[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
ఆంధ్రుల చరిత్రలో కాకతీయుల కాలం ఒక స్వర్ణయుగం. రాజకీయంగా ప్రజలందరూ ఎక్కువకాలం పాటు ఒక ఛత్రచ్ఛాయలో పాలింపబడ్డారు. తెలుగుభాష, నృత్య సంగీతాలు, తెలుగువారి కవిత్వ పాండిత్యాలు, వర్తక వ్యాపారాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. అటువంటి కాలంలో వెలసిన శాసనాలలో విశేషం ఒకటున్నది. ఈ కాలంలో కనిపించినంతగా స్త్రీలు వేయించిన శాసనాలు ఇంక ఏ కాలంలోనూ కనిపించవు. స్త్రీలు కుటుంబసభ్యుల ధర్మార్ధం దానాలు చేసి వేయించుకున్నవి, వారి తండ్రులు, కొడుకులు ఆయా స్త్రీల ధర్మార్థం వేయించినవి, స్త్రీలే తమకోసం దానం చేసి వేయించుకున్నవి, తమ తండ్రులు, భర్తలు, కొడుకుల పుణ్యలోక ప్రాప్తి కొరకు వేయించుకున్నవి ఎన్నో ఉన్నాయి. ఆయా శాసనాల్లో ప్రసక్తమైన స్త్రీల పేర్లు వంశం, భర్త, తండ్రి లేక కొడుకు పేరు, వారి పదవి ఇత్యాది వివరాలు సేకరించి ఒక పట్టికగా ఏర్పరచితే నా పరిశోధనకీ, ఇతరులకు కూడా లాభించవచ్చునని కాకతీయుల నాటి స్త్రీలు – ఒక పరిగణన అనే ప్రకరణంగా తయారుచేశాను. అయితే ఆనాటి శాసనాలు కొల్లలుగా ఉన్నాయి కనుక మనకు లభ్యమయ్యే శాసనాలలో ముఖ్యమైనవి కొన్ని తీసుకొని పట్టికగా తయారుచేశాను. వాటిని ఆధారంగా తీసుకొని ఆ నాటి స్త్రీల పేర్లు, వారికి సంఘంలో స్థానం, ఆనాటి రాజకీయ, మత సాంఘిక పరిస్థితులలో వారి పాత్ర, వారి ఆర్థిక స్థితిగతులు, వారు చేసే వృత్తులు, దానధర్మకార్యాలు, పూజలు, వ్రతాలు ఇత్యాది విషయాలను గూర్చి పరిశోధించి వ్రాసే ప్రయత్నం చేశాను.
ఈ ప్రకరణంలో పేర్కొనబడిన స్త్రీలు, కేవలం ఉన్నత వర్గానికి చెందినవారే కాదు. భోగస్త్రీలు, సానులు, దేవాలయ పరిచారిక స్త్రీలు, మొదలైన వారెందరో ఉన్నారు. ఆనాడు ఇంటిపేర్లు అంతగా వాడుకలో లేవు. చాలామంది తమ తండ్రుల పేర్లు, తల్లుల పేర్లు, వృత్తుల పేర్లు ముందుచెప్పి తమ పేరు చెప్పుకొనేవారు. ఏ వంశాలకు చెందినవారు తమ తల్లుల పేర్లు చెప్పుకొని తరువాత తమ పేరు చెప్పుకొనేవారో, దానికి కారణం ఏమిటో పరిశోధించడానికి వీలుగా తల్లిపేరు చెప్పి తన పేరు చెప్పుకొన్న సంతానం వేయించిన శాసనాలలో పేర్కొనబడిన స్త్రీలను ఈ పట్టికలో చేర్చాను. కొంతమంది భోగస్త్రీలు సంఘంలో ఎంత గౌరవంగా చూడబడేవారో శాసనాల నుంచి తయారు చేసిన భోగస్త్రీల పట్టికను బట్టి తెలుస్తుంది. ఆనాటి సామంతుల, సంపన్నుల కుటుంబాల స్త్రీలు ధర్మకార్యాలకై ధనాన్ని ఖర్చు పెట్టేవారు. ఎన్నో దేవాలయాలు, తటాకాలు, సత్రాలు, మఠాలు, ఉద్యానవనాలు నిర్మించేవారు. వీటిని తెలిపే శాసనాల నుంటి ఆయా స్త్రీల వివరాలు కూడా ఈ ప్రకరణంలో చేర్చాను.
ఆనాటి స్త్రీలలో కులస్త్రీలు అనగా ధర్మపత్నులు, ఇతర భార్యలు, భోగస్త్రీలు, వేశ్యలు, దేవాలయ పరిచారికలు అంతఃపుర పరిచారికలు ఉండేవారు. వీరందరూ బీదా, గొప్పా తారతమ్యం లేకుండా తమశక్తి కొలది దానాలు చేసేవారు. వీరికి శాసనాల్లో వాడబడిన విశేషణాల వల్ల వారు ఏ వర్గానికి చెందినవారో ఏఏ ప్రత్యేకతలు కలిగినవారో ఏ మతాన్ని అనుసరించిన వారో తెలుసుకునే వీలున్నది. కనుక ఆ స్త్రీల పట్టికలో వారికి వాడబడిన విశేషణాలను చేర్చడమే కాక ఆయా విశేషణాలను బట్టి ఆయా స్త్రీల వ్యక్తిత్వ నిరూపణకు కూడా ప్రయత్నం చేశాను. వారు ఏ కాలంలో దానం చేశారో ఏఏ సందర్భాలలో ఏ పుణ్యక్షేత్రాల్లో ఏ విధమైన దానాలు చేశారో పరిశీలించడానికి వీలుగా ఈ పట్టికలో స్త్రీలను పేర్కొన్న సందర్భంలో ఆయా వివరాలు చేర్చాను.
కాకతీయులు మొదట జైన మతాన్ని అభిమానించి తరువాత శైవమతాన్ని పోషించి, చివరలో వైష్ణవాన్ని ప్రోత్సహించారని శాసనాలను పరిశీలిస్తే అవగతమౌతుంది. కాకతీయ రాజులు, చక్రవర్తులు అభిమానించిన మతాన్ని వారి స్త్రీలు కూడా అభిమానించారా, సామంత కుటుంబాల్లో స్త్రీలు వేరే మతాలను అనుసరించారా? లేక వారి రాజులు, భర్తలు అనుసరించిన మతమే అనుసరించారా అన్న అంశాలని పరిశీలించి మతం విషయంలో ఆనాటి స్త్రీలకి భావస్వాతంత్ర్యం ఉన్నదా లేదా అని పరిశోధించడానికి ఈ ప్రకరణం ఉపయోగిస్తుంది.
