Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కావ్య పరిమళం-18

సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.

కృష్ణరాయల ఆముక్తమాల్యద

రాయల సాహిత్యపోషణ:

విజయనగర సామ్రాజ్యాధిపతియైన శ్రీకృష్ణదేవరాయలు 1530-42 మధ్య కాలాన పరిపాలన సాగించాడు. తన ఆస్థానంలో భువనవిజయంలో అష్టదిగ్గజ కవులను పోషించాడు. స్వయంగా తాను ఆముక్తమాల్యద కావ్యాన్ని రచించాడు. పెద్దన, తిమ్మనాది కవులాయన ఆస్థానకవులై ఆయన కంకితంగా మనుచరిత్ర, పారిజాతాపరహణాది కావ్యాలు రచించారు. రాయలు ఒక రాత్రి  కృష్ణా మండంలోని శ్రీకాకుళాంధ్ర దేవుని దర్శించి నిద్ర చేశాడు. ఆంధ్ర విష్ణువు ఆయనకు కలలో కన్పించి –

“తెలుగదేలయన్న దేశంబు తెలుగు యేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎఱుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స”

అని పలికి “నీవు వ్రాయబోయే కావ్యాన్ని నీకిష్టమైన వేలుపైన తిరుమల వేంకటేశ్వరుని కంకితమిమ్మని ఆదేశించాడు.

రాయలు మదాలస చరిత్ర, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి – అనే గ్రంథాలు కూడా వ్రాసినట్లు వినికిడి. ముక్కు తిమ్మన రాయలను ‘కవితా ప్రావీణ్యఫణీశ!’ అని సంబోధించాడు.

ఆముక్తమాల్యద రచనా కాలం:

ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ఆముక్తమాల్యద రచనా కాలాన్ని ఈ విధంగా నిర్ధారించారు:

“రాయల సాహిత్యకీర్తికి ధ్వజప్రాయమైన ఈ కావ్యరచనా సంకల్పము పూర్వదిగ్విజయ యాత్ర నొనరించి శ్రీకాకుళాంధ్ర విష్ణువును సందర్శించునప్పుడైనా, రచన పూర్తి కావడం రాయచూరు ముట్టడి అనంతరం జరిగెను. అనగా 1520-22 ప్రాంతము. రాయచూరు ముట్టడించి ఎదిల్ షాను జయించి నిశ్శాత్రవ మొనర్చిన పిదప ఈ రచన.” (ఆంధ్ర సాహిత్య చరిత్ర, పుట 392).

ఈ కావ్యానికి విష్ణుచిత్తీయం అని మరో పేరు వుంది. పూర్వ భాగంలో విష్ణుచిత్తుడి కథ వుండటం వల్ల ఆ పేరు సార్థకం. విష్ణుచిత్తుడు పన్నిద్దరాళ్వారులలో ఒకరు. ఉత్తర భాగంలో గోదాదేవి చరిత్ర వుంది. ఆమె కూడా పన్నిద్దరాళ్వారులలో ఒకరు. ఆమెకు ‘చూడికొత్త నాంచార్’ అనీ, ‘ఆండాళ్’ అని కూడా పేర్లు.

వివిధ రూపాలలో విష్ణుభక్తి:

ఈ కావ్యంలో రాయలు ఐదు రకాలైన భక్తి భేదాలను కథల రూపంలో వర్ణించడం విశేషం. (1). యమునాచార్యుడు: వేదవేదాంగాలు జీర్ణం చేసుకున్న విష్ణుభక్తుడు (2). విష్ణుచిత్తుడు: అమాయకపు భక్తుడు. ఆయన మనసు విష్ణు కైంకర్యం పరమావధిగా భావించింది. ఆయన ప్రపన్నుడు (3). గోదాదేవి: శృంగార రూపంలో ప్రపన్నత వ్యక్తం చేసింది. (4). మాలదాసరి: జ్ఞాని కాడు. కులరీత్యా కైంకర్యానికి అవకాశం లేదు. గాన కైంకర్యం చేశాడు. (5). ఖాండిక్య కేశిధ్వజులు: విష్ణుభక్తి పూర్వక యోగాభ్యాసపూర్ణులు.

