[శ్రీ కొప్పర్తి వెంకటరమణమూర్తి వెలువరించిన ‘కొప్పర్తి కవిత్వం’ అనే కవితాసంపుటిని విశ్లేషిక్షిస్తున్నారు డా. విజయ్ కోగంటి.]
“రాయాలి రాయాలి
ఎప్పుడో వచ్చే ఒక శాశ్వత వాక్యం కోసం జీవితమంతా రాయాలి
రాసి రాసి గుండెలు అరిగిపోవాలి
రాయడం గంధం రాయడం ఒకటి కాదు
రాయడాన్ని ఎవరు కాల రాయలేరు” ..
అవును, రాయడం గంధం రాయడం ఒకటి కాదు.
సునిశిత పరిశీలన, హృదయాన్ని తాకే భాష, బుద్ధిని తార్కికతవైపు నడిపించే శక్తి, మనిషితనాన్ని మరతనాన్ని విడదీయగల తాత్త్వికత, ఇవన్నీ కలిస్తే కొప్పర్తి కవిత్వం!
కొప్పర్తిగా పిలవబడే కొప్పర్తి వెంకటరమణమూర్తి గురించి కవిత్వ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. 1991 నుంచి 2013 వరకు ముచ్చట కలిపే మూడు కవిత్వసంపుటాలతో అనేక సాహిత్య పురస్కారాలతో ఒకవైపు చరిత్రని, మరోవైపు సాహిత్యాన్ని తన కళ్ళుగా భావిస్తూ కవిత్వాన్ని పలవరించే కొప్పర్తి ‘పిట్టపాడే పాట కోసం’, (1991) ‘విషాద మోహనం’ (2003) ‘యాభై ఏళ్ల వాన’ (2014) అనే మూడు సంపుటాల కవిత్వాన్ని ఒక సంపుటిగా ఈ మధ్యనే మనకు అందించారు.
‘బహుళత్వమే తన కవిత్వ తత్త్వం’ అనే కొప్పర్తి, బాల్యం నుంచి సాహిత్య వాతావరణంలో పెరిగారు. ముద్దు కృష్ణ, శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి, వేదుల, దువ్వూరి, విశ్వనాథ, బాపిరాజు లాంటి వారి కవిత్వ సంపుటులతో ఇంట్లోనే కలిగిన పరిచయం, నాన్న అమలింగేశ్వర రావు నుండి విన్న జాషువా పద్యాలు కవిత్వపు అడుగులు నేర్పించాయి. 70వ దశకంలో వికసించిన అభ్యుదయ విప్లవ ప్రభావం నుంచి మొదలై కవిత్వ సృజనలో ప్రత్యేకతను సాధించుకుంటూ, జీవితపు విషాద మోహనత్వాన్ని పొదువుకుంటూ ఒక పరిపూర్ణ కవిగా మార్క్స్, శ్రీశ్రీ, గాంధీ, అంబేద్కర్ లతో బహుళత్వాన్ని సాధించేంతవరకు సాగింది. తనను తాను ‘డీ క్లాసిఫై’ చేసుకుని, కళాత్మకతను మార్దవాన్ని పోగొట్టుకోని కవితగా నిలిచిన కొప్పర్తి కవిత్వం చాలా లోతుగా, ఉదాత్తతతో, గాఢతతో సుదీర్ఘమైన నదీగానంలా సాగుతుంది.