ఇక స్త్రీలలో వారి కులాలు, మతాలు, వర్గాలు అనేవాటిని అనుసరించి నామధేయాలుండేవి. వారు అచ్చంగా దేశీయమైన తెలుగు పేర్లు పెట్టుకొనేవారా లేక సంస్కృత నామధేయాలుండేవా, శాసనాలలో ఒకే పేరుతో వ్యవహరింపబడేవారా, కొద్దిమార్పు కలిగిన పేర్లతో వ్యవహరింపబడేవారా, నామాంత ప్రత్యయాలుగా దేవి, అంబిక, అమ్మ, అక్క, సాని వంటివి చేరేవా అన్న విషయం ఆనాటి స్త్రీల నామధేయాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఒకే కుటుంబంలో ఒకే పేరుతో చాలామంది వ్యక్తులుండేవారు. సరిగా పరిశీలించకపోయినట్లైతే వారిని ఒకరుగానే భావించి చారిత్రక పరిశోధనలో తప్పుడు నిర్ణయాలు జరగవచ్చు. కనుక ఒకే పేరున్న వ్యక్తుల భర్తలు తండ్రులు, కొడుకుల వివరాలను, స్త్రీలను తెలిపే సమయంలో తెలపడం వల్ల ఈ సందేహాలు కలుగడానికి ఆస్కారం తక్కువ. కనుక స్త్రీల పరిగణనలో ఈ వివరాలు కూడా చేర్చడమైనది.
శాసనాలలో ప్రసక్తమైన స్త్రీలకు వారి తల్లిదండ్రులు, భర్తలు, సోదరులు, కొడుకులు, కుమార్తెలు వాడిన విశేషణాలను బట్టి ఆ స్త్రీలు కుటుంబంలో ఎటువంటి స్థానాన్ని పొందారో తెలుసుకోవచ్చు. వారి కుటుంబ సభ్యులకు ఆ స్త్రీల పట్ల గల గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు తెలుస్తాయి. కనుక ఆ స్త్రీలను, వారి విశేషణాలను పట్టికలో చేర్చాను.
పై విధంగా ఏర్పరచిన పట్టిక చదవడానికి ఆసక్తికరంగా లేకపోయినప్పటికీ పరిశోధనా దృక్పథంతో చూస్తే అవసరమని తోచడంవల్ల ఈ ప్రకరణాన్ని కాకతీయులనాటి స్త్రీలు – ఒక పరిగణన అన్న శీర్షికతో తయారుచేశాను.
ఈ ప్రకరణాన్ని రెండు భాగాలుగా విభజించాను. మొదటి భాగంలో పరిశోధనాంశానికి చెందిన కాలానికి చెందిన (అంటే క్రీ.శ. 1100 నుండి 1323 వరకు) ఉన్న కావ్యాలలోనూ శాసనాలలోను ప్రసక్తమైన, ప్రసిద్ధురాండ్రైన స్త్రీలను గురించి వివరిస్తాను. రెండవభాగంలో ఆ కాలంలో శాసనాలలో ప్రసక్తమైన రాజసామంత, మంత్రి దండనాయకాది రాజోద్యోగుల స్త్రీలు, మున్నూర్వురు సానులు, భోగస్త్రీలు మొదలైనవారి గురించిన వివరాలు పేర్కొంటాను.
శీలమ పల్నాటివీరులకు సంబంధించిన కాలంనాటి శ్రీ బ్రహ్మనాయుని తల్లి. అనుగురాజు మంత్రి దొడ్డనాయుని భార్య. అనుగురాజు తన రాజ్యం పాలమాచాపురి వదలి తీర్థయాత్రలకై వెడలినపుడు అతనితోపాటు పలనాడుకు వచ్చిన పరివారంలో ముఖ్యమైన శ్రీ బ్రహ్మనాయుని ‘శీలమబ్రహ్మ’ అని వ్యవహరించడం వల్ల శీలమ ప్రత్యేకత తెలుస్తుంది.
శీలమ కూడా నాయకురాలు నాగమ వలె రాజనీతి, రాజ్యతంత్రం తెలిసిన స్త్రీ. స్వయంగా రాజ్యపాలన, మంత్రాంగం నెరపకపోయినప్పటికీ, ముందు నలగామరాజుకు, తరువాత మలిదేవునికి మంత్రి అయిన బ్రహ్మనాయునికి రాజనీతిని బోధించేది. మంత్రులకుండవలసిన అప్రమత్తత, జాగరూకత శీలమ కున్నాయని పలనాటి వీరచరిత్ర కావ్యాన్ని బట్టి తెలుస్తుంది.
మండాది వలస వెళ్ళిన మలిదేవాదుల బలాన్ని తెలుసుకొనేందుకు వారి ఆలమందను తోలి తెచ్చేటందుకు నాయకురాలు నాగమ వీధుల పలినేనిని పంపగా అతడు వేగులవారిని పంపాడు. వారు దాసరుల వేషాలతో తిరుగుతూ వైష్ణవ మతానుయాయులైన బ్రహ్మనాయుని పక్షంవారిలో చేరి వివరాలు సేకరించేందుకు మండాది చేరారు. వీరు నిజమైన దాసరులని భావించి శీలమ తన దాసిని పంపగా ఆమె వారిని వెంటబెట్టుకొని శీలమ వద్దకు తీసుకురాగా ఆమె వారిని వేగులవారని వెంటనే పసిగట్టింది. వారిని పేరుపేరునా పిలిచి పలకరించగానే వారు భయపడి నమస్కరించి రక్షించమని అర్థించారు. వారిపై దయగలిగి విడిచిపుచ్చిన దయార్ద హృదయ శీలమ.
తల్లిపై అమితమైన భక్తి గలవాడు బ్రహ్మనాయుడు. అతడు తల్లికి మొక్కనిదే, ఆమె అనుమతి లేనిదే ఏ పనీ చేయనారంభించనివాడు.
