అయోధ్యా నగరానికి సమీపంలో వున్న పల్లెలో లోహజంగుడనే అతి బీద బ్రాహ్మణుడు వుండేవాడు. అతనికి ఉపనయనం చేయించి యాచకత్వం చేసుకోమని వదిలేసారు వృద్ధులైన అతని తల్లిదండ్రులు. ఎనిమిదవ ఏట మేనమామ అయిన పాపానికి పిల్ల నిచ్చిన పెద్దమనిషి, ఇతనికి నాలుగు అక్షరాలు నేర్పించి, వేద పాఠశాలలో అయినా వేద్దామని చూస్తే, ఇతని నాలిక తాటి మట్టలా వుందనీ, తిరగదనీ, ఇతను ఎందుకూ పనికి రాడనీ, యాచకత్వం చేసుకోమని గురువులు సలహా ఇచ్చారు. కరువు కాలం.. యాచించినా నాలుగు గింజలు పుట్టడం దుర్లభంగా వుంది! ఇంట్లో భార్యా పిల్లలు పస్తులుంటున్నారు. ఒకనాడు ఏ పనీ చెయ్యకుండా వీధి అరుగు మీద కూర్చుని ఏదో కూనిరాగం తీస్తున్న భర్తని, భార్య చంపక కోపంగా, విదిలిస్తూ “ఏ మంత్రమూ రాదు ఆ నాలికకి… కనీసం నారాయణ.. నారాయణ.. అని శ్రీమన్నారాయణుని అయినా తలచుకో.. నారాయణ మంత్రాన్ని మించినది లేదని పెద్దలు చెప్తారు” అంది.
లోహజంగుడు “నారాయణ.. నారాయణ” అని పది పన్నెండు సార్లు అనిన వెంటనే నిద్ర వచ్చేసింది. దరిద్రుడికి ఆకలెక్కువా.. సోమరికి నిద్రెక్కువా అన్న చందాన.. లోహజంగుడు నిద్ర లోనికి జారిపోయాడు.
కానీ నారాయణ మంత్రం మహిమాన్వితం కదా!
అతనికి స్వప్నంలో “లోహజంగా” అని పిలుస్తూ, ఎవరో భుజం తట్టి నిద్ర లేపారు. మెలుకువ రాగానే, “ఎవరయ్యా.. బంగారం వంటి నిద్ర చెడగొట్టావూ?” అని విసుక్కున్నాడు. ఆ బ్రాహ్మణుడి ఎదురుగా, పద్మనేత్రుడు, ఎగు భుజములు కలవాడు, శంఖు చక్రాదులని దాల్చిన అతి సుందరుడు, జగన్మోహన స్వరూపం సాక్షాత్ శ్రీమహా విష్ణువు కనిపించాడు. “స్వామీ” అన్నాడు తడబడుతూ చేతులు జోడించి లోహజంగుడు. “పిలిచావుగా? వచ్చాను” అన్నాడు నారాయణుడు! లోహజంగుడు తల గోక్కుని, “నారాయణ మంత్రమైనా పఠించు అన్నది నా భార్య. ఈ మంత్రం తేలికగా వున్నదని జపించాను.. కాని నువ్విలా వచ్చేస్తావని, నా భార్య చంపక చెప్పలేదు.. ఇప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలీడం లేదు. చంపకని నిద్ర లేపనా?” అని అడిగాడు లోహజంగుడు.
శ్రీమన్నారాయణుడు నవ్వి “నీకు దరిద్రం నుండి విముక్తి కావాలి.. అంటే అంతులేని సంపదలు అడగాలి.. అవి నీకు నేను కాదు, నన్ను అమితంగా పూజించే, నా భక్తుడు ఇస్తాడు. అతని పేరు విభీషణుడు.. అతని దగ్గరకు వెళ్ళు” అన్నాడు.
లోహజంగుడు శ్రీమహా విష్ణువు రెండు కాళ్ళూ పట్టుకుని “అతను ఎవరు? ఎక్కడుంటాడు స్వామీ?” అని అడిగాడు.
“సముద్రానికి ఆవల నున్న లంకా నగరంలో వుంటాడు అతను.. అతని అన్న లంకాధీశుడు.. రావణ బ్రహ్మ” అన్నాడు.
“సముద్రానికి ఆవలా? చచ్చాం.. ఈ పల్లెలో వున్న పిల్ల కాలువే నేను బల్లకట్టు మీద తప్ప దాటలేను, కనీసం సంసార జలధినే కాదు, నిజమైన నీటిలో కూడా ఈదడం రాని వాడ్ని, అంతటి సముద్రాన్ని దాటి ఆవలి వైపుకి ఎలా చేరుకోగలను నారాయాణా? నాతో మేలమాడ్తున్నావా? ఊళ్ళో పిల్ల మూకంతా నన్ను ‘దరిద్ర నారాయణా’ అని హేళన చేసి పరిగెడ్తుంటారు.. నువ్వూ ఆ చందంగానే నన్ను పరిహసించుచుంటివా స్వామీ?” అన్నాడు చిన్నబోయిన వదనంలో..
“నీ దగ్గర అన్ని సాగరాలనీ దాటించే మహత్తు కల మంత్రం వుంది! ఏ మంత్రం పఠించి, నన్ను ఈ వేళలో చరాచర జగత్తులోని కార్యాలన్నింటినీ త్యజించి నీ వద్దకు వచ్చేటట్లు చేసావో.. ఆ మంత్రమే నిన్ను ఆ మహా సముద్రాన్ని దాటించగలదు..” అని అంతర్ధానమయ్యాడు శ్రీమహా విష్ణువు.
లోహజంగుడు “నారాయణా.. నారాయణా” అని పిలుస్తూ చుట్టూ చూసాడు. ఎదురుగా భార్య చింకి పాతతో కూర్చుని, నోరంతా ఆశ్చర్యంగా తెరిచి, “ఏమిటా కేకలు? కలేమైనా కన్నావా? ఏం?” అన్నది.
పిల్లలు నిద్రలోనే ఆకలికి ఏడుస్తున్నారు. ఎండి డొక్కకి అంటుకుపోయిన వారి పొట్టలను చూసాడు లోహజంగుడు.
“నారాయణ.. పోయి వస్తా” అని లేచి, పై బట్ట కప్పుకున్నాదు.
“ఎక్కడికీ?” అడిగింది చంపక.
“లంకా నగరానికి”
“అది ఎక్కడున్నదీ?”
“సముద్రానికి ఆవల వైపున” అని బయల్దేరాడు.
“ఇదెక్కడి చోద్యం? వాగు దాటలేని నువ్వు మహాసముద్రాన్ని దాటుతావా? నీ వల్ల అవుతుందేం?” అని ఎన్నో ప్రశ్నలు వేస్తున్న ఆమెతో “చూడు.. అంతులేని సంపద తోనే తిరిగొస్త్తా.. నువ్వూ పిల్లలూ ఇక చింకి పాతలు కట్టుకుని, ఈ పూరి పాకలో పస్తులుండ నవసరం లేదు” అని “నారాయణ.. నారాయణ” అని పఠిస్తూ వెనుతిరిగి చూడకుండా బయల్దేరాడు. రొప్పొచ్చినా మంత్రాన్ని పఠించడం ఆపలేదు.. అలా మూడు రాత్రులూ, రెండు పగళ్ళూ నారాయణ మంత్ర మహిమ వల్ల ఆకలి దప్పులు మరిచి, నడిచి సముద్ర తీరాన్ని చేరాడు. చుట్టూ కారడవి. అసలే కారు చీకటి, ఆపై కారుమబ్బులు అలముకున్నాయి.. దట్టమైన ఆ అడవి ప్రాంతంలో, కుంభవృష్టి కురవ నారంభించింది. పక్షులు గూళ్ళు చేరుతున్నాయి. పులులూ, సింహాలు వంటి క్రూరమృగాలు సైతం, తమ నివాసాలకి వేగంగా చేరుకుంటున్నాయి.. అతి భీకరమైన వాటి ఘోషలు, లోహజంగుడికి వినిపించుట లేదు. అతను “నారాయణ.. నారాయణ.. నన్నీ సముద్రాన్ని దాటించు.. అది నీ వల్లనే అవుతుంది” అని పదే పదే గొణుగుతూ ఒక గుహలోకి వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అది నిజానికి అతను అనుకున్నట్లు గుహ కాదు, ఒక తోడేలు చీల్చి తినగా మిగిలిన ఏనుగు కళేబరం, దాని ప్రేవులు చీల్చి తోడేలు తినడం వలన ఆ పొట్ట భాగంలో ఖాళీ ఏర్పడింది. మన లోహజంగుడు అందులోనే తల దాచుకుని, నారాయణ మంత్రాన్ని పఠిస్తున్నాడు. అతను అలా కళ్ళు మూసుకుని పఠిస్తు నిద్రలోకి జారుకున్నాడు. ఆ వర్షం ధారల వల్ల, అతను తల దాచుకున్న ఏనుగు కళేబరం, ప్రవాహంలో కొట్టుకుని పోయి సముద్రంలో పడి ప్రయాణం సాగించింది. లోహజంగుడు స్పృహ తప్పి, ఎన్ని పగళ్ళూ, రాత్రుళ్ళూ అలా ప్రయాణించాడో అతనికే తెలీదు!
కొంత కాలానికి లోహజంగుడికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిస్తే, వెలుతురు కళ్ళల్లో పడిండి. అతను తనో సొరంగంలో చిక్కుకున్నాడు అని తలచి అందులో నుండి బయటపడడానికి ఒంట్లోకి శక్తిని కూడగట్టుకుని, ‘నారాయణ’ మంత్రం పఠిస్తూనే, పైకి రావడానికి ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కాలేదు. కారణం ఏమన, అతను ఆ ఏనుగు కళేబరం యొక్క వెనుక భాగంలో పిరుదుల మధ్యన ఇరుక్కుపోయి వున్నాడు. చచ్చిన దాని కళేబరం నీలుక్కుపోయి, ఏ మాత్రం అతని శక్తి అందుగుండా బయటపడడానికి సరిపోవట్లేదు! అతను “నారాయణ.. నారాయణ నీదే భారం స్వామీ” అని ఎలుగెత్తి అరిచాడు. చిత్రంగా ఆ కేక విన్నట్లుగా, ఆకాశంలో సంచరించే గద్ద ఒకటి అమాంతం క్రిందకి వచ్చి, నీటిలో తేలుతున్న ఆ ఏనుగు కళేబరాన్ని తన ముక్కుతో అదే పనిగా పొడిచింది.
లోహజంగుడికి మార్గం ఏర్పడింది. అతను “నారాయణ.. నారాయణ” అంటూ, రెండు చేతులతో దారి ఏర్పచుకుంటూ, ఆ చచ్చిన ఏనుగు కళేబరం నుంది బయటకు రా ప్రయత్నించాడు.
ఆ తీరం, లంకానగరం సమీపంలోని సముద్ర తీరం. విభీషణుడి కోట మీద అంబుడూ, అనింబుడూ అన్న రక్షక భటులు కావలి కాస్తున్నారు.
పెద్దగా కేకపెట్టి, “అంబూ.. అటు చూడు విచిత్రం” అన్నాడు అనింబుడు. అంబుడు కూడా అతను చూపెట్టిన దిశగా చూసి, నోరు వెళ్ళబెట్టాడు! సముద్ర తీరానా, ఏనుగు కళేబరం, దాని వెనుక భాగం నుంచీ ఒక మానవ శరీరం తన్నుకుంటూ, కష్టం మీద బయటకి రావడం కనిపించింది.
అనింబుడు “నేను చూస్తున్నది మాయ కాదు కదా! ఏనుగేవిటి? ఒక మానవాకారాన్ని ప్రసవించడం ఏమిటీ?” అని అంబుడ్ని అడిగాడు.
అంబుడు వెంటనే “మాయ కాదు వాస్తవం! నేనూ అదే చూసాను. ఏనుగు ఒక మనిషిని ప్రసవించింది.” అన్నాడు.
“పద.. పద.. వాడిని పట్టుకుందాం” అన్నాడు అనింబుడు.
ఆకలితో అలమటిస్తూ, ఒడలంతా నొచ్చి, శక్తిహీనుడైన లోహజంగుడు “నారాయణ.. నారాయణ” అంటూ కళ్ళని పొడుస్తున్న వెలుగు కిరణాలకి అరచేతిని అడ్డం పెట్టుకుని, ధగధగాయమానంగా వెలుగులు విరాజిల్లుతున్న, బంగారు కోటనీ, అందులో పొదగబడిన వజ్ర వైఢూర్య మణుల కాంతి వలయాలకీ విస్మయం చెందుతూ కోటని చూస్తుండగా, అంబుడూ, అనింబుడూ అతన్ని సమీపించారు.
