సందడి సందడిగా మారిపోయింది. మాకూ గాంధీ లాంటి పిల్లాడికీ మధ్య ఈ మూడు బస్సులు ఆగి కాసేపు గాంధీ ఏమి చేస్తున్నాడో కనిపించకుండా చేసాయి.
మూడు బస్సులూ వెళ్ళిపోయాక చూస్తే గాంధీ వేషంలో ఉన్న రామాంజనేయులు కొడుకు తన నడుముకు గాంధీ గారు వాచీని వేలాడదీసుకున్నట్టుగా వేలాడదీసుకున్న చిన్న సెల్ఫోన్లో ‘గాంధీ పుట్టిన దేశం, ఇది రఘు రాముడు ఏలిన దేశం’ అన్న పాట వినిపిస్తూ ముందు పరచిన గుడ్డ మీద ఏమైనా డబ్బులు పడుతున్నాయా? లేదా? అని కళ్ళతోనే లెక్క వేసుకుంటున్నాడు.
గాంధీ వేషంలో రామాంజనేయులు కొడుకు తెలిసీ ఆ పాటను ప్లే చేశాడో లేక తెలియకుండానే ప్లే చేసాడో తెలియదు కానీ ఆ పాట నా వొంటి మీద వేయి బాంబుల విస్ఫోటనంలా పేలింది. నా ఆలోచనలు పరి పరి విధాలా, ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా ఎటో వెళ్లిపోయాయి.
లేని దాన్ని వున్నది అనుకోవడాన్ని మించిన సౌఖ్యం ఏదీ లేదేమో. అవినీతిని గెలిచే బలమివ్వు.. నీ బాటను నడిచే బలమివ్వు అని వాచ్య మాత్రంగా అయినా వినిపిస్తున్న ఆ పాటలోని భావం ఆ పిల్లాడికి తెలుసా? తెలిసీ ఈ దేశ ముఖ చిత్రం మీద ఇంత నల్ల రంగు పులుముతున్నాడా? నిజంగా గాంధీ బతికి మళ్ళీ వస్తే గజానికో గాంధారీ పుత్రుడు ఉన్న ఈ దేశంలో గాంధీకి నిలబడటానికి ఇంత చోటు ఉంటుందా? నా ఆలోచనల్లో నేను ఉండగానే అక్కడొక విచిత్రం జరిగింది.
రామాంజనేయులు కొడుకు గాంధీ వేషంలో ఆ దిమ్మ మీద నడుం వంచుకుని కర్ర పట్టుకుని నిలబడి ఉండగానే, ఒంటినిండా సిల్వర్ పూసుకున్న మరొక పిల్లాడు గాంధీ వేషంలో ఆ దిమ్మ దగ్గరకు వచ్చాడు. రామాంజనేయులు కొడుకు సన్నగా, పీలగా వొంట్లో ఊపిరి లేనట్టు ఉంటే, గాంధీ వేషంలో వచ్చిన రెండవ పిల్లాడు మాత్రం బొద్దుగా, లావుగా ఉన్నాడు, రామాంజనేయులు కొడుకు బక్క గాంధీ అయితే వీడు బాగా బలిసిన గాంధీ అన్న మాట.
రెండో గాంధీ వస్తూనే దిమ్మ మీద నిలబడి ఉన్న బక్క గాంధీని కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. ఎంత బలంగా తన్నాడు అంటే ఆ దిమ్మ మీద నుండి వెనక్కు ఒక్కఉదుటున పడిపోయిన రామాంజనేయులు కొడుకు లేవడానికి కనీసం పది నిముషాలు పట్టి ఉంటుంది. ఈలోగా రెండో గాంధీ, రామాంజనేయులు కొడుకు పరచిన గుడ్డను కాలితో నెట్టేసి తానొక జంబుఖానా పరిచాడు. తేరుకున్న రామాంజనేయులు కొడుకు వెనకనుండి రెండో గాంధీని బలంగా నెట్టేశాడు.
రెండో గాంధీ ముందుకు తూలి నిలదొక్కుకొని “ రేయ్! ఇది నా అడ్డా! నువ్వెవడివిరా ఇక్కడకు వచ్చి నిలబడటానికి. మర్యాదగా అన్నీ మూసుకుని వెళ్ళిపో!” అని గట్టిగా హెచ్చరించాడు రామాంజనేయులు కొడుకును.
