[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]
ఎక్సైట్మెంట్లో కొన్ని మరిచిపోతాం. కొన్నింటిని గమనించము. డాక్టరు గారి దగ్గరకి ఓ అమ్మాయి జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేది. చాలా డాషింగ్ అండ్ డేరింగ్‌గా వుండేది. “రాజుగారూ.. యీ అమ్మాయి పేరు కలిదిండి జయ. పోస్టు గ్రాడ్యూయేట్ మాత్రమే కాదు చాలా షార్ప్ జర్నలిస్టు.. అండ్.. etc. etc.” అని జలంధర గారు నాకు ఆ అమ్మాయిని పరిచయం చేశారు. ఆ అమ్మాయే నేటి హిట్ లేడీ డైరక్టర్ బి. జయ. వండర్ వరల్డ్ పత్రిక సంపాదకురాలు. సూపర్ హిట్ మేగజైన్ (సినీ)కి శ్రీ BA రాజుతో బాటు యజమానురాలు. ఆ తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొన్ని సినిమాలు చేసి, లవ్లీ, చంటిగాడు, వైశాఖం లాంటి సూపర్ హిట్ ఫిలిమ్స్‌ని ఇచ్చింది.
బి. జయ
“వీరు నాకెందుకు తెలీదు.. వీరిని పరిచయం చేసింది బాపినీడుగారేగా” అని జలంధరగారితో అని, “మీరు నన్ను గమనించలేదుగానీ, నేనూ బాపినీడుగారి దగ్గర అసిస్టెంట్‌గా డైరక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నా” అన్నది. తరవాత నేను గమనించిందేమంటే, ఎవరికి సహాయం చెయ్యాలన్నా ముందు వరసలో వుండే మనుషులో మొదటి వ్యక్తి జయ అని. హైలీ ఇంటెలిజంట్, హైలీ సెన్సిటివ్ ఎండ్ హైలీ సెన్సిబుల్.
డాక్టరుగారి దగ్గరికి సాయంత్రాలు వచ్చే బేచ్‌లో తరచుగా జయ కూడా వుండేది. ఏకవచనం ఎందుకంటే, తను నా కంటే చాలా చిన్న. అంతే కాదు ఆమె అంటే నాకు అంతులేని వాత్సల్యం. ఇప్పటికీ ప్రేమగా “కవిగారూ” అనే పిలుస్తుంది. ఆ స్నేహం సినిమాకి అతీతమైనది (ఇప్పుడామె మన మధ్య లేదు).
“అసలు మీ గురించి కాస్త చెప్పండి. వింటాను.” అని వడపళని రోడ్డు పక్కన స్కూటర్ ఆపి మరీ నన్ను అడిగి నా గురించిన వివరాలు తను అడగటం ఏనాటికీ మర్చిపోలేను. ఆ తరువాత తను నాకు చేసిన సహాయం గురించి తరువాత చెబుతాను. ఇప్పుడు జయగారి విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఓ పక్క జర్నలిస్ట్‌గా వుంటూనే, రచనలు సాగిస్తూనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి ధైర్యంగా ఎంటరైన ఏకైక స్త్రీ ఆమె ఒక్కతే. అంతకు ముందు సుహాసిని (నటి) కెమేరా డిపార్ట్మెంట్లో కొంత పని చేసినా జర్నలిస్ట్ ప్రొఫెషన్ నుంచి డైరెక్టరుగా మారింది జయ ఒక్కతే. అఫ్కోర్స్ విజయనిర్మలగారు దర్శకురాలిగా గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించారు. అది వేరే విషయం. కారణం ఆవిడ నటి. ఆప్పటికే భానుమతిగారూ, సావిత్రిగారూ దర్శకత్వం చేపట్టి విజయం సాధించారు.
