[సంచిక పాఠకుల కోసం ‘గాండీవం’ అనే సినిమా లోని ‘గోరువంక వాలగానే’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
ఉగాది సందర్భంగా మన తెలుగు పాటలోని మాధుర్యాన్ని మరోసారి నెమరు వేసుకుందాం. వేటూరి, సిరివెన్నెల ఎలాంటి కథకైనా అద్భుతమైన పాటలు రాసేవారు. సందర్భానికి తగినట్టు రాయటమే గానీ లెక్కలు వేసుకోవటం వారికి తెలియదు. వేటూరి నిర్మాతల కోరిక మేరకు ఘాటుగా రాసినా అందులో చమక్కులు కూడా ఉండేవి.
వేటూరి సాహితీప్రతిభని ఇతర భాషల దర్శకులు కొందరు బాగా ఉపయోగించుకున్నారు. విశ్వనాథ్, జంధ్యాల, వంశీ లాంటి దర్శకులు మంచిపాటలు రాబట్టుకున్నా మిగతా తెలుగు దర్శకులు వ్యాపారాత్మక ధోరణితో పాటలు రాయించుకున్నారు. ఇతర భాషల దర్శకులు భాష తెలియకపోవటం వల్లనేమో ఆయనికి ఎక్కువ స్వతంత్రం ఇచ్చినట్టు అనిపిస్తుంది. పాట రాశాక అనువాదకుల సహాయంతో దాని భావాన్ని చెప్పించుకుని ఆ భావానికే పులకించిపోయేవారు. ముఖ్యంగా ‘సీతాకోకచిలుక’, ‘గీతాంజలి’లో భారతీరాజా, మణిరత్నం వేటూరి చేత అద్భుతమైన పాటలు రాయించుకున్నారు.
‘సీతాకోకచిలుక’లో ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా’ పాటలో ఒక చరణం:
ఆ: ఓ ఓ ఓ, చుక్కా నవ్వవే
వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల.. జంట పేరంటాల
అ: ఓ ఓ ఓ, చుక్కా నవ్వవే
నావకు చుక్కానవ్వవే
పొందు ఆరాటాల.. పొంగు పోరాటాల
‘నావకు చుక్కానవ్వవే’ అంటే అర్థం కాకపోయినా చాన్నాళ్ళు నేను పట్టించుకోలేదు. ‘నావకు చుక్కా నవ్వవే’ అనే పాడుకునేవాడిని. కానీ అది ‘నావకు చుక్కాని అవ్వవే’ అని తెలిశాక మనసుకి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. పొందు కోసం ఆరాటపడుతున్న నాయకుడు నాయికని నవ్వమని అడుగుతున్నాడు. ఆమె నవ్వితే ఆరాటమనే పొంగులో పోరాడుతుడున్న నావ లాంటి అతని మనసుకి ఆమె చుక్కాని అవుతుంది. అంటే ఆమె సమ్మతి లభిస్తుంది.
మళయాళ దర్శకుడు ప్రియదర్శన్ తీసిన ‘గాండీవం’ చిత్రంలో ఒక అద్భుతమైన పాట రాశారు వేటూరి.


కథ ప్రకాతం ఒక పెద్దాయన (అక్కినేని నాగేశ్వరరావు) చిన్నవయసులో ఒక స్త్రీని ప్రేమించాడు. కానీ వారు విడిపోయారు. ఇప్పుడా పెద్దాయన పెద్ద వ్యాపారవేత్త. ఇంట్లో బంధువులు పడి తింటూ ఉంటారు. వారంటే పెద్దాయనకి చికాకు. అయినా భరిస్తూ ఉంటాడు. ఆయన బిడ్డనంటూ ఇద్దరు యువకులు, ఒక యువతి వస్తారు. వారిలో వారు తగువులాడుకుంటూ ఉంటారు. అందులో ఒక యువకుడి (బాలకృష్ణ) మంచితనం చూసి అతనే తన కొడుకైతే బావుండేదని పెద్దాయన అనుకుంటాడు. నిజానికి ఆ యువకుడు అతని మీద పగ తీర్చుకోవటానికి వచ్చాడు. అది ప్రేక్షకులకి మాత్రమే తెలుసు. పెద్దాయన మాత్రం ఆ యువకుడి మీద పుత్రోత్సాహంతో ఊహల్లో ఉంటాడు.
పాట చిత్రీకరణ విచిత్రంగా ఉంటుంది. పెద్దాయన తన దగ్గరున్న ఒక సరంగు బొమ్మతో తన మనసులోని మాట చెప్పుకుంటాడు. ఆ సరంగుతో కలిసి పాట పాడుకుంటున్నట్టు ఊహించుకుంటాడు. ఆ సరంగు పాత్ర పోషించినది మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. పాటలో బాలకృష్ణ, రోజా కూడా ఉంటారు. రోజా పెద్దాయన బిడ్డనంటూ వచ్చిన యువతి. హీరో హీరోయిన్లు లేకపోతే పాట పాపులర్ అవ్వదని నిర్మాతలు ఒత్తిడి చేసినట్టు అనిపిస్తుంది.


అక్కినేనికి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడగా మోహన్లాల్కి శ్రీకుమార్ పాడారు. ఈయన మళయాళ గాయకుడు అనుకుంటాను. సంగీతం కీరవాణి. పాటంతా తెలుగుదనంతో నింపేశారు వేటూరి. కృష్ణుడి ప్రస్తావన పాటంతా ఉంటుంది. నందుడి ఇంట్లో ఉన్న కృష్ణుడు తండ్రి అయిన వసుదేవుడి దగ్గరకి వస్తే వసుదేవుడి భావాలు ఎలా ఉంటాయో ఆ భావాలని ఆవిష్కరించారు. ఈ పాట యూట్యూబ్‌లో లభ్యం.
అక్కినేని (అ): గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణగణా గంటలే మోగనేలా
మోహన్ లాల్ (మో): గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా
అ: వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై
మో: ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన
పడి లేచు అలలకు, తీపి కలలకు లేని అలసట నీకేలా
అ: నల్ల నల్ల నీళ్ళల్లోన ఎల్లాకిల్లా పడ్డట్టున్న అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటి జాబిలమ్మ అబ్బాయంటి సూరీడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో
మో: ఎవరికి వారే
అ: యమునకు నీరే
మో: రేవు నీరు నావదంట, నావ తోడు రేవుదంట పంచుకుంటే
అ: ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనెమనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో
మో: ముగ్గందాల ఇల్లు నవ్వె.. సిగ్గందాల పిల్ల నవ్వె బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వె.. పేరంటాల పూలు నవ్వె గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో
అ: పరవశమేదో
మో: పరిమళమాయె
అ: పువ్వు నవ్వె, దివ్వె నవ్వె, జివ్వుమన్న జన్మ నవ్వె పాడుతుంటే
పల్లవిలో గోపురం మీద గోరువంక వాలగానే గంటలు మోగినట్టే బాలకృష్ణుడు వచ్చినప్పుడు గోకులంలో ఆనందం వెల్లివిరిసిందని చెప్పారు. గోపురం మీద గంటలు గణగణా మోగినా అవి వినసొంపుగా ఉన్నాయట. ఆనందం ఎక్కువైనప్పుడు గుండె దడదడా కొట్టుకున్నట్టు. ఇక్కడ నటుడు బాలకృష్ణని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణుడి ప్రస్తావన తేవటం వేటూరి చాకచక్యం.
మొదటి చరణంలో ‘నల్ల నల్ల నీళ్ళల్లోన’ అనే పంక్తుల్లో కథలో పెద్దాయన ఇంటి వాతావరణాన్ని చెప్పారు. ‘తెప్పలు చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ’ అన్నట్టు ఆయన ఆస్తిపరుడు కావటంతో ఇంట్లో బంధువులు చేరారు. దీనిని ఆకాశంలోని చుక్కలతో పోల్చారు. ఆకాశం నల్లని నీళ్ళట. అందులో చుక్కలు గందరగోళంగా పడి ఉన్నాయట. నీటి చుక్కలు అనుకోవచ్చు. లేక తారలు అనుకోవచ్చు. అలా ఉన్న ఆకాశంలో సూరీడు అబ్బాయట, జాబిల్లి అమ్మాయట. వారు ఇంటికి దీపాలవ్వాలట. ఎన్ని తారలున్నా సూర్యుడికి, జాబిల్లికి సాటిరావు. సూర్యుడొస్తే చుక్కలు పారిపోవాల్సిందే. ‘రేవు నీరు నావదంట, నావ తోడు రేవుదంట పంచుకుంటే’ అనే చోట పంచుకోవటం ఎంత ముఖ్యమో చెప్పారు. రేవు తన నీటిని నావతో పంచుకోనంటే ఒంటరిగా మిగిలిపోతుంది. ఎవరికి వారే అన్నట్టుంటే యమునకైనా నీరు మాత్రమే మిగులుతుంది. యమున ప్రస్తావనతో మళ్ళీ కృష్ణుడిని గుర్తు చేశారు. ఇక్కడ ‘ఎవరికి వారే యమునా తీరే’ అనే నానుడి కూడా గుర్తొస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేయటంలో వేటూరి దిట్ట.


రెండో చరణంలో ‘ముగ్గందాల ఇల్లు’, ‘సిగ్గందాల పిల్ల’, ‘పైరందాల చేలు’ తెలుగుదనం నిండిన ప్రయోగాలు. ఇంటికి ముగ్గు అందం, ఆడపిల్లకు సిగ్గు అందం, చేనులో పైరుంటే అందం. వీటికి తోడుగా ‘పేరంటాల పూలు’ అనటం వేటూరికే చెల్లింది. ఈ పదబంధాలకి ప్రాస కూడా బాగా కుదిరింది. ప్రాస అంటే గుర్తొచ్చింది – ‘ఆనంద్’ సినిమాలో ‘నువ్వేనా నా నువ్వేనా’ పాటలో వేటూరి చేసిన ఓ ప్రయోగం ఇప్పటికీ గిలిగింతలు పెడుతుంది.
మసక ఎన్నెలల్లే నీవు ఇసక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు
ఇక్కడ ప్రాస కోసం ‘గసగసాల కౌగిలింత’ అని అద్భుతమైన ప్రయోగం చేశారు వేటూరి. దీని కథ ఏమిటంటే ‘సగం సగం’ అనే మాటని తిప్పారు. అది ‘గసం గసం’, చివరికి ‘గసగసాలు’ అయింది!
‘గోరువంక వాలగానే’ పాటలో కీరవాణి బాణీ గురించి కూడా చెప్పుకోవాలి. చరణంలో మొదటి రెండు పంక్తుల బాణీ నెమ్మదిగా ఉంటుంది. తర్వాతి రెండు పంక్తులు వేగంగా ఉంటాయి.


దీనితో పాటకి ఒక ప్రత్యేకత వచ్చింది. ఇక చివరగా చెప్పుకోవాల్సినదేమిటంటే సినిమా కథలో నాయకుడు వ్యాపారవేత్త మీద కసిగా ఉంటాడు. ఈ పాటలో కృష్ణుడితో పోలిక చెప్పటం వల్ల ఆ వ్యాపారవేత్త కంసుడనే భావం కూడా కలుగుతుంది.
Images Source: Internet