మంచి కవిత్వం ఎప్పుడూ మన పట్ల మనకి ఒక అవగాహనను, మన చుట్టూ నిలిచిన మనుషుల పట్ల, జీవిత విషయాలపట్ల ఒక వాస్తవిక పరిజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇటువంటి తార్కిక సృజనకు ఒక అవగాహన, జీవితపు అనుభవం, అంతర్దృష్టి కావాలి. మనిషితనాన్ని, మనసుతనాన్ని, ప్రపంచాన్ని, మనుషులను, వారి భావావేశాలని, కన్నీటి రహస్యాలని, జీవితపు సారాన్ని ఔపోశన పట్టగలిగినవాడు, దాన్నే తన అంతరంగాన్ని చేసుకోగలిగినవాడు, నిత్యం కవిత్వాన్ని పలకరించాలన్న తపన కలిగిన వాడు కవిత పలుకకుంటే ‘తనకు తాను కాకుండా పోయానను కునే’వాడు కాబట్టే కొప్పర్తి ఒక విశిష్ట కవిగా నిలిచిపోతాడు.కవిత్వ లక్షణం గురించి ఆయన మాటలలోనే చూద్దాం :
భాషలో స్తంభించిన ఒక అనుకంపన, భావనలో, అభివ్యక్తిలో, ప్రదర్శితమైన ఒక హృదయ పరిచ్ఛేదన. (పే.19)
కవిత్వ ప్రవాహం ఎలా ప్రారంభమవుతుందో, ఎక్కడ ఆగిపోతుందో, మరలా ఊట ఉబికినట్లు మళ్ళీ ఎలా ఉబికి ప్రవహించి పరిగెడుతుందో తెలియదు. అలాంటి ప్రవాహ దశలలో ఒక కవి కవిత్వ తత్వ నిర్ధారణ చేయలేము. కానీ ఇప్పుడు అనేక సంవత్సరాల తర్వాత ఆ నది నిలిచిపోయి, చాలు మాత్రమే కనిపించేటప్పుడు, ‘ఖాళీ పూరింపబడుతుందనే ఆశ లేనప్పుడు’, ఆ నది పుట్టుక గురించి, ప్రవహించిన దారుల గురించి, సుసంపన్నం చేసిన క్షేత్రాల గురించి, ఆ ప్రవాహ వేగం, లోతుల గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి.
ఈ సంపుటిని పరిశీలిస్తే ‘మనిషి చిరునామాకై వెతుకుతూ’ బయలుదేరిన కవి అస్తిత్వరాహిత్యాన్ని సూచించే బహువచనాన్ని తృణీకరిస్తూ ‘నేను’ గా నిలవడం గమనిస్తాం. కవి ప్రయాణం నిలకడగా తాత్విక విశ్లేషణతో నడుస్తుంది. సాధారణ కవులు ఆవేశపూరితంగా చెప్పే విషయాన్ని కూడా కొప్పర్తి నిలకడతనంతో, నాటుకుపోయే బాణంలా పదునైన సూటిదనంతో చెప్తాడు. ఇలా చెప్పగలిగే రహస్యానికి కారణం ఆయన వ్యక్తిత్వమే. ఆయన కవిత్వం అంతా, డాక్టర్ పాపినేని శివశంకర్ కూడా అభిప్రాయపడినట్లు ‘ఆయన వ్యక్తిత్వ ప్రతిఫలనమే’. ఆయన కవిత్వం ఒక సాత్విక తీక్ష్ణత, సవాలు చేసి నిశ్శబ్దంతో ఎదిరించేతనం, విశ్లేషణా చాతుర్యంతో, సమస్యను deconstruct చేసే విధానంతో నిండి ఉంటుంది. ‘సముద్రంలోంచి లేచే సూర్యుడిలా అల్లకల్లోలం లోంచి లేచి ‘శిరసెత్తు’తుంది, ‘శివ మెత్తు’తుంది.’
చరిత్ర అధ్యాపకుడి అంతరంగం, అనుభవంతో ఈ ప్రపంచపు ఆవిర్భావాన్ని, సామాజిక నాగరికతల అడుగుజాడలను పట్టి చూపుతాడు కొప్పర్తి. ఈ మూడు సంపుటాలలో లఘు కవితలతో పాటు దీర్ఘ కవితలూ చాలా ఉన్నాయి స్త్రీల మనోభావాలు, ఉద్వేగాలతోపాటు పురుషులు వారి ముందట ఎంత అల్పులో వివరిస్తాడు. తనకిష్టమైన వ్యక్తుల గురించి, మతం పేరిట దగాపడ్డ వారి గురించి, వర్ణాలుగా, వర్గాలుగా చీలి మోసం చేస్తున్న సమాజం నుంచి కవి బాధను పంచుకుంటాడు. మనుషుల మధ్య మాయమవుతున్న బంధాల గురించి. స్వార్థాన్ని గురించి, స్నేహ ద్రోహాల గురించి, భగ్నమౌతున్న అనుబంధాల గురించి, భాష గురించి, కవిత్వభాష గురించి తన వ్యథాభరిత హృదయాన్ని ఆవిష్కరిస్తాడు.
