జీవిత యానంలో ఎన్నో మలుపులు, కుదుపులు తప్పవు
అవి దాటినా తరువాతనే గమ్యం చేరగలం!
మంచి రోజులు సంతోషం పంచితే
చెడు కాలం అనుభవాలను పంచుతుంది
విషాద సంఘటనలు పాఠాలను నేర్పుతాయి
అత్యంత సంతోషం కలిగించే సంఘటనలు
తీయని జ్ఞాపకాలను మిగుల్చుతాయి!
జీవితాన్ని ప్రేమించు ద్వేషించి దూరమైతే విలువను కోల్పోతావు
అపజయాన్ని బాధ్యతగా గుర్తించగలిగితే విచారం ఉండదు
అదే విజయానికి మార్గంగా మలుచుకో
నీకెవరూ తోడుగా రారు తెలుసుకో.
నా వెనుకనే నడిచి రాకు నీ కోసం నేను ఆగను
నాకు ముందు నడవకు నిన్ను దాటడం సాధ్యం కాదు
నాతో బాటు నడవడం అంటే నా స్నేహం కోరుతున్నట్టు సంకేతం.
ఒకోసారి మౌనంగా ఉండటం ఉత్తమం
ఎందుకంటే కొన్ని భావాలకు మాటలే వుండవు.
నేర్చుకోడం ఎన్నడూ ఆపకూడదు
జీవితం మనకు ఎప్పుడూ పాఠాలు నేర్పుతూనే ఉంటుంది
నేర్చుకోక పోవడం మన లోపం.
విషాద వార్తలు కాలంలో కలిసి పోతాయి
మంచి వార్తలు మనలను ముందుకు నడిపిస్తాయి.
కళ్ళు నెత్తిన పెట్టుకుని తల ఎత్తి నడుస్తావు
నీ నీడ కూడా నిన్ను అనుసరిస్తూ ఉంటుందని తెలుసుకోవు.
జీవితం పూలబాట కాదు సుమా
సమస్యలు అనే చిక్కుముడులు కూడా ఉంటాయి
వాటిని ఓర్పుగా నేర్పుగా విడదీయాలి.

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.