ఇప్పుడు నెల్లూరులో చూడండి! ఎన్ని అన్ఎయిడెడ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చారో! వీధి వీధికి ఒక కాలేజీ, చిన్న చిన్న భవనాల్లో, ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహించేవారికి గుర్తింపు ఇచ్చారు. వి.ఆర్.కళాశాల, సర్వోదయ కళాశాల వంటి పాత కాలేజీలు, తరగతి గదులు, క్రీడాసౌకర్యాలు, ప్రయోగశాలలు, గొప్ప గ్రంథాలయాలు అన్ని ఏర్పాట్లు ఉన్నవి – కుక్క గొడుగుల్లాగా తలెత్తిన ఈ అన్ఎయిడెడ్ సంస్థలముందు బలాదూరయ్యాయి! ఔరా, కాలమహిమ!
కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చాలాకాలం నేనే చూడవలసివచ్చింది. ఎందరో పండితులు, కళాకారులు కళాశాలకు వచ్చారు. తొలి నాలుగయిదేళ్ళు విద్యార్థుల సంఖ్య తక్కువ, చాలా ఆసక్తిగా ఈ కార్యక్రమాలు తిలకించేవారు. బహుశా మూడో సంవత్సరమే శ్రీశ్రీని పిలిచాము. సభ తర్వాత స్టాఫ్ అందరం శ్రీశ్రీగారితో ఫోటోలు దిగాము, కానీ స్టూడియో వారివద్ద ప్రింట్లు తీసుకోలేదు. మేము ఆరీ తీరి ప్రింట్ల కోసం అడిగితే ఆ నెగటివులు పోయాయని స్టూడియో వారు చెప్పారు. చాలా బాధపడ్డాము కానీ మాదే పొరబాటు.
ఆగస్టు 15న విద్యార్థులని తోటి అధ్యాపకులని ఉద్దేశించి ప్రసంగిస్తున్న రచయిత
ఒక సంవత్సరం పాలగుమ్మి పద్మరాజు గారు సాంస్కృతికోత్సవాల్లో ఉపన్యసించారు. వారికి ఫస్టుక్లాస్ రైలు టికెట్ మొత్తం చెల్లించబోతే “సినిమావాళ్ళం, మీ కాలేజీ వారివద్ద తీసుకోను” అని చాలా హుందాగా, ఆ మొత్తం వెనక్కి ఇచ్చారు. ఒక సంవత్సరం వేటూరివారు వచ్చారు. సినిమాలలో కొన్ని ద్వంద్వార్థాలు వచ్చే పాటలు రాసినందుకు చింతిస్తున్నామన్నారు. మా మిత్రులు గోపాలకృష్ణ వేటూరి ప్రకటించిన పశ్చాత్తాపాన్ని ‘జమీన్ రైతు’లో తీవ్రంగా విమర్శించారు. కాలేజీ పెట్టినయేడు ఆంధ్రప్రభ వారపత్రికలో పనిచేస్తున్న ఎల్లోరా, విద్యానగర్ కళాశాల ప్రిన్సిపాల్ వై.విశ్వనాథం వంటి పెద్దలు సాంస్కృతికోత్సవాల్లో పాల్గొన్నారు. 1973లో విద్యానగర్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ ఎక్కిరాల భరద్వాజ మా languages Association ప్రారంభించారు. అప్పటికి వారు ఆధ్యాత్మిక జీవనంవైపు దృష్టి సారించలేదు. కాలేజీ నెలకొల్పిన ఏడాది పూర్తైన సందర్భంగా 21-1-1973న జరిపిన సభలో బెజవాడ గోపాలరెడ్డి గారు, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు పాల్గొన్నారు. ధారా రామనాథశాస్త్రి గారు నాట్యావధానం చేశారు.
కొత్త క్యాంపన్ మెయిన్ బిల్డింగ్
రోజులు ఏంతో సంతోషంగా దరోగిపోతున్న సమయంలో మేము ఊహించని విధంగా కడప విద్యార్థులు, స్థానిక విద్యార్థులమధ్య వైరాలు చిలికి చిలికి గాలివానై ఒక సాయంత్రం పెద్ద ఘర్షణ, కొట్లాటగా పరిణమించింది.
