ఆ.. ఆనందమే వేరు సుమా..!!
జీవితంలో ఏ దశకు ఆ దశే గొప్పది. సీరియస్‌గా తీసుకుంటే దేని గొప్పదనం దానికుంటుంది. జీవితం చివరి దశలో వాటన్నింటిని సింహావలోకనం చేసుకోగలిగేవారికి, అంతకు మించిన ఆనందం, తృప్తి ఎక్కడ దొరుకుతుంది. కొందరు వారి వారి అభిరుచులను బట్టి, మిత్రులతో, సన్నిహితులతో, శ్రేయోభిలాషులతో, దగ్గరి బంధువులతో ఏదో రూపంలో నిత్యం సంబంధం కలిగి వుంటారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సాధ్యం అయినా దానిమీద పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు. కొందరు మాత్రం గత జ్ఞాపకాలను నెమరు వేసుకుని తాత్కాలిక తృప్తిని పొందుతూ వుంటారు.
ముఖ్యంగా చదువుకునే రోజులను గురించి చెప్పాలంటే, చాలామంది, పదవ తరగతి, లేదా ఇంటర్ వరకూ ఒకే చోట చదువుకుని, ఆ తర్వాత పై చదువుల కోసం తలోచోటికి పోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వారి.. వారి అవకాశాలను బట్టి వివిధ ప్రదేశాలకు వెళ్లి చదువుకోవడం, చదువులు పూర్తయ్యాక, ఉద్యోగ రీత్యా వివిధ ప్రదేశాలకు, రాష్ట్రాలకు, లేదా విదేశాలకు వెళ్లడం, అక్కడ స్థిరపడిపోవడం జరుగుతుంది. ఆడపిల్లల విషయం వేరేగా చెప్పనవసరం లేదు. అత్తారిల్లు, ఆఫీసు ఎక్కడ వుంటాయో చెప్పలేము.
ఇలా ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలా చాలామంది ఇక అసలు కలుసుకోలేక పోతారు. ఉద్యోగాల మూలానో, బంధుత్వాలు మూలంగానో, కొందరు వారి జీవితంలో బాల్య మిత్రులను కలుసుకోగలుగుతారు. అలా కాకుండా ఒక్కోసారి మనం ఊహించని రీతిలో, మనకు తెలిసిన వాళ్ళు అనుకోకుండా, వేరొకరి ద్వారా మన గురించి తెలుసుకుని, మన వివరాలు కనుక్కుని, మనకు కాల్ చేసినా, ఉత్తరం రాసినా (ఇప్పుడు అలవాటు తప్పిపోయిందనుకోండి) మనం పొందే ఆనందం చెప్పడానికి కొలమానం ఉండదు. ఎందుకంటే అలా జరుగుతుందని మనం ఊహించం, అనుకోము కూడా! అలాంటి సందర్భాలు మనిషికి జీవితం మీద మరింత ఆశను కలిగిస్తుంది. ఈ ఆధునిక కాలంలో మొబైల్ వంటి ప్రసార/ప్రచార సాధనాలు అందుబాటులోనికి రావడంతో, ఇలాంటి కలయికలు మరింత సులభం కావడానికి అవకాశం కలిగింది. ఒకప్పుడు వేరే ఊర్లలో, విదేశాల్లో వున్నవాళ్ళతో కనీసం మాట్లాడాలనుకుంటే, ‘ఎస్.టి.డి, ఐ.ఎస్.డి’ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. మాట్లాడుకోవడానికి క్లారిటీ ఉండేది కాదు, పైగా బోలెడంత ఖర్చుతో కూడుకుని ఉండేది. సామాన్యులకు ఈ సదుపాయం ఉండేది కాదు.
కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నం. ఇప్పుడు మొబైల్ నుండి ఉచితంగా ఎక్కడికైనా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అందుచేత పాతవాళ్ళు కలుసుకోవడానికి ఇప్పుడు ఇదొక ముఖ్య సాధనం అయిపొయింది. అతి సామాన్యుడికి సైతం మొబైల్ అందుటులోనికి రావడమే దీనికి ప్రధాన కారణం.
మొబైల్ వచ్చి జీవితాలను నాశనం చేసిందని, బంధాలు-అనుభందాలను తెంచేసిందని, ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవడమే మానేశారని.. మొబైల్‌ను వాడుతూనే దానిపై నిందలు మోపేవాళ్లు కూడా లేకపోలేదు. దేనినైనా సద్వినియోగం చేసుకోకపోతే ఇలాంటి వ్యాఖ్యానాలే వినిపిస్తుంటాయి. అది ఆ పరికరం తప్పు కాదు కదా!
