గత వారం కళ్యాణదుర్గం చెరువు గూర్చి, తిప్పయ్య అమాయకత్వం గూర్చి తెలుసుకున్నాం కద.
***
ఈ వారం అక్కడ నేను చూసిన కొన్ని సినిమాల గూర్చి, సినిమా థియేటర్స్ గూర్చి, ఇంకా అనేక ఇతర విశేషాలు తెలుసుకుందాం.
తెలుగువారికి గర్వకారణం అయిన ‘మాయాబజార్’ చిత్రాన్ని నేను కళ్యాణదుర్గంలో చూశాను.
నాకు గుర్తున్నంతవరకు ఆ ఊళ్ళో రెండు మంచి థియేటర్లు, ఒక సినిమా టెంట్ (టూరింగ్ టాకీస్) ఉండేవి. నేను చూసిన మొదటి-చివరి సినిమా టెంట్ అదే. కాకపోతే అందులో నేను ఏవీ సినిమాలు చూడలేదు.
ఆ ఊరి నడిబొడ్డులో లాండ్మార్క్ అనదగ్గ మూడు రోడ్ల కూడలి నుంచి అనంతపురం వెళ్ళేదారిలో ఓ పెట్రోల్ బంకు ఉండేది. ఆ పెట్రోల్ బంక్ బయట ‘గాలి ఉచితం’ అని పెద్ద బోర్డ్ ఉండేది. నాకు చిన్నతనంలో అర్థం అయ్యేది కాదు. మనం పీల్చుకుంటున్న గాలి ఉచితమే కద, ఈ బోర్డ్‌లో ప్రత్యేకంగా ఎందుకబ్బా ఇలా వ్రాశారు అని అనుకునేవాడిని.
ఆ పెట్రోల్ బంక్ పక్కగా వెళ్ళి కాస్త దూరం నడిచి వెళితే మనకు ఓ సినిమా థియేటర్ వస్తుంది. దీని పేరు గుర్తు లేదు నాకు.
రాయదుర్గం రోడ్డులో శుక్రవారం సంత వచ్చే ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం పక్కగా వెళితే కాస్త దూరంగా ఊరి బయట ఒక సినిమా థియేటర్ ఉండేది.
సంతకి దగ్గరగా, రాయదుర్గం రోడ్డులో ఉండే సినిమా థియేటర్‌కి కాస్త క్రేజ్ ఎక్కువ ఉండేది ప్రజలలో. బహుశా ఆ రెండింటిలో అది కొత్తది అనుకుంటా. ఇందులో హిందీ సినిమాలు కూడా వచ్చేవి. హిందీ సినిమాలు ఆడించే యోగ్యత ఉందంటే చాలా ‘క్లాస్’ థియేటర్ కింద లెక్క ఆ రోజుల్లో.
ఏదైనా తెలుగు సినిమాకెళ్ళినప్పుడు ఇంటర్వెల్ తర్వాత వచ్చే హిందీ సినిమా ట్రైలర్స్ చూసి ‘అబ్బ హిందీ సినిమాలు ఎంత భారీగా ఉంటాయి’ అని అనుకునేవారం.
మా సుభద్ర అక్కయ్య ఆ హిందీ సినిమాలలోని డైలాగులని భలే ఇమిటేట్ చేసేది. ఇమిటేషన్ అంటే మరీ పెద్దగా ఏమీ కాదు, అప్పటికి ఆమె ఏడో తరగతి చదువుతుండేది. తనకు కూడా అప్పటికి హిందీ భాషా జ్ఞానం ఎక్కువేమి ఉండేది కాదు, అందువల్ల, ఆ హిందీ సినిమా ట్రైలర్స్‌లో చూపినట్టు, ధర్మేంద్ర లాగా (అప్పటికి అమితాబ్ పెద్ద హీరో కాదు) భావరహితంగా మొహం పెట్టి, ఒకలాంటి గొంతుకతో వచ్చీరాని ఒక పెద్ద డైలాగ్ చెప్పి, మనం ఊహించని విధంగా ‘డిష్యూం….డిష్యూం’ అని మనం తప్పుకునేలోగా ఓ రెండు పిడిగుద్దులు మన మొహం మీద గుద్దేది (నొప్పి కాకుండానే లెండి).
