[కారులో హైదరాబాద్ తిరిగి వెళ్తూ రాఘవ గురించి రాజన్న ఎలా చెప్పగలిగారా అని ఆశ్చర్యపోతాడు సుదర్శనాచారి. అన్నకి అన్నీ తెలుస్తాయి అంటుంది ఆండాళ్లు. ప్రసన్నలక్ష్మి తన తండ్రి చెప్పిన మాటలని అత్తమామలకి చెబుతుంది. ఇంటికి చేరాకా ఆండాళ్ళు బీదవారికి నిత్యాన్నదానం మొదలుపెడుతుంది. స్పృహలోకొచ్చి నెమ్మదిగా కదిలిన రాఘవని ఆప్యాయంగా పలకరిస్తాడా తాత. అక్కడ ఫొటోలో ఉన్న యతిని గుర్తించి వారి చిరునామా సంపాదిస్తాడు రాఘవ. తాత ఆదరణతో అప్పనపల్లి శ్రీ పీఠానికి బయల్దేరుతాడు. అక్కడికి చేరేసరికి చీకటి పడుతుంది. ఒక గుడిసె ముందు దీపం వెలుగుతుండడంతో అక్కడికి వెళ్ళి పీఠం దారి అడుగుతాడు. బాగా చీకటిగా ఉండడంతో ఒక లాంతరు ఇచ్చి దారి చెప్తాడాతను. మెల్లగా నడుస్తూ శ్రీ పీఠం చేరుకుంటాడు రాఘవ. గుడి బయట ఉన్న మండపంలో నిద్రిస్తాడు రాఘవ. – ఇక చదవండి.]
ఉదయం ఐదు వరకు ఆ మండపంలో నేల మీద పడుకుండిపోయాడు రాఘవ.
ఐదు గంటలకు గుడి తెరుస్తూ మండపంలో పడుకున్నారెవరో అని చూసి పూజారి, “ఎవరయ్యా? ఇక్కడ పడుకున్నారు. లేవాలి. కోవెల శుభ్రం చెయ్యాలి..” అన్నాడు.
రాఘవ లేచి చుట్టూరా చూశాడు. అక్కడే పంపు దగ్గర ముఖం కడుక్కు వచ్చాడు.
పూజారికి దండం పెట్టి “స్వామి దర్శనార్థం వచ్చానండి..” అన్నాడు.
పూజారి గర్భగుడి తలుపులు తీసి లోపలికి వెళుతూ “స్వామి లేరు కదయ్యా పీఠంలో” అన్నాడు.
రాఘవ షాకయ్యాడు. ‘ఏంటి ఇంత కాలము తిప్పలు పడి వస్తే ఇంకా దర్శనం ఇయ్యవా స్వామి? నాకు ఎక్కడ్నుంచి వస్తుంది ఓపిక ఇక?’ అనుకున్నాడు. కన్నీరు కారుతుండగా ‘నీవు వచ్చే వరకు నేనిక్కడే ఉంటాను. ఇక కదలను గాక కదలను’ అని నిశ్చయించుకున్నాడు.
గుడి లోపల బయట తిరుగుతూ పూజారిగారు రాఘవతో “బయట ఊరి నుంచి వచ్చావా?” అడిగాడు.
“అవునండి..” అన్నాడు రాఘవ.
“సరి అయితే. ఏడు గంటలకు మేనేజరు గుడికొస్తాడు. ఆయనను అడుగు రూము ఇస్తారు..” అని సలహా చెప్పిన రాఘవ అవతారానికి రూము తీసుకుంటాడా ఇతను? అని మనస్సులో విసుక్కున్నాడు.
మురికిగా ఉన్న బట్టలు, పెరిగిన గడ్డం, అట్టలుగా ఉన్న జుట్టు. రాఘవను చూస్తే ఎవరన్నా పిచ్చాడేమో అనుకోవచ్చు. అలా ఉన్నాడతను.
పూజారి మాటలకు తల ఊపి ఆ మండపంలో మఠమేసుకొని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు.
రోజు లాగానే నవ్వుతు యతి దర్శనమిచ్చాడు. “స్వామి నన్ను వదలకు ఇక.. నీవు తప్ప మరి దిక్కులేదు ఈ జీవికి” అనుకున్నాడు ధ్యానంలో.
కోవెలలో సుప్రభాతం పెట్టారు. పూజారి మూలవిరాట్‌కు అభిషేకం చేసి, అలంకారం చేశాడు. అయినా రాఘవకు తెలియలేదు. నిశ్చలంగా అలా మఠమేసుకు కూర్చుని ఉన్నాడు. దాదాపు ఏడింటికి వచ్చాడు మేనేజర్. పూజారి మేనేజరుకు రాఘవను చూపి “బయట ఊరి నుంచి వచ్చాడట సామిగళ్ళ్ కొరకు..” అన్నాడు.
“సరే చూద్దాం..” అన్నాడాయన
రాఘవ అప్పటికింకా లేవకపోతే తట్టి లేపాడు మేనేజరు.