సినిమా రిలీజ్ రోజయిన దగ్గర్నించీ రోజూ ఆనందన్ స్ట్రీట్ లో వున్న శ్రీనాథ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌కి వెళ్ళేవాడ్ని. ఓ రోజు అనుకోకుండా అన్నాను “ఈ సినిమా వందరోజులూ ఆడుతుంది.. నాకు ఫస్టు షీల్టు ఇస్తుంది” అని. కానీ, ఎవరూ అంత నమ్మకం పెట్టుకోలేదు. చివరికి నా మాటే నిజమైంది.
సినిమాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. కానీ ముందుకి ఎలాగు వెళ్ళడం. అదీ గాక బాపినీడుగారో మాట నా రికార్డింగ్ రోజునే అన్నారు, “భువనచంద్రగారూ, నేను మీ పేరుని ఎవరికీ రికమెండ్ చెయ్యను. ఎందుకంటే, రికమెండ్ చేశానని నా మీద గౌరవంతో మిమ్మల్ని పిలిపిస్తారు. కానీ పని మాత్రం జరగదు. అదే మీ పాట hit అయిందనుకోండి వాళ్ళంత వాళ్ళే మీరు ఎక్కడున్నా సరే వెతికి మరీ వ్రాయించుకుంటారు. మీరు ఎంత శ్రద్ధతో రాస్తే మీకంత మంచిది.. అయితే నేను తీసే సినిమాల్లో మాత్రం తప్పక మీకు అవకాశం ఇస్తా” అన్నారు.
ఆ మాట మనసా వాచా కర్మణా ఈనాటి వరకూ కూడా ఫాలో అవుతున్నా. నాకు పాట ఇమ్మని యినాటి వరకూ ఎవర్ని నేను అడగలేదు. మొదటిసారి చివరిసారి కూడా బాపినీడు గారిని అడగడమే.
చిత్రం ఏమంటే ఓ సంస్థ పరిచయం చేసిన వ్యక్తికీ, సినిమా హిట్టయితే తప్పని సరిగా రెండో ఛాన్స్ ఇస్తారు. ‘నాకూ పెళ్ళం కావాలి’ తరువాత మరో సినిమాని శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్ వారు వెంటనే వేరే వాళ్ళతో మొదలు పెట్టినా, పాట రాసే అవకాశం మాత్రం నాకు రాలేదు. చిత్రంగా ఆ అవకాశం బాపినీడు గారి దగ్గర్నించే వచ్చింది. అప్పట్లో గొప్ప వెలుగు వెలిగిన గోపీకృష్ణ కంబైన్స్ వారు బాపినీడు గారి దర్శకత్వంలో తీసిన ‘మా ఇంటి మహారాజు’ రూపంలో. ఆ సంస్థ అధిపతి నన్ అదర్ దేన్ హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజుగారూ, వారి సోదరులు యు. సూర్యనారాయణరాజుగారూ. సుక్షత్రియుల కంపెనీ అది. అన్నీ రాయల్ గానే వుండేవి.. కృష్ణంరాజుగారి పలుకు, మన్నన నిజంగా అద్భతంగా ఉండేది.
ఓ రోజు విజయబాపినీడుగారు పిలిపించారు, వారి ప్రొడక్షన్ వ్వవహారాలు చూసే గుత్తా మధుసూదన్ రావుగార్ని పంపి. మహదానందంగా వెళ్ళాను.
“ఏమండీ.. సినిమా అయ్యాక మళ్ళీ కనిపింలేదే?” అన్నారు బాపినీడుగారు. “మీరు బిజీగా వుంటారుగదా.. డిస్టర్బ్ చేసినట్టు అవుతుందేమోనని?” అన్నాను. అప్పుడర్థమయింది ఆయనకి సినిమా నీళ్ళు ఇంకా నాకు వంట బట్టలేదని.
“మరి ఏం చేస్తున్నారూ?” అన్నారు.
“మరో మూడు డిటెక్టివ్ నవల్స్ రాశానండి.. అలాగే ట్రాన్స్లేషన్లూ అప్పుడప్పుడూ చేస్తున్నాండి” అన్నాను.
