Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-27

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

తనువుతో కలుగు బాంధవ్యమ్ములెల్ల
తనువుతో నశియించి ధరణిలో గలియు

‘శ్రీకృష్ణావతారం’ సినిమాలో పాట కాని,  రాగయుక్తమైన శ్రావ్య వచనం ఇది. ఈ పాటకు సందర్భం మహా భారతం సృష్టించి ఇచ్చింది. యుద్ధం సమయంలో ప్రత్యర్థులుగా బంధువులు, ఆంతరంగికులను చూసి, వీరందరినీ చంపి ఏం సాధించాలన్న విరక్తితో అర్జునుడు ఆయుధాలు విసర్జిస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ‘భగవద్గీత’ ద్వారా అర్జునుడికి కర్తవ్య నిర్వహణకు ప్రేరణనిస్తాడు.

‘కురుక్షేత్ర’ యుద్ధం చూపించాల్సిన సినిమాలనేకం ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు కొన్ని మాటలు చెప్పటమో, కొన్ని భగవద్గీత పద్యాలు పాడి అర్థం చెప్పటమో చూపించి ముందుకు వెళ్లిపోయాయి. ఇందుకు భిన్నంగా దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ‘భగవద్గీత’ గానం ఈ సందర్భంలో పొందుపరచారు. ఇది గొప్ప ఛాలెంజ్!

నిజానికి యుద్ధం సమయంలో, అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు, 18 అధ్యాయాల భగవద్గీత బోధించటం అనౌచిత్యమని వాదించే వారున్నారు. శ్రీకృష్ణుడు 18 అధ్యాయాలు బోధించే దాకా యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు ఎదురు చూస్తుంటారా? అని ప్రశ్నించేవారూ ఉన్నారు. కాబట్టి సినిమాల్లో ‘భగవద్గీత బోధన’ చిత్రీకరణ కాస్త జటిలమైనదే. కథాగమనం ఆగకూడదు. ప్రేక్షకులకు విసుగు రాకూడదు. కురుక్షేత్ర యుద్ధం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ ‘బోధన’ ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడకూడదు. కానీ భగవద్గీత బోధన కాకుండా కురుక్షేత్ర యుద్ధం ఆరంభమయ్యే వీలు లేదు. అయితే దృశ్యం, కెమెరా కోణాలు, నటన, చక్కని గానం.. వీటికి తోడుగా అతి చక్కని భావనతో గీతాన్ని రచిస్తే ఎలాంటి దృశ్యాన్నయినా పండించవచ్చని నిరూపించాడు దర్శకుడు ‘శ్రీకృష్ణావతారం’ సినిమాలో ‘వచన గానం’ ద్వారా.

సందర్భం భగవద్గీత బోధన. ఈ సమయంలో గొప్ప గొప్ప కెమెరా కోణాలు, కళ్లు చెదరే సెట్లు, గుండె అదిరే సంగీతం కుదరదు. ముందుగా కుదరాల్సింది గేయ రచన. ఇక్కడే సముద్రాల రాఘవాచార్య ప్రతిభ ప్రస్ఫుటమయ్యేది.

ఇలాంటి సందర్భాలలో భావం మైమరపించాలి. వింటున్నవారు భావానికి మంత్రముగ్ధులైపోవాలి. ఆశ్చర్యపోవాలి. భగవద్గీత అంటే సమాజంలో ఉన్న పవిత్రభావన ఏమాత్రం చెదరకుండా, భగవద్గీత సారాన్ని మామూలు పదాలలో ప్రదర్శిస్తూ పండితులనూ, పామరులనూ మెప్పించాలి.

18 అధ్యాయాల భగవద్గీతను అయిదు నిముషాల్లో కుదించి ప్రదర్శించాడు సముద్రాల రాఘవయ్య ఈ పాటలో. అయితే మొత్తం, భగవద్గీత సారాన్ని ప్రతిబింబించే బదులు, ఆ సందర్భానికి ఎంత అవసరమో, ఆ సందర్భంలో ఎంత చెప్పాలో అంతే చెప్పాడు. ‘బంధువులను, మిత్రులను, గురువులను చంపలేను’ అన్న అర్జునుడికి కర్తవ్య బోధ చేయటం మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాడు.

భగవద్గీత బోధన ఆరంభానికి ముందు కొన్ని సంభాషణల ద్వారా ‘తనువుతో కలుగు బాంధవ్యమ్ములెల్ల’ అంటు ఆరంభించేందుకు భూమికను ఏర్పాటు చేశారు దర్శకుడు, సంభాషణల రచయిత. సంభాషణల రచయితనే గేయ రచయిత కూడా కావటంతో అత్యద్భుతమైన సమన్వయం కుదిరింది.

ఇక్కడే తాను ఎంచుకున్న కళాకారుల ప్రతిభపై దర్శకుడి విశ్వాసం తెలిసేది. ఒక static situation. పెద్దగా ఉద్విగ్నత సృష్టించే వీలు లేదు. సంఘర్షణ లేదు. కానీ ఎన్టీరామారావు శ్రీకృష్ణుడిగా అప్పటికే ప్రజల ఆమోదం పొందాడు. ఎన్టీరామారావు తప్ప ఇంకెవరు శ్రీకృష్ణుడి వేషం వేసినా ఒప్పుకునే స్థితిలో లేరు ప్రజలు. కాబట్టి తన సందర్భోచిత నటన ద్వారా ప్రేక్షకులను ఎన్టీయార్ కట్టి వేయగలడనటంతో ఎటువంటి సందేహం లేదు.

ఈ సందర్భంగా ఔచిత్యమైన బాణీని కుదర్చటం టి.వి. రాజు బాధ్యత. తెలుగు సినీ రంగంలో అందరి తక్కువ అంచనాలకు గురయ్యే అత్యద్భుతమైన  సంగీత దర్శకుడు టి.వి. రాజు. ఆయన పాట చరణాల  నడుమ సరైన ఇంటర్‌ల్యూడ్ సంగీతాన్ని కుదిర్చాడు.

ఈ సందర్భంగా గొప్ప కెమెరా కోణాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. లాంగ్ షాట్‌లు, లోయాంగిల్ షాట్ లు, టాప్ యాంగిల్ షాట్‌లు అప్పుడప్పుడు క్లోజప్పులు చాలు.

ఈ పాటలో, భావం ఎంత కీలకమో, ఆ భావాన్ని పలికే స్వరం అంతకన్నా ఎక్కువ కీలకం. ముఖ్యంగా భావాన్ని పలికే స్వరానికి తగ్గట్టు నటన ప్రదర్శించే నటుడు తోడయితే, ఇక పాట పండినట్టే, ఎన్టీరామారావు నటన, ఘంటసాల స్వర భావ ప్రదర్శనల నడుమ సమన్వయం విషయంలో ఎలాంటి సందేహం లేదు. అనేక సందర్భాలలో ఘంటసాలకాదు, ఎన్టీరామారావే పాడుతున్నట్టు అనిపిస్తుంది.  కాబట్టి దృశ్యాన్ని పండించటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మధురమైన గీతం – మనోహర దృశ్యంగా ‘భగవద్గీత బోధన’ దృశ్యం ఎదిగింది.

ఎన్టీయార్ నటన, సముద్రాల రచనల గొప్పతనం కన్నా ముందు గమనించాల్సింది ఘంటసాల పాట పాడిన విధానం. భావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆయన గొంతును మార్చిన విధానం, భావాలు పలికిన విధానం, హైపిచ్‌కు వెళ్లిన విధానం. సరిగ్గా అయా భావాలకు  తగ్గట్టు ఎన్టీరామారావు హావభావ ప్రదర్శనను గమనిస్తే, ఎందుకని ఆ కాలంలో పాటలు, దృశ్యాలు మరపురానివిగా ఎదిగాయో, ఎందుకని, నటులకు గాయకులకు నడుమ విడదీయరాని అనుబంధం ఏర్పడిందో అర్థమవుతుంది. నేపథ్యంలో గాయకులు పాడలేదు, నటులే పాడేవారన్న భ్రమలో ఎందుకుండేవారో తెలుస్తుంది.

అసలు పాట ఆరంభంలో ఘంటసాల స్వరం ఎంత మంద్రస్థాయిలో మృదువుగా, లాలిత్యంతో  ఉంటుందంటే, బాధ పడుతున్న అర్జునుడి విషాద యోగానికి స్పందిస్తూ, సానుభూతితో, భ్రమలో పడి అనవసరంగా దుఃఖిస్తున్న వాడిని బుజ్జగిస్తూ ‘ఇదంతా భ్రమ’ అని అత్యంత మృదువుగా చెప్తున్నట్టుంటుంది. ఆ మృదుత్వంలో మందలింపు కూడా తొంగిచూస్తూంటుంది.

