[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


తాజాగా.. తాజ్ ఫలక్‌నుమా పేలస్..!!
ఒకప్పుడు నవాబులు పరిపాలించిన హైదరాబాద్, వారి కాలంలో కొన్ని చూడదగ్గ ప్రదేశాలకు ప్రసిద్ధి. వాటిని చూడనిదే హైదరాబాద్ చూసినట్టు లెక్కలోనికి రాదు. పని మీద హైదరాబాద్ వెళ్లినా, విద్యా పరంగా, వ్యాపార పరంగా లేదా ఉద్యోగపరంగా, హైదరాబాద్‌లో ప్రవేశించిన వెంటనే, కొన్ని తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలను వారాంతంలో సరదాగా తిరిగి రావడం తప్పనిసరి. అంతమాత్రమే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి లేదా వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది పర్యాటకులు ప్రత్యేకంగా హైదరాబాద్ చూడడానికి వస్తుంటారు. అలాగని విదేశీ పర్యాటకులు సైతం దీనికి అతీతం కాదు. అంటే అన్ని చూడదగ్గ ప్రదేశాలు వున్నాయి కనుకనే వాటిల్లో అనేక ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు హైదరాబాద్‌కు తరలి వస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ పక్షాన, ప్రైవేట్ పర్యాటక సంస్థల ద్వారా పర్యాటకులకు హైదరాబాద్ లోని చూడదగ్గ ప్రదేశాలను చూపించే సౌకర్యం వుంది. కొందరు స్వయంగా తమకు తాము పర్యటించే అవకాశాలు వున్నాయి.


ప్యాలెస్ ముందు కొడుకు రాహుల్, కోడలు దివ్యతో.. రచయిత దంపతులు
నవాబుల అద్భుత నిర్మాణం హైదరాబాద్ నగరం. హైదరాబాద్‌ను ఈ విధంగా ఊహించుకోవచ్చు. నవాబుల పరిపాలనా కాలం నాటి హైదరాబాద్, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్, ప్రస్తుత హైదరాబాద్. భారతదేశంలో నిజాంల పాలనలోవున్న హైదరాబాద్ విలీనం అయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన నుండి నేటి తెలంగాణా రాష్ట్ర పరిపాలనలో ఇప్పటి వరకూ హైదరాబాద్ అనేక మార్పులకు గురి అయింది. ఒకప్పుడు ఎక్కడికంటే అక్కడికి హాయిగా నడిచి వెళ్లిపోగల, భాగ్యనగరంగా చెప్పబడే హైదరాబాద్, ఇప్పుడు లెక్కలేని జనసందోహంతో, రకరకాల వాహహానాలతో క్రిక్కిరిసి వీధులు, రోడ్లు నగరాన్ని మూసేసిన ఫ్లై ఓవర్లు, నేటి హైదరాబాద్ చిత్రం. ఒకప్పుడు కురిసిన వర్షం నీరు అప్పటికప్పుడు భూమిలో ఇంకిపోవడమో, లేదా డ్రైనేజి కాల్వల ద్వారా లోపలికి పోవడమో జరిగేది. అయితే, జనాభా పెరుగుదల, ఉద్యోగం, వ్యాపారం పేరుతో ,గ్రామాల నుండి పెరుగుతూ వసున్న వలసలను, ఒక పద్దతిలో నియంత్రించక పోవడం వంటి విషయాల ఆధారంగా, కబ్జాల జాతరలో సహజ డ్రైనేజీలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తి వర్షం వస్తే, వరద వచ్చినట్టుగా భావించే పరిస్థితి ఏర్పడింది. పచ్చదనం తగ్గిపోయి, కాంక్రీటు కట్టడాల హోరులో మొక్కల పెంపకం కరువై, పర్యావరణ సమస్యలు తలెత్తి, విపరీతమైన వాతావరణ కాలుష్యంతో, రుతువులు తల్లక్రిందులయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండురకాల హైదరాబాద్‌ను గమనించిన అనుభవం ఈ రచయితది.


ప్యాలెస్ బయట కోడలు, కూతురితో రచయిత
ఇకపోతే, హైదరాబాద్‌లో, చూడదగ్గ కొన్ని ప్రదేశాల విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చేవి – చార్మినార్, గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం, నెహ్రు జూలాజికల్ పార్క్, (తాజ్) ఫలక్‌నుమా ప్యాలెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి (ముఖ్యంగా కట్టడాలు, వస్తుసేకరణ, వగైరా) ఇలా ఎన్నెన్నో.


