పాఠకుల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ వారికి ఆసక్తి కలిగించే విభిన్నమయిన రచనలను అందించాలని సంచిక అనుక్షణం తపన పడుతూంటుంది. అందరికీ అన్నీ అందించాలని ప్రయత్నిస్తూంటుంది. అందుకనే వీలయినన్ని విభిన్నమయిన రచనలను విశిష్టమయిన రీతిలో అందించాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో సంచిక ఎదుర్కొంటున్న ప్రధాన ప్రతిబంధకం పలు రకాలుగా రచనలు చేసే రచయితల కోసం వెతుక్కోవాల్సి రావటం.
సోషల్ మీడియా విస్తృతి వల్ల గతంలోలా ఒక రచయిత తన రచనలను ప్రచురించేందుకు ఎదురుచూడాల్సిన అవసరంలేని పరిస్థితి నెలకొంది. ఒక పత్రికకు రచన పంపి వారి స్వీకారం కోసం ఎదురుచూడటం, తరువాత ప్రచురితమవటం కోసం వేచివుండేందుకు రచయితలు అంత ఉత్సాహం చూపటంలేదు. తాము రాసింది రాసిన వెంటనే సోషల్ మీడియాలో ప్రచురించేస్తే, తమ స్నేహితులు, హితులు వహ్వాలు, గ్రేట్లు అనేస్తే కలిగే అహం, తృప్తి ఒక పత్రికలో ఎడిటర్ అమోదం పొంది ప్రచురితమవటంలోనూ, పలువురు పాఠకుల నిష్పాక్షిక నిశిత పరిశీలనకు గురవటంలోనూ ఆధునిక రచయితకు లభించటంలేదు.
అలాంటి వారు తమకంటూ ఒక గుంపును ఏర్పాటుచేసుకుని ఒకరినొకరు పొగడుకుంటూ తెలుగు సాహిత్యాన్ని ఊపేస్తున్నామని క్విక్సోట్ గాలిమరలపై కత్తియుద్ధానికి వెళ్ళి సాధించిన విజయంలాంటి విజయంతో ఒక భ్రమ లోకంలో వుంటున్నారు. తామిక నేర్పటమే తప్ప నేర్చేదేమీ లేదని అహంకరిస్తున్నారు. పలు కారణాలవల్ల వీరికి సాహిత్యానికి తమని తామే పెద్దలుగా భావించుకునేవారి అండ లభిస్తే ఇంక ఏమీ రాయకుండానే ఫేమస్ రచయితలైపోతున్నారు. వీరి దృష్టికి ఇతరుల రచనలు ఆనటంలేదు. ఇది శోచనీయమైన పరిణామం. రచయిత ఎదుగుదలను నశింపచేసే పరిణామం.
సీనియర్ రచయితలనుంచి తెలుసుకోవాలని, గొప్ప రచయితల రచనలు చదివి గమనించాలన్న తపన లేకపోగా నేనే అంతా అనే ధోరణి ప్రబలుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో విభిన్నమయిన రచనలు రాసేవారు దొరకటం అరుదయిపోతోంది. ఇలా రాయాలని చెప్తే వినే రచయితలు కనబడటం లేదు. రాయాలన్న తపన, అదీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించే రీతిలో రాయాలన్న తపన, ప్యాషన్లు కనబడటంలేదు. రాయకముందే వందిమాగధులు సిద్ధంగా వుండే పరిస్థితిలో ఎవరు ఎవరికి ఏమి చెప్తారు? చెప్తే వినేదెవరు? పైగా కష్టపడి రాసేకన్నా ఏ జర్నలిస్ట్ రచయిత ప్రాపును సంపాదిస్తేనో, ఏ సాహిత్య మాఫియా ముఠా గుంపులో చేర్తేనో ఏమీ రాయకున్నా పెద్ద పేరు వచ్చేసే పరిస్థితుల్లో విభిన్నమయిన రచనలు చదివి, శ్రమపడి విశిష్టంగా రాయాలనుకునేవారెవరు? మారథాన్ రన్నర్లకన్నా వందపరుగుల మెరుపువీరులనే ప్రపంచం గుర్తిస్తుందని షార్ట్కట్ల గొప్పతనాన్ని మెదళ్ళలో ఎక్కిస్తూంటే రాత్రింబవళ్ళు రచనలనే శ్వాశిస్తూ తపిస్తూ ఒక తపస్సులా రచనలు చేసేవారు కనబడతారని ఆశించటమూ దురాశే. పైగా రచనలపై ఆధారపడి జీవించే పరిస్థితి తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ లేదు. దాంతో సంచిక ఆశించిన రీతిలో రచనలను అందించటం కోసం శ్రమించాల్సి వస్తోంది.
