[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
మంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్. ఎప్పుడూ లేనంతగా కిక్కిరిసి పోయి ఉంది. మంత్రి చైర్‌లో కూర్చుంటూ “మీ అందరికీ శుభవార్త” అని అనగానే “సార్ మీరు వారానికి ఓ సారి సభకు నమస్కారం అన్నట్టు మీ అందరికీ శుభవార్త అంటారు. మొన్నోసారి మీ అందరినీ కోటీశ్వరులను చేసేస్తున్నాం అని ప్రకటించారు. అది చదివి అంతా మా జర్నలిస్ట్‌ల మీద కుళ్ళుకుంటున్నారు. ఈ శుభవార్తలు 20 ఏళ్ళ నుంచి వింటున్నాం. అయ్యేది లేదు పోయేది లేదు” అని సీనియర్ జర్నలిస్ట్ కాసింత అసహనంగానే తన అసంతృప్తిని బయటపెట్టాడు. “పాత శుభవార్తలు మరిచిపోండి. ఇప్పటి నుంచి ఒక లెక్క జర్నలిస్ట్ లకు సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ముచ్చర్ల గ్రామంలో రెండు వందల గజాల ప్లాట్ ఇవ్వాలి అని నిర్ణయించింది.” అని మంత్రి ప్రకటించగానే అరవింద్‌కు తన కాళ్ళ కింద భూమి చీలిపోయి, తాను అందులో పడిపోయినట్టు అనిపించింది. తల గిర్రున తిరుగుతోంది. అరెస్ట్ చేస్తారనే భయంతో ఆగిపోయాడు కానీ మంత్రి బట్టతల మీద వాయించాలి అని ఉంది. సీనియర్‌ల అందరి పరిస్థితి నవ్వలేక, ఏడవలేక అన్నట్టు ముఖం పాలిపోయింది. వారందరి కన్నా తనకు ఎక్కువ బాధగా ఉంది. ఎక్కువ సేపు అక్కడే ఉంటే చేయరానిది ఏదైనా చేస్తనేమో అనుకోని అక్కడే బెంచ్‌పై తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు. తన కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీటి గురించి తనకే తెలుసు. ఎవరి జీవితంలో ఇంత క్రూయల్ జోక్ వేయవద్దు దేవుడా! అని మనసులో అనుకున్నాడు.
పక్కవాళ్ళు “ఏమైంది” అని పలకరిస్తే నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు. మాట్లాడితే దుఃఖం వస్తుందేమో అనుకోని “ఏమీ లేదు” అని బదులిచ్చి తల టేబుల్ పై వాల్చి ఆలోచనలో పడిపోయాడు. మూడు దశాబ్దాల జీవితం, రెండు దశాబ్దాల సొంతింటి కల కనుల ముందు కనిపిస్తుంది. ఒకదాని తరువాత ఒక దృశ్యం కనుల ముందు కనిపిస్తోంది
***
డిగ్రీ పూర్తి చేసి అరవింద్ జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరగానే న్యూస్ ఎడిటర్ కృష్ణయ్య పిలిచి “చూడు బాబూ! ఇప్పుడే డిగ్రీ పాస్ అయి వచ్చావు. జీవితం అంటే ఏమిటో తెలియదు. నువ్వు రిపోర్టర్‌వు కాబట్టి ఎవరో ఒక నాయకుడు మందు తాగించడానికి ఆసక్తి చూపిస్తాడు. ఒక్కసారి ముందుకు లొంగావు అంటే ఇక నీ జీవితం అంతే. అలా అని నేనేమీ మందు ముట్టను అని చెప్పడం లేదు. నేను ముందుకు అలవాటు పడి జీవితాన్ని కోల్పోయాను. మనకు మందు తాగించిన వాడికి కూడా మన మీద గౌరవం ఉండదు. తాగుబోతులు కూడా తాగని వారికే విలువ ఇస్తారు. జీవితానుభవం ఉంది కాబట్టి చెబుతున్నాను. వినడం వినక పోవడం నీ ఇష్టం. నువ్వు రిపోర్టర్‌గా జిల్లాకు వెళ్ళగానే జర్నలిస్ట్‌ల హౌసింగ్ సొసైటీలో చేరు. ఏ జిల్లాలో అయితేనేం ఒక ఇంటివాడివి అయితే జీవితానికి ఓ భరోసా ఉంటుంది” అని జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు చెప్పి పంపించాడు పెద్దాయన.
ఏడాదికి ఓ జిల్లా బదిలీ కావడంతో ప్రతి చోట చివరి నిమిషంలో తప్పిపోయిన ట్రైన్‌లా ఉండేది పరిస్థితి. అరవింద్ అటు తిరిగి ఇటు తిరిగి హైదరాబాద్‌లో వచ్చి పడ్డాడు. హైదరాబాద్‌కు వచ్చిన కొంత కాలానికి కొత్త ప్రభుత్వం జర్నలిస్ట్‌లకు ఇంటి స్థలం సబ్సిడీ ధరతో ఇవ్వాలి అని నిర్ణయించింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు రాజధాని నగరంలో సొంత ఇల్లు ఆలోచిస్తేనే అరవింద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఉచితం కాదు మార్కెట్ ధర కన్నా కొంత తక్కువ. మూడు లక్షలు చెల్లించాలి. మూడు లక్షలు అంటే మామూలు విషయం కాదు. వచ్చే జీతం ఏ నెలకు ఆ నెల అన్నట్టు ఉంటుంది. ఊరికి వెళ్లి అమ్మ నాన్న, అన్నలకు విషయం చెప్పాడు. “రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు పండలేదు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక మేమే ఇబ్బందుల్లో ఉన్నాం” అని చెప్పి కుటుంబం అంతా చేతులెత్తేసింది. హైదరాబాద్‌లో సొంతింటి కల దూరం అవుతుందా? అని భయం వేసింది. తాకట్టు పెడదాం అంటే బంగారం కూడా లేదు. ఎరువుల కోసం ఎప్పుడో తాకట్టు పెట్టారు. చివరకు “నా వాటా మూడు ఎకరాలు నాకిచ్చేస్తే అమ్మేసుకుని ప్లాట్ కోసం డబ్బు కడతాను” అని అరవింద్ ప్రతిపాదించాడు. అంతా మూకుమ్మడిగా ససేమిరా అన్నారు. “పస్తులైనా ఉంటాం కానీ పొలం అమ్మేది లేదు” అని అన్నలు అంటే, మేం బతికి ఉన్నంత వరకు పొలం అమ్మితే మా మీద ఒట్టు అని తల్లిదండ్రులు అడ్డుకున్నారు. “పొలం అమ్ముకున్నారు అంటే ఊర్లో పరువు ఉంటుందా?” అని నానమ్మ తన వంతు వ్యతిరేకత చూపించింది. కుటుంబం అంతా ఏకగ్రీవంగా వ్యతిరేకించడంతో అరవింద్ తన అత్తామామలను తీసుకువచ్చి తనకు వాటా కింద వచ్చే మూడెకరాలు పంచి ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాడు. ఏడ్చినా, నచ్చజెప్పినా వినకపోవడంతో చివరకు అరవింద్ వాటా మూడు ఎకరాలు పంచి ఇచ్చారు. అతి కష్టం మీద మూడు ఎకరాలు అమ్మితే రెండున్నర లక్షలు వచ్చాయి. మరో 50 వేలు అప్పు చేసి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి మూడు లక్షలు చెల్లించి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినంత సంబరంగా అరవింద్ ఇంటికి వెళ్లి “డార్లింగ్ ఈ మహానగరంలో ప్రైమ్ ఏరియాలో ఇక మనకూ ఓ సొంతిల్లు, పర్మనెంట్ అడ్రస్ ఉండబోతుంది” అని ప్రేమగా భార్యకు చెప్పాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ తాను కట్టబోయే సొంత ఇల్లు ఎలా ఉండబోతుందో అరవింద్ రంగురంగుల కలలు కంటున్నాడు. సొంత ఇంటి ఆవరణలో ఏయే రకం మొక్కలు పెంచాలో రోజుల తరబడి చర్చలు సాగాయి. ఇంటి ముందు పెంచే మల్లె చెట్టు మొగ్గలు ఎవరూ తుంచకుండా చూసుకునే బాధ్యత పుట్టబోయే బిడ్డకు అప్పగించాలి అనే నిర్ణయం అయిపొయింది. రోజూ ఇంట్లో పూజకు అవసరం అయిన పూల మొక్కల బాధ్యత మొత్తం అరవింద్ తన భార్యకే అప్పగించాడు. చుట్టూ పక్కల వాళ్ళు పూలు తెంపుకు పోవడం ఓ పెద్ద సమస్య. కాలనీ అన్నప్పుడు ఇలాంటివి భరించక తప్పదు అనుకున్నారు. “మీ అమ్మానాన్నలు వచ్చినా, మా అమ్మానాన్నలు వచ్చినా ఉండేందుకు వారికో గది కూడా ఉండాలి కదా?” అని అరవింద్ భార్య మనసు దోచాడు.
