బహుముఖీన ప్రతిభ – శ్రీమతి శీలా సుభద్రాదేవి..!!


***
ప్ర: సుభద్రాదేవి గారూ.. సంచిక అంతర్జాల పత్రిక పక్షాన మీకు స్వాగతం.. నమస్కారం.
జ: నమస్కారం ప్రసాద్ గారూ.
ప్ర: రచనా వ్యాసంగం పట్ల మీకు దృష్టి ఎప్పుడు, ఎలా మళ్లింది? దాని నేపథ్యం వివరించండి.
జ: మా పెద్దక్క పి.సరళాదేవి తెలుగు స్వతంత్రలో విరివిగా రచనలు చేసేది. మాలతీచందూర్, పి.శ్రీదేవి, రామలక్ష్మిల సమకాలీనురాలు. డా.శ్రీదేవి అక్కకు మంచి మిత్రురాలు. నేను కుటుంబ పరిస్థితుల వలన ఎనిమిదవ తరగతితో చదువు మానేసి ఏడాది పాటు గోపన్నపాలెం అక్క ఇంట్లో ఉన్నప్పుడు బడికి వెళ్ళకపోవటం వలన అక్క ఇంట్లోని గ్రంథాలయంలో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్థం అయినా కాకపోయినా విరివిగా చదివాను. నేను రచయిత్రిగా మారటానికి దోహదం చేసింది అక్క వాళ్ళింట్లో ఉన్న సమయమే అనుకుంటాను. ఒకరోజు ఏలురులో ఆవంత్స సోమసుందర్ గారికి జరిగిన సత్కార సమావేశనికి అక్కతో పాటూ వెళ్ళాను. సభానంతరం ఒక సాహితీ మిత్రుడి ఇంటి డాబా పైన వెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది. ప్రముఖ కవుల కంఠంలో కవిత్వం వినటం నాకు అద్భుతంగా అనిపించింది. అంతవరకూ కథలూ, నవలలూ చదివాను. ఇంటికివెళ్ళాక కవిత్వం పుస్తకాలు అక్కని అడుగుతే శ్రీశ్రీ మహాప్రస్థానం, కృష్ణశాస్త్రి ఊర్వశి, ముద్దుకృష్ణ వైతాళికులు ఇచ్చింది. అందులో నాకు నచ్చినవి ఒక పుస్తకంలో కాపీ చేసుకున్నాను.


భర్త.. శ్రీ శీలా వీర్రాజు గారితో శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు
ప్ర: మీరు చదువుకునే రోజుల్లో, భవిష్యత్తులో మంచి రచయిత్రి కావాలని కోరుకున్నారా? లేక యాదృచ్ఛికంగా ఈ నాటిస్థాయికి చేరుకున్నారా?
జ: అక్క ఇంటినుండి తిరిగి విజయనగరం చేరిన తొమ్మిదవ తరగతిలో చేరాను. మా తెలుగు మాష్టారు ఛందస్సు చెప్తే ఆటవెలదిలో మాష్టారు మీద పద్యం రాసి చూపిస్తే ఆయన పొంగిపోయి నువ్వు మంచి కవయిత్రి అవుతావని దీవించారు. మాష్టారు ఒక లిఖిత పత్రికను మొదలు పెడితే అందులో పద్యాలు, కవితలూ రాసేదాన్ని. అందులో ఒకటి “నా బొమ్మే నా చెల్లి” అని పదకొండు ద్విపద పద్యాల్లో రాసాను. బహుశా నా దీర్ఘ కవితా ప్రస్థానానికి అది తొలిమెట్టు కావచ్చు. మా అక్కనీ, అన్నయ్యలనీ రచయితలుగా చూస్తూ ఉండటం వలన మనసులో ఏమూలో రచయిత్రి కావాలనే కోరిక రెక్కవిప్పుకొనే వుంటుంది.


