[సంచిక కోసం వైద్యులు, కవి, అనువాదకులు డా. టి.రాధాకృష్ణమాచార్యులు గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
వరంగల్ – కరీంనగర్ సాహిత్య వారధి డా. టి. రాధాకృష్ణమాచార్యులు..!!:
“వరంగల్ నా జన్మస్థలం. కరీంనగరం నా కార్యక్షేత్రం. వరంగల్‌తో నాది విడిపోని బంధం. సాహిత్య సీమలో అది ఓ ప్రబంధం. ఇక కరీంనగరంతో నాది విడదీయరాని అనుబంధం. అది ఓ కమ్మని కావ్యం. వరంగల్ నాకు అమ్మకొంగు. కరీంనగరం నాకు నీడ పంచిన చెట్టుకొమ్మ” అంటున్న ఈ కవిగారు ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వృత్తివిద్య కంటే ముందునించే సాహిత్యం/కవిత్వం మీద ఎక్కువ మక్కువ పెంచుకున్న ఈ డాక్టరుగారు వృత్తికి, ప్రవృత్తికి ఇప్పటికీ సమానంగానే న్యాయం చేస్తున్నారు. అనువాద ప్రక్రియలోనూ తమ వంతు కృషి చేస్తున్న డా. టి. రాధాకృష్ణమాచార్యులు గారు తన సాహితీ ప్రస్థానం గురించి ఇంకా ఏమి చెబుతారో చూద్దామా!
~
జ: సాహితీమూర్తులు కస్తూరి మురళీకృష్ణ గారికి, కొల్లూరి సోమ శంకర్ గారికి, సంచిక అంతర్జాల మాసపత్రికకూ, ఈ ఇంటర్వ్యూ బాధ్యులు డా. కె. యల్. వి. ప్రసాద్ గారికి కృతజ్ఞతలు, నమస్కారం.
1. డాక్టర్ గారూ.. మీరు వృత్తిరీత్యా వైద్య రంగంలో వున్నారు కదా! ఇలా సాహిత్యరంగంలో మీరు అడుగుపెట్టడానికి వెనుక గల నేపథ్యం వివరించగలరా?
జ: డా. ప్రసాద్ గారూ.. మీకు తెలియని విషయమేమీ కాదు గానీ మనిషికి కొన్ని అభిరుచులు, ఇష్టాలు మన బతుకులో ఎంతో కొంత డామినేట్ చేయడం సహజమే కదా! అలానే నా వృత్తి వైద్యమైనా నా ప్రవృత్తి సాహిత్యంగా జీవిస్తుంది. నిజానికి వైద్యవిద్యకు ముందే దాదాపు 1970-72 ప్రాంతంలో నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే సాహిత్యంపై మక్కువ పెరిగింది. దానికి కారణం మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండడమే. చిన్నపాటి లైబ్రరీ కూడా అప్పట్లో ఉండేది. వేసవి సెలవుల్లో ఎక్కువగా తెలుగు సాహిత్య పుస్తకాలు నన్ను ఆకర్షించాయి. పుస్తక పఠనం, సాహిత్య అధ్యయనం కూడా బాగా సాగింది. అంతకు ముందు నా ఉన్నత పాఠశాల విద్యాసమయంలో తెలుగు బోధించిన ఉపాధ్యాయులు శ్రీ. సచ్చిదానంద మూర్తి సారు నుండి ఎం.ఏ.లో సినారె వంటి వారి ప్రేరణ, వారు పాఠాలు చెప్పిన తీరులోని రస సిద్ధ శక్తేదో నన్ను సాహిత్యం వైపు వాలేలా చేసింది.
2. సాహిత్య రంగంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. కానీ, వాటిలో మీరు కవిత్వానికి మాత్రమే అధిక ప్రాధాన్యత నివ్వడానికి కారణం ఏమిటి?
