Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-8

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

‘ప్రాణస్నేహితులు’ సినిమా గురించి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఆత్రేయగారి ఆశీస్సులతో మధుసూధనరావుగారు, కృష్ణంరాజుగార్ల ఆప్యాయతానురాగాలతో 5 పాటలు వ్రాశాను. అందులో ఓ ‘మందు’ పాట వుంది. మిత్రులిద్దరూ సరదాగా మందు కొడుతూ పాడే పాట. పాట వ్రాయడం అయిపోయింది. విజయ డీలక్స్‌లో రికార్డింగ్. ఒకేసారి రెండు పాటలు. ఓ పక్క ‘స్నేహానికన్న మిన్న’ పాట రికార్డవుతుంది.

ఆ పాట గురించిన వ్యవహారం అంతా చెబితే MVVS బాబురావుగారన్నారు.. “తినే ప్రతి మెతుకు మీదా తినే వారి పేరు రాయబడివున్నట్టు, ప్రతి పాట మీద కూడా రాసేవాడి పేరు వ్రాయబడి వుంటుందండీ.. అందుకే చివరికి మీ పాట రికార్డవుతోంది” అని. ఆయనేదో పని మీద విజయా గార్డెన్స్‌కి వచ్చారు.

మధుసూదనరావుగారు నన్ను పిలిచి ‘భువనం.. గగనం’ అనే పాటలోని (నేను వ్రాసిందే) కొన్ని లైన్స్ మార్చమనడంతో నేను వాకిట్లో కూర్చుని మారుస్తున్నాను. ఈలోగా రెండో పాట ‘మిత్రమా మిత్రమా సౌఖ్యమా’ అన్న మందు పాటని ముగించేసి బాలూగారు అమెరికా వెళ్ళడం కోసం వెళ్ళిపోయారు. ఆయన సంవత్సరానికి రెండు మూడు సార్లైనా ప్రోగ్రామ్స్ నిమిత్తం అమెరికా వెళ్ళేవారు. ఆయన తిరిగొచ్చే వరకూ అందరి హీరోల పాటలూ ‘వెయింటింగ్’ లోనే వుండేవి. షూటింగ్‌కి మాత్రం ‘ట్రాక్‍ సింగర్’తో పాడించి షూట్ చేసుకునేవారు.

నేను లోపలికి వెళ్ళి పాట విందును గదా, ఓ చోట నేను వ్రాసిన లిరికుకి బదులుగా వేరేది వినిపిస్తోంది. “సార్, లిరికు మారింది సార్” అని కంగారుగా మధుసూదనరావుగారితో అన్నాను. “ఏం మారిందీ?” ఆశ్చర్యంగా అడిగారాయన. “సార్.. నేను ‘స్నేహమంటే కాదు వ్యాపారం.. మనసు బ్రతకడానికోధారం అని రాస్తే, స్నేహమంటే కాదు వ్యాపారం మనిషి బతకడాని కాధారం’ అని వుంది సార్” అన్నాను. లిరిక్ పేపరు తెప్పించి చూస్తే నేను వ్రాసిన ‘మనసు’ని కొట్టేసి వేరే హేండ్ రైటరింగ్‌తో ‘మనిషి’ అని రాసి వుంది. పిచ్చి కోపంతో మధుసూధనరావుగారు ఆసిస్టెంట్ కుర్రవాళ్ళని పిలిచి ఎంక్వయిరీ చేస్తే తేలింది. ఓ కొత్త అసిస్టెంట్ తన ‘తెలివి’ని వుపయోగించి, ‘మనసు’ని కొట్టేసి ‘మనిషి’ అని రాశాడని. మధుసూదన రావుగారు క్లాసు పీకిన విషయం పక్కన పెడితే, ఏం చేస్తాం, ఆల్రెడీ సింగర్ వెళ్ళిపోయాకా. విచిత్రమేమంటే ఆ కుర్రాడు నా దగ్గరికొచ్చి “నేను కరెక్టు చేసిం దాంట్లో తప్పేముంది సార్? మనిషి బ్రతకడానికి ముఖ్యం స్నేహమే కదా?” అని నిష్ఠూరంగా అడిగాడు.