కవితా రచనా శైలి, వస్తువు ఎంపిక పరిశీలిస్తే 30 లేక 40 కవితలతోనే ప్రతి సంపుటి తీర్చిదిద్దిన తీరు కనిపిస్తుంది. ఒక పేజీలో పూర్తయ్యే చిన్న కవితలు, ఒకటిన్నర పేజీల్లో పూర్తయ్యే మధ్యనిడివి కవితలు, ఒకటిన్నర పేజీలు దాటి నడిచే దీర్ఘ కవితలు అనేకం కనిపిస్తాయి. ‘పిట్ట పాడే పాట కోసం’ లో 9 దీర్ఘ కవితలు, 8 మధ్యనిడివి కవితలు, 13 లఘు కవితలు, ‘విషాదమోహనం’లో 24 దీర్ఘ కవితలు, ఆరు మధ్యనిడివి కవితలు, 11 లఘు కవితలు, ‘యాభై ఏళ్ల వాన’ లో 19 దీర్ఘ కవితలు, 5 మధ్యనిడివి కవితలు, 6 లఘు కవితలు ఉన్నాయి.
‘మహోదయం’, ‘మహాప్రస్థానం’, ‘శ్రమ నిష్ఫలమై’, ‘చైతన్యం’, ‘పొలికేకలు’, ‘వేదనా గణితం’, ‘యాంటీ థీసిస్ ‘, ‘రాయలసీమ’ ‘పిట్ట పాడే పాట కోసం లోని లఘు కవితలైతే, ‘కస్తూరి వాహకుడు’, ‘ప్రతిక్రియ’, ‘మరో లవణ రాజు కల’, ‘విషాదమోహనం’ లోనివి. ‘తల్లి’, ‘నిర్నిద్రం’, ‘కవి’, ‘దుఃఖం’, ‘భాషా ప్రజలు’, ‘ప్రశ్న’ ‘యాభై ఏళ్ల వాన’ లో కనిపిస్తాయి.
దుఃఖానికి, ఆనందానికి గల నిష్పత్తిని వేదనా గణితం లెక్కిస్తే కవి కలాన్ని ‘జీవితంలో’ ముంచిన వాడంటూ మరొక కవిత వివరిస్తుంది. ‘నైట్ మేర్’ మనసును పిండి వేసే భావాలను ఓ దృశ్యంలా నిలబెడితే మ్యాజిక్ రియలిజం వాతావరణాన్ని ‘మెలంకలి స్ట్రెయిన్’ చూపెడుతుంది. చిన్న కవితే అయినా పశు న్యాయాల్ని, శవనాగరికతను, విలోమస్మృతిని, పిండ సంస్కృతిని, లోహ చరిత్రను ‘ప్రతిక్రియ’ వివరిస్తుంది. ఇక అతి తక్కువ లఘు కవితలు ‘తల్లి’ ‘నిర్ణయం’, ‘కవి’, ‘దుఃఖం’, ‘భాషా – ప్రజలు’, ‘ప్రశ్న’ లాంటివి మూడవ భాగం అయిన ‘యాభై ఏళ్ల వాన’ లో కనిపిస్తాయి.
ఈ పరిణామ క్రమాన్ని చూస్తే రానురాను లఘు కవితపై కన్నా దీర్ఘ కవితపై కొప్పర్తికి ఆసక్తి పెరగడం గమనిస్తాం. ఒక సంభాషణలో ఆయనే తెలిపినట్లు ‘దీర్ఘ కవిత రచించడం ఒక మహాశిఖరారోహణ చేసిన సంతోషాన్నిస్తుంది అయితే అది కత్తి మీద సాము లాంటిది’. కవిత ఎత్తును అంచనా వేయడం, అధిరోహణకు కావలసిన సామాగ్రిని అంటే వస్తువును, దృశ్యాల్ని, భాషను, పొదుపుకోవడంతో పాటు, ఒక సంగీత ప్రక్రియలోనో లేదా నాట్య నాటక ప్రదర్శనలోనో క్రమక్రమంగా ఉచ్చస్థితిలోనికి, ఒక ‘కెతార్సిస్’ భావన లోనికి తీసుకెళ్తున్నట్టు తన కొప్పర్తి తన దీర్ఘ కవితను నడిపిస్తాడు.
దీర్ఘ కవితలు రాయడం అంత సులువైన పని కాదు. దీర్ఘ కవితకు వస్తువు, ఎంపిక, శైలి, శిల్పం, అన్ని పకడ్బందీగా నడవాలి. ఎక్కడ పాఠకుడికి లేదా చదువరికి ఆసక్తి సడలిపోకూడదు. భాషలోనూ, భావనలోనూ దృశ్యమానం చేసే శక్తి కావాలి. అనవసరత్వం అసలు పొడచూపకూడదు. వాల్ట్ విట్మన్, రాబర్ట్ ఫ్రాస్ట్, జేమ్స్ రైట్, రాండాల్ జారల్ లాంటి కవులు నడిపినట్లు దీర్ఘ కవిత రాయడం చాలా క్లిష్టమైన విషయం.
పాఠకుడిలో ఆసక్తి కలిగించాలంటే దీర్ఘ కవిత ఒక విప్లవ గీతమో లేదా కథా ఇతివృత్తం గల పద్యమో అయి ఉండాలి. ఒక తాత్విక చింతనను దీర్ఘ కవితలా మలచాలంటే, ఆనందింప చేయాలంటే చాలా ఓర్పు, ఓపిక, ఇటు కవికీ అటు పాఠకుడికీ అవసరం. కవి అంచెలంచెలుగా వ్యక్తపరిచే ఆలోచనలు అసందర్భంగా ఉండకూడదు. పాఠకుడు వాక్యాల్ని దాటుకెళుతూ వెళ్లి ముగింపుకి దగ్గర కాకూడదు. అందునా తాత్వికతను పంచేటప్పుడు వస్తువుకు సంబంధించిన శైలి, గాఢత పాఠకుని చేయి పట్టుకుని నడిపేలా, ఆలోచనలు రేకెత్తించేలా ఉండాలి. దీర్ఘ కవిత ఎప్పుడూ బౌద్ధికమైన, అనుభూతిపరమైన ఆలోచనను, సహనాన్ని ఆశిస్తుంది. ఆలోచనాత్మకమై మనసు కన్నును తెరిపిస్తుంది. ప్రపంచాన్ని చూపిస్తుంది.
దీర్ఘ కవితలో కవిత కాన్వాస్ పెరిగే కొద్దీ, కవికి తాను అందులో ఒక చిన్న భాగమై, మరింత అణకువతో ఒదిగిపోతూ ఉంటాడు. అనునిత్యం ఆ కవితా సందర్భంలో భాగమై తనకు తానే మరిచిపోతాడు కూడా. దీర్ఘ కవితలకు లఘు కవితలలా ఒక నిర్దేశిత ముగింపులు ఉండక పోవచ్చు. జీవిత సత్యాలతో ముడిపడే ఉండేవైతే అవి ‘డిస్కోర్సెస్’లా నడుస్తూ, అసంపూర్తిగా కూడా అనిపిస్తాయి. ఆగిన కవితను ఇంకా పొడిగించుకునే అవకాశమూ ఉంటుంది. అయితే కాన్వాస్ పెద్దది కావడంతో తార్కిక వ్యాసంలా కూడా అవి సత్య నిరూపణ చేయగలుగుతాయి.
ఒక్కోసారి దీర్ఘ కవితలు తమ దారిలో ఒక సత్యాన్వేషణకు దోహదపడతాయి. లఘు దీర్ఘ కవితలు రెంటినీ వ్రాసే డేవిడ్ ట్రినిడాడ్ అనే కవి ఈ విషయాన్ని చెప్తాడు: “కవిత ఎలా మొదలవుతుందో, ఏ మలుపులు తిరుగుతుందో, ఎక్కడ ఆగిపోతుందో కవికే తెలియదు. కవితను పూర్తిగా అర్థం చేసుకోవడానికి అనేక పర్యాయాలు చదవాలి” అంటాడు. విట్మన్ అనుకున్నట్లు ‘కవి తర్కిస్తూ, కవితకు స్వేచ్ఛనిస్తూ, తనకు తాను మర్చిపోయే సందర్భాలు కూడా’ ఉంటాయి. కవి సృజనలో తనకు తానే, కవితా వస్తువుకు, అంశానికి వ్యతిరేకమై కూడా ఆలోచించవచ్చు. విట్మన్వే అయిన ఈ వాక్యాలు చూడండి: “Do I contradict myself? / Very well then, I contradict myself/ I am large, I contain multitudes.”
కొప్పర్తి మూడు సంపుటులలోనూ దాదాపు 52 దీర్ఘ కవితలున్నాయి. ఇవి ఇలా వ్యతిరిక్తతను తెలుపవు గానీ ఇలాటి తాత్త్వికతనే కలిగి ఉంటాయి. ఈ దీర్ఘ కవితల్లో మానవ నైజాలు, సమాజ సంఘటనలు, సంఘర్షణలు, ఆత్మ నివేదనలు, పక్కన పెట్టలేని కొన్ని వాస్తవాలు, నాగరికత లోని ప్రయాణాలు, ప్రమాణాలు, చరిత్ర చూపిన పక్షపాతాలు, భయద సౌందర్యాలు, గుండె గుండెకూ పెరుగుతున్న దూరాలు, అసలు నక్కల అరాచకాలు, మరతనాలు, అశ్రు రసాయన సూత్రాలు, అంతిమ సత్యాలు, జెండర్ పాలిటిక్స్, ప్రాచీన స్మృతులు, నిరాకరణలు, ‘అమర’ కథలు అన్ని సుడిగుండాలై తిరిగి తిరిగి ‘సుశీల’లై జీవితమథనాన్ని గురించిన వాస్తవాన్ని కనులముందు నిలుపుతాయి. ఒక్కోసారి ఒక్కొక్క కవితను ఏడు, ఎనిమిది సార్లు తిరగరాసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తాడు. కొప్పర్తిలా అన్ని దీర్ఘ కవితలు రాసిన కవులు చాలా అరుదు. ఆయన శైలి ఆయనకే చెల్లు. ఇంత కవిత్వ నిర్మాణ శక్తి ఉండి కూడా ఆయన ‘విషాద మోహనం’ పుస్తకాన్ని ప్రచురించే సమయంలో దాన్ని బయటకు తేవాలా వద్దా అనే సంశయంతో ఊగిసలాడేడంటే ఆయనకు కవిత్వం పట్ల ఉన్న శ్రద్ధ మనకి అర్థమవుతుంది.
కొప్పర్తి తన కవిత్వ భాష పట్ల కనబరచే శ్రద్ధ గురించి కూడా మనం తెలుసుకోవాలి. కవితా వస్తువును బట్టి ఆయన భాష మారుతుంది. ఎంత సాత్వికతను పొదువుకుంటాడో అంత పదునుగానూ చెప్తాడు. ఈ వాక్యాలు చూడండి:
“ఆకలెయ్యడం అరాచకమూ అసాంఘికమూ అయిన చోట
కరచాలనం చేస్తే కరవాలం దూసినట్లుండాలి
వెన్నెముకలు విడిగా గుట్టగా పడి ఉన్న చోట
రెండు చేతులూ పైకెత్తి
ఒక్క ఉదుటున లేచి నిలబడితే
డైనమైట్ పేలి మట్టి ఎగజిమ్మినట్లుండాలి.” (అన్ని దార్లూ రోమ్ ను చేరవు, ౩౩)
తాత్త్వికతతో ‘ ప్రాణం ఒక ప్రశ్న’ అంటున్నప్పుడు ఎలా ఆలోచనాత్మకమౌతుందో చూడండి:
“ప్రాణం ఒక జ్వాలన్నదెవరు, కాదన్నదెవరు
ప్రాణాన్ని ఘనమన్నదెవరు, ద్రవమన్నదెవరు
ప్రాణం ఏకవచనమన్నదెవరు, బహువచనమన్నదెవరు
అసలు ప్రాణమన్నది ఎవరు”.. (ప్రాణం ఒక ప్రశ్న, 157)
దీర్ఘకవితలలోని భాష గురించి మాట్లాడుతూ‘ అది చాలా వైవిధ్యమైనదని, పాఠకుడ్ని కవితలోకి మళ్ళించే శక్తి భాషకే ఉన్నదని చెపుతూ, అది అతి సరళమైతే, కవిత తన కవిత్వ లక్షణాన్ని కోల్పోయి శుద్ధవచనమై పోతుంద’ని అంటాడు.
కొప్పర్తి దీర్ఘ కవితల వస్తువులు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అందరూ ‘కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్’ ‘సుశీల’ కవితలను గురించి చెప్తారు కానీ, విశ్వజనీనమైన మూల విషయాలను దర్శించి ప్రాణం పోసిన కవితలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఒక నిరంకుశ రాజ్యం ఏర్పడే స్థితిని ‘ఏకపాద పద్యం’ వివరిస్తుంది. ప్రణాళిక ప్రకారం జరిగే సభలు, సమావేశాలు ప్రకటనలు, కళాకారులందరితో జరిపే కార్యక్రమాలు ఎలా పకడ్బందీగా జరుగుతూ పక్కకు తొలగుతూ నియంత పాదాన్ని కూరుకుపోయేందుకు ఎలా తెలియకుండానే సహకరిస్తాయో కళ్ళకు కట్టినట్టుగా ఉండే దృశ్యాలతో వివరిస్తాడు. కవిత ఎంత బలంగా మొదలవుతుందో చూడండి:
ఒకానొక ఛాయ మెత్తగా మౌనంగా విస్తరిస్తున్నప్పుడు
మనం దాన్ని గుర్తించలేం
దాని తాలూకు అదృశ్యపాదం
దేశపటం మీద బలంగా పరుచుకుంటున్నప్పుడు కూడా
మనం దాన్ని రూపు కట్టుకోలేం
తీరా ఆనిం తర్వాత
అంతా బీభత్సం.. (ఏకపాద పద్యం, పేజీ 22)
చిన్న కవితలలోనూ భావాల్ని ఎంత దృశ్యమానం చేస్తాడో చూడండి. ఉదయాన్నే చూసినపుడు రాత్రి ఇంట్లో పెట్టడం మరచిపోయిన చిట్టి చెప్పులు, వాటిలో చిన్న తల్లి రాత్రంతా శీత గాలిలో నిలుచుండి పోయిన భావన ఎలా కోత పెడుతుందో చెప్తాడు. కవి సున్నిత హృదయంతో బాటు పరిశీలనని దృశ్యమానం చేయ గల శక్తి ఒక చెహోవ్ కథా వాతావరణాన్ని సృష్టిస్తుంది.
అలాగే ‘తల్లీ, భూదేవి’ (పే.94) కవిత మనిషి నాగరికతాచక్రంలో ఎలా పరిణామం చెందాడో వివరిస్తుంది. ఈ కవితా వస్తువు ఊహ, నడిపించిన తీరు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. భూమి తల్లిలా మనిషితో మాట్లాడుతూ ఎలా నడిపిస్తూ దుక్కి దున్ని పండించడం నేర్పిందో చాలా హృద్యంగా చెప్తాడు. కవిత ప్రారంభమయే తీరు, మనిషికి, భూదేవికి మధ్య జరిగిన సంభాషణ, భూదేవి నాగలిగా మారి తటాలున ఎలా అదృశ్యమయిందో, మనిషి మలుపు తిరిగి సాగిపోయాడో, చెప్పిన తీరు కవిత్వపు అసలు ఛాయను విశదీకరిస్తుంది. కవిత ఒక కథను చెప్తున్నట్లు సాగి నాగరికతా పరిణామాన్ని కవిత్వీకరిస్తుంది.
కొప్పర్తిని కేవలం సాత్త్విక కవిగా మనం లెక్కిస్తే ఎంత పొరపాటు పడిన వారమో చెప్పడానికి ఈ ఒక్క కవిత చాలు. ఎంత పదునుగా ఉంటుందో ఎలా అరాచకాన్ని తర్జనితో బెదిరిస్తాడో ‘భృత్యుజాలం’ కవిత వ్యంగ్యాస్తమయం ముగింపునిస్తుంది.
చేస్తాను చేస్తాను అంటాడు
చేయకపోతే నేనెందుకు అంటాడు
అన్నాడంటే మరి తప్పకుండా చేస్తాడు
అన్నిటికంటే మనుషుల్ని బాగా ఖరీదు చేస్తాడు
చరిత్రను బాగా ఖరాబు చేస్తాడు
చూస్తూ కూర్చుంటే ఏమైనా చేస్తాడు
జనం లేచినిలబడితే కాలంచేస్తాడు (పే.22)
కొప్పర్తి కవితా వస్తువులు కొన్ని వేళలకో, కొన్ని సందర్భాలకో మాత్రమే కట్టుబడి ఉండవు. విశ్వ జనీనమై ఉంటాయి. ‘ఆకలి నైరూప్యం కాదు, అక్షరం మనిషైనప్పుడు, పిట్ట పాడే పాట కోసం, యుద్ధమూ-శత్రువూ, అణు విచ్చిన్నం, తెరిచియుండువేళలు, అపేక్ష సిద్ధాంతం, భాష-ప్రజలు, ఒక నిరాకరణ, మరణ వైయక్తికం’ – లాటివి పరిశీలిస్తే మనకిది బాగా అవగతమౌతుంది.