అనుక్షణం చక్కగా రాయాలన్న తపన వున్న రచయితల కోసం అన్వేషణ సాగుతోంది. ఆసక్తి కల రచయితలు తమ వివరాలు పంపిస్తే ఆయా రచయితలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రచనల్లో మెలకువలు తెలిపే ప్రయత్నం చేస్తుంది.
సంచిక ప్రధానంగా సాహిత్య పత్రికనే అయినా రచయితలు తామున్న సమాజంతో సంబంధంలేకుండా వుండటమన్నది కుదరని పని. కాబట్టి సంచికలో రాజకీయ సామాజిక అంశాలకు సంబంధించిన శీర్షికలను ప్రవేశపెట్టాలని సంచిక ఆలోచిస్తోంది. ఈ విషయమై పాఠకుల సలహాలను కోరుతోంది. అలాగే విభిన్న అంశాలను రాయటం పట్ల ఆసక్తివున్న రచయితలు ముందుకురావాలని అభ్యర్ధిస్తోంది.
త్వరలో సంచిక ఒక విభిన్నమయిన పోటీ నిర్వహించబోతోంది… వివరాలు త్వరలో…
1 జూన్ 2019 నాటి సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలు ఇవి:
సంభాషణం:
- డా. జి.వి. పూర్ణచంద్ అంతరంగ ఆవిష్కరణ – మొదటి భాగం
ప్రత్యేక వ్యాసం:
- భాసనాటకం – బాలచరితమ్ – ఇ.ఎన్.వి. రవి
కాలమ్స్:
- రంగులహేల-15- బైట నుంచి ప్రేమిద్దాం – అల్లూరి గౌరీలక్ష్మి
- నవ్వేజనా సుఖినోభవంతు!-1 -అటో ఇటో ఎటో వైపు – భావరాజు పద్మిని
వ్యాసాలు:
- సంస్కృత పల్లకి – ఎన్.వి.యస్.యస్. ప్రకాశరావు
- పత్తాలు – నల్ల భూమయ్య
- కందుకూరి వీరేశలింగం సాంఘిక సంస్కరణలు – చారిత్రక నేపథ్యం – దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
కథలు:
- చదరంగంతో చదువు – దాసరి శివకుమారి
- బొమ్మల ఊరు – కాళ్ళకూరి శైలజ
- ఎప్పటాటే – చావా శివకోటి
- స్నేహమంటే ఇదేనా – గూడూరు గోపాలకృష్ణమూర్తి
- అభిషేకం – శ్రీమతి కే వాసవదత్త రమణ
కవితలు:
- అడవికాచిన వెన్నెల – శ్రీధర్ చౌడారపు
- ‘ఈ’ అనుబంధాలు – గొర్రెపాటి శ్రీను
- జోరు – పి.యం.జి. శంకర్రావు
- ఏడ దాగావు కోకిలా – తాళ్ళపూడి గౌరి
- ఈ శాపం మాకెందుకు – కొప్పుల ప్రసాద్
భక్తి:
- దివి నుంచి దిగివచ్చిన దేవతలు – 12 – డా. ఎం. ప్రభావతీదేవి
పుస్తకాలు:
- ‘భారతీయం’ – పుస్తక పరిచయం - సంచిక టీమ్
అవీ ఇవీ:
- “మఱ్ఱిమాను – తరతరాల వారసత్వం” – రంజని కవితల పోటీ ప్రకటన – రంజని
సంచిక ప్రకటనలు:
- కడపలో ‘క్రీడాకథ’ పుస్తక పరిచయ సభ – సంచిక టీమ్
కార్టూన్లు:
- తోట రాజేంద్రబాబు-3
త్వరలో సరికొత్త ఫీచర్లతో, రచనలతో పాఠకులను మరింతగా అలరించే ప్రయత్నాలు చేస్తున్నాము. మీ అభిప్రాయాలు సలహాలూ సూచనల కోసం ఎదురుచూస్తున్నాము.
సంపాదక బృందం
1 Comments
Konduri Kasivisveswara Rao
Sir, Good Morning. June – 2019 editorial lo Chala practical vishayalu teliya chesinunduku dhanyavadamulu. Meeru chestunna talent search ki Hats off. Writers ki meeristunna encouragement entho amulyamainadi. My best wishes to the editor and all staff members of Sanchika Web Magazine. I wish all the best.
Konduri Kasivisveswara Rao, writer