Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-23

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

మానవుడే మహనీయుడు
శక్తియుతుడు, యుక్తిపరుడు
మానవుడే, మాననీయుడు

‘బాల భారతం’ సినిమా అంతా ఒక ఎత్తు, చివరి దశలో ఘంటసాల పాడిన అర్థవంతమైన  నేపథ్య గీతం ఒక ఎత్తు. అత్యంత ఆదరణ పొందిన పాట ఇది. ఆరుద్ర కలం నుంచి సందర్భాన్ని అనుసరించి జూలు వారి, ఆరుద్ర వ్యక్తిగత తత్వాన్ని ప్రతిబింబించే తాత్విక గీతం ఇది. ఎస్.రాజేశ్వరరావు చారుకేశి రాగంలో అత్యద్బుతంగా రూపొందించిన గీతం ఇది.

‘మహా భారతం’లో ఆదిపర్వంలో కౌరవులు పాండవుల నడుమ ఉన్న పోటీలు, అసూయల ప్రస్తావన ఉంది. దాని ఆధారంగా కల్పనలు జోడించి రూపొందించిన సినిమా ‘బాల భారతం’. ఇందులో పాటకు సందర్భాన్ని స్క్రిప్టులో సృష్టించారు.

నారదుడు సూచించిన వ్రతం చేయాలనుకుంటుంది కుంతి. దానికి స్వర్గంలో ఉండే ఐరావతం కావాలి. కానీ స్వర్గానికి వెళ్లటం ఎలా? ఐరావతం తేవటం ఎలా? అర్జునుడు బాణాలతో స్వర్గానికి నిచ్చెన నిర్మిస్తాడు. భీముడు ఆ నిచ్చెన ఎక్కి స్వర్గం వెళ్లి ఐరావతాన్ని తీసుకువస్తాడు. నిజానికి పాట లేకుండా కూడా ఈ దృశ్యాన్ని తీయవచ్చు. భీముడు నిచ్చెన ఎక్కడం, చుట్టూ అంతరిక్షంలో నక్షత్రాలను, గ్రహాలను, పాలపుంతలను, సంబరంగా చూస్తూ స్వర్గం చేరినట్టు చూపవచ్చు. అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయవచ్చు.

‘2001 స్పేస్ ఒడిస్సీ’ సినిమాలో నాయకుడు అత్యద్భుతమైన అంతరిక్ష ప్రపంచంలో ప్రయాణిస్తాడు. ఆ సందర్భంగా సినిమా ప్రపంచంలో అతి గొప్ప దృశ్యాలుగా పేర్కొనే దృశ్యాలు వస్తాయి.

అంతగా, సినిమా సాంకేతిక పరిజ్ఞానం, బడ్జెట్ లేని తెలుగు సినిమా కాబట్టి దృశ్యాలతో ప్రేక్షకుడిని అదరగొట్టటం కష్టం. అదిగాక, కేవలం నేపథ్య సంగీతం, దృశ్యాలతో తెలుగు ప్రేక్షకులను అలరించటం కష్టం. కాబట్టి, ఈ సన్నివేశం మరపురానిదిగా ఎదగాలంటే మధురమైన పాట ఉండటం తప్పనిసరి. పాట మాధుర్యంతో మైమరచి ప్రేక్షకులు సాంకేతిక పరిజ్ఞానం గురించి, లాజిక్ గురించి ఆలోచించరు. అదే జరిగింది. కానీ ఎలాంటి పాట ఉండాలన్న నిర్ణయం గొప్ప నిర్ణయం. దృశ్యం మరపురానిదిగా, పాట మరుపురానిదిగా నిలవటంలో ఈ సందర్భంలో పాట భావం అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. అంటే, ఇది గేయ రచయిత ప్రాధాన్యం అధికంగా కల  ‘పాట’ అన్నమాట.

సందర్భం చక్కగా కుదిరింది. ఇలాంటి పాట తెలుగు సినిమాల్లోనే కాదు ఇతర ఏ భాషలోనూ లేదన్న రీతిలో పాటను రచించాడు ఆరుద్ర.