బెడ్ రూమ్ నుంచి వంటగది వరకు సొంతింటిని తమ ఊహల్లోనే నిర్మించారు.
ప్లాట్ కేటాయింపు జరగడమే తరువాయి ముందస్తు తతంగం అంతా పూర్తి చేశారు.
వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. నాకు దక్కంది మీకెలా దక్కుతుందో చూస్తా అని సీనియారిటీ లేని జర్నలిస్ట్ కృష్ణ కోర్టుకు వెళ్ళాడు. ఇంత మంది పేదలు, ఇండ్లు లేకుండా బతుకుతుంటే జర్నలిస్ట్ లకు సబ్సిడీతో ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని పెద్ద భవంతిలో విశ్రాంతి జీవితం గడుపుతున్న గుడిసెవాసుల సంఘం నాయకుడు కోర్ట్‌కు వెళ్ళాడు. చిలికి చిలికి గాలి వాన అయినట్టు వ్యవహారం సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది. కాల చక్రం రెండు దశాబ్దాలు అలా గిర్రున తిరిగింది. భార్య మంగళసూత్రం అమ్మి డబ్బు కట్టిన వాళ్ళు, వడ్డీకి తెచ్చి కట్టిన వాళ్ళు రోడ్డున పడ్డారు. సగం మంది రిటైర్ అయ్యారు. వీరిలో సగం మందిలోకం విడిచి వెళ్లారు. మిగిలిన వాళ్ళు అటు చావలేక ఇటు బతక లేక చావు బతుకు మధ్య బతుకీడుస్తున్నారు. ఓ శుభ ముహూర్తంలో మంత్రి మీ అందరినీ కోటీశ్వరులను చేస్తున్నాను. మీ ల్యాండ్ మీకే ఇస్తున్నాం అని ప్రకటించారు. జర్నలిస్ట్‌లు రెండు చేతులా సంపాదిస్తున్నది సరిపోలేదా?, కోట్ల రూపాయల భూమి ఎవడి సొత్తు అని ఇస్తారు అని తిట్టుకున్న వాళ్ళు, ఈర్షపడ్డ వాళ్ళ సంఖ్యకు లెక్క లేదు. కానీ ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం అప్పటి రేటుతో కొని ఇప్పటి వరకు చకోర పక్షుల్లా ఎదురు చేస్తున్నవాళ్లు అని జాలి చూపిన వారు లేరు. ససేమిరా ఆ భూమి ఇవ్వడానికి వీలులేదు, వాళ్ళు కట్టిన డబ్బు వడ్డీతో తిరిగి చెల్లించండి అని ధర్మ ప్రభువులు తీర్పు చెప్పారు.
ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. డబ్బుకు బదులు ఏదో ఒక చోట భూమి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంలో భాగంగానే మంత్రి విలేకరుల సమావేశం.
