Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-3

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

ది బిగినింగ్ 1-1-1987 మరో ప్రారంభం:

డాక్టర్ గోపాలకృష్ణ గారి ఆస్థానం స్టాండర్డ్ ఎలెక్ట్రికల్స్, పాండీబజార్ దగ్గర శుభప్రదమైన పేద్ద వేప చెట్టు క్రింద. పొద్దున్న రాగానే నాయుడు టైలర్స్ వరండాలో పెట్టిన నాలుగయిదు కుర్చీల్ని ప్లాట్‌ఫార్మ్ మీద ఇవతలగా వేస్తారు, నడిచే వాళ్ళకి ఇబ్బంది కలక్కుండా. ఆ తరవాత నేల మీద పేద్ద గోనిపట్టాలు రెండు వేసి వాటి మీద పేపర్‌నీ బుక్కునీ పడేస్తారు. ఆ తరవాత ఓ కుర్చీలో కూర్చొని తనతో పాటు తెచ్చుకున్న మందుల సూట్‌కేస్‌ని ఓపెన్ చేసి పెడతారు. మరోటి నాయుడి గారి షాపులో వుంటుంది, మందులతో. ఆ తరవాత తనో కప్పు టీ తో కూర్చుని వచ్చిన వారందరికీ ‘టీ’ ఇప్పిస్తూ వుంటారు. ఇహ అక్కడి కొచ్చేవారు అతి సామాన్యుల నించి సెలిబ్రిటీల దాకా ఎందరెందరో!

ఓ రోజు అడ్డ పంచె కట్టుకున్న ఒకాయన్ని పరిచయం చేసి “వీరు జాలాదిగారు. గొప్ప సినీ గీత రచయిత. రచయిత కాక ముందు ఎన్నో వేల మందికి స్పూర్తి నిచ్చిన మేస్టారు” అని అన్నారు. వెంటనే వారికి  నేను పాద నమస్కారం చేశాను. కారణం, వారి రచనలు, అంటే,  పాటలు ఎన్నో విన్నాను. ఓ అద్భుతమైన రచయిత.

“ఇతని పేరు రాజు. ఏర్‌ఫోర్స్ నించి బయటకి వచ్చారు. సినిమాలంటే ఇంట్రెస్టు. మీకేమన్నా పనికి వస్తాడేమో చూడండి” అని న్ను జాలాది గారికి పరిచయం చేశారు డాక్టరుగారు.

“సరే.. చూద్దాం.. సాయంత్రం రోహిణీ ఇంటర్నేషనల్‌లో ‘ప్రిన్స్’ రూమ్‌కి రండి” అని జాలాది గారు నాతో అన్నారు. అప్పటి కింకా నాకు బాపినీడుగారి పరిచయం కాలేదు.

“మారుతి” అనే సినిమాకి అప్పుడు జాలాది గారు పాటలు రాస్తున్నారు. దానికి డైరెక్టరు అప్పట్లో అతి పిన్న వయస్కుడైన సుగంధ రమేష్ రాజా.

నేను సాయంత్రం జాలాది గార్ని కలవగానే “రేపు AVM స్టూడియోకి వెళ్దాం. ఎనిమిదింటి కల్లా రండి” అన్నారు.

***

AVM స్టూడియో దగ్గర జాలాదిగారూ నేనూ ఆటో దిగాము. జాలాది గారికో చిన్న సెంటిమెంటు వుంది. మేము రోహిణీ ఇంటర్నేషనల్ దగ్గర ఆటో కోసం నిలబడగా చాలా ఆటోలు ఖాళీగా వచ్చినా వాటిని ఆపలేదు. నేను ఆపబోతే వద్దన్నారు. చివరికో ఆటోని సెలెక్టు చేసి ఎక్కమన్నారు. “అదేమిటీ?” అనడిగితే టోటల్ నెంబర్ 9 వుంటే మంచిదనీ ఆ నంబరుండే ఆటో కోసం వెయిట్ చేస్తాననీ అన్నారు నవ్వి. ఆ తరవాత ఓసారిలానే చెప్పారు.. అలా నంబరు 9 total వచ్చే ఆటో ఎక్కమని డాక్టరు గారు చెప్పారని. జాలాది గారి పూర్తి పేరు జాలాది సువర్ణరాజారావుగారు. గొప్ప హృదయం వున్న మనిషి. అందర్నీ సరదాగా “తాతా” అని పిలుస్తూ, “తాతా” అనే పిలిపించుకునేవారు. నిఖార్సయిన కమ్యూనిస్టు. తొమ్మిదో నంబర్‌ని కూడా డాక్టర్ గారి మీదుండే గౌరవంతో పాటించేవారు.