ఆరోజు రాత్రి కొందరు కడప విద్యార్థులు మా ఇంటికివచ్చి తమకు కొంత డబ్బిస్తే కడప వెళ్లిపోతామని, డబ్బు ఎమ్.ఓ. పంపుతామని వేడుకొన్నారు. ఆ పిల్లలు కడప వెళ్లి నాకు డబ్బు పంపించారు. కళాశాల వాతావరణం ఇట్లా కలుషితం కావడం నన్ను కలచివేసింది. ఆ రాత్రి నా దుఃఖాన్ని చిన్నకవితగా రాసి కళాశాల సంచికలో ఒక విద్యార్థి పేర ప్రచురించాను.
~
ఏది తూర్పు? ఏది పడమర? ఏది సంధ్య? ఏది పొద్దుపొడుపు? ఎవరు మీ పసిహృదయాల్లో చిచ్చుపెట్టింది? ఎవరు మీ పాలమనసుల్లో విషం కలిపింది? కాలానికి హద్దుల్లేవు. మానవతకసలే సరిహద్దుల్లేవు. ఎందుకు మనకీ స్పర్థలు? తుడిచెయ్యండి కులగిరుల్ని. చెరిపెయ్యండి ప్రాంతీయతల్ని. మీ గుండెల్లో గరళం దాచకండి. అందరికి మమతను పంచండి. మనసుమందారాన్ని ద్వేషం విషప్పురుగు కాటన్దనీకండి. మనసుమీది మకిలం తుడిచేసుకో. మొహమ్మీది కోపం కడిగేసుకో. ఇప్పుడు చూడు నీ మనసు ఎంత తేలికయిందో! ఈ దేశం మనది, ఈ కాలం మనది ఈ గాలీనీరూ ఈ సంపద-అన్నీమనవి. చూడకండి విడివిడిగా, నిలవండి నిటారుగా ఎవరుచెప్పు ఈ తమ్ముడు? నిన్న నీ భుజం భుజం రాచుకొంటూ కదంతొక్కిన వీరుడేకద! ఎవరుచెప్పు ఈ తమ్ముడు? మొన్నమొన్న కాలకీలకు ఎదురుతిరిగి పదంపాడిన వీరుడేకద! మనసున్న మనుషుల్లారా! మళ్ళీ ఒకసారి మనసువిప్పి మాట్లాడుకోండి! మానవతల్ని కలబోసుకోండి!
ఆ రోజుల్లో అసలు ఉద్యోగం చేశామా, లేక ఏదో తపస్సులాగా జీవించామా అని అనిపిస్తుంది. ప్రిన్సిపాల్ గారు కాలేజీ తొలి మ్యాగజైన్ బాధ్యత నా మీద పెట్టారు. నాకు సహ అధ్యాపకులు శివరామప్రసాదు గారు తోడు. అప్పటికే ఆయనకు ప్రూఫులు చూడడం బాగా అలవాటు. నెల్లూరులో ఏ పండితులు పుస్తకం అచ్చువేసుకున్నా ప్రూఫులు వారివద్దకు వెళ్లేవి. తొలి సంచిక కనుక బాగా రావాలనీ, పదిమందీ మెచ్చుకోవాలనీ మా అభిలాష. అప్పటికి యింత దారుణంగా ఎత్తిపోతల పథకం రాలేదు. కొన్ని కాలేజీల సంచికలు తిరగవేస్తే అవే వ్యాసాలూ, కవితలు, కథలు పేర్ల మాత్రం మార్పుతో కనిపిస్తాయి. మేము పిల్లలకు కొన్ని సూచనలిచ్చి, వాళ్ళ చేత రాయించాము. కొందరు ఊహ ఉన్నవిద్యార్థులు మంచి కథలు రాశారు. ‘రాజమ్మగారు చెప్పిన రహస్యం’ కథ ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. రవూఫ్ అనే విద్యార్ధి రాసిన కవిత చదివి అతన్ని ‘జమీన్ రైతు’ పత్రికకు పరిచయం చేసాము. ఇప్పుడు డాక్టర్ రవూఫ్ దంపతులు గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆతను మంచి వచన కవితలు రాసి పేరు తెచ్చుకొన్నాడు. సంచిక పఠనయోగ్యంగా వుండాలని అధ్యాపకులం రాయడమేకాక, కొన్ని రచనలు మేమే రాసి పిల్లల పేర్లు పెట్టి ప్రచురించాము. ఆర్నిథాలజి మీద నేను రాసిన వ్యాసం తెలుగులో ఆ విషయం మీద మొదటిది కావచ్చు.
మా కళాశాల కమిటీ అధ్యక్షులు సంజీవిశెట్టిగారు అన్ని మతాలకు ప్రాధాన్యం వుండేట్లు పుస్తకంమీద emblem బొమ్మ వేయమని సూచించారు. నా మిత్రుని శ్రీమతి విద్యుల్లత గీచిన బొమ్మ సంచికలో ప్రచురించాము. ‘మా కళాశాల మూలస్థంభం వాకాటి సంజీవిశెట్టిగారు’ పేరుతొ వారి జీవితాన్ని పరిచయంచేస్తూ వ్యాసం రాసాను. ఆయన ప్రాథమిక విద్య తప్ప పెద్దగా చదువుకోలేదుగానీ పెద్ద వ్యాపారాలు చేశారు. ధాన్యం టోకు వ్యాపారంలో ధరవరలు వారి యిష్టాయిష్టాలమీద నడిచేవట. బొంబాయి, అహమ్మదాబాదు ప్రసిద్ధ మిల్లు వస్త్రాలకు వారే ఏజెంటు. 1934కు జిల్లాలో మైకా పరిశ్రమ పుంజుకొంది. వారు మైకా గనులు త్రవ్వించడం, మైకా ఎగుమతి రెండూ చేశారు. ఈ పరిశ్రమ ద్వారా మా జిల్లాలో ఎందరో తెల్లావారికల్లా కోటీశ్వరులయ్యారు. శెట్టి గారు మైకా వ్యాపారనిమిత్తం ఇంగ్లాండు పర్యటించారు దుబాసీల సాయంతో. నెల్లూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆత్మాభిమానం దెబ్బతింటుందని తోచిన మరుక్షణమే అన్నీ విడిచి అస్త్రసన్యాసం చేశారు. వారి జీవితంలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. చిన్నకుమారుడు వివాహమైన కొద్దికాలానికే పోయాడు. శెట్టి గారు విధురులు. గూడూరులో మైకా వ్యాపారంలో ఉన్నపుడు స్కూల్ టీచరు పంకజమ్మ గారిని ఇష్టపడి జీవిత సహచరిగా తెచ్చుకున్నారు. వేరే కులం. పంకజమ్మ గారు సెట్టిగారి బాగోగులు చక్కగా చూచుకొనేవారు. దురదృష్టం ఏమంటే ఆమె శెట్టిగారి చివరి రోజుల్లో ముందుగా వెళ్లిపోయారు. వారు చివరి రోజులు నెల్లూరులోనే పెద్ద కుమారుడివద్ద గడిపారు.
దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు వారికి ఆత్మీయ మిత్రులు.
మా కళాశాల తొలిసంచిక బాగుందని ప్రిన్సిపాలుగారు చాలా మెచ్చుకున్నారు. మేమేదో గొప్ప పత్రిక అచ్చువేస్తున్నట్లు శ్రద్ధ తీసుకున్నాము. రాత్రుళ్ళు ప్రెస్‌లో పడుకొని ప్రూఫులు సరిచూసేవాళ్ళం. ఇది త్రిభాషా పత్రిక. ఇన్ని కష్టాలుపడి ఎలాగో బయటపడ్డాము.