జ: నిజమే సార్. సాహిత్యం నిత్య ప్రవాహ జీవనది. దాని పాయలే మనం చెప్పుకుంటున్న ఈ ప్రక్రియలన్నీ కూడా. అయితే ఇష్టం ఎందుకు ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు గానీ అందుకు తపన, కష్టం, శ్రమ అన్నీ ఏకోన్ముఖంగా కృషి చేస్తే బాగుంటుంది. అలా కవిత్వం ప్రక్రియ నాకు దగ్గరగా ఉంది. నవల, కథ, కవిత్వం చదివినా కవిత్వం నన్ను అక్కున చేర్చుకుంది. ఆ రోజుల్లో రేడియోలో ప్రసారమైన లలితగీతాలు, సినిమా పాటలు వినడం వల్ల అవి నన్ను కవిత్వం వైపు నడిపించాయి. గొప్ప గొప్ప సృజనకారులు సాహితీమూర్తులు అన్ని ప్రక్రియల్లోనూ ప్రతి కాలాల్లోనూ ఉన్నారు. అయితే కవుల ప్రభావమే గాక ఆ కవిత్వంలోని సామాజిక చైతన్యం కూడా ఆ వైపు ఆలోచించేలా నన్ను నడిపించడం చెప్పుకోదగ్గది. ఆ దిశలో నా నడక, నా కృషి సాగడం నాకొక మానసిక ఉపశమనం సార్.


విస్తృత బృహత్ కుటుంబంతో అమ్మ యాది..
3. కవిత్వం రాయడం కేవలం మీ తృప్తి కోసమేనా? లేక దీనివల్ల సమాజానికి ఏదైనా ఉపయోగం ఉందని మీరు భావిస్తున్నారా?
జ: మంచి ప్రశ్న డాక్టర్ గారూ.. వృత్తిలో స్వీయ మనుగడ సామాజిక చైతన్యం రెండు పాయలూ ఉండేదే జీవితం. అయితే కవిత్వంలో సామాజిక చైతన్యం మానవీయ కోణంలో వచ్చే సృజన అభిలషణీయం. అదే సామాజిక హితం కొరకు వచ్చే కవిత్వం అని నా భావన. వైయక్తిక జీవితంలోని విలువైన సమయానికి దూరమైన సాహిత్యకారులు, కవులు కూడా ప్రేరణగా నిలిచి ముందు తరాలకు దారి దీపాలుగా ఉన్నారు. మనుషులుగా మనం మన పని చేసుకుపోవడమే మన ముందున్న కర్తవ్యం. అదే నా ఆలోచన.
వైద్యవృత్తిలో మానవీయ సామాజిక సేవ ఎంత గొప్పదో నేను చూశానూ అనుభవించాను. ఆ పద్ధతిలోనే సమాజం వైపు నా చూపూ నా ఆలోచన కూడా సారించాను. దాని ఫలితాలు కూడా నాకో స్థానాన్ని వృత్తిపరంగా అందించాయి కూడా. అందుకు గొప్ప పోషకులైన నా పేషంట్లకు కృతజ్ఞతలు. కవిత్వంలో కూడా నా అడుగులు సామాజిక సంఘర్షణ, చైతన్యం కోసం వేయాలనేదే నా తపన.
నా సాహిత్య ప్రయాణంలో గురువులు, మిత్రులు, హితులు, సహచరులు ఆత్మీయులు పాఠకులు అలా ఎందరో మార్గనిర్దేశకులు. వారందరికీ నా నమస్సులు, ధన్యవాదాలు కూడా.


అన్నదమ్ములతో రచయిత
4. మీకు ఇష్టమైన కవి ఎవరు? ఎందుచేత? ఏ కవి ప్రభావం మీపై ఉందని మీరు భావిస్తున్నారు?