AVMలోకి వెళ్ళగానే జాలాదిగారు చక్రవర్తి గార్ని (ద గ్రేట్ మ్యూజిక్ డైరక్టర్) పరిచయం చేశారు. చక్రవర్తి గారి పేరు ఆ రోజుల్లో హిమాలయ శిఖరాగ్రం మీద వుండేది. చక్రవర్తి గారు కూడా నాతో రెండు మంచి మాటలాడారు. కాసేపు వుండి వెనక్కి వచ్చేశాము (అంటే Lyric paper ఇచ్చేశాక). అది AVM G. థియేటర్). అక్కడే సుగంధ రమేష్ రాజాతో కూడా పరిచయం జరిగింది. సుశీలగారు వాయిస్ రూమ్‌లో నించి బయటికి వస్తూ కనిపించారు. గానీ, పలుకరించే ధైర్యం చేయ్యలేకపోయాను.. ఏమని నన్ను నేను పరిచయం చేసుకోనూ?

జాలాది గారు రెండో పాటలో బిజీ అయ్యి ఆ కాన్సన్‍ట్రేషన్‌లో వున్నారు. నేను మెల్లగా హోటల్ నించి బయటపడి డాక్టరు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ తరవాత ఎందుకో జాలాది గారు తన బిజీలో తానుండేవారు (నేను బిజీ అయ్యాక తెలిసింది. పాటలు వ్రాయడం అంటే జాబ్ ఆఫ్ ద అవర్ కాదనీ, గంటల తరబడి ఒంటరిగా నెప్పులు పడాలనీ!).

***

బాపినీడుగారి దగ్గర పాట ok చేయించుకున్నాక మహదానందంగా డాక్టరుగారిని కలిశాను. ఆయన ఆనందంగా అన్నీ విని, “ఈ విషయం ఎవరితోటి చెప్పకండి.. పాట రికార్డు అయేంత వరకూ. అంతే కాదు.. నా సలహా ఏమంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ చెప్పొద్దు. కారణం ‘cup కి lip కి మధ్య లక్ష అడ్డంకులుంటాయి. ఒక్కోసారి షూట్ చేసిన పాటని కూడా సినిమా ‘నిడివి’ ఎక్కువయిందని cut చెయ్యెవచ్చు. కనుక గోప్యంగా ఉంచండి. అంతే కాదు, స్క్రీన్  కోసమూ, రచనల కోసమూ మాంచి పేరు ఏదైనా సెలెక్టు చేసుకోండి” అన్నారు. రాత్రంతా చాలా సేపు ఆలోచించాక తట్టింది.. మా అమ్మగారి పేరూ, భువనేశ్వరమ్మ గారి పేరూ కలిపి నా పేరుగా పెట్టుకుందామని. భువనేశ్వరమ్మగారి పేరులోని ‘భువన’; మా అమ్మ చంద్రమౌళీశ్వరీ దేవిలోని ‘చంద్ర’ కలిపి ‘భువన చంద్ర’ గా సెట్ చేశాను. పేరు set అయ్యాక బ్రహ్మాండంగా నిద్ర పట్టింది. పొద్దున్నే లేచి నేను చేసిన పనేమిటంటే విజయలక్ష్మీ పబ్లిషర్స్ వారి దగ్గరికి వెళ్ళి రచన – భువన చంద్ర అని వెయ్యమని చెప్పాను. ఆ తరవాత పదింటికి బాపినీడుగారింటికి వెళ్లి “సార్.. నా స్క్రీన్ పేరు భువన చంద్రగా పెట్టుకుందామనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పరూ” అని అడిగాను. ఆ పేరు పెట్టడానికి కారణం కూడా వివరించాను. ఆయన సంతృప్తిగా “వెరీ గుడ్.. చాలా బావుంది..” అని ఆశీర్వదించారు, అంతేగాక, “మీరు రాసిన పాటని మీరే ఫెయిర్ చేసి మీ పేరు మీరే వ్రాసి ఇవ్వండి. భువన చంద్ర గా మీరు మా ఆఫీసు (ఇల్లు) లో పుట్టినట్టు అవుతుంది.” అన్నారు. నా మొదటి పాట రికార్డింగ్‌కి నాలుగు రోజుల ముందర ధనలక్ష్మి కాలనీ వడపళనిలో బాపినీడు గారింట నా పేరు మొదటిసారి కాయితం మీద వ్రాయబడింది.

