చలో.. నిజామాబాద్..!!
‘కరోనా కాలం’ యావత్ ప్రపంచానికీ చాలా దురదృష్టకరమైన కాలం!
బ్రతుకు మీద ఆశలు మిణుకు.. మిణుకుమని భయపెట్టిన రోజులు. యావత్ జాతినీ ఇళ్లకే పరిమితం చేసిన కాలం, ఇంట్లో వున్న అందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకోలేనంత గడ్డు కాలం. ఆ రోజులు మరిచిపోదామన్నా మరచిపోలేని భయంకర రోజులు. పండుగలు లేవు, ఆటపాటలు లేవు, విందు వినోదాలు లేవు, బడులు గుడులు లేవు, పెళ్ళిళ్ళూ పేరంటాళ్ళూ లేవు, అంతా అయోమయం. దీనితో మనిషి ఒంటరివాడై పోయాడు, అన్నింటికీ దూరమైపోయినాడు.


ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన శ్యాం, లీల దంపతులు (నిజామాబాద్)
పుట్టింటికి వెళ్ళడాలూ, పుణ్యక్షేత్రాలు దర్శించడాలు వంటి విషయాలకు అసలు తావే లేదు! పక్కింట్లో, బంధువో, స్నేహితుడో, సన్నిహితుడో మంచం పట్టినా, మరణించినా చూడలేని పరిస్థితి. ఈ అయోమయంలో కూలినాలీ కోసం పొట్ట చేత పట్టుకుని పట్నాలకు తరలివచ్చిన పేద ప్రజానీకం, దిక్కు తోచని స్థితిలో, దూరాభారాలు లెక్కచేయకుండా కేవలం కాలినడకన ‘బ్రతికుంటే బలిసాకు తిని ఉండవచ్చు’ అనే సామెతకు అనుగుణంగా తమ స్వంత గ్రామాలకు చేరుకున్న ప్రజల దీన గాథలు తలచుకుంటే ఇప్పటికీ హృదయాలను మెలిపెట్టేస్తాయి.


మిత్రుడు, పారిశ్రామికవేత్త, తంగేడు ఫార్మ్ హౌస్ అధినేత, టి.వరప్రసాద్ (కొంపల్లి)
అసలు ప్రజలు తిరిగి స్వేచ్ఛగా కలిసి మెలిసి తిరిగే రోజు వస్తుందా? అన్న అనుమానం అందరిలోనూ ఉండేది. ఇది ఇలా ఉంటే ఆ రోజులు కార్పొరేట్ ఆసుపత్రులకు, ఇతర వ్యాపారస్థులకు పండగ రోజులు. సమస్త రోగపీడితులను నిలువుగా దోచుకుని మనిషిలో రాక్షసుడు ప్రవేశించిన రోజులు. ఆస్తిపాస్తులు అమ్మి తమ వారిని ఆసుపత్రిలో చేర్పించి లక్షలకొద్దీ ఖర్చు చేసినా, బ్రతికి బయటికి వస్తారో లేదోనని ఆందోళనపడిన దుర్దినాలు. ఇలాంటి నేపథ్యంలో రాకపోకల కోసం అన్ని మార్గాలూ మూసుకుపోయిన పరిస్థితి.


వరప్రసాద్ ఇంటి ప్రాంగణంలో – ఎడమనుండి -శ్రీమతి అరుణ ప్రసాద్, శ్రీమతి శోభా రెడ్డి, శ్రీమతి రాణి వరప్రసాద్.
ఇంటికే, నాలుగు గోడల మధ్య పరిమితమైపోయి, ఒక రకమైన నిర్లిప్తత, బద్ధకం చోటుచేసుకున్న సందర్భంలో ఊళ్ళు తిరగడాలు, బంధువులని చూడడాలు, పుణ్యక్షేత్రాలు తిరగడానికి ఉత్సాహం నశించిపోయిన సందర్భంలో, పిల్లలు కూడా నన్ను ఎక్కడికీ కదలనివ్వని ఆ దురదృష్టకర సమయంలో నా మిత్రుడు (ఇంటర్) శ్యామ్ కుమార్ చాగల్ (నిజామాబాద్/హైదరాబాద్) నాలో పూర్వ ఉత్సాహం తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేసి విజయం సాధించాడు. అది నేను హన్మకొండలో వుండి సాధించలేక పోయాను.


