జీవన రాగం..!! (‘ఆన్షి’ల పుట్టుక)
తెలుగు సాహిత్యం సామాన్య పాఠకుడికి అందుబాటులో రావడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రయోగాలు జరిగాయి. ఎందరో మహానుభావులు, పండితులు భాషాశాస్త్రవేత్తలు, కవుల భాగస్వామ్య కృషితో ఈవాళ తెలుగు సాహిత్యం సామాన్య పాఠకుడికి అందుబాటులోనికి వచ్చింది. చెప్పాలంటే మరింత కృషి ఇందులో జరగవలసి వుంది, మరింత చేరువగా పాఠకుడికి తెలుగు సాహిత్యం రావలసి వుంది.
తెలుగు సాహిత్యం, ప్రాచీన సాహిత్యం నుండి మొదలుపెడితే, అందరికీ అందుబాటులో లేని (అర్థం కాని) పద్యం, తర్వాతి కాలంలో సరళ వచనం అందుబాటు లోనికి వచ్చింది. ఆ తర్వాత వచన కవిత్వం పలు రూపాలలో ఇప్పుడు దర్శనం ఇస్తున్నది.
గ్రాంథిక భాష నుండి వ్యవహారికమూ, సరళ వ్యవహారికమూ అందుబాటులోనికి రావడానికి ఎందరో మహానుభావుల కృషి వుంది. గురజాడ, గిడుగు రామ్మూర్హి పంతులు, గిడుగు సీతాపతి వంటివారు మొదలుకొని, మహాకవి శ్రీశ్రీ, కుందుర్తి ఆంజనేయులు గారు, శీలా వీర్రాజు వంటి వారివరకూ ఈ కృషి కొనసాగింది.
ఆ తర్వాత తెలుగు కవిత్వం రకరకాల రూపాలలో దర్శనం ఇచ్చింది, అంతమాత్రమే కాకుండా, ఉత్సాహవంతులైన కవులను కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో తయారుచేసింది. అలా ఇప్పుడు కవిత్వం రాయడం ఒక ఫ్యాషన్‌గా కూడా మారిపోయింది. దీనికి కారణం, తెలుగు కవిత్వంలో అనేక నూతన పోకడలకు శ్రీకారం చుట్టడం, సరళతరం కావడం అని నా అంచనా.
అలాంటి నూతన పోకడల కవిత్వపరంగా బాగా ప్రాచుర్యం పొందిన ప్రక్రియ ‘నానీలు’ అని నా నమ్మకం. ఈ నానీల సృష్టికర్త ప్రొఫెసర్ (రిటైర్డ్) ఎన్. గోపి అన్న విషయం చాలామందికి తెలిసిందే! ఈ ప్రక్రియకు ఆకర్షింపబడ్డ ఎంతోమంది కవులు, నానీలు రాయడమే కాదు, పుస్తకాలు కూడా వేసారు. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ వంటి మాధ్యమాలలో ప్రత్యేకముగా ‘నానీలు’ గ్రూపు ఏర్పడడం, అనేకమంది ఆ గ్రూపులో నానీలు రాయడం గమనించవలసిన విషయం. అలాగే అనేక వాట్సప్ గ్రూపుల్లో వారంలో ఒకరోజు నానీల కోసం కేటాయించడం, సభ్యులు ఉత్సాహంగా నానీలు రాయడం ఆ ప్రక్రియ ప్రాచుర్యానికి మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు. తర్వాత మినీ కవిత్వం అనే ప్రక్రియ కూడా చాలామంది యువకవులను/కవయిత్రులను ఆకర్షించడమే కాకుండా, మినీకవిత్వం పుష్కలంగా రాసే పరిస్థితులు వచ్చాయి. అయితే చిన్నకథ రాయడం ఎంత కష్టమో, చిన్న కవిత (మినీ) రాయడం కూడా అంతకంటే కష్టం అని నా అభిప్రాయం. తక్కువ నిడివిలో ఎక్కువ అర్థాన్ని చెప్పగల అర్థవంతమైన కవిత్వమే మినీ కవిత్వం, ఇది అందరికీ సాధ్యం కాదని నా అభిప్రాయం.