“నాయినా మనిషి బ్రతకడానికి ముఖ్యంగా కావాలసింది రోటీ కపడా ఔర్ మకాన్. అంటే కూడూ గూడ్డూ గుడ్డా. మనసు బ్రతకడానికి నిజంగా కావల్సినవి స్నేహమూ, ప్రేమా” నిట్టూర్చి అన్నాను. ఎందుకంటే ఓ చక్కని లైన్ ఓ మూర్ఖుడి తప్పు వల్ల మిస్ అయిందనే బాధ.

“అలాగా! నేనేమో మీరు తప్పుగా రాశారని కరెక్టు చేశాను” అని చక్కాబోయాడా మానవుడు. నాటి నించీ నేటి వరకూ రికార్డింగ్‌లో నేను ఖచ్చితంగా వుంటా. ఫెయిర్ కాపీ  నేనే వ్రాసిస్తా గాయనీ గాయకులకీ, అటువంటి తప్పు మళ్ళీ జరక్కుండా వుండటం కోసం.

***

మరో బాధాకరమైన విషయం ఏమంటే, ‘సింగిల్ కార్డు’ రాసినా నా పేరు మెయిన్ టైటిల్స్‌లో వెయ్యలేదు. రోలింగ్ టైటిల్స్‌లో వేశారు. అంటే సినిమా పూర్తయ్యాక వరసగా వచ్చే పేర్లలో అన్నమాట. ఆపాటికి అందరూ బయటికి పోతారుగానీ, పాటలు రాసిన వాడెవరా అని ఆత్రంగా wait చేస్తూ రోలింగ్ టైటిల్స్‌ని చూడరు కదా!

తరవాత తెలిసింది ‘ఓ అతి తెలివి దురాశాపరుడు’ పెద్దగా తన టైటిల్స్ వేసుకోవడం కోసం నా దాన్ని చివర్లో అనామకంగా పంపేశాడని. కారణం అతనికి కొత్తగా పెళ్ళవ్వడం. మరి తన గొప్పతనం భార్యకి భూతద్దంలో చూపించాలి గదా!

ఇటువంటి వారూ మన పక్కనే మనతోనే స్నేహంగా వున్నట్టుగా వుంటుంటారనీ, సమయం దొరగ్గానే వారి స్వభావం ఇలా చూపిస్తారనీ అర్థమైంది.

“మధుసూదనరావుగారికీ, కృష్ణం రాజుగారికీ చెబితే సరిపోయేదిగా?” అని బాబురావుగారు నన్నడిగారు. “ఆల్రెడీ రిలీజైన పిక్చర్‌కి వాళ్ళు మాత్రం ఏం చేయ్యగలరూ?” అని నేనన్నాను. ఓ ఆశ, దాని పక్కనే మరో నిరాశా పొంచి వుంటుందని నాకు స్పష్టంగా అర్థమైంది.

***

డిఫెన్స్‌లో పని చేసినవారి జీవితాలు వేరు. దేన్నీ సీరియస్‌గా తీసుకోము. ఎందుకంటే, మిలటరీలోకి చేరడం అంటేనే మృత్యువుకి సిద్ధపడటం. సిద్ధపడిన వాడే ఆర్మీ, ఏర్‌ఫోర్స్, నేవీ & ఇతర పారామిలటరీ వ్యవస్థల్లో చేరతాడు. ఎప్పుడు ఏమవుతుందో మాకే తెలీదు గనక భీకరంగా సంపాయించాలీ, ఆస్తుల్ని కూడబెట్టాలనే తాపత్రయం అసలుండదు. “జీవితాన్ని సంతోషంగా సాగనీ.. మృత్యువా.. అది మన నీడలాంటిది.” అనే మనస్తత్వం మావాళ్ళకి వుంటుంది. స్నేహం అంటే ప్రాణంతో సమానం. ఎవరూ దగ్గర్నించీ ఏమీ ఆశించరు గనక ఏర్‌ఫోర్స్ లైఫ్ అద్భుతంగా 18 ఏళ్ళు గడిచింది.

అది పూర్తి చేసుకుని ‘సివిల్ లైఫ్’ లోకి అడుగు పెట్టిన మరుక్షణమే మేం అవాక్కవుతాం. కారణం ఇక్కడ మనిషికీ మనిషికీ మధ్య లెక్కలేనన్ని గోడలు. ప్రతి మనిషికీ లెక్కలేన్నన్ని ముసుగులు. చిన్న వయసులో మిలిటరీలో చేరి ఏ ముప్పై నాలుగూ అయిదేళ్ళకి బైటకొచ్చి, ఇక్కడి లౌక్యమూ, స్వార్థపరత్వమూ చూసి మిగతా సైనికుల్లానే నాకు తల తిరిగిపోయింది. అన్నిట వెనకాలా స్వార్థమే. ఏదో పొందాలనే తపనే. ఆఖరికి స్నేహం వెనక కూడా స్వార్థమే నీడలా వుంటుంది.

మామూలు ప్రపంచంలోని మనుషులే అలా వుంటే, అద్భుతమైన యీ చలన చిత్ర పరిశ్రమలోని వారు ఎలా వుంటారూ? ఇదంతా ‘షో’ బిజినెస్. వ్యాపారాత్మకమైన కళ. లేక కళాత్మకమైన వ్యాపారం. అందరికీ కలలే. అసలు కలలుగన్న వాళ్ళే ఇక్కడికొస్తారు. కోట్లాది కలలలో 24 క్రాఫ్ట్స్ వారికీ ‘కళ’తోనే బంధం. ‘కళ’ ఎవరికి అబ్బుతుందీ? సున్నితమైన మనస్సూ, పరిశీలనా వున్న వారికి అబ్బుతుంది. అంటే, ఈ పరిశ్రమలోని వాళ్ళంతా, అత్యంత సున్నిత మనస్కులు. చిన్న పొగడ్తకి పాలుపొంగినట్టు పొంగిపోతారు. ఏ చిన్న విమర్శ ఎదురైనా పగిలిపోయే గ్లాసులా క్రుంగిపోతారు. అయితే అన్ని ఫీల్డుల్లానే ఈ ఫీల్డులోనూ పరాన్నభుక్కులూ, గోతులు తవ్వేవాళ్ళూ, ఇతరుల్ని వాడుకుని విసిరేసేవాళ్ళూ, పని చేయించికుని డబ్బు ఎగ్గొట్టే వాళ్ళు లేకపోలేదు. అయితే వారి సంఖ్య స్వల్పమే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, సినిమా ఫీల్డులోకి రావడానికి ఎవరూ భయపడాల్సిన పని లేదనీ, శ్రమించే మనస్తత్వమూ, వినయమూ, సహనమూ వుంటే సినీ పరిశ్రమ మనని అక్కున చేర్చుకుంటుందని చెప్పడానికి. చాలామంది బయట అనుకుంటారు, సినిమా వాళ్ళకి నీతి నియమాలు వుండవనీ, శీలానికి పావలా విలువైనా ఇవ్వరనీ, అది మమ్ముటికీ తప్పుడు అభిప్రాయమే. ఇన్‌క్లూడింగ్ స్త్రీ కళాకారుల విషయంలో కూడా. “మీ కేరక్టర్ పోగొట్టుకుంటే మీకు మా సినిమాలో కేరక్టర్ ఇస్తామన్నారు” అని కొందరు నటీమణులు చెప్పడం నేను చెవులారా విన్నాను. తరువాత తేలిందేమంటే అటువంటి వారి సంఖ్య అతి స్వల్పమని.

అలాగని శారీరిక బంధాలు ఏర్పడవా అంటే ఒక్కోసారి ఏర్పడతాయి. కొన్ని నెలల పాటు షూటింగ్‌లో గంటలు గంటలు గడపాల్సి వస్తే స్త్రీ పురుషులు మధ్య అనుబంధం పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడమూ జరుగుతుంది. ఇద్దరూ ఇష్టపడితే శారీరిక సంబంధమూ ఏర్పడుతుంది. అంతేగానీ అదో అన్‌టోల్డ్ రూల్‌గా మాత్రం ఎన్నడూ జరగదు.

అయితే ప్రేమ పేరుతో జరిగే తొందరపాటు పనులూ, ఒకోసారి ప్రేమ వికటిస్తే రెచ్చే ప్రతీకారాలూ ఇక్కడ అరుదుగా కనిపిస్తాయి.. బట్.. జాగ్రత్తగా ఆలోచిస్తే సినిమా వారూ మనుషులేగా. మానవ బలాలూ బలహీనతలూ సినిమా వారికి సహజమేగా! అయితే అందరికంటే ఎక్కువగా స్పాట్‌లైట్‍లో వుంటారు గనక రూమర్లు అతి త్వరితంగా వ్యాపిస్తాయి.

***

‘ఖైదీ నంబర్ 786’ తరువాత చిరంజీవిగారివి ఒకటో రెండో ఫిలిమ్స్ ఘాటింగ్ జరిగాయని తెలుసు. కానీ ఆ సినిమాలకి పాటలు వ్రాసే అవకాశం నాకు రాలేదు. తప్పు నాదే.. ఎందుకంటే, నిర్మాత దర్శకులతో నటీనటులతో ‘టచ్’లో ఉండాలి. ఆ పని నేను చెయ్యలేదు. కానీ బాపినీడు గారు ముందే చెప్పారు, “రికమెండేషన్ వల్ల వచ్చే  పాటల  వల్ల మీరు నిలబడలేరు. మీ పాటలు హిట్ అయితే ఆటోమేటిక్‌గా ఆ హిట్ సాంగ్సే మీకు మరిన్ని పాటల్ని తెచ్చిపెడతాయి” అని స్పష్టంగా బోధించడం. ఓసారి ఖాళీగా కూర్చోలేక ఒక్కపూట ఉదయం ఏడింటికే బస్సులో బీచ్‍కి పోయాను. తిరిగి తిరిగి మధ్యాహ్నం రూమ్‌కి వచ్చాను. “మీరెక్కడికెళ్ళారూ? డాక్టరు గారు మీరెక్కడున్నారా? అని అందర్నీ అడుగుతూనే వున్నారు. చప్పున అక్కడికి వెళ్ళండి” అని రబ్బీ చెప్పాడు. గబగబా వెళ్ళాను. “ఏంటి రాజావారూ ఎవరికీ చెప్పకుండా ఇలా వెళ్ళిపోతే ఎలా?” అని కోపంగా అన్నారు. “లేదండీ కాస్త మనసు ఫ్రెష్ అవుతుందని బీచ్‌కి వెళ్ళాను” అన్నాను. “సరే సరే ముందు మీరు ‘G’ కి వెళ్ళి అక్కడ చక్రవర్తి గారిని కలవండి. అలా కలవమని బాపినీడు గారి అసిస్టెంట్ ఇక్కడకొచ్చి చెప్పాడు. మీరు రూమ్‌లో దొరకలేదట” అన్నారు.

తిండి కూడా తినకుండా 12 B( బస్సు నంబరు)  పట్టుకుని వడపళనిలో దిగి, అక్కడ్నించి AVM ‘G’కి నడుచుకుంటూ పోయాను. చక్రవర్తి గారు వున్నారు. ట్యూన్ ఎక్కించిన ఓ కేసెట్ ఇచ్చి, సన్నివేశం వివరించి, “రాసి మీరు కోదండరామిరెడ్డిగారికి, అల్లు అరవింద్ గారికీ వినిపించండి. సినిమా హీరో చిరంజీవి” అన్నారు. వడపళని దగ్గరలోనే వున్న ఉడుపి కృష్ణలో ఓ దోశ తిని రూమ్‍కి పోయా. ఓ గంట హాయిగా పడుకున్నా. రూమ్ చేరేసరికే అయిదయింది. ఆరింటికి నిద్ర లేచి “రబ్బీగారూ నేను రూమ్ లోనే వున్ననని డాక్టరుగారికి చెప్పండి. పాట రాసుకోవాలి” అని రబ్బీకి చెప్పాను. చక్రవర్తిగారు కేసెట్ ఇస్తూ “పాటలో మాంఛి ఊపు హుషారూ ఉండాలి. గుర్తు పెట్టుకోండి” అన్నారు. ట్యూన్ చూస్తే అదిరిపోయింది. పిచ్చ Tempo. ఆరింటి నించీ కుస్తీ పడుతూనే వున్నాను. తొమ్మిదిన్నరకి పల్లవికి పదాలు దొరికాయి.

