ఇదేమి శిక్ష..!!
అల్లరి చేయడం పిల్లల హక్కు! అల్లరి అంటే ఏమిటో తెలియని స్థితిలో పిల్లల అత్యుత్సాహాన్ని ‘అల్లరి’ అనాలేమో. వాళ్ళ దృష్టిలో అది ఒక క్రీడ. దానివల్ల కలిగే లాభనష్టాల గురించి పిల్లలకు తెలియదు. హద్దులు దాటితే ఏదైనా వికృతంగా తయారవుతుంది. కన్నవారికి అది ఆనందం అవుతుందేమో గానీ ఎదుటివారికి అభ్యంతరంగా మారుతుంది. అల్లరిని అదుపు చేయవల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! అల్లరి చేస్తున్నాడని అదే పనిగా చావబాదే తల్లిదండ్రులు కూడా వున్నారు. కేవలం పిల్లలను దండించడం వల్ల, వాళ్ళు అల్లరి మానేస్తారని అనుకోవడం తప్పు. పిల్లలకు నచ్చచెప్పడం ద్వారా అల్లరి మాన్పించాలి గాని అదే పనిగా కొట్టడం వల్ల బండబారిపోతారు గానీ మారరు.
అది తెలీక చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు సరైన మార్గదర్శనం చేయకుండానే, ఏ చిన్న తప్పుచేసిన (అది తప్పు అని వాళ్లకు తెలియదు కదా!) అల్లరి చేసినా, పిల్లలు అన్న జ్ఞానం మరచి గొడ్డును బాదినట్టు బాదేస్తారు. దీనివల్ల పిల్లలు తల్లిదండ్రులు ఊహించిన దానికి భిన్నంగా తయారవుతారు. దెబ్బలకు అలవాటు అయి క్రమంగా బండబారిపోయి తర్వాత దెబ్బలను కూడా లెక్కచేయరు. తద్వారా తప్పులు చేయడంగానీ అల్లరి చేయడంగాని మానరు. ఇది చాలా సున్నితమైన సమస్య.
పిల్లలు అల్లరిచేసినా, తప్పులు చేసినా దానికి పూర్తి బాధ్యతను తల్లిదండ్రులు లేదా పిల్లల సంరక్షకులు వహించక తప్పదు. చిన్నపిల్లలకు ఆ వయస్సుకు తగ్గట్టుగా మృదువుగా, ఏది మంచి, ఏది చెడ్డ అన్నది చెప్పాలి. ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అన్నది కూడా పిల్లల బుడి బుడి నడకల స్థాయిలోనే వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. మన ఇంట్లో మన పిల్లలు అల్లరి చేస్తేనేమి? అని కొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. మరి పిల్లలతో ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అల్లరి చేయరని గ్యారంటీ ఏముంది?


రచయితతో చిన్న బావమరిది జాషువా. పాండ్రాక (విజయవాడ)
నాకు మంచి పేరున్న వైద్య మిత్రుడు ఉండేవాడు. ఆయన శ్రీమతి సాధారణ గృహిణి. మా ఇరుకుటుంబాల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉండేవి. మంచి కుటుంబం. వారికి ముగ్గురు మగపిల్లలు ఉండేవారు. అందులో ఒకరు మా అబ్బాయి క్లాస్మేటే, మరో అబ్బాయి మా అమ్మాయి క్లాస్మేట్. అంతా బాగా ఉండేవారం. కానీ ఎప్పుడైనా వారాంతరంలో మా ఇంటికి వచ్చినప్పుడు నేను టివి, రిఫ్రిజిరేటర్, టేప్ రికార్డర్ వంటి వస్తువుల దగ్గర కాపలాగా ఉండేవాడిని. వాళ్ళు యెంత అల్లరి చేసినా తల్లిదండ్రులు అసలు పట్టించుకునేవారు కాదు. వస్తువు పోతే తిరిగి సమకూర్చుకునే పరిస్థితి నాకు అప్పుడు అసలు లేదు. అలా వుంటాయి పరిస్థితులు. అలాంటి పిల్లలను చూసిన ఇతరులు తక్షణం అనేమాట “ఇదేమి తల్లిదండ్రుల పెంపకం” అని.


