Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మానవ నైజం

చేసే మేలును మరిచి కృతఘ్నతను ప్రదర్శించే మానవ నైజంలోని మరో పార్శ్వాన్ని చూపిన కథ “మానవ నైజం”.

“బస్ మిస్ అయితే ఎంత యిబ్బంది పడాలో? ఈ పిల్లలు ఒక పట్టాన తెమలరు” అనుకొంటూ హడావుడిగా బాక్స్‌లు సర్దుతున్న ప్రవల్లిక ఎవరో మెయిన్ డోర్ వద్ద బెల్ మ్రోగించడం విని ‘ఇంత ప్రొద్దున్నే మనింటికి ఎవరొచ్చారబ్బా!’ అని అనుకొంది. ‘నర్సమ్మా! ఎవరో చూడు’ అని కేకేసింది.
బాల్కనీలో బట్టలుతుకుతున్న పనమ్మాయి నర్సమ్మ, కొంగుతో చేతులు తుడుచుకొంటూ వెళ్ళి తలుపు తెరిచింది. ఎప్పుడూ చూడని క్రొత్త ముఖం కనిపించి ‘అమ్మా, ఎవరో వచ్చారు’ అని ప్రవల్లికతో చెప్పింది. ప్రవల్లిక హాల్ లోకి వచ్చి గుమ్మం ముందు నిలబడిన క్రొత్తావిడను ‘ఎవరా!’ అన్నట్లు చూసింది. ఆగంతుకురాలి ముఖం వాడినట్లుంది, తలకూడా దువ్వుకోలేదు. బోసి నుదురు, నలిగిన బట్టలతో దీనంగా వుందావిడ. ప్రవల్లికను చూడగానే ‘సార్ వున్నారా మేడం?’ అందామె. ఆమె స్వరం కూడా బలహీనంగానే వుంది. ‘సార్ కోసమా, వున్నారు. ఇంకా నిద్ర లేవలేదు. లేపుతాను. రండి, ఇలా కూర్చోండి’ అని మర్యాదగా చెప్పి లోనికెళ్ళింది ప్రవల్లిక. ‘పర్వాలేదండీ’ అని అలాగే నిలబడింది ఆ వచ్చినావిడ. బెడ్ పైన పసివాడి లాగ, అమాయకంగా బోర్లా పడుకొని నిద్రపోతున్న ప్రణయ్‌ను చూస్తే ముద్దనిపించింది ప్రవల్లికకు. చిలిపి ఊహ కలిగి మెల్లగా వంగి ప్రణయ్ చెవిని మునిపంటితో సుతారంగా కొరికింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ప్రణయ్‌కు ఎదురుగా నవ్వుతున్న భార్య కనపడగానే చటుక్కున ఆమెను తన వేపు లాక్కోబోయాడు. ప్రవల్లిక తప్పించుకొని “గుర్రం కట్టేయండి శ్రీవారు తమరి కోసం ఎవరో ఒకావిడ వచ్చింది. త్వరగా లేచి రండి” అన్నది. “ఆవిడా? నా కోసమా? ఎవరూ?” అంటూ వెంటనే లేచి లుంగీ సవరించుకొంటూ బయటకి వచ్చాడు. అతడిని చూసి ఆ వచ్చినావిడ ‘నమస్తే సార్’ అన్నది. తల వూపుతూ ప్రశ్నార్థకంగా ఆమెను చూసి, ‘ఎవరమ్మా మీరు’ అన్నాడు.