జ: కవిత్వం నా జీవితంలో ఓ భాగం. సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక మజిలీ. ఇందులో ఎందరో కవులు రచయితలు స్వేచ్ఛగాలిని పంచిన వారు ఆకుపచ్చ చెట్లుగా నిలిచారు. కవుల సాహిత్యమే పాఠకులకు ఇష్టాన్ని పెంచేది. ఇది ప్రాథమిక ప్రాతిపదిక. నన్నయ్య నుండి నేటి వచన కవిత్వం వరకు సామాజిక చైతన్య నేపథ్యం స్పృశిస్తున్నవే. నాకు ఇష్టమైన కవులలో గురజాడ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ, సినారె, కుందుర్తి, తిలక్, శివారెడ్డి, గోపి వంటి వారున్నారు. కవిత్వ కడలిలో సాంద్రమైన, విస్తృతమైన, లోతైన సామాజిక నేపథ్య కెరటాలు నా కలానికి ఆలంబనగా నిలిచినవి. భాష, భావం, వస్తువు, అభివ్యక్తి, శైలి, శిల్పం వివిధ రీతుల పార్శ్వాల తాకినా సామాజిక చేతనే బహుళంగా కనిపిస్తుంది. పాఠకుడికి పుస్తకంలో ప్రతి పేజీ చదివిన సంపూర్ణ సంతృప్తి దొరికేది. అలాగే కవిత్వమనే గ్రంథంలో అన్ని పేజీలూ చదివి ఆకళింపు చేసుకోవడం ప్రతి కవికీ తప్పక ఉండే లక్షణం. అందుచేత ప్రతి కవీ నిత్యపాఠకుడే. ఇది కవిత్వం నాకు బోధించిన పాఠం. సామాజిక స్పృహను కవిత్వంలో రంగరించి చైతన్యం నింపిన ప్రతి కవి స్పర్శ నాకు ఆశావాదం. వారి కవిత్వం గొప్ప ఆలంబన.
5. వచన కవిత్వంలో మళ్ళీ ఈమధ్య కాలంలో పొట్టి కవిత, నానీలు, హైకూలు వంటి అనేక ప్రక్రియలు వెలుగు చూస్తున్నాయి. వీటిపై మీ ఉద్దేశ్యం ఏమిటి? వివరంగా చెప్పండి.
జ: తెలుగు సాహిత్యం చాలా ప్రాచీనమైనది. కవిత్వం కూడా అంతే. ప్రాఙ్నన్నయ కాలం నుండి తెలుగు కవిత్వం వివిధ ప్రక్రియల్లో వెలుగుతూ విలక్షణ భావోద్వేగాల పాయలతో సాగుతున్న జీవనది. మరిన్ని కొత్త ప్రక్రియలు జత చేరడం మంచి పరిణామమే. ఆహ్వానించాలి కూడా. ఇటీవల వచన కవిత్వంలో హైకూలు, మినీ కవితలు, నానీలు వంటి ప్రక్రియల్లో కవిత్వం వస్తున్నది. మంచిదే. కవిత్వం కవిత్వమే. మరి ఏ ప్రక్రియలో ఉన్నా ఏ రూపంలో వచ్చినా అందులోని జీవం కవిత్వ విన్యాసమైతే పాఠకులు ఆదరిస్తే సంతోషకరం. ఇంకా చెప్పాలంటే అది ఆరోగ్యకరం కూడా. శైలి శిల్పం, నడకలో కొత్తదనంతో వచ్చే ఏ ప్రక్రియైనా కవిత్వ సాంద్రతతో ఆదరణ పొంది కాల పరీక్షకు నిలబడినప్పుడు మంచి ప్రక్రియగా జీవిస్తుంది. హైకూలు, చిన్న కవితలు, నానీలు కూడా ఆ కోవలోనివే. బహుళ ఆదరణ పొందినవి. వర్తమాన వర్ధమాన కవులకు అందివచ్చిన కవిత్వ ప్రక్రియ నానీలు. విరివిరిగా నానీల కవిత్వం వస్తున్నది. నా కలం నుండి జాలువారిన ‘గునుగు పూలు’ నానీల కవిత్వం 2004లోనే వచ్చింది.
6. కుందుర్తి, వీర్రాజు గారు వంటి సాహిత్యకారులు వచనకవిత్వానికి ప్రాధాన్యతనిస్తూ నవల, కథ, ప్రక్రియలను కూడా వచన కవిత్వరూపంలో తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది అంతగా ప్రాచుర్యం పొందక పోవడానికి గల కారణం ఏమిటి?