కూతురు-మనవరాలితో వీర్రాజు గారు, సుభద్రాదేవి గారు
ప్ర: మీ పుట్టినిల్లు, మెట్టినిల్లు, సాహిత్య వాతావరణం పుష్కలంగా కలిగి ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే! మీరు గొప్ప రచయిత్రిగా ఎదగడానికి ఎక్కడ వీలయింది? ఎందుచేత?
జ: చిన్నప్పుడు అక్క పంపిన బొమ్మల పుస్తకాలూ, అన్నయ్య కొన్న చందమామ, వారపత్రికలూ నేను చాలా చిన్నప్పుడే పఠనాసక్తిని పెంచాయి. అక్కయ్య, అన్నయ్యల కథలు పత్రికల్లో పడినప్పుడు కాలేజీ రోజుల్లో నాకూ రాయాలనే కోరిక పెరిగింది. అప్పట్లోనే కొన్ని కథలు రాసాను. వీర్రాజు గారు పరిచయం అయ్యాక పత్రికలకు పంపాను. పెళ్ళికి ముందే 1970 లో మొదటికథ ప్రచురితం అయ్యింది. పంపిన నాలుగైదు కథలు ప్రచురితం అయ్యాయి. ఉమ్మడి కుటుంబంలో కథ రాసేంత సమయం సమకూర్చుకోలేక రాయలేక పోయాను. ఆరేడేళ్ళు గడిచాక మళ్ళా రాయటం మొదలుపెట్టాను. తర్వాత మరి వెనక్కి చూడలేదు. రాస్తూనే ఉన్నాను.
ప్ర: మీరు కథలు రాశారు, కవిత్వం రాశారు, వ్యాసాలు రాస్తున్నారు. కానీ మీ కలం కవిత్వం వైపు మొగ్గు చూపుతుందని మీ రచనలను గమనిస్తున్న నాబోటి పాఠకులకు అనిపిస్తుంది. ఇది నిజమేనా? ఎందుచేత?
జ: పెళ్ళయ్యాక ముఖచిత్రాల కోసం కవులు రావటం, కవితా సంపుటాలు ఎక్కువగా ఉండటంతో కవితలు రాయటానికి మొగ్గుచూపాను. చిన్న స్పందన చాలు కవిత రాయటానికి. కానీ కథ రాయాలంటే మంచి అంశం, పాత్రలూ, సంఘటనలూ, సంభాషణలు, ఆకట్టుకునే ముగింపు. ఇవన్నీ ఆలోచించే సావకాశం లేక అరుదుగా కథలు రాసాను.


‘శ్రీ గంగిశెట్టి లక్ష్మినారాయణ మాతృ శ్రీ పురస్కారం’ అందుకుంటున్న శ్రీమతి సుభద్రాదేవి గారు
ప్ర: మీరు ‘ఇస్కూలు కథలు’ అనే కధాసంపుటి వెలువరించారు. ఈ కథలు రాయడానికి మిమ్ములను ప్రేరేపించిన అంశాలు ఏమిటి?
జ: మాది ఎయిడెడ్ పాఠశాల కావటం వలన విద్యార్థులందరూ ఆ పరిసరాల్లోని బస్తీలో పిల్లలే. వాళ్ళతో కలిసి మెలిసి ఉండటంలో వాళ్ళ కుటుంబ నేపథ్యాలు, ఆడపిల్లల చదువులకు కలిగే అవరోధాలూ, వారిపై ప్రభావాలూ, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందుల తీరుతెన్నులు ఇవన్నీ పాఠశాల అభివృద్ధిపై, విద్యపై చూపే ప్రభావాలని కథలుగా రాయాలనుకున్నాను. తెలుగువిద్యార్థి మాసపత్రిక రెండున్నర సంవత్సరాలు నా ఇస్కూలు కతలను ధారావాహికగా ప్రచురించింది. అందులో మొదటి కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ద్వితీయ భాష తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా తీసుకుంది.


ప్ర: దీర్ఘ కవితల ద్వారా మీరు మంచి పేరు సంపాదించారు. అయితే ఈ ప్రక్రియకు భవిష్యత్తు ఉంటుందంటారా? ఎందుచేత?
జ: లఘుకవితలైన హైకూలు, మినీ కవితలు అప్పటి కప్పుడు చమక్మనిపిస్తాయి. కానీ అవి కవితా రంగంలో ఎక్కువకాలం నిలవవని నా అభిప్రాయం. ఒకటి రెండు పేజీల కవితా ఖండికలు ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని గూర్చి పాఠకుల్ని ఆలోచింప చేయగలవు. ఇక మొదటినుంచీ చివరివరకూ ఒక సుదీర్ఘ అంశాన్ని డీవియేట్ కాకుండా దీర్ఘ కవితగా కవిత్వీకరించటంలోనే కవి ప్రతిభ తెలుస్తుంది.


తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకుంటున్న సుభద్రాదేవి గారు.
ప్ర: మీరు వీర్రాజు గారి జీవితంలో ప్రవేశించేనాటికే ఆయన సాహిత్య రంగంలోనే కాక, చిత్రకారునిగా మంచి పేరు పొందారు. చిత్ర కళలో మీకు అప్పటికే ప్రవేశం ఉన్నప్పటికీ, ఎందుకో మీరు నిర్లక్ష్యం చేసినట్టు కనిపిస్తుంది. అలా ఎందుకు జరిగింది? ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా?
జ: చిన్నప్పటినుంచి బొమ్మల పుస్తకాలలోని చిత్రాలు చూసి వేసేదాన్ని. చిన్నప్పుడు ఢిల్లీ శంకర్స్ వీక్లీ వారి చిత్రలేఖన పోటీలో కూడా పాల్గొన్నాను. తర్వాత వారపత్రికలోని బాపూ బొమ్మల్ని అత్యంత ప్రేమతో వేసేదాన్ని. పెళ్ళయ్యాక వీర్రాజు గారు ప్రోత్సహించారు కానీ ఏకాగ్రతతో దీక్షగా వేయాల్సిన కళ చిత్రలేఖనం. పిల్లలతో ఉమ్మడి సంసారంలో ఎక్కడ కుదురుతుంది? వీర్రాజు గారు తైలవర్ణ చిత్రాలు వేస్తున్నప్పుడు నాకు వేయాలనిపించేది రిటైర్ అయ్యాక వేయాలనుకున్నాను. స్కెచ్ బుక్ కూడా కొనుక్కొని ఒకటి రెండు పెన్సిల్ స్కెచ్ వేసాను. అక్షరాలు రాయటం అలవాటైన వేళ్ళు చిత్రాలవైపు సాగటం లేదు.
ప్ర: ఈమధ్య అంతర్జాల పత్రికలదే ‘హవా’ అన్నట్టుగా వుంది. తెలుగు సాహిత్య పురోగతికి ఇవి ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయి? మీ అభిప్రాయం చెప్పండి.
జ: పుస్తకం ప్రచురణ, అమ్మకం కూడా సాహితీవేత్తలకు మోయలేని భారమయ్యింది. వేసిన పుస్తకాల్ని అమ్ముకోవటం కూడా ఒక కళగా మారింది. ప్రింట్ పత్రికలు తగ్గిపోయాయి కనుక సాహిత్యకారులందరూ తమ రచనలకు ఒక వేదిక కావాలి. కనుక అటువైపు చూడటం మొదలు పెట్టారు. టెక్నాలజీ తెలిసినవారు అంతర్జాల పత్రికలు అనుసరిస్తారు. అయితే ఎప్పటిలాగే రకరకాల రచనలు అంతర్జాల పత్రికలలో వస్తున్నాయి. కాలగతిలో ఏవి నిలుస్తాయో కాలమే నిర్ణయించాలి. ప్రతీ వాటికీ వాటి పాఠకులు వారికి ఉంటారు కదా.


ఉమ్మిడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం అందుకుంటున్న శ్రీమతి సుభద్రాదేవి గారు
ప్ర: వృత్తికి, ప్రవృత్తికి మీరు ఎలా న్యాయం చేయగలిగారు? ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా? వాటిని ఎలా పరిష్కరించుకోగలిగారు?
జ: వృత్తీ, ప్రవృత్తి రెండూ వేర్వేరు ఛానల్స్. స్కూల్లో, విద్యార్థుల్లో, వారి నేపథ్యాల్లో బోధనేతర పనుల్లో (సర్వే), జీవితపోరాటాల్లో నేను ఎప్పటికప్పుడు నాకు రచనలకు కావలసిన అంశాల్ని ఏరుకునే దాన్ని. నాకు సమయం కుదిరినప్పుడు ఎక్కువగా కవితలుగా రాసేను. కొన్నింటిని కథలుగా రాసాను. నాకు ఆ రోజుల్లో ప్రధాన సమస్య సమయమే. అందులోను నేను ఎక్కువగా రాసేది రాత్రి పూటే.
ప్ర: కథకు గాని, కవిత్వానికి గాని, ఎలాంటి వస్తువుని తీసుకోవడానికి మక్కువ చూపుతారు? ఎందుచేత?
జ: చిన్న స్పందన గాని, ముల్లులా గుచ్చుకునే సన్నని బాధ గానీ, మనసుని కల్లోలపరచే సమాజంలోని సంక్షోభ సందర్భాలు కానీ నన్ను కవిత రాయకుండా ఉండలేని పరిస్థితిని కల్పిస్తాయి. కథ రాయాలంటే వస్తువు సంఘటనలనీ, దృశ్యాల్నీ, పాత్రల్ని సమకూర్చుకునేలా ఉండి ఆకట్టుకునే ముగింపు చేయగలిగినప్పుడే రాస్తాను. అందుకే నేను కథలు తక్కువ రాసాను.


శ్రీ కుందుర్తి సభలో ప్రసంగిస్తూ శ్రీమతి శీలా సుభద్రాదేవి
ప్ర: శ్రీ శీలావీ – మీరు, సాహిత్య రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు. సాహిత్య పరంగా మీకు వారసులున్నారా? వారి గురించి చెప్పండి.
జ: మా అమ్మాయి పల్లవి తెలుగుకన్నా ఆంగ్ల సాహిత్యం ఎక్కువగా చదువుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో రాయటానికి ప్రయత్నించలేదు. ఆరేళ్ళ క్రితం ఉద్యోగం మానేసి ఎమ్మే ఇంగ్లీష్, జర్మన్ భాష సర్టిఫికేషన్ చేసింది. గత ఏడాదిగా తెలుగు సాహిత్యం చదువుతూ కవితలూ, ఆర్టికల్స్ రాస్తోంది. అనువాదాలు చేయాలనుకుంటుంది. మా మనవరాలు తెలుగు పుస్తకాల కన్నా ఆంగ్ల సాహిత్యం విపరీతంగా చదువుతుంది. తర్వాత ఎప్పుడో సాహిత్యం లోకి వస్తుందేమోనని చిగురాశ.
ప్ర: అనువాద ప్రక్రియ పై మీ అభిప్రాయం ఏమిటి? అనువాదానికి నోచుకున్న మీ రచనల గురించి వివరించండి.
జ: వీర్రాజు గారి నవల ‘మైనా’, నా దీర్ఘకవిత ‘యుధ్ధం ఒక గుండె కోత’ ఆంగ్ల, హిందీ, తమిళ భాషల్లోకి అనువాదమై గ్రంథరూపంలోకి వచ్చాయి. వీర్రాజు గారి కథా సంపుటి, నా కవితా సంపుటి ఆంగ్లానువాదపుస్తకాలు వెలువడ్డాయి. మా ఇద్దరి రచనలూ కన్నడ, మైధిలీ వంటి ఇతరభాషలలోకీ అనువాదమయ్యాయి. ఇతర భాషల నుండి తెలుగు లోకి వచ్చినంతగా తెలుగు పుస్తకాలు ఇతరభాషల్లోకి వెళ్ళలేదు. అనువాదం కావటం ఒక ఎత్తైతే వాటిని సమర్థవంతంగా ఇతర రాష్ట్ర సాహితీవేత్తల దృష్టిలో పడేలా ప్రచారం చేసుకోవటం మరో ఎత్తు. అది మాకైతే చాతకాలేదు.
ప్ర: శీలా వీర్రాజు గారి రచనలపైగానీ, మీ రచనలపై గానీ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలేమైనా జరిగాయా తెలియజేయగలరు.
జ: శీలా వీర్రాజు గారి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో మూడు MPhil పరిశోధనలూ, ఒక PhD పరిశోధన జరిగాయి. నా మొదటి కవితా సంపుటి ‘ఆకలినృత్యం’పై, ‘యుధ్ధం ఒక గుండె కోత’ పై మధురైకామరాజు విశ్వవిద్యాలయం లోనూ, రెండు కవితాసంపుటాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ మూడు MPhil పరిశోధనలూ, నా సమగ్ర కవిత్వంపై నాగార్జున విశ్వవిద్యాలయం నుండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండీ ఇద్దరు PhD పరిశోధనలూ చేసారు.
ప్ర: మీరు ప్రకటించిన పుస్తకాల వివరాలు చెప్పండి
జ: ఆకలినృత్యం (1980), మోళి(1982), తెగినపేగు(1986), ఆవిష్కారం(1986), ఒప్పులకుప్ప (1992), యుద్ధం ఒక గుండెకోత(2001), ఏకాంత సమూహాలు(2004), బతుకుపాటలో అస్తిత్వరాగం (2009), నా ఆకాశం నాదే (2016) తొమ్మిది కవితా సంపుటాలు. శీలా సుభద్రాదేవి సమగ్రకవిత్వం (1975-2009).


యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కావ్వానికి
- యుధ్ధం ఏక్ దిల్ కి వ్యథా (హిందీ 2018)
- War, A Heart’s ravage (ఆంగ్లానువాదం 2001)
- Ullak kumural (తమిళానువాదం 2020)
- Dance of a Hunger (anthology of poems 2021)
అనువాదాలు.
- దేవుడుబండ(1990)
- రెక్కలచూపు(2007)
- ఇస్కూలుకతలు(2018)మూడు కథా సంపుటాలు,
- నీడలచెట్టు నవలిక,


ఇతరములు:
- నా ముందు తరం రచయిత్రుల కథల గురించి రాసిన 25 వ్యాసాల సంపుటి ‘కథారామంలో పూలతావులు’
- డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ (కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ 2015)
- నిడదవోలు మాలతి రచనా సౌరభాలు (2022)
- గీటురాయిపై అక్షర దర్శనం (నా రచనలపై వచ్చిన సమీక్షల సంకలనం)


సంపాదకత్వం:
- ముద్ర (వనితల కవితల సంకలనంభార్గవీరావుతో సంపాదకత్వం 2001)
- వాళ్ళు పాడిన భూపాలరాగం(డా. పి. శ్రీదేవి కథలు 2022)
- యాభై ఏళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు(2022)
- మధుకలశమ్ (డా. పి. శ్రీదేవి కవిత్వం)




