Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

క్రోధి ఉగాది

[2024 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘క్రోధి ఉగాది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

శుభకృత్ వెళ్ళిపోయింది
క్రోధి వచ్చేసింది వడిగా వేడిగా
క్రోధాన్ని మాపై చూపక
విరోధాన్ని అసలు పెంచక
అవధి లేని ఆనందాన్నివ్వు

పేరులోనే నీకు కోపమున్నా
నీ గుండెలో మాపై కరుణ ఉంది
వరుణ దేవునికి చెప్పి
చల్లని వాన కురిపించు
భూమాతను పలకరించు

మావి చిగురు తింటూ
కోయిల గానం చేస్తోంది
నిను రారమ్మని పిలుస్తోంది
కోపాన్ని వేసవి తాపాన్ని తగ్గించు

ఈ ఏడు పంటలు బాగా పండించు
రైతన్నలను ఓ కంట కని కనికరించు
నీది శీఘ్ర కోపమేలే మాకు తెలుసు
చప్పున చల్లారుతుంది చల్లబడుతుంది

ఓ క్రోధి నీవు కావు విరోధి
మా పాలిట పెన్నిధి అన్నది
నా మది నా గుండె చప్పుడాలకించు
జనుల కామనలు మన్నించు

Exit mobile version