కళ్ళు తెరిచిన రాఘవతో, “బాబు! స్వామి చాతుర్మాసానికి శ్రీరంగం వెళ్ళారు. నీవు సాపాటు చేసి మీ ఊరు వెళ్ళిపో. ఇప్పుడిప్పుడే రారు స్వామిగళ్!” చెప్పాడాయన.
రాఘవ లేచి ఆయనతో నడుస్తూ “నేను ఏ ఊరు లేనివాడినండి. నాకు స్వామి తప్ప మరి గతి లేదు. స్వామి వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. స్వామి వచ్చాక ఆయనే చెబుతారు ఏం చెయ్యమంటారో..” అన్నాడు.
“ఇంటి మీద అలిగి వచ్చావా? ఏ ఊరు? బాష చూస్తే ఇక్కడి వాడివి కానట్టు ఉన్నావు..”
“హైదరాబాద్ అండి.”
“స్నానం చేసి ఎన్ని రోజులైయింది?”
రాఘవ మాట్లాడలేదు.
“మారు బట్టలు కూడ లేనట్టున్నాయి. ఎక్కడుంటావు? ఏం తింటావు?”
“మీరు చెప్పిన పని చేస్తానండి. ఉండమన్న చోట ఉంటాను. నన్ను మాత్రం పొమ్మనకండి. స్వామిని దర్శించే వెళ్ళాలిక్కడ్నుంచి..”
అతని పట్టుదలకు ఆయనకు ఆశ్చర్యమేసింది.
“సరే కానియి. స్వామిని చూసే వెళ్ళుదువు గాని. నాలుగు నెలలు ఉండాలి మరి..”
“సరేనండి..”
ఆయన రాఘవకు ఆశ్రమం వచ్చిన వారు వాడుకునే బాత్ రూములు చూపాడు. “అక్కడ స్నానం చేసి రా.” అని, “ఉండు ఒక నిముషం..” అని ఎవరినో పిలిచాడు.
అతనితో “ఈయనకు ఒక పంచె తెచ్చివ్వు..” అన్నాడు.
అతను ఒక ధోవతి, పైపంచ తెచ్చి ఇచ్చాడు.
రాఘవ స్నానం చేసి వంటి మీద బట్టలు ఉతికాడు. అతను అంతలా శరీర శుభ్రం పాటించి కూడా చాలా కాలమే అయింది. స్నానం చేసి, పెరిగిన జుట్టును నడినెత్తిమీద ముడివేశాడు.
ఆశ్రమవాసులనడిగి తిరునామం దిద్దాడు. అతని అవతారమే మారిపోయింది.
మేనేజరు అతనిని చూసి ఆశ్చర్యపడ్డాడు. “రేపటి నుంచి పనిచెయ్యవచ్చు ఈ రోజు విశ్రాంతి తీసుకో..” అన్నాడు.
రాఘవ ఆ రోజు శ్రీమఠం తిరిగాడు. లాంతరును తిరిగి ఇచ్చి వచ్చాడు.
కాళ్ళ కున్న హవాయి చెప్పులు విప్పి ఆవతల పారేశాడు. జోళ్ళు లేకుండానే తిరగటం మొదలెట్టాడు.
ఆ రోజు ఎక్కడ ఏ పని కావాలన్నా సాయం పట్టాడు. సాయంత్రానికి గుడి మంటపం చేరాడు.
“బాగు బాగు. నీవు గది తీసుకోలే?” అన్నాడు పూజారి.
“లేదండి. నా వద్ద డబ్బు లేదు..”
“మంచి సరుకే!” అనుకుంటూ “వెళ్ళి ఆ మేనేజరుకి చెప్పవయ్యా ఆ విషయం!” అన్నాడు.
రాఘవ మళ్లీ మేనేజరుకు కనపడ్డాడు.
“రాత్రికి నీకు బస కావాలి కదా. సరే. నీవు ఆ హాల్లో పడుకో!” అంటూ ఒక హాల్ చూపాడు. వచ్చిన పేద భక్తులు ఆ హాల్లో పడుకుంటారు. డబ్బులున్నవారు గదులు తీసుకుంటారు.
భోజనానికి శ్రీ పీఠంలో కొరతలేదు. రోజు నిత్యాన్నదానం జరుగుతుంది. రాఘవ శ్రీపీఠంలో నెమ్మదించాడు.
ఇక ఇక్కడుంటే స్వామిని కలవవచ్చానే నమ్మకం కలిగింది. మనస్సులో అగ్ని తీరలేదు కాని కొంత వెసలుబాటు..
ఆ హాల్లో ఉన్న నారాయణ యతి నిలువెత్తు చిత్రపఠం వద్ద ధ్యానిస్తూ ఉండిపోయాడు.
రాత్రి అక్కడే ఏ వేళకో నిద్రపోయాడు.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కుసుమ వేదన-15
సినిమా క్విజ్-92
వందే గురు పరంపరా-1
నిరంతర దైవ నామస్మరణ
ప్రభావశీల వ్యాస సంకలనం ‘ప్రభావం’
సాధించెనే ఓ మనసా!-17
స్టాంపులలో మల్లె సుగంధం
అలనాటి అపురూపాలు-88
కనిపించని కంచెలు
అనూహ్య స్వప్నాలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®