జ: భావ అభ్యుదయ కవిత్వానంతరం వచన కవిత్వం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ప్రక్రియ. పద్రకవిత్వంలోని ఛందోబద్ధమైన సంకెళ్లు విరిచి ఊపుతూగుతో స్వేచ్ఛగా సరళంగా సాగే వచనకవిత పాఠకులను ఎంతగానో హత్తుకున్నది. కుందుర్తి ఈ ప్రక్రియను చక్కగా పెంచి పోషించారు. ఒక వ్యవస్థలా దీన్ని ప్రచారంలోకి తెచ్చారు. అందుకే వచన కవితాపితామహుడు ఆయన. నగరంలో వాన కూడా తెచ్చారు. ఇప్పటికీ ఉధృతంగా కొనసాగుతున్ననదీ ప్రక్రియ. నవల, కథ వంటివి శీలా వీర్రాజు, కుందుర్తి వంటి కవులు, రచయితలు వచనకవిత్వంగా వచ్చినా అంతగా ప్రాచుర్యం పొందలేదని చెప్పలేము. అన్నింటికీ పాఠకుల నాడి కేంద్రకం.
వాళ్ళ అభిరుచి, మూడ్ గొప్ప కొలబద్దలు.


7. ఈ మధ్యకాలంలో పద్యం రాసేవాళ్ళు తక్కువై పోతున్నట్టుగా అనిపిస్తున్నది? దీనికి కారణం ఏమిటంటారు? పద్యాన్ని భావితరాలు మరచిపోయే పరిస్థితి రాబోతుందని మీరు భావిస్తున్నారా?
జ: సృజన సర్వకాల సార్వజనీన జీవక్రియ. కాలాలను పాఠకులను బట్టి ప్రక్రియల ఆదరణ ఉంటుంది హెచ్చు తగ్గుల పరిమాణంలో. చదువరులలో ఉత్సుకత రేకెత్తించే పద్యం కూడా ఇంకా సజీవమే. రాసే కలాలు, చూసే ధోరణి, రీడర్స్‌ను ఆకట్టుకునే తీరు చాలా ప్రభావితం చేసే లక్షణాలు. సమాజం స్వేచ్ఛగా బతుకుతున్నంత కాలం కవిత్వం జీవిస్తుంది. లేకున్నా అదే స్వేచ్ఛ కోసం కవిత్వం యుద్దం కూడా చేస్తుంది. సమాజహితమే కవిత్వం. అది చెరిగిపోని చరిత్ర కదా.
8. అనువాద ప్రక్రియపై మీ అభిప్రాయం ఏమిటి? అనువాద ప్రక్రియపై మీరు మక్కువ చూపడానికి కారణం ఏమిటి? అనువాదం చేయడంలో గల సాదకబాధకాలను, మీ అనుభవాలతో క్రోడీకరించి చెప్పండి.
జ: అనువాదం ఎంత గొప్ప మాట. ఇది లేని ప్రపంచాన్ని నేడు ఊహించగలమా! అనువాద కవిత్వం ఇప్పుడు ప్రభావిత క్షేత్రంగా బలంగా సృజనలోకంలో నిలబడ్డది. అన్ని ప్రక్రియ ల్లాగే అనువాద ప్రక్రియ తెలుగు సాహిత్యంలో, కవిత్వంలో రాణిస్తున్నది. అయితే చదువరుల అభిరుచి, దృష్టికోణం ప్రసరిస్తున్న ముఖ్య ప్రక్రియల్లో అనువాదం కూడా మనగలగడం సంతోషించదగ్గ పరిణామమే. ఇక నాకు కవిత్వం గొప్పగా తోస్తే అనువాదం చేయాలనే ఆలోచన తన్నుకొస్తుంది. అదీ తెలుగు నుండి ఆంగ్లంలోకీ, ఇంగ్లీష్ నుండి తెలుగులోకి. అలా కొన్ని అడపాదడపా అనువదించాను. వచన కవితను ఫ్రీ వర్స్‌లో, వ్యాస సంపుటిని prosody లో అనువదించాను. అదే స్ఫూర్తితో నలిమెల భాస్కర్ సాహితీ సుమాలు తెలుగు వ్యాస సంపుటిని ‘ది స్పీకింగ్ రూట్స్’ గా ఆంగ్లంలోకి అనువాదం చేశాను. సృజన అనుసృజనలు సమాంతరాలు కాదు సాపేక్షసావాసాలు. అనువాదం మూల సృజన భాషాంతరీకరణ మాత్రమే కాదు సృజనాత్మ సాహితీ విలువల విలక్షణ ఆవిష్కరణ కూడా. ఇది కత్తి మీద సాములాంటిదే. స్వీయ కవిత కన్నా అనువాద కవిత ఎప్పుడూ గొట్టే. గీసిన గిరిలో స్వేచ్ఛ వికసించడం పరిమితం. అదే అనువాదం. ఆలోచన స్వేచ్ఛగా విస్తృతంచేయడం స్వీయ సృజన. అది మైదానం.


