హీరోలం మేము హీరోలం మా గురించి నిజం చెబుతాం
మాతో చేయి కలిపితే అభిమానిస్తాం వ్యతిరేకిస్తే మా సంగతి చెబుతాం
మేము కాలేజీలో చేరేముందు అనుకుంటాం ఇలా
అనుభవాల లోగిళ్ళు… ఆనందాల పరవళ్లు
ఆదర్శాలకు పునాదులు వేసిన అధ్యాపకులు
ఆటలతోపాటలతో అలరించిన నేస్తాలు
అరమరికలులేని అంతస్తులు లేని సమైక్య సోదర భావాలూ
అతివిలువైన జ్ఙాన సముపార్జనకు పునాదులు
అల్లరిలో హనుమంతులం ఆదర్శాలు వల్లించే హీరోలం
చదువునేర్పిన కాలేజీలు పిరికితనాన్ని పోగొట్టిన పాఠాలు
పరీక్షలు డిగ్రీలకేకాదు జీవిత సమస్యలకు పరిష్కారాలని తెలియచెబుతాయి
యువనాయకత్వపోటీ రాబోయే రాజకీయ ప్రవేశానికి వేదికగా కాలేజీ ఎన్నికలు
హీరోయిజానికి ఖరీదైన బైకులు లేటెస్ట్ స్మార్ట్ఫోనులే గీటురాళ్ళుగా నమ్మినవాళ్ళం
సినిమా మొదటి షోకి సిన్సియర్‌గా హాజరయ్యే అభిమాన నటుల ఫ్యానులం
పాఠాలు అర్థంకాక క్లాసులకు హాజరుకాక పరీక్షల్లో పాసుమార్కులురాని జీరోలం
పరీక్ష ఫెయిలైతే మాస్టార్ని మార్చాలని సమ్మె చేస్తాం రాత పరీక్షలు వద్దంటాం
క్రికెట్ సినిమాకబుర్లు క్లాసులో అమ్మాయిల అడ్రస్సులు అడగండి….నో డౌట్
ఇంటి దగ్గిర ఎవరిమాటా వినం క్లాసులో అమ్మాయిలు ఏదిఅడిగినా కాదనం
హీరోలా వున్నావంటే వాళ్ళకి దాసోహం అవుతాం
నిజంచెబితే వాళ్ళ అంతు చూస్తాం
ప్రేమంటే తెలియని వయసులో అమ్మాయిలకు ప్రేమలేఖలు మెస్సేజ్ పెట్టిన ఘనులం

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్‌చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.