[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘గురు శిష్యుల మైత్రి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


మనసా వాచా కర్మణా ఉండాలి త్రికరణ శుద్ధి
విద్యా వినయం గురువు ద్వారానే సంసిద్ధి
అప్పుడే శిష్యునికి సంప్రాప్తిస్తుంది బుద్ధి
గురువు లేని విద్య గుడ్డి విద్య
గురుబోధనతో లభించు ఉన్నతమైన విద్య
లేదంటే విద్యాన్వేషణలో అదొక మిథ్య
శిష్యునికి కావాలి సంపూర్ణ శరణాగతి
గురుతత్వంతో తరించి పొందు సద్గతి
అప్పుడే సాధకునికి నిజమైన సుకృతి
ఎక్కడైతే ఉంటుందో గురు శిష్యుల మైత్రి
అక్కడే పవిత్రతను పొందుతుంది ధాత్రి
సచ్చీలత లేకుంటే సమస్తం కాళరాత్రి