70’ల నాటి హిందీ సినిమాలలో అది ఒక రెగ్యులర్ ఫీచర్‌గా ఉండేది అని ఆ తర్వాత నేను కూడా గమనించి తెలుసుకున్నాను. అప్పట్లో ధర్మేంద్ర స్టార్ హీరో. అతను నెమ్మదిగా ఒక్కొక్క పదాన్ని ఒత్తి పలుకుతూ కాస్త ఊపిరి బలంగా వదులుతూ,
’మే తేరే ఖూన్ పీలూంగా’ అనో
’మే ఖసమ్ ఖాకే, ఆజ్ ఏ ఏలాన్ కర్ రహాహూ, మీ తుఝే జిందా జలా దూంగా’ తరహా డైలాగులు కొన్ని నిమిషాల పాటు చెప్పి విలన్ మొహం మీద పిడిగుద్దులు గుద్దేవాడు.
నాకర్థం కాని విషయం ఏమిటంటే ఆ గుండు గాడు (విలన్ విధిగా గుండువాడు ఉండేవాడు) అతను చెప్పే డైలాగులన్నీ ఓపికగా విని, తప్పుకునే ప్రయత్నం కూడా ఏమీ చేయకుండా బుద్ధిగా తన్నులు తినేవాడు.
ఆ సమయంలో విధిగా ధర్మేంద్ర మొహం చెమటతో నిండి ఉండాలి, ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని ఉండాలి, వీలయితే చొక్కా అక్కడక్కడా చినిగి ఉండాలి, ఇవన్నీ అటుంచితే, ధర్మేంద్ర మొహంలో ఎటువంటి భావాలూ పలకకూడదన్నమాట.
ఏతావాతా నేను చెప్పొచ్చేదిమిటంటే ఆ రోజుల్లో హిందీ సినిమాలు చూడటం ఒక స్టేటస్ సింబల్‌గా చలామణిలో ఉండేది.
ఆ రోజుల్లో నేను చూసిన సినిమాలలో నాకు బాగా గుర్తుండిపోయిన కొన్ని సినిమాలు.
- మాయా బజార్
- అందాలరాముడు (నాగేశ్వరరావు)
- నోము (రామకృష్ణ)
- గూఢచారి (కృష్ణ)


ఇవికాక ఆ రోజుల్లో ఎక్కడికెళ్ళినా తప్పనిసరిగా ఈ సినిమా పోస్టర్లు కనిపించేవి – ఆయా సినిమాలలోని పాటలు వినిపించేవి. అవి ఏమిటంటే,
మంజుల, శోభన్ బాబు నటించిన ‘మంచి మనుషులు’
కే.విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ‘ఓ సీత కథ’
బాపు దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘సాక్షి’
బాపు దర్శకత్వం వహించిన ‘సంపూర్ణ రామాయణం’
జీకే వెంకటేష్ సంగీతం వహించిన శ్రీదేవి అనే చిత్రంలోని ‘రాశాను ప్రేమలేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో….’ అనే పాట ఎక్కడికెళ్ళినా మారుమ్రోగి పోయేది.
ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘దేవదాసు’ చిత్రం విడుదల అయింది. కానీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్, మరొక సీనియర్ నటుడు పన్నిన తంత్రాల వల్ల అది అట్టర్ ఫ్లాప్ అయింది అని అందరూ అనుకునేవారు.
చెప్పాను కద, అప్పటికే అల్లూరి సీతారామరాజు సినిమా చూసి, సూపర్ స్టార్ కృష్ణగారికి వీరాభిమానిగా మారిపోయాను అని, ఈ దేవదాసు సినిమా ఇలా కుట్ర వల్ల ఫ్లాప్ అయింది అని తెలిసి అతని మీద జాలితోకూడిన, ప్రేమతోకూడిన, అభిమానం-ఇష్టం పెరిగిపోయాయి.
అల్లూరి సీతారామరాజు సినిమా తీసి అప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఒక హీరోతోనూ, ఈ దేవదాసు చిత్రం తీసి మరో అగ్రహీరోతోనూ వైరం కొని తెచ్చుకున్నాడని అందరూ తెగ జాలిచూపేవారు కృష్ణగారి పట్ల.