ప్యాలెస్ ప్రాంగణం లోని గార్డెన్లో శ్రీమతి అరుణ.. రచయిత
అయితే మెట్రిక్యూలేషన్ నుండి, దంతవైద్యం (బి.డి.ఎస్) వరకూ నేను హైదరాబాద్ లోనే వుండి చదూకోవడం వల్ల ఇంచుమించు అనేక సందర్భాలలో, హైదరాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలామట్టుకు చూసేసాను ఒక్క ఫలక్‌నుమా పేలెస్ తప్ప. బహుశః అప్పట్లో ఫలక్‌నుమా పేలెస్కు సందర్శకులను అనుమతించేవారు కాదేమో! తర్వాత తాజ్ హోటల్ గ్రూప్ దానిని తీసుకుని, స్వల్పంగా మార్పులు చేర్పులు చేసి, సహజ నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేకుండా, ఏడు నక్షత్రాల స్థాయి హోటల్‌గా మార్చినందువల్ల, అందులో ప్రవేశానికి, ఒక్కొక్కరికి (డిన్నర్‌తో సహా) ఆరువేలు ఫీజు ఉండడం వల్ల సామాన్యుల దృష్టిలో అది ఎక్కువగా పడదేమోనని, ఈ మధ్య నేను ఫలక్‌నుమా తాజ్ పేలస్ చూసిన తరువాత బాగా అర్థం అయింది. అంతమాత్రమే కాకుండా చారిత్రాత్మక కట్టడంగా దానిని తప్పక చూడాలనిపించింది. ఆనాటి నిజాం ప్రభువులు ఎంతటి విలాస జీవితాన్ని అనుభవించగలిగారో కూడా అర్థం అవుతుంది.


రచయిత కూతురి కుటుంబం
సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని కాలంలోనే, అలాంటి సుందర భవనాలు నిర్మించగలగడం మామూలు విషయం కానేకాదు. డబ్బు, కష్టం ప్రజలదే అయినప్పటికీ, అటువంటి గొప్ప కట్టడాల గురించి ఆలోచన చేయగలగడం గొప్ప విషయం. అందుచేతనే అవి ఇప్పటికీ చెక్కు చెదరని చారిత్రాత్మక అపురూప కట్టడాలుగా నిలిచి వున్నాయి. ఇప్పటి ప్రజలను కూడా అమితంగా ఆకర్షిస్తున్నాయి.


రచయిత కొడుకు, కోడలు
ఫలక్‌నుమా అంటే అర్థం ‘ఆకాశ దర్పణం’ అట. ఈ విలాసవంతమైన అపురూప కట్టడం, ఆరవ నిజాం పాలనలో నాటి ప్రధాన మంత్రిగా సేవలు అందించిన సర్. విఖర్ ఉమ్రా నవ్వాబ్ కట్టించాడని చెబుతారు. ఈ కట్టడం 3, మార్చి 1884 నాడు ప్రారంభమై, 1893లో నిర్మాణం పూర్తి అయిందట. నవాబుల కాలంలోనూ, వారి పాలనా కాలం చివరి దశలోనూ విదేశీయులకు, రాజులు మహారాణులకు అనేక విలాసవంతమైన గదులు కేటాయించి మరచిపోలేనంతగా ఆతిథ్యం అందించేవారట. నవాబుల కాలం చెల్లిపోయిన తర్వాత చాలాకాలం అది దిక్కూదివాణం లేకుండా వున్న నేపథ్యంలో, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యాజమాన్యం లీజ్‌కు తీసుకోగా, ఒక గొప్ప ఏడు -నక్షత్రాల హోటల్‌గా, 1 నవంబర్ 2010 నాడు ఆవిర్భవించింది. దీనిని ఎత్తైన కొండమీద నిర్మించడం మూలాన, పచ్చని వృక్ష సంపదతో పాటు, మొత్తం హైదరాబాద్‌ను చూడగలిగే వెసులుబాటు ఉంటుంది. రాత్రిపూట చార్మినార్ అక్కడికి విద్యుత్ కాంతులు విరజిమ్ముతూ చూపరులకు నేత్ర పర్వం చేస్తుంటుంది.