మౌనం మాట్లాడింది ఆవిష్కరణ సభలో మేడమ్ ప్రొ. కాత్యాయని విద్మహే ముఖ్య అతిథిగా..
9. ఒకప్పుడు శరత్ చంద్ర వంటి బెంగాలీ రచయితల సాహిత్యం తెలుగు అనువాదాలుగా వచ్చి మంచి ప్రాచుర్యం పొందింది. వాటికి పాఠకుల స్పందన కూడా అధికంగా ఉండేది. ప్రస్తుతం అలాంటి వాతావరణం కనిపించడం లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: సృజన ప్రపంచ యవనికపై నేడు విస్తృత విన్యాసం చేసే ఉత్పేరక స్వేచ్ఛ.
కారణం సాంకేతిక విప్లవం. గాడ్జెట్స్ అందుబాటులో ఇంటి ముందుండడమే.
కలం కాగితం స్థానంలో లాప్టాప్, సెల్ డ్రివెన్ బై ఫింగర్స్ పద్ధతి సర్వసాధారణంగా కనిపిస్తున్నది. శరత్ నవలలు బెంగాలీ నుండి సాహిత్యానువాదాలుగా వచ్చాయి నిజమే. ఇవి ఇతివృత్త ప్రధానంగా నిలబడ్డవి. సమాంతరంగా ఇతర భాషల్లోంచీ వచ్చినా పేరెన్నికగన్నవిగా వెలుగు చూడకపోవచ్చు. కొత్తను ఆహ్వానించి స్వీకరించడం నేటి పాఠకుల్లో ఎక్కువే మరి. ఇరుగు పొరుగు, ఆదాన్ ప్రదాన్, ఇచ్చిపుచ్చుకోవడం వంటి భాషాంతరీకరణ ప్రయత్నాలు బలమైన గొంతుకతో వస్తున్నాయి. అది మంచిదే. ఆహ్వానిద్దాం. కళల పరిణామ క్రమంలో కాలానిదే ముఖ్య భూమిక ఎప్పుడూ కదా! పని చేసుకుపోవడమే కలాల పని.


10. ఇతర భాషా సాహిత్యం అనువాదాలతో పోలిస్తే, తెలుగు సాహిత్యం అంతగా అనువాదాలకు నోచుకోవడం లేదనే మాట అక్కడక్కడా వింటుంటాం. మరి, మీరేమంటారు?
జ: అనువాదాలు తెలుగులో కూడా వస్తున్నాయి. ప్రతి ప్రక్రియలోనూ రాశి కన్నా వాసి గొప్పది. ఒకప్పుడు తెలుగులో అనువాద ప్రక్రియలో వాల్యూమ్ తగ్గినా ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా తెలుగులో కవులు, రచయితలు విశేషంగా కృషి చేస్తున్నారు. అనువాద పొత్తాలూ గణనీయంగా వస్తున్నాయి. ఇక అవరోధమల్లా అనువాద మాధ్యమం ఆంగ్ల భాషగా ఉండడమే. మూల భాష నుండి ఆంగ్లంలోకి అటునుండి మరేదైన ఇతర స్థానీయ భాషల్లోకి వస్తున్నాయి కదా. ఇంగ్లీషుభాషపై పట్టు సాధించడం అంత సులువు కాదు. అందుకే సీదాగా స్థానిక భాషల నుండి స్థానీయ భాషలోకి తర్జుమా కొంత వెసులుబాటు కావొచ్చు. అనుకూలతా కల్గించనూ వచ్చు. ఏది ఏమైనా ఇంకా సాంద్రత పరిమాణం పెంచే దిశలో అనువాద సృజనను కొత్తతరం కవులు అనువాదకులు దృష్టి సారిస్తే మంచి పరిణామమే.