అయినా అతను వెనుకాడకుండా ముందుకు వెళ్తున్నాడని తెగ పొగిడేవారు. అతన్ని నిజమైన సాహసి అని చెప్పుకునేవారు.




ఏవీఎం వారి ‘నోము’ సినిమాలో పాము చేసే విన్యాసాలు చూసి అవాక్కయ్యాను ఆ రోజుల్లో. ఆ సినిమాలో చంద్రకళ చక్కటి ఇల్లాలు, ఆమె భర్త రామకృష్ణ నాస్తికుడు. ఆమె భక్తి కారణంగా ఒక పాము ఆమె భర్తని క్షమించేస్తూ ఉంటుంది. చివరికి కథ సుఖాంతం అవుతుంది.
***
అదే విధంగా కేవలం వాల్ పోస్టర్స్ చూసి సినీనటి మంజుల గారికి వీర ఆరాధకుడిగా మారిపోయాను ఆ చిన్న వయసులోనే. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా మంజుల ‘మంచి మనుషులు’ చిత్రం పోస్టర్స్‌పై కనిపించేవారు. ఏమీ తెలియని ఏడేండ్ల వయసులోనే తెగ సంచలనానికి గురి అయ్యేవాడిని మంజులని చూసి.




రాంగోపాల్ వర్మ తన గూర్చి చెప్పుకుంటూ, తాను శ్రీదేవికి వీరాభిమానిని అని చెప్పుకోవడంలోని ఫీల్‌ని అర్థం చేసుకోగలుగుతున్నాను. సినిమా పోస్టర్స్ అంత ప్రభావాన్ని చూపుతాయి మనుషుల మెదళ్ళ మీద అని చెప్పగలను.
మా అప్ప మమ్మల్ని సినిమాలకు తీసుకెళ్ళటానికి ఎక్కువ ఇష్టం చూపేవారు కాదు.
తహసిల్దార్ అంటే ఆ తాలూకాకి సంబంధించి రెవిన్యూ డిపార్ట్మెంట్లో అతి పెద్ద అధికారి. ఆ కారణంగా ఎక్కడికెళ్ళినా ఒక ప్రత్యేక గౌరవం లభించేది ఆ ఊర్లో మా కుటుంబానికి. మనపాటికి మనం సినిమాకి వెళదామన్నా, అక్కడి సినిమా థియేటర్ యాజమాన్యం మనకి ప్రత్యేక గౌరవమర్యాదలు అందజేసేవారు. బాల్కనీలో ఒక వరుస మొత్తం మనకు కేటాయించడం, థియేటర్‌కి చెందిన ఒక నౌకర్ని సదా మన సేవకై అక్కడే దగ్గరగా నిలబెట్టి ఉంచటం, ఇంటర్వెల్లో కూల్ డ్రింకులు లేదా కాఫీ లాంటివి సరఫరా చేయటం తదితర మర్యాదలు చేసేవారు. టిక్కెట్ కొంటామన్నా ‘అయ్యో సార్ ఏమంటున్నారు?’ అంటూ హాహాకారాలు చేసేవారు.
మా అప్ప చాలా ముక్కు సూటి మనిషి. సహజంగా మృదుస్వభావి. ఆయన ఈ గౌరవ మర్యాదలకి పొంగి పోయి దర్పం చూపేవారు కాదు. మీదు మిక్కిలి తెగ మొహమాటపడిపోయి, ‘నాకు ఇలా మీరు ప్రత్యేక మర్యాదలు చేయకండి, ఇలాగయితే నేనసలు సినిమాలకే రాను’ అని చెప్పేవారు.
ఆయన ప్రిన్సిపిల్స్ ఆయనవే. సినిమా థియేటర్ యాజమాన్యాల మర్యాదల దారి వాటిదే, అన్నట్టుండేది. ఈ కారణంగా అయన మమ్మల్ని సినిమాలకి తక్కువగా తీస్కువెళ్ళేవారు.
కానీ ఆ రోజుల్లో సినిమాలు మాత్రమే ఏకైక వినోద సాధనం.
అందాల రాముడు, నోము, మాయాబజార్ తదితర చిత్రాలు ఆ రోజుల్లో చూసినవే.
