ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి బాలల కోసం రచించిన 22 కథలతో రూపొందిన పుస్తకం ‘మా బాల కథలు’. ఇది రచయిత్రి 20వ పుస్తకం. పిల్లల కోసం రాసినవి కాబట్టి ఇవి బాల కథలైనా, ఇందులోని ప్రధాన పాత్ర పేరు ‘బాల’ కాబట్టి కూడా ఇవి ‘బాల కథలు’. ఈ కథలన్నీ సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమైనవే.
“ఈ సంపుటిలో చాలా కథలున్నాయి. ఏ విషయంలోనైనా పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి అనే అంశం ఈ కథల్లో ప్రతిఫలిస్తుంది” అని అన్నారు డా. ముక్తేవి భారతి.
“బాల సాహిత్యం రాయాలంటే, బాలల మనస్తత్వాలను బాగా ఆకళింపు చేసుకుని వుండాలి. రచనల్లో సరళత్వం వుండాలి. సంక్షిప్తత మరీ ముఖ్యం. ఆకెళ్ళ గారు చేయి తిరిగిన రచయిత్రి గనుక చక్కగా ‘మా బాల కథల్ని’ తీర్చిదిద్దారు” అని ముందుమాటలో వ్యాఖ్యానించారు డా. గంగిశెట్టి శివకుమార్.
~
బాల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పారు రచయిత్రి.
నానమ్మ పట్టరాని కోపంతో ఊగిపోతుంది. ఇంట్లో అందరూ భయపడిపోతుంటారు. విషయం తెలుసుకున్న బాల ఓ చిట్కా చెప్పి నానమ్మతో సహా అందరినీ నవ్విస్తుంది ‘వడ్లు ఒలిచేద్దాం’ కథలో.
నానమ్మతో గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది బాల. పెరట్లోని పువ్వులు కోసుకురమ్మని చెబుతుంది నానమ్మ. పెరటి తోటలో ఉన్న పూల మొక్కల నుంచి రకరకాల పూలు కోస్తుంది బాల. కానీ నానమ్మ వచ్చి సజ్జలో ఏం పూలు ఉన్నాయో చూసి విస్తుపోతుంది. కోసిన పూలన్నీ బాల ఏం చేసింది, సజ్జలో ఏ పూలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ‘బాల మనసు..’ కథ చదవాలి.
సెలవలకి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి తల్లి శాంతతో కలిసి రైల్లో బయల్దేరుతుంది బాల. బయటి ఆహార పదార్థాలు తింటే అనారోగ్యమని ప్రయాణాల్లో ఏమీ కొనదు శాంత. బాల ఏదైనా కొనమంటే, డబ్బులు లేవని ఎవరైనా ఊరికే ఇస్తే, తీసుకుందామని అంటుంది. కూతురుకి జాగ్రత్తలు చేసి కాసేపు నిద్రపోతుంది శాంత. కాసేపటికి తల్లిని కుదిపి నిద్ర లేపుతుంది బాల. ఊరికే ఇస్తానంటున్నాడని ఒక అమ్మకందారుని పిలుస్తుంది. అతనేం అమ్ముతున్నాడో, ఊరికే.. ఊరికే అని ఎందుకు అన్నాడో ‘మురికే.. మురికే’ కథ చెబుతుంది.
తాను ఆఫీసుకు వెడుతూ బాలని బడి దగ్గర దింపుతుంటాడు నాన్న. ఆరోజు బాలకి ఆలస్యం అవుతుంది. నాన్న చిరాకు పడతాడు. భార్య శాంతని విసుక్కుంటాడు. బాల వల్ల తాను చివాట్లు తినాల్సి వచ్చిందని చిన్నబుచ్చుకుంటుంది శాంత. తనపై పెద్దల అజమాయిషీ భరించలేక పెద్దయి నానమ్మలా అవ్వాలని అనుకుంటుంది బాల. పిల్లలు త్వరగా పెద్దయిపోవాలని కోరుకోవడం సహజమే, కానీ బాల నానమ్మలా అయిపోవాలని ఎందుకు అనుకుందో ‘బాల కినుక’ కథ చెబుతుంది.
బాల అన్న బబ్లూ – పార్టీ ఇస్తానంటూ బాలని హోటల్కి తీసుకువెళ్తాడు. అన్న దగ్గర దాచుకున్న డబ్బులు ఉన్నాయోమో, అందుకే తనని ప్రేమగా పార్టీ ఇప్పిస్తున్నాడని అనుకుని వెళ్తుంది బాల. కానీ బాలని హోటల్కి తీసుకువెళ్ళడంలో బబ్లూ ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశం ఏమిటో, హోటల్ తాము ఏం తిన్నారో అన్న మర్చిపోయాడనుకుని నిజం చెప్పిన బాల అందరి కోపానికి ఎలా కారణమయిందో ‘బాల సందేహం’ కథ చెబుతుంది.