గోదాదేవి తన పాశురాల ద్వారా తానొక్కతే తరించింది. మాలదాసరి తనతో బాటు బ్రహ్మరాక్షసుని కూడా తరింపజేశాడు. గోదాదేవి శృంగారం లౌకికం కాదు. ఆధ్యాత్మికం. ఇరువురు వ్యక్తుల మానసిక సంయోగం. భక్తిరసంగా పరిణమించిన శృంగారం. రంగనాథునికి ఆత్మార్పణ చేసికొన్న ధన్యురాలు. రాయలకు గోదాదేవి కున్న మధురభక్తి, యమునాచార్యుల కున్న ఉపననిషత్ జ్ఞానం, పాతంజలాది యోగశాస్త్రజ్ఞానమూ అభ్యాసవశంగా లభించాయి. అందుకే ఆయన తిక్కన వలె వాస్తవిక చిత్రణలో సిద్ధహస్తుడనిపించుకున్నాడు. వర్ణనా కుతూహలంలో నన్నెచోడుని సరిజోడు. అందుకే మూడు ఋతువులను వంద పద్యాలలో సుదీర్ఘంగా వర్ణించాడు. లోక ప్రవృత్తిని విశదం చేయడం రాయల ప్రజ్ఞ. సంపన్నుల, నిరుపేదల, రాజుల, మంత్రుల, ఆలయాల, అర్చకుల జీవన రహస్యాలను కావ్యంలో ప్రతిబింబింపజేశాడు. ‘రాయలనాటి రసికత’ అనే వ్యాసంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ఆనాటి ఆచార వ్యవహారాలను విపులీకరించారు. ప్రకృతి పరిశీలనలో రాయలు అందె వేసిన చేయి. ప్రజలతో మమేకమైన చక్రవర్తి ఆయన.

ప్రబంధ యుగం:

రాయలనాటి యుగం (1500-1600) తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగంగా చెబుతారు. మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపహరణం, కళాపూర్ణోదయం, పాండురంగమహత్యం, కాళహస్తి మహత్యం, ఆముక్తమాల్యద, యయాతిచరిత్ర వంటి కావ్యప్రబంధాలు వెలశాయి. ప్రబంధకవులకు లౌకిక దృష్టి అధికం. పురాణకవుల వలె ధర్మ ప్రచారం, నీతిబోధలు వీరికి పట్టవు. శృంగార రసాపేక్ష ఎక్కువ. దానికి ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితులే ప్రధాన కారణం. భక్తి ప్రధాన కావ్యాలలో కూడా శృంగారం జోడించారు.

“భారతంలో  బీజప్రాయంగా, ఎర్రనలో అంకురప్రాయంగా, నాచన సోమనలో మొలకగా చూసిన ప్రబంధలత శ్రీనాథుని చేతిలో చిగిర్చి మారాకు వేసింది” అని ఆచార్య లక్ష్మీకాంతం విశ్లేషించారు.

ప్రబంధానికి ముఖ్య లక్షణం ‘వస్వైక్యత’. అంతే ఇతివృత్తంలో ఏకత్వం. ఆ ఇతివృత్తమ్ ప్రఖ్యాతి చెందినది కావచ్చు లేదా కల్పితమో, మిశ్రమో కావచ్చు. ఏకనాయకాశ్రయమై ప్రబంధ కథ నడుస్తుంది. ఇవి ఆంధ్రీకరణలు కావు.