శెట్టిగారి ఇంటికి వచ్చిపోయే పెద్దమనిషి వారి మీద రాసిన వ్యాసంలో ‘జీవితమనే విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు’ అన్న వాక్యాన్ని చదివి వినిపించి, ‘మీకు చదువు లేదట!’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ వారిమనసు విరిచారు. దుష్టులకు మరేమీ పని వుండదు. వారి మీద ఈ చిన్న వ్యాసం తప్ప ఏమీ గ్రంథస్తం కాలేదు.
నాకు చిన్నప్పటినుంచి కళాత్మక సినిమాలంటే చాలా యిష్టం. మా నెల్లూరు కవి తిక్కవరపు పఠాభి కన్నడ భాషలో తీసిన ‘సంస్కార’ సినిమాకు రాష్ట్రపతి స్వర్ణపతక పురస్కారం లభించింది, పత్రికలూ వారిని పరశంసిస్తూ వ్యాసాలూ రాశాయి. నెల్లూరులో వారి బంధువర్గం ఉంది. ఎవ్వరూ ఆ సినిమాను నెల్లూరులో ప్రదర్శించను ప్రయత్నం కూడా చెయ్యలేదు. సినిమా పిచ్చోళ్ళం చాలా నిరాశ పడ్డాము. ఆ నైరాశ్యంలోనుంచే నెల్లూరులో ఫిల్మ్ సోసైటీ నెలకొల్పాము. ఆ రోజుల్లో ప్రోగ్రెసివ్ అనే విశేషణం లేకుండా నెల్లూరులో ఏదీ ఉండదు. అభ్యదయ వేదిక ఒక ఉదాహరణ. 1973 ఆగస్టులో తరుణేందు, సింగరాజు ప్రసాద్, పెన్నేపల్లి గోపాలకృష్ణ , మా కాలేజీ ప్రసాద్ గారు మొదలైన కొంతమందిమి కలిసి చర్చించాము. నెల్లూరు ఫిల్మ్ సొసైటీ అని పేరు పెట్టాలని మా ఊహ. కానీ వి.ఆర్. కాలేజీ రసాయనశాస్త్రం ఉపన్యాసకులు ఏం. పట్టాభిరామిరెడ్డి గారు ప్రోగ్రెసివ్ పదం ఉండాలని పట్టుబట్టారు. ఆ విధంగా ప్రోగ్రెసివ్ ఫిల్మ్ అసోసియేషన్ పేరు స్థిరపరిచారు.
1974 జనవరి నాలుగున, ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరులో చాలా మంచి సినిమా హాలుగా పేరొందిన శ్రీరామ్ ఎయిర్ కండిషన్ థియేటర్లో ఆహూతులకు తోలి ప్రదర్శన ఏర్పాటు చేశాము. బెజవాడ గోపాలరెడ్డిగారు ధర్మపత్నితో సహా వచ్చి సినిమా చూసారు. మా ఫిల్మ్ అసోసియేషన్‌ను ‘జమీన్ రైతు’లో గోపాలకృష్ణ గారు ప్రోఫిల్మ్ అని ముద్దుగా వ్యవహరించారు. ప్రజల్లో ఆ పేరుతోనే వాడుకలోకి వచ్చింది. ప్రోఫిల్మ్కు నేను కార్యదర్శిగాను, సింగరాజు ప్రసాదు ఫైనాన్స్ కార్యదర్శిగాను ఎంపిక అయ్యాము. మొదటి సంవత్సరం సభ్యత్వం పది రూపాయలు. సుమారు 220 మంది సభ్యులుగా చేరారు. కళాశాల అధ్యాపకులు, బ్యాంకు ఉద్యోగులు, విద్యాధికులైన వ్యక్తులు సభ్యులుగా చేరారు. ఆ ఏడే ఫెడరేషన్ అఫ్ ఫిల్మ్ సొసైటీస్ అఫ్ ఇండియా దక్షిణ భారత విభాగానికి అనుబంధ సంస్థగా చేరాము. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ అఫ్ ఇండియా, పుణెకు గూడా మా సంస్థ అనుబంధించబడింది. ప్రతినెల కనీసం ఒక కళాత్మక చిత్రం ప్రదర్శిచాము. 16 ఎం.ఎం. చిత్రాలు కూడా ప్రదర్శించాము. ఇస్కస్, ఇండో జిడీఆర్. ఫ్రెండ్షిఫ్ సొసైటీ, పౌరసంబంధ శాఖ, గ్రంథాలయ సంస్థ మొదలైన అన్ని సంస్థలు సంతోషంగా సహకరించాయి.