బహుశా ఆ క్షణం నిజంగా అమృత ఘడియే అయిండాలి. బాపినీడు గారు ప్రథమ కోపి. అయినా వెన్నలాంటి మనసున్న మనిషి. నా దృష్టిలో నా ఉన్నతికి జన్మనిచ్చిన దేవుడు. తండ్రి.

***

డిసెంబరు 31st రాత్రి ఎలా గడిచిందో నిజంగా నేను చెప్పలేను. ఎప్పటి కలో రేపు నిజం కాబోతోంది. ‘నా పాట’ రికార్డు కాబోతోంది. అంతకు మూడు రోజులు ముందే శ్రీరామ్ సురేష్ గారు బాపినీడుగారూ నన్ను శ్రీ N. శివలింగేశ్వరావు గారికి పరిచయం చేశారు. శివలింగేశ్వరరావు గారు నేను వ్రాయబోతున్న (వ్రాసిన) ‘నాకూ పెళ్ళాం  కావాలి’ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆనందన్ స్ట్రీట్ (T. Nagar) లో వారి ఆఫీసు వుండేది. డాక్టరు గారి చెట్టు నించి కూత వేటు దూరమే అక్కడికి. సంస్థ పేరు ‘శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్’. ప్రొడ్యూసర్ గారి పేరు ‘ఆలపాటి రంగారావుగారు’. వారిని నేను ఏనాడూ చూడలేదు. Just వచ్చి వెళ్ళిపోయేవారట. దేన్లోనూ కల్పించుకునే వారు కాదు. శివలింగేశ్వరావు గారంటే అంత నమ్మకం. బాపీనీడు గారు శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌కి తీసికెళ్ళి నన్ను పరిచయం చేసిన దగ్గర్నించీ ప్రతి రోజూ పొద్దునా సాయత్రం ఆఫీసుకి వెళ్ళేవాడిని. సురేష్ గారు కూడా వచ్చేవారు. అక్కడే వారి మేనేజర్ చంద్రమోహన్, నాగభూషణం గారు బాగా పరిచయమయ్యారు. ఆఫీసు మేనేజర్ గురుమూర్తిగారు. చాలా నెమ్మదస్తుడు. వినయ సంపన్నడు. వారందరూ నాతో మంచిగా మాట్లాడేవాళ్ళు.

***

జనవరి 1st 1987. ఏడింటి కల్లా బాపినీడు గారింటికి వెళ్ళా. ప్రొడక్షన్ కారులో వారు నన్ను ప్రసాద్ ఓల్డ్ థియేటర్‌కి పంపారు (ఈ ప్రసాద్ ఓల్డ్ థియేటర్ శ్రీ ఇళయరాజాగారికి ఇప్పుడు పెర్మినెంట్ రికార్డింగ్ థియేటరైంది. ప్రసాద్ డీలక్స్‌ని కూడా చాలా కాలం ఇళయరాజాగారూ, ఆ తరువాత ‘దేవా’ గారూ వాడారు).

7.30 కల్లా వాసురావుగారు మ్యూజిషియన్స్‌కి నోట్స్ ఇచ్చేశారు. ఓ పక్కన ప్రాక్టీసు జరుగుతుంటే మరో పక్క నిశ్శబ్దంగా అన్నింటినీ గమనిస్తూ కూర్చున్నా. నా ఎక్సై‌ట్‌మెంట్‌లో టిఫిన్ తినడం కూడా మర్చిపోయా. వాసూరావు గారే “టిఫిన్ చేశారా?” అని అడిగి మరీ టిఫిన్ పెట్టించారు. అఫ్‌కోర్స్ ప్రొడక్షన్ టిఫినే అనుకోండీ!

ఒంటిగంటకి ఎస్.పి. బాలసుబ్రమ్మణ్యంగారు వస్తారని కబురందింది. నరేష్ కృష్ణ చౌదరి ఎలర్ట్‌గా నేను ఫెయిర్ చేసిచ్చిన కాపీని మళ్ళీ ఫెయిర్ చేసి సిద్ధంగా పెట్టారు. నరేష్ చేతి రాత అద్భుతంగా వుంటుంది. ఇండస్ట్రీ  మొత్తంలో ఒక్కో  కేరక్టర్‌కీ ఒక్కో కలర్ ఇంకుని వాడే ఏకైక అసోసియేట్ డైరక్టర్ ఆ రోజుల్లో అతనొక్కడే. రకరకాల బాల్ పెన్నులు, ఇంకు పెన్నులూ వుండేవి అతని దగ్గర.