నానీల తర్వాత, ‘నానోలు’ వచ్చాయి. వీటి సృష్టికర్త శ్రీ ఈగ హనుమాన్ గారు (2005 సంవత్సరం నుండి శ్రీ హనుమాన్ ‘నానోలు’ రాస్తున్నారు). నానో.. అంటే ‘సూక్ష్మాతిసూక్ష్మమైన ప్రక్రియ’ అనే భావంలో దీనిని ప్రయోగిస్తున్నారు. నానో టెక్నాలజీ ప్రాచుర్యంలోనికి వచ్చిన తర్వాత ‘నానో’ పేరుతో ఈ కవితా ప్రక్రియ ప్రసిద్ధిలోనికి వచ్చినప్పటికీ ‘నానీలు’ ప్రక్రియకు వచ్చినంత ప్రాచుర్యం వీటికి రాలేదనే చెప్పాలి. తర్వాత ‘రెక్కలు’ – కవితా ప్రక్రియ (2009 నుండి ఎం. కె. సుగంబాబు) వామీలు, మామీల పేర్లతో కొన్ని కవితా ప్రక్రియలు వెలుగులోనికి వచ్చాయి.
తర్వాత ప్రముఖంగా చెప్పుకోదగ్గవి ‘హైకూలు’. ఇది జపాన్ కవిత్వ ప్రభావంతో తెలుగు కవిత్వంలో వెలుగు చూసిన కవితా ప్రక్రియ. 1991 నుండి కవి ఇస్మాయిల్, ఈ కవితా ప్రక్రియను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. గాలి నాసర రెడ్డి గారు 1994 నుండి హైకూలు రాయడం ప్రారంభించారు. ఇలా రకరకాల పేర్లతో రకరకాల కవితాప్రక్రియలు తెలుగులో వెలుగు చూడడంతో నాకూ ఒక దురాశ పుట్టింది. అదెలాగో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వచన కవిత్వంలోనూ, మినీ కవిత్వంలోనూ, నానీల ప్రక్రియలోనూ ఎంతో కొంత అభిరుచి, నా రచనా వ్యాసంగంలో ఒకభాగమూ అయినందువల్ల సులభమైన రీతిలో ఎక్కువమంది రాసే విధంగా ఒక నూతన ప్రక్రియను సృష్టించాలానే ఆలోచన నన్ను ‘ఆన్షి’ కవితా ప్రక్రియ వైపు ఉసిగొల్పింది.
అదెలాగంటే – పద్యం నాకు చాలా ఇష్టం. శ్రావ్యంగా పద్యం పాడేవాళ్ళంటే మరీ మరీ ఇష్టం. కానీ పద్యం నేను రాయలేను. ఎప్పుడో హైస్కూల్ స్థాయిలో నేర్చుకున్న ఛందస్సు, మచ్చుకి కూడా గుర్తు లేదు. దానిని ఈ ప్రత్యేకంగా ఈ వయసులో అధ్యయనం చేసే ఓపిక కూడా లేదు. అయితే పద్యం మీద మొహం సడలక పోవడంతో, ఛందస్సు లేని వచన పద్యాలు రాయాలనే కోరిక మనసులో మెదిలింది. అలా రాయొచ్చునో లేదోనని, సందేహ నివృత్తి కోసం మిత్రులు, గురుతుల్యులు, గొప్ప సాహతీవేత్త శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబును సంప్రదించినప్పుడు వారు సంతోషంగా పచ్చ జండా ఊపారు. ఆ ధైర్యంతో కొన్ని వచన పద్యాలు రాసి తెలిసిన గ్రూపుల్లో పెట్టినప్పుడు, వాటిని చదివిన సాహితీ పెద్దలు డా. సి హెచ్ సుశీల గారు (రచయిత్రి, విమర్శకురాలు, సమీక్షకురాలు, మంచి ఉపన్యాసకురాలు, రిటైర్డ్ ప్రిన్సిపాల్) ఎంత గానో మెచ్చుకుని, ఈ ప్రక్రియకు ఒక పేరు పెట్టమని మంచి సూచన చేశారు.


‘ఆన్షిలు’ రాయమని ప్రోత్సాహం అందించిన సాహితీ పెద్దలు డా. సి.హెచ్. సుశీల (హైదరాబాద్)
వారి సూచన మేరకు నా ఈ కవితా ప్రక్రియకు ‘ఆన్షిలు’ అని పేరుపెట్టాము. ఈ పేరులోని ప్రత్యేకత ఏమిటంటే ‘ఆన్షి’ నా మనవరాలి పేరు. ఈ సందర్భంగా డా. సుశీల గారికి ఎంతగానో రుణపడి వుంటాను.


