[పాలస్తీనా కవి మోసాబ్ అబు తోహా రచించిన కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Mosab Abu Toha’s poem ‘What is home?’ by Mrs. Geetanjali.]


~
ఇక్కడ ఇల్లంటే..
యుద్ధంలో కూకటి వేళ్లతో సహా
భూమి నుంచి పెకిలించి వేయబడడానికి ముందు..
నా బడికి వెళ్ళేదారిలో చల్లటి చెట్ల నీడ.
ఇక్కడ ఇల్లంటే.. బాంబుల దాడిలో
పగుళ్లు వారడానికి ముందు..
మా ఇంటి గోడలకు వ్రేలాడిన
మా అమ్మమ్మా-తాతయ్యల
నలుపు తెలుపు రంగుల పెళ్లి ఫోటో!
ఇల్లంటే..
మా మామూ ప్రార్థన చేసుకునే
జనామాజ్.. చలి కాలపు రాత్రుళ్ళు
చీమలు కూడా దాని మీద నిద్రపోయేవి.
కానీ.. ఇప్పుడది లూటీ చేయబడి
మ్యూజియంలో ప్రత్యక్షమైంది!
అదిగో.. చూడండి అటు..
మా అమ్మీ.. రోజూ మా కోసం రొట్టెలు కాల్చేది..
చికెన్ వేపేది ఆ పొయ్యి అది.
అదిప్పుడు.. ఇజ్రాయిలీల దాడుల్లో బూడిదై పోయింది.
ఇక ఇక్కడ చూసారా..
ఈ కాఫీ కేఫ్‌ని..
ఇక్కడ కూర్చుని గంటల కొద్దీ
ఫుట్‌బాల్ ఆట చూసేవాడిని..
ఆడే వాడిని కూడా!
కానీ ఏముందిక్కడ.. ఒక్క ఇల్లైనా లేదు..
ఇక ఇల్లు లేకపోవడాన్ని చూస్తున్న
నా కొడుకు నన్ను ఆపి మరీ అడుగుతాడు..
“నాలుగు అక్షరాల పదం
ఈ విధ్వంసాన్నంతా పట్టుకోగలదా నాన్నా” అని!
మీరు చెప్పండి.. అది సాధ్యమా మరి?
~
మూలం: మోసాబ్ అబు తోహా
అనుసృజన: గీతాంజలి


అతని మొదటి కవితల పుస్తకం, Things You May Find Hidden in My Ear, ఏప్రిల్ 2022లో సిటీ లైట్స్ ద్వారా ప్రచురించబడింది.
ఈ పుస్తకానికి అమెరికన్ బుక్ అవార్డ్, పాలస్తీనా బుక్ అవార్డ్, ఆరోస్మిత్ ప్రెస్ వారి 2023 డెరెక్ వాల్కాట్ పోయెట్రీ ప్రైజ్ లభించాయి.
ప్రస్తుతం భార్యా, ముగ్గురు పిల్లలతో జబాలియా లోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్నాడు.

శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్‌పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964