ఓ నిముషం నావంక చూసి ఆఫీసు మేనేజరు కమ్ అకౌంటెట్ సరోజిని గార్ని పిలిచి “వీరు ఎప్పుడు డబ్బు అడిగినా వెంటనే ఇవ్వండి. ఎంత అడిగినా ఇవ్వండి. ఇచ్చే ముందు నా పర్మిషన్ అక్కర్లేదు.” అని ఆవిడతో చెప్పి, “ఇకనించీ మీరు మా సంస్థ మెంబర్ అనుకోండి. డబ్బుకి ఏనాడూ ఇబ్బంది పడొద్దు.. కావాల్సినంత తీసుకోండి.. మెల్లిగా పాటలు రాసి తీర్చుకుందురుగాని” అన్నారు.
దేవుడా.. ఎంత ప్రేమ.. ఎంత అభిమానం.. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆయన పకపకా నవ్వి “మీరేం మిలట్రీవారండీ బాబూ.. ఇంత సున్నితంగా వుంటే ఎట్టా బతుకుతారూ?” అని మా వెస్ట్ గోదావరి యాసతో అన్నారు. ఆ రోజే నాతో చెప్పారు.. “రేపట్నించీ ‘మా ఇంటి మహారాజు’ అనే సినిమాకి స్క్రిప్టు వర్క్ మొదలెడుతున్నాం. మీరూ సిటింగ్‌లో కూర్చోండి. బ్రేక్‌ఫాస్టూ భోజనం ఇక్కడే. రాత్రి కూడా లేటైతే డిన్నర్ మా అందరితో పాటు మీరూ చెయ్యచ్చు” అన్నారు. స్క్రిప్టు వర్క్ అనే సరికి నాకు ఉత్సాహం ఉప్పొంగిపోయింది. ఇంకే కావాలి.
***
‘మా ఇంటి మహారాజు’ వర్క్ మొదలయింది. శ్రీ జి. సత్యమూర్తిగారూ, బాబూరావుగారూ, నరేష్ అందరం సీన్ బై సీన్లు డిస్కషన్ చేసుకుంటూ ముందుకెడుతున్నాం. కొన్ని సీన్లు కాగానే “భువనచంద్రగారూ.. ఇక్కడో పాట పెడితే బావుంటుంది, వ్రాయండి” అనేవారు బాపినీడుగారు. ఆ సన్నివేశానికి తగిన పాట నేనే రాసుకుని ట్యూన్ కట్టుకుని పాడి వినిపించేవాడ్ని. టైటిల్ సాంగ్‌తో సహా మొత్తం 8 పాటలూ ఓ బుర్రకథ వ్రాశాను. అఫ్కోర్స్ నిడివి ఎక్కువ అవుతుందని బుర్రకథని లాస్ట్‌లో మేమే తీసేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ వుండగానే పూర్తయింది. ఓ రోజున కృష్ణంరాజుగారు విజయిబాపినీడు గారింటికి వచ్చి మార్పులు చేర్పులు విన్నారు. నేను పాడిన పాటలు ఎప్పటికప్పుడు నరేష్ బాపినీడు గారి టేప్ రికార్డర్లో రికార్డ్ చేసేవాడు. కృష్ణంరాజుగారికి ఆ పాటలన్నీ వినిపించారు. ఆయన చాలా సంతోషించారు. కానీ, ఆయన పాటలు విన్నప్పుడు నేనక్కడ లేను. బాపినీడు గారి పక్కింట్లోనే వున్న సత్యమూర్తిగారితో మాట్లాడుతున్నాను. మా కబుర్లలో మేము ఎంతగా మునిగిపోయామంటే, కృష్ణంరాజుగారు వెళ్ళిపోయాక గానీ వారు వచ్చిన సంగతి తెలీలేదు.
