Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-12: పెళ్లి సందడి

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

“ఎడిటర్ గారు బ్యూరోలో రిపోర్టర్‌లు అందరినీ రమ్మంటున్నారు” అని ఆఫీస్ బాయ్ చెప్పగానే అందరూ “ఎవడికి మూడిందో?” అని ఒకరినొకరు చూసుకుంటున్నారు.

అప్పటి వరకు వార్తల కోసం సచివాలయంలో అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగి వచ్చిన రిపోర్టర్‌లు వార్తలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు. రాజకీయ పార్టీల బీట్ రిపోర్టర్‌లు ఇంకా ఆఫీస్‌కు రాలేదు. వారికి కూడా సమాచారం ఇవ్వమని ఆదేశం రావడంతో ఎడిటర్ పీఏ పొలిటికల్ బీట్ రిపోర్టర్‌లకు ఫోన్ చేసి “ఎడిటర్ ఛాంబర్‌కు వెంటనే వచ్చేయండి. మీటింగ్ ఉంది. అంతా మీ కోసం ఎదురు చూస్తున్నారు” అని సమాచారం ఇచ్చాడు. బ్యూరోలో రిపోర్టర్‌లు అందరూ వచ్చారని లెక్క పెట్టుకొని అంతా కలిసి కట్టుగా ఎడిటర్ ఛాంబర్ లోకి వెళ్లారు.

ఏమవుతుందో? అని అంతా భయపడుతుంటే వినోద్ మాత్రం అందరినీ చూసి నవ్వుకున్నాడు.

“నీకేమైనా మెంటలా? అందరూ టెన్షన్ పడుతుంటే, నవ్వుతున్నావు” అని వినోద్‌ను విక్రమ్ కోపంగా చూశాడు.

“ఎడిటర్ ఎందుకు పిలిచాడో నాకు తెలుసు. కంగారు పడాల్సిన అవసరం లేదు” అని వినోద్ భరోసా ఇచ్చాడు.

ఎడిటర్ ఛాంబర్‌లో విలాసంగా కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. మహా అయితే ఓ పది కుర్చీలు పట్టే ఆ ఛాంబర్‌ను ఎడిటర్ విశాల విశ్వంగా భావిస్తాడు. ప్రపంచాన్ని అక్కడి నుంచే నడిపిస్తున్నట్టు ఫీల్ అవుతుంటాడు. అమెరికా ప్రపంచానికి పెద్దన్న అయితే ఈ విశాల విశ్వానికి నేనే బాస్‌ను అన్నట్టు ఉంటుంది అతని మాట తీరు. ఉద్యోగం పోతే కుటుంబం రోడ్డున పడుతుంది అనుకునే బలహీనులు ఎడిటర్ పేరు వింటేనే వణికిపోతారు. వారు వణుకుతుంటే చూడడం ఎడిటర్‌కు ఓ సరదా. యజమాని మనసు కర్ణుడిది, చూపు ధృతరాష్టుడిది, దాంతో ఎడిటర్ శకునిగా మారి పత్రికను తన సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నాడు.

బ్యూరో మొత్తం తన ఛాంబర్ లోకి రాగానే ఎడిటర్ అందరినీ ఓ సారి చూసి, “ఏంటీ అంతా ఇలా కట్టకట్టుకుని వచ్చారు?” అని అడిగాడు.

పిలిచింది తానే, ‘ఏంటీ ఇలా వచ్చారు?’ అని అడిగేది ఆయనే. ఇది అయన స్టైల్. ‘బిజీగా ఉంటాడు కాబట్టి పిలిచి మరిచిపోయాడు’ అనుకోవాలి.

“మీరు రమ్మని పిలిచారని” అంతా కోరస్‌గా పలికారు.

ఎడిటర్ ఎదురుగా నాలుగు చైర్స్ ఉంటే వాటిలో ఎవరో అనామకులు కూర్చున్నారు. బ్యూరో కూర్చోవడానికి కుర్చీలు లేవు, అవకాశం లేదు.

“ఏమయ్యా! నువ్వసలు పని చేస్తున్నావా? ఏం చేస్తున్నావు?” గిరిధర్‌ను చూస్తూ ఎడిటర్ చిరాగ్గా అడిగాడు.

“సార్ ఇప్పుడే క్యాబినెట్ ఇన్‌సైడ్ సమాచారం తెలుసుకొని వచ్చాను. 12 మంది మంత్రులను కలిసి మాట్లాడితే కానీ సమాచారం తెలియలేదు.” అని గిరిధర్ తాను చేసిన డ్యూటీ గురించి చెప్పుకొచ్చాడు.