రచయితతో వారి అబ్బాయి రాహుల్. కానేటి (బోస్టన్-అమెరికా)
ఇంకొక విషయం ఏమిటంటే ఎదుగుతున్న పిల్లల ఎదురుగా తల్లిదండ్రులు సరసాలాడడం, దుర్భాషలాడుకోవడం, కొట్లాట పెట్టుకోవడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం వంటివి చేయడం వల్ల ఆ ప్రభావం పిల్లల మీద తప్పక పడుతుంది. పిల్లలను చదువుకోమని, తల్లిదండ్రులు పెద్ద సౌండ్ పెట్టి టి.వి, చూడడం, పాటలు వినడం పిల్లలను పెడత్రోవ పట్టిస్తాయి. అంతమాత్రమే కాదు, పిల్లలకు – తండ్రి గురించి తల్లి చెడుగా చెప్పడం, అదే విధంగా తల్లి గురించి చెడుగా తండ్రి చెప్పడం వంటివి పిల్లలను అయోమయంలో పడేసి వారిని చెడు మార్గంలోకి నెట్టేసే పరిస్థితులు ఏర్పడతాయి. పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తుంది, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడడో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబాలలో, సంసారాలలో బీటలు వారే పరిస్థితులు ఏర్పడతాయి. అందుచేతనే పిల్లలు ఏమి చేసినా, ఎక్కడో తల్లిదండ్రులు తప్పు చేసినట్టుగా భావించవలసి ఉంటుంది. పిల్లల ఎదుగుదల దశ చాలా సున్నితమైనది. ఆ సమయంలో వినిపించే ప్రతిమాట, కనిపించే ప్రతి దృశ్యం వాళ్ళ మస్తిష్కంలో ముద్రపడిపోతుంది. అందుకే పిల్లల పెంపకం అనుకున్నంత సులభం కాదు. జాగ్రత్తలు పాటిస్తే కష్టమైన పని కూడా కాదు.


చిన్నప్పుడు రాహుల్ (కుడి)
ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మా అబ్బాయి (రాహుల్) మా చిన్న బావమరిది (జాషువా) బాల్యంలో నాకు ఎదురైన చిన్న సంఘటన గురించే – సుమారుగా పాతిక సంవత్సరాల క్రితం మాట. నేను మహబూబాబాధ్ ఆసుపత్రిలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న రోజులు. మా అబ్బాయికి (రాహుల్ కానేటి) నాలుగైదు సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. మా చిన్న బావమరిది (జాషువా సుందర్. పాండ్రక) మా వాడికంటే కొన్ని సంవత్సరాలు పెద్దవాడు. సెలవులు ఉన్నప్పుడల్లా మా బావమరిది విజయవాడనుండి మహబూబాబాద్‌కు మా ఇంటికి వచ్చేవాడు. ఇద్దరు అక్కలు, ఒక అన్న తర్వాత చాలా కాలానికి పుట్టినవాడు (అందుకే చిన్ని.. అని పిలుస్తారేమో) చాలా గారాబంగా పెంచేవారు. అల్లరి బాగా చేసేవాడు, చిలిపి పనులెన్నో చేసేవాడు. ఇంట్లో అతడి చేష్టలను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. నాకు మాత్రం కాస్త భయపడేవాడు. అతనొక్కడే నన్ను ‘బావగారు’ అని పిలుస్తాడు. (పెద్ద బావమరది, మరదలు నన్ను ‘మామయ్య’ అని పిలుస్తారు).