“రేయ్! ఇదేమన్నా నీ సొంతమా? మర్యాదగా నువ్వే వెళ్ళిపో! మొదట వచ్చింది నేను. ఇక్కడ నిలబడే హక్కు నాకే వుంది” అన్నాడు రామాంజనేయులు కొడుకు ఏ మాత్రం తగ్గకుండా.
చుట్టూ చేరిన జనం వింతగా చూస్తున్నారు. నా కెందుకో అక్కడ ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నటుగా కాక ఇద్దరు గాంధీలు కొట్టుకున్నటుగా అనిపించింది. వాళ్లను విడదీద్దాము అని నేను ఒకడుగు ముందు కేస్తే పండరినాథ సాయి నా చేయి పట్టుకుని ఆపాడు.
“వద్దు సార్! మనం వెళ్లొద్దు! ఈ సెంటర్ అసలు మంచిది కాదు. ఏదైనా జరిగితే మీకు ప్రాబ్లమ్ వస్తుంది.”
“ప్రాబ్లం వస్తుందని మనం చూస్తూ ఎలా ఉంటాము?” అన్నాను
సీతామహాలక్ష్మీ ఫుడ్ కోర్ట్ లో కాఫీ, టీ సెర్వ్ చేస్తున్న ఓనర్ కమ్ సర్వర్, “వద్దు సార్! వాళ్లకు ఇది అలవాటే. కాసేపు కొట్టుకుంటారు. తరువాత మళ్ళీ కలిసిపోతారు. మేము రోజూ చూస్తూనే వుంటాముగా! మొదట వచ్చిన వాడేమో రామాంజనేయులు కొడుకు, ఈ రెండో వాడేమో రామాంజనేయులు అన్న కొడుకు. పిల్లలు కదా అని మీరు కలగచేజేసుకున్నారు అనుకోండి రేప్పొద్దున్నే మీ బ్యాంకు వద్దకి ఇద్దరూ కలిసి వచ్చి మిమ్మల్ని బండ బూతులు తిడతారు. అసలు ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉండాలి. ఈ బిజీ టైమ్‌లో ఇక్కడ ఉండాలిగా, వాడే సందుల్లో దూరడానికి వెళ్ళాడో” స్వగతాన్ని, జనాంతికాన్ని కలగలిపి చెప్పాడు ఫుడ్ కోర్ట్ ఓనరు.
దిమ్మ దగ్గర గొడవ పెద్దది అయింది. ఎవ్వరూ తగ్గడం లేదు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి లాఠీ తీసుకుని ఇద్దరినీ రెండు బాదుళ్ళు బాదాడు. దానితో ఇద్దరూ కర్రలను వదిలేసి పరుగెత్తారు. ఐదు నిమిషాల పాటు సెంటర్ అంతా ప్రశాంతంగా మారిపోయింది. జనం నిండినా, చోద్యం చూస్తూ ఉన్న రెండు ఆటోల డ్రైవర్లూ ఆటోలు తీసుకుని వెళ్లిపోయారు.
సరిగ్గా ఏడో నిమిషంలో గురజ రోడ్లో నుండి రామాంజనేయులు కొడుకు పరుగెత్తుకుంటూ వచ్చి దిమ్మ మీద నిలబడ్డాడు. మరో క్షణం మరో పిల్లాడు కూడా దిమ్మ దగ్గరికి వచ్చేసాడు. ఇద్దరూ మళ్ళీ బాహా బాహీ కొట్టుకోసాగారు. రెండో పిల్లాడు రామాంజనేయులు కొడుకును బలంగా నెడితే వాడు వెళ్లి నిట్ట నిలువునా దిమ్మ మీద పడిపోయాడు వెల్లకిలా. దిమ్మ అంచులకు బలంగా తాకిన తల ‘ఫట్’మంటూ చీలి రక్తం ఫౌంటైన్ పైకి ఎగజిమ్మినట్టుగా పైకి ఎగజిమ్మింది
ఒక్క క్షణం పాటు సెంటర్ అంతా చీకట్లు కమ్మినట్టు అయింది. శీతాకాలపు సాయంత్రం మెల్లగా పరచుకుంటున్న నల్లటి చీకట్లు రామాంజనేయులు కొడుకు రక్తం పులుముకుని ఎర్రగా, భయంకరంగా కాగా సిల్వర్ పూసుకున్న వొళ్ళు మోదుగు పువ్వులా మారింది. గాంధీ వేషం వేసుకున్న రెండవ పిల్లాడు భయంతో, వణుకుతున్న శరీరంతో, గురజ రోడ్ లోకి పరుగు తీశాడు. కొంత దూరం ఆగకుండా పరుగెత్తి, కళ్ళు చీకట్లు కమ్మగా ఎదురుగా ఉన్న కల్వర్టును ఢీకొని కాలువలోకి పడిపోయాడు.