పాండవుల గొప్పతనాన్ని వర్ణిస్తూ పాట రాయవచ్చు. మంచి చెడుల పోరాటాన్ని వర్ణిస్తూ పాట రాయవచ్చు. హిందీలో ‘నిజం’ గొప్పతనం తెలిపే ‘నిర్బల్ సె లడాయీ బల్‌వాన్ కీ, యే కహానీ పై దియే కీ ఔర్ తూఫాన్ కీ’ వంటి అత్యద్భుతమైన గీతం రాయవచ్చు. క్రిందనున్న వారు భీముడిని రక్షించమని ప్రార్థిస్తున్నట్టు పాట రచించి అంతరిక్షంలో దైవకృపతో భీముడు అన్నీ అడ్డంకులను దాటుతున్నట్టు చూపించవచ్చు. భీముడు చూస్తున్న దృశ్యాలను వర్ణిస్తూ రాయవచ్చు. కానీ సందర్భాన్ని పురస్కరించుకుని ఆరుద్ర సృష్టికి కేంద్రం మానవుడు, సృష్టిలోని అత్యుత్తమ జీవి మానవుడు అనే human centric, anthropocentric తాత్త్విక గీతాన్ని రచించాడు. ఒక వ్యక్తికో, సంఘటనకో పరిమితం కాకుండా సార్వజనీన లక్షణం కల పాట రచించాడు.

సృష్టిలో మహనీయుడు మానవుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడు’ అని ఆరంభంలోనే ఈ తాత్త్వికతకు  ప్రాతి పదిక వేశాడు.

గంభీరమైన ఘంటసాల గొంతు, ‘మానవుడే మహనీయుడు’ అని ఎలుగెత్తి గానం చేస్తుంటే ఆరంభంలోనే అద్భుతం అనిపిస్తుంది. పాటలో భావం ఆకర్షిస్తుంది. భూమి నుంచి స్వర్గానికి దూరం ఎంత? అంత దూరం నిచ్చెన వేయాలంటే ఎన్ని బాణాలు కావాలి? నిచ్చెన స్థిరంగా ఎలా ఉంటుంది? ఆ పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తక్కువవుతుంది. అంతరిక్షంలో అంతా శూన్యం. మరి అలాంటి పరిస్థితులలో భీముడు ఎలాంటి రక్షణ లేకుండా ఒక చిన్న ధోతీ కట్టుకుని, గద చేత పట్టుకుని స్వర్గం ఎలా చేరాడు? వంటి ప్రశ్నలేవీ ఉదయించవు. ‘మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే. తిమ్మిని బమ్మిని చేయగలవాడు మానవుడే’. ఆ మాయలో పడేవాడూ మానవుడే.

మంచిని తలపెట్టినచో మనిషికడ్డు లేదులే
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే

రెండు పాదాల్లో గొప్ప తత్వాన్ని చెప్పాడు. మనిషి ‘ఇచ్ఛాశక్తి’ కి పెద్ద పీట వేశాడు. ప్రేరణ దైవంనుంచి లభించినా దాన్ని సాధించాల్సింది మానవుడే. భగవంతుడు కూడా, అనుకున్నది సాధించేందుకు మానవావతారం ఎత్తాల్సిందే. పైనుంచి ఆశీర్వదిస్తాడు. వరాలనిస్తాడు. కానీ, ఏది సాధించాలన్నా మానవజన్మ ఎత్తవలసిందే.  ఈ సందర్భంగా మంచిని తలపెడితే మనిషికి అడ్డులేదని చెప్పటంవల్ల, చెడు చేయాలనుకుంటె అన్నీ అడ్డంకులే అనీ చెప్పినట్టయింది. ఇటీవలి కాలంలో పాలోకోలో అనే రచయిత ‘ది ఆల్కెమిస్ట్’ అన్న రచనలో, మనిషికి సంకల్పబలం వుంటే, ప్రకృతి సర్వం అతని సంకల్పం నెరవేరేందుకు తోడ్పడుతుందని రాశాడు. అది ఆరుద్ర తత్త్వానికి ప్రతిధ్వని.

పట్టుదలతో తాను అనుకున్నది సాధించే మానవుడి ‘శక్తి’ గురించి రెండవ చరణంలో చెప్పాడు.

దివిజ గంగ భువి దించిన భగీరధుడు మానవుడే
సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే
సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే
జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే

పాటనే అంతా చేస్తుంది. ఘంటసాల గంభీర స్వరం పాట స్థాయిని విలువను పెంచుతుంది. పాట చిత్రీకరణలో ప్రత్యకంగా చేయాల్సింది ఏమీ లేదు. సృష్టిలో మానవుడి ప్రాధాన్యాన్ని, గొప్పతనాన్ని చెప్తుందీ చరణం.

 పాట చిత్రీకరణలో కెమేరామేన్ చేయాల్సిందేమీ లేదు. భీముడు నిచ్చెన ఎక్కుతున్నదాన్ని  పలుకోణాల్లో చూపాలి. అప్పుడప్పుడు క్లోజప్పులు, అప్పుడప్పుడు ‘లాంగ్ షాట్’ లు తీయాలి. నేపధ్యంలో గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు ఎంత కృత్రిమంగా అనిపించినా ప్రేక్షకుడు పట్టించుకోని స్థితిలో ఉంటాడు. ఇంటర్‌ల్యూడ్ సంగీతం అద్భుతంగా  ఉంటుంది. ‘అంతరిక్ష కవాతు’ లయలా అపిస్తుందీ పాట సంగీతం.

గ్రహరాశుల నధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసీలో
గంధర్వ గోళ తతుల దాటి
చంద్రలోకమైనా, దేవేంద్ర లోకమైనా
బొందితో జయించి మరల భువికి  తిరిగి రాగలిగే
మానవుడే మహనీయుడు

చివరి చరణం అద్భుతమైనది

తత్త్వం, ధర్మం, భవిష్యత్తు సర్వం కలబోసి రచించిన చరణం ఇది. ఘంటసాల ‘గగనాంతర రోదసీలో’ అని దీర్ఘం తీయటం గగనాంతర రోదసిలోతును స్ఫురింపచేస్తుంది.  నిజంగా అంతరిక్షంలో గానం ప్రతిధ్వనిస్తున్నట్టనిపిస్తుంది. అద్బతమైన నేపథ్య గానం ఇది.

ఇంతకీ స్వర్గం ఎక్కడుంది?

భారతీయ పురాణాల ప్రకారం 14 లోకాలున్నాయి. ఏడు ఊర్థ్వలోకాలు. ఏడు అధోలోకాలు. భూ, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం, అనేవి ఊర్ధ్వలోకాలు. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు అధోలోకాలు.

‘భుః’ అన్నది భూమి, ‘స్వః’(స్వర్గం లోకం) అన్నది దేవలోకం. మరణించిన వారు వెళ్లేలోకం. ‘భువః’ ఈ రెంటి మధ్య ఉండే లోకం. ‘జనః, తపః, సత్యం’ కలిపి  బ్రహ్మలోకం. అత్యంత పుణ్యవంతులు ఈ లోకం చేరి కొన్నాళ్లు గడుపుతారు. ముక్తి పొందుతారు. బ్రహ్మలోకానికి భూః, భువః, స్వః లోకాలకు నడుమ ఉంటుంది మహః. ఇది ఊర్ధ్వలోకాల అమరిక. ఇంద్రుడు ఉండే ‘ఇంద్రలోకం’ సువర్లోకంలో ఉంటుంది. ఇక్కడే మేరు పర్వతం, అమరావతి ఉంటాయి. బాణాల నిచ్చెన మెట్లెక్కి భీముడు వెళ్లింది ఈ సువర్లోకం లోని ఇంద్రలోకానికి. అందుకే –

“గగనాంతర రోదసీలో గంధర్వ గోళ తతుల దాటి”

అన్నాడు ఆరుద్ర. గంధర్వ లోకం కూడా ‘ఇంద్రలోకం’లోనే ఉన్నా, అది స్వర్గం అధోభాగంలో ఉంటుంది. కాబట్టి గంధర్వ గోళ తతుల దాటి అన్నాడు.

చంద్రలోకాన్ని చంద్రగ్రహంలా భావించకుడదు. సూర్యలోకం దాటిన తరువాత లక్ష యోజనాల దూరంలో చంద్రలోకం ఉంటుంది. ఇది కూడా సువర్లోకంలో భాగమే.

ఏ లోకానికి వెళ్లినా బొందితో తిరిగి రాగలడు మానవుడే అన్నాడు ఆరుద్ర 1972లో రాసిన ఈ పాటలో.  అప్పటికే మనిషి చంద్రుడి మీద అడుగుపెట్టి తిరిగి వచ్చాడు క్షేమంగా. ఇప్పుడు మనిషి ఇతర గ్రహాలకు  కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. భవిష్యవాణి చెప్పినట్టు చెప్పాడు ఆరుద్ర. అందుకే ఈ పాట సమస్త మానవాళికి వర్తించే పాటగా ఎదిగింది.

పాటలో పదాలతో పాటలను మరపురాని పాటలుగా మరచటం చాలా గొప్ప విషయం. సినిమా ప్రధానంగా దృశ్య మాధ్యమం. కానీ ఈ సందర్భంలో ఈ పాట ఈ పదాలతో కాక ఇతర ఏ భావంతో రాసినా దృశ్యం అంతగా పండేది కాదు. చివరికి భీముడు తనని తాను ప్రేరేపించుకుంటూ, పాడుతూ నిచ్చెన ఎక్కుతున్నా అంతగా నప్పేది కాదు. నేపథ్యంలో ఘంటసాల ‘మానవుడే మహనీయుడు’ అంటూ ఆరుద్ర రాసిన పదాలను, ఎస్.రాజేశ్వరరావు కూర్చిన బాణీలో పాడకపోతే ‘బాల భారతం’ మాములు బాల భారతంగా మిగిలిపోయి ఉండేది.

ఇక్కడే మన ఇతిహాసాలు, పురాణాల గొప్పతనం తెలిసేది. కథ అందరికీ తెలుసు. సస్పెన్స్ ఏమీ లేదు. కానీ అవే కథలను ఎన్నెన్ని రకాలుగా, ఎన్నెన్ని మార్లు తీసినా ఏ కాస్త బాగా తీసినా అలరిస్తాయి. తరగని గనులు మన పురాణాలు. ఆ కాలం నాటి కళాకారులు వాటిని వీలయినంత వాడుకున్నారు. తమ ప్రతిభతో, అద్భుతమైన కళాప్రదర్శనతో,  చిత్తశుద్ధి,  దీక్షలతో,  నటులు దైవం స్థాయికి ప్రేక్షకుల దృష్టిలో ఎదిగారు. ఇవి మన కథలు. ఇవి మన సమాజం స్పందించి, ఆనందించి, అనుభవించే గాథలు. నిజానికి పురాణాలనుంచి ప్రేరణ పొందితే, సరైన కథలు లేవన్నమాట మన కళాకారుల నోటినుంచి రాదు. కానీ, ప్రేరణ కోసం, వెలుపలివైపు చూస్తూ, మనల్ని మనం మరచిపోతే, మనదన్నదాన్ని విస్మరిస్తే, కథలుండవు. కలలుండవు. పీడ కలలు, ఘోరమైన కథలే లభిస్తాయి.

ఇటీవలి కాలంలో పురాణాల ఆధారంగా వచ్చే సినిమాలు అదృశ్యమైపోయాయి. ఒకటీ అరా అక్కడక్కడా వచ్చినా సాంకేతిక పరిజ్ఞానం పై పెట్టిన దృష్టి, కథనం పై, పాత్రల వ్యక్తిత్వాల పై పెట్టక పోవటంతో పురాణాలు విదేశీ సినిమాలలా తోస్తున్నాయి తప్ప వాటిలోని భారతీయత కనబడటం లేదు. మానవుడే మహనీయుడులో మానవుడు మిగిలాడు. మహనీయత్వం కనుమరుగయింది. అందుకే ఆనాటి పౌరాణిక సినిమాలను,  పాటలను తలచుకుంటుంటే, ఆకాశంలో విహరించే గంగ గుర్తుకు వస్తుంది. పురాణాలను పవిత్ర భావనతో, అవగాహనతో స్పృశిస్తే చాలు అమృత వృష్టి కురుస్తుంది. ఉత్తమ కళ సృజితమవుతుంది. సమాజం ఉన్నతమై వ్యక్తమవుతుంది. లేకపోతే, ద్యోమార్ఝఝరి భూమిపైకి వచ్చి, కలుషితమై, మురికి కాలువల స్థాయికి దిగజారినట్టే ఉత్తమ కళగా సమాజంముందు నిలుస్తుంది.

(మానవుడే మహనీయుడు పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=Ph8TlK5BxP8 )

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version