అటుగా అడుగులు పడుతాయని ఆశించమే గొప్ప తపన.


మౌనం మాట్లాడింది కవితా సంపుటిలో సినారె అభిప్రాయం
11. మీ రచనా వ్యాసంగం (ముద్రించిన కవితా సంపుటాలు, వగైరా) గురించి విపులంగా చెప్పండి.
జ: సర్, నేను విద్యార్థి దశనుండే కవిత్వ అధ్యయనంతో పాటు సాధనా భ్యాసం చేస్తున్నాను. కానీ రాసిందేదో దాచిన అలవాటు నాది. కానీ కరీంనగర్ సాహితీ క్షేత్రంలో మిత్రులు వారాల ఆనంద్, నలిమెల భాస్కర్ల చొరవ సహకారంతో ఆ కవిత్వ గనిని తవ్వి కొన్ని కవితలను ఏరి నా తొలి కవితాసంపుటిని ‘మౌనం మాట్లాడింది’ టైటిల్‌తో 1999లో వెలుగీకరించాను. అందుకు ధన్యవాదాలు ఎలా చెప్పినా వారి కృషి తీరని దాహంలా నాలో ఎప్పుడూ సజీవమే.
ఇక 2000లో ‘ఎడారి దీపం’ కవిత్వం వచ్చింది.
2001లో ‘భూమి పొరల్లోంచి’ కవిత్వం వెలుగుచూసి కవిత్వ హాట్రిక్ సాధించాను. కొంత విరామం తర్వాత 2004లో ‘గునుగు పూలు’ నానీలు, 2006లో ‘దేహం కురిసిన వర్షం’ కవిత్వం కన్ను తెరిచాయి. అప్పటినుండి ధారగా వస్తూనే ఉంది. స్వతహాగా వైద్యుణ్ని నేను. వృత్తిపనిలో ఒత్తిడి కారణంగా సమయం దొరికినప్పుడు, వీలున్నప్పుడు కవిత్వం నన్ను ఆవహించినప్పుడు సృజన ముందుకు సాగేది. అలా మరి కొంత విరామం తర్వాత 2019 లో కరోనా కాలంలో నలిమెల భాస్కర్ భారతీయ సృజనకారుల వ్యాస సంపుటిని ఇంగ్లీష్ లోకి ‘ది స్పీకింగ్ రూట్స్’ గా అనువదించాను.


కవిగారి రచనలు
12. సాహిత్య రంగంలో మీరు పొందిన సన్మానాలు, అవార్డుల గురించి వివరించండి.
జ: అవార్డులూ లేవు సన్మానాలూ లేవు. సాహితీ మిత్రుల ప్రశంసలు, మాత్రమే ఉన్నవి. ముఖ్యంగా 1976 ప్రాంతంలో నాటి ఆంధ్ర సారస్వత పరిషత్‌లో నా తొలి కవిత ‘కష్ట జీవి’ చూసిన పిదప శ్రీశ్రీ గారు స్వీయ దస్తూరితో నాకందించిన అభినందన వాక్యం ‘విజయం చేకూరే వరకు విశ్రమించవద్దు’ అదే నాకు జీవితంలో గొప్ప ఆటోగ్రాఫ్ కూడా (ఫైల్ మిస్సైంది).
13. వరంగల్, కరీంనగర్ ప్రాంతాలతో మీకు మంచి అనుబంధం వుంది కదా! అక్కడి సాహిత్యరంగాలపై మీ అవగాహన ఎలాంటిది? వివరించండి.