ఈ కవి తన కవితలలో చేసే పోలికలు కూడా సహజంగా ఉంటాయి. ‘మనిషిని పుష్పించగల చెట్టం’టూ, ‘పలికేవి, పగిలేవి, అడిగేవి, అడుగులేసేవి అక్షరాలు’ అని చెప్తూ ‘అక్షరాలు అచ్చం మనుషుల్లానే ఉంటాయని’ అరసున్నాలను తాత నడుములతో, దీర్ఘ అక్షరాలను తుపాకీ ఎక్కుపెట్టిన సైనికులతో, తొక్కిపట్టే మనుషులను ద్విత్వాక్షరాలతో పోలుస్తూ, దేశ పుస్తకంలో ‘ఇప్పుడు తలకట్లు లేని మొండి అక్షరాలే సంచరిస్తున్నాయ’ని హెచ్చరిస్తాడు. మనం రోజు చూసే వస్తుజాలం తోటే ఇలాంటి పోలికలు అన్నీ అల్లుతాడు. మైదానం అక్షరాలు లేని కాగితమైనా, ఇవాళ చరిత్ర నీళ్లు ఇంకిపోగా అవశేషాలన్నీ బయటపడిన బావి అయినా, చిన్ననాటి జ్ఞాపకాలు గొడుగుల్లా విప్పుకున్నా, – ఇలాటి పోలికలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి.
మనిషి కన్నీళ్ళ విలువ తెలిసినవాడు కాబట్టే రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి అంటూ ‘కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్’ కవితను పంచుతాడు. కన్నీళ్లు ఎలా మనిషితనాన్ని చూపెడతాయో నిరూపిస్తూ ‘గుండె బరువెక్కి, ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి కన్నీళ్లు తొణికిస లాడాయా, నువ్వు మనిషివే’ అని ఈ రసాయన క్రియను వివరిస్తాడు. సామాన్య పాఠకుడికి సైతం కన్నీళ్ళ విలువను తెలుపుతూ మనిషి హృదయంలో జరిగే రసాయనిక చర్యకు కన్నీళ్ళకు గల సంబంధాన్ని తెలుపుతాడు. అవును, కొప్పర్తి చెప్పినట్లు ‘రక్తాన్ని ఎక్కించ గలం కానీ, కన్నీళ్ళ నెవరైనా ఎక్కించ గలరా?’ ‘అసలు నక్క’, ‘అంతిమ సత్యం’ కవితల్ని గమనిస్తే ‘కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్’ కు మూలాలు దొరుకుతాయి. ఇవి ఒక కవి అంతర్వేదన ఎలా కొనసాగుతూ వస్తుందో చూపుతాయి.
కవిత్వ సంపుటుల, కవితల శీర్షికలను గమనిస్తే కవి ఎంత లోతుగా జీవితాన్ని పరిశీలిస్తాడో అర్ధమౌతుంది. బంధాలు కనుమరుగౌతూ కృత్రిమత్వం సిద్దాంతీకరింపబడటాన్ని ‘అపేక్ష సిద్ధాంతం’, కాలాన్ని పలుకోణాల్లో చూపే ‘కాలస్పృహ’ , సున్నితమైన మనసును విడిచి వేసిన అహంకారాన్ని, స్త్రీత్వపు ఔన్నత్యాన్ని సమర్ధించే ‘జెండర్ పాలిటిక్స్’, జీవన్మరణాన్ని తర్కిస్తూ, చరిత్రలో దుష్టులుగా నిలిచిన వారిని నిలదీసి, అమాయకుల మరణం ఎంత దుర్మార్గమో తెలిపే ‘మరణ వైయక్తికం’ – వంటివి ప్రత్యేకంగా నిలిచిపోతాయి.
అలాగే సమాజపు కుట్రలో ఏర్పడి దగా పడ్డ ఐదవ జాతి శక్తిని కించ పరచక మనలో కలుపుకు నిలుపుకు పోవాలనే ‘సింధూ నది’, ‘ప్రతిక్రియ’ , ‘ఊరూ వాడా’ కవితలు ఆలోచనను రేకెత్తిస్తాయి. స్త్రీల పట్ల, పెద్దల వల్ల చిన్న పిల్లల జీవితంలో ఏర్పడే ఒంటరితనం పట్ల ఈ సాత్విక కవి వ్యక్తపరిచే అవ్యాజమైన ప్రేమ మనకు కన్నీళ్లు తెప్పిస్తుంది.
స్త్రీత్వం అనేది ఒక శక్తిమంతమైన తత్త్వం. పుష్పించి ఫలింప చేసే జీవన సూత్రం. ఇది గాంధీ వంటి నాయకులను ఎలా మలిచిందో ఈ సంపుటిలోని స్త్రీవాద కవితలను చదివి అర్ధం చేసుకోవచ్చు. అలాగని కొప్పర్తి దీన్నొక వాదంగా పేర్కొనడు, ప్రకృతిలో దాని ప్రముఖ పాత్రని తెలియచేస్తాడు. ‘కాళ్ళ కింద నేల’, ‘ద్వీప కల్పాంతం’, ‘శిక్షా స్మృతులు’, ‘జెండర్ పాలిటిక్స్’, ‘దుఃఖం’, ‘సుశీల’ కవితలు సూక్ష్మ స్థాయి నుంచీ స్త్రీత్వపు గొప్పతనాన్ని నిలబెడతాయి. అందుకే కొప్పర్తి గాంధీ లోని స్త్రీ తత్త్వాన్ని రాబట్ట గలిగాడు.
గాంధీజీ వ్యక్తిత్వాన్ని అపరిమితంగా ప్రేమించిన వ్యక్తి కాబట్టే సాత్వికతను స్వభావంగా వ్యక్తిత్వంగా మల్చుకోగలిగిన కవీ అయ్యాడు. కవిత్వంలో హృదయాన్ని ముంచుకున్న వ్యక్తి , భార్యని ‘నిజంగా ఆమె ప్రకృతి’ అని కొలుస్తూ ‘నేను మానవుడిని’ అని తన స్థాయిని కుదించుకున్న వ్యక్తి,, ప్రాణమొక ప్రశ్నగా నిలిపిన వ్యక్తి, బంధాలను అపరిమితంగా ప్రేమించగల వ్యక్తీ కవి అయినప్పుడు, ప్రతి కవితకీ ఒక సుదీర్ఘ వ్యాసం రాయాల్సిన అవసరం ఉంటుంది.
‘కాసిన్ని పాటలను, కాసిన్ని నమ్మకాలను, కాస్తంత నమ్మకాన్ని మరి కాస్తంత చైతన్యాన్నీ’ తెచ్చి ‘గుండె తలుపులు తట్టి’, ‘కంటికి కిటికీలు తెరుస్తున్న’ కవిత్వమిది. ఇది కవులు ఉత్సవం చేసుకోవాల్సిన సందర్భం. యువకవులు చదివి నేర్చుకోవాల్సిన సందర్భం. కొన్ని అక్షర దోషాలు మినహాయిస్తే ఈ సంపుటిని అందంగా మలిచి అందించిన శ్రీ శ్రీ ప్రింటర్స్ వారు అభినందనీయులు. నిడివి, సమయం కోసం ఇంకా కొన్ని విషయాలను రాయలేకపోతున్నానని బాధపడుతూనే ఈ అవకాశాన్ని ఇచ్చిన ‘సంచిక’ పత్రిక వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీ కొప్పర్తి వెంకటరమణమూర్తి గారికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. ఇక కవితా ప్రియులదే ఆలస్యం!
***
రచన: కొప్పర్తి వెంకటరమణమూర్తి
పేజీలు: 270
వెల: ₹ 250/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, ఫోన్: 9912460268
~
కొప్పర్తి వెంకటరమణమూర్తి
101, ది పార్క్ వ్యూ అపార్ట్మెంట్స్,
రోడ్ నెంబర్ 9, మాధవపురి హిల్స్,
పిజెఆర్ ఎన్క్లేవ్, చందానగర్
హైదరాబాద్ 500050. ఫోన్: 9849525765
~
కొప్పర్తి వెంకటరమణమూర్తి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-mr-kopparthy-venkataramana-murthy/
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని,
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి.
డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు.
drvijaykoganti2@gmail.com
8309596606
