Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కుంకబొద్దింక కథ

[సంచిక కోసం వికటకవి అందిస్తున్న వ్యంగ్య కథ ‘కుంకబొద్దింక కథ’]

‘కుంకబొద్దింక’కు కోపం వచ్చింది.

వెంటనే ‘బొద్దికంపు’ (కంప్యూటర్) ను దగ్గరకు లాక్కుంది.

“ప్రపంచ బొద్దింకలారా ఏకం కండి. బొద్దింకలంటే చిన్నచూపు పెరిగిపోయింది. అణుబాంబు పేలినా బ్రతకగలిగే ఏకైక జీవి బొద్దింకను మృత్యుంజయదేవుడని కొలిచి నెత్తిన పెట్టుకోవాల్సిన ప్రపంచం ‘గందీ నాలేకీ కీడా’లలో కలిపేసింది (మనం గందీ నాలే కీ కీడాలమే అయినా దొంగను దొంగ అంటే కోపం రాదా?). ఈ అవమానం సహించలేను. బొద్దింకల ఆత్మగౌరవం జిందాబాద్. బొద్దింకల వ్యతిరేకులూ నశించాలి.. నాతో ఏకీభవించేవారంతా మీ మద్దతు తెలపండి”

కంప్యూటర్ లో చకచకా టైప్ చేసి బొద్దిగ్రాం, బొద్దద్దర్, బొద్దిబుక్ లలో పోస్ట్ చేసింది బొద్దింక. అంతే కాదు, అంతకుముందే తాను ఏర్పాటు చేసుకున్న బొద్ది పేజ్‌లో బొమ్మ మార్చి.. ‘బొద్దిజం’ పేజ్ అని ప్రకటించింది.

వెంటనే ఎక్కడెక్కడో ఉన్న బొద్దింకలన్నీ సంఘీభావం ప్రకటించటం ప్రారంభించాయి. ముఖ్యంగా మనుషుల సమాజంలో ఉండి ‘బొద్దిరాజ్యం’ స్థాపించేందుకు మనుషుల రూపంలో ఉన్న బొద్దింకలన్నీ వెంటనే మద్దతు ప్రకటించేశాయి. “నేను బొద్దింక” అంటే “నేను బొద్దింక” అని మనుషులు, మానవజన్మ కన్నా ఉత్తమం బొద్దింక జన్మ అని భావిస్తున్నట్టు బొద్దింకలయిపోయేందుకు పోటీలు పడ్డారు.

క్షణ క్షణానికీ పెరిగిపోతున్న లైకులు, కామెంటులూ, సబ్‌స్రైబులూ చూస్తున్న కుంకబొద్దింక గర్వంగా తల తిప్పి ఆంటెన్నాలాడించింది.

ఇంతలో బొద్దిసెల్ మ్రోగింది.

“యెస్ బాస్” అంది.. బాస్ నుంచి ఫోను రాక చాలా ఏళ్ళయింది.

“రెస్పాన్స్ చూస్తున్నావా?” అడిగింది బొద్ది బాస్.

“చూస్తున్నాను. అందరికీ సింహంపై అసంతృప్తి ఉంది. ముఖ్యంగా మన బొద్దిజీవులలో అధికంగా ఉంది. హాయిగా, మురికినీళ్ళల్లో, బురద చీకట్లలో ఉండేవాళ్ళం. ఈ సింహం అంతా వెలుగుతో నింపేస్తున్నది. మన బ్రతుకు సూర్యరశ్మి చేస్తున్నది. మళ్ళీ మనకు చీకట్లు కావాలి. అందుకే కదా బాస్ మనమంతా చీకటి కోసం వెలుతురు పోవాలని పోరాటం చేసి చేసి పరాజయం పాలయి పాలయి చెల్లాచెదురయ్యాము. అయినా మన ప్రయత్నాలు మానలేదు. బోలెడన్ని బొద్దింకలను మనుషుల రూపంలో సమాజంలోకి చొప్పించాము. సమయం కోసం ఎదురుచూస్తున్నారు వారు. ఇంతకు ముందు ప్రయత్నాలన్నీ విఫలమవటంతో, ఏమీ చేయలేక, సింహం వెంట్రుకలో వెయ్యవవంతు భాగాన్ని కూడా తాకలేక విసుగుతో, కోపంతో ఆ పోస్టు పెట్టాను. మన బొద్దింకలు ఎగిరిగంతులేసి, రెక్కలూపుతున్నాయి. ఆంటేన్నాలాడిస్తున్నాయి” సంతోషంగా చెప్పింది బొద్దింక.

“నీకొస్తున్న రెస్పాన్స్ చూసి మన నక్క, తోడేళ్ళ సంకీర్ణ గుంపు ఈసారి నిన్నే మన పోరాటానికి చిహ్నం చేయాలని నిశ్చయించింది”.

“అంతకన్నానా!!!” ఉబ్బితబ్బిబ్బయి బోర్లాపడి, కాళ్ళూపుతూ అంది కుంకబొద్దింక.

“ఇంకేం ‘కుంకబొద్దింక’ పార్టీ ఆరంభించు” ఆజ్ఞలందుకుంది బొద్దింక..

***

ప్రపంచమంతా సంచలనంతో నిండి పోయింది.

‘కుంకబొద్దింక పార్టీ’ ఆవిర్భావం తుఫాను సృష్టించింది.

ప్రపంచంలోని బొద్దింకలన్నీ, ఎక్కడేక్కడో, ఎన్నెన్నో రూపాల్లో, చీకటి మూలల్లో, బాత్రూముల్లోని తూముల్లో, చెత్తకుప్పల్లోని చెత్తపొరల్లో, పెంటకుప్పల్లోని ఎండిన పెంటపొరల నడుమ, మురిక్కాలువల్లో మురికి అంచున, చీకటి మూలల్లో చీకట్లలో నక్కినక్కి ఉన్న బొద్దింకలన్నీ “వచ్చేసిందీ, మన సామ్రాజ్యం వచ్చేసిందీ, మళ్ళీ చీకటి రోజులు వచ్చేశాయి, చీకటిరాజ్యం వచ్చేసిందీ” అని అరుస్తూ, పొర్లుతూ, దొర్లుతూ బిలబిలబిల బిలాలన్నీ వదిలి ఇలాతలానికి రావటం ఆరంభమయింది.

పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతు నిస్తున్న బొద్దింకలను చూడగానే చీకటి చానెళ్ళ చాటుమాటు హృదయాలన్నీ చీకట్ల ఆశలతో మెరిసిపోయాయి.

“ఇంకేముంది చీకటి ప్రపంచం వచ్చేసింది. పురుగు, పుట్ర, నలుగు, నట్ర, కీటకాలు, చీమ,దోమ,తేలు,నల్లి,మిడత,తేనెటీగ, కందిరీగ, బల్లి, మిణుగురు పురుగు, గొంగళి పురుగు, ఈగ, పండు ఈగ, సీతాకోకచిలుక, చిమ్మెట పురుగు,పేనుబంక, పిండి నల్లి, తెల్ల దోమ, తామర పురుగులు, పచ్చ దోమ, ఎర్ర నల్లి, వేరు పురుగు, కాండం తొలుచు పురుగు, కాయ తొలుచు పురుగు,పెంకు పురుగు, చెదపురుగులు, నులి పురుగులు, పురుగులు, పురుగులు, పరాన్నజీవులు ఇలాంటివెన్నెన్నో “నేనే బొద్దింక” అంటూ  మద్దతిస్తున్న కుంకబొద్దిదే గెలుపు.. సింహం గింహం జాన్తానై, సింహం పనయిపోయింది” రాత్రింబవళ్ళు బొద్దింక మనుషులు, మనిషిబొద్దింకలతో, చానెళ్ళన్నీ చర్చలతో, చర్చోపచర్చలతో “సింహం పనయిపోయింది. కుంకబొద్దింకకున్న మద్దతు సింహానికి లేద”ని ప్రచారం హోరును జోరున పెంచాయి.

“ఇంకేం బొద్దింక రాజ్యం వచ్చేసింద”ని బొద్దింకలు ఇతర పురుగులు సంబరాలు ఆరంభించాయి. “బొద్దింకతో ఆవంక నూతన పొద్దింక” అని బొద్దికవులు కవిత్వాలారంభించేశారు.

మరోవైపు పురుగుల మద్దతు చూసిన నక్కలు, తోడేళ్ళు సింహం గద్దె దిగిన తరువాత కుంకబొద్దింకనే వంక వాగులడొంకలో దించాలో చర్చించసాగాయి.

“విప్లవం వర్ధిల్లాలి. సింహం ఛోడ్ ఛోడ్ గద్ది ఛోడ్.. భాగో సింహం భాగో.. భగావో, వీధిమే లాకే కొట్టెయ్యవో..” అని అరుస్తూ బొద్దింకల గుంపు వీధుల్లోకి వచ్చేసేందుకు సిద్ధమయిపోయింది.

మరోవైపు తోడేళ్ళు, నక్కలు అధికారం లాగేసుకునేందుకు సిద్ధమైపోయాయి.

బొద్దింకలు, ఇతర పురుగులు, కీటకాలు విప్లవం లేవదీయటమే తరువాయి..

***

బాత్రూము తూముపైనున్న సన్నని రంధ్రాల జాలీనుంచి ఒక్కొక్క బొద్దింక దూరి బయటకు రావటం మొదలయింది.

ఇంతలో హఠాత్తుగా బాత్రూంలో లైట్ వెలిగింది. లైటు వెలగగానే అలవాటు ప్రకారం చీకటి మూలవైపు పరుగెత్తాయి బొద్దింకలు..

“అమ్మా బొద్దింకలే!” అరిచింది పాప.

“ఈ బొద్దింకలతో చచ్చే ఛావొచ్చింది. ఎంత శుభ్రంగా వుంచినా ఏదో ఒక మూలనుంచి వస్తూనే ఉంటాయి” తిట్టుకుంటూ ‘హిట్’ పట్టుకుని అమ్మ వచ్చింది.

“ఎక్కడే బొద్దింక. ఇంత పెద్దమనిషివి, బొద్దింకని చూసి భయపడతావా?” పాపని తిట్టి, బొద్దింకలు దాక్కున్న చీకటి నీడలోకి ‘హిట్’ హిట్టింది.

అంతలో ఆమె కళ్ళు చిన్నవయ్యాయి.

ఇంకొన్ని బొద్దింకలు జాలీ సందుల్లోంచి దూరి రాబోతున్నాయి.

“ఇన్ని బొద్దింకలున్నాయేమిటిక్కడ?” అనుకుంది. “ఏమండీ.. ఒకసారి ఇలారండి” అరిచింది.

“ఎహె.. ప్రశాంతంగా సినిమా చూడనియ్యవు. ధురంధర్ చూస్తున్నాను డిస్టర్బ్ చేయద్దన్నానా?” విసుక్కుంటూ వచ్చాడతడు. ఆమె బొద్దింకలను చూపించింది.

అతడు కోపం పట్టలేకపోయాడు.

“ఈ బొద్దింకల కోసమా సినిమా నుంచి డిస్టర్బ్ చేసింది?”

కోపంగా బొద్దింకల దారికి అడ్డుగా ఉన్న జాలీ పీకాడు. క్రిందంతా బొద్దింకలు కనిపించాయి, లుకలుకలాడుతూ..

“ఇన్నిక్కడ చేరాయేమిటి? బాత్రూంను శుభ్రంగా ఉంచమంటే వినరు” విసుక్కుని, భార్య ముఖంలో కోపం చూసి, మొదటికే మోసం వచ్చేట్టుందని గ్రహించి, “బొద్దింకల సినిమా హీరో ఏదయినా మీటింగ్ పెట్టాడా?” తన విట్టుకి తానే నవ్వుకుంటూ భార్య చేతిలోంచి హిట్ లాక్కుని, ధురంధర్ తుపాకీ ఎక్కుపెట్టినట్టు, బొద్దింకలవైపు హిట్ ఎక్కుపెట్టాడు.

***

‘ఛట్’ చెప్పుతో కనబడ్డ బొద్దింకలను కొట్టిందామె.

“ఛావు” చీపురుతో కసితీరా కనబడ్డ బొద్దింకనల్లా కొట్టిందామె.

“ఛట్”, “ఫట్”, ఛట్ ఫట్”, “ఛట్ఛట్ ఫట్ఫట్”, “చట్ఛట్ఛట్ ఫ్ట్ఫ్ట్ఫట్ఫట్”, “ఛట్ట్చప్ట్ఛట్ఫట్ఛట్ఫట్ఛట్.”….

ఒకరు చెప్పుతో.. ఒకరు చీపురుతో.. ఒకరు హిట్ తో.. మరొకరు..

***

“ఏమైంది విప్లవం?” నక్క తోడేలునడిగింది.

“బొద్దినెట్ లో సూపర్ సక్సెస్.. కానీ విప్లవంలో ‘హిట్’ వికెట్” విషాదంగా చెప్పింది తోడేలు.

“మన కుంకబొద్ది ఏమయ్యాడు?”

“వాడేమవుతాడు. వాడు ఖండాంతరంలో హాయిగా ఉన్నాడు. కొన్ని రోజులు కనబడడు. మనవైపు బొద్దింకలు బోలెడన్ని చచ్చాయి. బయటకొచ్చినవి బయటకొచ్చినట్టు, బయటకు వస్తున్నవి వస్తున్నట్టు చచ్చాయి. ఇంకామిగిలని మళ్ళీ చీకటి ముసుగులోకి జారుకున్నాయి.  మళ్ళీ అనుకూల పరిస్థితులొచ్చినప్పుడు, ఈ సారి బొద్దింక కాదు, జెర్రి వేషం వేస్తాడు. మనవైపు ఆకర్షితులయ్యే వాళ్ళంతా భూమి లోపల చీకటి కలుగుల్లో ఉండేవాళ్ళే కదా! అతలవితలసుతలతలాతల్ సూర్యకాంతిసోకని తలాలన్నీ మనవేకదా!” అంది తోడేలు.. మళ్ళీ విప్లవానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు పథకాలు వేస్తూ.

***

అధోలోకంలో జరుగుతున్న అధమ డ్రామా ఏమాత్రం తెలియని సింహం హాయిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నది.

ప్రజలు తమాషా చూస్తూన్నారు. ‘మనుషులందు బొద్దింక మనుషులు వేరయా’ అని అర్ధం చేసుకుంటున్నారు.

Exit mobile version