భయంకరమైన కొమ్ములూ, కోరలతో రాక్షసాకారులూ, ఆయుధపాణులూ అయిన ఆ రాక్షసుల విగ్రహాలని చూసి లోహజంగుడు భయంతో “నారాయణ.. నారాయణ” అని అరిచాడు.
“జై రావణ, జై జై రావణ” అని వారు ఉగ్రంగా అరిచారు.
“అయ్యా! నన్ను వదిలి పెట్టండి. నేనో పేద బ్రాహ్మణుడిని” అని లోహజంగుడు చెప్తుండగానే అంబుడు అతన్ని వడిసి పట్టుకుని “ఈ మానవుడిని భుజిద్దాం.. రుచిగా వుంటుందీ మాంసం అనిపిస్తోంది” అన్నాడు నాలుక చప్పరిస్తూ.
లోహజంగుడు ఇంకా గట్టిగా “నారాయణ” అంటూ భయంతో ఆర్తనాదాలు చేసాడు.
అనింబుడు, అంబుడ్ని వారిస్తూ, “వీడు ఏనుగు నుండి పుట్టడం ఒక విచిత్రం.. మనిషో, మాయావో! ఇతన్ని మన ప్రభువు దగ్గరకి తీసుకుని వెళ్దాం. ప్రభువులు ఏం చెప్తారో చూద్దాం” అన్నాడు.
అంబుడు సరేనని లోహజంగుడ్ని ఈడ్చుకుంటూ విభీషణుడి కొలువుకి తీసుకెళ్ళారు.
ఆ సమయంలో విభీషణుడు శయనాగారంలో మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతని రాజమందిరం అద్భుత మణిమయ విరచితంగాను, అనేకానేక కళారూపాల సంపదలతోనూ అలరారుతోంది. రావణుడు రాజైనప్పటికీ, విభీషణుడికి రాజ్యమందు విశేషమగు అధికారము కల్గి, అడుగడుగునా సేవకులతో, గజ తురగ వాహనాదులతో అలరారుతోంది అతని కోట!
రసాస్వాదనలో మునిగి తేలుతున్న విభీషణుడికి, “రక్షించండి.. రక్షించండి.. వదలండి” అన్న భయంతో కూడిన ఆర్తనాదాలు వినిపించి, అతని ఏకాగ్రతని చెడగొట్టగా, “ఎవరక్కడ?” అని అరిచాడు.
ద్వారపాలకులు వెళ్ళి చూసొచ్చి, భూమిని తలలు తాకుతు వుండగా, వినమ్రంగా వందనం చేస్తూ.. “స్వామీ, భటులు ఎవరో ఒక వింత ఆకారాన్ని పట్టి బంధించి తెచ్చారు, ప్రభువుల దర్శనార్థం” అన్నారు.
“ఈ సమయమందా?” అని విభీషణుడు లేచి, వారిని వెంట పెట్టుకుని బయటకి వచ్చాడు.
భటుల చేతిలో గిల గిల తన్నుకుంటున్న ఒక మానవుడూ, అతన్ని ఏ నిమిషమైనా కబళించేట్టున్న భటులూ కనిపించారు.
“ఎవరు ఈతడు?” అన్న విభీషణుడి ప్రశ్నకి, భటులు అతన్ని వదిలి, వినయంగా ఒంగి ప్రణామాలు చేస్తూ, “ప్రభూ! ఇతనికి ఒక ఏనుగు జన్మ నివ్వడం మేం కళ్లారా చూసాం.. ఆ వింత మీ చెవిన వెయ్యాలని తీసుకొచ్చాం” అన్నారు.
లోహజంగుడు రెండు చేతులూ వూపుతూ, “ఏనుగు జన్మనివ్వడం ఏమిటీ? నేను నా తల్లి తండ్రులకే జన్మించాను. నారాయణ మంత్ర ప్రభావం వలన ఆ మహా సాగరాన్ని దాటడానికి ఆ ఏనుగు యొక్క కళేబరం నాకు సాయపడింది.. నేను దాని లోంచి రావడం చూసి మీ భటులు అపార్థం చేసుకున్నట్లున్నారు” అన్నాడు.
భటులు తలలు తడుముకున్నారు, అయోమయంగా. విభీషణుడికి నవ్వూ, విస్మయం రెండూ కలిగాయి.
“అసలు మీరెవరు? ఎందుకు సముద్రం దాటి వచ్చినట్లూ?” అని అడిగాడు.