కథా గమనం:

ఆముక్త – అలంకరించుకొన్న, మాల్య – పూలదండను, ద=ఇచ్చునది అని ఆముక్తమాల్యద పదాని కర్థం. ఇందులో కథానాయిక గోదాదేవి. ఆమెయే ఆండాళ్ (లక్ష్మీదేవి). ఆమె మహాభక్తురాలే గాదు, పాశురాల కవయిత్రి. ద్రావిడ దేశంలో శ్రీవిలుపుత్తూరు అనే గ్రామం వుంది. ఆ వూరిలో అందరూ వైష్ణవులు, భాగవతులు. అక్కడ విష్ణుచిత్తుడనే పరమ భక్తుడున్నాడు. ఆయన ఇంట రోజూ అతిథి సంతర్పణలే!

శా:
ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే యాలించినన్ మ్రోయు నెం
తే నాగేంద్రశయానుపుణ్యకథలున్ దివ్యప్రబంధాను సం
ధానధ్వానము ‘నాస్తి శాకబహుతా, నా స్త్యుష్ణతా, నాస్త్యపూ
పో, నాస్త్యోదన సౌష్ఠవంచ, కృపయాభోక్తవ్యమన్’ పల్కులున్”
(ఆముక్త, 1-84)

“అయ్యా! కూరలు ఎక్కువ వడ్డించలేదు. అన్నం వేడిగా వుందో లేదో?, పప్పు వడ్దించారా, అన్నం బాగా వుడికిందా? నాయందు దయతలచి ఆరగించండి!” అనే మాటలు అర్ధరాత్రి కూడా వినిపిస్తాయట!

మధురానగరం పరిపాలిస్తున్న మత్స్యధ్వజుడు తన ఉంపుడుకత్తె వద్దకు దారివెంట నడిచి వెళ్తున్నాడు. ఆ దారిలో ఒక బ్రాహ్మణుడు పురోహితునింట భోం చేసి ఏవో నీతి పద్యాలు చదువుతూ పండుకొని వున్నాడు. “వానాకాలంలో తినడానికి వాన లేని రోజుల్లో సంపాదించుకోవాలి. రాత్రి పూట కోసం పగలు, ముసలితనం కోసం వయసులో ఉన్నప్పుడు కూడబెట్టాలి” అనే శ్లోకం చదివాడు. రాజు మనసు మారిపోయి పరలోక ప్రాప్తికై మోక్షమార్గాన్ని తెలుపమని పండితవాదం ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క దేవుని గొప్పదనం వివరించాడు.

విలుపుత్తూలో వున్న విష్ణుమూర్తి విష్ణుచిత్తుని ప్రేరేపించాడు. మధురానగరానికి వెళ్ళి విష్ణుతత్వమే గొప్పదని వాదించమన్నాడు. ఆ అలౌకికుడు – “స్వామీ! ఏదో ఇల్లు ఊడ్చడం, నీరు తెచ్చి నీకు అభిషేకం చేయించడమో, నీ పల్లకీని మోయడమో సరిగాని, ఈ వాదాలు నేను చేయగలనా?” అని బెదిరిపోయాడు. విష్ణుమూర్తి తన పక్కనే వున్న లక్ష్మీదేవిని చూచి “ఇతనిని గెలిపిస్తాను చూడు” అని పలికాడు. “పిచ్చివాడా! నీ పాండిత్యంతో పనిలేదు. సభలో గెలిపించే బాధ్యత నాది. పొమ్ము” అని పంఫాడు. రాజసభలో విష్ణుచిత్తుడు భారత యుద్ధంలో అర్జునుడు క్రీడించినట్లు క్రీడించాడు. వేదాల నుండి, ఉపనిషత్తుల నుండి అనేక ఉదాహరణలు చెబుతూ ఖాండిక్య కేశిధ్వజ సంవాదాన్ని కథగా సభలో చెప్పాడు. ఇదొక విచిత్రమైన కథ. ఖాండిక్యుడు, కేశిధ్వజులు అన్నదమ్ములు. మిథిలానగరం వారిది. యుద్ధంలో ఖాండిక్యుడు ఓడిపోయి రాజ్యం వదిలిపెట్టి మోక్షమార్గం వెదుకుతూ తపస్సు చేసుకొంటున్నాడు.