“నా పేరు సుగుణండీ. నేను మీ ఆఫీస్ బాయ్ బాబూరావు భార్యను” అందామె దుఃఖం నిండిన స్వరంతో. “అయ్యయ్యో, అలాగామ్మా. ఏం పని మీద వచ్చారమ్మా” అని సాదరంగా అడిగాడు ప్రణయ్. ఆ బాబూరావు తప్పత్రాగి డ్యూటీ టైమ్‌లోనే బైక్ ఆక్సిడెంట్లో మరణించాడు. అతడికి రావలిసిన డబ్బులన్నీ చివరి రూపాయితో సహ చెక్ వ్రాయించి యిప్పించాడు ప్రణయ్. బాబూరావు తరవున ఎవరో వాళ్ళ దగ్గరి బంధవు, సుగుణ పేరు పైనే చెక్ అందుకొన్నాడు. ఇది జరిగి కూడా నాలుగైదు నెలలు గావస్తున్నది. తగినంత సర్వీసు లేనందువల్ల బాబురావుకు పెన్షన్ అర్హత లేదు. అవన్నీ గుర్తు చేసుకొంటూ ఆమె వైపు చూశాడు ప్రణయ్. సుగుణ కన్నీళ్ళతో, దీనంగా చూస్తూ “సార్ మీరు ఎందరికో ఉద్యోగాలిప్పించారని విన్నాను. నేను తొమ్మిది వరకూ చదువుకొన్నాను. నాకు మా ఆయన స్థానంలో ఉద్యోగమిప్పిస్తే నేను నా పిల్లలు మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాం” అన్నది. ప్రణయ్ సాలోచనగా చూస్తూ “బాబూరావుది చాలా స్వల్ప సర్వీస్‌ గాబట్టి, అతని స్థానంలో నీకు జాబ్ రావడం దాదాపుగా అసాధ్యమే. అయినా వేరే ఏదో ప్రయత్నం చేస్తాను. నీ అర్హతలన్నీ వివరంగా వ్రాసివ్వమ్మా” అన్నాడు. ఆమె తనతో తెచ్చుకొన్న చేతి సంచీలో నుండీ ఒక ప్లాస్టిక్ కవర్ తీసింది. అందులో పాతబడిన తన టి.సి.ని, తను వ్రాసిన దరఖాస్తును తీసిచ్చింది. ఆ దరఖాస్తులో కొన్ని వర్ణదోషాలున్నప్పటికీ తన దీన గాథను వివరిస్తూ, తనకేదైనా చిన్నపాటి ఉద్యోగం యిప్పించమని వేడుకొంది. 9th చదువుతూ మధ్యలోనే వదలేసినట్లున్న టి.సి అది. చిన్నపాటి అర్హతలతో ఆమెకెలా, ఏం ఉద్యోగమిప్పించాలో ప్రణయ్‌కు అర్థం కాలేదు. గట్టిగా కాదనలేకపోయాడు. “చూద్దాం. తర్వాత రండి” అని అన్నాడు.
ఈలోగా ప్రవల్లిక ట్రేలో రెండు కప్పులతో టీ తీసుకొని వచ్చింది. సుగుణ వేపు కప్పు అందిస్తూ “తీసుకోండి” అన్నది.
“వద్దు మేడం” అన్నది సుగుణ మొహమాటంగా.
మరో కప్పు తాను అందుకొంటూ “పర్వాలేదు తీసుకోండి”, “మీరు స్నానానికెళ్ళండి, పిల్లలు రెడీ అయ్యారు” అటు సుగుణతోనూ, ఇటు భర్తతోనూ అన్నది ప్రవల్లిక. తానక్కడ వుండడం వల్లే సుగుణ మొహమాటపడుతోందని గ్రహించిన ప్రణయ్ అక్కడ నుండి లోనికెళ్ళిపోయాడు.
“టీ చల్లారిపోతున్నది తీసుకోండి” అని ప్రవల్లిక మరోసారి అనడంతో తప్పనిసరిగా కప్పు చేతిలోకి తీసుకొంది సుగుణ. ప్రవల్లిక తల దువ్వుకొంటూండగా, ఆమె నిశ్శబ్దంగా టీ త్రాగింది. ఇంతలో నర్సమ్మ వచ్చి ఖాళీ కప్పును చేతిలోకి తీసుకొంది. సుగుణ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ “వెళ్ళొస్తా మేడం” అని చెప్పి వెళ్ళిపోయింది.