“నేనొక చదువు రాని, ఏ కళలూ ఒంటబట్టని బీద బ్రాహ్మడిని. అయోధ్యా నగర సమీపంలోని పల్లె నుండి, విభీషణుడిని కలవగోరి వచ్చాను. నాకు ఆ మహానుభావుల దర్శనం కావాలి” అన్నాడు.
విభీషణుడు ఈ సారి మరింత ఆశ్చర్యపోయాడు. “నేనే ఆ విభీషణుడిని.. నన్ను కలవమని ఎవరు పంపారు?” అన్నాడు
వెంటనే బ్రాహ్మణుడు నేల మీద సాష్టాంగపడి “ప్రణామములు… సాక్షాత్ శ్రీమహావిష్ణువు నా స్వప్నంలో కనిపించి ‘నీ దరిద్రం తొలగాలంటే, నా భక్తుడైన విభీషణుడిని కలవ’మన్నాడు. నేను ఎక్కడో సముద్రం ఆవలి తీరాన వున్న వారిని ఎలా కలవాలి అంటే, ‘నారాయణ’ మంత్రానికి అంతటి శక్తి వుందనీ, ఆ మంత్రమే నన్ను మీ వద్దకు చేర్చగలదని చెప్పి, స్వామి నా స్వప్నంలో అంతర్ధాన మయ్యారు. అచ్చం అలాగే జరిగింది ప్రభూ!” అన్నాడు ఆనందంగా లోహజంగుడు.
విభీషణుడు అతను చెప్పింది మొత్తం వినగానే, తనే చేతులు జోడించి, లోహజంగుడి ముందు సాష్టాంగపడి, “ఎవరు? సాక్షాత్ ఆ శ్రీమహా విష్ణువు.. నారాయణుడు.. నా పేరు చెప్పి, నా స్వామి, నా దగ్గరకు పంపించాడా? ఎంతటి ధన్యుడివయ్యా? ఎంతటి తపశ్శక్తి సుసంపన్నుడి వయ్యా? కలలోనైనా ఆ స్వామిని దర్శించగలిగావు! నాకెన్నడు కలుగుతుందో ఆ భాగ్యం?” అన్నాడు.
“తథాస్తు.. త్వరలోనే కలుగుతుంది, నారాయణ మంత్రాన్ని వదలకుండా పఠిస్తుంటే” అన్నాడు లోహజంగుడు.
అప్పుడు విభీషణుడు అతనికి సకల ఉపచారాలూ చేసి, భోజనం, మంచి వస్త్రాలు ఇచ్చి, ఒక నౌక నిండా అంతులేని సంపద, మణులూ, వజ్రాలు, బంగారు నాణేలు కల భాండాలతో నింపి, సాదరంగా అతనిని వెనక్కి పంపాడు.
అది మొదలు విభీషణుడికి అనునిత్యం నారాయణ మంత్రం నాలిక చివరనే ఆడసాగింది. ‘నాకెన్నడో ఆ జగన్మోహనుడి దర్శనం’ అని అనుకోసాగాడు.
లోహజంగుడినీ, అతను తెచ్చిన సంపదను మోసుకొస్తున్న సేవకులను చూసి, అతని భార్య చంపకా, ఊర్లోని వారు, చుట్టపక్కాలూ ఆశ్చర్యపోయారు. అతని ఖ్యాతి పట్టణం అంతా పాకింది. ప్రజలు తండోపతండాలుగా చూడవచ్చారు. అందరికీ లోహజంగుడు “నిండు మనసుతో, దృఢ విశ్వాసంతో నారాయణ మంత్రాన్ని జపించండి.. మహత్యాలు జరుగుతాయి” అని బోధించడంతో, అతన్ని దరిద్ర నారాయణుడు అన్నవారే, ‘నారాయణ మంత్ర తీర్థులు’ అని సేవించసాగారు.
***
కొన్ని ఏళ్ళకి విభీషణుడికి శ్రీమహా విష్ణువు అవతారమైన ‘శ్రీరాముని’ దర్శనం లభిస్తుందని ఆనాడు అనుకోలేదు!
దుర్బేధ్యమైన తన లంకా నగరం.. దాన్ని కావలి కాస్తున్న లంకిణీ, మొదలగు శక్తిశాలురైన రాక్షసులూ, అమిత పరాక్రమశాలురైన సోదరులూ, తన అనంతమైన శక్తి సేనా.., తన బలం.. ఇవన్నీ చూసుకుని, విర్రవీగుతూ, సీతామాతని అపహరించి తెచ్చిన అన్నగారు “ఆ శ్రీరాముడి తరమా? ఈ సముద్రాన్ని దాటి తన సేనతో వచ్చి దాడి చేసి సీతని నా నుంచి గెలిచి, తీసుకుపోవడం?” అని అహం తలకెక్కి వికటాట్టహాసంతో వదరుచుండగా, తమ్ముడైన విభీషణుడు చెప్పాడు..
“అన్నా.. సాధ్యమే… రాముడు అంటే ఎవరు? సాక్షాత్ ఆ శ్రీహరి స్వరూపం.. మహా విష్ణువు అవతారం.. కేవలం ‘నా..రా..య..ణ’ అనే నాలుగక్షరాల అతని నామం పలకడం వల్ల, ఒక బక్కచిక్కిన బ్రాహ్మడు, చచ్చిన ఏనుగు సాయంతో, ఈ మహాసముద్రాన్ని దాటి, మన రాజ్యానికి నిర్విఘ్నంగా రాగలిగాడు.. ఇక సాక్షాత్ శ్రీరామచంద్రుడికి.. అతనే రాదలుచుకుంటే ఒక అడ్డా? అతను రావడమే కాదు, అతని సేనలొచ్చి నీ రాజ్యం అంతా ఆక్రమిస్తాయి. పతనం చేస్తాయి. శ్రీరాముడినీ, అతని నామ మహిమని ఎరిగిన వాడిగా చెప్తున్నాను.. అన్నా.. లంకకి చేటు రానున్నది.. నా మాట విను.. సీతను విడిచిపెట్టు.. శ్రీరాముని శరణు కోరు!” అన్నాడు
“శ్రీరామ.. శ్రీరామ.. అంత మహిమ కలదా ఆ నామం? ఏదీ అయితే రమ్మను.. చూస్తాను” అన్నాడు రెచ్చిపోయిన రావణాసురుడు.
ఆ శ్రీరామ నామ జప ఫలితమే.. ఆ దానవ జన్మ నుండి శ్రీమన్నారాయణుడి చేతిలో విముక్తి నొందాడు రావణ బ్రహ్మ! అతని కోరిక నెరవేరింది!
నారాయణ మంత్రానికీ, రామ నామ జపానికి అంతటి శక్తి కలదు! శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు!
శుభం
రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. ‘కాలమ్ దాటని కబుర్లు’ అనే పుస్తకం, ‘రేపల్లెలో రాధ’, ‘ఎవరే అతగాడు’, ‘అనూహ్య’, ‘ఖజూరహో’, ‘ఆ ఒక్కటి అడిగేసెయ్’ వంటి నవలలు వెలువరించారు.
“లోహజంగుడు ” కథ నచ్చింది. “నారాయణ..నారాయణ..” అంటూ శ్రీ మహా విష్ణువు గొప్పతనాన్ని స్మరించుకుంటూ చక్కని కథని అందించిన మీకు అభినందనలు సవినయంగా తెలియజేస్తున్నాం. _గొర్రెపాటి శ్రీను.
Anthaa Sri Raamaanugraham..dhanyavaadaalu🙏
లోహజంగుని కథ ద్వారా నారాయణుని నామ మహాత్యం తెలియజేసారు.. చక్కని సందేశాన్ని అందించారు. కథా గమనం అద్భుతం. అభినందనలు మా ప్రియ రమణీ మేడం. – మీ లలిత చిట్టే..🌹
Jai Sriram..niku subhaalu kalagaali..Lilly..thanks
Narayana naamamrutham adbhutham Ramani garu
Thanks Kalavathi garu🙏
నారాయణ మంత్ర మహిమని తెలియజెప్పిన అద్భుతమైన కథ,కథనం.
Thanks Annapurnagaru
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
తెలుగు, ఆంగ్ల సాహిత్య కుసుమాలు జీవన సౌరభాలు
యువభారతి వారి ‘కుందుర్తి కవితా వైభవం’ – పరిచయం
సినిమా క్విజ్-56
నూతన పదసంచిక-80
కథా సోపానములు-9
సినిమా క్విజ్-61
కల్పిత బేతాళ కథ-2 ఓటమిలో విజయం
మా బాల కథలు-7
తెలుగుజాతికి ‘భూషణాలు’-29
అమృత్ రసగుల్లా హౌజ్..
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®