కేశిధ్వజులు యజ్ఞం చేద్దామని తెచ్చిన గోవును ఒక పులి తినివేసింది. దానికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలో తపోధనుడైన ఖాండిక్యుడే చెప్పగలడని పండితులు చెప్పారు. ‘పరిష్కారం చెప్ప’మన్నాడు.  రాజ్యభాగం ఇస్తానంతే వద్దని ఖాండిక్యుడు యోగవిద్యను కేశిధ్వజుడి వద్ద నేర్చుకొన్నాడు. ఈ కథ చెప్పి వాదంలో గెలిచాడు విష్ణుచిత్తుడు. భగవంతుడాతనికి సాక్షాత్కరించాడు.

మరొక భక్తుని కథ యమునాచార్యుని వృత్తాంతంలో వుంది. ఆ కథను స్వామి లక్ష్మీదేవికి చెప్పెను. యమునుడు వేదశాస్త్రాలు చదువుకున్నాడు. పాండ్య రాజ్యకాలమది. రాజు శైశవ మత ప్రోత్సాహకుడు. రాణి రహస్యంగా వైష్ణవులను ఆదరించేది. యమునాచార్యు డొకనాడు రాణి వద్దకు వెళ్ళి రాజసభలో వాదం చేసే అవకాశం కలిగించమన్నాడు. రాజు ఆ కుర్రవాడిని పరిహాసం చేస్తూ –

“సంగతి యెమోయి ఇసుమంత ఠింగణావు
తత్వనిర్ణయవాదమ్ము తరమె నీకు
ఓడితేనియు పట్టి ‘మొర్రో’ యనంగ
లింగమును గట్ట కుడుగ మెరింగి నుడువు” అన్నాడు.

యమునాచార్యుడు విష్ణువే దైవమని చెప్పి గెలిచాడు. రాజు తన చెల్లెలినిచ్చి పెళ్ళి చేశాడు.

గోదాదేవి:

విష్ణుచిత్తునకు తులసివనంలో పసిపిల్ల లభించింది. ఆమెయే గోద. ఆమెకు భగవంతునిపై ప్రేమ కలిగెను. భగవంతునికి పూలు సమర్పించేది. ఆలయానికి వెళ్ళి సేవలు చేసేది. రంగనాథునిపై మరులు గొని విరహం అనుభవించింది. విష్ణుచిత్తుడు స్వామికి ఆమె చిక్కిపోతున్న విధానం చెప్పాడు. స్వామి అతనికి మాలదాసరి కథ వివరించాడు. అతడు గానంతో స్వామిని అర్చించేవాడు. ‘నీ కూతురిని శ్రీరంగం తీసుకువెళ్ళ’మని స్వామి హితవు పలికాడు.

శ్రీరంగనాథుడు ఆమెపై ముచ్చటపడి తన అంతఃపురానికి ఆమెను చేర్చాడు. విష్ణుచిత్తుడు ఊరికెళ్ళి దిగులుపడగా, ఆమె ఇంటి వద్దనే కన్పించెను. రంగశాయి బ్రహ్మాదులను పెళ్ళి పెద్దలుగా పంపినాడు. రంగనాథుడే మా ఊరికి వస్తే పిల్లనిచ్చి పెళ్ళి చేస్తానని విష్ణుచిత్తుడు షరతు పెట్టాడు.

స్వామి దేవతలందరితొ విలుపుత్తూరు వెళ్ళాడు.

విష్ణుచిత్తుడు గోదను కన్యాదానం చేశాడు.

స్వామి ఆమె మెడలో మంగళసూత్రం కట్టి, తలంబ్రాలు పోసుకున్నారు. ఆ మరునాడు గోదా సమేతంగా శ్రీరంగానికి చేరుకుని సంసారం చేస్తూ ఆనందించాడు. ఈ కథను రాయలు ఏడాశ్వాసాల ప్రబంధంగా అద్భుతావహంగా తీర్చిదిద్ది తెలుగు సాహిత్యానికి ఆణిముత్యాన్ని అందించాడు.

Exit mobile version