ప్రవల్లిక పాపను లేపి రెడీ చేసి, డే కేర్ సెంటర్‌కు తీసుకెళ్ళితే, ప్రణయ్ అబ్బాయిలిద్దరినీ స్కూల్‌లో దింపి ఆఫీస్ కెళ్ళాడు. పాపకు తాను తినిపించినా, ఇంకా కొన్ని స్నాక్స్, పాలు, పళ్ళు అన్నీ బాస్కెట్‌లో పెట్టిచ్చి, నిర్వాహకులకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి, తన స్కూల్ కెళ్తుంది ప్రవల్లిక. నర్సమ్మ మిగిలిన పనంతా ముగించి ఇంటికి తాళం వేసి, కీని తులసి కోటలో దాచి వెళ్తుంది. ఎంతో నమ్మకమైన వ్యక్తి ఆమె. అందుకే ప్రవల్లిక నిశ్చింతగా, నిర్భయంగా ఆమెకు ఇల్లు అప్పగిస్తుంది. కీ సీక్రెట్ ప్లేస్ ఇంటిల్లిపాదికీ తెలుసు. ప్రవల్లిక దగ్గిర అదనపు కీ వుంటుంది. పిల్లలు గానీ, ప్రణయ్ గానీ ముందు వస్తే అందుబాటులో వుండేందుకే ఆ ఏర్పాటు. అదీ గాక నర్సమ్మ సాయంకాలం వచ్చి ఆరేసిన బట్టలు తీసి మడతపెట్టి ఇంకా మిగిలిన పనులు చేస్తుంది. సాయంకాలం అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు. హోమ్ వర్క్ చేయడం అయ్యాక మగిపిల్లలిద్దరినీ తనకు చెరోవైపూ పడుకోబెట్టకొని కథలు చెప్పూ నిద్రపుచ్చుతాడు ప్రణయ్. పాపనూ లాలి పాడి, ముద్దులాడి నిద్రపుచ్చుతుంది ప్రవల్లిక. పిల్లలు ముగ్గురూ నిద్రపోయాక ప్రవల్లికా ప్రణయ్‌లదే ప్రణయ సామ్రాజ్యం. నిద్ర వచ్చేదాక ఎన్నెన్నో కమ్మని కబుర్లూ, కలలూ వాళ్లవే.
***
ఆవేళ మొదలుకొని ప్రతీ 2,3 రోజుల కోసారి సుగుణ రావడం మొదలు పెట్టింది. ప్రణయ్ ఆమె ఊద్యోగం కోసం చాలా నిజాయితీగానే ప్రయత్నించాడు. తగిన అర్హతలు లోకపోవడం వల్ల సుగుణకు తన వద్ద జాబ్ ఇవ్వడం అస్సలు కుదురలేదు. సుగుణ పట్టు వదలకుండా తరచూ రావడం మానలేదు. ‘పాపకు నేను తల దువ్వుతాను’ అనీ, ‘ఫ్రాక్ వేస్తాను’ అనీ చనువుగా ప్రవల్లిక చేతిలో నుండి దువ్వెన్న దుస్తులూ తీసుకొని పనుల్లో సాయం చేసేది. కాదని ప్రవల్లిక వారిస్తున్నా వినకుండా ఎంతో వినయంగా, ఆప్యాయంగా వ్యవహరించేది సుగుణ. ఆమె వచ్చినప్పుడల్లా ప్రణయ్‌కి చాలా గిల్టీగా అనిపించేది. ఎలాగైనా ఆమె కేదో ఒక జాబ్ యిప్పించి తీరాలనే పట్టుదలతో చాలా ప్రయత్నం చేసి, ఒక 3,4 నెలల తర్వాత తన మిత్రుడి బ్యాంక్‌లో అటెండర్‌గా జాబ్ యిప్పించాడు ప్రణయ్. ఫ్రెండ్‌కు గాకపోయినా కొన్ని తప్పనిసరి ఖర్చులు చేశాడు. 5 వేలు ఖర్చుపెట్టినా ఈ రోజుల్లో జాబ్ దొరకడమే అసాధ్యం. ఆమెకు ఏదో ఒక ఉపాధి దొరికింది,అది చాలు అనుకొన్నాడే గానీ డబ్బు విషయం ఎవరికీ చెప్పలేదు. జాబ్ చిన్నదైనా బ్యాంక్‌లో గాబట్టి సుగుణకు
ఆర్థిక స్థిరత్వం ఏర్పడిందని ప్రవల్లికా సంతోషించింది.