నలగాముడు తన మందను పొడిపించి లంకన్నను చంపించాడని ఆగ్రహించి బ్రహ్మనాయుడు గురజాలపై దండెత్తబోయిన సందర్భంలో తల్లివద్దకు దీవనకై వెళ్ళాడు. శీలమ బ్రహ్మనను దీవించి, ఏయే వేళల యుద్ధం చేయకూడదో, యుద్ధంలో ఎవరెవరిని చంపగూడదో బోధించింది. అధర్మయుద్ధం చేయరాదన్నది. కట్టెలు మోసేవారు, కూరలమ్మేవారు, పశువుల కాపర్లు, ఆటవిక జనులు, స్త్రీలతో కూడి తమ యిళ్ళలో దాగినవారు, గుడులలో చేరినవారు మొదలైన వారిని చంపరాదని చెప్పింది. న్యాయం, ధర్మం, దయ వదలి పురుషన్యాయం వీడి చంపటం దోషమని బోధించింది. ఏయే వేళల్లో యుద్ధం చేయరాదో విశదంగా చెప్పి కారణాలు బోధపరచింది. జపం కొఱకు బ్రాహ్మణులు వెళ్ళేవేళ (సంధ్యవేళ), ఉదయమే స్త్రీలు ఆవులను పాలకై పితికే ఆ సమయంలో కోటపై ముట్టడి చేస్తే అగ్నివాయువుల చేత పట్టణం కాలి పశువులు కాలి నశించిపోతాయని, ఆ దోషం ఎన్నటికీ పోదని హెచ్చరించింది. పగలంతా పొలంలో పనిపాటలు చేసి మగడు ధాన్యం కొని మాపటికి ఇల్లు చేరుతాడనే ఆశతో అతని కులసతి, బిడ్డలు తమ ఇళ్ళలో ఎదురుచూస్తూ ఉంటారు. కనుక అర్ధరాత్రి దాడి మంచిది కాదు. ఆవేళ కోట ముట్టడి చేసినపుడు నిన్ను చూసిన భీతిలో ఆయుధాలను మరిచిపోయినవారిని చంపడం దోషం. వారిని నీ తమ్ములుగా భావించు అని చెప్పింది. బ్రాహ్మణులు, భక్తులు, భట్లు, దాసరులు, జంగములు, జోగులు చంపదగినవారు కారు. కనుక వారిని ముందు జాగ్రత్తకై హెచ్చరించాలి. ఆ తరువాత రాజుకు తెలిసేటట్లు యుద్ధం ప్రకటించి ఏడు గడియలకు గురజాలపై దాడిచేస్తే విజయం, కీర్తి లభిస్తాయని బోధించింది.
అనుగురాజు పంపితే ఆరణగండ్లపై దండెత్తే సమయంలో శీలమ బ్రహ్మనను ప్రోత్సహించి యుద్ధానికి పంపింది. కొడుకు యుద్ధానికి వెళ్ళే కారణం తగినదైతే ప్రోత్సహించింది. యుద్ధం వల్ల ప్రజలకు కలిగే నష్టాలు ఆమెకు బాగా తెలుసును కనుక వాటిని తగ్గించడానికై ఆ నష్టాల గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని తన కొడుకుకు బోధించి పంపింది.
బ్రహ్మనాయుని వంశాన్ని శీలమవారని వ్యవహరించడం వల్ల శీలమకున్న ప్రత్యేకత, ఆమె గొప్పతనం తెలుస్తాయి.
“కోరి శీలమ యింటి కూరాకు నీరు వారక త్రాగిన వారలకెల్ల కలుగు శూరత్వము” అని “చేరి శీలమువారి చేతిక్రిందుండి కలినీళ్ళు త్రాగిన కలుగు మగతనంబు”
అన్న వాక్యాలను బట్టి శీలమ వంశం పౌరుషానికి శూరత్వానికి పెట్టింది పేరని తెలియడమే కాదు,
“మొక్కలంబుగ మీరు మొనల ఖండించి గుఱ్ఱమ్ము లేనుగుల్ గూలంగ పొడిచి సెలగొని కొట్టుడీ సేనలనెల్ల”
అని కొడుకు బ్రహ్మనాయుని యుద్ధానికి ప్రోత్సహించి దీవించి పంపిన శీలమ వల్లనే ఆ వంశానికి ఆ కీర్తి కలిగిందని భావించవచ్చును.
కాకతీయుల కాలంలో ప్రసిద్ధిపొందిన మహిళలలో నాయకురాలు నాగమ్మ ముఖ్యురాలు. ఈమె వీర జగ్గారెడ్డి పెంపుడు కూతురు. పంటరెడ్డి భార్య, ఆరవెల్లి వారి అనుగు కోడలు. మేకపోతుల రెడ్డి మేనకోడలు. ఈమె రాజకీయాలలో ప్రవీణురాలు, యుద్ధప్యూహ రచన చేయగలిగింది. స్వయంగా కత్తి పట్టి యుద్ధం చేయగలిగిన వీరనారి. అంతేకాదు మంత్రులకు కావలసిన సమయస్ఫూర్తి, కార్య సాధనకు అవసరమైన సామదానభేద దండోపాయాలను చక్కగా ఉపయోగించ గలిగిన నేర్పు ఆమెకు అపారంగా ఉన్నాయని పలనాటి వీర చరిత్ర కావ్యాన్ని బట్టి తెలుస్తుంది.
అనుగురాజు వద్ద మంత్రిగా చేరకముందే నాగమ్మ గామాలపాడు గ్రామానికి నాయకురాలు. ఆ అధికారంతోనే వేటనుంచి తిరిగి వస్తూ ఉన్న అనుగురాజును, అతని పరివార జనాన్ని తన గ్రామానికి ఆతిథ్యం స్వీకరించమని ఆహ్వానించింది. ఆ ఆహ్వానంలోనే ఆమె లౌక్యం రాజకీయ కుశలత తెలుస్తాయి.
రాజకీయాలలో ఆతిథ్యానికి గొప్ప స్థానమున్నది. పెద్ద పెద్ద దేశాధినేతలు ఇరుగు పొరుగు దేశాలతో మైత్రి సంబంధాలు పెంచుకొనేందుకు ఒకరి దేశాన్ని మరొకరు సందర్శిస్తారు. ఆ సందర్భాలలో అతిథిని ఆహ్వానించే దేశం చేసే స్వాగత కార్యక్రమాలపైనా, అతిథి సత్కారాలపైనా ఆయాదేశాల దౌత్య సంబంధాలు ఆధారపడి ఉంటాయి. అటువంటి నేర్పు, చాకచక్యం చూపించే దేశాల దౌత్య సంబంధాలు చక్కగా ఉండి రాజకీయౌన్నత్యానికి దారి తీస్తాయి. నాగమ్మ అటువంటి నేర్పు, చాకచక్యం ఉన్న స్త్రీ కనుక అనుగురాజు వేటకు వెళ్ళి వచ్చేమార్గంలో గామాలపాడు గ్రామవాసుల తరఫున అతడిని సవినయంగా ఆహ్వానించింది.
