[పాలస్తీనా కవి మోసాబ్ అబు తోహా రచించిన కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Mosab Abu Toha’s poem ‘What a Gazan should do during an Israeli air strike?’ by Mrs. Geetanjali.]


~
అవును .. ఏం చేయాలప్పుడు ..
ఆకాశం నుంచి ఇజ్రాయిల్ మన మీద బాంబులు వేస్తున్నప్పుడు?
జాగ్రత్తగా వినండి! ముందు వెంటనే ఇంట్లోని ప్రతీ గదిలో దీపాలు ఆర్పేయాలి.
పరుగున వెళ్లి వంటింటి కింద ఉండే మిద్దె గదిలో నేల మీద కూర్చోవాలి.
కిటికీలకు మాత్రం దూరంగా ఉండడేం .
పొరపాటున కూడా పొయ్యికి దగ్గరగా ఉండొద్దు.
బ్లాక్ టీ చేసుకుందామన్న ఆలోచన అస్సలు రానివ్వధ్ధు సుమా!
ప్రతీ ఒక్కరూ పెద్ద నీళ్ల సీసాలను బాంబుల వేడి నుంచి
మిమ్మల్ని చల్ల బరచుకోవడానికి దగ్గరగా పెట్టుకోవాలి..
దాహం వేస్తే తాగడానికి కూడా!
భయపడే పిల్లలను అక్కువ చేర్చుకుని బుజ్జగించండి.
పిల్లల కిండర్ గార్డెన్ స్కూల్ బాగ్ తో పాటు
మిగతా సామాను కూడా సిద్ధం చేసుకోండి.
చిన్న చిన్న బొమ్మలు.. వాళ్ళు బెంగ పెట్టుకోకుండా.
అలాగే ఏమైనా డబ్బులు ఉంటే అవి కూడా సర్దేసుకోండి.
ఆ.. అన్నట్లు మీ ఐడీ కార్డ్ జాగ్రత్తగా పెట్టుకోండి.
నానమ్మ – తాతయ్యల అత్తా-మామల ఫొటోలు కూడా..
అసలు విషయం.. ఎప్పుడో అయిన మీ తాతా నానమ్మల
పెళ్లి శుభలేఖలు దొరికితే పెట్టేసుకోండి..తప్పదు.
ఇటు చూడూ.. ఒక వేళ నువ్వు రైతువైతే..
కొన్ని స్ట్రా బెర్రీ పండ్ల విత్తనాల పొట్లం జేబులో పెట్టుకో.
బాల్కనీలోని పూలకుండీల్లో ని మట్టిని కూడా మూట గట్టుకో.
వాటినలాగే గట్టిగా పడి పోకుండా పెట్టుకో.
కేక్ మీద ఉన్న చివరి పుట్టినరోజు నెంబర్ తో సహా..
అది ఎవరిదైనా సరే.. అన్నింటినీ భధ్రం గా ఉంచుకో.
ఆకాశం నుంచి ఇజ్రాయిల్ బాంబులు వేస్తున్నపుడు
నా గాజాన్ ప్రజలారా.. పిల్లలారా.. మీరిలా చేయాలి తప్పదు!
~
మూలం: మోసాబ్ అబు తోహా
అనుసృజన: గీతాంజలి


అతని మొదటి కవితల పుస్తకం, Things You May Find Hidden in My Ear, ఏప్రిల్ 2022లో సిటీ లైట్స్ ద్వారా ప్రచురించబడింది.
ఈ పుస్తకానికి అమెరికన్ బుక్ అవార్డ్, పాలస్తీనా బుక్ అవార్డ్, ఆరోస్మిత్ ప్రెస్ వారి 2023 డెరెక్ వాల్కాట్ పోయెట్రీ ప్రైజ్ లభించాయి.
ప్రస్తుతం భార్యా, ముగ్గురు పిల్లలతో జబాలియా లోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్నాడు.

శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964
1 Comments
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
కవిత చాలా బాగుంది. పైకి ఏదో జాగ్రత్తలు చెప్తున్నట్టు ఉంది కానీ, యుద్ధ సమయంలో సామాన్య ప్రజల భయం, వలస వెళ్ళే నిస్సహాయ స్థితి, మళ్ళీ తిరిగి వస్తామో రామోనన్న అనుమానం తో కవిత మొత్తం విషాదం ధ్వనించింది.