ఆ సాయంత్రం రామాంజనేయులును కలవకుండానే రూమ్‌కి వెళ్ళిపోయాను. మనసంతా చేదు మాత్ర తిన్నట్టుగా మారిపోయింది. కళ్ళు మూసుకున్నా నెత్తుటితో మంకెన పువ్వులా మారిపోయిన ఆ పసి పిల్లాడే గుర్తుకు వస్తున్నాడు. రెండు మూడు గంటలపాటు కదలకుండా ఆ దిమ్మ మీద నిల్చుంటే ముందు పరచిన దుప్పట్లో ఎంత చిల్లర పడుతుంది? మహా అయితే రెండొందలో. మూడు వందలు పడతాయేమో, కానీ నిండు ప్రాణం పోయింది కదా. గాంధీ వేషం వేసుకున్న ఆ చిన్న పిల్లల మనస్సులో కూడా గాంధీ ఉండి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో. ఎవరో ఒకరు ఆ పూటకు రాజీ పడి పోయేవారేమో! ఆ పిల్లలకి సంబంధించినంత వరకు గాంధీ వేషం ఒంటికి చేసుకునే ఒక సాధారణమైన అలంకరణ అంతే. ఆ అలంకరణ చేసుకుంటే కొన్ని ఎక్కువ డబ్బులు పడతాయి అంతే. అందుకే ఆ వేషం. హిట్లర్, పోనీ, రావణాసురుడు ఈ వేషాలు వేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటే ఆ వేషాలు కూడా వేస్తారు కదా. అక్కడ వేషం వేయిస్తున్నదీ, వేస్తున్నది రెండూ ఆకలే. రామాంజనేయులు కొడుకు రూపంలో చనిపోయిన గాంధీ, చంపిన గాంధీ ఇద్దరూ ఆకలికి ప్రతిరూపాలే.
ఆలోచనలతో మనసు వేడెక్కింది. సెల్ఫోన్లో టైమ్ చూస్తే రెండు గంటల అర్ధరాత్రి. మెల్లగా లేచి ముదినేపల్లి బస్ స్టాండ్ వైపు నడిచాను. అక్కడ అయితే ఎంత రాత్రి అయినా టీ దొరుకుతుంది. టీ బడ్డీ దగ్గర ఉన్న బల్ల మీద కూర్చున్నాను. నాకు హఠాత్తుగా రామాంజనేయులు లోను ఖాతా గుర్తుకువచ్చింది. రెండు దాటింది కదా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ లోకి ఆటోమాటిక్‌గా జారిపోయి ఉంటుంది. పొద్దున్నే రీజినల్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్ నుండి తిట్లు తప్పవు.
టీ తాగుతుంటే దూరంగా నిలబడి ఎవరో నన్నే చూస్తున్నట్టు అనిపించింది. ఒక్క క్షణం ఆ ఆకారం వైపు పరీక్షగా చూసి టీ చెప్పాను. నన్ను రోజూ చూస్తున్నాడు కనుక కొంచెం అల్లం ఎక్కువ వేసి టీ ఇచ్చాడు బడ్డీ వాడు. టీ చివరి సిప్ కూడా నాలుకను తృప్తి పరచాక పేపర్ గ్లాస్ క్రష్ చేసి డస్ట్ బిన్ లో పడేసి లేస్తున్నప్పుడు, దూరంగా ఉన్న ఆ ఆకారం నా దగ్గరగా వచ్చింది.
“సార్! మా అబ్బాయి చనిపోయాడు. దహనానికి చేతిలో డబ్బులు లేవు. కాస్త సాయం చేయండి” అని చేయి చాపాడు. అతడిని కింద నుండి పై వరకు చూసాను. జేబులో చేయి పెడితే ఐదు వందల రూపాయల నోటు గరుకుగా తగిలింది. జేబులోనుండి నోటు తీస్తూ ఉండగా గుర్తొచ్చింది. అతడు రామాంజనేయులు. ఇవ్వాలా? వొద్దా? అన్న సంశయంలో పడిపోయాను.
రామాంజనేయులు కొడుకు చావును కూడా క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నాడా?