తెలుగులో మొట్టమొదటి ప్రబంధం మనుచరిత్ర. ఆంధ్రకవితాపితామహ బిరుదాంకితుడైన అల్లసాని పెద్దన దాని కృతికర్త. శ్రీకృష్ణదేవరాయల భువనవిజయ సభాభవనంలో అష్టదిగ్గజాలలో ప్రథమపీఠం పెద్దనదే. “అల్లసానికి వారి అల్లిక జిగిబిగి” అని పేరు వచ్చింది. “మనుచరిత్రము చదవనిచో మన భాషలో పండితుడనుటకు వీలు లేదు” అని విశ్వనాథ సత్యనారాయణ కితాబునిచ్చారు. తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర కావ్యం అది.
సంస్కృతంలో వలె తెలుగు భాషలో పంచకావ్యాలుగా ఐదు ప్రసిద్ధికెక్కాయి. అవి – పెద్దన మనుచరిత్ర, రామరాజభూషణుని వసుచరిత్ర, రాయలవారి ఆముక్తమాల్యద, తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహత్యం, ఐదవది శ్రీనాథుని శృంగార నైషధం. రాయల యుగమును సాహిత్యంలో ప్రబంధ యుగంగా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం తదితర సాహిత్యకారులు విశ్లేషించారు.
పెద్దన కాలము క్రీ.శ.1475 – 1540. రాయలు స్వయంగా పెద్దన కాలికి గండపెండేరం తొడిగాడు. పల్లకీని మోశాడు. రాయల తర్వాత కూడా అల్లసాని పెద్దన జీవించాడనటానికి “ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి,కేలూతయొసంగి యెక్కించు కొనియె” అని పెద్దన చెప్పిన సీసపద్యమే సాక్ష్యం. “కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికి యున్నాడ జీవచ్ఛవంబనగుచు” అని పెద్దన బాధపడ్డాడు. రాయల వారు పెద్దనకు కడప జిల్లాలోని కోకటాద్యనేక గ్రామాలు అగ్రహారంగా ఇచ్చాడు. మనుచరిత్ర రచనా కాలం 1519-20 ప్రాంతం.
మనుచరిత్రకు మూలం మారన మార్కండేయ పురాణం. పురాణగాథను ప్రబంధోచితంగా పెద్దన మలచుకొన్నాడు. ఈ గ్రంథానికి పెద్దన పెట్తిన పేరు స్వారోచిష మనుసంభవమ్. లోకంలో మనుచరిత్రగా ప్రసిద్ధం. మానవజాతికి ధర్మశాసనం చేయగల ఒక మహాపురుషుని జననం ఇందులో ప్రధానం. స్వారోచిష మనువు స్వరోచికీ, వనదేవతకు పుట్టాడు. అతని తేజోశక్తికి కారకులు పూర్వతరానికి చెందిన వరూధినీ ప్రవరులు. అపరాగ్నిహోత్రుడు ప్రవరుడు. దివ్యసుందరి వరూధిని. నిజానికి మాయా ప్రవరుడైన గంధర్వు డతని తండ్రి. మానసికంగా వరూధిని భావించినది అరుణాస్పదపుర ప్రవరుని. మనుచరిత్రలో శాంతరసము ప్రధానం. మూలం వికసించని కోరకం. ఈ ప్రబంధం వికసించిన పుష్పం. పెద్దన వర్ణనా చాతుర్యం అమోఘం.