సుగుణ జాబ్‌లో చేరిన నాలుగవ రోజు 6 ఆపిల్స్, 12 అరటిపళ్ళూ, ½ కిలో స్వీట్ బాక్స్ తీసుకొని ప్రవల్లిక దగ్గిరికి వచ్చింది. ప్రవల్లికా, ప్రణయ్‌లు అవన్నీ అస్సలు వద్దనీ, మీ పిల్లలకే తీసుకెళ్ళమనీ చెప్పారు. “సార్, మీమేలు నేను జన్మలో మర్చిపోను. మీదయ వల్లనే నాకీ జాబ్ వచ్చింది. దీని కోసం మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టారని తెల్సింది. మీ ఋణం తీర్చలేనిది. మీ మంచితనం వల్లనే, నేను నా పిల్లలను బ్రతికంచుకోగలననే భరోసా వచ్చింది. నెలనెలా ఎంతో కొంత యిచ్చి, మీ అప్పు తీరుస్తాను. ఇవి వద్దనకండీ” అని ఎంతో నమ్రతగా చెప్పింది సుగుణ. “ఆ డబ్బులు నేను అప్పుగా ఏమీ యివ్వలేదు. నిజాయితీగా శ్రద్ధగా నీ డ్యూటీ చేసుకో, అది చాలు” అన్నాడు ప్రణయ్. “అవునమ్మా. నువ్వు వీలైతే ప్రైవేట్‌గానైనా చదువుకొని, బ్యాంక్లోనే మరింత మంచి జాబ్ సాధించవచ్చు. నువ్వు ఇంతగా చెబుతున్నావు గాబట్టి యిదిగో ఈ ఆపిల్స్ రెండు చాలు. మిగిలినవన్నీ నీ పిల్లలకే నేను యిచినట్లుగా యిచ్చేయి. వాళ్ళను చక్కగా చదివించు. సరేనా?” అంటూ రెండు ఆపిల్స్ తీసుకొంది ప్రవల్లిక. ఆ దంపతుల మంచితనాన్ని మరీ మరీ పొగిడి వెళ్ళింది సుగుణ.
“పోనీలెండి, ఎలాగోలాగా ఆమెకు జాబ్ వచ్చింది. భగవంతుడి దయ వల్ల ఆమె, పిల్లలూ వీధిన పడకుండా రక్షించబడ్డారు” అన్నది ప్రవల్లిక ప్రణయ్‌తో. “అవునా, ఇందులో నా సహాకారం ఏమి లేదంటావా?” చిలిపిగా నవ్వుతూ అన్నాడు ప్రణయ్. “అయ్యో, ఎందుకు లేదూ? ఆ భగవంతుడే మీ రూపంలో ఆమెను ఆదుకోన్నాడు సార్” అంతే కొంటెగా నవ్వుతూ బదులిచ్చింది ప్రవల్లిక. ఇద్దరూ నవ్వుకొన్నారు.
***
సుగుణకు జాబ్ రాక ముందు ఒకసారి ఆమె ప్రవల్లికను బజార్లో కలిసింది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. “మేడం, సార్‌కు నా జాబ్ గురించి గుర్తుచెయ్యండి” అని ప్రార్థించింది. ప్రవల్లిక కూడా ఆదరణగా మాట్లాడుతూ “తప్పకుండా నీ జాబ్‌కై ప్రయత్నిస్తాం” అని హామీ యిచ్చింది. సుగుణకు జాబ్ వచ్చి నెల గడిచి, తొలి నెల జీతం కూడా ఆమె చేతిలో పడి వుంటుంది. ఆ సాయకాలం వేళ ప్రవల్లిక యింటికి వస్తుండగా సుగుణ కనబడిందామెకు. స్కూటీని స్లో చేయబోయింది. అయితే సుగుణ మాత్రం ప్రవల్లికను చూడనట్లుగానే గబగబా ఆమెను దాటిపోయింది. ప్రవల్లిక ఒక్కక్షణం ఆశ్చర్యపడినా చూడలేదేమోలే అనుకొని బండి ఆపి వెనక్కి తలతిప్పి ‘సుగుణా’ అని పిలిచింది. కానీ సుగుణ ఆగలేదు. మరింత వేగంగా వెళ్ళిపోయింది. ‘ఏంటిది?’ అనుకొని ప్రవల్లిక బండి స్టార్ట్ చేసింది. ఆ విషయం అప్పడే మరచిపోయిందామె. మరో నెలా పదిరోజులు గడిచాక దారిలోనే సుగుణను చూసింది. సుగుణ సిల్క్ చీరె కట్టుకొని, నున్నగా తల దువ్వుకొని, కళ్ళకు నల్లని కళ్ళజోడు పెట్టుకొని సైకిల్‌పై వస్తూ ఎదురైంది. ప్రవల్లిక ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆమెను దాటి పోయింది సుగుణ. ఈసారి సుగుణ కావాలనే తనను పలకరించలేదనే విషయం ప్రవల్లికకు అర్థమైంది. ‘ఇంతలోనే యింత మార్పా?’ అనుకొంటూ ముందుకు సాగింది. ఆ రాత్రి భర్త దగ్గిర సుగుణ గురించి మాట్లాడాలనుకొందామె. కానీ అనుకోకుండా ప్రణయ్ ఆ ప్రస్థావన తెచ్చాడు. ప్రవల్లిక ముద్దుపేరు అమ్మలు. “అమ్మలూ, ఈవేళ ఏదో పని మీద సుగుణ మా ఆఫీస్‌కు వచ్చింది. ఆమె రూపం ఎంత మారిపోయిందో? చాలా స్టైలిష్‌గా గాగుల్స్ పెట్టుకొని మరీ వచ్చింది. ఏవో బ్యాంక్ పేపర్స్ యివ్వడానికి వచ్చింది. నా చాంబర్‌లో నుండే చూసానామెను. స్టాఫ్‌తో నవ్వుతూ మాట్లాడి వెళ్ళిపోయింది. ఇంత క్రితంలాగా నా దగ్గరికి రావడానికి ప్రయత్నించలేదు. వాటె చేంజ్?” అన్నాడు.