పల్లవి:
“మెరుపులా ఆడతా
పిడుగులా రేగుతా
దమ్ముంటే.. కాస్కో
ఛాలెంజీ చేస్కో
డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తా.. రా..” అని.
చరణం 1:
సలాము చేస్తే గులాము నేనై వుంటా
కలేజా ఖరీదుకట్టే షరాబు నేనే నంటా
రెచ్చగొట్టితే రచ్చకీడ్చి కవ్విస్తా.. హొరబ్బా
హోలుసేలుగా గోలుమాల్ చేయిస్తా
దేఖో మెహబూబా.. పోటీ తగదికా
కాలు కదిపితే కాటు తప్పదిక సో.. జా.. ॥మెరపు॥
చరణం 2:
డబ్బుకి లేదే సిగ్గూ ఎగ్గూ న్యాయం
అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడం ఖాయం
ఒప్పుచేసినా తప్పు లెన్నితే లోకం
ఫట్ ఫట్ నట్లు బిగించి నేర్పేస్తా గుణపాఠం
తెలుసుకో.. దారీ.. మలుచుకో
హద్దు మీరకూ.. ఆటలాడకూ జా.. జా.. ॥మెరుపు॥

~

పాట పూర్తయ్యేసరికి రాత్రి ఒంటిగంటన్నర. తిండి సంగతి మర్చిపోవడంతో ఆకలి రెచ్చిరేగింది. పొద్దున్నించీ పొట్టలోకి చేరింది కేవలం ఓ కప్పు కాఫీ, మధ్యాహ్నం కేవలం ఓ దోశ గనక ఆకలితో నకనకలాడి పోయా. రాత్రి ఒంటిగంటన్నరకి మద్రాసులో ఏం దొరుకుతుందీ? విచారంగా నడవలో అటూ ఇటూ తిరుగుతుంటే రూమ్ నంబర్ 33 తలుపు తీసి టెన్నిస్ రాజు గారు బయటకికొచ్చారు.

“ఏంటి నిద్రపట్టడం లేదా?” అన్నారు.

“అవును. పాట ధ్యాసలో పడి ఫుడ్ సంగతి మర్చిపోయా” మూడో సిగరెట్టు పేకెట్టు ఓపెన్ చేసి సిగరెట్టు వెలిగించుకుంటూ అన్నాను.

“మీరేమీ అనుకోపోతే నా ఫ్రెండొకడు ఓ ఫుల్ బాటిల్ రమ్ము బహుకరించాడు, ఇవ్వాళ ఓ స్మాల్ టెన్నీస్ టోర్నమెంట్ గెలిచినందుకు. వాడికి కోచింగ్ ఇచ్చింది నేనే. నేను తాగనని మీకు తెలుసుగా. అది మీరు తీసుకోండి. అలాగే మొన్న వూరినించి తెచ్చిన మరమరాల వుండలూ, జీళ్ళు, శనగప్పు వుండలూ, జంతికలూ కొన్ని వున్నాయి. అవీ తీసుకోండి.. సరేనా” అంటూ మళ్ళీ గదిలోకెళ్ళి వాటిని ఓ కేరీ బేగ్‍లో వేసి నాకు ఇచ్చారు. కళ్ళవెంట నీళ్ళొచ్చాయి. మాట రాలేదు. గట్టిగా అతన్ని హత్తుకుని “థాంక్స్” అన్నా. నాకు తెలుసు. ప్రపంచంలోని అన్ని భాషల అక్షరాల్ని కలిపినా గుండెలోని ధన్యవాదాలను నిజంగా తెలుపగల భాషని అవి తయారు చేయలేవని.

రెండు పెగ్గులు తీసుకుని మధ్య మధ్యలో విశ్రాంతిగా చిరుతిండి తింటూ రాత్రికి తోడుగా కాలం గడిపాను. హాయిగా నిద్రపోయా. ఎన్నిసార్లు తలుచుకున్నా ఆనాటి మాధుర్యం అలానే గుండెలో నిలిచిపోయింది. “ఇంతకీ ఏం పాట రాశారూ?” మరుసటి రోజు ఎనిమిదింటికి నేనూ లేచాక అడిగారు టెన్నిస్ రాజుగారు. పాట పాడి వినిపించాను.

