Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-18

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

~

తెలుగు తమిళ ఫిలిం డైరెక్షర్ మౌళిగారి పూర్తి పేరు T.S.B.K. మౌళి. ఆయనో గొప్ప నాటక/సినీ రచయిత, నటుడు, దర్శకుడు. ఆయన చేసిన చాలా సినిమాలకి నేను పాటలు వ్రాశాను.

ఆయన 3 నాటకాలు ఎంతో పేరు తెచ్చుకుని తెలుగులోకీ బంగాలీలోకీ అనువదించబడటమే గాక 4000 సార్లు ప్రదర్శింపబడి గొప్ప రికార్డు సృష్టించాయి.

నిజం చెప్పాలంటే ఓ క్రీడాకారిణి మీద తీసిన తొలి బయోపిక్ ‘అశ్వని’ అందులో అన్ని పాటలు వ్రాయగలగడం నా అదృష్టం. మౌళిగారు చాలా హాస్యప్రియులు. వంద సినిమాలకి పైగా నటించారు. కె.బాలచందర్ లాంటి ఉద్దండ దర్శకుని బేనర్‌లో కూడా అతను రెండు సినిమాలకి దర్శకత్వం వహించడం ఆయనకి రచన, దర్శకత్వం పైనున్న ‘పట్టు’కి నిదర్శనం.

ఆయన చదివింది B.Tech. అయినా రచనలు, ముఖ్యంగా నాటక/సినీ రచనలంటే ప్రాణం. ఆయన స్క్రీన్ ప్లే వ్రాసి నటించిన Flight No. 172 అనే నాటకం 30 సంవత్సరాల పాటు వరసగా ప్రదర్శింపబడటం ఓ గ్రేట్ రికార్డు.

ఆయన మొదటి తెలుగు సినిమా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’. దానిలో,  నటీనటులు చిరంజీవి, రాధిక. ఆ సినిమా ఏకంగా 280 రోజులు ఆడింది. ఆ తరవాత ఆయన 29 సినిమాలు తెలుగులో దర్శకుడిగా చేశారు. నేను 12 సినిమాలకు పైగా మౌళిగారికి పాటలు వ్రాయాటం జరిగింది. వారి నాన్నగారు బాలకృష్ణ భాగవతార్. అందుకేనేమో మౌళిగారికి అద్భుతమైన మ్యూజిక్ సెన్స్ వుంది. ట్యూన్ వినగానే, ఏది పనికొస్తుందో (సన్నివేశానికి) ఏది పనికి రాదో ఠక్కున చెప్పేవారు. తాంబూల ప్రియుడు, హాస్యప్రియుడు. ‘కంఫర్ట్స్’ కోసం నిర్మాతని కష్టపెట్టే మనస్తత్వం కానే కాదు. T.V.B. ప్రసాద్ గారిదీ, మౌళిగారిదీ చాలా మంచి కాంబినేషన్. వారెన్నో టీ.వీ.సీరియల్స్‌ని రూపొందించడమే గాక నటించారు కూడా. ఏమైనా, బి. చంద్రమౌళి అని పిలువబడే మౌళిగారు చాలా యీజీ గోయింగ్ డైరెక్టర్. “ఎంతో అనుభవించాలని డబ్బు సంపాయిస్తాం. కానీ సంపాదన తప్ప దేన్నీ నిజంగా అనుభవించలేము” అని నవ్వుతూ ఓ సారి నాతో చెప్పిన మాట ఏనాడూ నేను మరిచిపోను.

ఇదంతా ఎందుకంటే కీరవాణిగారి సంగీత సారథ్యంలో, మౌళిగారి దర్శకత్వంలో, సి.వెంకట్రాజు. జి.శివరాజుగార్లు నిర్మించిన ‘ఆదర్శం’ సినిమాకి సంబంధించిన పాటల ముచ్చట చెప్పటం కోసం. బేనర్ పేరు శ్రీవిజయ లక్ష్మీ ప్రొడక్షన్స్. నటీనటులు, రఘు.. అశ్వనీ నాచప్ప.