“నిజమేనండీ నాకూ అలాగే అనిపిస్తున్నది. దారిలో కనబడినప్పుడు మొదట్లోలాగ, ఆగి మాట్లాడలేదు. ఎంత చిత్రంగా మారిపోయిందో?” అన్నది ప్రవల్లిక.
“తనకి స్థిరమైన జాబ్ వచ్చిందిగా? మనతో అవసరమేముందిక?” అన్నాడు ప్రణయ్.
“అయితే మాత్రం మరీ ఇంతగా మారిపోవాలా? మనుషుల్లో యింత కృతఘ్నత వుంటుందా?” బాధగా అన్నది ప్రవల్లిక.
“అది వుండేదే మనుషులకు అమ్మలూ. అయినా మనం ఆమె నుండి ఏదో ఆశించలేదు గదా? లీవిట్.” అన్నాడు ప్రణయ్.
“ఏమీ యివ్వక్కర్లేదు. ఒక్క చిరునవ్వు, చిన్న పలకరింపు కూడా కరువైనవా? వాటి కోసం ఏమీ ఖర్చవదే? నాకైతే చాలా కష్టంగా అనిపిస్తోంది ప్రణ్ణూ” అన్నది ప్రవల్లిక.
“పోనీలే అమ్మలూ, చాలా మంది తీరు యింతే. అన్నం పెట్టిన చేతినే కరిచే పశుప్రవృత్తి సర్వసాధారణం. అయినా మనం ఆ సుగుణకు ఏమంత గొప్ప సాయం చేసామని ఆమె మనపట్ల విధేయత చూపాలి చెప్పు” అన్నాడు ప్రణయ్
స్వంత లాభం కొంతమానుకొని, ఇతరులకు సుంత మేలు చేయడమే మానవత్వమన్న మతం ఆ దంపతులది. అలాంటిది అందరిలో వుండాలని వారి ఆశ. ప్రవల్లిక ప్రేమగా భర్త తల నిమురుతూ “ప్రణ్ణూ, యు ఆర్ గ్రేట్ గై. ఐ నో యిట్. నువ్వెంతమందికి జాబ్స్ యిప్పించావో, వాళ్ళందరూ యుప్పటికీ నీ కోసం ఎంత అభిమానం పంచుతారో నాకు తెలుసు. నీ గొప్పతనం నీకు తెలియకపోవడం కూడా నీ గొప్పేరా” అంటూ ముద్దుగా అతని ముక్కు మాపింది.
ప్రణయ్ గోముగా తన తలను ప్రవల్లిక ఒడిలో దాచుకొంటూ “నాకు అందరి కన్నా గ్రేట్ నువ్వే రా అమ్మలూ. నీ సన్నిధిలో నాకు ప్రతీ రేయీ పున్నమే. ప్రతీ ఉషస్సూ ఉగాదే” అన్నాడు.
ప్రవల్లిక కిలకిలా నవ్వుతూ “బయటేమో పేద్ద ఆఫీసర్. నా దగ్గిరేమో బుల్లి పాపాయివి గదూ?” అన్నది. బదులుగా ప్రణయ్ నిజంగానే పసిపాపలా మారి ఆమెను చుట్టేసాడు.
ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ సుగుణగానీ, ఆమెలో వచ్చిన మార్పు గానీ గుర్తు రాలేదు. ‘మానవ నైజమింతే’ అనుకొంటూ వారి రసరమ్య జగత్తులోకి వెళ్ళిపోయారు.

-చల్లా సరోజినీదేవి

Exit mobile version