జ: వరంగల్ నా జన్మస్థలం. కరీంనగరం నా కార్యక్షేత్రం. వరంగల్‌తో నాది విడిపోని బంధం. సాహిత్య సీమలో అది ఓ ప్రబంధం. ఇక కరీంనగరంతో నాది విడదీయరాని అనుబంధం. అది ఓ కమ్మని కావ్యం. వరంగల్ నాకు అమ్మకొంగు. కరీంనగరం నాకు నీడ పంచిన చెట్టుకొమ్మ. వరంగల్ పుట్టుకైతే సృజనలో కరీంనగర్ నాకు బతుకు.
14. ప్రస్తుతం కవిత్వం రాసే ప్రయత్నం చేస్తున్న లేలేత కవులకు/కవయిత్రులకు మీరిచ్చే సందేశం?
జ: ఇప్పుడు వస్తున్న కవిత్వం గాఢ సాంద్రత గలిగినది, లోతైనది. విశాలమైనదిగా ఉంటున్నది. మంచి మంచి కవితలు వివిధ పత్రికల సాహిత్య పేజీల్లో కనిపిస్తున్నవి. అదీ కాక సంకలనాల రూపంలో కవిత్వం విస్తృతమౌతున్నది. ఇది శుభ పరిణామం.
ఇక కవిత్వం రాయాలనే తపన గల కవులకు, కవయిత్రులకు సలహా కాదు కానీ నా అనుభవాన్ని పంచుకోగలను. ఏ రంగంలోనైనా రాణించాలనే తపనతో కృషి చేయడం పరిపాటి. కానీ టైమ్, లక్ కలిసిరావాలి. కవిత్వంలో ముఖ్యంగా అధ్యయనం, అభ్యాసం రెండు గొప్ప మూలాలు. సాధనతో లక్ష్యం వైపు నడిచేందుకు ఈ రెండూ ఎంతో అవసరం అని నా నమ్మిక. అందుకే విస్తృతంగా చదువాలి. ఔపోసన పట్టాలి. కొత్తగా ఆలోచించాలి. విజయ తీరాలను అందుకోవాలి.
~
* మీ సమయాన్ని వెచ్చించి మీ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.
జ: నా అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు మీకూ, పత్రిక యాజమాన్యం వారికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
25 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక మాసపత్రిక సంపాదకులకు
ఇతర సాంకేతిక నిపుణులకు
హృదయ పూర్వక ధన్యవాదములు.
K. Ravindra chary
Excellent ఇంటర్వూస్. Wonderful questionsquestiobs by the interviewer and very appropriate answer by the interviewd. Salutes to the noble literary giants.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir
V.Madhu prasad
Nice.. ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఏక బిగిన చదివించేలా ఉంది కవి నేపథ్యం, అనుభవాలు, సాహితీ కృషి ఆకట్టుకున్నాయి. ఇలా నిస్వార్ధంగా సాహితీ సేద్యం చేసే వారిని అవార్డులు.. రివార్డుతో ప్రోత్సహించడం తక్షనవసరం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు సర్.
కొల్లూరి సోమ శంకర్
ఇది ఈతకోట సుబ్బారావుగారి వ్యాఖ్య: *అభినందనలు సార్. చదువుతాను సార్. అనుమానం లేదు సార్ మీ కవిత్వం లా పదును గా ఉంటుంది.
– ఈతకోట సుబ్బారావు, నెల్లూరు*
డా కె.ఎల్.వి.ప్రసాద్
సుబ్బారావు గారు
ధన్యవాదాలు మీకు.
కొల్లూరి సోమ శంకర్
This is a comment by Dr. K. G. Venu: * Congratulations sir.
Dr.K.G.Venu, Poet&Writer, Vizag.*
డా కె.ఎల్.వి.ప్రసాద్
వేణు గారూ
ధన్యవాదాలు
కొల్లూరి సోమ శంకర్
This is a comment by Mr. K. Prashanth: *Dr.Saab, Good Morning,
Your remarkable journey is truly inspiring, as you skillfully navigate two parallel paths with ease – the track of medicine and the track of literature. This exceptional feat is a testament to the power of passion, demonstrating that when driven by genuine interest and dedication, multiple pursuits can not only coexist but thrive.