ప్ర: మీరు పొందిన అవార్డులు వగైరా..
జ: నాకు లభించిన అవార్డులు/పురస్కారాలు..
- లేఖిని సాహిత్యసంస్థ నుండి వచ్చే కవిత్వానికి కుసుమారామారావు పురస్కారం.
- తెలుగువిశ్వవిద్యాలయం నుండి 97 లో సృజనాత్మక సాహిత్యానికి పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్.
- శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి1999 లో ఉత్తమ రచయిత్రి అవార్డ్.
- కడప కవితా సాహిత్య సాంస్కృతిక సంస్థ నుండి రెక్కల చూపు కథలసంపుటికి 2011 లోగురజాడ అవార్డ్.
- ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం.
- 2018లోఉమ్మడిశెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం.
- 2018లోకవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం.
- 2018లో “నా ఆకాశం నాదే” కవితా సంపుటికి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి మాతృపురస్కారం.
- 2022లో సుశీలానారాయణరెడ్డి పురస్కారం.
- 2022 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి మాతృపురస్కారం. ఇవి చెప్పుకోదగినవి.
ఇంత శ్రధ్ధగా నన్ను పరిచయం చేసినందుకు మీకు, సంచిక అంతర్జాల పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
16 Comments
శీలా సుభద్రా దేవి
మీరు ఇంత శ్రద్ధ తీసుకుని నా అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రసాద్ గారూ.ఫొటోలతో పాటూ ఈ ముఖాముఖిని అంతే అందంగా ప్రచురించిన సంచిక నిర్వాహకులు కస్తూరి మురళీకృష్ణ గారికి మనసారా ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
మేడం
మిమ్ము లను ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం
నా అదృష్టంగా భావిస్తాను.
సహకరించిన మీకు
హృదయ పూర్వక కృతజ్ఞతలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ప్రచారార్భాటాలకి దూరంగా ఉండే శీలా సుభద్రాదేవి గారిని ఇంటర్వ్యూ కి ఒప్పించిన డాక్టర్ కెఎల్వీ గారికి అభినందనలు.
ఏదో ఒక వాదం ముద్ర పడకుండా, తన మనసుకి ముల్లులా గుచ్చుకొన్న దృశ్యాన్నో, సంఘటననో కవితగా, కథగా మలిచే సీనియర్ రచయిత్రి సుభద్రా దేవి గారు. ఎక్కడా తొణకక బెణకక రచనని, వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ తను మనసా నమ్మిన సిద్ధాంతపు నడక దారిలో పయనిస్తున్నారు. నా ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ సుభద్రా దేవి గారు మరిన్ని రచనలు చేయాలని మనసా ఆశిస్తున్నాను.
శీలా సుభద్రా దేవి
మీ ఆత్మీయ అభినందనలకు ధన్యవాదాలు సుశీల గారూ
మువ్వా శ్రీనివాసరావు
బావుంది ప్రసాద్ గారు , మీకూ సుభద్రా దేవి గారికి అభినందనలు …
శీలా సుభద్రా దేవి
ధన్యవాదాలు మువ్వా శ్రీనివాసరావు గారూ
డా కె.ఎల్.వి.ప్రసాద్
సుభద్రా దేవి గారిని గొప్పగా పరిచయం చేశారు సార్ ! ఒక మంచి రచయిత్రిని గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం కలిగించారు . ధన్యవాదాలు డాక్టర్ గారూ !
మెట్టు మురళీధర్
హన్మకొండ.
శీలా సుభద్రాదేవి
ధన్యవాదాలు మురళీధర్ గారు
Jhansi koppisetty
శీలా సుభద్రా దేవి గారి గురించి మీ ఇంటర్వ్యూ కారణంగా విపులంగా తెలుసుకోగలగటం చాలా ఆనందంగా వుంది…. వారి సహృదయత, నిరాడంబరత, డౌన్ టు ఎర్త్ తత్వం అభినందనీయం. వారితో నాకున్న కొద్దిపాటి పరిచయంతో వారిపై గౌరవం రెట్టింపయ్యింది… ఇప్పుడు వారి సాహిత్య ప్రస్థానం చదివాక అది మరింత బలపడింది



శీలా సుభద్రాదేవి
మీ ఆత్మీయ అభినందనలకు ధన్యవాదాలు ఝాన్సీ కొప్పిశెట్టి గారూ
sunianu6688@gmail.com
శ్రీమతి శీలా సుభద్రా దేవి గారి గురించి తెలుసుకోవడం చాలా ఆనందం గా వుంది. ఇంత ప్రతిభ కలిగిన రచయిత్రి గారి గురించి తెలిపిన రచయత Dr KLV ప్రసాద్ గారికి ధన్యవాదాలు



శీలా సుభద్రాదేవి
ధన్యవాదాలు
నిడదవోలు మాలతి
మంచి ఇంటర్వ్యూ. అభినందనలు సుభద్రాదేవిగారూ.
శీలా సుభద్రాదేవి
మీ ఆత్మీయ అభినందనలకు ధన్యవాదాలు మాలతి గారూ
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
Antharanga aavishkarana bagundi ..
Subhadra gariki dhanyavadalu.
—-డా.మధుసూదన్.కానేటి
విశాఖపట్నం.
శీలా సుభద్రాదేవి
ధన్యవాదాలు మధుసూదన్ గారూ