అశ్వనీ నాచప్ప పుట్టింది 1967లో, కర్నాటకలో. పెరిగింది కలకత్తాలో.. ఆవిడ ఎన్నో పరుగుపందాల్లో పాల్గొనడమే కాక రెండుసార్లు అప్పటి గ్రేట్ రన్నర్ పి.టి. ఉషగార్ని ఓడించింది. 1988 సియోల్ ఒలింపిక్స్ క్వాలిఫై కావడమే గాక, జాతీయ క్రీడల్లో ఎంతో అద్భుతమైన పేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం బెంగుళూరు అర్బన్ డిస్ట్రక్ట్ అథ్లెట్స్ అసోసియేషన్‌కి అధ్యక్షురాలుగా వుంది. ఆమె నటించిన 5 సినిమాల్లో 4 మౌళిగారు దర్శకత్వం వహించినవే. అన్నిట్లోనూ నేను పాటలు వ్రాయడం జరిగింది.

ఈ సినిమా జరిగేప్పుడు యూనిట్‌తో పాటు నేను ఓ షూటింగ్ స్పాట్‌కి వెళ్ళి, అక్కడే పాట వ్రాసి ఓకే చేయించుకున్నది ఓ మధురమైన జ్ఞాపకం. ఓ జాతీయ క్రీడాకారిణిని కలవడం కూడా అప్పుడే మొదటిసారి.

కీరవాణి గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. రెండు పాటలు తప్ప మిగతావన్నీ సన్నివేశబలం తోడైన పాటలు.

“క్షణం.. క్షణం.. సంఘర్షణం”

“చీకటి ముసిరిన మా ముంగిట్లో వెన్నెలొచ్చింది”

“ఈడు కోరినది తోడు చేరినది స్వాగతం పలుకనా”

“లవ్వా లక్కిడి లాఠీ నే పెట్టా నవ్వుల పోటీ”

“లవ్వా లక్కిడి లాఠీ ఇది గువ్వ పిట్టల పోటీ”

ఈ అయిదు పాటలు నేను వ్రాసినవే.

ఈ సినిమా తరవాత మౌళి గారితో నా పరిచయమూ, స్నేహం ఇంకా పెరిగాయి. జీవితాన్ని ఎప్పుడూ ఓ పాజిటివ్ దృక్ఫథంతో చూసే మౌళిగారు, ఓ ఛాంపియన్‌గా తనని తాను మలుచుకున్న అశ్వనీ నాచప్ప, స్వశక్తి మీద నమ్మకమూ, పని మీద శ్రద్ధ వుంటే, ఆకాశమే మన ముందు తలవాల్చతుందని నిరూపించిన శ్రీ. ఎం.ఎం.కీరవాణి.. వీరందరితోటి పని చేయడం నా పూర్వజన్మ సుకృతం కాక మరేమిటీ?

***

‘ఆదర్శం’ తరవాత నేను చేసిన సినిమా ‘అహంకారి’. దీనికీ నిర్మాతలు పి.వెంకట్రాజు, బి.శివరాజుగార్లే. దర్శకత్వం డా. దాసరి నారాయణరావుగారు. సంగీతం రాజ్-కోటి.

సినిమాలోకి వెళ్ళే ముందు ఓ చిన్న విషయం చెప్పాలి. తెలుగులో ‘కేసెట్’ కంపెనీ అంటే ‘లియో’ ( LEO) కంపెనీ గురించి చెప్పకోవాలి. ‘లియో’ అనంగానే గుర్తొచ్చేది ‘లియో’ ఆనంద్. ఆనంద్ తన పేరెంట్స్‌తో, తోబుట్టువులతో మద్రాసులోనే వుండేవాడు. యువకుడు. పట్టుదల, సమర్థత, కార్యదక్షత కలిగినవాడు కావటంతో పెద్ద పెద్ద కంపెనీల నించి ‘కేసెట్’ రైట్స్ పట్టుకునేవాడు.

ఇప్పుడు ఈ సినిమాకీ ఆనంద్‌కీ సంబంధం లేదు కానీ, రాజ్-కోటి గార్లకి ‘కిరీటం’లో ఎంబ్లమ్ సృష్టించిన ఘనత మాత్రం లియో ఆనంద్‌దే. అలాగే, ‘సుందరకాండ’, ‘దేవీ సంతోషి’ లాంటి రెండు డివోషనల్ కేసెట్స్ నా చేత వ్రాయించింది కూడా ఆనందే.

ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్-కోటి. Spic కంపెనీ తాలూకు ఏవో ఆఫీసులో ఎక్కడో షూటింగ్ టైములో నాకు ట్యూన్ కేసెట్ ఇచ్చారు దాసరి నారాయణరావుగారు. డా. రాజశేఖర్, రాధ, సుజాతలు ముఖ్య పాత్రధారులు. రాజశేఖర్ గార్ని చూడడం అదే మొదటిసారి. ఆ రోజెందుకో జీవితగారు కూడా వచ్చి వెళ్ళారు. సాయంత్రంలో పాట పూర్త అయింది. పాడింది చిత్ర మనో. “నీలూ నీలూ నీలూ మోగిస్తా డోలు” అనేది పల్లవి. జస్ట్ సాంగ్ ఫర్ సాంగ్. సాంగ్ ఫర్ సాంగ్ అంటే పెద్ద సన్నివేశం అంటూ వుండదు. డైలాగ్స్‌లో చెప్పేదానికి బదులు ఓ పాట పెడితే మొనోటనీ తగ్గుతుందని ‘సాంగ్ ఫర్ సాంగ్’ పెడతారు. సాంగ్ ఫర్ సాంగ్ వ్రాయడం అంత తేలిక కాదు. కొంచెం ఊపూ, హుషారు ఉండేలా చూసుకోవాలి. పిక్చరు హిట్టయితే, ఇటువంటి సాంగ్స్ సూపర్ హిట్టవుతాయి. పిక్చర్ సో.. సో గా ఆడితే సాంగ్‌కి కూడా లాంగ్‌విటీ వుండదు. అద్భుతంగా రాసిన పాటలు సోదిలోకి కూడా దొరక్కుండాపోయిన వైనం నాకు తెలుసు. అలాగే క్వాలిటీలో ‘సో సో’ పాటలు కూడా యమా హిట్ అవడం చూశాను. మనుషులకి అదృష్టాదృష్టాలు వున్నట్టు గానీ, పాటలకి కూడా వాటి వాటి అదృష్టాదృష్టాలు వుంటాయని అర్థమైంది. కొన్ని పాటలైతే, రిలీజైనప్పుడు యావరేజ్‌గా టాక్ తెచ్చుకుని, తరవాత విజయకేతనాలు ఎగరేయ్యడం కూడా చూశా.


ఎనీ వే.. D.N.R. గారితో మరో సినిమా, రాజశేఖర్ తొలి సినిమా, రాజ్-కోటితో ఇంకాస్త ముందుకు ఈ సినిమా ద్వారా జరిగాను.

***

మళ్ళీ మా బాపినీడు గారితో:

సినిమా పేరు ‘సీతాపతీ ఛలో తిరుపతి’. నిర్మాతలు మురళీ శ్రీనివాస్ సునీల్ కిలారు. సంస్థ శ్రీరాఘవేంద్ర ఫిలిమ్స్. సంగీతం చక్రవర్తి. నటీనటులు రాజేంద్ర ప్రసాద్, వాణీ విశ్వనాథ్.

ఇందులో ఓ వాన పాట.

~

అతడు:
“కోణంగి వాన.. కొట్టందే జాణా.. ఊపందుకుంటేనే ఊప్పొంగిపోనా
వానా.. వానా.. వానా..”
ఆమె:
“చిన్నారి చినుకూ చిటికేసెనయ్యో
దానిమ్మ మొగ్గ తడిసింది రయ్యో
కొమ్మంతా కదిలింది రయ్యో మామయ్యో
వానా.. అబ్బ.. వానా..”

మాస్ మసాలా దట్టంచిన పాట.

అతడు:
“మల్లెమొగ్గ ఏమన్నదీ”
ఆమె:
“గిల్లి గిచ్చుకోమన్నదీ”
అతడు:
“తెల్ల చీర ఏమన్నాదీ”
ఆమె:
“కొల్లగొట్టుకోమన్నదీ”
అతడు:
“మల్లెపూల పక్క మీద “
ఆమె:
“తెల్ల చీర బజ్జుంటే”
అతడు:
“హద్దు లేక ముద్దు మీద
ఆమె:
“ముద్దు పెట్టుకోమంటే..”