శ్యాం ఇంట్లో.. ఎడమ నుండి,ఆర్.చంద్రశేఖర్ రెడ్డి, శ్యామ్ కుమార్, టి.వరప్రసాద్.
మొదట రెండేళ్ల క్రితం మిత్రుడి ఫామ్-హౌస్‌లో(తంగేడు) మా ఇంటర్మీడియేట్ సహాధ్యాయులం ఆత్మీయ సమ్మేళనంతో నా కదలిక మొదలయింది. దీనికి ప్రధాన కేటలిస్ట్ మిత్రుడు శ్యామ్ కుమార్. అప్పుడు అతడు ప్రధానంగా నిజామాబాద్‌లో ఉంటున్నాడు, నేనేమో హన్మకొండలో ఉంటున్నాను. నేను ఆ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకానేమోనన్న అపనమ్మకంతో, నన్ను హైద్రాబాద్ తీసుకెళ్లడానికి, నిజామాబాద్ నుండి హన్మకొండకు కారులో వచ్చాడు. అంతమాత్రమే కాదు సుమండీ, మళ్ళీ నన్ను హైదరాబాదు నుండి తీసుకువచ్చి హన్మకొండలో క్షేమంగా దించాడు. అతని ప్రేమ అభిమానం అలాంటివి మరి!


శ్యాం & లీలకు చిరుసత్కారం
అలాగే మళ్ళీ నాగార్జునసాగర్, వరంగల్ లోని లక్నవరం, రామప్ప, గుంటూరులో సాహిత్య కార్యక్రమం, వీటన్నింటిని తిరగడానికి మిత్రుడు శ్యామ్ ఉత్ప్రేరకంగా పనిచేశాడు. నన్ను ఒక్క రూపాయికూడా ఖర్చు చేయనివ్వలేదు. అదిగో.. ఇదే నేపథ్యంలో చాలా రోజులుగా తమ జన్మస్థలం నిజామాబాద్‌లో మా ఇంటెర్మీడియేట్ మిత్రుల (1972-74) ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ప్రతిసారీ ఎవరికో ఏదో పని ఉండడం, మా ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇలా అయితే ఇది అయ్యేపని కాదని, ఎంతమంది వున్నా ఈసారి కార్యక్రమం జరగవలసిందేనని, ఒక తేదీ ఖాయం చేసేసాడు, అదే 11, మార్చి 2023, శనివారం అన్నమాట. గతంలోని మా ఆత్మీయ సమ్మేళనాలన్నీ హైదరాబాద్ లోనే ఎక్కడో ఒక చోట (రెండు సార్లు తంగేడులో) జరిగాయి.


శ్యాం & లీలకు చిరుసత్కారం
ఈసారి నిజామాబాద్. హైదరాబాద్ నుండి రెండున్నర గంటల ప్రయాణం. అనుకున్నట్టుగానే కొందరికి వీలు కాలేదు. మా ప్రతి కార్యక్రమంలోనూ వుండి, మాతో కలసి ఆనందిస్తూ, మమ్ములను ఆశీర్వదించే మా గురువు గారు (ఇంటర్లో మాకు జంతు శాస్త్రం బోధించారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరై, ఆ తర్వాత కంట్రోలర్ ఆఫ్ ఎక్సమినేషన్స్గా పదవీ విరమణ చేశారు) ప్రొఫెసర్ నాగులు గారు, మిత్రుడు సూర్య ప్రకాష్ రెడ్డి, ఆయన శ్రీమతి ఈ నిజామాబాద్ ఆత్మీయ సమ్మేళనానికి రాలేక పోయారు.