ఇక అసలు విషయానికి వస్తే, ఈ మధ్య రచయిత్రి శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారు (వీరు సంచిక – అంతర్జాల పత్రిక ద్వారా పరిచితులు) నా.. అనారోగ్యం వల్ల రెండుసార్లు వారి ఫోన్ విషయం నేను చూడలేదు. అయితే వారే నాకు వాట్సప్‌లో మెసేజ్ పెట్టారు. కొందరి పేర్లు ఉదాహరించి “వీరు మీకు తెలుసా, సార్” అన్నారు. అది చదివి నేను ఆశ్చర్య పోయాను. కారణం వారు ఉదాహరించిన వారందరూ, నాగార్జున సాగర్‌లో, నా విద్యార్థి దశలో నాకు బాగా పరిచయం వున్నవారు. వీళ్లంతా నాగలక్ష్మి మేడంకు ఎలా తెలుసబ్బా? అని కాస్సేపు ఆశ్చర్య పోయాను. ఆవిడ బంధువులు అనుకుందామా, అంటే, ఆవిడ చెప్పిన వ్యక్తులను బట్టి, బంధువులు అయ్యే అవకాశం లేదు. ఆవిడ ఫోన్ చేసి మాట్లాడేవరకూ ఆ చిక్కు ముడి వీడలేదు.


రచయిత్రి శ్రీమతి పుట్టి నాగలక్ష్మిగారు
ఆవిడ చెప్పిన వాళ్లంతా, చదువు సంధ్యలు ముగించుకుని, ఉద్యోగ రీత్యానూ ఇతర కారణాల వల్ల నాగలక్ష్మి గారికి బాగా తెలుసు. అయితే మాటల మధ్యలో నాగార్జున సాగర్ రావడం, నేను సంచికలో రాసిన ఒక వ్యాసం ఆధారంగా లక్ష్మి గారు నా పేరు ప్రస్తావించడం, తద్వారా తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం సమాచారం అందించే అవకాశం ఆవిడకు కలిగింది.
మేడం ఉదహరించిన వ్యక్తులు నన్ను అభిమానించే వాళ్ళు కావడం, ఇప్పటికీ అభిమానిస్తుండడం, ఇదంతా సాగర్‌లో నన్ను చదివించిన మా అక్క ప్రభావం. వాళ్లకి మా అక్క పట్ల వున్న గౌరవం,అభిమానం కారణంగా నన్ను ఇంకా గుర్తుపెట్టుకుని నన్ను గురించి తెలుసుకోవడం, నన్ను కలవాలని ఆరాటపడడం, వారి సహృదయతకు తార్కాణం. ఇప్పుడు ఇక్కడ వారందరి గురించి ప్రస్తావించలేను కానీ, ఒక వ్యక్తి గురించి తప్పక చెప్పాలి.
నాగార్జున సాగర్, దక్షిణ విజయపురి హైస్కూల్లో మా అక్క స్వర్గీయ కుమారి కానేటి మహానీయమ్మ గారు సైన్స్ అసిస్టెంట్‌గా పని చేస్తూ, బయాలజీ, ఆంగ్లం బోధించేవారు. అక్కకు ఇద్దరు మంచి స్నేహితులు (సహోద్యోగులు) ఉండేవారు. వారు శ్రీమతి శేషారత్నం గారు (ఇప్పుడు గుంటూరు లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు) శ్రీమతి సత్యవతి గారు (ఇప్పుడు లేరు). సత్యవతి టీచర్ గారు హిందీ బోధించేవారు.


ఎడమ రచయిత అక్కగారు, మధ్య శేషారత్నం గారు, కుడి సత్యవతి గారు
ఈవిడ మా అక్కను, మమ్ములను (నన్ను, అన్నయ్య డా. మధు) స్వంత బంధువులుగా చూసేవారు. మా కుటుంబం నాన్-వెజిటేరియన్,అయినప్పటికీ మా అక్క మాత్రం నూటికి నూరుపాళ్లు శాకాహారి. అందు చేత సత్యవతి టీచర్ గారు, నాకు అన్నయ్యకు, మాంసాహారం ఆప్యాయంగా వండిపెట్టేవారు.


రచయిత పెద్దక్క మహానీయమ్మ నాగార్జున సాగర్
ఆవిడకు ముగ్గురు పిల్లలు, ఆ పిల్లలతో పాటు, వారి చెల్లెలి కొడుకును కూడా చదివించేవారు. ఆ ముగ్గురు పిల్లలకంటే ఈ అబ్బాయి పెద్దగా ఉండేవాడు, ఇంటిపనులలో టీచర్ గారికి సహాయం చేస్తూ కష్టపడి చదువుకుంటుండేవాడు. నేను 1974లో ఇంటర్ పాస్ అయిన తర్వాత, హైదరాబాద్‌కు వచ్చేయడం చదువు, ఉద్యోగం, పదవీ విరమణ, విశ్రాంత జీవితం 70 ఏళ్ళ వయసుకు లాక్కొచ్చింది. ఈ కాలంలో సత్యవతి టీచర్ గారు చనిపోవడం మాత్రమే తెలుసును గానీ, వారి పిల్లలు ఏమి చదువుకున్నారో నాకు తెలిసే అవకాశం లేదు. ఆ ఆలోచన కూడా సహజంగా ఉండదు. ఎందుకంటే మన నిత్య జీవిత వ్యవహారాలు మనకుంటాయి కదా!