(ఇంకా ఉంది)

డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ దేశం గర్వించదగ్గ సాఫ్ట్ స్కిల్స్ శిక్షణా నిపుణుడు. వీరు రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్ అధినేత. వివేకానంద్ గారు రూపుదిద్దిన ‘పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ’ అనే మోడ్యూల్ అత్యంత ప్రజాదరణ పొందింది. చాలా పై స్థాయిల్లో ఉన్న అనేకమంది ప్రముఖులు, సెలెబ్రిటీలు వీరి పేపర్ లెస్ ఫ్లూయెన్సీ కోర్స్ ద్వారా విజయ శిఖరాలకి చేరుకున్నారు. ఇప్పటిదాకా యాభై వేలమందిపైగా ప్రొఫెషనల్స్ మరియు సెలెబ్రిటీలు ఈ శిక్షణా తీసుకుని ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ’ని అమలు చేయబోయే ముందు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకి వీరిని ప్రత్యేకంగా అహ్వానించి వీరి సలహాలు సూచనలు స్వీకరించటం జరిగింది.
డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. పేపర్ లెస్ ఫ్లూయెసీ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలెప్మెంట్, ఇంటర్యూ స్కిల్స్, హెచ్చార్డీ స్కిల్స్ తదితర అనేక శిక్షణా తరగతులు వీరు నిర్వహిస్తూ ఉంటారు. వీరి బోధనలు విని మంత్రముగ్ధులు అవని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. తన శిక్షణా కార్యక్రమంలో ‘న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్’ మరియు ‘పవర్ ఆఫ్ సబ్కాన్షస్ మైండ్’ అనే ప్రభావవంతమైన సూత్రాలతో వీరు తమ బోధనని రక్తి కట్టిస్తారు.
టీనేజీ పిల్లలకి ‘గోల్ సెట్టింగ్’ అనే ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టి వీరు అనేక మంది పిల్లలని విజయపథంలో నడిపిస్తున్నారు.
వీరి కార్యక్రమాలని యూట్యూబ్‌లో చూడవచ్చు. వీరు స్వతహాగా రచయిత. సినీ విశ్లేషకులు కూడా. వీరు వ్రాసిన ఇంగ్లీష్ పుస్తకం ‘సాఫ్ట్ స్కిల్స్ టు ఏస్ ఇంటర్వ్యూస్’ అమెజాన్‌లో లభ్యం అవుతుంది.
ప్రతి శనివారం సాయంత్రం జూమ్ ప్లాట్‌ఫాం ద్వారా వీరు లైవ్‌లో పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ గూర్చి ఉచిత అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తారు.
7 Comments
Darbha Venkateswaraprasad
చాలా చక్కగా రాసారు. వీటిలో చాలా మధురమైన అనుభవాలు నాకు కూడా ఉన్నాయి. మీరు వివరించిన కాలంలో సినిమాల గురించి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నా పీసీలో తెలుగు ఫాంట్ లేదు. నేను ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదం కోసం ఇంటర్నెట్‌ని ఉపయోగించాను
Dr.. Vivekanand Rayapeddi
హృదయ పూర్వక ధన్యవాదములు. చదువుతూనే ఉండండి
కోడీహళ్లి మురళీమోహన్
ఆ థియేటర్ల పేర్లు 1 వెంకటమ్మ 2వెంకటేశ్వర టెంటు పేరు నూర్ ముబారక్
Vivekanand
Wow
థాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్
Dr. Uma Sharma
ఇప్పుడే చదివాను.. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా రాశారు. గాలి ఉచితంగా ఇవ్వబడును అన్న వాక్యం ఏడు సంవత్సరాల అబ్బాయి ఎలా అర్థం చేసుకోవచ్చు అన్నది నవ్వు తెప్పించింది.. సినిమాల గురించి, మామయ్య గారి ఆలోచనల గురించి బాగా చెప్పారు . సుభద్ర వదిన హిందీ సినిమా నటుల అనుకరణ నవ్వు తెప్పించింది… మొత్తం మీద సూపర్ గా రాశారు…

Vivekanand Rayapeddi
Thank you very much
Ravi
Very impressive style of writing. Lot to learn for any upcoming writer