క్యాబినెట్ సమావేశం వివరాలు అధికారికంగా మంత్రులు చెబుతారు. కానీ రాజకీయ చర్చనే అసలు వార్త. సీనియర్‌లు మాత్రమే తమ పరిచయాలతో ఆ సమాచారం సేకరిస్తారు. అది నాకే సాధ్యం అన్నట్టు గిరిధర్ మనసులోనే మురిసి పోతాడు. పైకి చెబితే ఆమాత్రం సంతోషాన్ని కూడా ఎడిటర్ భరించలేడు అని గిరిధర్‌కు తెలుసు.

“ఈ కబుర్లకేం తక్కువ లేదు. 12 మంది మంత్రులను కలిసి రాశావా? సొంత పైత్యమా? రేపు అన్ని పత్రికలు చూశాక చెబుతా.. ఒక్క పాయింట్ మిస్ అయినా సాక్ చేస్తా” అని ఎడిటర్ వార్నింగ్ ఇచ్చాడు.

గిరిధర్ మనసులో నవ్వుకుంటున్నా, పైకి గంభీరంగా ఉన్నాడు. ముఖంలో ఏ ఫీలింగ్ బయటపడకుండా ఉండడం తనకు దేవుడిచ్చిన వరం అని గిరిధర్ అనుకుంటాడు.

‘బాస్ అకారణంగా తిడుతున్నప్పుడు అతని ముఖంలో పందిని, కుక్కను ఏదో ఓ జంతువును ఊహించుకుంటే తిడుతున్నప్పుడు బాధకలగదు, నవ్వు వస్తుంది’ అని ఓ రచయిత రాసిన మాటలు గిరిధర్‌పై బాగా ప్రభావం చూపాయి. దీనిని ఆచరణలో పెట్టినప్పటి నుంచి ఇలాంటి సందర్భాల్లో గిరిధర్ హాయిగా మనసులోనే నవ్వుకుంటున్నాడు.

మొత్తం బ్యూరోను పిలిచి ఎడిటర్ ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా గిరిధర్‌కు తెలుసు.

అందుకే ఎడిటర్ మాట్లాడుతున్నా తన ఆలోచనలు ఎడిటర్ ఛాంబర్‌లో కూర్చున్న ఆ నలుగురి గురించే సాగుతున్నాయి.

ఏదో పల్లెటూరి వారిలా ఉన్నారు. ఎడిటర్ ఏం మాట్లాడుతున్నారో? రిపోర్టర్‌లు ఏం చెబుతున్నారో వారికి అర్థం కావడం లేదు అయోమయంగా చూస్తున్నారు.

“ఏం వరప్రసాద్ డ్యూటీలో ఉన్నావా? ఏ పని చాతకాదు.” అంటూ వరప్రసాద్ వైవు చూస్తే, వరప్రసాద్ నవ్వి “ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వస్తున్నా సార్. నిన్న మీరు రాసిన ఎడిటోరియల్ చదివి ముఖ్యమంత్రి చాలా బాధపడ్డారని సీఎం పౌర సంబధాల అధికారి వెంకటరెడ్డి చెప్పారు” అని వరప్రసాద్ బాధ నటిస్తూ చెప్పాడు.

“వాడి బొంద. సీఎం అయితే భయపడతాననుకున్నాడా? ఎవడ్ని వదిలి పెట్టను. అయినా సీఎం నాకు డైరెక్ట్‌గా ఫోన్ చేసి, వాడి ఏడుపెందో ఏడవాలి కానీ, సీఎం వాళ్ళ బంట్రోతు దగ్గర బాధపడడం, ఆ బంట్రోతు నీకు చెప్పడం, నువ్వు నాకు చెప్పడం పిండాకూడు పనులు. ఏం నా నంబర్ లేదా సీఎం ఆఫీస్‌లో. నాకు కాల్ చేయమని చెప్పు” అని ఎడిటర్ వరప్రసాద్‌కు చెబుతుంటే ఎడిటర్ ఎదురుగా కూర్చున్న నలుగురు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు.

‘వామ్మో ఈయన మాములు మనిషి కాదు. ముఖ్యమంత్రినే వణికిస్తున్నాడు అంటే మనం చాలా గొప్ప సంబంధం కలుపుకుంటున్నాం’ అనుకున్నారు.