ఒంటి గంటన్నరకి బాలుగారొచ్చారు. నరేష్ పేపరిచ్చారు. నేను టెన్షన్‌తో అటూ ఇటూ తచ్చాడుతున్నా. బాపినీడు గారు నన్ను లోపలికి పిలిచి, “రెండో చరణంలో మూడూ, నాలుగు లైన్లేమైనా మార్చగలరా.. ఇంకా ఎఫెక్టివ్‌గా” అన్నారు. గభాల్న బయటికిపోయి సిగరెట్టొకటి ముట్టించి మూడే మూడు నిముషాల్లో రెండో చరణం మొత్తం మార్చేశా. కారణం ఏమిటో, మార్చకపోతే పాటని తీసేస్తారన్న భయం. ఫ్రెష్ చరణం ఇవ్వగానే “శభాష్.. చాలా బాగా మార్చారు. టెన్షన్‌లో పని చెయ్యగలరో లేదో చూద్దామని అడిగా. చాలా బాగా మార్చారు. ఇప్పుడీ లిరిక్‌ని బాలూ గారికివ్వండి” అన్నారు.., భుజం తట్టి. నేను వాయిస్ రూమ్ లోకి వెళ్ళి కొత్తగా రాసిన చరణం బాలూగారికి ఇచ్చి “ఇది 2nd చరణం అండీ.. బాపినీడుగారు మీకు ఇవ్వమన్నారు” అని ఇచ్చా. ఆయన పాట చూస్తున్నారు. “అలాగే” అని తలెత్తకుండా కాయితం మాత్రం తీసుకున్నారు. నేను మళ్ళీ బాపినీడు గారి దగ్గరికి వెళ్ళా.

వాసూరావు గారు “స్టార్ట్ మ్యూజిక్” అనగానే 1st BGM ని ప్లే చెయ్యసాగారు మ్యూజిషియన్స్. బాలుగారుకి ‘సైన్’ చెయ్యగానే, “వినోదాల విందురా బాధలన్ని బంద్ రా” అని యమ హుషారుగా బాలూగారు పాడటం ప్రారంభించారు. నా గుండెల్లో ఉద్వేగం.. గబగబా బయటకి పోయి ఒంటరిగా వున్న ఓ బెంచీ మీద కూర్చుని భోరుమన్నాను. ఎక్కెక్కి ఏడ్చా.

కాసేపాగి కళ్ళు తుడుచుకుని థియేటర్లోకి నేను ప్రవేశించడం బాలూగారు బయటకి నిష్క్రమించడం ఒకేసారి జరిగింది. వాసూగారు నా వీపు మీద చెయ్యి వేసి, “వినండి.. ఇది మీ పాట” అని మళ్ళీ పాట వేయించారు. విని బాపినీడు గారి పాదాలకి నమస్కరించాను. ఇప్పడే ఉద్విగ్నతా లేదు. మనసు శాంత సరోవరమైంది.

“టెన్షన్ పడ్డారు కదూ..! మీరు ఏవడడం నేను చూశా. నాకూ అలానే వస్తాయి కన్నీళ్ళు.. అయితే దాచుకుంటాను” కారులో నన్ను ఆఫీసుకి తీసుకువెళ్తా అన్నారు బాపినీడుగారు నిజం.. వారూ చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్.

సాయంకాలం “ఇదిగో భువనచంద్ర్ గారూ, చెక్కు శుభసూచకం అని వెయ్యినూట పదహార్లు వ్రాశాను” అని నా తొలి చెక్కు ఇచ్చారు శివలింగేశ్వరరావుగారు. ఆ చెక్కు డాక్టరు గారి పాదల దగ్గర పెట్టాను. ఆయనా చాలా ఎమోషనల్‌గా నా తల మీద చేయివుంచి అస్పష్టంగా ఎన్నో దీవెనలిచ్చారు. ఇవాళ శివలింగేశ్వరరావు గారు లేరు.. డాక్టరుగారూ లేరు.. కానీ, నాడు జరిగిన సంఘటనకి సాక్షిగా నేనూ ఆ నితంబ వృక్షం అక్కడే వుంది.. నీడతో పాటు ఆశీస్సుల్ని కురిపిస్తూ..