***
ముచ్చర్లలో సర్వే నంబర్ 988లో మీకు రెండు వందల గజాల ఇంటి స్థలం ఇస్తున్నామని మంత్రి విలేకరుల సమావేశంలో ప్రకటించగానే అరవింద్‌కు ఏడుపు ఆగలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో తప్పు ఉంటే ప్రభుత్వాన్ని శిక్షించాలి కానీ, జర్నలిస్ట్ లను శిక్షించడం ఏం న్యాయమో అర్థం కాలేదు. మూడు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైమ్ ఏరియా లోని జర్నలిస్ట్‌ల ల్యాండ్ తీసుకుని, మహానగరానికి 60 కిలో మీటర్ల దూరంలో ఐదు వేలకు గజం దొరికే చోట రెండు వందల గజాలా? అని అందరూ బాధపడుతుంటే. అరవింద్ బాధ వర్ణనాతీతం. ముచ్చర్ల ఎక్కడో కాదు తన బాల్యం అంతా గడిపిన తన సొంత ఊరు. మూడెకరాల వ్యవసాయ భూమి అమ్మి, రెండు దశాబ్దాలు నిరీక్షించి అదే గ్రామంలో రెండు వందల గజాలు పొందుతున్న తన దురదృష్టాన్ని చూసి అరవింద్ తట్టుకోలేక పోతున్నాడు. అన్నదమ్ములకు, తల్లితండ్రులకు ముఖం ఎలా చూపాలో అర్థం కావడం లేదు. నిజమే పెద్దలు చెప్పినట్టు పస్తులు ఉండాలి కానీ సొంత ఊరిలో పొలం అమ్ముకోవద్దు అనుకున్నాడు. మబ్బులను చూసి కుండలో నీటిని పారబోసిన తన అజ్ఞానానికి తనను తానే తిట్టుకున్నాడు. ముచ్చర్ల సర్వే నంబర్ 988 ని మరోసారి చూసి ఏడుపు ఆపుకోలేక పోయాడు. సర్వే నంబర్ 988 అంటే తమ భూమే. తాను అమ్మిన భూమి అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వం చేతికి వచ్చింది. తాను అమ్మిన మూడెకరాల భూమిలో 20 ఏళ్ళ తరువాత తనకు రెండు వందల గజాలు వస్తోంది. భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో. తన భూమిలో రెండు వందల గజాల కోసం మూడు ఎకరాలు అమ్మిన నన్ను నేను జీవితంలో క్షమించను అనుకున్నాడు.
నాలుగు దశాబ్దాల జర్నలిజం జీవితం. ఉదయంలో అక్షరాభ్యాసం. అనంతరం నాలుగు దశాబ్దాలు ఆంధ్రభూమిలో అక్షర సేద్యం. 1987లో ఆంధ్రభూమిలో జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరక ముందు నుంచే భూమిలో బోలెడు వ్యాసాలు. 2017లో ఆంధ్రభూమి నుంచి వెళ్లిపోయిన తరువాత కూడా రాయడం ఆపలేదు. ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో 20 ఏళ్ళ పాటు ‘జనాంతికం’ పేరుతో వారం వారం రాజకీయ పోకడలపై సెటైర్ కాలం. ఈ కాలంకు తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం లభించింది. ఆంధ్రభూమి మాసపత్రికలో ఐదేళ్ల పాటు ‘వర్తమానం’ కాలం. విద్యార్థిగా ఉన్నపుడు ఆంధ్రభూమితో ఏర్పడిన అనుబంధం కరోనా ఆంధ్రభూమిని మింగేయక ముందు వరకు కొనసాగింది. రిపోర్టర్‌గా ఉంటూ కాలం రాసిన వాళ్ళు అరుదు. 87లో ఆంధ్రభూమి విశాఖపట్నం ఎడిషన్‌లో కాళీపట్నం ఆధ్వర్యంలో ‘నేటి కథ’ అని రోజుకో కథ వచ్చేది. అక్కడే కథలు రాయడం మొదలు పెట్టి, అక్కడే ఆపేశాను. చాలా ఏళ్ళ తరువాత తిరిగి కథలు రాయాలి అని ఆసక్తి కలిగింది. 2017లో తెలంగాణ తొలి సమాచార హక్కు కమిషనర్ పదవి చేపట్టాను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలోని ఈ పదవివి ఐదేళ్ల పాటు విజయవంతంగా పూర్తి చేశాను. తిరిగి పూర్తి స్థాయి రాత పనిలో పడిపోయాను. రాసుకొని బతకడంలో ఓ తృప్తి ఉంటుంది.
పుట్టింది భువనగిరి జిల్లా మన్నెవారి తుర్కపల్లి. కనులు తెరిచింది, జీవిత కాలం మొత్తం గడిపింది/గడిపేది హైదరాబాద్ లోనే.. ఇద్దరు పిల్లలు, భార్య.. ఇదీ జీవితం.