ఇలా సాగుతుంది పాట.

“అబ్బాయ్.. పరవాలేదు. ఫక్తు మాస్‍లో పడ్డావు. ఇక నువ్వేం పాటల కోసం బెంగెట్టుకోనక్కర్లా.. అవే వస్తై” అన్నారు చక్రవర్తిగారు.

“అవునండీ.. అన్నీ రకాలూ వ్రాయాలి. మడి కట్టుకుంటే ఎలాగా?” నవ్వారు బాపినీడుగారు.

“ముద్ర పడుతుంది.. అయినా తప్పదు. ఎందుకంటే మనం ఇక్కడ షాపు లాంటి వృత్తిలో వున్నాం. ఎవరేది అడిగితే అది ఇవ్వాలి. అది వృత్తిధర్మం” ఓపెన్‌గా క్లియర్‌గా చెప్పారు MVVS బాబూరావుగారు.

“సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు. సమాజానికో సందేశమూ వుండాలి. అంటే, ఓ ఇంటర్వెల్ బేంగ్, మరో క్లైమాక్స్ సస్పెన్స్ తో తీసేవి కాలానికి నిలబడలేవు” అన్నారు నాగభూషణంగారు. ఆయనో ప్రొడక్షన్ కంపెనీ వెల్‍విషరు. ఆ ప్రొడక్షన్ కంపెనీలో ఆయన వర్క్ ఏమిటో స్పష్టంగా తెలీదు కానీ, అన్నింటిలోనూ ఆయన ఇంటర్‌ఫియరెన్స్ ఉంటుంది. “అయ్యా, తెలుగు సినిమా నిర్మాణం మొదలైన దగ్గర్నించీ ఇప్పటి వరకూ అన్ని రకాల సినిమాలూ వచ్చాయి. ఏ సినిమా ఎందుకు ఆడుతుందో ఏది ఎందుకు ఆడదో చెప్పే జ్యోతిష్కుడు ఇప్పటి దాకా పుట్టలేదు. నీతిని బోధించే సినిమాలు తీసినా, బూతుని హైలైట్ చేసే సినిమాలు తీసినా, నిర్మాతకి లాభం వచ్చినా రాకపోయినా, అసలుకి మాత్రం మోసం రాకూడదు. ఫస్టు ప్రిన్సిపల్ అదీ. ఇక తరవాత సంగతి అంటారా.. ‘ఫార్ములా’ని నమ్మిన వాళ్ళు కనీసం బాగుపడతారని ఓ గుడ్డి నమ్మకం. ఒకప్పుడు సినిమా మీద ప్రేమతో, ఓ అవగాహనతో నిర్మాతలూ దర్శకులూ యీ చిత్ర పరిశ్రమకి వచ్చే వాళ్ళు. ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంటుగా చేరి, పని చేసి, కొంత అవగాహనా, అనుభవం కలిగాక సినిమా తీసేవాళ్ళు. ఇప్పటి సంగతా, కేవలం గ్లామర్‍ని చూసో, రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోదామనే ఆశతోనో వస్తున్నారు. కొంత మంది కేవలం ఫిలిం ప్రొడ్యూసర్ అనే, పేరు పేపర్లో పడితే చాలని వస్తున్నారు. ‘వెల్లు’ తక్కువ ‘పొల్లు’ ఎక్కువ.. మీరన్నట్టు సమాజ సేవ చేయ్యాలంటే సినిమాలే తీయ్యక్కర లేదుగా!” నాటి రచయితా, సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తండ్రిగారైన జి.సత్యమూర్తిగారన్నారు నాగభూషణంగారితో.

చర్చకి తాత్కాలికంగా తెరపడ్డా, అదో అర్థవంతమైన చర్చే అనిపించింది. దాని ‘లోతు’ తరవాతే నాకు అర్థమయింది.

ఆ తరవాత సాంగ్ మరీ మాస్.