‘ఆన్షిలు’కు ప్రేరణ రచయిత మనవరాలు బేబి. ఆన్షి నల్లి. (హన్మకొండ)
‘ఆన్షి’లు రాయడం పెద్ద కష్టమైన పని కాదని నా ఉద్దేశం. వీటి ప్రధాన లక్షణాలను ఇక్కడ వివరిస్తాను.
1) మామూలుగా నాలుగు పాదాలు ఉండాలి. ప్రతిపాదంలోనూ ఇన్ని అక్షరాలు ఉండాలన్న నియమం లేదు.
2) చివరి పాదం మంచి ‘మకుటం’తో పూర్తి కావాలి. అది ఎవరి ఇష్టం వారిది, లేదంటే అర్ధవంతంగా, చదివాడానికి వినసొంపుగా ఉండాలి (నాకోసం ఈ ప్రక్రియకు రాసుకున్న మకుటం ‘వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము!’)
3) ప్రతి పాదంతో ప్రాస కలసి వచ్చేలా రాయగల నేర్పు ఉంటే పద్యానికి అందం వస్తుంది.
4) నాలుగు పాదాలూ ఒకదానితో ఒకటి సందర్భోచితంగా అర్ధవంతంగా ఉండాలి.
ఇవీ ఆన్షిల కోసం ఉండవలసిన ప్రధాన లక్షణాలు. ఇవి చదివిన తర్వాత నాకు కూడా బాగా అనిపించింది. ప్రయత్నిస్తే చాలామంది వర్ధమాన కవులు సైతం ఈ ప్రక్రియతో వచన పద్యాలు సులభంగా రాయగలరు. అలా అని శాస్త్రీయమైన ఛందస్సు పద్యాలను చిన్నబుచ్చడం కాదు, అది సాధ్యం కానీ వారికోసమే ఈ వచన పద్యాలు. ఈ ప్రక్రియ కూడా అధిక స్థాయిలో ప్రాచుర్యం లోనికి రావలసిన అవసరం వుంది. మాతృభాష అయిన తెలుగును క్లిష్టమైన భాషగా ఊహించుకుని, భయపడక ఇతరభాషలతో పాటు తెలుగుకు కూడా అధిక ప్రాధాన్యతను ఇచ్చే దిశగా ప్రతి తెలుగు బిడ్డా ముందుకు అడుగులు వేయాలని ఒక తెలుగు భాషా ప్రేమికుడిగా ఎల్లప్పుడూ కోరుకుంటాను. పాలకులకు తెలుగుభాష మింగుడుపడనప్పుడు అది కొంత నిర్లక్ష్యానికి గురికావచ్చునేమో కానీ, అది తాత్కాలికం అని మాత్రమే గుర్తించాలి.
జీవన రాగం శీర్షికతో, నేను రాసిన ‘ఆన్షి’ లను మెచ్చుకొని, వెన్నుతట్టి తమ పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించిన ‘మొలక’ అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీ వేదాంత సూరి గారికి, ‘సంచిక’ అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికీ, వారి సంపాదక వర్గానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


‘ఆన్షిలు’ కవితా ప్రక్రియను ప్రోత్సహించిన శ్రీ తిరునగరి వేదాంత సూరి (హైదరాబాద్)


సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ (హైదరాబాద్)
నేను కథలు రాసినా కవిత్వం రాసినా, వ్యాసం రాసినా, అందులోని మంచి చెడ్డలను సమీక్షించి శాస్త్రీయమైన చక్కని సూచనలు అందించే నా చిన్నన్నయ్య డా. మధుసూధన్ కానేటికి, ముఖ్యంగా ఈ ‘ఆన్షి’ల ప్రక్రియను ప్రోత్సహించినందుకు గాను ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా జీవితంలో, నా రచనా వ్యాసంగంలో ఇదొక కొత్త అధ్యాయంగా నేను భావిస్తాను.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
27 Comments
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక.
—డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలు.
Sagar
మంచి ప్రక్రియ మొదలెట్టారు సర్. నానీల సృష్టికర్త ఆచార్య గోపి గారు అయినా నాకు వివరించి ప్రోత్సహించింది మీరే అని గర్వంగ చెప్పుకోగలను. కొన్ని రోజులు ఆన్షీలు కూడ వ్రాశా. ఇక వాటికి కూడ సమయం కేటాయించి మొదలెట్టాలి. మీ ప్రక్రియ విజయవంతం కావాలని కోరుకుంటూ మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సాగర్ ధన్యవాదాలు మీకు
Shyam kumar .chagal. nzbd
తెలుగు సాహిత్యంలో పద్య రూపం నుండి వచన కవిత్వం వరకూ సాగిన రూపాంతరం గురించి వివరించిన తీరు ఈరోజు పాఠకులకీ అవసరమైనది గా రచయిత తలచి రాయటం సందర్భానికి తగ్గట్టుగా ఉంది. ఉన్నతమైన సాహిత్యపు కట్టుబాట్లతో ఛందోబద్ధంగా సాగే పద్యం చాలా కొద్ది మందికి మాత్రమే అర్థం అయ్యేది. ప్రజాబాహుళ్యంలో ఆనతి కాలంలోనే వచన కవిత్వం ఆదరణ పొందడం అన్నది దాంట్లో ఉన్న సరళతరమైన భాషా ప్రయోగమే కారణం. వచన కవిత్వం సాగించిన ప్రయాణంలో దానికి మా శక్తిని ధారపోసిన ఎంతో మంది కవులు గురించి సందర్భానుసారంగా రచయిత ప్రస్తావించారు.
ఒకే మూస ఒరవడిలో కొట్టుకుపోకుండా ప్రతి కవి తన యొక్క వ్యక్తిగత ప్రతిభ తో ఈ కళను పెంపొందించడంలో తమ వంతు పాత్ర పోషించేందుకు అభినందనీయుడు. Dr.KLV ప్రసాద్,ఈ విషయంలో తనదైన పాత్ర పోషించి తను కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో ఆన్శి లను ఆవిష్కరించడం శ్లాఘనీయం. వారికి అభినందనలతో
శిష్యుడు శ్యామ్ కుమార్
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
డియర్ శ్యామ్
నీ విశ్లేషణ అద్భుతంగా వుంది
నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
డా. సిహెచ్. సుశీల
ఎవరో వారి వారి పిల్లల పేర్లతో వచన కవిత్వం, మినీ కవితలు రాస్తున్నారు. ఆ పేర్లు ఎందుకు, మీ మనవరాలి పేరుతో రాయొచ్చు కదా అని చిన్న సలహా ఇచ్చాను మీకు. నా మాటకు ఎంతో సంతోషించి, 108 కవితలు ( ఇంకా ఎక్కువే నేమో) పూర్తి చేసారు. ఇప్పుడిలా నాకు కృతజ్ఞతలు చెప్తారనుకోలేదు. ధన్యవాదాలండీ. సాగర్ గారు కూడా కొనసాగించడం సంతోషం.
నా ఈ ఆలోచనకి మూలం ” సిరికోన” వాక్స్థలి. అక్కడ చక్కగా మనవడు/ మనవరాళ్ళ పేరుతో ఎన్నో అందమైన కవితలు రాస్తున్నారు. ఆ ఆలోచనే మీకూ చెప్పాను.
మీ సాహిత్యాభిలాషకు, సాహిత్య కృషికి అభినందనలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
డాక్టర్ సి హెచ్ సుశీల గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ ప్రోత్సాహానికి మరోసారి
ధన్యవాదాలు మేడం.
‘—-డాక్టర్ కెఎల్వి ప్రసాద్
హన్మకొండ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సార్… మీ సాహితీ ప్రక్రియల విశ్లేషణ… అభినందనీయం !
ఆన్షీల పేరుతో… వచన పద్యాలు… మంచి ప్రయత్నం
నేను కూడా… గణ, వృత్త, ప్రాసా చందోలంకారాల కోసం
కుస్తీ పట్లు పట్టుకు కూచోక…
వచన పద్యాలనేస్వేచ్ఛా ఛందస్సులో భావప్రధానంగా
రాస్తుంటాను…!అందంగా.
ఆకర్షణీయతతో…చ్ఛందో పద్యంలాంటి వచనపద్యం అందరికీ అందుబాటులో…
ఆదరణ పొందగలదు… !
అభినందనలు ! కోరాడ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మీ సహృదయ స్పందనకు
ధన్యవాదాలు సర్.
డి. వి. శేషాచార్య
మీరు ప్రారంభించిన ఆన్షీలు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ గా నిలదొక్కు కోవాలని కోరుకుంటూ…
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మిత్రమా
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
నమస్కారం.
కధ,కధానిక,కవిత,పొట్టి కవిత,నానీల నుండి ఆన్షిల ఆవిర్భావం..శైలి ల గురించి చక్కగా వివరించారు.ఇది పదుగురికి ప్రేరణ కూడా.