షూటింగ్ ముందరే మొత్తం సాంగ్స్ అన్నీ రికార్డు చేసేద్దామని నిర్ణయించారు బాపినీడు గారు. ఒకసారి ఎవరితోనైనా అనుబంధం ఏర్పడితే, ఏనాడూ ఆ అనుబంధాన్ని విస్మరించని వ్యక్తిత్వం బాపినీడుగారిది. అందుకే యీ సినిమాకి మళ్ళీ మా బేచే అంటే, శ్రీ వాసూరావుగారే సంగీత దర్శకులు.
నేను రాసిన పాటలకి అద్భుతమైన ట్యూన్లు కట్టారు వాసూరావుగారు. మొట్టమొదట రికార్డైన పాట –
“అందాల హరివిల్లు మా బొమ్మరిల్లు
నవ్వులు పూచేటి ఓ పొదరిల్లు” అనే టైటిల్ సాంగ్.
రికార్డింగ్ జరిగింది విజయాగార్డెన్స్, విజయడీలక్స్ థియేటర్లో.
విజయాగార్డెన్స్‌లో రికార్డింగ్ జరిగితే సినిమా సూపర్ హిట్ అనే మాట ఎప్పటినుంచో వాడుకలో వుంది. అసలా గార్డెన్ లోకి అడుగుపెట్టడం అదే మొదటి సారి నాకు.
బాబూరావుగారు నాకు విజయగార్డెన్స్ని తిప్పి తిప్పి చూపిస్తూ “అదిగో అక్కడే ‘గుండమ్మ కథ’లో ఫలానా ఫలనానా సీన్స్ తీసింది.. ఇదిగో ఈ బుల్లి కొలనులాంటి గుంటలోనే ‘జగదేకవీరుని కథ’లోని ‘జలకాలాటలలో’ పాట పిక్చరైజ్ చేసింది, అదిగో అక్కడే, ‘ప్రేమయాత్రలకు బృందావనమూ’ ఘాటింగ్ జరిగింది..” అంటూ అద్భుతంగా వివరించారు. నా ఒళ్ళు పులకరించిపోయింది.
బాబూరావుగారితో రచయిత
“అంతే కాదు.. అదిగో ఆ చెట్టు కింద ఓ బండవుంది చూశారూ.. పింగళిగారు అక్కడే కూర్చుని పాటలు రాసేవారు.. ఇదిగో యీ చెట్టు కిందే ఇప్పుడు వేటూరిగారు కుర్చీ వేయించుకుని పాటలు రాసేది.” అంటూ గతాన్ని వర్తమానాన్ని కలబోసి వివరించారు. ఆహా.. కె.వి.రెడ్డిగారూ, బి.ఎన్.రెడ్డిగారూ, పింగళి నాగేంద్రరావుగారూ వంటి మహామహులు తిరిగిన చోటు ఇది. వారి పాదముద్రలతో పులకించిన చోటు కదా ఇదీ అని మురిసిపోయా (స్నేహితులారా.. నిజం.. యీ పదాలు రాస్తున్న యీ క్షణం కూడా నా గుండె ఆనందంలో వేగాన్ని పెంచుకుంది. ఆనందం పొంగి కళ్ళల్లో చెమ్మ చేరింది). నేనా ఆనందంలో వుండగానే పి. సుశీలగారి కారు డీలక్స్ థియేటర్ ముందు ఆగింది. సమయం ఒంటిగంట. గబగబా లోపలికి వెళ్ళాం. పది నిముషాల్లో బాలూగారి కారు కూడా వచ్చింది. అప్పట్లో హీరోల కాల్షీట్లయినా దొరికేవి గానీ, బాలూగారి కాల్ షీట్లు దొరకడం కష్టమయ్యేది. కానీ, మా వాసూరావు గారికీ బాలూగారికీ వున్న అనుబంధం వేరు. “బావా” అంటే “బావా” అని పిలుచుకునేవారు ఆత్మీయంగా. దక్షిణ భారతదేశంలో నాడూ ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకి కూడా బిజీయస్ట్ సింగర్ బాలూగారే. పాట మొదలైంది. అద్భుతంగా పాడారు. నా మొదటి సినిమాలోని రెండు పాటలూ పాడింది బాలూగారే. కానీ, సుశీల గారు నా పాట పాడిన మొట్టమొదటి సినిమా ‘మా ఇంటి మాహారాజు’. సుశీల గారంటే సంగీత ప్రపంచంలో ఓ దేవత అప్పటికే. నేను పెరుగుతూ విన్నది ఘంటసాల సుశీల పాటలే. ఆవిడ నా పాట పాడడం అనేది ఇప్పటికీ నేను కలగన్న నిజమే.