ఆ రోజుల్లో ఈ ప్రదర్శనలకు ముందుగా సినిమా గురించిన సాహిత్యం, కరపత్రాలు పంచడం, ఫిల్మ్ బాక్సులు ఠంచనుగా ఫెడరేషన్ వారి ప్రోగ్రాము ప్రకారం మరొక సొసైటీకి చేర్చడం చాలా బాధ్యతతో కూడిన విషయాలు. అరడజను మంది కార్యకర్తలం స్వచ్ఛందంగా ఈ పనులన్నీ సంతోషంగా చేసేవాళ్ళం. నెల్లూరులో విజయమహల్ సినిమాహాల్ వారు నామకార్దం బాడుగతో హాలు ఇచ్చారు. పదేళ్లు అక్కడే సినిమాలు వేశాము. మాకు శర్మ అనే నిరుద్యోగి యువకుడు ప్రతి సినిమా కరపత్రాన్ని జాగ్రత్తగా ఇళ్లకువెళ్ళి చేర్చేవాడు. అతనికి 300 కరపత్రాలు జాగ్రత్తగా సభ్యులకు చేర్చినందుకు వంద రూపాయలు ఇచ్చేవాళ్ళం. అడ్రెసులు రాయడం, కరపత్రాలు సమయానికి తయారుచేయడం అన్నీ ఒక పెద్ద పని. ఉద్యోగాలు చేస్తూనే ఈ పనులన్నీ చేసేవాళ్ళం. ఒక్కోసారి ఫిలిం boxలు పూనాకు, ఇతర ప్రదేశాలకు తీసుకొని వెళ్లాల్సివచ్చేది. కార్యకర్తలం ఏన్ని కష్టాలు పడ్డామో!
ఫిల్మ్ సొసైటీ పెట్టినపుడు మాకు వినోదం పన్ను రాయితీ లేదు. జిల్లా కలెక్టరులు, టాక్స్ అధికారులు సహకరించేవారు. మా ప్రదర్శనలకు కలెక్టర్, డిస్ట్రిక్ట్ జడ్జి, పోలీసు సూపెర్నెంట్, విద్యుత్ శాఖ సూపర్నెంట్ ఇంజనీర్ కూడా హాజరయేవారు. ఎమర్జన్సీ సమయంలో అమెండెంట్ టు స్టేట్ డిఫెన్స్ యాక్ట్ అనే రుమేనియా దేశపు సినిమా, ది కీ అనే జెక్ దేశపు సినిమా రెండింటికీ జిల్లా అధికారులంతా హాజరయ్యారు. రెండు చిత్రాలు జర్మని అనుకూల ప్రభుత్వాలలో పౌరహక్కులు ఎంత దారుణంగా అణచబడుతునన్నవో చిత్రించారు.
(ఇంకా ఉంది)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు. రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి. 2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ. 2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ). పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఆఖరి పద్యం
నేను నేల తల్లిని! నీ ఉపశమనాన్ని!
కాజాల్లాంటి బాజాలు-10: ఎవరిగోల వాళ్ళదే…
నల్లయ్య ఉరఫ్ కిట్టయ్య
మనోగీతిక
ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 2
అతిరథ మహారథులు.. అర్ధరథులు
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-10
యుద్ధ రంగస్థలం
భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 9: జోగుళాంబ ఆలయం, అలంపూర్
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®