[మాయా ఏంజిలో రచించిన ‘just for a time’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. ఒకప్పటి ప్రేమికురాలితో ప్రేమికుడు చెబుతున్న మాటలు. బహుశా ‘మాయా’కి తన ప్రేమికుడు చెప్పిన మాటలే ఈ కవితగా రూపుదిద్దుకొని ఉండవచ్చు.]


~
అమాయకత్వపు చిరునవ్వుతో
అలా నువ్వు నడిచి వెళ్ళేదానివి
నీతో సంభాషణ. నిన్ను వినడం
నీదైన శైలి నీ నడత
నన్ను కొంతకాలం మురిపించాయి
నువ్వు నా పురా ప్రేమికవు
వసంతరుతువులోని
ప్రతి ఉదయం లాగా నువ్వో నవ్యతవు
నువ్వప్పుడు నా సర్వస్వానివి
అదే నన్ను గాయకుడిని చేసింది
పోలికలు నాకిష్టం లేవు
గతస్మృతులు నా బలమూ కాదు
గడచిన కాలాన్ని తలచి
నేను కన్నీరూ చిందించను
నువ్వో వెలకట్టలేని ముత్యానివని
మాత్రం నిజాయితీగా చెప్పగలను
నువ్వెప్పుడూ వెలుగులీనుతూ
ఉండాలని నేను కోరుకునే
పరిపూర్ణమైన బాలికవు నువ్వు
నువ్వొకప్పుడు నా దానివి
కొంతకాలం..
కొంతకాలం..
కొంతకాలం మాత్రమే నువ్వు నా దానివి!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవితలు వెలువరించారు.
ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.




బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‌గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.
రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.

సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.