ఆ పాట అయిపోగానే బాలూగారు వెళ్ళిపోయారు. సుశీల గారూ కారు ఎక్కారు. సెండాఫ్‌గా నమస్తే చెప్పడానికి కారు దగ్గరికి వెళ్ళాను. “మీరెక్కడికి వెళ్ళాలీ?” అడిగారు.. కార్ ఎక్కుతూ. “టి. నగర్ అండీ” అన్నాను. “రండి ఫ్రంట్ సీట్లో కూర్చోండి, డ్రాప్ చేస్తా” అన్నారు. వెంటనే కారెక్కాను. సుశీలగారి కార్లో సుశీలగారితో ప్రయాణించే అదృష్టం ఎంత మందికి దక్కుతుందీ? అదీ ఓ మిలట్రీ వాడికి దక్కడం పూర్వజన్మ సుకృతమేగా!
కార్లో కూర్చోగానే సుశీల గారు ట్రాన్సిస్టర్ తీసి హిందీ పాటలు వింటూ వున్నారు. దేముడెంత సమవర్తి.. నార్త్‌కి లతామంగేష్కర్‌ని ఇస్తే సౌత్‌కి పి. సుశీలని ఇచ్చాడు.. ఇద్దరూ గాన సరస్వతులేగా!
***
టి. నగర్లో సుశీలగారి కారు దిగిన రెండు నిముషాల్లోనే బాపినీడు గారి డ్రైవర్ నన్ను ఆపాడు. “ఏమిటీ?” అంటే, “సార్, మీరు ఎవరితోటీ చెప్పకుండా సుశీలగారి కారు ఎక్కి వచ్చేశారు. స్టూడియోలో బాపినీడుగారు ఆ విషయం తెలిసి వెంటనే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు” అన్నారు.
మాట్లాడకుండా కారెక్కా. పావుగంటలో స్టూడియోకి చేరాము. స్టూడియో దగ్గర కారెక్కబోతూ వి.మధుసూదన్ రావుగారు కనిపించారు. వారి ఫోటోలు చూడటమే గానీ, ఎదురుగా ఆయన్ని చూడటం అదే మొదటిసారి. బాపినీడుగారు గబగబ వచ్చి “సార్.. ఇతనే ఆ పాట వ్రాసింది” అని నన్ను విక్టరీ మధుసుదన్ రావుగారికి పరిచయం చేశారు.
“చాలా బాగుంది. ఓ గంట ఆగి AVM స్టూడియోకి రండి. అక్కడో ట్యూన్ మీకిస్తాను. పాట రాద్దురుగానీ” అన్నారు. అంటూనే కారెక్కి వెళ్ళిపోయారు.
“భువనచంద్రగారూ, నిజంగా మీరు లక్కీ. మధుసూదనరావుగారంతటి వారు మీ చేత పాట వ్రాయించుకుంటానంటే ఇంకేం కావాలి” భుజం తట్టి ఆనందంగా అన్నారు విజయబాపినీడుగారు.