“వినవయ్య రాజేంద్ర విన్నపంబొకటి కంటిని రెప్పతాకాచెడు భంగి పుణ్య పురుషుండవై భూమిపాలింప నెమ్మినున్నారము నీదు రాజ్యమున”
అని చెప్పి విందుకు పిలిచింది. అందరికీ విడుదుల నేర్పరచి విందులు కావించింది.
నలగామరాజు కొలువులో మంత్రిణిగా ఉన్నపుడు కోడిపందాల సందర్భంలోనూ అతిథుల కోసం ఏర్పాట్లు చాలా గొప్పగా చేయించింది. ఈ విధంగా అతిథి మర్యాదలు చేసి దౌత్యసంబంధాలు గట్టిపడే మార్గాన్ని చూపిన నాగమ్మ తరువాతి కాలాల్లోని వారికి అనుసరణీయురాలు.
నాగమ్మ సమయాసమయ విచక్షణ కల స్త్రీ. అనుగురాజుకు ఆతిథ్యం గొప్పగా ఇచ్చి అతని అనుగ్రహాన్ని సంపాదించి ఏడు గడియలపాటు మంత్రిపదవిని నిర్వహించాలని వరం కోరింది. రాజు అందుకు సమ్మతించినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోలేదు. కారణం ముందు వెనుకలు చూడకుండా మంత్రిపదవి చేపట్టితే ప్రయోజనం ఉండదు. అదను వచ్చినపుడే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిసిన కుశాగ్రబుద్ధి నాగమ్మ. కనుక అనుగురాజుతో పత్రం రాయించుకుని నలగామరాజు రాజై బ్రహ్మనాయుడు మంత్రిపదవి నిర్వహించే రోజువరకు వేచి ఉన్నది. అప్పటివరకు రాజసభకు రాకపోకలు సాగించి విషయాలను, పరిస్థితులను అవగాహన చేసుకున్నది. బ్రహ్మనాయని మంత్రిత్వం నాగమకు నచ్చలేదు. అందుకు వారిద్దరి మధ్యనున్న మత వైషమ్యం కూడా కారణం కావచ్చు. నాగమ్మశైవభక్తురాలు. నలగాముడు, అతని తల్లి మైలమ వంశంవారు శైవులే. నలగాముడు శివుని ప్రసాదం వల్ల జన్మించాడు. హైహయులు చెన్నకేశవుని భక్తులు. పట్టపురాణి వీరవిద్యలదేవి చెన్నకేశవుని నోము నోచగా మలిదేవాదులు జన్మించారు. బ్రహ్మనాయుడు వైష్ణవమత ప్రచారానికి ఎంతో దోహదం చేశాడన్నది చరిత్ర ప్రసిద్ధమైన విషయమే. శైవురాలయిన నాగమ్మకు బ్రహ్మనాయునిపై నమ్మకం తక్కువ. అతడు పట్టపుదేవి వీరవిద్యలదేవి పుత్రుడైన మలిదేవునికి రాజ్యం కట్టబెడితే ఆధిపత్యం బ్రహ్మనదేనని మలిదేవాదులు బ్రహ్మన చేతిలో కీలుబొమ్మల వంటివారని, నాగమ్మ భావించి ఉంటుంది. బ్రహ్మన మలిదేవుని పేరుమీద రాజ్యం చేస్తే శైవమతాధిక్యం తగ్గి వైష్ణవ మతప్రాబల్యం ఎక్కువౌతుందని ఆమె అభిప్రాయపడి ఉండవచ్చును. కనుక నలగాముని దృష్టిలో బ్రహ్మనాయుని దోషిగా నిలబెట్ట నిశ్చయించింది. తాను మంత్రి పదవి చేపట్టగానే రాజభటులను రహస్యంగా పంపి బ్రహ్మనాయుని స్నేహితుల ఇళ్ళు కొల్లగొట్టించి, ఆ ధనరాశులను నలగామరాజుకు చూపి బ్రహ్మనాయుడు ఏటేటా రాజుకు రావలసిన ఆదాయంలో చాలా భాగం స్నేహితుల ఇళ్ళకు చేర్చుతున్నాడని తగిన ఆధారాలతో వెల్లడించింది. అనవిని నలగాముడానాటినుండి ‘శీలమ బ్రహ్మిని చేరంబవెరచె’. దానితో నలగామరాజుకు బ్రహ్మనాయునిపై విశ్వాసం సడలిపోయింది.
ఆనాడు రాజకీయాలకూ మతానికి అవినాభావ సంబంధం ఉండేది. ప్రజలే మతాన్ని అభిమానిస్తే ఆ మతాన్నే రాజులు ప్రోత్సహించేవారు, అవలంబించేవారు. వారి రాజరికం తద్వారా సుస్థిరంగా ఉండేది. కనుక ఆనాటి మతాలు ప్రజలని ఆకట్టుకునే విధంగా తయారయేవి. వర్గభేదం స్త్రీ పురుష బేధం చూపని వ్యవస్థను శైవమతం ప్రోత్సహించింది. దానికి ప్రతిగా ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి క్రింది వర్గాల ప్రజలందరినీ తన చాపకూటి సిద్ధాంతంతో కూడగట్టుకొని బ్రహ్మనాయుడు వైష్ణవ మత ప్రచారం చేసి తద్వారా రాజకీయంగా తన బలాన్ని పెంచుకొన్నాడు. మలిదేవరాజును నామమాత్రపు రాజుగా చేసి తానే అధికారాన్ని చేపట్టాడు. శివభక్తురాలు, చారచక్షువు, రాజనీతి కుశలురాలైన నాగమ్మ ఈ విషయాలన్ని ముందే గ్రహించి బ్రహ్మనాయునికి అతడాశించిన అధికారం దక్కకుండా వ్యూహం పన్నింది. కానీ చివరకు పల్నాటి విభజన తప్పలేదు. ఆమె ఊహించినట్లే మలిదేవుని పేరిట బ్రహ్మన పలనాటిని పాలించసాగాడు.