బాల రాహుల్


రాహుల్ (ఎడమ), జాషువా (కుడి)


జాషువా (ఎడమ), రాహుల్ (కుడి)
సెలవులకు ఒకసారి మా చిన్న బావమరిదిని తీసుకుని మా ఇంటికి వచ్చారు మా అత్తగారు. ఒకరోజు నేను సాయంత్రం ఆసుపత్రి డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుండగా, మా అబ్బాయి రాహుల్ ఏడుపు వినిపించింది. మామూలుగా చిన్న చిన్నవాటికి మా అబ్బాయి ఏడ్వడు. ఏడుస్తున్నాడంటే అదేదో పెద్ద విషయం అనుకుని వెంటనే బయటకు పరిగెత్తాను. రాహుల్ ఏడుస్తున్నాడు, చిన్న బావమరిది జాషువా సీరియస్‌గా వున్నాడు. సంగతేమిటని రాహుల్‌ని అడిగాను. వాడు ఏడుస్తూనే “చిన్ని (జాషువా) కొట్టాడు” అన్నాడు, అతని వైపు చూపించాడు. నిజానికి అబ్బాయి చెప్పినదానిని బట్టి, నేను మా బావమరిదిని కొట్టడమో, భయం చెప్పడమే చేయాలి. కానీ దానికి వ్యతిరేకంగా ఇంకా ఏడుస్తున్న నా కొడుకునే చీపురు లోని ఈన తీసుకుని కొట్టడం మొదలు పెట్టాను. ఆశ్చర్యంగా దెబ్బలు తిన్నవాడు ఏడుపు మానేసాడు, దెబ్బలు తినవలసిన వాడు ఏడ్వడం మొదలు పెట్టాడు. తన తప్పు తెలుసుకున్నాడు “బావగారూ.. రాహుల్‌ని కొట్టకండి, ఇంకెప్పుడూ రాహుల్‌ని కొట్టను” అంటూ దండాలు పెట్టడం మొదలు పెట్టాడు. నా భయానికి మావాడు బిగబట్టుకుని కూర్చున్నాడు. అనవసరంగా మా వాడిని కొట్టినందుకు లోలోపల నేను ఏడ్చుకున్నాను. వాడిని ఎత్తుకుని లోపలికి తీసుకుపోయాను.


జాషువా కుటుంబం (విజయవాడ)
అది ఇప్పటికీ అది నాకు బాధ కలిగిస్తూనే వుంది, కానీ అప్పటి నుండి మా బావమరిది అల్లరి స్థాయి తగ్గించేసాడు, నేనంటే అతనిలో భయంతో కూడిన గౌరవం ఏర్పడింది. ఆ గౌరవం, తనకు పెళ్ళై పిల్లలు కలిగినా అతను ఇప్పటికీ కొనసాగిస్తూనే వున్నాడు. వాళ్లిద్దరూ ఇప్పటికీ మంచి స్నేహితుల్లా వుంటారు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, పిల్లలు ఎదుగుదల, వారి చేష్టలు, వ్యక్తిత్వం, తల్లిదండ్రుల పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది. పిల్లల పట్ల ప్రేమగానే ఉండాలి, కానీ అవసరమైనప్పుడు క్రమశిక్షణ గుర్తు చేయవలసిందే. ప్రేమ పేరుతో గారాబం, పిల్లల భవిష్యత్తుకు స్పీడ్ బ్రేకర్ కాకూడదు. అలాగే క్రమశిక్షణ పేరుతో పెద్దలు ‘అతి’ ప్రదర్శించడం కూడా మంచిది కాదు. హద్దులు దాటితే ఏదీ మంచి ఫలితాలను ఇవ్వదు. పిల్లలను పెంచడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా ఈ రోజుల్లో అది కత్తిమీద సాము లాంటిదే!


శ్రీమతి దివ్యతో….రాహుల్ (బోస్టన్)


తల్లిదండ్రులతో, శ్రీమతితో రాహుల్.
అవసరమైనప్పుడు పిల్లలకు చిన్న చిన్న శిక్షలు, తాత్కాలిక విషయం, కానీ ఆ క్రమశిక్షణ జీవితాంతం వారితో కలిసి పయనిస్తుంది, అందులో ఎలాంటి సందేహమూ లేదు.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
26 Comments
డా. కె.ఎల్ వి ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక కృతజ్ఞతలు
—-డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా.
Sagar
నిజమే సర్. మీరన్నట్లు చెప్పవలసిన రీతిలో పిల్లలను మార్చాలే తప్ప, ఇష్టం వచ్చినట్లు బాదితే అది అసలుకే మోసం అవుతుంది. ఇక మీ బావమరిది విషయంలో మీ ప్రవర్తనే అతనిని అల్లరి తగ్గేలా మార్చిందని నా అభిప్రాయం. మీకు ధన్యవాదములు సర్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సాగర్
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
జ్ఞాపకాల పందిరి ..103 లో పిల్లల పెంపకమనే సున్నితమైన అంశంపై రాశారు. మీరు చెప్పినట్టుగా పిల్లలను పెంచడం కత్తి మీద సాములాంటిదే. పిల్లల మనసులు గాజుకంటే చాలా సున్నితమైనవి. చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణగా వారిని పెంచడం అవసరం.
నేను ఈ మధ్య కొందరు తల్లిదండ్రులను మా ఆపార్టుమెంట్ లో గమనించాను. పిల్లలు ఏది అడిగితే అది క్షణాల్లో సమకూరుస్తున్నారు. అతి గారాబం చేస్తున్నారు. తను కోరుకున్న వస్తువు లభించనప్పుడు నానా అల్లరి చేస్తూ, చేతికి అందిన వస్తువులను విసిరేస్తున్నారు. పిల్లల పెంపకంపై మీ సూచనలు అమూల్యం. అభినందనలు
—-జి.శ్రీనివాసాచారి
కాజీపేట.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
చారిగారూ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
103 వ సంచిక వ్యాఖ్యానించటానికేమీ లేదు.మీరు చెప్పిన విషయాలూ కాదనలేనివి..మీవలె ఆలోచన చేసేవారు తక్కువ.పిల్లలను తీసుకొని ఇతరుల( స్నేహితుల) ఇండ్లకు పోయినప్పుడు పిల్లలమీద వారి చర్యల మీద ఒక కన్ను వేసి ఉంచాలె.ఏది కనిపిస్తే అది కావాలని అడగటం ఇవ్వకపోతే అల్లరి చేసి ఏడవటం వంటివి కంట్రోల్ లో పెట్టవలసిన బాధ్యత,తలిదండ్రులదే.వద్దంటున్నా అన్ని వస్తువులు వెదకి తీసి పగలకొట్టేపిల్లలను తలిదండ్రులు సర్ది చెప్పే బదులు మావాడు చూచిన వస్తువు వాని చేతికి వచ్చేదాకా ఊరుకోడు ఆరునూరైనా ఆవస్తువు వానికివ్వవలసిందే అంటూ అదేదో గొప్ప లక్షణమైనట్టు చెప్పుతుంటరు.పిల్లలు ఆడుకుంటే పరవాలేదు విరగ్గొట్తారు
తలిదండ్రులుఅయ్రో విరగ్గొట్టినావుర అంకుల్‌కు మళ్ళీ కర్చు పెట్టినవా ? అంటుంటారు. ఇటువంటివి చాలా చూసిన.పిల్లలనుమిరన్నట్టు ఒక పద్ధతిలో పెంచటం ,కొన్ని విషయాలు–మర్యాద -అదే ఎవరింటికి పోయినప్పుడైనా మెలగవలసిన పద్ధతులు చెప్పాలె.
—రామశాస్త్రి
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
శాస్త్రి గారు…
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
చాలా సున్నితమైన సమస్య. మంచి కథనం. అభినందనలు సార్
——డా.సుజాత
విజయవాడ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