Your ability to balance the precision of medicine with the creativity of poetry is a rare gift, and your accomplishments in both fields are a shining tribute to your versatility and talent.
As a doctor, your expertise heals bodies, while as a poet, your words nourish souls.
Your dual passions have created a unique synergy, enriching the lives of those touched by your work. A rare gift, your work inspires others.
Please continue to ride your bogey of life on these two parallel tracks, inspiring others with your remarkable journey.
To SUMMARISE:
A healer by profession, a wordsmith by passion.
HAVE A NICE DAY.
*********
Prashanth K.*
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir
కొల్లూరి సోమ శంకర్
ఇది కె. విజయ గారి వ్యాఖ్య: *ఆయన జవాబుల్లో కూడా కవితలు తొంగి చూస్తున్నాయి. ఇంత మంచి విషయాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు సర్. – శ్రీమతి విజయ.కె., హైదరాబాద్.*
డా కె.ఎల్.వి.ప్రసాద్
విజయ గారూ
నమస్సులు.
కొల్లూరి సోమ శంకర్
ఇది విల్సన్ రావు కొమ్మవరపు గారి వ్యాఖ్య: *ఇంటర్వ్యూ బాగుంది సార్. మంచి ప్రశ్నలు సంధించారు, అందుకు తగిన సమాధానాలు కూడా రాబట్టారు. రెండు మూడు చోట్ల సమాధానాలు పునరుక్తిలా ఉన్నాయి. మంచి ముఖాముఖి. -విల్సన్ రావు కొమ్మవరపు.*
డా కె.ఎల్.వి.ప్రసాద్
కవి గారి స్పందనకు
ధన్యవాదాలు.
కొల్లూరి సోమ శంకర్
ఇది హోతా పద్మినీదేవి గారి వ్యాఖ్య: *బాగుంది సర్. అభినందనలు. -పద్మినీదేవి.హోతా*
డా కె.ఎల్.వి.ప్రసాద్
పద్మినీదేవి గారికి
ధన్యవాదాలు.
కొల్లూరి సోమ శంకర్
ఇది సంగెవేని రవీంద్ర గారి వ్యాఖ్య: *Dr.Sab.. చాలా విషయాలు తెలిపారు.. you are great Sir.. మీకూ dr. ప్రసాద్ గారికి అభినందనలు

– సంగెవేని రవీంద్ర, ముంబై.*
డా కె.ఎల్.వి.ప్రసాద్
రవీంద్ర గారు
ధన్యవాదాలు.
కొల్లూరి సోమ శంకర్
ఇది నందిని సిధారెడ్డి గారి వ్యాఖ్య: *అభినందనలు మిత్రమా. – నందిని సిధారెడ్డి, కవి,సాహితీవేత్త, హైదరాబాద్.*
డా కె.ఎల్.వి.ప్రసాద్
సిధారెఢ్ఢి గారికి
కృతజ్ఞతలు.
పుట్టి నాగలక్ష్మి
కవిత్వం గురించిన విషయాలను ప్రశ్నలు గా సంధించిన డా. కె. యల్వీ.ప్రసాద్ గారికి, వివరంగా సమాధానాల రూపంలో తెలియజేసిన డా. టి. రాధాకృష్ణమాచార్యులు గారికి ధన్యవాదాలు..

డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదములు
D.Nagajyothi
గొప్ప కవిత్వ అంతరంగాన్ని చక్కని చిక్కని ప్రశ్నావళి తో ఆవిష్కరించారు. చాలా బావుంది అండీ ఇంటర్వ్యూ. చాలా విషయాలు గ్రహించడానికి ఆస్కారం కల్పించినందుకు డాక్టర్ గారు మీకు, శ్రీ కృష్ణమాచార్యులు గారికి ధన్యవాదాలు అండీ–నాగజ్యోతిశేఖర్, మురమళ్ల
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదములు మీకు.