“సూపర్ హిట్టవుతుంది గురూగారూ.. చిరంజీవిగారికైతే అద్భుతంగా సూటవుతుంది” అన్నారతను. అతనికి అప్పుడు చెప్పలేదు.. ఆ పాట నేను వ్రాసింది చిరంజీవిగారి కోసమేనని. ఎందుకంటే, రికార్డయినప్పుడు గదా తెలిసేది.. నా పాటే షూటింగ్‌కి వెడుతుందనీ, ఆ పాట మీద నా పేరు వ్రాసి వుందనీ. అప్పటి దాకా చెప్పకూడదు మరి.

***

మరుసటి రోజున ‘తత్కారం’ కరెక్టుగా ఉందాలేదా చెక్ చేసుకుందామని AVM కి వెళ్ళి శ్రీ చక్రవర్తిగారిని కలిసి పాట వినిపించాను. ఆయన కాసేపు మౌనంగా వుండి “అబ్బాయ్.. నువ్వు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చావు.. న్యాయంగా అయితే నేనేమీ నీకు సలహా ఇవ్వనవసరం లేదు. కానీ, ఇవ్వాలనిపిస్తోంది గనుక ఇస్తున్నా.. వెంటనే ఈ పల్లవిని మార్చు.. అది నీ కెరీర్‌కి మంచిది” అన్నారు.

చక్రవర్తిగారు స్వయంకృషితో ఎదిగిన ఓ మహామనిషి. జీవితంలో వెలుగు నీడలు ఎన్ని చూడాలో అన్ని చూసినవారు. ఆయన దగ్గర పని చేసిన వారందరూ అద్భుతమైన పొజిషన్‌లో వుండటానికి కారణం ఆయన సహకారమూ సలహాలే. కృష్ణ-చక్ర, రాజ్-కోటి, కీరవాణి, మనో, వందేమాతరం ఇలా ఎంతో మంది ఆయన దగ్గర పని చేశారు. ఆశీస్సులు పొందారు. లబ్ధప్రతిష్ఠులయ్యారు.

కానీ, ఆనాడు ఆయన ఎంతో ముందుచూపుతో ఇచ్చిన సలహా నా మనసుకి చేరలేదు. కారణం పల్లవి సూపర్‌గా వుందనీ సన్నివేశానికి 100% కరెక్టనీ నేను అనుకోవడమే.

నేను మాట్లాడకుండా వారికి నమస్కరించి కోదండరామిరెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. కోదండరామిరెడ్డి గారు ఫాస్టెస్ట్ డైరెక్టర్. అత్యంత స్పీడ్‌గా KSR దాస్‌లా సినిమా తీసే పేరు ఆయనకుంది. అంతే కాదు సూపర్ హిట్ డైరెక్టర్. ఆయన పట్టింది బంగారమని అప్పటికే పేరుంది.

నేను పల్లవి వినిపించగానే “బాగుంది, కానీ ఓసారి అల్లు అరవింద్ గారికి వినిపించండి. మరో పల్లవి కూడా రాస్తే మంచిది” అన్నారు. “సరేనండీ” అన్నాను.

కానీ నేను వారికి జ్ఞాపకం లేను అన్న విషయం నాకు అర్థమైంది. అదెట్లా అంటే నేను కొంచెం నా ఏర్‌ఫోర్స్ విషయం చెప్పాలి. రిటైర్మెంట్ సంగతి వేరు. అది వయసు ఉడిగి రిటైర్ కావడం. నాది ఆ టైప్ కాదుగా. వాలంటరీ రిటైర్మెంట్. మాకో ఆప్షన్ ఇస్తారు. ఒకవేళ మేం మనసు మార్చుకుంటే, మళ్ళీ మమ్మల్ని డిఫెన్స్ పోర్సెస్ లోకి యధాతథంగా చేర్చుకోమని రిక్వెస్టు చెయ్యొచ్చు.