డిన్నర్ టైం
నేను 1964 నుండి హైదరాబాద్‌తో సంబంధాలు కలిగి వున్నా ఇంత గొప్ప కట్టడం చూడడం నాకు వీలు కాలేదు. బహుశః నా ప్రయారిటీలలో అది లేదేమో! అందుకే ఇప్పటివరకూ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను చూడలేక పోయాను. ఇప్పుడు అంటే జూన్ నెల మొదటివారంలో నాకు పిల్లలతో కలసి ఫలక్‌నుమా ప్యాలెస్ దర్శించే అవకాశం కలిగింది. మా అబ్బాయి రాహుల్, కోడలు దివ్య అమెరికా నుండి రావడంతో, దూర ప్రదేశాలకు పోయే అవకాశం లేక ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది మా అమ్మాయి నీహార.
సరిగ్గా మేము నివాసం ఉంటున్న సఫిల్ గూడకు, కారులో గంట ప్రయాణం. సాయంత్రం కనుక ట్రాఫిక్ ఇబ్బంది వల్ల ఇంత సమయం పట్టి ఉండవచ్చు. ప్యాలెస్ ప్రాంగణం ఎత్తైన కొండమీద ఉండడం, దారిపొడుగునా, పచ్చని దట్టమైన చెట్ల సముదాయం, బోలెడన్ని నెమళ్లతో, ఆ ప్రాంతం అంతా ఆహ్లాదకరంగా ఉంది. చాలా ఆనందం అనిపించింది. ఇక ప్యాలెస్ లోనికి అడుగుపెట్టే ద్వారం నుండి సిబ్బంది అసలు ప్యాలెస్ దగ్గరికి వారి వాహనాలలో తీసుకు వెళ్లడం, అక్కడి నుండి ఇతర సిబ్బంది ఎంతో ఆత్మీయంగా, మర్యాదగా లోపలికి తీసుకువెళ్లడం, చూపించ వలసిన ప్రదేశాలు ఎంతో శ్రద్ధగా చూపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరిశుభ్రత విషయంలో మాట్లాడే పనే లేదు.


ప్యాలెస్ లో పుట్టినరోజు జరుపుకున్న రచయిత అల్లుడు.. వినోద్ కుమార్
ప్యాలస్‌లో నవాబులు ఉపయోగించిన సమావేశ మందిరాలు, ఆఫీసులు, గ్రంథాలయం, శయన మందిరాలు, వగైరా అన్ని ఆ కాలంలోని విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్లు, అక్కడినుండి సాంకేతిక నిపుణులను రప్పించుకున్నట్టు అర్థం అవుతుంది. సామాన్య ప్రజానీకానికి ఇదంతా వింతగానే కనిపిస్తుంది. రాత్రి భోజనం (డిన్నర్) భోజన మందిరం వర్ణించలేని అంశం. మాంసాహారులకు, శాఖాహారులకు సమాన స్థాయిలో, రుచికరమైన భోజనం ప్రత్యేకమైన తృప్తిని అందిస్తుంది.


నవాబులు ఉపయోగించిన డైనింగ్ హాల్
భోజన ప్రియులకు ఇది సరైన చోటు. మద్యం కూడా వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా సరఫరా చేయడం మరో ప్రత్యేక ఆకర్షణ. ఆర్డర్ చేసిన క్షణాల్లో వేడివేడిగా ఆహార పదార్ధాలు అందివ్వడం, వారి మర్యాదలు, ఒక ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న దానికంటే ఎక్కువ తృప్తిని అందించింది. అందరికంటే ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేసింది, సంవత్సరం వయసున్న నా మనుమడు చిరంజీవి నివిన్ ఆయాన్స్ (నికో).