ధన్యవాదాలు మీకు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Very nicely described about small children, we must always polite to small children
—-Alexander.Nama
USA.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you somuch brother.
డి. వి. శేషాచార్య
పిల్లల పెంపకం అనేది ఒక కళ. మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు. పిల్లల పెంపకంలో గారాబం, క్రమశిక్షణ సమపాళ్ళలో ఉండాలి. సున్నితమైన ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదములు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదాలు
మిత్రమా…
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ఇప్పటివరకు , మన జీవితంలో కనిపించే ఎన్నో. ఇతివృత్తాలను సాంఘిక సమస్యలను వివరించారు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు.
పిల్లల ను పెంచే విధానంలో ,తోటివారికి ఇబ్బంది కలిగించే ఎన్నో క్రమ శిక్షణ లేని పనులు చేసే పిల్లల ను సరి దిద్దకుండా వుంటే వచ్చే ఇబ్బంది ఏలా ఉంటుందో తెలియ చెప్పారు. పిల్లలు ఎవరికైనా ముద్దె, కాని వారు చేసే అల్లరి పరిధి దాటి, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వున్నప్పుడే అసలు సమస్య.
పిల్లలను పెంచటం,ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య. అందులో ప్రస్తుతం ఒకరు మాత్రమే సంతానం అయ్యేప్పటి కి అది ఇంకా జటిలం అయ్యింది.
సంఘజీవిగా తాను చూసిన ప్రతీ విషయాన్ని జ్ఞాపకాల రూపంలో ప్రచురించడం అభినందనీయం.
రచయిత గారికి నా యొక్క నమస్సులు
—-శ్యామ్ కుమార్. చాగల్
నిజామాబాద్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మిత్రమా
నీ విశ్లేషణ చాలా బాగుంది
కృతజ్ఞతలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అల్లరి చేస్తున్న పిల్లల ను ఏ విధముగ కంట్రోల్ చెయ్యాలో ఎగ్జాంపుల్ తో సహా చక్కగా వివరించారు.ఇప్పటి పేరెంట్స్ కు ఈ ఎపిసోడ్ చాలా ఉపయోగ పడుతుంది. మీకు ధన్యవాదాలు అన్నయ్య గారు.
—శ్రీమతి జయ అలెగ్జాండర్
అమెరికా.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 103 ఎపిసోడ్ లో పిల్లల పెంపకం అనే అంశంపై చక్కని సందేశాత్మక వివరణ ఇచ్చారు.ఇప్పటి తరానికి ఎంతో ఉపయోగపడుతుంది. చెప్పిన మాట విననప్పుడు చాలా మంది తల్లిదండ్రులు వారిపై సహనం కోల్పోయి అరవడం చేస్తుంటారు. పిల్లలకు ఏ విషయం చెప్పాలన్నా అది చాలా నిదానంగా సౌమ్యంగానే చెప్పాలి,మరియు వారు వినే ప్రయత్నం చేసే విధంగా ఉండాలి.చెప్పవలసిన రీతిలో చెప్పి పిల్లలని మార్చాలని చక్కని సందేశం ఇచ్చారు సర్.మీకు ధన్యవాదములు డాక్టర్ గారు
.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Anduke ..peddalu cheppevaallu..
“Pillalaku Kalla bhayam vundaali”
Ani….
Kanti choopulathone bhayapettaali..ani ardham..
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ఓహో…!!
My sister late mahaneeyamma.kanety practiced as a Teacher.
Thank you Rao garu.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
పిల్లల పెంపకంలో మీ అనుభ వాలు, ఆలోచనలు సహజ మైనవే !






—కోరాడ నరసింహారావు
విశాఖపట్నం.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
కోరాడ వారికి
ధన్యవాదాలు.
ADLURU NARASIMHA MURTHY
“ఇదేమి శిక్ష” అంటూ Dr KLV ప్రసాద్
గారు వ్రాసిన
జ్ఞాపకాల పందిరి – 103
నీడలో ప్రశాంత చిత్తుడనై,
మనసు సారించాను.
వారి విశ్లేషణా విధానం బహు ఉపయుక్తంగా
ఉంది. పిల్లలు అల్లరి చేయకపోతే
చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ దగ్గరికీ,
పెద్దలు అల్లరిచేస్తే సైకియాట్రిస్ట్
దగ్గరికి తీసుకెళ్లాలని
మా నాన్న కీ.శే.A.L.N శాస్త్రి గారు
అంటూ ఉండేవాడు.
కాబట్టి, పిల్లలు అల్లరి చేయాలి తప్పకుండా.
మనపిల్లల అల్లరి మనకానందమే మరి.,
ప్రక్కింటివారికి….అని తల్లిదండ్రులు ఆలోచించాలని డా. ప్రసాద్ గారు
మన మెదడకు మేత వేశారు.
అది అక్షర సత్యం.
అపార్ట్మెంట్ కల్చర్ లో పిల్లల అరుపులు, కేకలు, విరగ్గొట్టడాలతో తల్లిదండ్రులు అరవడం, కొట్టడం గురించి
గూడా వివరించారు.
అదే జరిగింది…
మా అపార్ట్మెంట్ హనుమకొండలో.
మా మనుమలు
చి.సుధామ (10),
చి. సుధాంశ(7) ల విషయంలో.
కారిడార్ లో వాళ్ళు సైకిల్ తొక్కితే, ఎదురింటి వారితో గోల. మా గోడ మీద గీతలు పడ్డాయి కాబట్టి కలర్స్ వేయించండని.
ఇలాంటి పరిస్థితులలో రచయిత డా.ప్రసాద్ గారు చెప్పినట్లు పిల్లల మనస్తత్వస్థాయికి
దిగి వారికి నచ్చజెప్పాలే తప్ప కొట్టకూడదని
చెప్పడం నచ్చింది నాకు.
కొట్టడం అనివార్యమైతే, అది వేరే విషయం.
అతి గారాబం చెయ్యకుండా, గాబరా పడకుండా… సున్నిత మనస్కులైన పిల్లలను
కడు జాగ్రత్తగా పెంచాలనే సూచన తల్లిదండ్రులు అందరికీ ఆవశ్యకం.
పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్ళినపుడు ముందుగా
పిల్లలకు కొన్ని గట్టి సూచనలిచ్చి, ఒక కనిపెట్టాలనేది మరీ ముఖ్యం.
జాషువ, రాహుల్ ల మధ్య గల చిన్న వివాదాన్ని వారు మరో కోణంలో దానిని పరిష్కరించడం చాలా ఆశ్చర్యపరిచింది.
ధన్యవాదములు సర్.
నమస్కారం!!!
అడ్లూరు నరసింహమూర్తి
రిటైర్డ్ మ్యాథ్స్ లెక్చరర్
హనుమకొండ.
9010620404.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మీ విశ్లేషణ బాగుంది సర్
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
వాస్తవం చెప్పారు సర్ పిల్లల్ని క్రమంలో పెట్టి పెంచాల్సిన విధంగా పెంచడం కత్తి మీద సాము అయినా తల్లిదండ్రులే ఆ బాధ్యత నిర్వహించాలి.ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం మరీ కష్టంగా ఉంది.చైల్డ్ సెంటర్డ్ ఫ్యామిలీస్ అయిపోయి అతి గారాబం చేస్తున్న వైనాలే ఎక్కువ ఉన్నాయి.చక్కగా పెంచిన మీ వైనం,అతి చక్కగా పెరిగి నేడు బోస్టన్ వంటి విదేశాల్లో ఉంటున్న మీ కుమారులు అందరికీ ఆదర్శమే.తల్లిదండ్రులు చెప్పినట్టు పెరిగే పిల్లల ప్రగతి ఈ విధంగానే ఉంటుంది అని చెప్పకనే చెప్పారు.ఆవశ్యకమైన అంశాన్ని పంచుకున్నారు సర్.ధన్యవాదాలు


—నాగజ్యోతీ శేఖర్
కాకినాడ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు.