[శ్రీ సయ్యద్ సలీం రచించిన ‘హోమో అల్టిమా’ అనే సైన్స్ ఫిక్షన్ కథని పాఠకులకి అందిస్తున్నాము.]
మిల్కీ వే గెలాక్సీలోని అలాసియా అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోన్న జీజె అనే గ్రహం నుంచి బయల్దేరిన అంతరిక్షనౌక ఎస్‌ఎల్‌వో 3 అత్యంత వేగంతో భూమి వైపుకు దూసుకెళ్తోంది.
వ్యూపాయింట్ దగ్గర కూచుని ఉన్న నాహల్ లేత నీలం రంగు చుక్కలా కన్పిస్తున్న భూమి వైపు ఆసక్తిగా చూశాడు. అది జి క్లాస్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉండటాన్ని గమనించాడు.
నాహల్ వయసు యాభై రెండు సంవత్సరాలు. జీజె గ్రహంలో అతను పేరెన్నికగన్న ఛీఫ్ ఆర్కియాలజిష్ట్. కొన్ని వేల సంవత్సరాల క్రితం జీజె గ్రహంలో తిరుగాడిన జీవుల రహస్యాల్ని కనుక్కోవడంలో అతను తన టీమ్‌తో కలిసి చేసిన పురావస్తు తవ్వకాలు ప్రామాణికంగా నిలిచాయి. అతను తన అసిస్టెంట్ కేథ్వీ వైపు తిరిగి “భూగ్రహం మీద వాతావరణ పరిస్థితి మనం వూహించినట్టే ఉందా? ఎవరైనా లేదా ఏదైనా జీవించి ఉండే అవకాశం ఉందా? చెక్ చేసి చెప్పు” అన్నాడు.
స్పేస్‌షిప్‌లో ఉన్న అత్యంత ఆధునికమైన, శక్తివంతమైన పరికరాలు భూగ్రహ వాతావరణాన్ని, దాన్నుంచి వెలువడుతున్న వాయువుల్ని విశ్లేషించి, అందచేసిన సమాచారాన్ని కేథ్వీ నాహల్‌కి తెలియచేసింది. “జీరో బయో సైన్స్. మన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ల్యాబ్‌లోని గెల్టో టెలిస్కోప్‌లో కన్పించిన దృశ్యాల్లో భూగ్రహం స్టెరైల్‌గా కన్పించింది కదా. అలానే పూర్తిగా స్టెరైల్‌గా ఉంది. ప్రాణమున్న జంతు వృక్ష జాతులేమీ లేవు. టెంపరేచర్ 50 డిగ్రీల సెల్సియస్ ఉంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రభావం వల్ల టెంపరేచర్, హ్యుమిడిటీ కల్సిన అతి ప్రమాదకరమైన వెట్ బల్బ్ ఉష్ణోగ్రతలు ఏర్పడి ఉంటాయి.”
“భూగ్రహం ప్రరిభ్రమిస్తున్న నక్షత్రం యొక్క కాంతి పది శాతం పెరిగి ఉంటుంది. దానివల్ల ఆ గ్రహం మీదున్న సముద్రాల్లోని నీరు ఆవిరైపోయి భూవాతావరణాన్ని కప్పేసి ఉంటుంది. తద్వారా వేడి మరింత పెరిగి ఉంటుంది” అన్నాడు నాహల్.
“ఇంతకూ మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నట్టు? అక్కడ ఎక్స్‌కవేషన్స్ జరపడం వల్ల మనకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి? మనం ఎందుకింత శ్రమ తీసుకుని, ప్రమాదకరంగా మారిన భూగ్రహం మీదికి వెళ్ళి సాధించేదేమిటో నాకర్థం కావడం లేదు” అంది కేథ్వీ.
“మన జీజె గ్రహాన్ని పోలిన గ్రహం కోసం అంతరిక్షంలో వెతుకుతుంటే స్పైరల్ గెలాక్సీలోనే ఉన్న ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోన్న ఈ భూగ్రహం మన శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. మన జీజే గ్రహంతో పోలిస్తే పరిమాణంలో భూమి ఓ ఇరవై శాతం చిన్నది. మన అలాసియా నక్షత్రం ఏర్పడి నాలుగు బిలియన్ సంవత్సరాలైంది. భూమ్మీద జీవరాశి మనుగడకు ఆధారమైన సూర్యుడని పిలవబడే నక్షత్రం వయసు రేడియో యాక్టివ్ డేటింగ్ ద్వారా 4.6 బిలియన్ సంవత్సరాలుగా మన ఖగోళశాస్త్రవేత్తలు తేల్చారు. మొదట మనవాళ్ళు ఈ భూగ్రహం మీద కాలనీలు ఏర్పాటు చేసుకుని, జీజె గ్రహం నివాసయోగ్యం కాని పరిస్థితుల్లో, ఈ గ్రహం మీద నివసించాలని ఆశించారు. మరిన్ని పరిశోధనల తర్వాత ఒకప్పుడు జీవంతో తొణికిసలాడిన ఈ గ్రహం ఇప్పుడు మృత గ్రహమని తెల్సుకున్నారు.”
అతన్ని మధ్యలోనే ఆపేస్తూ “ఎలాగూ మనకు నివాసయోగ్యం కాదని తెల్సుకున్నాక ఈ ఎక్స్‌పెడిషన్ మన చేత ఎందుకు చేయిస్తున్నట్టు? మనకు పనికొచ్చే మరేదైనా గ్రహాన్ని అన్వేషించి మనల్ని అక్కడికి పంపించిఉంటే బావుండేదిగా. అక్కడ తవ్వకాలు చేసి, దొరికిన శిలాజాల్ని పరిశీలించడం వల్ల అక్కడ నివసించబోయే మన ముందుతరాల వారికి ఉపయోగపడే సమాచారం తెలిసి ఉండేదిగా” అంది.
“భూగ్రహం పూర్తిగా నాశనం కావడానికి దారితీసిన పరిస్థితుల్ని తెల్సుకోడానికే మనం అక్కడికి వెళ్తున్నాం. సూర్య నక్షత్రంలో ఇంధనం చివరి దశకు చేరుకోవడం వల్ల అది వ్యాకోచించి, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల జరిగిన నష్టమా లేక ఆ గ్రహం మీద తిరుగాడిన జీవుల స్వయంకృతాపరాధమా లేక రెండూ కలిసి సృష్టించిన విధ్వంసమా అనే విషయం మనం నిర్థారించుకోవాలి.”
“దానివల్ల మనక్కలిగే లాభం ఏమిటి?”
“మన అలాసియా నక్షత్రం పరిమాణంలో, వేడిమిలో, కాంతిని వెదజల్లడంలో సూర్య నక్షత్రాన్ని పోలి ఉంది. ఒకవేళ భూగ్రహం సూర్య నక్షత్రం వ్యాకోచించి, వేడి పెరగడం వల్ల నాశనమై ఉంటే మరో ఆరువందల మిలియన్ సంవత్సరాల్లో అలాసియా నక్షత్రం వల్ల మనక్కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలున్నాయి. అలా జరక్కముందే మన గ్రహవాసుల్ని వేరే గ్రహానికి పంపించే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఒకవేళఅక్కడి జీవుల తప్పిదాల వల్ల వినాశనం జరిగిఉంటే అటువంటి తప్పులు మన గ్రహవాసులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు” అన్నాడు.
ఆమె మరో ప్రశ్నని సంధించేలోపల అతను వ్యూపాయింట్ నుంచి చూస్తూ “చూడు. మనం భూగ్రహానికి చేరువ కాబోతున్నాం” అన్నాడు.
కేథ్వీ వ్యూపాయంట్ లోంచి చూసింది. సూర్యుడు, దాని చుట్టుా పరిభ్రమిస్తున్న గ్రహాలు మినియేచర్ పెయింటింగ్‌లా కన్పిస్తున్నాయి. భూమినుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్మన్‌లైన్‌ని దాటారు. హిమాలయ పర్వతాలు, నార్త్ అమెరికా ఆసియా ఖండాలు కలిసిపోయి ఏర్పడిన అమాసియా అనే సూపర్ కాంటినెంట్, మిగతా ఖండాలు కన్పించసాగాయి. మరికొన్ని క్షణాల్లో అంతరిక్షనౌక ఎస్‌ఎల్‌వో 3 భూమిని చేరుకుంది.
అత్యంత హానికరమైన భూగ్రహ వాతావరణం నుంచి రక్షించే సూట్లు ధరించి నాహల్, కాథ్వీ కిందికి దిగారు. భూమి విశాలమైన స్మశాన స్థలిలా ఉంది. ఎటుచూసినా శిథిలావస్థలో ఉన్న కాంక్రీట్ అవశేషాలు కన్పిస్తున్నాయి.
“చూశావా ఈ భూగ్రహవాసులు ఎన్ని రకాల నిర్మాణాలు చేపట్టారో.. చాలా తెలివిగల స్పీసీస్ అనిపిస్తోంది” చుట్టూ చూస్తూ అన్నాడు నాహల్.
“మన జీజెయన్స్ కన్నా తెలివిగలవాళ్ళా?” అని అడిగింది కాథ్వీ.
“ఆ విషయం ఎక్స్‌కవేషన్స్ తర్వాతే నిర్థారించగలం” అన్నాడు నాహల్.
తవ్వకాల్లో సహాయం చేయడానికి తెచ్చుకున్న నలుగురు సిబ్బంది అంతరిక్ష నౌకలోంచి ఎస్డీ-8 అనే పరికరాన్ని కిందికి దింపారు. అది ఆరడుగుల పొడవుతో నాలుగడుగుల వెడల్పుతో, మూడడుగుల ఎత్తుగా ఉంది. దానికి బలమైన లోహంతో చేసిన నాలుగు చక్రాలు ఉన్నాయి.
ఎక్కడ తవ్వాలనుకుంటున్నారో ఆ స్థలంలో ఎస్డీ -8 యంత్రాన్ని ఉంచాక, సిబ్బంది పక్కకు తప్పు కున్నారు. నాహల్ తన చేతిలో ఉన్న రిమోట్ బటన్ నొక్కడం ఆలస్యం ఎస్డీ-8 యంత్రంలోంచి ఎనిమిది పదునైన బల్లేల్లాంటివి బైటికొచ్చి వేగంగా నేలను తవ్వసాగాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు అడ్డొస్తే వాటిని సునాయాసంగా పక్కకు నెట్టేస్తూ నేలను తొలుచుకుని లోపలికెళ్ళిపోతున్నాయి. వాటికమర్చబడిన సెన్సార్‌లు ఏదైనా మనిషి లేక జంతువు కళేబరాలను గుర్తించగానే రెండు లోహపు చేతులు వాటిని భద్రంగా పైనున్న కంటెయినర్లలోకి చేరుస్తున్నాయి.
గంట వ్యవధిలో దాదాపు వెయ్యిమీటర్ల స్థలంలో చాలా లోతు వరకు తవ్వకం పూర్తయింది. పన్నెండు కంకాళాలు బైటపడ్డాయి. ఆరు కంకాళాలు ఐదడుగుల ఐదంగుళాల నుంచి ఐదడుగుల ఏడంగుళాల పొడవున్నాయి. ఐదు కంకాళాలు వాటికన్నా తక్కువ పొడవున్నాయి. ఒకే ఒక కంకాళం పొడవు దాదాపు ఆరడుగులుంది. వాటిని నాహల్ జాగ్రత్తగా పరిశీలిస్తూ, తన అభిప్రాయాన్ని రికార్డ్ చేయసాగాడు.
“ఎర్త్‌లింగ్స్ చాలా అర్భకులు. శారీరకంగా దుర్బలులు. మన జీజె గ్రహవాసుల్తో పోలిస్తే సగం ఎత్తుకి కూడా పెరగలేదని తెలుస్తోంది. గుల్లబారిపోయిన అస్థిపంజరాల్ని చూస్తే ఎముకల నిర్మాణం కూడా బలహీనంగానే ఉండేదని అర్థమౌతోంది. చర్మం చాలా సున్నితంగా, కండరాలు శక్తిహీనంగా ఉండి ఉంటా యి. అందువల్లనే ఎముకలు తప్ప వాటి ఆనవాళ్ళు కన్పించడం లేదు. ప్రతికూల వాతావరణాన్ని, హానికర కెమికల్స్‌ని, ప్రమాదకర జంతువుల్ని తట్టుకుని బతికేంత దేహ దారుఢ్యం లేని జీవులు. కానీ వీళ్ళు కూడా మనలానే రెండు కాళ్ళ మీద నడిచే తెలివిగల స్పీసీస్. వీళ్ళు నిర్మించిన అద్భుతమైన కట్టడాల్ని చూస్తే అత్యంత మేధావులనే నిర్థారణకు రావొచ్చు. ద్వైదీ స్వభావం కలిగి ఉండేవారనిపిస్తోంది. వివేకంతో పాటు అహేతుకత, కరుణతో పాటు క్రూరత్వం, క్రమశిక్షణతో పాటు అస్తవ్యస్తత లాంటి విరుద్ధమైన స్వభావాల వల్లనే తమ నాశనాన్ని కొని తెచ్చుకుని ఉండొచ్చు.”
అత్యంత దృఢమైన శరీరంతో దాదాపు ఎనిమిదడుగుల పొడవున్న కాథ్వీ “అంతటి బలహీనులు ఈ గ్రహం మీద దాదాపు బిలియన్ సంవత్సరాలు మనుగడ సాగించారంటే నమ్మశక్యంగా లేదు. అదెలా సాధ్యపడింది?” అని అడిగింది.
“బహుశా వాళ్ళ మేధస్సుతో హాని కలిగించే శక్తులనుంచి రక్షణను కల్పించుకుని ఉండొచ్చు.”
మరికొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినప్పుడు వేల సంఖ్యలో మానవ కంకాళాలతో పాటు వందల సంఖ్యలో జంతువుల కళేబరాలు కన్పించాయి.
“బహుశా భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాల వంటి కారణాలతో ఇలా గుంపులు గుంపులుగా చనిపోయి ఉండొచ్చు” అన్నాడు నాహల్.
“విషవాయువుల వల్ల కావొచ్చు. లేదా జీవాయుధాల వల్ల కూడా కావొచ్చుకదా” అంది కాథ్వీ.
“అవకాశం ఉంది. ఇక్కడి మట్టిలో విషరసాయనాల ఆనవాళ్ళు చాలా కన్పిస్తున్నాయి” అన్నాడు నాహల్.
“ఇక్కడి వాతావరణంలో ఆక్సిజన్ జీరో, కార్బన్ డైఆక్సైడ్ టెన్ పార్ట్స్ పర్ మిలియన్, నైట్రోజెన్ మాత్రం తొంభై ఐదు శాతం ఉంది. మీథేన్ కూడా చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ గ్రహం మీద జీవరాశి మొత్తం నాశనం కావడానికి ఇక్కడి గ్రహవాసులు చేసిన తప్పిదాలే ఎక్కువగా ఉన్నట్టు అన్పిస్తుంది” అంది.
“నువ్వు సరిగ్గానే వూహించావు. ఈ గ్రహం మీద దట్టంగా ఆవరించి ఉన్న కట్టడాల్ని చూస్తేనే అర్థమౌతుంది ఎర్త్‌లింగ్స్ అడవుల్ని నరికేసి, చెట్లను కొట్టేసి కాంక్రీట్ జంగిల్స్‌ని పెంచుకున్నారని. చెట్లను నాశనం చేయడంవల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోయి ఉంటుంది. ఆక్సిజన్ లేకపోవడంతో జీవరాశి మొత్తం నశించిపోయి ఉంటుంది” అన్నాడు.
వారం రోజులు జరిపిన తవ్వకాల్లో వాళ్ళకు అస్థిపంజరాలతో పాటు శిథిలమైపోయిన రకరకాల కళాకృతులు, శిల్పాలు, పెయింటింగ్స్, చివికిపోయిన పుస్తకాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాపులు, డిజిటల్ స్టోరేజ్ డివైజ్‌లు, విరిగిపోయిన హ్యూమనాయిడ్, యాండ్రాయిడ్ భాగాలు, మెటల్స్‌తో చేసిన వస్తు సముదాయాలు చాలా కన్పించాయి.
విశాలంగా ఉన్న ఓ శిధిల భవనంలో కొన్ని వేల అస్థిపంజరాలు గోడలకు ఆనుకుని కూచుని ఉన్నపొజిషన్లో కొన్ని, నేల మీద పడుకుని కొన్ని, ఇనుప రెయిలింగ్‌ని పట్టుకుని కొన్ని కన్పించాయి.
“వీళ్ళందరూ దేనికో భయపడి, ఇక్కడ దాక్కుని ఉంటారనిపిస్తోంది. అసలీ కట్టడమే ఏదైనా విపత్తు సంభవించినపుడు, ప్రాణాల్ని కాపాడుకోడానికి కట్టినట్టనిపిస్తోంది” అంది కాథ్వీ.
“భయమే వీళ్ళను కాపాడి ఉంటుంది. చివరికి ఆ భయమే వీళ్ళందర్ని చంపేసి ఉంటుంది” అన్నా డు నాహల్.
ఎనిమిదో రోజు ఓ లైబ్రరీ బిల్డింగ్ కింద బేస్‌మెంట్‌లో కొన్ని గదులు కన్పించాయి. చాలా కట్టడాలు కూలిపోయి, శిధిలమైపోయి కన్పిస్తుంటే ఆ బిల్డింగ్ మాత్రం స్థిరంగా నిలబడి ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యానికి లోనైనారు.
“దీన్ని ఏదో ఓ ప్రత్యేకమైన ఉద్దేశంతో కట్టి ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలకు తల వొంచకుండా నిలబడేలా చాలా బలంగా, దృఢంగా ఉండేలా నిర్మాణం చేసిఉంటారు” అన్నాడు నాహల్.
లైబ్రరీలో మానవ పరిణామానికి, శాస్త్ర సాంకేతిక పురోగతికి సంబంధించిన వేలాది పుస్తకాలు జీర్ణావస్థలో కన్పించాయి.
“బేస్‌మెంట్‌లో ఏముందో చూద్దాం పద” అన్నాడు కాథ్వీతో నాహల్.
లిఫ్ట్ ఉన్నా పని చేయడం లేదు. ఇద్దరూ విరిగిపోయిన మెట్లమీదనుంచి జాగ్రత్తగా కిందికి దిగారు. గదుల్లో పెద్ద పెద్ద స్క్రీన్‌లు, ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు ఉన్నాయి. ఏవీ పని చేయడం లేదు. చివరి గదిలో నాలుగు హోలోగ్రామ్ ఎక్జిబిట్స్ కన్పించాయి. కాథ్వీ వాటిలో తన దగ్గరున్న పవర్‌సెల్‌ని వాడితే, పని చేస్తాయేమోనని ప్రయత్నించింది. మూడు పని చేయలేదు. నాలుగో హోలోగ్రామ్‌లో లైట్ వెలిగింది.
ప్రొజెక్టర్ మీద బొమ్మలు కదులాడసాగాయి. మనుషులు గుంపులు గుంపులుగా నడుస్తూ.. రోడ్లమీద వేగంగా దూసుకెళ్తున్న కార్లు, రైళ్ళు.. ఆకాశంలో పక్షుల్లా ఎగురుతున్న విమానాలు.. సముద్రజలాల మీద చేపల్లా జారిపోతున్న ఓడలు.. రాకెట్లు, పరిశ్రమలు.. కుటుంబాలు.. మనుషులు మాట్లాడుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు. కోపంగా అరుచుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. చంపుకుంటున్నారు. మానవ చరిత్ర మొత్తం దృశ్యమానమై కన్పిస్తోంది. యుద్ధాలు, క్షతగాత్రులు, హాస్పిటళ్ళు, విజ్ఞాన పరిశోధనలు, చంద్రుడిపైకి పంపిన వ్యోమనౌకలు, మార్స్ గ్రహం మీద జరిగిన అన్వేషణలు.. రోబోట్స్.. రకరకాల పనులు చేస్తూ హ్యూమనాయిడ్స్.. మనుషుల్తో కలిసి మనుషుల్లానే మసలిన ఆండ్రాయిడ్లు..
“ఈ ఎర్త్‌లింగ్స్ అభివృద్ధి పేరుతో ఎంత వినాశనాన్ని కొని తెచ్చుకున్నారో గమనించావా? వాళ్ళు వాడిన ప్రయాణసాధనాలు పని చేయడానికి వాడిన ఇంధనం వల్ల గాలి ఎంత కలుషితమై పోయి ఉంటుందో.. ఫ్యాక్టరీల నుంచి వెలువడిన విషపదార్థాలు నీటిని కలుషితం చేసి ఉంటాయి. నియంత్రణ లేని కర్బన ఉద్గారాల వల్ల కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోయి, గ్రహ ఉపరితలం మరింత వేడెక్కి ఉంటుంది. ఇటువంటి తప్పులు చేయకుండా ఉండిఉంటే ఎర్త్ మరో బిలియన్ సంవత్సరాల వరకు జీవరాశిని కాపాడి ఉండేది” అన్నాడు నాహల్.
అదే సమయంలో ప్రొజెక్టర్ మీద దాదాపు ఎనభై యేళ్ళ వయసున్న వ్యక్తి కన్పించాడు. తలమీద పల్చగా ఉన్న తెల్ల వెండ్రుకలు, తెల్లటి గడ్డం, కళ్ళద్దాలు, కళ్ళల్లో కన్పిస్తున్న ఏదో మెరుపు.. అతను మాట్లాడటం మొదలెట్టాడు.
“నా పేరు డాక్టర్ నరసింహమూర్తి. నేను భారతదేశస్థుడిని. జెనెటిక్ ఇంజనీర్‌ని. మరి కొన్ని దశాబ్దాల్లో భూమి మీదున్న జీవజాతి మొత్తం నాశనం కాబోతుందని అర్థమవడంతో నాసా, ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచ దేశాల్లోని ప్రముఖ శాస్త్రవేత్తలందరం జెనీవాలో సమావేశమైనాము. అప్పటికే గ్రహాంతర ప్రయాణాలు అందుబాటులో ఉండటంతో కొంతమంది శాస్త్రవేత్తలు వేరే గ్రహాల మీద కాలనీలు నిర్మించుకుని బతకడమొక్కటే దారి అని, మరో ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. కొన్ని కోట్ల జనాభాని గ్రహాంతర వాసానికి పంపడం సాధ్యమా? అందుకు ఎన్ని వ్యోమనౌకల్ని ప్రయోగించాలి? ఎంత సమయం పడ్తుంది? ఎంత ఖర్చవుతుంది? ఎంతమంది అంత ఖర్చుకి సిద్ధపడగలరు? అందుకే నేనా సలహాని బలంగా వ్యతిరేకించాను.
అసలు ఈ భూమ్మీదనుంచి ఎందుకు పారిపోవాలి? ఈ భూమి మనది. మన తల్లి లాంటిది. మనమే స్వయంకృతాపరాధాల వల్ల దాన్ని నివాసయోగ్యం కాకుండా చేసుకున్నాం. ప్రతికూల భూవాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా మనల్ని మనం తయారుచేసుకుంటే మనం భూమి నొదిలి పారిపోవాల్సిన అవసరం లేదుగా. నా అభిప్రాయంతో చాలామంది శాస్త్రవేత్తలు ఏకీభవించారు. అప్పటినుంచి జెనెటిక్ ఇంజనీర్లు, బయో కెమిష్ట్‌లు, మాలిక్యులార్ బయోలజిష్ట్‌లు, బయో ఇంజనీర్లు అహోరాత్రాలు శ్రమించి మానవ డిఎన్‌ఏలలో మార్పులు చేసి, ఎంబ్రియోలని తయారుచేశాం. మా అంతం సమీపించే చివరి క్షణం వరకు నిరంతరాయంగా ఆ పనిని కొనసాగించి కొన్ని వేల ఎంబ్రియోలను తయారు చేశాం. వాటిని నేల మాళిగలో ఓ చోట భద్రంగా కాపాడే ఏర్పాటు చేశాం. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళు మళ్ళీ ఈ భూమ్మీద తిరుగాడతారు.
వాళ్ళు మానవ డిఎన్‌ఏలతో ఏర్పడిన జీవులే. కానీ హ్యూమన్ స్పీసీస్ కాదు. కొత్త స్పీసీస్. మేము మా మేధస్సుని ఉపయోగించి, తయారుచేసిన బలమైన స్పీసీస్. వీళ్ళు ఎత్తు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల వరకు పెరుగుతారు. పొడవాటి బలమైన కాళ్ళను కలిగి ఉంటారు. కపాలం ఎముక రెండింతలు మందంగా ఉంటుంది. గుండెలో ఎనిమిది ఛాంబర్స్ ఉంటాయి. ఎముకలు ఇనుములా దృఢంగా మారతాయి. బలంగా, వేగంగా, తెలివిగా ఈ భూమ్మీద మనగల దేహ దారుఢ్యంతో తయారయ్యే స్పీసీస్. మేము ఈ ప్రాజెక్ట్‌కి పెట్టిన పేరు హోమో అల్టిమా.
మేము సామాన్య మానవులం. భూమ్మీద బతకలేము. కానీ ఎంతటి వేడినైనా తట్టుకుని, ఆక్సిజన్ లేకున్నా బతగ్గల హోమో అల్టిమా జాతి మా తదనంతరం ఈ భూమ్మీద తిరుగాడుతుంది. మా వారసత్వ సంపదను ఈ విధంగా భద్రపరిచి మేము వెళ్ళిపోతున్నాం. భూమి ఎప్పటికీ స్టెరైల్ కాదు. కానివ్వం. మానవజాతి భూమ్మీద ఏదో ఓ రూపంలో బతికే ఉంటుంది. లాంగ్ లీవ్ హోమో అల్టిమా” అంటూ తెర మీద అతని బొమ్మ అంతర్థానమైపోయింది.
నాహల్, కాథ్వీ ఒకరిమొహాలొకరు చూసుకున్నారు.
“ఒకవేళ హోమో అల్టిమా స్పీసీస్ నిజంగానే ఎక్కడో ఉన్నా భూమ్మీద ఎన్నాళ్ళు నివసించగలరు? ఈ నక్షత్రం రెడ్ జెయింట్‌గా మారేవరకేగా. అప్పుడీ గ్రహాన్ని కూడా రెడ్ జెయింట్ మింగేస్తుందిగా” అంది.
నాహల్ సాలోచనగా తల పంకించాడు. “సూర్యుడని పిలవబడే ఈ నక్షత్రం రెడ్ జెయింట్‌గా మారడానికి మరికొన్ని బిలియన్ సంవత్సరాలు పడ్తుంది. ప్రస్తుతం నాశనమైపోయిన మానవజాతి ఈ భూమ్మీద బతికిన దానికన్నా హోమో అల్టిమా నాలుగు రెట్లు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది” అన్నాడు.
“ఇంతకూ ఆ కొత్త స్పీసీస్‌ని ఎక్కడ దాచిపెట్టినట్టు?”
“ప్రస్తుతం మన పని అదే. ఆ నేల మాళిగ ఎక్కడుందో వెతకడమే. పద వెతుకుదాం” అన్నాడు నాహల్.
***
నాలుగు రోజుల వెతుకులాట తర్వాత నేల మాళిగ ఎక్కడుందో కనుక్కోగలిగారు.
లోపలికి మెట్లున్నాయి. పది మెట్లు దిగాక పక్కనే లిఫ్ట్ కన్పించడంతో నాహల్ ఆశ్చర్యపోయాడు.
“జంక్ మెటీరియల్. ఎప్పుడో పాడైపోయి ఉంటుంది” అంది కాథ్వీ.
“లెటజ్ ట్రై” అంటూ నాహల్ లిఫ్ట్ బటన్ ని ప్రెస్ చేశాడు. అది నిశ్శబ్దంగా తెరుచుకుంది. అందులోకి ప్రవేశించగానే తలుపులు మూసుకున్నాయి. కంట్రోల్ ప్యానెల్ మీద ఒకటి నుంచి ఆరు అంకెలు వేసిఉన్న బటన్లు కన్పించాయి.
నాహల్ ఒకటో నెంబర్ బటన్ ని నొక్కాడు. లిఫ్ట్ మెల్లగా కిందికి దిగసాగింది.
“పవర్ జెనరేటింగ్ సిస్టమ్స్ అన్నీ నాశనమైపోయినా, ఈ లిఫ్ట్ ఎలా పని చేస్తుందో అర్థం కావడం లేదు” అన్నాడు నాహల్.
ఓ నిమిషం ప్రయాణించాక లిఫ్ట్ ఆగింది. కొన్ని క్షణాల విరామం తర్వాత దాని తలుపులు తెరుచుకున్నాయి.
“ఇది సెకనుకి ఒక మీటర్ స్పీడ్‌తో ప్రయాణించింది. అంటే మనం అరవై మీటర్ల లోతుకి చేరుకు న్నాం” లిఫ్ట్ నుంచి బైటికి వస్తూ అన్నాడు నాహల్.
ఎదురుగా విశాలమైన కారిడార్లు విద్యుద్దీపాల వెలుగులో ప్రకాశవంతంగా కన్పించాయి.
చుట్టూ పరిశీలిస్తూ మెల్లగా నడవసాగారు. ఇరువైపులా గదులు.. వాటిమీద నెంబర్లు వేసి ఉన్నాయి. గదుల్లోపల దాదాపు తొమ్మిదడుగుల పొడవున్న, రాతిశిల్పంలా బలంగా ఉన్న హోమో అల్టిమా జాతి మనుషులు, ఆడామగా కలిసి ఉల్లాసంగా కబుర్లాడుకుంటూ కన్పించారు. ఒక్కో గదిలో నాలుగు జంటలు..
వీళ్ళను ఉత్సుకతతో కొన్ని క్షణాలు చూసి, మళ్ళా నవ్వుకుంటూ మాట్లాడుకోసాగారు.
పది గదులు దాటి ఉంటారు. వాళ్ళకు ఎదురుగా ఓ బలశాలి వచ్చి నిలబడ్డాడు. అతని కండలు మెలితిరిగి ఉక్కు ముక్కల్లా కన్పిస్తున్నాయి. కాళ్ళు ఇనుప స్తంభాల్లా ఉన్నాయి. తల రాతి పలకల్తో చేసినట్టు దళసరిగా ఉంది. నల్లటి పొడవాటి జుట్టు భుజాల వరకు ఉంది.
“ఎవరు మీరు?” అతని గొంతు ఖంగుమంటూ మోగింది. కళ్ళు క్రోథంతో ఎర్ర జీరలు సంతరించుకోవడాన్ని నాహల్ గమనించాడు.
“మేము జీజె గ్రహవాసులం. నాపేరు నాహల్. నేను ఆర్కియాలజిష్ట్‌ని. ఈమె పేరు కాథ్వీ. నా అసిస్టెంట్” నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. కానీ ఎదురుగా భయం గొలిపేలా నిలబడిఉన్న ఆకారాన్ని చూస్తుంటే అతనికి నవ్వు రాలేదు.
“మా గ్రహానికి ఎందుకొచ్చారు?” మళ్ళా ప్రశ్నించాడతను.
“ఈ గ్రహం స్టెరైల్ కావడానికి దారితీసిన పరిస్థితులేమిటో తెల్సుకోడానికొచ్చాం. మేము మీకు హాని చేయడానికి రాలేదు. అసలీ గ్రహం మీద మీవంటి ఎర్త్‌లింగ్స్ బతికున్నారంటే నమ్మశక్యంగా లేదు. ఓ బేస్‌మెంట్లో దొరికిన హోలోగ్రామ్ ద్వారా హోమో అల్టిమా స్పీసీస్ గురించి తెల్సుకుని, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం” ప్రశాంత వదనంతో బదులిచ్చాడు.
అతనిలోని క్రోధఛాయలు మాయమైనాయి. “వెల్‌కం టు అవర్ హోమో అల్టిమా వరల్డ్. నా పేరు గ్యాన్. రండి నా గదికెళ్ళి మాట్లాడుకుందాం” అన్నాడు.
అతను ముందు నడుస్తుంటే అతని వెనక నాహల్, కేథ్వీ నడిచారు.
“ఒక్కో అంతస్తులో వంద గదులుంటాయి. అటువైపు యాభై, ఇటువైపు యాభై. ఈ అంతస్తులో పదిహేనేళ్ళు దాటి, ఇరవై యేళ్ళ లోపల వయసున్న ఆడా మగా ఉంటారు. ఒక్కో గదిలో నాలుగు జంటలు. వాళ్ళకు పుట్టే పిల్లల్ని కిందున్న నాలుగో అంతస్తులోని గదుల్లో ఉంచి పెంచుతాం” అంటూ ఓ గది తలుపు తెరిచి, “రండి లోపలికి” అన్నాడు.
లోపల హాల్ చాలా విశాలంగా ఉంది. రెండు బెడ్రూంలున్నాయి. గ్యాన్ ఓ కుర్చీలో కూచుంటూ వాళ్ళను కూడా కూచోమని సంజ్ఞ చేశాడు. వాళ్ళు అతని ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూచున్నారు. అప్పుడే ఓ బెడ్రూం తలుపు తెరుచుకుని గ్యాన్‌తో సమానంగా ఎత్తున్న స్త్రీ హాల్లోకి ప్రవేశించింది. ఆమె గ్యాన్ పక్క నున్న కుర్చీలో కూచున్నాక “ఈమె నా భార్య.. ఇరా” అని పరిచయం చేశాడు.
“హోమో అల్టిమా ప్రాజెక్ట్‌లో మొదట పుట్టించింది మా ఇద్దర్నే. మాకు పదిహేనేళ్ళు వచ్చేవరకు శాస్త్రవేత్తలు మరో బేబీని పుట్టించకుండా తమ ప్రయోగాలు సత్పలితాలనిచ్చాయో లేదో మా ఎదుగుదలని పరిశీలించడం ద్వారా తెల్సుకోసాగారు. మమ్మల్ని మధ్య మధ్యలో భూవాతావరణంలోకి పంపించి, మా శరీరాలు తట్టుకోగలవని నిర్థారించుకున్నాక, మా ఇద్దరి కలయిక ద్వారా పుట్టే పిల్లల జీన్స్‌ని పరిశీలించి, వాటి నిర్మాణం తాము ఆశించినట్టే ఉన్నాయని రూఢ చేసుకున్నారు. అలా ఐదేళ్ళలో మాకు నలుగురు పిల్లలు పుట్టారు. శాస్త్రవేత్తలు ఎంబ్రియోలలో జీన్స్‌ని మ్యుటేట్ చేయడం ద్వారా విస్తృతంగా పిల్లల్ని తయారుచేయసాగారు. ప్రస్తుతం మా యిద్దరి వయసు ముప్పయ్ ఐదేళ్ళు. ఈ ప్రాజెక్ట్ బాధ్యతంతా మా యిద్దరికి అప్పగించబడింది” అన్నాడు.
“ఇక్కడే అందరూ ఉండిపోతే భూమ్మీదికెళ్ళి బతికేదెవరు?” అని అడిగాడు నాహల్.
“ఇరవై యేళ్ళ వయసు నిండాకనే వాళ్ళను భూ వాతావరణంలో బతకడానికి పంపమని మమ్మల్ని ఆదేశించారు. ఈ అంతస్తులోని గదుల్లో ఉన్న హోమో అల్టిమా పిల్లల్లో ఇంకా ఎవ్వరూ ఇరవై యేళ్ళని పూర్తి చేయలేదు” అన్నాడు గ్యాన్.
“మీకు అవసరమైన పవర్ ఎక్కడినుంచి జనరేట్ అవుతోంది?” అని అడిగింది కేథ్వీ.
గ్యాన్ లేచి నిలబడి, “రండి మీకు ప్రాజెక్ట్ మొత్తం చూపిస్తాను” అన్నాడు.
లిఫ్ట్‌లో ఆరు సెకండ్లలో కిందున్న ఫ్లోర్‌ని చేరుకున్నారు. అందులో కూడా వంద గదులున్నాయి. ఒక్కో గదిలో ఎనిమిది మంది చొప్పున యాభై గదుల్లో మగపిల్లలు, యాభై గదుల్లో ఆడపిల్లలు వేర్వెరుగా ఉన్నారు.
“వీళ్ళ వయసులు పదేళ్ళు దాటి పదిహేనేళ్ళ మధ్యలో ఉంటాయి. దీని కింది ఫ్లోర్‌లో ఐదు నుంచి పదేళ్ళ లోపు పిల్లలు, దానికింది అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ళ లోపు వయసున్న పిల్లలు ఉంటారు. వాళ్ళ బాగోగులు పదేళ్ళ లోపు వయసున్న పిల్లలు చూసుకుంటారు” అన్నాడు గ్యాన్.
వాళ్ళని మరో కింది అంతస్తులోకి తీసుకెళ్ళాడు. అక్కడ కొన్ని గదుల్లో వంటకు ఉపయోగపడే సరుకులుంటే మరికొన్ని గదుల్లో వంటలు వండుతున్నారు. అక్కడ విశాలమైన తోటలు కూడా కన్పించాయి. “మాకు అవసరమైన పంటలు మేమే పండించుకుంటాం. ఇవి కూడా జన్యు మార్పిడికి లోనైనవే. ఎంత వేడిలోనైనా, ఏ మాత్రం చెమ్మ లేకున్నా పెరుగుతాయి. మాకు అతి తక్కువ ఆహారం సరిపోతుంది. హోమోసెపియన్స్‌కు అవసరమైనట్టు పదహారు వందలనుంచి రెండు వేల కెలోరీలు మాకవసరం లేదు. మా మెటబాలిక్ రేట్ చాలా తక్కువ. యిక మీరడిగిన పవర్ ప్రాజెక్ట్ చూపిస్తాను రండి” అంటూ గ్యాన్ వాళ్ళని అన్నిటికంటే కింద ఉన్న ఫ్లోర్‌లోకి తీసుకెళ్ళాడు. అక్కడంతా అటామిక్ పవర్ ప్లాంట్స్‌తో నిండి ఉంది. “చూశారుగా.. మరో రెండు వందల యేళ్ళ వరకు మా హోమో అల్టిమా ప్రాజెక్ట్‌కి పవర్ కొరత ఉండదు” అన్నాడు.
అక్కడినుంచి లిఫ్ట్‌లో మొదటి అంతస్తు చేరుకుని,మెట్లెక్కి భూ ఉపరితలం మీదికి చేరుకున్నారు.
వాళ్ళిదరికీ వీడ్కోలు పలుకుతూ “గుడ్‌బై జీజెయన్స్. ఇంకెప్పుడూ మా భూమ్మీదకు రాకండి. మీ అవసరం లేదిక్కడ. భూమి యింకా స్టెరైల్ కాలేదు. ఈ భూ గ్రహం మాది. మరికొన్ని బిలియన్ సంవత్సరాల వరకు ఈ గ్రహం మీద మా హోమో అల్టిమా స్పీసీస్ నివసించబోతున్నారు” అన్నాడు.
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