ప్యాలెస్ నుండి కనిపిస్తున్న హైదరాబాద్ మహానగరం
ఇలా చెప్పుకుంటే పొతే చాలా వుంది. ప్రవేశం చాలా ఖరీదుతో కూడుకున్నదన్న విషయం ప్రక్కన పెడితే, అందరూ ఒకసారి చూడవలసిన సుందర కట్టడం ‘తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్’ అని చెప్పడంలో సందేహపడవలసిన అవసరం లేదు.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
13 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
——డా కె.ఎల్.వి.ప్రసాద్.
Sagar
ఆనాటి నిర్మాణాల నాణ్యతకు ఇది ఒక చిన్న ఉదాహరణ సర్. మీరు అన్నట్లు సాంకేతికత అభివృద్ధి లేని ఆరోజుల్లో అంత గొప్ప నిర్మాణం నిజంగా అభినందనీయం.ఆస్వాధించి ఇక్కడ మాకు పంచిన మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు సాగర్.
Shyamkumar
చాలా ఖరీదైన హోటల్లో ఫలక్‌నుమా ప్యాలెస్ ఒకటి. దాని గురించి వినడమే గాని నేనైతే ఇంతవరకు చూడలేదు. అక్కడ తాను ఎదుర్కొన్న అనుభవాలను విశదీకరించిన రచయిత గారికి అభినందనలు
డా.కె.ఎల్.వి.ప్రసాద
చూడవలసిన అవసరం వుంది
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఫలక్ నుమాప్యాలెస్ నేను ఎప్పూడూ చూడలేదు.చూచెఅవకాశమూ లేదు.ఇప్పుడు మీరూ రాసిన దాన్నిబట్టి చూసిన.అద్భుతమైన ఇటువంటి కట్టడాలెన్నో భారతీయులు కాని పరిపాలకుల హయాంలోనే నిర్మాణం జరిగిందన్నది వాస్తవం. ఢిల్లీలోని లాల్ ఖిలాకూడా .తాజ్ మహల్ కూడా.తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరూ అని శ్రీ శ్రీ ప్రశ్నించినా ఆచరణలో ఎంతమందిమి దీన్ని పాటిస్తున్నం.ఇంతెందూకు మనం ఉంటున్న అందమైన భవంతులు కట్టిన మేస్త్రీలను మనం గుర్తుంచుకుంటున్నమా గుత్తేదార్ నుతప్ప..
అట్లా అనుకుంటే దేశీయ రాజులకాలంలోనూ గొప్పవైన నిర్మాణాలెన్నో జరిగినై.రామప్ప, వేయిస్తంభాలగుడివంటివి.అవిమాత్రం రాజులు స్వయంగా కట్టిన్రా?కూలీలశ్రమతోనేకదా కట్టింది. రామరాజ్యం కావాలని కాకతీయుల పరిపాలన కావాలనీ లేదా తెస్తున్నమనీ చెప్పేపాలకులు నిర్మిస్తున్న నిర్మాణాలన్నీ మాయాబజారు , లెదా పాతాళభైరవిసినిమాలలో వలె వాటంతటవే నిర్మాణమవుతున్నయా? శ్రమదోపిడేకాదా? హైదరాబాద్ బిర్లామందిరం నిర్మాణం దేవాలయమైనా బిర్లాపేరుమీదనే చలామణి అవుతున్నది.లోకంలో ఎప్పుడూ శ్రమించిన వాని శ్రమకు ఆనవాలుగా వానచేచేయబడ్డనిర్మాణం మిగిలిపోతున్నది.
రాముని రాజ్యమో మరో రాజు రాజ్యమో కావలసిందేనా మన ప్రజలపాలన వద్దా.
గొప్పనిర్మాణాలు చేయించిన వారు తమకోసమేచేయించినా వారితోనిర్మాణాలు పోలేదు .అందువలననే మనం చూడగలుగుతున్నం ఆ రాళ్ళెత్తిన కూలీఎవడన్న ప్రశ్న వేస్తున్నం.
ఆనిర్మాణాలనూవచూసి ఆనందిస్తున్నం.ఆనందిస్తునేవుంటం.సిద్ధాంతానికి ఆచరణకు ఏన్గు చీమతేడాయని అన్నడు కాళోజీ.
ఏంచెప్పాలనుకున్ననో ఏంచెప్పిన్నో?
మీజ్ణాపకాల పందిరి నీడన కాసేపు సేదతీరుతున్న మాటమాత్రం నిజం.
—–రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారూ
మీ వివరణ చాలా బాగుంది.
మీకు కృతజ్ఞత లు .
డా కె.ఎల్.వి.ప్రసాద్
[18/06, 21:51] Naga Jyothi Sekhar: బ్యూటీఫుల్ యాత్ర కళ్ళకు కట్టినట్లు చూపారు సర్…ఎంతో అందమైన ప్రదేశంలో మరింత అందమైన మీ కుటుంబ ఆత్మీయతను దర్శించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.ఛాయా చిత్రాలు అన్నీ ఎంతో ఉత్సుకత ను ఉత్సహాన్ని కలిగిస్తున్నాయి.మన భాగ్య నగరంలోనే ఇంత అందమైన ప్రదేశానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసిన నీహారా గారికి అభినందనలు…అల్లుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు… మా అందరికీ ఇంత కనువిందు కలిగించిన మీకు ధన్యవాదాలు సర్ ముఖ్యంగా… వ్యక్తిగతంగా మీ కోడలు,కూతురు ఇద్దరితో ఉన్న ఫోటో నన్ను చాలా ఆకట్టుకుంది.ఎంతో నచ్చింది ఆ సమభావం… స్వేచ్ఛ

—-నాగజ్యొతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా….
మీ స్పందనకు ధన్యవాదాలు .
Bhujanga rao
మన రాష్ట్రరాజధాని హైద్రాబాద్ లో ఉన్నటువంటి ఫలక్ నామా ప్యాలస్ యొక్క ప్రత్యేకతలు మరియు నిర్మాణం మీరు పొందిన అనుభవాలు మాతో పంచుకున్న మీకు నమస్కారములు సర్.చాలా ఖరీదైన హోటల్లో ఫలక్ నామా ప్యాలస్ ఒకటి అని విన్నాము ఇంతవరకు చూడలేదు,చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఫలక్ నామా ప్యాలస్ అంటే మరొక పేరు ‘ఆకాశ దర్పణం’ అని ఈ సంచిక ద్వారా తెలిసినది. మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు సర్ మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Gd Evng Doctor garu,
My cousin (Peddamma Koduku) Son’s betrothal/engagement ceremony took place in that hotel. A wonderful experience to be in that environment.
—–Surya narayana rao
Hyderabad
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir.