ఒకప్పుడు తెలుగులో కవిత్వమంటే పద్య కవిత్వమే. అది ఇతిహాసం కావచ్చు. పురాణం కావచ్చు. ప్రబంధం కావచ్చు. ఆత్మాశ్రయమైన శతకం కావచ్చు.
పద్యమంత ప్రాచుర్యం పొందకపొయినా ‘ద్విపద’ కూడా పక్కపక్కనే పురాణేతిహాస రచనల్లో చోటు చేసుకుంది.
పదం లేదా గేయ ప్రక్రియ కవిత్వ ప్రియుల మధ్య పద్యమంతగా ఏనాడూ ప్రాచుర్యం పొందలేదు. బహుశా అది పాడుకోవడానికి ఉద్దేశించినదనీ, సంగీతంతో ముడిపడి ఉన్నదనీ, – శిష్టులు ప్రధాన కవిత్వ స్రవంతిలో గుర్తించినట్టు లేదు.
గుర్తించనంత మాత్రాన – పదం లేదా గేయం ఆది నుంచీ తెలుగుభాషలో తన ఉనికిని కోల్పోలేదు. జన పదాల వృత్తుల్లో, గృహ జీవనంలో, పండుగలలో, వేడుకలలో అల్లుకొని జీవిస్తూ వస్తూనే ఉంది. యక్ష గానాలలో, ఉదాహరణం వంటి లఘు కృతుల్లో ప్రముఖ స్థానం ఆక్రమిస్తూనే వుంది.
ఈనాడు తెలుగు జన జీవనంలో పాట పొందిన ప్రాచుర్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సినిమా వినోదం ప్రచారంలోకి వచ్చాక, పాటకి పట్టపగ్గాలు లేవు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటల ప్రపంచంలోకి ప్రవేశించే ముందు – ఆయన ప్రవేశానికి పూర్వం ‘పాట’ ప్రక్రియ స్థితి ఎలా వుండేదో క్లుప్తంగానైనా చూస్తే, కృష్ణశాస్త్రి పాట ప్రత్యేకత బాగా బోధ పడుతుంది.
దాదాపు క్రీస్తు శకం 12వ శతాబ్ది నుంచి ‘పాట’ ప్రస్తావన పాల్కురికి సోమనాథుడి బసవపురాణం ద్వారా మనకి తెలుస్తోంది. అదేమిటో ఎలా పాడేవారో తెలియదు.
సంకీర్తన లక్షణమనే పుస్తకం వ్రాసీ, 32వేల కీర్తనలు వ్రాసీ అన్నమాచార్యులు పదకవితాపితామహుడయే వరకు, అన్నిరకాలుగా – వట్టి ముక్తక పద్ధతిలో – పదాన్ని పలికించవచ్చునని దాదాపు ఎవరూ ఊహించనైనా లేదు.
‘పదం’ అనే ప్రక్రియ అన్నమాచార్యులు చేతిలో శృంగార, వైరాగ్య ఇతివృత్తాలతో పరిపూర్ణంగా రాణించింది. పల్లవి, మూడు చరణాల ‘రూపాన్ని’ పదానికిచ్చిన వాడు ఆయన – ఆ తరువాత మళ్ళీ క్షేత్రయ్య రంగ ప్రవేశం చేసి మువ్వగోపాల పదాలు రచించడంలో పదమంటే శృంగార పదమనే రూఢి కలిగించారు.
ఆ తరవాత కాలంలో యక్షగానాల రగడలలో, ఉదాహరణాల కళికోత్కళికలలో (ఉదహరణ ప్రక్రియదో పెద్ద చరిత్ర. దానికీ పాల్కురికి సోమనాథుడే తెలుగులో అద్యుడు. అది విషయాంతరం) సంగీతకృతులలో, జావళీలలో, మారాఠీ, పార్సీమట్లతో అవతరించిన నాటకాల పాటలలో, పదం రకరకాల అవతారాలెత్తింది. ఇవాళ పదాన్నే పాటగా వ్యవహరిస్తున్నాం, స్థూలంగా ఈ ప్రసంగంలో కూడా ఇకమీద ‘పాట’ అనే మాటనే గేయ సాధారణ వాచకంగా వాడుతున్నాను.
దేవులపల్లి కృష్ణశాస్త్రి యువకుడిగా కళ్ళు విప్పి – 1911 సంవత్సరంలో కాకినాడలోని పీఠికాపురాధీశ కళాశాలలో చేరే నాటికి రాజకీయంగా జాతీయోద్యమం నడుస్తోంది. సాంఘికంగా సంస్కరణోద్యమం నడుస్తోంది. మత సంబంధంగా బ్రహ్మ సమాజం ఉచ్చస్థితిలో ఉంది. ఒకవైపు కందుకూరి వీరేశలింగం, మరొక వైపు రఘుపతి వెంకట రత్నం నాయుడు సంఘ సంస్కరణ, బ్రహ్మసమాజ ఉద్యమాలకు నాయకులుగా ఉన్నారు.
కృష్ణశాస్త్రి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి శిష్యుడు. కాకినాడలో ఆయన ప్రభావంతో బ్రహ్మసమాజం ప్రచార గీతాలు వ్రాయడంతో ఆయన సాహిత్య యాత్ర ప్రారంభమైంది. కృష్ణశాస్త్రి పాట చరిత్ర చెప్పాలంటే బ్రహ్మ సమాజ గీతాలతో ప్రారంభమై రేడియో కోసం దేశభక్తి గీతాలు, సంగీత రూపకాల కోసం వ్రాసిన పాటలు, పిల్లల పాటలు, తిరుప్పావు కీర్తనలు, సినిమా పాటల వరకు చెప్పాలి. 1925లో కృష్ణపక్షం, 1929లో ప్రవాసం – ఊర్వశి ఖండ కావ్య సంపుటులు ప్రచురించే వరకు శాస్త్రి గారు ఎక్కువగా తెలుగు పద్యాన్ని నిడివిలో, భాషలో, భావంలో సంస్కరించి తన కాల్పనిక భావ ప్రకటనకు అనుకూలంగా మలుచుకొనే పని చేశారు. అది వృత్తమైనా, సీస పద్యమైనా, ద్విపదైనా, జాతి, ఉపజాతి తరహావైనా ఆ పద్యాలకు కృష్ణశాస్త్రి భావ సుగంధం ఉంది. భావ సమాసాలతో, పద బంధాలతో, అవి భాషించే తీరు వేరు. పద్యానికి రూప వ్యవస్థ కంటె భావ వ్యవస్థ ప్రధానమని భావించారు కనకనే మిగతా సమకాలికుల కంటె భిన్నంగా ఆయనొక్కడే ’భావకవి’ అయ్యాడు. ఆ పేరు వల్ల మీదపడిన పూలూ, రాళ్ళు సరిసమానంగా భరించారు.
కృష్ణశాస్త్రి అంటే ‘పాట’ – అనే ప్రచారం 1936 నాటి నుంచీ ఆయనెక్కువైంది. ఈ పేరుకి కారణం 1936లో మద్రాసులో అవతరించిన రేడియో. ఆ తరువాత 1950 నుంచి సినిమా.
కృష్ణశాస్త్రి వాగ్గేయకారుడు కాడు. వట్టి గేయకారుడే. తానే పాడగలిగి, సంగీత శాస్త్ర ప్రమేయంతో గేయం కూర్చే వారినే వాగ్గేయకారులనడం తెలుగు సంప్రదాయం. వింజమూరి సీత, అనసూయ, బాలాంత్రపు రజనీకాంతరావు, పాలగుమ్మి విశ్వనాథం, ప్రధానంగా హమేషా శాస్త్రిగారికి సన్నిహితంగా వుంటూ సంగీతపు బాణీలూ, రాగాలు వినిపిస్తూ – ‘వ్రాయించినవి’ ఆయన పాటలు, అది విడిగా ఒక్కపాట కావచ్చు లేదా ఏదైనా ప్రసారం కోసం సంగీత రూపకం కావచ్చు.
మాట శాస్త్రిగారిదైతే బాణీ వారి వారిది. అయితే – మనస్సులో శాస్త్రిగారికి గల తాళ పరిజ్ఞానం, రాగ పరిజ్ఞానం గొప్పవి.
ఈ అమరిన సౌకర్యాలతో కృష్ణశాస్త్రి వందలకొద్దీ పాటలు – సినిమా పాటలు కాక – అర్ధ శతాబ్దికి పైగానే వ్రాశారు.
సినిమా సంగతి సరే సరి – సాలూరు రాజేశ్వరరావుతో ప్రారంభిస్తే – పెండ్యాల నాగేశ్వరరావు, ఆదినారాయణరావు, కె.వి మహదేవన్, రమేష్ నాయుడు వంటి ప్రముఖ సంగీత దర్శకులు ఆయన పాటలకు బాణీలు కట్టారు.
ఇప్పుడు అసలు విషయం – కృష్ణశాస్త్రి పాటలో విశిష్టత విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
పద్యం పక్కన ఆధునిక సాహిత్యంలో కవిత్వ ధర్మంతో పెద్దపీట వేసిన వ్యక్తి కృష్ణశాస్త్రి. ఆయన కవిత్వం పఠితృ సంప్రదాయానికి చెందినది కాదు. ప్రసంగాలు గల్పికలతో సహా శ్రవ్య సంప్రదాయానికి చెందినది. అందువల్ల తొలినాళ్ళకంటె రానురాను రేడియో సాహచర్యం వల్ల క్లుప్తంగా, అందంగా, బలంగా, శ్రోతకు తేటతెల్లంగా తన భావం ప్రసారం చెయ్యవలసిన అవసరం ఆయన కేర్పడింది. అంతే – అంతకు పూర్వం శాస్త్రి గారి భావ ప్రకటన మీద ఉండే ‘అస్పష్టతా’ ముద్ర తొలగిపోయింది.
చాలామందికి తెలుసో తెలియదదో కృష్ణశాస్త్రి రచనలన్నీ – వ్యాసాలు, ప్రసంగాలు, గల్పికలు, యక్షగానాలు, రేడియో సంగీత రూపకాలు, పిల్లల పాటలు, సినిమా పాటలు, పద్య రచనలు – 23 సంపుటాలుగా ప్రచురణ పొందాయి. వాటిలో అమృత వీణ, మంగళకాహళి, మేఘమాల, గోరింట కేవలం పాటల పుస్తకాలు. వీటిలో మొత్తం 423 పాటలున్నాయి (సినిమా పాటలతో సహా). ఇవికాక పిల్లల రాజ్యం అనే సంపుటిలో 20 పిల్లల కోసం పాటలు ప్రత్యేకంగా వున్నాయి.
రేడియో ప్రసారాల కోసం వ్రాసిన 27 సంగీత రూపకాలు, రంగస్థల ప్రదర్శన కోసం వ్రాసిన నాలుగు యక్షగానాలు, అన్నీ కలిపి ఆరు సంపుటాలుగా వెలువడ్డాయి. శ్రీ ఆండాళ్లు అనే రేడియో సంగీత రూపకం, గోదాదేవి వ్రాసిన (తమిళంలోని) 30 పాశురాలకు శాస్త్రి గారు చేసిన కీర్తనానువాదం (స్వర సహితంగా) ఒక సంపుటిగా వెలువడింది.
కృష్ణశాస్త్రి గేయ రచనా వైపుల్యం ఏమిటో స్తిమితంగా యీ సంపుటాలను బట్టి అంచనా వేయవచ్చు.
శాస్త్రిగారి పాట సంప్రదాయ కీర్తన కాదు. సంగీతం మీద – అంటే రాగ సౌందర్యం మీద – ఎక్కువగా ఆధారపడి, పాట పొడిపొడి మాటల కూటమిగానో, భగవన్నామాల సంబోధనల సంపుటిగానో వుండదు. తీర్పుగా పాటకు ఆకారం యిస్తూ, మనస్సు మీద ప్రభావం చూపే ఒకానొక భావం మీద ఆయన దృష్టి కేంద్రీకరించడం ఆయన పాటలోని సాధారణ ధర్మం.
ప్రేమ, ప్రకృతి దృశ్యం, దేశభక్తి, దైవభక్తి వంటి ఇతివృత్తాలతో – సంయోగ వియోగాలతో, ఆత్మ నివేదనతో, పాత్ర చిత్రణలతో, యీ పాటలన్నీ ఆయన వ్రాశారు. ఆయన తొలినాటి బ్రహ్మసమాజ గీతాలు ఏకేశ్వరోపాసన ప్రధానంగా వుండగా – తరవాత గుహుడు, శబరి, వంటి పాత్రల పరంగా రాముడు, కృష్ణుడు, రాధ, శివుడు, రంగనాథుడు వంటి దైవత మూర్తుల పరంగా కూడా అపురూపమైన పాటల ‘చిత్రణం’ చేశారు.
పాట వ్రాసినా, పద్యం వ్రాసినా, ఆయన రచనా సంవిధానంలో మాటల ఎంపిక తీరు ‘గేయా’నుకూలంగానే ఎక్కువగా కనిపిస్తుంది. బాహ్యమూర్తి చిత్రణం కంటే అంతరంగానుభవం చిత్రణం ద్వారా శ్రోత మనస్సును చూరగొనడం ఆయన రచనా విధానంలో మరొక విశేషం.
“పాట పక్షి వంటిది మాట మనిషి వంటిది” అని ఆయనంటారు.
మాట, మనిషి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ పాటలోకి అమరి పాట తేలికగా ‘సంచరించేది’ కాగలగాలి. పద్యంలో లాగ మాటల బరువుతో పాట క్రిక్కిరిసిపోయి – సంగీత సంచారానికి చోటు చాలకుండా చేయకూడదంటారాయన.
గాయకుడి దృష్టి ఎప్పుడూ నిర్దిష్ట రాగ భావాన్ని ఆవిష్కరించడం మీద వుంటుంది. వాక్కును గేయంలోకి పొదిగేవాడి దృష్టి ఎప్పుడూ సాహిత్య భావం మీద వుంటుంది. ఇద్దరూ మనోధర్మానికి అగ్ర ప్రాధాన్యమిచ్చేవారే. త్యాగరాజస్వామి వంటి అరుదైన వాగ్గేయకారులు మాత్రమే ‘ఒక్కచేతి మీదుగా’ రాగ భావాల మనో ధర్మ సమ్మేళనం సాధించినట్టు కనిపిస్తారు. ఆధునిక కాలంలో లౌకిక ఆధ్యాత్మిక భావాలకు రాగ ధర్మాన్ని కూడా (సంగీత మిత్రుల సాయంతో) సమర్థంగా జోడించి – సంగీత సాహిత్య మనోధర్మ సమ్మేళనం సాధించిన వ్యక్తి కృష్ణశాస్త్రి ఒక్కరే.
పల్లవి, చరణాలు కూర్చడమే కదా! అని తేలికగా, ప్రౌఢకవులమనుకునే వారు కొట్టి పారేయవచ్చు. ముక్తక స్వభావం గల పాట అనే ప్రక్రియ శరీరం చాలా చిన్నది. పల్లవి పాటలో తొలుత శీర్షస్థానంలో వుంటుంది. అది ఒక్కొక్కసారి ఒక ‘ప్రకటన’ చేసి, దానికి సమర్థకంగా చరణాలలో ఉపపత్తుల్ని చూపించవచ్చు; ఒక ప్రతిపాదన చేసి, చరణాలలో విపులంగా వివరించవచ్చు. ఒక మూర్తిని చిత్రించడానికి ప్రాతిపదిక ఏర్పరచవచ్చు. ఒక అనుభూతిని ఆవిష్కరించడానికి బీజం వేయవచ్చు. ఆవేశంగా నామ సంకీర్తనం చెయ్యడానికి, ప్రధాన లక్ష్యం నిర్దేశించవచ్చు. ప్రశ్నలు, చిక్కుముడులు ప్రారంభించి చరణాలలో విప్పవచ్చు. ఒక దృశ్య పరంపరకి “ప్రధాన క్రియ”ను మకుటంగా అమర్చవచ్చు. ఇవి అనంతాలు.
భాషాపరంగా అనుప్రాసలు, అంత్యప్రాసలు, శ్లేషవిరుపులు… అనేక అందాలు సంతరిస్తూ పాట శరీరానికి అలంకారాలు కూర్చవచ్చు. మనిషికి ఎన్నిరకాల మనోదశలున్నాయో అన్నింటినీ సమర్థంగా నిర్వహించగలిగితే – మహాకావ్యం చెయ్యజాలనంతగా కూడా – పాట ద్వారా చేయవచ్చు. ఈ విషయాన్ని పరిపరి విధాల నిరూపించిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.
పాటకు కావలసిన ప్రాథమిక లక్షణం పాడడానికి అనుకూలంగా వుండడం – అందుకు అనుకూలంగా తన భాషా పాండిత్యాన్ని ముందుగా కవి నిగ్రహించుకోవడం అవసరం. ఈ రహస్యం గ్రహించిన కొద్దీ కృష్ణశాస్త్రి పాట మనిషి మనస్సుకి మరీ మరీ దగ్గరైంది. ఇందుకు సమయం పట్టింది కూడా! కాలంతో పాటు ఆధునికత వైపు జరగడం ప్రారంభించిన కృష్ణశాస్త్రి తొలినాళ్ళ నుంచీ జాగ్రత్తపడిన ఒక అంశం వుంది. అదేమంటే: రచనా శిల్పంలో పరంపరగా వచ్చిపడే ‘అరిగిపోయిన’ పదబంధాలను విడిచిపెట్టడం – స్థిరపడిన ఛందస్సుల పాద, గణ సంఖ్యా నియమాలను మార్చుకోవడం – కొత్త పదబంధాలను సృష్టించడం, మహాకావ్య, ప్రబంధ రచనా మార్గాలను విడిచి – ముక్తక శ్రవ్య సంప్రదాయాన్ని ఆశ్రయించడం. వీటన్నిటికీ మించి అపురూపమైన అనుభూతి ప్రధానమైన కాల్పనిక పరిమళాన్ని ప్రతి రచనలోనూ అద్దడం, ఇంత నిర్మధనంలో నుంచి కృష్ణశాస్త్రి పాట రెక్కలు విప్పుకుంది. కృష్ణశాస్త్రి గారి బ్రహ్మసమాజ గీతాలు రచనలో ఆంతర్యం తెలియాలంటే బ్రహ్మసమాజం లక్ష్యాలు, ఆదర్శాలు ముందు తెలియాలి.
హిందూ సమాజాన్ని, మతాన్ని సంస్కరించి పరిశుద్ధ ఆస్తిక మతాన్ని నెలకొల్పడం కోసం 1828లో రాజా రామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. దక్షిణ దేశంలో సంచారం చేస్తూ కేశవ చంద్రసేన్ చేసిన ఉపన్యాసాల వల్ల, బ్రహ్మ సమాజం పట్ల ఇటువైపు ఆసక్తి పెరిగింది. ఆంధ్రదేశంలో బ్రహ్మసమాజ కార్యక్రమాలకు రాజమండ్రి, మచిలీపట్నం, కాకినాడ కేంద్రాలయ్యాయి. రఘుపతి వెంకటరత్నం నాయుడు 1881 నాటికి మద్రాసులో పండిత శిననాథ శాస్త్రి బోధనల ద్వారా ప్రేరణ పొంది బ్రహ్మ ధర్మ దీక్షా పరుడయ్యారు. ఆయనకు ప్రియ శిష్యుడైన పిఠాపురం మహారాజు సూర్యారావు గారు కాకినాడలో కళాశాల స్థాపించడంతో నాయుడు గారు కాకినాడ వచ్చి బ్రహ్మ సమాజ, సంఘ సంస్కరణోద్యమాలకు ఆ పట్టణాన్ని కేంద్రంగా చేశారు. అక్కడే కృష్ణశాస్త్రి 1911-12 సంవత్సరాలలో ఆయనకు శిష్యుడయ్యాడు.
బ్రహ్మ సమాజం అనుష్ఠాన మతం. అది ఆచరణకే ప్రాధాన్యం ఇస్తుంది. వేదాలు అపౌరుషేయాలని అంగీకరించదు. అన్ని మతాలను, ప్రవక్తలను గౌరవిస్తుంది. సత్యం ఎక్కడ సాక్షాత్కరించినా భక్తితో స్వీకరిస్తుంది. నైతిక జీవితానికి అగ్ర ప్రాధాన్యమిస్తుంది. బ్రహ్మ సమాజానికి ఉపనిషత్తులు ప్రమాణ గ్రంథాలు, అయినా, అన్ని మతాలలో వున్న సత్యాలను సమన్వయించుకుంటుంది. కుల-వర్గ-మత-ఆర్థిక భేదాల వంటి వాటిని పాటించరు. ఒక్కటే జాతి మానవ జాతి. ఒక్కడే సృష్టికర్త జగత్పిత; ఒక్కటే రాజ్యం స్వర్గరాజ్యం – అని చాటుతుంది. ఏకేశ్వరోపాసన లక్ష్యంగా గల బ్రహ్మ సమాజంలో విగ్రహారాధన లేదు.
కృష్ణశాస్త్రి యీ బ్రహ్మసమాజ లక్ష్యగీతం అనదగిన పాటలో ఈ ప్రపంచమంతా ఒక్క యిల్లు అనే భావం ప్రకటిస్తున్నారు.
ఈ సుధర్మభవనములో ఈరేడు జగాలనేలు
ఈశ్వరుడే దీన జన హృదీశ్వరుడే కొలువుదీర్చు
1.దిశదిశలే నింగినేల నిశాదివములిందుజేరి
కలసిపోవు కలగిపోవుఁ బులకరించునో…
2.మణిమోహన నవకాంచన మండితకోటీరకోటి
మసృణారుణకిరణావళి మలసి కౌగిలించునో….
3.ఈ దరిద్ర తృణోన్నిద్ర హృదయామోదము – ఇందు
ఈశ్వరుడే దీనజన హృదీశ్వరుడే కొలువు దీర్చు….
4.లేవు కుటిల శృంఖలములు లేవు కఠిన కుడ్యములే
చెరలు లేవు ఇరులు లేవు కరుణాలయ – మిందు…
5.అమృతకౌముదీ మధు మిళితానందమె యానందమాయె
దేవుడు గుళ్ళో ఎక్కడో కూర్చోడు. జనం మధ్యలో తిరుగుతూంటాడు. ముఖ్యంగా దీనజనుల మధ్యలో వుంటాడని ఇదిగో, యీ గీతం ప్రబోధిస్తుంది.
శిధిలాలయమ్ములో శివుడు లేడోయి
ప్రాంగణమ్మున గంటపలుక లేదోయి
దివ్యశంఖముగొంతు తెరవలేదోయి
పూజారి గుడి నుండి పోవలేడోయి
1.చిత్ర చిత్రపు పూలు చైత్రమాసపు పూలు
ఊరూర నింటింట ఊరకే పూచాయి
శిధిలాలయమ్ములో శిలకెదురుగాకునుకు
పూజారికొకటేని పూవులేదోయి….
2.వాడవాడల వాడె! జాడలన్నిటవాడె
ఇంటి ముంగిటవాడె! ఇంటింటిలో వాడె
శిధిలాలయమ్ములో శిలను సందిటబట్టి
పూజారి వానికై పొంచియొన్నాడోయి…
ఈ ప్రపంచం మాయ, మిథ్య, కాదు. నిత్యానందంతో విలసిల్లే బృందావనం. దీనిని, ఇందులో వుండే మనుషుల్ని శంకించే వాళ్ళని నమ్మవద్దని హెచ్చరించే పాట మరొకటి ఇది. ఇందులో లయ కూడా కొత్తగా వుంటుంది.
జాగ్రత్త! జాగ్రత్త! మాయ జగత్తని
శాస్త్రములెల్లను విప్పెదవు
భాగ్యము ప్రేమము పయఃకణములని
బైరాగి ధర్మము చెప్పెదవు.
1.ఇది యంధకూపమిది యస్థికార
బ్రతుకంతగోల పాడందువు
పది దిక్కులంటు మధుమల్లివనము
తుదిలేని వల్లకాడందువు.
2. లోకాలనేలునేకైకరాజు
క్రూరాత్ముడంచు శంకింతువు
ఏకాకి యేడ్పులే యెన్నడంచు
ఇట్టట్టు శిరసు పంకింతువు.
3.ఎలమావికొమ్మ శిఖరాల గుండె
కోకొమ్మటంచుకోయిలలు
అలసానిలాస తలలూపి పైన
లతనూగు పూవుటూయెలలు.
4.ఈ హాయిలోన యీ తోటలోన
ఎవ్వారి కిట్టి బోధనలు
ఓహో విరాగి! ఓహో విరాగి
చాలింపు శుష్క సాధనలు… అంటూ
మరో ఆరు చరణాల వరకు నడిచే ఈ పాట ముగింపు ముక్తాయింపు ఇలా వుంటుంది.
సంసారిరమ్ము! సంతాపిరమ్ము
సమ్రాట్టురమ్ము! సన్న్యాసి రమ్ము
సాటేదిలేని సంసారము స్వర్గము
భువనమ్ము గొప్ప బృందావనము…
ఇలాగ – ఏకేశ్వర కీర్తనంతోనూ, యీ జగత్తు అందరికోసం – అందరిదీ – ఆనందమయమైనది – అని చాటడంతోనూ, కృష్ణశాస్త్రి బ్రహ్మ సమాజ గీతాలు 67 ఉన్నాయి. వీటిలో ఇంకా ‘ఎటుల, నే నీ లీల కీర్తింతు’, ‘కనులు విచ్చికనుడీ’, ‘మలినబాష్పమౌక్తికమ్ము’, ‘పరువు పరువున రండో’, ‘తొలిప్రొద్దు కొండపై’, ‘మధుర నామంబెవరు వినిచిరో’, ‘దరిద్ర నారాయణ లోకేశా’, ‘దూరదూరానైన ద్వార తోరణమైన’, ‘పడవనడుపుము కర్ణధారీ’, ‘ఎంతకాలము వేచియుందును’, ‘ఒకసారిరావా! దేవా!’, ‘ప్రాణరమణదీన జన హృత్తాపహరణ’, ‘అవని యంతా పెద్ద అక్షయ పాత్ర’,… అనే పల్లవులతో నడిచే పాటలు ‘ఉపాసనా గీతాలు’, పేరిట – రేడియోలో భక్తి రంజని వినే శ్రోతలకు చిర పరిచితాలు. పాలగుమ్మి విశ్వనాథం, మల్లిక్, రజనీకాంతరావు వీటిలో చాలా పాటలను స్వరపరిచారు.
కృష్ణశాస్త్రి పాటల రచనలో రెండో దశ రేడియో పాట, సంగీత రూపకాల దశ, 1936 తరవాత 1949లో పూర్తిగా సినిమా రంగ ప్రవేశం చేసేవరకు; ఆ తరువాత 1960ల దశకంలో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో కొంతకాలం ప్రయోక్తగా ఉద్యోగం చేసినంత వరకు – రేడియో, ఆయన రచనా వ్యాసంగానికి కేంద్ర స్థానమైంది. దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, అనుభూతి పరమైన ఇంకా అనేక గీతాలు ఆయన వ్రాశారు. వాటి వివరాలలోకి వెళ్ళేముందు, గేయ రచనలో సాంకేతికంగా శాస్త్రిగారిలో వచ్చిన మార్పు గురించి పాలగుమ్మి పద్మరాజు గారు చేసిన విశ్లేషణ గమనించదగినది –
“తెలుగు జానపద రచనలలో అయిదు మాత్రల ఛందాన్ని విరివిగా వాడడం సంప్రదాయం. భావకవులు ఆ ఛందాన్నే ఎక్కువగా తమ గేయాలకు ఉపయోగించారు. అయిదు మాత్రల నడకకీ, తెలుగుకీ ఏదో స్వాభావికమైన సంబంధం వుంది. 3,4,6,7 మాత్రల ఛందాలు అక్కడక్కడ వాడినా కృష్ణశాస్త్రి తొలి గేయాల్లో ఎక్కువ భావం ఖండగతిలో నడిచినవే….
….రేడియో సంపర్కం ఏర్పడ్డాక, రకరకాల గాయకులతో సాన్నిహిత్యం ఎక్కువయ్యాక, కృష్ణశాస్త్రి గేయ రచనా శిల్పంలో ఎంతో మార్పు వచ్చింది. మౌలికమైన మార్పు!…. ఆ తరువాత ఆయన వ్రాసిన గేయాలన్నీ – ఇంచుమించు – ఎవరో ఒక ప్రముఖ గాయకుణ్ణి – ఏ రజనినో, విశ్వనాథాన్నో, పి.బి శ్రీనివాస్నో ఎదురుగా కూర్చో పెట్టుకుని ’ట్యూన్’ (బాణీ)తో పాటు పదాలు బిగించి వ్రాసినవే…. ఆయన ఒక పంక్తి వ్రాసి ఇచ్చేవారు దానికి ట్యూన్ (బాణీ) అజ్ఞాతంగా ఆయనలో ఏదో ఉండేది. గాయకుడు ఆ పంతి రకరకాల తాళాల్లో రాగాల్లో అనగా అనగా, ఆయన అనుకున్న వరస చటుక్కున తగిలేది. ’ఇదీ ఈ పాటకు వరస’ అని ఆయన నిర్ణయించేవారు. ఆ తరువాత మిగిలిన పాదాలు మెల్లమెల్లగా పూర్తి అయేవి…”-
ఇంత దీర్ఘంగా పద్మరాజుగారి మాటల్ని ఎందుకుదాహరించానంటే: అనేక పాటలు వ్రాసిన సందర్భాలు ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు. ఆయా పాటల భావ సంచారంలో కృష్ణశాస్త్రి అనేక అనుభూతులతో భిన్న మూర్తులుగా మారడం ఆయనకు తెలుసు.
దైవభక్తి, దేశభక్తి గీతాలు కాకుండా ఆయన ‘విడి’గా వ్రాసిన భావగీతాలు ఎంతో సున్నితమైనవీ, – మన జీవితాలలో అనేక సందర్భాలలో మనకు ఉత్సాహం, ఓదార్పు, కలిగించేవీ, వున్నాయి. ఈ పాట ఒక మృదువైన మనస్థితిని విశదం చేస్తుంది.
ఒదిగిన మనసున పొదిగిన భావము
కదిపేదెవ్వరో! కదిపేదెవ్వరో!
1. కదలని తీగకు కరిగినరాగము
కరపేదెవ్వరో! కరపేదెవ్వరో!
కదిపేదెవ్వరో! కరపేదెవ్వరో
కరగని మనసును, కదలని తీగకు?
2. హృదయమురాయిగ గళమునరేయిగ
కదలని దీనుని గతియిక ఎవ్వరో?
నాకయి ప్రాణము గానము తానయి
నడిపేదెవ్వరో! నడిపేదెవ్వరో!
కదిపేదెవ్వరో! కరపేదెవ్వరో!-
ఈ పాట – ఒక ఉదయ దృశ్యాన్ని ప్రశాంత సుందరంగా చిత్రిస్తుంది.
ఉదయగిరిపైన అదిగొ గగనాన
కదలె దినరాజు తేరు…
పొదిగి చిరుగాలి నిదుర తెరజారి
కదలె కోనేరు నీరు…
1.త్వరపడి వికసించె కమలము
తిరువడికడనిడె, దళదళము
వివరించె విహంగమకులము
సవరించిగళము మంగళము…
2. హరి ఓమ్మనెకోవెలగంట
హరి ఓమ్మనె దెసదెసలంట
హరి ఓమ్ హరి ఓమ్
హరి ఓమ్మనె గిరులూఝరులూ
పరవశమున్ పులుగులుతరులు…
3.పలుకాడని,కదలనిరాయి
చలియించెను పూవైపులుగై
నవమోహనగాన మధురమై
నవజీవన పరిమళభరమై….
కృష్ణశాస్త్రి ఎంత అలవోకగా ప్రేమ గీతం వ్రాయగలరో, మామూలుగ వుండే మాటల్ని కలిపి ఎంత విరహం పలికించగలరో, యీ చిన్న పాటలో చూడవచ్చు.
ఏమోనే ప్రియా!
ఈ నా మనసు నిలువదే
నీముసమేని నిలువదే
నీ కన్నులు చూడనేని…
1. అటు చూచును ఇటు చూచును
ఆగి ఆగి అటె నిలుచును
అటు ఊగును ఇటు ఊగును
అలయిక నా యెద తూగును…
2.లోల మధుకరాళులౌను
నీలోత్పలమాలలౌను
నీ కన్నుల వెంట వెంట
నా కన్నులు డోల లౌను….
మనస్సును చిన్నగా చకితం చేసే సందర్భాలను సైతం గొప్ప అనుభూతి కలిగించే పాటగా శాస్త్రి గారు కూర్చగలరు. ఈ పాట ఎగిరే పచ్చని చిలక గురించి…..
ఏమే చిలకా కోపమా! నీ
మదినేమైనా తాపమా?
1.అలరులగూడే నేయనా?చివు
రాకుల వీడే వేయనా?
నాకల నీకల ఏకముగా మన
రెక్క రెక్క కలిపేయనా?…
2. మింటిపైన మనసాయెనా! నీ
యింటి కొరకు దిగులాయెనా?
జంటగ మాయని మధువని నీ – వా
ల్గంటి చెంత వదిలేయనా –
కృష్ణశాస్త్రి హృదయ ధర్మానికి ప్రతీక అనదగిన మరొక్కపాట ఇక్కడ ఉదాహరించి – మరో అంశానికి వెడతాను.
శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు
ఎద లోపల పూలకారు ఏనాటికి పోనీయకు.
1. ఉగ్రమైన వేసంగియెండ
ఆగ్రహించి పై బడనీ
ఒక్కుమ్మడిగా వర్షామేఘం
వెక్కివెక్కి ఏడ్చేయనీ!
శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు….
2. చైత్రంలో తొగరెక్కే కోర్కెలు
శరత్తులో కైపెక్కే కలలు
శీతసమయం మగతానిదురా
శిశిరకాలం మరణం మసనం
శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు…
3.వీట లేడనీ చెప్పించు
వీలులేదనీ పంపించు
వీధి వాకిటను జరాపద ధ్వని
వినబడగానే వెంటనే
వీటలేడనీ చెప్పించు
వీలు లేదనీ పంపించు… శీతవేళ రానీయకు…
ఈ క్రమంలో మరికొన్ని పాటల పల్లవులు:
1.ఎక్కడ నుందో,యీ పిలుప
ఎందుకు నాకీ మైమరపు…
2.నీ యింటికి పిలువకు,నను
లోనికి రమ్మనకు….
3. ముందు తెలిసెనా ప్రభు ఈ
మందిర మిటులుంచేనా!….
4. ఒక తుమ్మెద మదిలో ఝమ్మంది
ఒక మంగళమంత్రం పలికింది…
5. మధూదయంలో మంచి ముహూర్తం
మాధవీ లతకు పెళ్ళి….
6. రెల్లుపూలా పానుపు పైనా – జల్లు జల్లులుగా
ఎవరో – చల్లినారమ్మా – వెన్నెల చల్లి నారమ్మా!….
– వీటి భావాలను బట్టి, నడకలలో వైవిధ్యం గమనించవచ్చు.
ఇక కృష్ణశాస్త్రి గారి భక్తి గీతాల గురించి చెప్పాలంటే ఆయన రేడియో సంగీత రూపకాలలోకి, సినిమా పాటల్లోకీ వెళ్ళవలసిందే!
అచ్చయి – ఇప్పటికి మనకు తెలిసినంతలో ఆయన 27 రేడియో సంగీత రూపకాలు, నాలుగు రంగస్థల యక్షగానాలు వ్రాశారని ముందే అనుకున్నాం. వాటిలో ఆయనకెంతో పేరు తెచ్చినవి శర్మిష్ఠ, కృష్ణాష్టమి, ధనుర్దాసు, ఏడాది పొడుగునా, శ్రీ విద్యాపతి, సుప్రియ, అతిథిశాల, రంగస్థల యక్షగానాలలో విప్రనారయణ, క్షీర సాగర మథనం –
నిజానికి కృష్ణశాస్త్రి యక్షగానాలు, సంగీత రూపకాలు అన్నిటా సంభాషణల్లో, పద్యాల్లో, పాటల్లో కవిత్వమో చమత్కారమో లేని వేవీ లేవు. నేనిప్పుడు చెప్పినవి, పరిమితంగా ఉదాహరించినవి.
ఇక్కడ, కృష్ణాష్టమి రూపకం నుంచి వట్టి నామ జపం లాగ కనిపిస్తూ కవిత్వం పలికించిన యీ పాట చూడండి:
జయ జయ కృష్ణా! జయ జయ కృష్ణా
జయ జయ జయ జయ జయ గోవిందా!
1.జయ జయ గోపకిశోర! యశోదా
నందా నందకుమార! మనోహర!
2.జయ జయ శ్రావణ జలదేందీవర
తరుణ తమాల కిసాల సమాన
3. శ్యామల కోమల చారు శరీర
మామక హృదయాంతర సంచార
జయ జయ కృష్ణా!
4. జయ జయ నవ నవ సుందర సుమధుర
ధరహాసి తోన్మిషి తానన మోహన
5.రజనీకర! మధుకర మృదుచికురా!
రాధా మానస ధన పాటచ్చర!
జయ జయ కదంబ కకుభ ప్రసూన
కేసర కేసర నవ కువలయదళ
6.సురభిళ మృదుశయ్యాప్త విహారా!
గోపీ జనతా ఘన తాపహార!
ఇదే రూపకంలో మరొక పాట – తాత్వికంగా ఎంతో యెత్తున నిలిచే పాట – చూడండి.
వేయబోవని తలుపుతీయమంటూ పిలుపు
రాధ కెందుకొ నవ్వు గొలుపు!
నీలోన నాలోన నిదురపోయే వలపు
మేలుకుంటే లేదు తలుపు!
విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైన
వీధి వాకిలి యేదె చెల్లెలా!
విశ్వవిభుడే రాధ వెంటనంటీరాగ
పిలుపేది తలుపేది చెల్లెలా! –
శ్రీ ఆండాళ్ళు రూపకం విష్ణుచిత్తుని పెంపుడు కూతురైన గోదాదేవి కథ. ఆ కథలో మౌలికమైన భక్తి ప్రణయాల ఆవేశ స్థాయుల్ని గుర్తించి శాస్త్రిగారు గొప్ప రూపకం వ్రాశారు. అందులో పెరియాళ్వారూ (విష్ణుచిత్తుడు) గోదాదేవీ, కలిసి పాడే పాట ఇది –
పెరియ : నవ తులసీదళదామా
నవ కువలయాభిరామా
నవ నవ లావణ్య సీమా
తిరువరంగథామా! శ్యామా!
సురలకేని మునులకేని
దొరకరాని పదములాని
విరులతోడ జేరిచినా
శిరసునుంచనీవా!
గోదా : కోరి కోరి రమ్మని నా
తీరా నీ వేతెంచిన
ధారలైన ఆశ్రుల, నీ
రూపుతోచదేమీ, స్వామీ!-
శ్రీరంగనాథుడంటే అందరికీ గుర్తుకు వచ్చే శాస్త్రిగారి పాట మరొకటి వుంది. ఇది ‘విప్రనారయణ’ యక్షగానంలోది. దీనిని రంగస్థలం మీద సుప్రసిద్ధ కూచిపూడి నాట్య గురువు, ప్రయోక్త వెంపటి చిన్న సత్యం గారు ప్రదర్శించేవారు. ఈ పాటలో దరువు + శబ్దం – కూచిపూడి సంప్రదాయంలో కూర్చినవి. దరిమిలా, యీ పాటను వేరే సందర్భం కల్పించి, తమ ’ఆనందభైరవి’ చిత్రంలో, దర్శకుడు జంధ్యాల ఉపయోగించారు. దీనిని బాలాంత్రపు రజనీకాంతరావు స్వరపరిచారు.
కొలువైతివా రంగశాయి – హాయి
కొలువైన నినుజూడ కలవా కనులువేయి?
1.సిరి మదిలో పూచి తరపిరాగమురేచి
చిరునవ్వు విరజాజులేవోయి ఏవోయి…
2. సిరిమోము తమ్మకై మరిమరి క్రీగంట
పరిచేటి ఎలదేటు లేవోయి ఏవోయి….
ఔరా! ఔరౌరా!
రంగారు జిలుగు బంగారు వలువ
సింగారముగ ధరించి
ఉరమందు తులసి సరులందు కలసి
మణి యందముగ వహించి
సిస్తైన నొసలు కస్తూరి బొట్టు
ముస్తాబుగాగ ఉంచి
వెలిదమ్మి కనుల యెలరేను కొనల
తులలేని నెనరు నించి
జిలిబిలి పడగల శేషాహి
తెలిమెల్లెశయ్య శయనించి
ముజ్జహములు మోహమ్మున
తిలకింపుగ పులకింపగ
శ్రీరంగమందిరా నవసుందరా పరాక్….
అందరికీ రేడీయో ద్వారా – విడిగా – శ్రీరంగం గోపాలరత్నం కంఠంలో పరిచయమైనది ‘శివక్షేత్ర యాత్ర’ రూపకంలోని యీ పాట:
శివ శివ శివ అనరాదా
శివ నామము చేదా!
శివ పాదముమీదా – నీ
శిరసు నుంచరాదా!
1.భవసాగర మీదా – దు
ర్భర వేదన కాదా
కరుణాళుడు కాదా – ప్రభు
చరణధూళి పడారాదా
హర హర హర అంటే – మన
కరువు తీరి పోదా!
కరి పురుగూ పాముబోయ
మొరలిడగా వినలేదా?
కైలాసము దిగి వచ్చీ
కైవల్యము ఇడలేదా?
మదనాంతకు మీదా – నీ
మనసెన్నడు పోదా
మమకారపు తెరస్వామిని
మనసారా కననీదా…
రేడియో రూపకంగానే కాక – రంగస్థలం మీద ఛాయానటకంగా కూడా ప్రసిద్ధి పొందినది ‘అతిథిశాల’ – ఇది ప్రముఖ పారశీక కవి ఓమర్ ఖయ్యాం తాత్త్విక చింతన ప్రతిబింబించే రచన. ఎక్కువగా మార్మికంగా, ప్రతీకాత్మకంగా నడిచే రచనయిది. ఇంతవరకు మనకు పాటల్లో కనిపించే శాస్త్రి గారు వేరు. ఇందులో వేరు. ఇందులో వాతావరణానికీ, ఇతివృత్తానికీ తగిన విధంగా బాషను ఆయన వాడగా – ఈ రూపకం మొత్తం స్వరపరచి – తాను ఓమర్ ఖయ్యం పాత్ర ధరించి పాటలు పాడిన వారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు. సంగీతంలో మధ్య ప్రాచ్య శైలిని వాడడం ప్రత్యేకత. ఈ రూపకంలోంచి ఒక పాట:
రావె సాకీ సాకీ రాగ వీథుల నడచి
కడచి చలివేళ పొలిమేర ఆమని పొడిచె
రాగ బుల్బులు గొంతు మ్రోగించు బాకా
సోగ విరి తీగె తెగ తూగించుజూకా!
జాగా గులాబి పొద ఊగును బులాకీ
ఆగకిక సాకీ, రావె సాకీ సాకీ!
దురుసు మనుగడ రెక్కె తొడిగికోగా
దరసి మృత్యువు కోర లొరసిరాగా
వెరచి సీజరు సికందరులు పోగా
ఆగకిక సాకీ… రావె సాకీ సాకి!
దేశభక్తి గీతాలు, మత సామరస్య గీతాలు, మానవత్వం ఉత్కృష్ణతను చాటే గీతాలు, పతాక గీతాలు, కృష్ణశాస్త్రిలో మరో పార్శ్వాన్ని చూపిస్తాయి. విశాల మానవతా సమతా సాధననీ, భావి లోక కల్యాణ సుస్థిర స్థాపననీ ఆకాంక్షిస్తూ ఆయన వ్రాసిన అనేక గేయాలు ‘మంగళకాహళి’ సంపుటిలో మీకు కనిపిస్తాయి. వీటిలో –
1.జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి….
2. నీ చరణ తరుణ లక్షాచిత్రితములమ్మ
నీసుతుల జీవితములు – నా తల్లి
నిరుపేద జీవితములు….
3.ఆకాశము నొసట పొడుచు అరుణారుణ తార
ఏకాకి నిశీధి నొడుచు తరుణ కాంతి ధార…
4.స్వాతంత్ర్య రథం స్వాతంత్ర్య రథం
అదిగదిగో అదె, అదే అదే….
5.హే భారత జననీ స్వేఛ్ఛాగగన విహారిణీ
స్వతంత్ర కిరణ స్వర్ణారుణ కంకణ కటక కలాపినీ!
6.నిలపండీదివి,నిలపండీభువి
చలిపంకుండ మన జండా!
7.నారాయణ నారాయణ! అల్లా అల్లా!
మా పాలిటి తండ్రీ! నీ పిల్లలమే మెల్లా!
8.కమ్మగా బతికితే గాంధీ యుగం – మనిషి
కడుపునిండా తింటె గాంధీ జగం…
9.మంది కృత మహాయుగం
ముందున్నది ముందున్నది…
10.తెలుగు తల్లికి మంగళమ్ – మన
కల్పవల్లికి మంగళమ్….
– ఈ పల్లవులతో నడిచే పాటలు విశేష ప్రచారం పొందాయి.
శాస్త్రి గారికి జానపదులు, వాళ్ళ పలుకుబళ్ళు అంటే చాలా యిష్టం. సందర్భం దొరికినప్పుడు జానపద ధోరణిలో కొన్ని పాటలు ఆయన వ్రాస్తూ వచ్చాడు. వాటిలో కొన్ని పాటలు పల్లవులు మాత్రం చెపుతాను.
1.ఎయ్రా ఏసైరగడ
తొయ్రా తోసైర పడవ
గోదారీ మేట ఏసెరా…
2.గుండెల్లో నిండాలి కులాసా
ఉండాలి మనసులో దిలాసా
3.సెంబైలే జోరులంగర్
సెంబైలే జోరు లంగర్
జోరు లంగర్ – రోడ్ రోలర్
సాంబయ్యా! ఓ సన్నాసీ
సవటల్లారా! లాంగడేస్….
4.చువ్వీ చువ్వన్న లాలొ చువ్వన్న లాలో
చువ్వన్న లాలో
ఊడుపులూడుద్దాము ఓలమ్మలాలో
ఓలమ్మలాలో….
5.గున్నాసారి గున్నమ్మా
ఓ గున్నాసారి గున్నమ్మా
ఊడుపులూడ్చే కాడ నీకు
ఒడినిండా పసుపెందుకే – గున్నాసారి గున్నమా
6.పెళ్లంటే జల్లుమంటది – నా మనసు
పిల్లంటే పరుగులేత్తది – ఎంచక్కా
పిల్లంటే ఉరకలేత్తది…
7.నవ్వంటే జాబిల్లి – పువ్వంటే మల్లి
నవ్వేటి పువ్వంటే నా చిట్టితల్లి…
– ఇన్ని రకాల పాటలు వ్రాసిన కృష్ణశాస్త్రి చిన్నపిల్లల కోసం కూడా తమాషా పాటలు వ్రాశారు. అటువంటి ఇరవై పాటలు ‘పిల్లల రాజ్యం’ పేరిట బుజ్జాయి గారి బొమ్మలతో సహా వెలువడింది.
మనదేశం, మా యిల్లు, మా బడి, తాతపిలక, వినాయకుడు, గాలిపటం, గొడుగు, ఉడతలు, ఉగాది తాత, విమానం…. ఇవన్నీ పిల్లల కిష్టమైనవే. ఈ సంగతులతోనే ఆయన పిల్లల పాటలు – కబుర్లు చెప్పినంత సహజంగా – వ్రాశారు. వాటిలోంచి ‘గాలిపటాల’ పాట ఒక్కటి తీస్తాను.
వదలండీ గాలిపటం వదలండీ
వదలండీ దారం వదలండీ పాపం!
1.పట్టుకు లాగొద్దని
కొట్టుకు పోతుంది
మబ్బుల నొరుసుకుపోయే
మనసాయెనేమో!
2.చుక్కలను చేరువగా
చూడాలను ఉందేమో
తల ఊపీ తోకూపీ
తల్లడిల్లి పోతుందీ
3.మెలికలుగా ఒళ్ళంతా
గిలగిల మంటూంది
వదలండీ దారం
వదలండీ పాపం!
4.ఎంతుందో ఆకాశం
ఏముందో ఆ పైని
ఆ దవ్వుల పావురాన్ని
అడిగి తెలుసుకోవాలని
ముందుకు దూకాలని
తొందరగా పడిపోతుంది.
5.బైలంటే భయంలేక
పైకిపైకి పోవాలని
వదలండీ పాపం!….
ఇంతవరకూ చెప్పకుండా – చివరికి దాచిన విశేషం కృష్ణశాస్త్రి సినిమా పాట! నిజానికి వాటి గురించి విశేషంగా చెప్పక్కర లేదు. ఆయన ‘మల్లీశ్వరి’ చిత్రంతో ప్రారంభించి వ్రాసిన సినిమా పాటల్లో దాదాపుగా అన్నీ ప్రచారంలోకి వచ్చినవే!-
రేడీయో పాటలకంటె కూడా ఇంకా సరళంగా, అనుభూతిమయంగా ఆయన చాలా సినిమా పాటలు వ్రాశారు. వాటిలో కొన్నింటిని ఎంచి – ‘మేఘమాల’, ‘గోరింట’ అనే పేర్లతో రెండు సంపుటాలుగా ప్రచురించారు. ఈ రెండు సంపుటాలలో మొత్తం 162 (81+81) పాటలున్నాయి. వీటిని విశ్లేషిస్తూ ఉదహరిస్తూ పోవడానికి గంటలు చాలవు. మల్లీశ్వరి పాటలు శాస్త్రి గారి జీవితంలోనే కాదు తెలుగు సినిమా జీవితంలో కూడా పెద్ద మలుపు. ఆయన ’శబరి’ పాటలు, దైవభక్తి గీతాలు సాటిలేని రీతిలో ప్రచారం పొందాయి. విధిగా కొన్నిపాటలు పల్లవులైనా స్మరించకపోతే యీ ప్రసంగం అసమగ్రమవుతుందనే భయంతో – వట్టి చాపల్యంతో – ముఖ్యమైన పల్లవులు చెప్పి ముగిస్తాను – భాగ్యరేఖలో – ‘నీవుండే దాకొండపై’; రాజమకుటంలో – ‘సడిసేయకో గాలి’; భక్త శబరిలో – ‘ఏమి రామకథ’; సుఖదుఃఖాలులో – ‘ఇది మల్లెల వేళయనీ’; ఉండమ్మా బొట్టుపెడతాలో – ‘అడుగడుగునగుడి ఉంది’; బంగారు పంజరంలో – ‘పదములు చాలును రామా’; ఏకవీరలో- ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’; మాయని మమతలో – ‘రానిక నీకోసం; అమ్మ మాటలో – ‘ఎంత బాగా అన్నావు’; సంపూర్ణ రామాయణంలో – ‘ఊరికే కొలని నీరు’; భక్త తుకారాంలో – ‘హరి ఓం, ఘనాఘన సుందరా’; బలిపీఠంలో – ‘కుశలమా! మీకు కుశలమేనా’; ఈనాటి బంధం ఏనాటిదోలో – ‘ఎవ్వరు నేర్పేరమ్మ యీ కొమ్మకు; గోరింటాకులో – ‘గోరింటా పూచింది కొమ్మ లేకుండా’; కార్తీకదీపంలో – ‘ఆరనీకుమా యీ దీపం’; శ్రీరామపట్టాభిషేకంలో – ‘ఈ గంగకెంత దిగులు’; మేఘసందేశంలో – ‘సిగలో అవి విరులో’; సీతామాలక్ష్మిలో – ‘మావిచిగురు తినగానే’; అమెరికా అమ్మాయిలో – ‘పాడనా తెలుగుపాట’; ధనవంతులు – గుణవంతులులో – ‘తెరచివుంచేవు సుమా’ – ఇక్కడికి ఇరవై సినిమాల నుంచి ఇరవై పాటలు మీకు గుర్తు చేశాను కనుక, యీ జాబితా ఆపుతాను.
కృష్ణశాస్త్రి కవిత్వ యాత్రలో 1911 నుంచి ప్రారంభించి – చనిపోయేవరకు – దాదాపు 65 ఏళ్ళ కాలంలో ఆయన వ్రాసిన బహుముఖ రచనలలో కేవలం పాట ప్రక్రియ గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను. వచన రచనలు (ప్రసంగాలు, వ్యాసాలు, గల్పికలు) స్పృశించలేదు. భావకవిగా, ఆ తరువాత (1936 తరువాత) ఆయన పద్య రచనలకు తాకలేదు. నిజం చెప్పాలంటే ఆయన పాట వ్రాసినా పద్యం వ్రాసినా – పాట గుణానిదే పైచేయి.
దేవులపల్లి కృష్ణశాస్త్రి 1897 నవంబరు రెండో తేదీన పిఠాపురం పక్కన చంద్రంపాలెం గ్రామంలో పుట్టారు. 1980 ఫిబ్రవతి 25న మద్రాసులో మరణించారు. పిఠాపురంలో ఉన్నత పాఠాశాలలో చరిత్ర అధ్యాపకునిగా, పీఠికా పురాధీశ కళాశాల (కాకినాడ)లో తెలుగు ట్యూటరుగా, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో (1957 నుంచి కొద్ది సంవత్సరాలు) ప్రయోక్తగా చెదురుమదురుగా, అనాసక్తంగా ఉద్యోగాలు చేశారు. చాలాకాలం ఏ ఉద్యోగం చేయకుండానే గడిపారు.
“నేను హృదయవాదిని, వట్టి హృదయవాదిని” – అని ప్రకటించుకున్న కృష్ణశాస్త్రి గారి హృదయం – అనుభూతి ప్రధానంగా-
ఆయన పాటల్లో ప్రతిధ్వనించింది. భావ కవిత్వ యుగం అనే పాటకి పల్లవి కృష్ణశాస్త్రి జీవితం.
నవ్య కవిత్వయుగం పేరు చెపితే దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు, నిర్వహించిన పాత్ర స్మరించని వ్యాసంగాని, పుస్తకం గాని వుండదు. అయితే కృష్ణశాస్త్రి గురించి, భావ కవిత్వ యుగం గురించీ విపులంగా తెలుసుకోదలచినవారికి అతి క్లుప్తంగా కొన్ని పుస్తకాలు సూచిస్తున్నాను.
అద్భుతమైన వ్యాసం. మళ్ళీ అందించిన సంచిక కి ధన్యవాదాలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కావ్య-3
మన సినిమాల్లో మహిళ- ప్రేమ
తెలంగాణ సాహిత్య సభల్లో పత్రసమర్పణ చేసిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
కాజాల్లాంటి బాజాలు-95: అపురూపమైన ప్రేమంటే ఇదా!..
విన్నవించుకోనా చిన్నకోరిక!?
మా బాల కథలు-8
మిర్చీ తో చర్చ-24: ప్రేమ – మిర్చీ… ఒకటే-6
స్వప్న వీధిలో…
లోకల్ క్లాసిక్స్ – 8: భూస్వామ్య మూషికం!
లోకల్ క్లాసిక్స్ – 53: తారతమ్యాల గ్లోబల్ మాయాబజార్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®