పెద్దన పాత్ర చిత్రీకరణం అద్భుతం. మనుచరిత్ర కథను రెండు భాగాలుగా విభజించవచ్చు. వరూధినీ ప్రవరుల వృత్తాంతం మూడు ఆశ్వాసాలలో ముగుస్తుంది. తర్వాతి మూడు స్వరోచి, మనోరమల కథ, ఆపైన స్వారోచిషుని జననాదికాలు ప్రస్తావించబడ్డాయి. మొదటి రెండు, మూడు ఆశ్వాసాలలో ఉన్న స్వారస్వం తరువాత కనిపించదు. పూర్వభాగంలో ప్రధాన పాత్రలు ప్రవరుడు – వరూధిని. ప్రవరుని రూప రేఖా విలాసాలను పెద్దన అందంగా చిత్రించాడు:
“ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షా పరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా ధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై.” (ప్రథమాశ్వాసము- 51వ పద్యం)
ఇలా వరూధినీ పాత్రను మన కనులకు కట్టేలా వర్ణించాడు పెద్దన. ప్రవరుని చూచిన వరూధిని తీరును ఇలా వర్ణించారు:
“చూచి, ఝళంఝళత్ కటకసూచిత వేగ పదారవిందయై లేచి, కుచంబులున్ తురుము లేనడు మల్లలనాడ నయ్యెడన్ పూచిన యొక్క పోక నునుబోదియజేరి విలోకనప్రభా వీచికలన్ తదీయ పదవీ కలశాంబుధి వెల్లిగొల్పుచున్.” (ద్వితీయాశ్వాసము- 29వ పద్యం)
అరుణాస్పదమనే ఊరు పెద్ద నగరమే. వరుణానది ఒడ్డున ఆ ఊరు వుంది. ఆ ఊరిలో మేడలు ఎత్తయినవి. ఆ ఊర్లో నాలుగు కులాలవారు సఖ్యంగా నివసిస్తున్నారు. అక్కడి వేశ్యలు నాట్యవిద్యలోనూ, వారి వారి విద్యలలోను ఘనులు. “అచట పుట్టిన చిగురు గొమ్మయిన చేవ” అంటాడు పెద్దన. ఆ పట్టణంలో ప్రవరుడనే నైష్ఠికుడున్నాడు. అతడు మిక్కిలి అందగాడు. వేదపాఠాలు చెబుతూ శిష్యులను ఆదరిస్తాడు. చిన్నతనంలోనే పెళ్ళి అయింది. నిద్ర లేవగానే భగవన్నామ స్మరణ. ఆ పైన వరుణానదీ స్నానం. సంధ్యాదులు పూర్తి చేయును. ఊరి జనులందరు అతనిని మెచ్చుకొనేవారు. వారికి బోలెడు మాన్యాలున్నాయి. ఎవరినీ చేయి చాయి ‘దేహి’ అని అడగడు. ఎవరైనా ఇస్తామని వచ్చినా స్వీకరించడు. అతని ఇంట్లో నిత్యం అన్న సంతర్పణ. అర్ధరాత్రి వచ్చినా అతిథులకు తృప్తికరమైన భోజనం లభిస్తుంది. ఆయన భార్య సోమిదమ్మ ఉత్తమురాలు.
“వండనలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి అతిథులేతేర నడికిరేయైన పెట్టు వలయు భోజ్యంబు లింట నవ్వారి గాగ.” (ప్రథమాశ్వాసము- 56)
ఎవరైనా తీర్థయాత్రలు చేసి వచ్చారని తెలిస్తే, ప్రవరుడు వారికి ఎదురుగా వెళ్ళి సాదర స్వాగతం పలికి, ఆతిథ్యమిచ్చి, ఇష్ట మృష్టాన్నాదులతో సంతృప్తిపరిచేవాడు.
ఆతడు అలా వచ్చిన వారి నుండి తీర్థయాత్రల విశేషాలు వివరంగా అడిగి తెలుసుకునేవాడు. ‘నేను వెళ్ళలేకపోతున్నాన’ని నిట్టూర్పులు పుచ్చేవాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఒకానొక రోజు ఒక సిద్ధుడు ఆ ఊరు వచ్చి ప్రవరుని కెదురుపడ్డాడు. అతనిని సాదరంగా ఆహ్వానించి ఇంటికి తెచ్చి అతిథి సపర్యలు చేశాడు.
కథకు మలుపు ఇక్కడే వుంది. చిన్న వయసులోనే అన్ని క్షేత్రాలు ఎలా సందర్శించారని సిద్ధుని ప్రవరుడు ప్రశ్నిస్తాడు. అలా అడిగేటప్పుడు వచ్చిన కొద్దిపాటి నవ్వును ప్రవరుడు ఆపుకొన్నాడు. ‘ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండయుగళుడ’య్యాడు. నేనూ వెళ్ళి చూచి రావాలనే కోరికను వెలుబుచ్చగా ప్రవరుని కాలికి పాదలేపం పూసి వెళ్ళాడు సిద్ధాడు. ఆ పసరు పనిచేస్తుందో, లేదో పరీక్షించాలని ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళాడు.
హిమాలయ సౌందర్యానికి పరవశుడయ్యాడు. కాలికి పూసిన పసరు కరిగిపోయింది. ఇల్లు చేరే ఉపాయం కోసం తహతహలాడాడు. దగ్గరలో ఒక కోన కన్పించింది. అక్కడ మణిమయభవనంలో అప్సరకాంత వరూధిని వుంది. ఆమె వీణ వాయిస్తోంది. ప్రవరుని సౌందర్యం చూచి మోహపరవశురాలైంది.