మలిదేవుని పేరిట మాన్యుడు బ్రహ్మి పలనాటి నింపార పాలింపుచుండె
నలగామరాజు తమ్ములంటే ప్రీతిగలవాడు కనుక అతడు రాజ్యవిభాగానికి వ్యతిరేకి కాదు. అయితే ఈ విభజన వల్ల లాభం పొందినవాడు బ్రహ్మన. రకరకాల చిన్నవృత్తులు చేసుకొనేవారిలో అంత ధనం చేరడం అసాధ్యం. పైగా వారందరూ చిన్నచిన్న వృత్తులను చేసుకొనేవారు. బ్రహ్మనాయని భార్య ఐతాంబ వద్ద చాలా ధనం ఆభరణాలు అతడు యుద్ధాలలో అప్పనాలుగా తెచ్చినవి ఉన్నట్లు బాలచంద్రుని మాటలవల్ల తెలుస్తుంది.
సకల దేశాధీశ సంఘంబునెల్ల సమర రంగంబున సాధించి మించి వారిచే మాతండ్రి వలసినయట్లు అప్పనంబులు గొన్న అధిక ధనంబు
మంత్రి రాజుకు యుద్ధాలలో సహాయపడి కొల్లగొట్టి కప్పాలుగా సంపాదిస్తే అదంతా రాజుకే చెందాలి. సాధారణంగా మంత్రులు పదవికి తగ్గ హోదాగలవారే కానీ రాజుకు ఉండే వైభవం ఉండదు. మలిదేవుని మంత్రి బ్రహ్మనాయుని వద్ద అపారమైన ధనమున్నది కానీ నాగమ ఏ విధంగా గానూ వైభవంగా ఉన్నట్లు కనిపించదు కనుక నలగామరాజుకు మంత్రిణి అయిన నాగమ్మ తన స్వార్థం కోసం బ్రహ్మనను నలగామరాజుకు దూరం చేసి ఉండదు.
నాగమ్మను కుతంత్రగా మాయలాడిగా, భారతంలో శకునిలా దాయాదుల మధ్య యుద్ధం కల్పించినట్లు పలనాటి వీరచరిత్రలోనూ, లోకంలోనూ అభిప్రాయమున్నది. దీనికి కారణాలు బ్రహ్మనాయకుని పై అభిమానం, ఒక స్త్రీ మంత్రిణిగా పదవిని చేపట్టటాన్ని అంగీకరించలేని మసస్తత్వం కావచ్చును. కానీ పలనాటి వీరచరిత్ర కావ్యాన్ని నిశితంగా పరిశీలించితే నాగమ్మ రాజుకు, ప్రజలకు మేలు చేకూర్చే మంత్రిణిగా వ్యూహంలోనూ, రాజనీతిలోనూ పురుషులను మించగల ప్రతిభ ఉన్నట్లు గ్రహించవచ్చును.
నాగమ్మకు నలగామరాజుపై అభిమానం ఎక్కువః –
అనుగురాజు సంతానంలో నలగామరాజు పెద్దవాడు. అనుగురాజే నలగామరాజును రాజుగా నియుక్తుని చేశాడు. పలనాటి సీమ నలగామరాజు తల్లి మైలమకు పసుపునకు ఆమె తండ్రి ఇచ్చినది. ఆ విధంగానూ నలగామరాజే న్యాయంగా రాజ్యానికి వారసుడు. కనుక నాగమ్మ నలగామరాజు నుంచి రాజ్యాధికారం పోకుండా రక్షించ ప్రయత్నించింది.
అలరాజు మరణానికి నాగమ్మ బాధ్యురాలు కాదు: –
బ్రహ్మనాయుడు మలిదేవాదుల రాజ్యభాగం కొఱకు నలగామరాజు వద్దకు అలరాజును రాయబారిగా పంపించదలిచాడు. భట్టునో, బ్రాహ్మణునో రాయబారిగా పంపించమని అలరాజు తల్లిదండ్రులు బ్రహ్మనను వేడుకున్నారు.
రాజులెన్నండేని రాయబారములు పోయిరే నరుడా పొసగ దీమాట తగునయ్య ఇట్లాడ ధర్మమా నీకు బ్రాహ్మడు పోవలె భట్టు పోవలెను నాకొమరును బంప న్యాయమా నీకు మా తండ్రితోడనే మడ సెదమనగ ఏమని నమ్మించి, యేల తెచ్చితివి నీళుల ముంచిన పాలముంచి నను నీ భారమేకద నీలవర్ణుండ
అని అలరాజు తండ్రి వేడుకున్నాడు. అతని తల్లి చల్లమ్మ
నమ్మి వచ్చిన వారి నడుప వలె గాక మహిలోన గూల్చెడి మహి పతులు కలరె ఏగురి కొక సుతునేమని యిచ్చి ఏ దేశమే భూమికేగెదమయ్య నాకుమారుని పంప న్యాయమా నీకు
అని బ్రతిమలాడింది. అందుకు బ్రహ్మన నీ కుమారునికి కీడు కలిగితే అతనికి బదులుగా తన కుమారుణ్ణి ఇల్లడ నిస్తానన్నాడు.
రాయబారానికి వెళ్ళిన అలరాజు, తల్లి హెచ్చరించిన విధంగా మామగారింట విడిది చేయక, వారింట్లో భోజనం చేయక, నాయకురాలి నుండి ఏమీ గ్రహించక వెనుతిరిగి వచ్చాడు. నలగాముని సభలో రాయబారిగా అలరాజుకు గౌరవమర్యాదలు జరిగాయి. కానీ అలరాజే ఆగ్రహంతో నాయుకురాలి వల్లనే ఈ కలహం వచ్చిందని ఆమె పై కత్తిదూశాడు. ఏమరుపాటు లేకుండా నాగమ్మ నేర్పుతో తప్పించుకున్నది. అయినప్పటికీ అలరాజు పై ఆగ్రహించక మామ నలగామరాజు అతనిని బుజ్జగించి ప్రేమతో అంతఃపురానికి రమ్మంటే కాదని తిరుగు ప్రయాణమైనాడు. విషం నిండిన పూలచెండును కొమ్మజియ్యరు కొనిపోతుండగా పిలిచి నాగమదని తెలుసుకొని, ఆమెకు పూజలెక్కడివని హేళన చేసి పూవుల వాసన చూసి ఆ విషం వల్ల మరణించాడు. తల్లి చెప్పినప్పటికీ అజాగ్రత్తతో అలక్ష్యంతో మరణాన్ని కోరితెచ్చుకున్నాడు. నాగమ్మ విషపు పూలచెండు పంపినా అది శతృవుల మధ్య మాములుగా జరిగే విషయమే కనుక శత్రువుల నుంచి ఏ వస్తువు స్వీకరించవద్దని తల్లి చల్లమ చెప్పింది. అలరాజు మరణం వల్ల నలగామరాజుకు దుఃఖమే కాని ఆనందం ఉండదు. అల్లునితోపాటు కూతురు పేరిందేవి కూడా గతించింది. అలరాజు మరణం వల్ల నాగమకు ఏమీ లాభించదు. కనుక స్వార్థంతో నాగమ్మ ఈ కుట్ర పన్నిందని చెప్పలేము. ఏది ఏమైనా ఆ కాలంలోని రాజనీతి తంత్రం ఆ విధంగానే ఉండేది. కనుక మంత్రిగా నాగమ్మ తన విధి నిర్వర్తించింది అని చెప్పవలసి ఉంటుంది.