అతడు:
“పంపుకాడ బిందెట్టుకో.. నీ బిందెనిండ నీళ్ళు పట్టుకో.”
ఆమె:
“ఊట బావి మాకుందిరో.. నీ పంపు జోలి నాకొద్దురో”
అతడు:
“తోడుకుంటే జబ్బపులుపు.. మోసుకెల్తే నడుము సలుపు
పంపు కొట్టుకో.. నీళ్ళు పట్టుకో”
ఆమె:
“ఊట బావి మాకుందిరో.. నీ పంపు బోలి నాకొద్దురో”

~

దీని తరవాత సాంగ్‌దే అల్లరి అంతా.. గాంగ్ లీడర్ లోని వేటూరిగారు రాసిన ‘వయసు వయసు’ పాటకి పేరడీలాంటిది ఇది. బాపినీడుగారు సరదాగా “ఇందులో ఓ కేరక్టర్ బెల్లపు అచ్చుల్ని అమ్ముతూ వుంటుంది. సరదాగా వుండేట్టు వ్రాయండి” అన్నారు.

“అంటే మేల్ & ఫిమేల్ ఇద్దరూ వుంటారా సార్” అనడిగాను.

“ఉహూ.. అమ్మే ఆమె, కొనుక్కునే కస్టమర్లు వుంటారు. రంజుగా రాసెయ్యెడి. సెన్సార్ పడితే పాటే తీసేద్దాం” అన్నారు.

~

పల్లవి:
ఆమె:
“అసలు సిసలు స్పెషలు కలరు బెల్లం నాదీ
రుచుల పచుల పదును తేల్చు బేరం నీదీ
సాగాలీ నీ ఖాతా.. కలకాలం.. నేడే మొదలెట్టా వ్యాపారం”

చరణం:
అనకాపల్లి బెల్లమూ.. అరిసెల కెరిలో శ్రేష్ఠమూ.. దిమ్మలు దించా చూడుము
మచ్చుకి ఇస్తా తినరా కొంచెము.
పెట్టానోయ్ క్యూ సిస్టమూ.. దిక్కులు చూస్తే నష్టమూ
స్టాకైపోతే కష్టమూ.. ఆపై నీ ఇష్టం..
పెళ్ళైనా.. పులుసైనా.. పురుడైనా..
వెయ్యక తప్పదు తియ్యని బెల్లం ॥అసలు॥

చరణం:
ఎక్కే పార్టీ ఎక్కనీ.. ఎక్కని పార్డీ నక్కనీ
బెల్లం మాత్రం దక్కనీ.. జంగిడీ ముందర చేరిన జనులకి
బుష్షుకి భూతం పట్టినా.. సద్దాం యుద్దం చేసినా
రష్యా వీటో పెట్టినా.. ఆపను వ్యాపారం..
ఇచ్చేశా.. వాగ్దానం.. ఇదిగోరా..
పట్టుకుపోరా పట్టెడు బెల్లం ॥అసలు॥

***

మీకో డౌట్ వచ్చి వుండొచ్చు. గొప్ప పాటల్ని హైలైట్ చేసుకోవాలిగానీ, ఇటువంటి పాటల పూర్తి పాఠాన్ని ఇవ్వొచ్చునా? అని.

అయ్యా.. ఒకసారి డబుల్ మీనింగా మరోటా అనే విషయాన్ని పక్కన పెట్టి చూడండి, ముఖ్యంగా చరణాలు ఏ పాట అయినా పదాల పేర్పే. మొదటి దాంట్లో అరిసెలు, పెళ్ళిళ్ళూ, పరుళ్ళూ పులుసు తయారీ మొదలైన వాటిల్లో బెల్లం వాడకం, రెండో దాంటో పార్టీలు, యుధ్ధాలు, వీటోలు వాగ్దానాలు ఇవీ. అప్పుడే మొదలైంది.. సద్దాంకీ అమెరికాకీ మధ్యన చిచ్చు.

అదీగాక సినిమాలో  యీ పాట పాడేది ఓ స్త్రీ పాత్ర. దాని వల్ల నిజంగా, ‘విజవల్’ గా కొంత ముతక హాస్యం తప్ప శృంగారం కనిపించనే కనిపించదు.