“ఎక్కడివాడొ! యక్షతన యేందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువజాలెడువాడు మహీసురాన్వయం బెక్కడ ఈ తనూవిభవమెక్కడ యేలనిబంటుగా మరున్ డక్కకొనంగరాదె అకటా నను వీడు పరిగ్రహించినన్.” (ద్వితీయాశ్వాసము- 35)
వరూధినీ ప్రవరుల మధ్య సంభాషణ రసవత్తరం. ‘పరాశరుడు, విశ్వామిత్రుడు, మాందకర్ణి, ఇంద్రుడు – చేసినది తప్పుగా భావించలేదు గదా! ముని ముచ్చులెళ్ళ తామరసనేత్రల ఇండ్లలో బందీలు కారే!’ అని ఎకసెక్కములాడింది. ప్రవరుడు ఆమెను తిరస్కరించి – అగ్నిదేవుని ప్రార్థించి ఇంటికి చేరాడు. ఇదీ ద్వితీయాశ్వాసం వరకు నడిచిన కథ.
వరూధిని విరహాన్ని అనుభవిస్తోంది. మాయాప్రవరుడు వచ్చి వరూధిని మాయ మాటలతో లోగొన్నాడు. లతాగృహాంతరంలో సమాగమం చేశాడు. వరూధినికి గర్భదేహృద లక్షణాలు కన్పించాయి. గంధర్వుడు కల్లబొల్లి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. వరూధిని ప్రవరుడే తిరిగి వచ్చాడని నమ్మింది.
వరూధిని పుత్రవతి అయినది. కుమారుడు స్వరోచి మౌనుల వద్ద పెరిగాడు. అతడు ఆటవికులకు రాజయ్యాడు. వేటకు వెళ్ళిన స్వరోచికి బాధలలో వున్న మనోరమ తటస్థపడింది. ఆమె శాపగ్రస్త. స్వరోచికి ఆమె ‘అస్త్రహృదయ విద్య’ నందించింది. ఎదురు పడిన రాక్షసునితో స్వరోచి తీవ్రంగా యుద్ధం చేశాడు. పావకాస్త్రం ప్రయోగించగానే రాక్షసుడు గంధర్వుడయ్యాడు. అతడే ఇందీవరాక్షుడు. శాపవశాన రాక్షసుడయ్యాడు. అతడు తన వద్ద తెలిసిన ఆయుర్వేద విద్యను స్వరోచి కిచ్చి తన కుమార్తె మనోరమనిచ్చి వివాహం దేవతల సమక్షంలో ఘనంగా జరిపాడు.
మనోరమ స్నేహితురాండ్రైన విభావసీ, కళావతుల దీర్ఘవ్యాధిని స్వరోచి నివారించాడు. విభావసీ కళావతులకు వివాహం జరిగింది. స్వరోచి యొక్క భోగలాలసతను చూచి చక్రవాక పక్షి విమర్శించింది. స్వరోచి సిగ్గుపడి, వైరాగ్య భావం పెంచుకొన్నాడు. దేవతలు పంపగా వనదేవత వచ్చి స్వరోచితో క్రీడించింది. వారికి స్వారోచిషుడు జన్మించాడు. అతడు తపస్సు చేసి శ్రీమహా విష్ణువును సాక్షాత్కరింపజేసుకున్నాడు. భగవంతుడు స్వారోచిషుని మనువుగా నియమించాడు. ఇదీ కథ.
పెద్దన కవితలో ఆలంకారిక రామణీయత మెండు. పాత్రలకు, సన్నివేశాలకు, రసానికీ సరిపడేలా అలంకారాలను ప్రయోగించాడు. “అంకము జేరి శైల తనయస్తన దుగ్ధము లానువేళ” అనే వినాయక స్థుతిలోనే కథా సూచన చేశాడు.
పెద్దన కవిత్వంలో సామెతలు, ఆర్యోక్తులు, నానుడులు సందర్భోచితంగా కన్పిస్తాయి. పాత్రలకు వాటివల్ల పరిపుష్టి కలుగుతుంది. సంభాషణల్లో నాటకీయత ప్రతిఫలిస్తుంది. ధారాశుద్ధి ప్రధానంగా పద్యాల పోకడ ఏర్పడుతుంది.
“ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భుసురేంద్ర!” అని వరూధిని ఎకసెక్కములాడి వలపు లొలికిస్తుంది. “వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె ఏరికిన్” వంటి సుధమయోక్తులు ప్రబంధ పరిమళాలను వెదజల్లాయి.
పెద్దన చెప్పిన ‘పూతమెరుంగులు’, ‘సీసమాలిక’,’నిరుపహతి స్థలంబు’, ‘రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పులరవిడెము’ వంటి పద్యాలు తెలుగు సారస్వత ప్రియుల నాలుకలపై ఎల్లప్పుడూ నర్తిస్తునే వుంటాయి.
తొలుత లెక్చరర్గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™