***

ఇంతకీ నా మొదటి సాంగ్ ఏదంటారా? ఇదిగో..

నిర్మాతలు: A. రంగారావుగారు, N. శివలింగేశ్వరరావు గారు

శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్

దర్శకత్వం: శ్రీ విజయబాపినీడు

‘నాకూ పెళ్ళాం కావాలి’

సంగీతం: శ్రీ. ఎస్. వాసూరావు

రచన: భువన చంద్ర

గానం: శ్రీ S.P. బాలసుబ్రమణ్యం.

~

పల్లవి:
వినోదాల విందురా.. తందానా తందానా
బాధలన్నీ బందురా.. తందానా తందానా
సినిమా సాటి లేదురా.. డాన్స్ ఫైట్ మిక్స్ రా
మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడరా.. సినిమా సినిమా సినిమా ॥వినో॥

చరణం:
అన్నగారు తిరుగులేని సినిమా హీరో..
నేటి మేటి ముఖ్యమంత్రి దేఖో యారో..
MGR గద్దెనెక్కె సినిమాల్లోంచే
రీగన్ బచ్చెన్ కిచ్చేపేరు సినిమా ఫీల్డే
కులాలూ మతాలూ లేవుర బాబూ
బీదగొప్పా తేడాలిక్కడ వుండవు బాబూ ॥సినిమా సాటి॥

చరణం:
శ్రీరాముడు కాళిదాసు రామరాజూ
మహారాజు దిగి వచ్చే తెరపై నేడూ
హాటు హాటు సెక్స్ పట్లు కాకు మిస్స్
సినిమా అంటే చక్కలిగింతల మినీ బస్సు..
టిక్కెట్టు కొని హాల్లో అడుగుపెట్టా..
లేటెస్టు ఫేషన్లనీ వొంటబట్టూ.. ॥సినిమా సాటి॥

♤

నటీనటులు: చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్, నిశాంతి, కల్పన.

తొలి పరిచయం: భువన చంద్ర (రచయిత), నిశాంతి (నటి), కల్పన (ఇళవరసి.. తెలుగులో తొలిపరిచయం), కోట శంకరరావు (నటుడు), కలిదిండి జయ (అసిస్టెంట్ డైరక్టర్).

***

చలన చిత్ర పరిశ్రమ భయంకరమైన ‘స్లంప్’లో వుండగా 100 రోజులు దిగ్విజయంగా ఆడిన సినిమా ఇది. తొలి పరిచయంతోనే మేమంతా మొట్టమొదటి 100 days shield (జ్ఞాపిక) అందుకున్న సినిమా కూడా ఇదే. అయితే మరో విషయం వుంది. చిత్తగించండి.

విజయ బాపినీడుగారు

‘నాకూ పెళ్ళాం కావాలి’ తమిళ సినిమా ‘ఆణ్ పాకం’కి రీమేక్. అని ముందే చెప్పానుగా. కానీ రీమేక్‌కి ముందే ‘ఆణ్ పాకం’ సినిమాని ‘పెళ్ళాం పిచ్చోళ్ళు’ అని తెలుగులో అనువదించి రిలీజ్ చేశారట. అది 75 రోజులు ఆడిందిట. చిత్రం ఏమంటే, రీమేక్ చేశాక 100 days ఆడటం.. అదీ ‘స్లంప్’లో.

సినిమా రిలీజయ్యాక “ఇంకో పాట జాయిన్ చేస్తే ‘రన్’ ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ మన డబ్బు మనకి వచ్చేసింది గనక రిస్క్  వుండదు” అని శివలింగేశ్వరరావుగారూ విజయ బాపినీడుగారూ నిర్ణయించారు. మ్యూజిక్ సిటింగ్ ఏర్పాటు చేసి నన్ను పిలిపించారు. ఈసారి సిటింగ్ జరిగింది మళ్ళీ బాపినీడు గారి ఆఫీసు (ఇల్లు) లోనే. చాలా సేపు సిటింగ్ జరిగినా ఏ ట్యూనూ ఓ పట్టాన ok కాలేదు.