మనసా వాచా కర్మణా చెబుతున్నాను.. నా ఉన్నతిని చూసి అత్యంత ఆనందపడిందీ, అన్ని విధాలా నాకు మార్గదర్శకం చేసిందీ శ్రీ విజయబాపినీడుగారే. పొద్దున్న ఓ పాట రికార్డై, మధ్యాన్నానికి మరో పాట ట్యూన్ తీసుకోవడం ఆ రోజే మొదలు. AVM కి వెళ్ళాను. AVM ‘G’ స్టూడియోకి వెళ్ళడం అది రెండోసారి. మొదటిసారి వెళ్ళింది జాలాదిగారితో. అక్కడ మధుసూధనరావుగారు నన్ను మళ్ళీ అభినందించి “చక్రవర్తీ.. ఆ ట్యూన్ ఇతనికివ్వు.. పొద్దున ఇతని పాట విన్నా.. బాగా రాశాడు..” అన్నారు.
చక్రవర్తి గారూ నావంక చూసి, “మీరు ఇది వరకు ఇక్కడికి వచ్చారా? చూసిన మొహంలా వుందీ!” అన్నారు. “అవునండీ జాలాదిగారితో వచ్చాను” అన్నాను.
“OK OK” అంటూ స్టూడియో లోపలికి తీసికెళ్ళి ట్యూన్ వినిపించారు. దాన్ని రికార్డు చేసుకుని బయటికొస్తే మధుసూదన్ రావుగారు వెళ్ళిపోయారని తెలిసింది. నేను వడపళని బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ వచ్చి, అక్కడ 12 B బస్సెక్కి టి. నగర్ లో దిగి రూమ్‌కి వెళ్ళిపోయాను.
మంచో చెడో గానీ, నాకో అలవాటుంది. ఏ పనీ లేనప్పుడు కలలు గంటూ కలలోనే గడిపేస్తా. పని వస్తే మాత్రం వెంటనే పని మొదలెడతా. ఒక్క క్షణం కూడా వేస్టు చెయ్యను. మరో చిత్రం ఏమంటే, అనుకున్న పని పూర్తయ్యేదాక మరి దేని మీదా ధ్యాస వుండదు. పని అయ్యేదాకా మనసులోని టెన్షనూ తగ్గదు.
బస్సులోనే ఆ ట్యూన్‌ని నాలుగేదు సార్లు విన్నాను. ట్యూన్ వచ్చేసింది. చాలా చక్కని మెలోడీ. ట్యూన్ వింటూ వుండగానే “నువ్వంటే నా కెంతో ప్రేమా” అనే పదం బుర్రలో నాటుకుంది.
రూమ్‌కి వెళ్ళగానే బాసింబట్టా వేసుకుని వ్రాయడం మొదలెట్టాను. అటూ ఇటూ తిరుగుతూ మధ్యలో కాసేపు కూర్చుంటూ ఓ గంటకల్లా ఓ పల్లవీ, చరణం వ్రాశా. అప్పడర్థమయింది.. పొద్దున్న స్టూడియోలో తిన్న టిఫిన్ తప్ప మరేదీ తీసుకోలేదని. టైమ్ చూస్తే నాలుగు. కిందకి దిగి భగవతీ విలాస్‌లో ఓ కప్పు వేడి వేడి కాఫీ తాగి, మళ్ళీ రూమ్‌కి వచ్చి మరో అరగంటలో రెండో చరణం పూర్తి చేశాను.
అయిదున్నర కల్లా వి. మధుసూదనరావు గారు చెప్పిన ‘పెనిన్సులా’ హోటల్‌కి వెళ్ళాను. నన్ను చూడగానే “ఏమిటీ?” అన్నారు. “పాట వ్రాశానండి. తెచ్చాను” అన్నాను. “ఓహ్.. ఇంత త్వరగానా?” అన్నారు. పాడి వినిపించాను. “గుడ్.. బాగుంది. రేపు మార్నింగ్ ఎనిమిందిటికి సిద్ధంగా వుండండి. పిక్ అప్ చేసుకుంటా. రేపే రికార్డింగ్” అని నేను ఇచ్చిన లిరిక్ పేపరు మీద సంతకం పేట్టి నాకు ఇచ్చారు. మహదానందంగా నడుచుకుంటూ వెళ్ళి P.T. బూత్ నించి call చేసి బాపినీడుగారికి విషయం చెప్పాను.