సెన్సారు ఏ మాత్రం అబ్జక్టు చెయ్యని పాటలో ఇదొకటి. ఎందుకు చెబుతున్నానంటే, నా ప్రవృత్తి వేరు. నేను అత్యంత ఇష్టపడేవి మెలోడీస్.

కానీ, పాటలు వ్రాయడాన్ని వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఏ పాటని ఎలా వ్రాయమన్నా సమర్థవంతంగా వ్రాయగలగాలి. ఒక విధంగా ఇటువంటి పాటలు కూడా రచయితకి క్లిష్టమైన పాఠాలే. ఈ పాట పాడింది చిత్రగారు. “ఆ రోజుల్లో ఆమెకి తెలుగు అర్థమయ్యేది కాదు గనక పాడివుంటారు” అని ఈ మధ్య ఓ మిత్రుడన్నాడు. ఉండొచ్చు.

“అలాగే ‘పంపుకాడ బిందెట్టుకో’ పాట అప్పుడు SPB పాడేరేమో గానీ ఇప్పుడైతే సాంగ్ పేపర్‌ని విసిరికొట్టి వుండేవారు” అన్నాడు ఆ మిత్రుడు. “అవును.. ఈ మాట మాత్రం నిజం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడీ పాటలు పాడాల్సిన అవసరం ఆయనకి లేదు” అన్నాను. అంతేగా మరీ.

ఇవి గాక “లక్.. చిక్ లక్ చిక్ లక్ స్వీటూ” అనే చిత్రగారి సోలో పాట ఇంకోటుంది. మొత్తం అయుదు పాటలు.

***

ఇదేలే తరతరాల చరితం:

జేసుదాస్ గారు నాకు పాడిన మొట్టమొదటి పాట ఇది. 25 సంవత్సరాలు, అక్షరాలా ఇరవై అయిదేళ్ళు గడిచినా ఈ పాట ప్రజల హృదయాల్లో అలానే మిగిలి వుంది. చాలామంది ఇప్పటికీ ఈ పాట గురించి నాలుగు మంచి ముక్కలు మాట్లాడుతూనే వున్నారు. ఒక విధంగా చెబితే ‘పెద్దరికం’ కథ మొత్తం ఈ పాటలో వుంది. “ప్రేమని గురించి భూత, భవిష్య, వర్తమానాల గురించి కూడా అన్నయ్య పల్లవిలోనే చెప్పేశారు” అని వెన్నెలకంటి – ‘పాడుతా తీయగా’ షో లో నా ఎదురుగా బాలూగారి ఎదురుగా లక్షలాది T.V వీక్షకుల ఎదురుగా అన్నారు. ఈ పాట వెనుక ఓ చిన్న కథ వుంది. నిర్మాత S.M.రత్నంగారు నిర్మిస్తూ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఇదో మలయాళ సినిమాకి రీమేక్. అంతే గాదు, ఓ కొత్త దర్శకుడిగా, తొలి అడుగే ‘భానుమతి’ వంటి హిమాలయంతో నటింపజేయడం రత్నంగారి కాన్ఫిడెన్స్‌కి నిదర్శనం. ఓ పక్క మలయాళ నటుడు పిళ్ళై, మరో పక్క దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ రచయిత్రి నటి భానుమతి! అలాంటి సినిమాలో 3 పాటలు వ్రాసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం కాక మరేమిటీ!