“సార్ ఏ సిట్యూయేషన్‍లో వస్తుందండీ యీ పాట” అని అడిగాను డైరెక్టరుగార్ని. సినిమా అప్పటికే బోలెడు సార్లు చూసుకోవడం ప్రతి సీనూ నాకు కొట్టిన పిండే. “ఏమీ స్పెసిఫిక్‌గా వుండదండీ.. రాజేంద్రప్రసాద్ ఓ లేడీస్ ఫిట్‌నెస్ రూమ్ (జిమ్) లోకి దూరతాడు. అక్కడండే వాళ్ళందర్నీ చూసి, మహా ముచ్చట పడిపోయి మనటైటిల్ వుంది చూశారా, ‘నాకూ పెళ్ళం కావాలి’ అనే టైటిల్, ఆ టైటిల్‌తో ఓ పాట పాడతాడు” అన్నారు బాపినీడు గారు. నాకు ఠక్కున బల్బు వెలిగింది. వాసూరావుగారి వైపుకి తిరిగి “సార్.. వినోదాల విందురా బాధలన్నీ బంద్ రా స్థానంలో నాకూ పెళ్ళం కావాలీ.. మూడూ ముళ్ళు వెయ్యాలీ అంటే కరెక్టుగా సరిపోతుంది కదూ!” అన్నాను. “యస్.. పెర్‌ఫెక్టుగా సరిపోతుంది.. మరి సినిమా సినిమా అనే కోరస్ పదాల దగ్గర ఏం చేద్దాం?” అన్నారు. “కావాలీ.. కావాలీ” అనిపిస్తే సరిపోతుందిగా” అన్నాను. బాపినీడుగారు వెంటనే “ok. అయితే అదే ట్యూన్‍కి వ్రాయండి” అని నవ్వారు. గంటలో పాట రెడీ అయ్యి మరుసటి రోజునే ట్రాక్ మిక్స్ చేశారు. నా లక్ ఏమంటే ఒకే ట్యూన్‌కి రెండు విభిన్నమైన పాటలు, ఒకటి టైటిల్స్ మీద వచ్చే సాంగూ, రెండు టైటిల్ సాంగూ వ్రాయగలగడం. సరికొత్తగా ఫీల్డుకొచ్చిన ఏ రైటర్‌కీ ఇలాంటి లక్కీ ఛాన్స్ లభించి వుంటుందని నేను అనుకోను. అన్నట్టు ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌కి ‘క’ అన్న అక్షరం పలకదు. ‘క’ బదులు ‘త’ అంటాడు. So పాట కూడా అలాగే వ్రాశాను. లిరిక్స్ చిత్తగించండి.

~

నిర్మాతలు: శ్రీ ఎ. రంగారావుగారు, N. శివలింగేశ్వరావుగారు

దర్శకత్వం: శ్రీ విజయబాపినీడు

శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్

నాకూ పెళ్ళాం కావాలి

సంగీతం: ఎస్. వాసూరావు

రచన: భువనచంద్ర

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

~

పల్లవి:
నాతూ పెళ్ళం తావాలీ.. తావాలీ.. తావాలీ
మూడు ముళ్ళు వెయ్యాలీ వెయ్యాలీ.. వెయ్యాలీ
పెళ్ళంటేనే థ్రిల్లంటా.. వైఫుంటేనే లైఫంటా
పెళ్ళం లేని లైఫ్ వద్దాంటా.. టా.. టా.. టా ॥నాతూ॥

చరణం 1:
సిగ్గుల మొగ్గ పీటల మీద తూచుందంటే
తాళిని తట్టి తలంబ్రాలు పోసుతుంటా
ఓర తంట నన్ను చూసి నవ్విందంటే
ష్యూర్‍షాట్ పెళ్ళాం నాకు బెల్లమంటా
తట్నాలూ తానుకలేవీ అడగబోనూ
పిల్లుంటే చాలు పెళ్ళితి సిద్ధం నేనూ ॥పెళ్ళంటేనే॥

చరణం 2:
తొబ్బరి ముత్తలాంటి పిల్ల దొరితిందంటే
బుగ్గలు రెండూ తొరితి ముద్దులు పెట్టుతుంటా
పట్టుచీర తొట్టి పత్తన చేరిందంటే
పగలూ రాత్రి నువ్వే నాతు లోతమంటా
అచ్చోసిన ఆంబోతల్లే తిరగబోనూ
మేరేజికి వాయిదాలు వెయ్యబోనూ ॥పెళ్ళంటేనే॥

***

నా మొదటి సాంగే నాకు రెండో సాంగ్‌ని మాత్రమే కాక 100 days షీల్డుని కూడా తెచ్చిపెట్టడం ఏనాటికీ నేను మరిచిపోను. మరిచిపోలేని మధురానుభవం అది!

(ఇంకా ఉంది)

Exit mobile version