శ్యాం.. ఇంటి ప్రాంగణంలో చెట్టు కింద
అలా, 11వ తేదీ ఉదయం 8 గంటలకల్లా, నేనూ నా శ్రీమతి, శంకరపల్లికి దగ్గరలో వుంటున్న మిత్రుడు ఆర్. చంద్రశేఖర్ రెడ్డి దంపతులు, కొంపల్లిలో ఉంటున్న మరో మిత్రుడు వరప్రసాద్ (పారిశ్రామికవేత్త, ‘తంగేడు గెస్ట్ హౌస్’ అధిపతి) ఇంటికి చేరుకున్నాము. అక్కడినుండి అందరం ఒకే కారులో బయలుదేరి, దారిలో వరప్రసాద్ ప్రాయోజకత్వంలో అల్పాహారం సేవించి, కమ్మని కబుర్లతో, హాస్య సంభాషణలతో, వరప్రసాద్ అప్పుడప్పుడూ విసిరే జోక్స్ ఆస్వాదిస్తూ, రెండున్నర గంటల ప్రయాణాన్ని, రెండు నిముషాల్లో ముగించినట్టు ఫీల్ అయ్యాము. ఈ ప్రయాణంలో మా రథసారథి ‘వరప్రసాద్’ కావడం విశేషం. అలా ఎందుకన్నానంటే అతని స్థాయిలో ఎంతమంది డ్రైవర్ల నైనా వినియోగించుకోగల శక్తి అతనిది. కానీ స్నేహితులతో సరదాగా గడపాలన్నది అతని ముఖ్య ఉద్దేశం.


గుడి ప్రాంగణంలో
నిజామాబాదులో, భార్యాభర్తలు, శ్యామ్ – లీల (ఇద్దరూ మా ఇంటర్ క్లాస్ సహాధ్యాయులే!) మమ్ములను సాదరంగా, ఆత్మీయంగా ఆహ్వానించారు. తేనీటి విందుతో మా సమ్మేళనం ఆహ్లాదకరంగా జరిగింది. సపోటా, మామిడి, జామ, గులాబీ జామ చెట్ల మధ్య కబుర్లు చెప్పుకుంటూ, గత స్మృతులను నెమరు వేసుకుంటూ, ఆత్మీయమైన శాఖాహార భోజనం ఆనందంగా ముగించాం. స్వల్ప విరామంలో మహిళామణులు ఒకచోట, పురుషులు ఒకచోట సేదతీరిన తర్వాత, స్త్రీమూర్తులందరూ, ఇంటికి కొద్దీ దూరంలో వున్న దేవాలయాన్ని దర్శించుకోవాలనే కోరిక వెల్లడించడంతో వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత మిత్రుడు శ్యామ్ కుమార్ తీసుకున్నాడు. మిగిలిన మేం ముగ్గురం (వరప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి, నేనూ) ముచ్చట్ల తోనూ, పానీయాల సేవనతోనూ గడిపేసాం.


నిజామాబాదు నుండి తిరుగు ప్రయాణానికి సిద్దపడుతూ
నిజానికి మేము ఎప్పుడు ఎక్కడ కలిసినా సంగీత విభావరి తప్పక ఉంటుంది. శ్యామ్ – లీల, గాయకులు కావడంతో అది తప్పక ఉంటుంది. దానికి అవసరమైన సరంజామ అంతా వారి దగ్గర వుంది. కూనిరాగాలు తీసే అలవాటు నాకు కూడా కొద్దిగా ఉండడం వల్ల, ఈ మధ్య నన్ను కూడా గాయకుడిగా మార్చే ప్రయత్నంలో శ్యామ్ వున్నాడు. కానీ ఈసారి సమయం అనుకూలించక పోవడం వల్ల, అలసిన శరీరాలు త్వరగానే నిద్రకు ఉపక్రమించాయి. శ్యామ్ దంపతులు చక్కని ఏర్పాట్లు చేశారు. ఉదయం అల్పాహారం ముగిసిన తర్వాత, సుమారు 9.30కి తిరుగు ప్రయాణం అయ్యాము. హైదరాబాద్‌లో మరో వేడుకలో పాల్గొనే నిమిత్తం శ్యామ్ దంపతులు కూడా మాతోనే వాళ్ళ వాహనంలో బయలుదేరారు.