ఆ సినిమాలో నేను రాసిన తొలి పాట ఇది. రాత్రి 10 గంటలకి రత్నంగారు నేనుండే చారీ స్ట్రీట్ ఇంటికి వచ్చి మొత్తం కథ వివరించి, ఈ సన్నివేశాన్ని మరోసారి వివరించి ట్యూన్ ఇచ్చి “రేపొద్దుటికి పూర్తి అయిపోవాలి. ఎందుకంటే రేపు జేసుదాస్ గారు అమెరికా వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం 2 to 3 మనకి కాల్‌షీట్ ఇచ్చారు” అని హెచ్చరించారు. ఆయన వెళ్ళేసరికే 11 గంటలయింది. ఓ పక్క నిద్ర. మరో పక్క అలసట. కారణం అదే రోజున ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రెండు పాటలు పూర్తి చేసి ఇవ్వాల్సి వచ్చింది. తిండి తింటే నిద్రకి ఆగలేను. అందుకని, ఓ కప్పు కాఫీ తాగి రైటింగ్ సరంజామాతో బాల్కనీలో కూర్చున్నా. రాత్రి 2.30 దాకా మేలుకునే వున్నా. ఒక్క ముక్క రాలేదు. ఎప్పుడు నిద్రలోకి జారానో తెలీదు. 6 గంటలకు ఇంటి ఓనర్ గేటు తీసే శబ్దానికి మెలుకవ వచ్చింది. ఓ చేతిలో (left) టేప్ రికార్డర్ వుంది. లక్కీగా తెలియకుండానే స్విచ్ఛాఫ్ చేశానన్న మాట. ఒళ్ళో రైటింగ్ పేడ్ వుంది. ట్యూన్ బుర్రలో గుండ్రంగా ‘టేప్’ లా తిరుగుతూనే వుంది. అయిదు నిముషాల పాటు మళ్ళీ సన్నివేశాన్ని ఫ్రెష్ గా నెమరు వేసుకున్నా. 15 నిమిషాల్లో పల్లవి పూర్తయింది. వెంటనే ఫోన్ చేశా కోటి గారికి. “కథంతా పల్లవిలోనే దించేశావు భువనా.. బ్రహ్మాండంగా వుంది. చరణాలేం రాస్తావూ?” అన్నారు. ఆ మాట చాలుగా.. కాన్ఫిడెన్స్ వందరెట్లు పెరగడానికి.

ఉ. 7.45 నిమిషాలకి పాట పూర్తి చేసి కాఫీ కప్పు అందుకున్నా. మళ్ళీ పాటంతా కోటికి వినిపించా. “Happy గా రెస్టు తీసుకుని 12½ కి వచ్చెయ్” అన్నారు. కానీ మనసు ఆగదుగా. టిఫిన్ చేసి 11 గంటలకి స్టూడియోకి (SP కోదండ పాణి ఆడియో లాబ్ – SPB గారిది) వెళ్ళా. వెళ్ళే ముందే రత్నంగారికి, వినిపించా. ఆయనా హేపీ.

మొదట అది డ్యూయెట్‌గా వుంటే బాగుంటుందని సగం స్వర్ణలత చేత కూడా పాడించారు. అయితే జేసుదాసుగారు వెళ్ళిపోయాక స్వర్ణలత ట్రాక్ తీశారు. కానీ సినిమాలో పాట మొత్తం జేసుదాసు గారి వెర్షనే వుంటుంది.. ఆడియోతో సహా.

స్వర్ణలతని తలుచుకుంటే మనసు దిగులుతో కృంగిపోతుంది. మొత్తం ఫేమిలీకి ఆధారం ఆమె. తను మాత్రం అందరి బాగోగులూ చూచేది. పెళ్ళి కూడా చేసుకోకుండానే అతి చిన్న వయసులో మరణించింది. ఎవరి వంకన్నా తలెత్తి చూడటానికి కూడా ఇబ్బంది పడేది. అంత నెమ్మదితనం, అంత వినయం మనం ఎక్కడా చూడలేదు. విలక్షణమైన గాత్రమే కాదు, విశిష్టమైన వ్యక్తిత్వం స్వర్ణలతది. ఎప్పుడూ ఆమెతో కూడా ఆవిడ బ్రదర్స్ ఇద్దరు వచ్చేవారు. ఏమైనా.. కొందర్ని తలచుకున్నప్పుడు, కొందరి జీవితాల్ని తరచి చూసినప్పుడు మనసు మూగబోతుంది. ఇతరుల కోసం చిట్ట చివరిదాకా  వెలిగి చివరికి నిశ్శబ్దంగా ఆరిపోయే కొవ్వొత్తులు గుర్తొస్తాయి.

(‘ఇదేలే తరతరాల చరితం’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=RdbBY3ZqirE)

(ఇంకా ఉంది)

Exit mobile version