బాల పుట్టిన రోజున చెల్లిని తీసుకుని గుడికి వెళ్తాడు బబ్లూ. ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకుని హరతి పళ్ళెంలో డబ్బులు వేసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన బాల – తాను దేవుడి పళ్ళెంలో వేసిన ఐదు రూపాయలు అన్న దొంగిలించాడని, తనకి పుణ్యం రాదని ఏడుస్తుంది. తాను తప్పు చేయలేదని అంటాడు బబ్లూ. చివరికి పెద్దవాళ్ళు నిజం తెలుసుకుంటారు. కానీ ‘అన్న దేముడి డబ్బులు తీశాడ’ని బాల అందరికీ ప్రచారం చేయకుండా చూడడం కష్టమైన పనిగా మారుతుంది ‘దేముడి వాటా’ కథలో.
నానమ్మ ఎప్పుడూ నిక్కచ్చిగా ఉంటుంది. ‘నాన్నా, పెళ్ళెప్పుడు’ కథలో బాల సరిగా చదవడంలేదని ఆవిడ విసిగిపోయి, ‘దీనికి చదువు రాదు గానీ, త్వరగా పెళ్లి చేసేయండి’ అని అంటుంది. పెళ్ళంటే ఏమిటో తన బాబాయి కూతురు నీలిమని అడిగి తెలుసుకున్న బాల తనకి పెళ్ళి చేసేయమని నాన్నని అడుగుతుంది. పాపం! ఎన్నిసార్లు అడిగినా నాన్న పెళ్ళి చేయడు. నానమ్మ చెప్పినా నాన్న పట్టించుకోకపోవడం బాలకి ఆశ్చర్యం కలిగిస్తుంది.
బాలకి శుక్రవారం అంటే ఇష్టం. అందుకు రెండు కారణాలున్నాయి. అవేంటో ‘అమ్మ నైవేద్యం’ కథలో తెలుస్తాయి. తన స్నేహితురాళ్ళ ముందు బాల ఎందుకు అవమానపడాల్సి వచ్చిందో, అందులో ఆమె తల్లి శాంత పాత్ర ఎంతో ఈ కథ చెబుతుంది.
నానమ్మకి మడి, ఆచారాల పట్టింపు ఎక్కువ. నానమ్మ మడికి భంగం కలగకూడదని బాల ఏం చేసిందో ‘బాల – మడి’ కథ చెబుతుంది. ‘బాల.. పాలవాడి గోల’ కథలో ఇంట్లో పెద్దవాళ్ళంతా పనుల్లో ఉన్నప్పుడు పాలవాడు వచ్చి పాలు పోయించుకోమంటాడు. బాల కదలదు. అతను గట్టిగా అరుస్తూ పిలుస్తూంటే తల్లి వచ్చి పాలు పోయించుకుంటుంది. పాలవాడు వెళ్ళిపోయాకా, బాలని తిడుతుంది. అప్పుడు బాల తానెందుకు పాలు పోయించుకోలేదో కారణం చెబుతుంది.
ఓ రోజు బాల వాళ్ళ నాన్న మీద అలుగుతుంది. ఎంత సముదాయించినా ఊరుకోదు. ఎందుకు అలిగిందో, ఎందుకు ఎవరూ బాలని సముదాయించలేకపోయారో ‘బాల.. ఫోటో మేళ’ కథ చెబుతుంది.
బాల కారణంగా దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్లాలో వద్దో అన్న సంశయంలో పడతాడు నాన్న. బాల కోరిక ఎంత ఇబ్బందిపెట్టిందో ‘బాల.. తోడు పెళ్ళికూతురు’ కథలో తెలుస్తుంది. బాల చేసిన పనికి ఏం చేయాలో తోచదు అమ్మ శాంతకి ‘బాల.. కొత్త పావడా’ కథలో. కూతురు మీద తండ్రికి ఉండే ప్రేమని ఈ కథలో చక్కగా వ్యక్తం చేశారు రచయిత్రి.
దేన్నయినా పంచి తినమని నానమ్మ చెప్పిన మాటలు బాలకి మరోలా అర్థమవుతాయి ‘బాల – ‘పంచి’ తినడం’ కథలో. చాలా కథల్లో బాల గడుసుతనం కనబడితే, ఈ కథలో మాత్రం అమాయకత్వం కనబడుతుంది.
అన్న బబ్లూ చేసిన ఓ పనికి ఇంట్లో అందరికీ ఓ సమస్య ఎదురవుతుంది. నానమ్మ ఊరు వెళ్ళిన ఆ రోజున అందరూ తమకి ఇష్టమైన పనులు చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. నానమ్మ తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో అనుకోని సంఘటన జరుగుతుంది. ఇంట్లో ఏం జరిగిందో బాల నానమ్మకి చెప్పకుండా ఉండడం కోసం ఇంటిల్లిపాదీ తమ తమ పద్ధతుల్లో బాలని ఒప్పించే ప్రయత్నం చేస్తారు ‘బాల.. భలే కష్టం’ కథలో.