తంగేడు ఫార్మ్ హౌస్ లో
గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత, దారిలోనే వున్న వరప్రసాద్‌కు చెందిన ‘తంగేడు ఫార్మ్ హౌస్’ (ఇది మెదక్ జిల్లా కింద వస్తుంది) కు చేరుకున్నాము. అక్కడ లంచ్ బ్రేక్ అన్నమాట. ఫార్మ్ హౌస్ నిండా పండ్ల చెట్లు, వరి పొలం, సింహాచలం సంపెంగ చెట్లు, మధ్యలో సుందరమైన అన్ని సదుపాయాలూ గల గెస్ట్ హౌస్. ఆ వాతావరణం ఎంత ఆహ్లాద భరితంగా ఉంటుందో అక్షరాల్లో చెప్పలేను. కూరగాయలు సైతం సేద్యం చేస్తున్నారక్కడ. లోపలికి వెళ్ళగానే ఉభయ గోదావరి జిల్లాలలో మసలుతున్న భావన కలుగుతుంది. హాయిగా అక్కడ మధ్యాహ్న భోజనం సుష్టుగా ముగించుకుని, ఎవరికీ వారు గమ్యస్థానాలకు భయాలు దేరాం.


తంగేడు గెస్ట్ హౌస్ ముందు
ఇవి గొప్ప అనుభవాలు. కాస్త తీరిక చేసుకుని, తాము ఎవరమన్న భేషజాలు మరచిపోయి, పాత స్నేహితులతో మనసి విప్పి మాట్లాడుకోవడం, గత స్మృతులను నెమరువేసుకోవడంలో వున్న హాయి, ఆనందం, తృపి, మరో రూపంలో ఎంత ఖర్చు చేసినా దొరకవు.
ఇది నేను చాలా ఆలస్యంగా గ్రహించిన నగ్నసత్యం. వయసు మీరిన వారికి ఇది గొప్ప టానిక్. ఈ విషయంలో నన్ను చైతన్యపరుస్తున్న నా కుటుంబ సభ్యులకు, మిత్రులకు ముఖ్యంగా శ్యామ్ దంపతులకు, ఇతర శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను.
ఆత్మీయ సమ్మేళనాలు,
మనకు మనమే సమకూర్చుకోగల
మానసిక ఉల్లాసానికి పనికివచ్చే
మధురాతి మద్రమైన దివ్యఔషదాలు!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
29 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సికిందరాబాద్.
Sagar
కచ్చితంగా గొప్ప అనుభవాలే సర్. ఈ సమ్మేళనాలకు ఎవరు మొదట తెర తీశారో కానీ వారికి ముందు వేయి దండాలు పెట్టాలి. ఇంక మీ విషయంలో శ్యామ్ సర్ ఈ వయసు లోనూ ఉత్సాహం గా అంత దూరం కార్ ప్రయాణం లో మిమల్ని జాగ్రత్త గా తీసికెళ్లి మరల చేర్చడం వారికి మీ పట్ల స్నేహితులు పట్ల ఉన్న అభిమానానికి సాక్ష్యం. సమ్మేళనాన్ని ఆస్వాదించిన మీ మిత్రులకు మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందనకు ధన్యవాదాలు .
Shyam Kumar Chagal
జరిగిన విషయాలను స్మరించుకొని వాటిని వివరంగా జ్ఞాపకాల పందిరిలో అక్షర రూపం ఇవ్వడంలో డాక్టర్ కె.ఎల్.వి ప్రసాద్ గారు అద్భుతమైన పటిమను ప్రదర్శించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
తన జీవితంలో జరిగిన మంచి మంచి విషయాలను ఇక్కడ చర్చిస్తూ వాటికి తగిన విధంగా తన అనుభవాలను జోడించి చదువరులను ఆకట్టుకునే విధంగా వివరిస్తూ ఉన్నారు.
నిజానికి నాకు కథా రచనలలో ఎటువంటి అనుభవం కానీ లేదు. నాతో రచనలను మొదలుపెట్టించి వాటిలో ఉన్న మెలకువలను నేర్పిస్తూ తప్పులను సరిదిద్దుతూ ఒక రచయితగా నన్ను కళారంగానికి పరిచయం చేశారు. ఇందులో నేను ఎనలేని ఆనందాన్ని అనుభవిస్తున్నాను అనడంలోఎటువంటి అతిశయోక్తి లేదు.
ఎన్ని విధాలైన సేవలు చేసినా కూడా నేను గురుతుల్యుడైన డాక్టర్ కె.ఎల్.వి ప్రసాద్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
మంచి స్నేహితులతో ఆరోగ్యకరమైన స్నేహాలలో ఉండే మధురమైన ఆనందాలను నేను ఇప్పుడు ఆస్వాదిస్తూ ఉన్నాను.
పదవీ విరమణ తర్వాత కలుగుతున్న ఈ ఆనందకర పరిణామాలు నేనెప్పుడూ ఊహించలేనివి. స్నేహితులతో కలిసి గోవర్ధనగిరి లాంటి స్నేహాన్ని మథనం చేస్తే వచ్చేది అమృతమే సుమా.
జీవితపు మలి అంచులలో ఉన్న వారందరికీ స్నేహితులే ప్రాణవాయువులు.
మా గృహానికి తమ సహచరిణలతో కలిసి విచ్చేసిన చంద్రశేఖర్ రెడ్డి, వరప్రసాద్ మరియు డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ గారితో గడిపిన విలువైన క్షణాలను జ్ఞాపకాల పందిరి రూపంలో అందించిన సంచికకు నా కృతజ్ఞతలు.
నకనకలాడుతున్న కడుపుతో ఆకలి బాధతో అలమటిస్తూ ఉన్న సమయంలో జీవితం సమరంలో విజయాన్ని సాధించడానికి తోడ్పడిన వారు స్నేహితులు మాత్రమే. నువ్వు చాలించే వరకు వారితో అత్యంత సమయం గడపడానికి వీలు కలగాలని దేవుడు నీ ప్రార్థిస్తూ మరొక్కసారి నా గురువు మరియు మిత్రుడు అయిన డాక్టర్ కె.ఎల్.వి ప్రసాద్ గారికి నా కృతజ్ఞత అభివందనములు.
మీ భవదీయుడు శ్యాం కుమార్ చాగల్
డా కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రమా చాలా బాగా రాసావు.విషయాన్ని బాగా విశ్లేషించావు.ఈ నైపుణ్యమే నిన్ను మంచి కథకుడిగా తయారు చేసింది.నీకు అభినందనలు/ధన్యవాదాలు.
-‘డా.కె ఎల్ వి ప్రసాద్.
సికిందరాబాద్.
sunianu6688@gmail.com
మీ అనుభవాలు, సంతోషాలు కొంతమందికి ఐనా స్ఫూర్తిదాయకంగా వుంటే చాలు. రిటైర్మెంట్ ఐన తర్వాత డబ్బులు కోసం కాక ఇలాంటి సంతోషాలు కోసం సమయాన్ని వెచ్చిస్తే ఆరోగ్యమ్ తో పాటు ఆనందాలు కలుగుతాయి. మీ మిత్రులు మరియు వాళ్ల ఫ్యామిలీ ఇలాగే ఉండాలి అని కోరుకుంటాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు


డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఇది చదివిన తరువాత త్వరలో మరల నిజామాబాదులొ ఏర్పాటు చేయాలన్న కోరిక కలుగుతున్నది.
—-లీల చాగల్
నిజామాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అవునా..శుభం
ధన్యవాదాలు మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఎవరికైనా పాతమిత్రులుకలిస్థే పండగే. ఆ అనుభూతి వర్ణనాతీతం. ఆ అనుభూతినుంచివచ్చిన శక్తిమనలను రీ చార్జ్ చేస్తుంది.కొన్నాళ్ళపాటు ఆరోగ్యంగా —మానసికంగా భౌతికంగానూ- ఉంచుతుంది.
అట్లాటిస్నేహాలు లభించటం ఒక వరం వంటిది.
—రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు ధన్యవాదాలండీ .
డా కె.ఎల్.వి.ప్రసాద్
కరోనా కాలంలో జీవితం నిర్జీవం అయిపోయింది అనేది అందరి అనుభవంలో ఉన్నదే.
కరోనా అందరిని సోమరిపోతులను చేసింది.
ఇక వలస కూలీల కష్టాలు వర్ణనాతీతం. వాటిని మన మిత్రుడు మెట్టు మురళీధర్ గారు వారి “కనిపించని శత్రువు ” అనే నవలలో అద్భుతంగా వర్ణించారు. దానిని తెలంగాణ సాహిత్య పరిషత్తు ఉత్తమ నవలగా కూడ గుర్తించింది.
మీ స్నేహబంధం చాలా గొప్పది వైద్యవర్య .
తంగెడ జనార్దనరావు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
అంటారు ఇందుకే నేమో
—అనీల్ ప్రసాద్
ఆకాశవాణి-వరంగల్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యొస్మీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రులతో కలయిక , ఆత్మీయసమ్మేళనాలు ఎంత ఉత్సాహాన్ని , బలాన్ని ఇస్తాయో సోదాహరణంగా చెప్పారు డా. ప్రసాద్ గారు . డాక్టర్ గారి కథనానికి ఫోటోలు కలిసి జ్ఞాపకాల పందిరి సుసంపన్నమయింది . మంచి అనుభవాన్ని అందించిన కెఎల్వీ గారికి అభినందనలు .
మెట్టు మురళీధర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
మురళీధర్ గారు
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Chaala chakkagaa varnincharu. Friends ante ala undali