చి.ఆన్షి ధన్యురాలు.
—-డాక్టర్ మల్లికార్జున్
హన్మకొండ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
Bhujanga rao
తెలుగు సాహిత్యంలో నానీలు,నానోలు మరియు హైకూలు కవిత్వపరంగా సృష్టించిన వారి పేర్లతో విశ్లేషణ బాగుంది.మీరు ప్రత్యేక శైలితో ప్రారంభించిన anshilu తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియగా ముందుకు సాగాలని కోరిక.నమస్కారములు సర్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
భుజంగరావు గారు
మీ విశ్లేషణ బాగుంది.
మొహమ్మద్+అఫ్సర+వలీషా
నలుగురికీ సహృదయతతో సహాయం చేసే మీరు, కవితలు వ్రాయాలనే పట్టు దల వ్రాయలేని పరిస్థితి లో ఉన్న నాకు గురువుగా నిలబడి నిలదొక్కుకుని వ్రాయగలిగే స్థితి కి ప్రోత్సహించిన మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూనే ఉంటా సార్. పద్యాలు అన్నా , ఛందస్సు అన్నా ఒకింత వణుకే సార్ .ఇలాంటి పరిస్థితి లో మీ ప్రయత్నం హర్షనీయం .



నాలాంటి వారికి చాలా తేలికైన ప్రక్రియ ఆన్షీలు.సరికొత్త ప్రక్రియకు మిమ్మల్ని ప్రోత్సాహించి ముందుకు తెచ్చిన సుశీల మేడమ్ గారికి హృదయపూర్వక అభినందనలు.


ప్రతి సారి మీరు వ్యాసానికి ముందువ్రాసే ఉపోద్ఘాతము చాలా బాగుంటుంది సార్. చాలా చక్కని జ్ఞాపకాల పందిరికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 











డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
నీహృదయ పూర్వక
స్పందనకు ధన్యవాదాలు.
శీలా సుభద్రా దేవి
ప్రసాద్ గారూ కవిత్వ పరిణామక్రమం గురించి రాసి కొనసాగింపుగా మీ మనవరాలి పేరుతో ఆన్షీలు అంటూ రాయటం బాగుంది.నిజమే ఇటీవల ఎవరి పిల్లల పేర్లతో కొత్త కొత్త పద్య ప్రక్రియలుగా చెబుతూ చాలా మంది రాస్తున్నారు.వ్యాసం బాగుంది అభినందనలు
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మేడం గారు
మీ స్పందనకు
ధన్యవాదాలండీ.
Rajendra+Prasad
Keep it up sir. Your passion on సాహిత్యం & కవితలు must be inspring the like minded people. And అన్షీ is one among them I believe.
– Rajendra
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
ప్రసాద్ గారు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
గురువు గారికి నమస్కారం
క్లిష్టతరమైన పదజాలంతో సంస్కృత భాషను ఆధారంగా చేసుకొని పద్యకావ్యాలను రూపొందించిన మన పూర్వకవుల యొక్క కృషి , మరియు సఫలత వారి నిబద్ధతకు మరియు కఠోర దీక్షకు నిదర్శనం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు సెలవిచ్చినట్లు ఆనాటి పద్య కావ్యములో వాడిన పద కూర్పు వినసొంపుగా, చందో బద్ధంగా ఉన్నప్పటికిని అటువంటి పద్యాలను చదివి భావాన్ని అర్థం చేసుకునేవారు మన తల్లిదండ్రుల తరం వరకే పరిమితమైనది అని అనిపిస్తుంది. నేటి యాంత్రిక పరుగు యుగంలో విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే సులభతరమైన ప్రక్రియ ద్వారా అందించాలనే మీ ఆలోచన ప్రశంసనీయము. ఈ నూతన ప్రక్రియ యొక్క రూపాంతరము,వివరించిన విధానము బహు చక్కగా ఉన్నది.
—-బి.రామకృష్ణా రెడ్డి
సికింద్రాబాద్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
డా. కె.ఎల్ వి ప్రసాద్
అభినందనలు సార్
మంచి ప్రక్రియకు రూపకల్పన చేశారు
—-జ్యోతి. మువ్వల
డా. కె.ఎల్ వి ప్రసాద్
ధన్యవాదాలు మేడం గారు మీకు
Dr.Harika
Good morning sir,
With huge respect, wishing you all the best for this new experiment to go successful and we are blessed to have you who taking part in saving mother tongue in every possible way.