ఒకవిధంగా బ్రహ్మనే అలరాజు మరణానికి కారకుడని చెప్పవచ్చు. అలరాజు తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా వినిపించుకోక శత్రువుల మధ్యకు అలరాజును పంపాడు. అలరాజు మరణించాక అతని బిరుదులు, ఆయుధాలు, పదవి అన్నీ బాలచంద్రునికే దక్కాయి.
నాగమ్మమంత్రిగా ఏ కార్యాన్నైనా నిపుణతతో చక్కటి పథకంతో నిర్వహించగల సమర్థురాలు. బ్రహ్మనాయుడు కోడిపందానికి సిద్ధమై తన పరివార బలగాలతో వచ్చిన సందర్భంలో కోడిపోరుకు కావలసిన ఏర్పాట్లను పరిశీలిస్తే ఆమె చాకచక్యం ద్యోతకమౌతుంది. కోడిపందానికి కావలసిన గరిడి, ప్రేక్షకులు తిలకించడానికి తమకం, పందెం చూడడానికి వచ్చినవారు విడిదిచేయటానికి ఇళ్ళు, రాజులు కూర్చునేటందుకు రత్నాలతో అలంకరింపబడిన వేదిక, నాలుగు వర్ణాలవారు కూర్చునేటందుకు తగిన స్థానాలు నిర్ణయించి, ఆనుకునేందుకు దిళ్ళు, స్తంభాలు మొదలైనవి సిద్ధంచేసి, వీటన్నిటినీ అందంగా అలంకరించడానికి ఒక ఓజును (ఈనాడు మనం ఆర్కిటెక్ట్ అని ఆంగ్లంలో అంటాము) నియమించి, తాము చెప్పినట్లు చేసిన తరువాత అతనికి ఒక ఊరును బహూకరించింది.
నాగమ నేర్పు కోడిపందెం తరువాతి పరిణామాల నూహించడంలోనూ, వాని నెదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్లలోనూ ద్యోతకమౌతుంది. కోడిపందెంలో ఓడినా గెలిచినా ఇరుపక్షాలకు పంతం పెరిగి యుద్ధానికి దారితీయవచ్చును. కనుక నాగమ్మ కోడిపోరుకే కాక తరువాత జరిగే యుద్ధానికి కూడా తగిన ఏర్పాట్లు చేసింది. ఆశ్వికులను పేరుపేరునా పిలిచి ప్రత్యేకమైన అశ్వాలను ఇచ్చి యుద్ధానికి సిద్ధం చేసింది. అనుకున్నట్లుగానే గోపన కయ్యంతో కాలుదువ్వి యుద్ధంలో మరణించగానే, గోసంగి కన్నమ గోపన్న మరణానికి బదులు తీర్చుకునేందుకు శత్రువులపై దూకి చీల్చిచెండాడుతూ ఉండగా ప్రజలు భయభీతులై పరుగులెత్తి కోటకు చేరారు. నాగమ్మ శత్రువులు ప్రవేశించకుండా కోటవాకిళ్ళు, తలుపులు మూసి, తాళాలు పెట్టి కోటను కాపాడి కోట వెలుపల ఉన్న నలగామరాజును హెచ్చరించి కోట లోపల ఉండమని అతనిని పంపి, కన్నమనీడు చేసే వీరవిహారానికి బెదిరి గగ్గోలు చెందిన ప్రజలు పారిపోతుండగా వారిని కోటలోనికి పంపి నాలుగు గవనులను, తలుపులను బిగించి, తాళాలు వేసి బ్రహ్మనాయుని వల్ల భయంలేదని ప్రజలకు ధైర్యం చెప్పింది. సైన్యబలాన్ని సమీకరించి కోటను, రాజును, ప్రజలను కాపాడిన మంత్రిణి నాయకురాలు నాగమ.
మలిదేవాదులు పంపగా నలగామరాజు వద్దకు రాయబారిగా వచ్చిన భట్టు వారి సందేశం వినిపించి, బ్రహ్మనాయుని పక్షం వారిబలంతో పోల్చి నలగాముని లోకువచేసి, బెదిరించినపుడు నాయకురాలికి ఆగ్రహం వచ్చింది. కానీ పలికిన వాడు భట్టు కనుక చంపక హెచ్చరించి, మర్యాదననుసరించి అతనికి కట్నాలిచ్చి పంపించింది. కనుక నాగమ్మ మంత్రిగా తన కర్తవ్యం మరచిపోదని రుజువౌతున్నది.
