[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘ఖగ విన్యాసం!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


అంతెరుగని విశాలాకాశంలో
ఏ సుదూర తీరం నుంచో ఈ పయనం
ఏ ప్రశాంత తీర్థానికో ఈ విహాయస యానం
స్నేహితులో, బందుగులో, కాక సైనికులో
ఎంతటి క్రమశిక్షణలో, ఏమి నైపుణులో
ఎంతటి ఏకాగ్రతా సంలీన సంచాలనలో
పెళ్ళికి తరలి వెళ్ళే ప్రృథు సంరంభాలో
విందు నుంచి ఇలు మరలుతున్న తొందరలో!
***
ఒకచోట తరలే కారుమబ్బులకు పోటీయై
ఒకచోట సనసన్నల జలతారు వలయై
ఒకసారి రెండు కోణాల రమణీయమై
ఒకతూరి రయ్యన దూసుకొచ్చే అమ్ము మొనయై
ఒకసారి విడిపోయిన విరి సరమై
ఇంకొంత దవ్వు సరళరేఖా సుందరమై
ఎవరూ కట్టని ఎగిరే మాలయై
ఆధారం లేకనే నిల్పిన మంగళ దామమై!
***
ఏ పంట పొలాల పడిన పైడి రుచులకో
ఏ తోట జామల మరువలేని ఆమెతలకో
ఏ జలపుష్ప భర రమ్య సరిత్తీరాలకో
ఏ దేవుని ఆలయ గోపుర దర్శనానందాలో
ఏ ఆంతర దిక్సూచియంత్ర నిక్షిప్తాలో
ఏ నిగూఢ విద్యల దిశాగ్రాహ్య కౌశలాలో
ఏ పలుకు పలుకని ఖేచర వైదుష్యాలో
ఇవేమి పక్షిగణ శేముషీ వైచిత్రులో!
**
వింతల పాలపుంతల గగనాస్తరణంలో
సుపర్వ శోభిత సజీవాలంకరణలై
పునః పునః వీక్షణాకర్షక విహగమాలికలై
ఖగ విన్యాస స్వేచ్ఛా విహార విలాసములై
దిగంతయాన సహజ విమానములై
ఈ పత్రరథాలు, చక్ర రహిత స్యందనాలై
పుడమి జనులకు ఐకమత్యపు పాఠాలై
కలిసి ఉంటే కలదు సుఖమనే మౌన వ్యాఖ్యలై!