రిటైర్మెంట్ ముందు మాకిచ్చే లీవ్‍లో నేనున్నాను. నేను మద్రాసు వెళ్ళొల్సొచ్చి వెళ్ళాను. అప్పుడు తెలిసింది. డైరెక్టర్ కోదండరామిరెడ్డిగారు శ్రీదేవి స్వంత సినిమాని డైరెక్టు చేస్తున్నారనీ, హీరో చిరంజీవి అనీ, ఒకటో రెండో పాటలు రికార్డు అయినా కథ సరిగ్గా కుదరక ఆగివుందనీ.

ఎ. కోదండరామిరెడ్డిగార్ని కలిశాను. ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ని ఇచ్చి శ్రీదేవి గారింటికి పంపించారు. శ్రీదేవిగారు అమ్మగారు తన మనసంతా TV సీరియల్ మీద పెట్టి వుండటంతో నేను మాట్లాడకుండా వెనక్కి వచ్చేసి కోదండరామిరెడ్డి గారికి విషయం చెప్పాను. “బహుశా ఆ సీరియల్‌ని వేరే భాషలో తియ్యాలన్న ప్లానేమో” అని చల్లగా నవ్వారు.

ఆ సమయంలోనే అక్కడ ‘వెన్నెలకంటి’ అనే రైటర్‌ని మొదటిసారి చూశాను. సఫారీలో వున్నారు. “బ్యాంకు ఎంప్లాయీ అండీ. సాహిత్యం మీద భాష మీదా బాగా పట్టుంది.” అన్నారు. అప్పుడు అతని గురించి తెలిసింది తక్కువ. ఇప్పుడయితే మేం అన్నదమ్ముల్లా వుంటాము. అతను నన్ను “అన్నయ్యా” అని పిలిస్తే, నేను “బుల్లెబ్బాయ్” అనిపిస్తాను. చి. వెన్నెలకంటి తండ్రి గారు శ్రీ వెన్నెలకంటి కోటేశ్వరరావుగారు. వారు ప్రసిద్ధి చెందిన అప్పటి ప్రతిభా ప్రొడక్షన్‌లో పని చేసేవారు గనక అందరూ వారిని ప్రతిభాకోటేశ్వరావుగారనేవారు. వారి చిన్న కుమారుడే ఈ వెన్నెలకంటి. ప్రతిభా సంస్థ శ్రీ ఘంటసాల బలరామయ్య గారిది. చిత్రంగా ఆ బలరామయ్యగారి మనుమడే నేటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ‘తమన్’.

మరో విషయం ఏమంటే వెన్నెలకంటి బ్యాంకు ఉద్యోగంలో చేరడానికి ష్యూరిటీ సంతకం కావాల్సివస్తే, డా. బెజవాడ గోపాలరెడ్డి గారు పెట్టారట. గొప్ప కవీ, మహా మనిషీ శ్రీ నాగభైరవకోటేశ్వరరావుగారి శిష్యుడు వెన్నెలకంటి. ఇతన్ని సినిమా ఫీల్డుకి ‘శ్రీరామచంద్రుడు’ చిత్రం ద్వారా డా.ప్రభాకరరెడ్డిగారు పరిచయం చేస్తే, సంపూర్ణమైన ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి, వెన్ను తట్టి ప్రోత్సహించడమే కాక వెన్నుదన్నుగా నిలిచింది మన S. P. బాలసుబ్రమణ్యంగారు. ఇప్పటి వరకూ 3000 కి పైగా సినీ గీతాలు వ్రాశారు వెన్నెలకంటి. ఆయన పిల్లలిద్దరిలో పెద్దవాడు శశాంక్ డబ్బింగ్ సినిమాలు స్వతంత్రంగా చేస్తూ తండ్రిని మించిన తనయుడైతే, రెండో పిల్లాడు రాకేందుమౌళి రైటరూ, సింగరూ, నటుడూ కూడా.