పలనాటి యుద్ధం సవతి సోదరుల మధ్య జరిగిన పోరు కాదని నలగామునికి బ్రహ్మనాయునికి మధ్య పోరనే అభిప్రాయం పలనాటి వీరచరిత్రలోనే ఉన్నది. బ్రహ్మనాయుని వద్ద కుంతమున్నదనే భయంతో అతడడిగిన అప్పనములు ఇచ్చిన రాజులు బ్రహ్మనాయుని గెలిచిన తరువాత అరమరులు మాని ఐకమత్యంతో రాజ్యాలను ఏలుకొందామని నలగామరాజు వ్రాసిన లేఖ చిన్నచిన్న కలహాలతో విడిపోయిన రాజులందరికీ సంతోషం కలిగించింది. అతని లేఖ నందుకున్న రాజులందరూ
నలగామరాజును నాయనివారు పగబెట్టుకొని పోరపయనమైనారు వీరకాముని గూడి వీరయుద్ధమున బలమెచ్చనందరు బ్రహ్మనాయుణ్ణి పొంగెల్ల నడగించి భూమేల వలెను
అని నలగాముని పక్షాన బ్రహ్మనాయునితో పోరాడడానికి నిశ్చయించారు. రాజులందరూ ఐకమత్యంతో పోరాడడానికి కారణం నలగామరాజు వ్రాసిన లేఖ. “మనకప్పనము పెట్టు మన్నెవారలకు పంపించు లేఖలు బలముంగూర్చి”. ఆ లేఖ వ్రాయమని ప్రోత్సహించినది అతని మంత్రి నాయకురాలు నాగమ్మ. బహ్మనాయుడు గానీ, అతని పక్షంవారు కానీ కేవలం భుజబలంపై ఆధారపడినవారే కాని ఏ మాత్రం ఆలోచన, సరియైన యుద్ధ ప్రణాళిక చేయగల సమర్థులుకారు.
మరణమైనను చాలు మంచిది యనుచు తగతెంపు చేతురా దారిద్ర్యయుతులు
అని నలగామరాజు చెప్పినట్లు వారు యుద్ధంలో మరణానికి సిద్ధపడేవారే కాని యుద్ధంవల్ల వచ్చే కష్టనష్టాలు సామాన్య ప్రజలు సైనికులు పడే బాధలు వారికి తెలియవు. మలిదేవుని పక్షంలో ఎంత సైన్యమున్నదీ, వారి భండారం (కోశాగారం) లో ఎంత హైన్యత ఉన్నదీ, దానివల్ల వారు ఎదుర్కోవలసిన పరిస్థితులు, జీతాలు ఇవ్వకపోతే బంట్లు యుద్ధాలు చేయక వెళ్ళిపోతారనీ ఇదంతా బ్రహ్మనాయుడు ఆడిస్తున్న నాటకమేగాని నిజానికి యుద్ధం చేసే శక్తి మలిదేవాదులకు లేదని నలగామరాజుకు తెలుసు.
మలిదేవు కార్యంబు మనసుకు గాదు కార్య స్వతంత్రత కలగదాతనికి భండార హైన్యంబు పగయధికంబు ఉన్నవారి వ్యయంబులుడుగకున్నవియు బలముల గూర్చినన్ భక్షణలేదు ఈవిలేకుండిన నెవరు వచ్చెదరు వచ్చిరా వారలు వశ్యులుగారు ఒక నెలమించెనా యోర్వరు బంట్లు దొర బంటుమేరలు తొలగుచు నుండు కార్యముల్ చెడిపోవు కలిమిలేకున్న ప్రతిమల నాడగా బట్టినయట్లు నాటకంబిటువలె నాయుడు చేసె
ఈ వివరాలన్నీ నాగమ నియమించిన వేగులవారివల్ల నలగామునికి ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. నలగాముడు అందరు అనుకొన్నట్లు నాగమ చేతిలో కీలుబొమ్మ కాదు. భుజశక్తి, బుద్ధిబలం ఉండి ప్రజాక్షేమం కోరిన రాజు. రాజులందరు ఐకమత్యంతో పాలనచేస్తే ప్రజలకు క్షేమమని గుర్తించినవాడు.
కారెంపూడి కదనరంగంలో సైన్యాలు మోహరించి బ్రహ్మన రాయబారానికి భట్టును పంపాడు. నరసింగుని తమకు అప్పగించి రాజ్యభాగం మలిదేవునికి ఇవ్వమని చెప్పిన సందేశానికి నలగామునికి ఆగ్రహం వచ్చింది. తమ్ముని ఇవ్వను గానీ రాజ్యభాగం ఇస్తాను ఏలుకొమ్మని చెప్పిన నలగామునికి రాజ్యభాగం ఇవ్వడం పౌరుషం కాదని, యుద్ధమే తగిన పని అనీ, ఇద్దరు రాజులుంటే పాలన కష్టమని నాగమ పలికింది.
సిరిపొత్తు చేయుట చెల్లురాజులకు ఆజ్ఞ పొత్తిచ్చుట అది నీతికాదు
అని రాజనీతి తెలియజెప్పిన రాజనీతిజ్ఞురాలు నాయకురాలు నాగమ.
నలగామరాజు యుద్ధానికై సైన్యాన్ని సమీకరించమని నాగమను ఆదేశించాడు. ఆమె నలగామ రాజుతో అప్పనం కట్టే మన్నెవీరులకు, మండలాధిపతులకు, స్నేహితులకు సహాయం కోరుతూ లేఖలు వ్రాయమన్నది. అందరూ ఐకమత్యంతో పోరి బ్రహ్మనాయుని ఓడిస్తే కప్పాలు కట్టనక్కరలేదని భావించిన రాజులందరూ నలగాముని పక్షాన పోరుకు తరలిరాగా నాగమ్మ స్వయంగా అశ్వాన్నధిరోహించి వచ్చి వారికి విడిది వసతులు చేయించింది. అందరికీ తగిన స్థలాలనేర్పాటు చేసింది. నలగాముడు యుద్ధవ్యూహానికై సైనిక బలాలను సమీకరించి ఆ సందర్భంలో చేసిన సభలో రాజు వెనుకనే ఉండి సైనికులందరికీ ఖడ్గవిద్యలో నేర్పులను తెలిపింది.