“వేరీ గుడ్.. వెంటనే వ్రాయడం మంచిదైంది. అలా వెంటనే రాసి యిస్తే ఇంప్రెషన్ బాగుంటుంది. వెరీ గుడ్” అని ఉత్సాహపరిచారు.
ఆ వెంటనే వ్రాయడం అనేది బాపినీడుగారు నాకు నేర్పిన విషయం అని వారికే తేలీదు. అదెలా అంటే, ‘మా ఇంటి మహారాజు’ సిటింగ్స్‌లో ఏదన్నా సిట్యుయేషన్ అనుకోగానే “ఈ సన్నివేశానికి పాట వ్రాయండి” అని చెప్పేవారు. చెప్పిన పది నిముషాలలోపులోనే “ఏవండీ.. పాట పూర్తి చేశారా?” అనడిగేవారు. నాకేమంటే, పాట వెంటనే వ్రాయకపోతే ‘పంపించేస్తార’ని భయం. దాంతో, మరో టెన్షన్ పడిపోతూ పాట గబగబా రాసేవాడ్ని.
ఆ తరువాత ఆయనే అన్నారు “పత్రిక పని చూడాలంటే మాములుగా కుదరదండీ. లాస్ట్ మినిట్‌లో పిచ్చ టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ వస్తేనే గబగబా పని పూర్తి అవుతుంది.” అని. సో, టెన్షన్లో పని చేయడం అలా ఆయన దగ్గరే నాకు అలవాటైంది.
అక్కడి నించి పాండీబజార్‌కి వెళ్ళి యీ ‘ఖుష్ ఖబర్’ డాక్టరుగారికి వినిపించి రూమ్‌కి చేరా. పొద్దున్నించీ పాట తోటీ, నడక తోటీ తెగ అలిసిపోయానేమో, పిచ్చ నిద్ర వచ్చింది. పడుకున్నాను. లేచేసరికి రాత్రి తొమ్మిదిన్నర. ఎప్పుడొచ్చాడో కానీ, రబ్బీ, రూమ్‌లో వున్నాడు. ఎలెక్ట్రిక్ హీటర్ మీద రైసూ పప్పు కలిపి పులగం వొండుతున్నాడు. నేను లేవగానే, “ఏమిటీ నీరసంగా వున్నారూ? భోం చెయ్యలేదా?” అన్నాడు. “లేదండీ” అనగానే, “సరే.. నేను వొండే పులగాన్నే మీరూ కొంచెం తిందురుగాని. నెల్లూరి నించి తెచ్చిన ఫ్రెష్ టమాటో పచ్చడీ, గోంగూర పచ్చడీ వున్నాయి” అన్నాడు. నీరసంగా వున్న వాడికి ఇంతకంటే మంచి కబురు మరే ముంటుంది.
ఇద్దరం షేర్ చేసుకుని తినేశాక అతను పక్క రూమ్ వాళ్ళతో బాతాఖానికి వెడితే నేను మళ్ళీ పాటని పట్టుకుని కూర్చున్నా. పల్లవిలోనూ, మొదటి చరణంలోనూ ప్రతి లైను చివరా ‘ప్రేమ’ అనే పదం వస్తుంది. రెండో చరణంలో అది లేదు. అందుకే పదం వచ్చేట్టు ఓ గంటన్నర కష్టపడి రాశా. బ్రహ్మండంగా వుందనిపించిది. హాయిగా అప్పుడు పడుకున్నాను.
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు”, “మహతి”, “పాండిబజార్ కథలు” అనే పుస్తకాలు వెలువరించారు.