ఇదంతా ఎందుకంటే, కోదండరామిరెడ్డిగారికి నేను జ్ఞాపకం లేను. సరే.. అరవింద్ గార్ని కలిస్తే, ఆయనా “మరో పల్లవి వ్రాయండీ, రాసింది బాగుంది. కానీ”, అనే అన్నారు. మొత్తం 20 పల్లవులు రాశానని గుర్తు, నాలుగయిదు సార్లు అటూ ఇటూ తిరుగుతూ. మళ్ళీ బాల్ కోదండరామిరెడ్డిగారి కోర్టులో పడింది. వారింటికెడితే వారు దొరకలేదు. అరవింద్ గారూ దొరకలేదు. చివరికి చిరంజీవిగారి తోడల్లుడు డా. వెంకటేశ్వరరావు గారు కలిసి ఒకే మాట అన్నారు. “చక్రవర్తిగారి దగ్గరికి వెళ్దాం, అక్కడ నిర్ణయం తీసుకుందాం” అని. అక్కడికి వెళ్ళి మొత్తం పల్లవులన్నీ చూపించాను. “నీ ఓటు దేనికబ్బాయ్?” అన్నారు చక్రవర్తి. “మొదటి దానికే” అన్నాను. ఓ క్షణం నావంక తీక్షణంగా చూసి, సుదీర్ఘంగా సిగరెట్ పీల్చి.. “OK” అని SPBకి కబురుపెట్టారు. SPB వచ్చేసరికి నాలుగయింది. పొద్దునంతా తిరుగుడు తోటి, కన్‌ఫ్యూజన్ తోటి, టెన్షన్ తోటి తిండి సంగతి మరచిపోయా. భయంకరంగా నీరసం పట్టుకుంది. నాకేమో చచ్చే మొహమాటం. బయట ఏదన్నా హోటల్‌కి వెళ్ళి తినొచ్చు. కానీ ఈలోగా బాలూగారు వస్తే? ఓ గాయకుడ్ని వెయిట్ చేయించడం రైటర్‍కి తగదు. అదీ SPB లాంటి బిజియస్ట్ గాయకుడ్ని.

బాలూగారు వచ్చారు. వాయిస్ రూమ్ లోకి వెళ్ళాక విషయం అంతా వివరంగా చెప్పి “సార్.. ఏ పల్లవి బాగుందో మీరే నిర్ణయించండి” అని రిక్వస్టు చేశా. ఆయన నా మొహం వంక ఓ క్షణం చూసి, “మీరేమీ తిన్నట్టు లేదు. అవునా? ముందు ఏదన్నా అర్జంటుగా తినేసి రండి.. ఈలోగా నేను సెలక్టు చేస్తా” అన్నారు. స్టూడియో బాయ్‍ని పంపి ఓ దోసె తెప్పించుకుని తిన్నాను.

బాలూగారు రెడీ. రికార్డింగ్ రవిగారు రెడీ. రికార్డింగ్ రూమ్‌లో నేనూ వెంకటేశ్వరావుగారూ వున్నారు.

నిజంగా, ‘మెరుపులా’ పాటకి ప్రాణం పోశారు బాలూగారు. పల్లవి వినగానే వెంకటేశ్వరరావు గారన్నారు “ఈ పాటకి తిరుగులేదు” అని. అనడమే కాదు చిరంజీవిగారికీ, అరవింద్ గారికీ, A.K.R. గారికీ ఫోన్ చేసి చెప్పారనుకుంటా, పది నిముషాల్లో వారంతా థియేటర్‌లో వున్నారు.

చక్రవర్తిగారితో సహా అందరూ డేమ్ హేపీ. అందరూ ఒకరినొకరు అభినందించుకుని కార్లలో వెళ్ళిపోయారు. AVM ‘G’లో నేనొక్కడ్నే మిగిలాను.

వడపళని బస్‌స్టాండ్‌కి పోయి 12 B పట్టుకుని టి.నగర్‌లో దిగి రూమ్‌కి పోయాను.

తరవాత తెలిసింది, ఆ పాట చాలామంది రైటర్స్ ఎటెంప్ట్ చేశారనీ, అవేవీ తృప్తిగా రాకపోవడంతో ఆ పాట చివరగా నాకు వచ్చిందనీ, అలా రావడానికి కారణం బాపినీడుగారు నాకు ‘ఆ పాట ఇచ్చి చూడమ’ని చెప్పడమనీ.

‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ అనే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. సిల్వర్ జూబిలీ ఆడింది. కానీ ఆ షీల్డు మాత్రం నాకు రాలేదు. నా ఆనందం ఏమంటే నా పాట సూపర్ హిట్టయిందిగా!

(ఇంకా ఉంది)

Exit mobile version