బ్రహ్మన యుద్ధం చేయవచ్చినాడన్న వార్త విని నలగామరాజు భయపడగా నాయకురాలు నాగమ్మ అతనికి ధైర్యం చెప్పింది. బ్రహ్మనను మండాదికి తిరిగి వెళ్ళకుండా చేస్తానని అప్పటికప్పుడు అశ్వికులను గజబలాలను సిద్ధపరచింది. వసిగొయ్య వడిసెలు, వాలుడొంకెనలు, గసికెలు, దూలాలు, గాలిదుందుభులు కోటకు చేర్పించింది. కాచిన కలయంపి కాగుల నిండా నింపి శత్రువులపై కుమ్మరించడానికి సిద్ధపరచింది. దండెత్త వచ్చినవాడు బ్రహ్మన ఒక్కడే అయినా చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే నీతిని ఉపయోగించి యుద్ధపు ఏర్పాట్లు భారీయెత్తున చేయించింది. బ్రహ్మనాయుడు వీరవిహారం చేస్తూ ఉండగా కోటపైనున్న కోలలవారిని ఉత్సాహపరిచి బ్రహ్మనపైకి ఉసిగొలిపింది. బ్రహ్మన వీరావేశానికి తట్టుకోలేకపోయిన నలగామరాజు నాయకురాలితో తనను బ్రహ్మన చంపకమానడని అనగా నాగమ్మ తానుండగా భయపడవద్దని అతనికి ధైర్యం చెప్పి ఉపాయమాలోచించి విప్రులను రప్పించి బ్రహ్మన వద్దకు పంపింది. నలగాముని, నరసింగుని భార్యాపుత్రులు వచ్చి అర్థించినా, గంగ గుడిలోని గంగాదేవి చెప్పినా వినని బ్రహ్మన విపుల మాటలను మన్నించి నలగాముని క్షమించి రాజ్యమేలుకొమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. శత్రువు బలాన్నీ బలహీనతలను సరిగా అంచనా వేయడం సమయసందర్భాలను బట్టి సామదాన బేధ దండోపాయాలు ఉపయోగించి రాజును రక్షించడమే మంత్రి కర్తవ్యం. స్వార్థం లేకుండా, స్వామిభక్తి కలిగి తన కర్తవ్యాన్ని పాటించి మంత్రిత్వం నెరపడంలో స్త్రీలు పురుషులకేమాత్రం తీసిపోరని చాటిన వీరనారి బుద్ధిశాలి అయిన నాయకురాలు నాగమ్మ.
మంత్రిగా ఎవరు సమర్థులు?
నాయకురాలు నాగమ్మ – బ్రహ్మనాయుడు – వీరిలో మంత్రిగా ఎవరు సమర్థులు?
బ్రహ్మనాయుడు తన పంతం కోసం కోడిపందెంలో తన ప్రభువైన మలిదేవుని రాజ్యం పోగొట్టి, వారందరిచేత వనవాసం చేయించాడు. కల్యాణాన్నేలే సోమేశ్వరుని కొడుకు కొమ్మరాజు తండ్రి చనిపోగానే బ్రహ్మనను నమ్ముకొని వచ్చాడు. బ్రహ్మన రాయబారం కొమ్మరాజు కొడుకు అలరాజు ద్వారా పంపడం వల్ల అతడు మరణించాడు. యుద్ధంలో కొమ్మరాజు మరణించాడు. మలిదేవుని బంధువులందరూ మరణించారు. చివరకు మలిదేవరాజు కోడిపందానికి వెళ్ళే బ్రహ్మనను వారించక కులపగకు కారణమై తన వారినందరిని పోగొట్టుకున్నానని చింతించాడు.
కల్యాణమేలుచు ఘనుడు మామామ లింగైక్యమందగా లీలతో రాజు మీలోకి వచ్చెను మిగులమెరుగాయె నమ్మి వచ్చినవారి నడుపవలె గాక మహిలోన గూల్చెడి మహిపతుల్ కలరె అని అలరాజు తల్లి చల్లమదేవి బ్రహ్మనను నిలదీసింది. సాటి బందుగులెల్ల సమరంబులోన కడతేరి పోకకు కారణంబెవరు ఆర్వెల్లి నాగమ్మ యానాడు మమ్ము పందెముకు పిలిచిన పంతగించితివి వలదని నాయుని వారించనైతి కోరితెచ్చితి నేను కులవైరమకట పందెమాడుటకతన పగవృద్ధి పొంది కలహమ్ము రేగెను కార్చిచ్చు పగిది
అని మలిదేవుడు పశ్చాత్తాపపడి, తాను నాయుడిని వారించకపోవడం వల్ల కోడిపందెం జరిగి, ఇంతమందికి ప్రాణహాని జరిగిందని, హఠధారణ చేసి ప్రాణాలు వదిలాడు. అతని తమ్ములు కూడా అదే విధంగా మరణించారు. బ్రహ్మన కొడుకు బాలచంద్రుడు కూడా పలనాటి యుద్ధానికీ, అందరి మరణానికి బ్రహ్మనే కారణమని నిందించాడు. నలగాముని తమ్ముడు నరసింగరాజు తలనరికి తెచ్చిన బాలచంద్రుని నిందించిన బ్రహ్మన్నతో
వెడవెడ యేడ్పులు వేగచాలించు కొలువులో మా మామ కొమ్మభూపతికి అలరాజుకై నన్ను అప్పగించితివి ఇదిగాక నీకపట మెన్నెద వినుము పోగొట్టితివి కోడిపోరును భూమి నిను నమ్మి వచ్చిన నీ మరిదినపుడు ప్రాణంబు గొన్నట్టి పాపాత్ముడవు చెలువుచూడగ బంప చెవుల గోపనను చటుల కర్ముడ వగుచు జంపించితీవు ఘనులెంకజోదును కలనికంపించి మందలో చంపితి, మాయమొనర్చి ఇటువంటి నీ చేష్ట లెన్ని వర్ణింతు
అని పలికి అతని వల్లనే అందరూ నాశనమైనారని నిందించాడు.
తన తెలివితేటలతో, రాజనీతితో యుద్ధకళా ప్రావీణ్యంతో తన రాజు నలగామరాజుకు, ప్రజలకు జయము, క్షేమం కలిగే విధంగా చేసిన మంత్రిణి నాయకురాలిని కుతంత్రగా, మాయలాడిలాగా చిత్రించి, తనరాజుకు, తనవారందరికీ, తన పంతం, స్వార్థం కోసం, హాని కలిగించిన బ్రహ్మనను మహావీరుడిగా, మహాత్మునిగా కీర్తించడం పలనాటి వీరచరిత్ర కవికి గల పురుష పక్షపాతాన్నీ, స్త్రీలపట్ల నిరసన భావాన్నీ వ్యక్తం చేస్తాయి. కనుకనే నాగమ్మ తరువాత మంత్రి పదవి నిర్వహించిన మహిళలే లేకుండా పోయారు.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఆనందనిలయంలో ఓ ఆదివారం
తస్మాత్!!
సిరివెన్నెల పాట – నా మాట – 7 – మధురమైన స్నేహ భావన
వారెవ్వా!-7
శాంతి కోసం విశ్వ గీతం
సంచిక – పద ప్రతిభ – 22
శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-7
ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-10
కవిత్వం…
మౌన ముని రమణ మహర్షి – పుస్తకావిష్కరణ సభ
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®