మేడం పుట్టి నాగలక్ష్మి గారి ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, సత్యవతి టీచర్ గారి దగ్గర చదువుకున్న వారి చెల్లెలి కొడుకు,శ్రీ నరసింహ రావు (ముద్దు పేరు ‘నర్స’) ప్రస్తుతం విజయవాడలో ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గా పని చేస్తున్నాడని (సత్యవతి టీచర్ గారి పిల్లలు ఈ స్థాయికి వచ్చినట్టు లేరు).


రచయిత పెద్దక్క ఒకనాటి శిష్యుడు, మేజిస్ట్రేట్ దేవు నరసింహారావు, ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, విజయవాడ.
ఈ విషయం విన్న నా ఆనందానికీ ఆశ్చర్యానికి కొలబద్దలు లేకుండా పోయాయి. అంత మాత్రమే కాదు, నా గురించి తెలియగానే నా మొబైల్ నంబర్ సంపాదించి, నాతో ఎంతో మర్యాదగా ఆత్మీయంగా మాట్లాడడం. ఎలాంటి భేషజాలు లేకుండా, ఆయన కుటుంబ మిత్రుడిలా, నలభై నిముషాలు మాట్లాడడం. ప్రతి రెండు నిముషాలకూ తనకు విద్యాబోధన చేసిన మా అక్కను స్మరించుకోవడం, అతని సంస్కారానికి, అభిమానానికి చిన్నవాడైనా, చేతులెత్తి నమస్కరించాలనిపించింది. ఇలా మా అక్క ద్వారా నాకు లభించే గౌరవానికి గర్వపడుతుంటాను. ఊహించని స్థాయికి చేరుకున్న అక్క శిష్యులను గురించి విని సంబరపడిపోతుంటాను. అక్క ఎంత అదృష్టవంతురాలో కదా! గురువుల విలువ కూడా అలాంటిది మరి!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
23 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్
సికిందరాబాద్.
Sagar
గతాన్ని గుర్తు చేసుకోవడం కొంత మందికి నామోషీ కావచ్చు కానీ, ఆ జ్ఞాపకాలలో ఉన్న మధుర భావన వర్ణనాతీతం. అలాంటి వాటి నెమరవేతలో మీరు మొదటి వరుసలో ఉంటారు సర్. మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నీ స్పందనకు ధన్యవాదాలు
సాగర్.
Shyamkumarchagal.nzbd
పాత స్నేహితులను కలుసుకోవడంలో ఉన్న మజాయే వేరు. తప్పిపోయిన స్నేహితులను మళ్లీ ఎన్నో దశాబ్దాల తర్వాత కలవడం లో ఉన్న ఆనందం చెప్పనలివి కాదు. ఇప్పటికీ నేను పాత స్నేహితులను కలవడానికి శా య శక్తుల ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎంతోమంది చిన్ననాటి స్నేహితులు జీవిత ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు. స్నేహితులం అందరం కలిసి వారిని వారి అడ్రస్ ను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా కూడా కొందరి ఆచూకీ మాత్రం తెలియటం లేదు. కలిసిన స్నేహితులతో ఎన్నో రకాలుగా అనుబంధాలను పెంచుకుంటూ ఆనందంతో గడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ప్రేమించే స్నేహితులు లేని జీవితం వ్యర్థం. తప్పిపోయిన ఆ కొందరిని కలవకుండానే నా జీవితం పూర్తయిపోతుందేమోనని ఎన్నో మార్లు కలత చెందుతూ ఉంటాను. జీవితపు మలిదశలో ఆప్తులతో బంధువులతో మిత్రులతో ప్రేమించే వారితో గడపడమే అన్నింటికన్నా అద్భుతమైన వరం.
ప్రతి వారం మంచి విషయాన్ని మన ముందుకు తెచ్చి మన మధ్య చర్చకు నిలుపుతున్న డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ మరియు సంచిక యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాలా బాగా చెప్పావు మిత్రమా
నా వ్యాసానికి నీ అనుభవాలు బాగా జోడించి చెప్పావు.నిత్యం నా రచనలు చదువుతూ మంచి ప్రోత్సాహం అందిస్తున్న నీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్.
సికింద్రాబాదు.
Bhujanga rao
ఈ సంచికలో గురు శిష్యుల బంధం వాటి విలువ మరియు స్నేహ బంధం లో ఉన్న మాధుర్యం బాగా చెప్పారు. స్నేహం అద్భుతమైనది,నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు అట్లాగే స్నేహానికి హద్దులు లేవు,వయస్సుతో నిమిత్తం లేదు స్నేహం మధురమైన అనుభూతినిస్తుంది. ఎవ్వరికి చెప్పుకోలేని సమస్య పరిష్కారానికి స్నేహితునితో పంచుకుంటాము.గత జ్ఞాపకాలలో ఉన్న మాధుర్యం చాలా గొప్పగా ఉంటుందని తెలిపిన సంచిక సర్.మంచి విషయాలు అందిస్తున్న మీకు మా నమస్కారములు,
డా కె.ఎల్.వి.ప్రసాద్
భుజంగరావు గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ అక్కగారికంటే… మీరింకా అదృష్టవంతులండి !











ఎన్నెన్ని గొప్ప, గొప్ప అనుభవాలో !వాటన్నిటినీ ఫోటోలతో సహా భద్రపరచి…
మిత్రులతో పంచుకోవటం
…మంచి సంస్కారం !
ఇది అందరికీ సాధ్య పడదు !
—కోరాడ నరసింహారావు
విశాఖపట్నం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు
ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
చద్ది తిన్న రేవును మరవ కూడదని ఒకసామెత.అయితే అట్లా ఎంతమందివున్నారనేదిమిలియన్ డాలర్ల ప్రశ్న.
మీ అక్క గారు పంచిన విద్రకన్న ఆమె పంచిన సంస్కారం గొప్పదని నేనూ భావిస్తున్నాను.అట్లా అని విద్యను తక్కూవ చేయటంలేదు .కేవల విద్యనే కాదు పంచిన సంస్కారం గొప్పదని నా ఉద్దేశ్యం. ఇవాళ ఎంత మేలు లేదా సాయంచేసినా మరూనిమిషంలో మరచిపోతున్న వ్యవస్థలో బతుకుతున్నం.ఇటువంటి వ్యక్తులు అపురూపంగా ఉంటరు.
ఇటువంటి సంస్కారులను తయారుచేయగలిగిన మీఅక్క గారి జన్మధన్యం
—-నాగిళ్ళ రామశాస్త్రి
హన్మకొండ
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
Rajendra Prasad
You reminded us of our childhood. You are right that we get recognition and love for the reasons of our association with great people, example in your case your Sister Mahaneeyamma garu. She is namaka sardhaneeyaka
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you prasad garu.
D. Umashanker
గతము తలిచి వగచేకన్నా సౌఖ్యమే లేదూ
ఆన్నారొక కవి. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు అన్నారు ఇంకొకరు. మరుగుపడిన బంధాలను బంధుత్వాలను పదిలంగా గుర్తుచేసుకుంటూ, మాకుకూడా గుర్తు చేస్తున్న మీకు నా అభినందనలు ధన్యవాదాలు డాక్టరుగారూ
డా కె.ఎల్.వి.ప్రసాద్
సర్,
ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఎప్పుడో మరుగున పడి పోయాయన్న మనసైన పరిచయాలు మళ్లీ కళ్ళ ముందు కదలాడితే ఆ సంతోషాల సాగరమే మదినిండా ఉప్పొంగి పోతుంది. ఆ అనుభూతుల వలయం మిమ్మల్ని వరించి నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీ సంతోషాలు ఎప్పుడూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని మరింత ఉత్సాహ పరిచి ఆనంద డోలికలలో ఊపాలని మనసారా కోరుకుంటూ మీ జ్ఞాపకాల పందిరికి మరో సారి అభివాదం చేస్తూ మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్















మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి)
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
నీ స్పందనకు ధన్యవాదాలు.
డి. వి. శేషాచార్య
అందరితో “మైత్రీ బంధాలను” కలుపుకోవడమే కాదు, మీలాగా వాటిని నిలుపుకోవడమే గొప్ప విషయం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రమా
ధన్యవాదాలు.
GitacharYa
It doesn’t appear so on the first look, but this is a highly essential and important literature work. Thanks for sharing these sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీరు నాగార్జునసాగర్ తో , అక్కడి సన్నిహితులతో ఉన్న అనుబంధం గురించి వ్రాసిన వ్యాసం చదివాను. నాకు అక్కడి వారితో ఉన్న పరిచయం మీకు తెలి
చేశాను. అంతమాత్రానికే నాకు గౌరవం ఇచ్చి, మీ వ్యాసం లో నా ప్రస్తావన చేసినందుకు ధన్యవాదాలండీ! మీరు స్నేహానికిచ్చే విలువ అమూల్యం.. మీ స్నేహితులను గురించి మీకు తెలియజేయగలిగినందుకు నాకు సంతోషం.
—-పుట్టి నాగలక్ష్మి
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మేడమ్