ఓ రోజు నానమ్మకి జ్వరం వస్తుంది. ఆవిడకి తొందరగా నయం కావాలని గుడికెళ్ళి మొక్కుకుంటుంది చిన్నకోడలు రూప. పిన్నితో పాటు గుడికి వెళ్ళిన బాల మరోలా కోరుకుంటుంది. ‘బాల కోరిక’ కథలో బాల దేవుడికీ సమస్య సృష్టిస్తుంది.
బాల చెప్పే నిజాల వల్ల అన్న బబ్లూకి ఎదురైన సమస్యని ‘బాల – భలే నిజాలు’ కథ చెబుతుంది. సచ్చు మామ్మ కానుకగా ఇచ్చిన జామపళ్ళను బాల అందరికీ పంచిన తీరుని ‘బాల పంపకం’ కథ హాస్యంగా వెల్లడిస్తుంది.
కృష్ణా బారేజ్ ఎక్కడ ఉంది అనే పరీక్షలో ఒక ప్రశ్న వస్తే దానికి బాల రాసిన జవాబు, ఎందుకలా రాసావని తండ్రి అడిగితే బాల చెప్పిన కారణం – ‘బాల- బారేజ్’ కథలో తెలుస్తుంది.
పక్కింటి వాళ్ళ కోడి బాల వాళ్ళ పెరట్లోకి వస్తే, బాల దాన్ని దాచడానికి ప్రయత్నిస్తుంది. అలా ఎందుకు చేస్తున్నావని తల్లి అడిగితే, బాల ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే ‘బాల – పాపం అమ్మ’ కథ చదవాలి.
బాల తన పుట్టినరోజుని తేదీల ప్రకారం కాకుండా, తిథుల ప్రకారం ఎందుకు జరుపుకోవాలనుకుందో ‘బాల తెలివి’ కథ చెబుతుంది. ఈ కథలో బాలలో కలుగుతున్న స్వార్థపు ఆలోచనలని మొగ్గలోనే తుంచేస్తుంది తల్లి శాంత.
తన బాబాయికి తొందరగా పెళ్ళి చేసేయమని పెద్దలందరినీ అడుగుతుంది బాల. ఎందుకో కారణం తెలియాలంటే, ‘బాల – బాబాయ్ పెళ్ళి’ కథ చదవాలి.
మధ్య తరగతి కుటుంబంలో, అందునా ఉమ్మడి కుటుబంలో జరిగే ఈ కథల్లో పిల్లల ఆటపాటలు, పెద్దల ప్రేమాభిమానాలు ఆప్యాయతలు అంతర్లీనంగా వ్యక్తమవుతాయి. బాలది అల్లరి అనిపించినప్పటికీ, అది ఎవరినీ ఇబ్బందికి గురి చేసే అల్లరి కాదని, తెలిసీ తెలియని పసితనపు చర్యలని అర్థమవుతుంది. ఈ కథలన్నీ సరదాగా ఉంటాయి. అమాయకమైన బాల్యంలో మనసుకు తట్టే ఉపాయాలతో ఇంటి సమస్యలకు పరిష్కారాన్ని సూచించే క్రమంలో అందరినీ నవ్విస్తూ – ఓ క్షణంలో ఉడుక్కుంటూ – బాధపడుతూ – మరో నిమిషంలో సంతోషిస్తూ – అనందగా గడిపే ఎందరో పిల్లల్ని ఈ కథలు గుర్తు చేస్తాయి. ఈ కథలు చదువుతుంటే మన చిన్నతనమో, మన పిల్లల బాల్యమో గుర్తు రావడం ఖాయం. పుస్తకం ముఖ చిత్రం మీద, ఆ యా కథలకి బాలి గారు గీసిన చిత్రాలు పెద్దలను కూడా ఆకట్టుకుంటాయి.
***
మా బాల కథలు (బాలల కథా సంపుటి) రచన: శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి పేజీలు: 64 వెల: ₹ 100/- ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, నాగోల్, హైదరాబాదు, ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు. శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి ఇంటి నెంబరు 24-6/4, సాయి కుంజ్, విష్ణుపురి, మల్కాజ్గిరి హైదరాబాద్-500047 ఫోన్: 9849464017
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
Jam (잠): హారర్ సినిమాకు కొత్త గ్రామర్ నేర్పించిన కొరియన్ సినిమా
సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 14
అలనాటి అపురూపాలు-130
కశ్మీర రాజతరంగిణి-31
చింతన!
మానస సంచరరే-21: జీవితం.. ఓ స్నేహగీతం!
మన్నించాలి.. మరి..
దివ్యాoగ ధీరులు 5 – బాడీ బిల్డర్ – బెస్ట్ డాన్సర్ గంధం సంతోష్ – 2
కచుడు – దేవయాని
వ్యామోహం-20
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®