‘ముఖ్యమంత్రిని ఫోన్ చేయమని ఆర్డర్ వేస్తున్నాడు అంటే మన అమ్మాయిని ఒక రకంగా రాజకుటుంబానికి ఇస్తున్నట్టే’ అని అక్కడ కూర్చున్న నలుగురిలో అమ్మాయి తండ్రి గర్వంగా పక్కనున్న బావమరిది ముఖంలోకి చూస్తూ సంతోషాన్ని దాచుకున్నాడు.

గిరిధర్‌కు నవ్వు వస్తున్నా ఆపుకుంటున్నాడు.

వీడి బోడి ఎడిటోరియల్ చదివే వాడెవడు? ఎడిటోరియల్‌ను చదివేది ముగ్గురే అని ఆఫీస్‌లో అందరూ జోకు లేసుకుంటారు. రాసిన ఎడిటర్, ఆ రాతను కంపోజ్ చేసే కంపోజిటర్, పేజీలో పెట్టే సబ్ ఎడిటర్, ఈ ముగ్గురు మాత్రమే చదువుతారని అందరి నమ్మకం. ఇంతోటి దానికి తానేదో మహాకావ్యం రాస్తున్నట్టు తన ఛాంబర్ బయట రెడ్ లైట్ వేసుకొని, రాసేప్పుడు ఎవరో రావద్దు అనే ఆంక్షలు. వరప్రసాద్ మహా ముదురు కేసు ఎడిటర్ వీక్‌నెస్ తెలిసినవాడు. ‘సీఎం మీ ఎడిటోరియల్ చదివి బాధపడుతున్నారు అంటే ఎడిటర్ పడిపోతాడు’ అని తెలుసు. వరప్రసాద్ ప్రయోగించిన ఆయుధం ఎప్పుడూ వృథా కాలేదు.

ఇంతకూ ఎడిటర్ ఎదుట కూర్చున్న నలుగురు ఎడిటర్ కొత్త బంధువులు. ఎడిటర్ అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది. అప్పటి నుంచి ఆఫీస్‌లో పెళ్లి సందడి. పెళ్లి చూపులు తప్ప మాటా ముచ్చట అంతా ఆఫీస్ లోనే . స్దాన బలం ఉన్న చోటే బలాన్ని చూపించాలి అని తెలిసినవాడు కావడంతో ఎడిటర్ ఆఫీస్‌నే పెళ్లి కేంద్రంగా మార్చుకున్నారు. అబ్బాయి తండ్రి ఎడిటర్ అని తెలుసు కానీ అదేం ఉద్యోగమో, అదేం పనో అమ్మాయి తండ్రికి తెలియదు. ఏదో ప్రైవేట్ గుమస్తా అనుకుంటున్నాడు. అందుకే వారికి తన పవర్ ఏమిటో చూపాలి అని ఆఫీస్ లోనే మాటా ముచ్చట సాగిస్తున్నారు.

వియ్యంకుడు ముఖ్యమంత్రినే హడలెత్తించే అంత అధికారం ఉన్నవాడు అని ఈ సమావేశంతో పెళ్లివారు నిర్ధారణకు వచ్చారు.

ఎడిటర్ ఓ వైపు రిపోర్టర్‌లకు వార్నింగ్ ఇస్తూనే, మరోవైపు వియ్యంకుడి ముఖం లోని భావాలను చదువుతున్నాడు.

ఎడిటర్ మందలింపులకు బాధపడుతున్నట్టు నటిస్తూనే గిరిధర్ ఓరకంట అటు ఎడిటర్‌ను, ఇటు ఆయన వియ్యంకుడి ముఖ కవళికలు చదువుతున్నాడు. వియ్యంకుడి ముందు అధికార దర్పం ప్రదర్శించడానికి తప్ప మీటింగ్‌కు మరో ఉద్దేశం లేదని గిరిధర్‌కు తెలుసు.

వియ్యంకుడు తన పవర్ గ్రహించాడు కాబట్టి మీటింగ్ ఇక చాలు అనుకుని

“ముట్టడికి పోయినట్టు ఆ ముఖాలు ఏమిటీ? మంచి స్టోరీ రాయాలి అని ఉండదా? వెళ్ళండి” అని రిపోర్టర్‌లు అందరినీ పంపించేశాడు.

బ్యూరోను పంపించేసి స్ట్రింగర్ లను పిలిచి “మీకు అప్పగించిన పెళ్లి పనులు ఎంత వరకు వచ్చాయి” అని ఒక్కొక్కరి నుంచి సమాచారం తీసుకున్నాడు. పిల్లి గుడ్డిది అయితే ఎలుకకు తిరుగు లేదన్నట్టు యాజమాన్యం తీరు వల్ల ఎడిటర్ ఆఫీస్‌ను పెళ్లి కేంద్రంగా మార్చేశాడు. ఏ జన్మలో చేసిన అదృష్టమో యజమానికి లేని అదృష్టం ఎడిటర్‌కు పట్టుకుంది.

***

ఆఫీస్ సిబ్బంది ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత తీసుకోని, చివరకు జీవితంలో మొదటిసారి రాత్రి పెళ్లి మండపంలోని పడుకొని తెల్లవారగానే ఏ లోటు లేకుండా పెళ్లి జరిపించారు. తమ “ఇంట్లో పెళ్ళికి కూడా ఇంత కష్టపడ లేదు” అని ఒకరి కొకరు చెప్పుకొని ఓదార్చుకున్నారు.

***

రెండు వారాల నుంచి పెళ్లి పనులతో టెన్షన్‌తో గడిపిన రిపోర్టర్ చంద్ర పెళ్లి ప్రశాంతంగా జరగడంతో ఆ రోజు మధ్యాన్నం భోజనం చేసి కునుకు తీశాడు. సెల్ ఫోన్ పదే పదే రింగ్ కావడంతో అసహనంగా లేచి చూస్తే ఎడిటర్ నంబర్.

“ఏమయ్యా? ఎక్కడున్నావ్? మాట్లాడమని చెప్పాను కదా? ఏమైంది?” అని ఎడిటర్ అసహనంగా అడిగాడు.

ఏం మాట్లాడమన్నాడో గుర్తు రాలేదు. ఆ మాట చెబితే బీట్ మార్చేస్తాడు. సచివాలయం వార్తలు రాసే రిపోర్టర్‌ను మున్సిపాలిటీ వార్తలు రాయమంటాడు.

ఆలోచించిన తరువాత గుర్తుకు వచ్చింది. “ఇప్పుడే మాట్లాడి చెబుతా” అంటే ఎడిటర్ కాల్ కట్ చేశాడు.

‘వీడికి సిగ్గు లేక పోయినా, అడిగేందుకు నాకు సిగ్గుగా ఉంది’ అని మనసులోనే అనుకొని, చంద్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసేందుకు వెళ్ళాడు.

పెళ్లి తరువాత తంతు కోసం టూరిజం వాళ్ళ గెస్ట్ హౌస్‌ను తీసుకున్నారు. ఒక రోజు అద్దె మూడు వేలు. అయితే అద్దె తగ్గించమని పైరవీ కోసం ఐఏఎస్ అధికారి వద్దకు చంద్ర ప్రయత్నం.

చంద్ర మాటలు వినగానే మేనేజింగ్ డైరెక్టర్‌కు నోటమాట రాలేదు. “మీ వాడికి కొంచం కూడా సిగ్గు అనిపించదా? హవ్వ దీనికి కూడా పైరవీనా?” అని చిరాగ్గా చూశాడు.

“సార్ అడిగేందుకు నాకే సిగ్గుగా ఉంది. ఎడిటర్ ప్రెషర్ మాములుగా ఉండదు. ఎలాగైనా కాస్త చూడండి సార్” అని చంద్ర ధీనంగా అడిగాడు.

మేనేజింగ్ డైరెక్టర్ తన జేబులో నుంచి మూడు వందలు తీసి ఇచ్చి, “గవర్నమెంట్ అద్దె ఒకటే ఉంటుంది. అంతా ఆన్‌లైన్ లోనే ఉంటుంది. మూడు వందలు తగ్గించాను అని చెప్పి ఈ మూడు వందలు కలిపి అద్దె చెల్లించండి” అని చెప్పి పంపించేశాడు.

***

“ఏరా? గిరిధర్! నీకు ఎడిటర్ మీద కోపంగా ఉందా?” అని ఆనంద్ అడిగాడు.

“లేదు జాలిగా ఉంది. దేవుడు రాజుగా బతకమని పంపితే లేదు ముష్టి బతుకులోనే గడుపుతా అంటే జాలి పడాలి కానీ కోపమెందుకు? తోటి ఓనర్ కం ఎడిటర్ మీడియాతో కోట్లు సంపాదించి గర్వంగా బతుకుతుంటే ముష్టి బతుకు బతికే ఎడిటర్ పట్ల జాలే కానీ కోపం లేదు” అని గిరిధర్ మనసులో మాట చెప్పాడు.

ఐదువేల రూపాయల సిగార్‌ను కాల్చడంలో యజమాని ఉండగా శకునిగా ఎడిటర్ తన పని పూర్తి చేశాడు. ఆ పత్రిక మూతపడడంతో శకుని టార్గెట్ సంపూర్ణం అయింది.

Exit mobile version