—-శ్రీమతి జి.రమణి
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు రమణి గారు.
Bhujanga rao
ఇటువంటి సమ్మేళనాల వల్ల దూరంగా ఉన్న స్నేహాన్ని దగ్గర చేసుకోవడానికి వీలవుతుంది.చాలా ఏళ్ళ క్రితం చదువుకునే రోజుల్లో చేసిన అల్లరి,ఆటపాటలు మరియు స్నేహితులతో కల్సి ఆనందంగా పలుకరింపులు, అందరి యోగక్షేమాలతో పాటు ఎవరు ఎక్కడ స్థిరపడిన విషయాలూ తెలుసుకుంటు బాల్యంలోకి వెళ్ళటం ఎంతో ఆనందం మరియు ఆరోగ్యదాయకం.మీ మిత్రులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఎన్నో మంచి విషయాలు అందిస్తున్న మీకు మా హృదయపూర్వక నమస్కారములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
భుజంగరావు గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఆత్మీయులతో ఆత్మీయ కలయిక ఎప్పుడూ ఆనందదాయకమే .మీకా అనుభూతి ని మిగిల్చిన మీ స్నేహితులు శ్యామ్ గారికి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు చాలా ఆనందం కలిగించే వ్యాసం వ్రాశారు.
మొహమ్మద్ అఫ్సర వలీషా
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా…
ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 154 లో కరోనా కష్టకాలంలో మనం ఎదుర్కున్న దయనీయ పరిస్థితుల గురించి చక్కగా తెలిపారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల కూలీలు వారి స్వరాష్ట్రాలకు తిరిగి వెళ్ళే సమయంలో ఎందరో అనారోగ్యానికి గురై మరణించారు. కొన్ని కార్పోరేట్ ఆసుపత్రులు మరియు ఫార్మా కంపెనీలు లాభాలు ఆర్జించాయి. ఆత్మీయ సమ్మేళనాల గురించి తెలిపారు. చక్కటి కథనం.
—-జి.శ్రీనివాసా చారి
కాజిపెట
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఇంటికి వచ్చినవారు ఎప్పుడెప్పుడు వెళ్లిపోతారా… అని వేచి చూసే బంధు గణము, “మా ఇంటికి వచ్చేటప్పుడు ఏమి తెస్తారు- మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు ఏమి ఇస్తారు” అనే వ్యాపార ధోరణితో ఆలోచించే మనస్తత్వం గల బంధుమిత్రులు, ఎదురుపడితే ఎక్కడ మాట్లాడవలసి వస్తుందో ! అని పక్క దారిలో తప్పించుక తిరిగే సభ్యులు ఉన్న నేటి సమాజంలో …,తిరిగి ఎప్పుడెప్పుడు కలుస్తామా! అనే ఆత్మీయ భావనతో ఎదురుచూసే… శ్యామ్ కుమార్ దంపతుల లాంటి మిత్ర గణం ఉన్న మీరు ధన్యులు, అభినందనీయులు
.
—-బి.రామకృష్ణ రెడ్డి
సికిందరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
వయసు మీరిన వారికి యిది ఒక టానిక్ అక్షర సత్యం అది అందరికీ సాధ్యం కాదు
—-విజయలక్ష్మి కస్తూరి
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.