అంతకు ముందు ఎన్టీరామారావు ‘చంపేవారెవరు చచ్చే వారెవరు?’ అని సంభాషణలు మందలిస్తున్నట్టుగా చెప్తాడు. ఈ సంభాషణలు పలికేటప్పుడు వాక్యానికి, వాక్యానికి నడుమ వదలిన కొన్ని సెకన్లు గొప్ప ఎఫెక్టునిస్తాయి.

కెమెరా ఫ్రేమ్ స్థిరంగా ఉంటుంది.  ఎన్టీరామారావు కళ్లు, పెదవులు చిరునవ్వు చేతుల కదలికలు మాటలు ప్రభావాన్ని పెంచుతాయి. తరువాత కృష్ణుడి క్లోజప్పు, ప్రార్థిస్తున్నా ఆందోళనతో ఉన్న అర్జునుడి క్లోజప్పు చూపిన తరువాత శ్రీకృష్ణుడిని ‘medium shot’ లేక ‘waist shot’ లో చూపిస్తారు.

ఈ కోణం నటుడి బాడీలాంగ్వేజ్‌ని ప్రేక్షకుడికి చేరువ చేస్తుంది. సాధారణంగా ‘వెస్ట్రన్ కౌబాయ్’ సినిమాల్లో ఇదే షాట్‌ను తొడలు, మోకాళ్ల నుంచి పైకి చూపుతారు. అంటే యుద్ధానికి తయారీ కోణం అన్నమాట. అందుకు భిన్నంగా పొట్ట పై భాగం నుంచి చూపించటం వల్ల శ్రీకృష్ణుడు ‘ఫ్రేమ్’ అంతా నిండుతాడు. శ్రీకృష్ణుడి తల వెనుక భాగం ప్రకాశంగా ఉంటుంది. వెనుక ఏమీ లేకపోవటంతో శ్రీకృష్ణుడు ఆకాశమంత ఎదిగనట్టునిపిస్తుంది. ముఖంలో కరుణ ఉట్టి పడుతూండగా ‘తనువుతో కలుగు’ అంటూ పాట ఆరంభమవుతుంది. ఘంటసాల స్వరంలోని మృదుత్వం గొప్ప ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎన్టీఆర్ వదనంలోని భావనలు ఆ ప్రభావాన్ని ఇనుమడింప చేస్తాయి. మాయలో పడి భ్రాంతిని నిజమనుకుని దుఖించే వ్యక్తిని చూసి కలిగే జాలితో కూడిన అభిమానం ఘంటసాల స్వరం ధ్వనిస్తుంది. శ్రీకృష్ణుడి వదనం  ప్రతిఫలిస్తుంది.

నెమ్మదిగా కెమెరా వెనక్కు కదలి శ్రీకృష్ణుడి ముందు మోకరిల్లిన అర్జునుడిని కూడా ఫ్రేమ్ పరిధిలోకి తెస్తుంది.

ఇక్కడ కెమెరా తన కదలికల ద్వారా ప్రేక్షకులకు ఓ విషయం చెప్తుంది. శ్రీకృష్ణుడు మొదట చరణం చెప్పిన తరువాత రెండో చరణం కన్నా ముందు వచ్చే ఇంటర్‍ల్యూడ్ సంగీతం సమయంలో కెమెరా టాప్ యాంగిల్ నుంచి ‘ఐ లెవెల్’ షాట్‍కు వస్తుంది. అంటే అర్జునుడి దృష్టిలో శ్రీకృష్ణుడు ఎంత ఎదిగిపోయాడో చూపిస్తూ, అర్జునుడికి నిజానిజాలు అర్థమయ్యాయని చెప్తోంది కెమెరా!

అందుకే తరువాత ‘షాట్’లో మోకాళ్ల పై కూర్చుని, దండం పెడుతుంటాడు అర్జునుడు. ఎత్తు పై నిలబడి శ్రీకృష్ణుడు బోధిస్తూంటాడు. ఈ కోణంలో కూడా ఆకాశమంత ఎత్తు అనిపిస్తాడు శ్రీకృష్ణుడు.

తనువనిత్యమ్ము నిత్యమ్ము ఆత్మ యొకటే
చివికి జీర్ణములైన చేలముల్ వదలి క్రొత్త వలువలు గ్రట్టికొన్నట్టి రీతి
కర్మానుగతికి ఒక్క కాయమ్ము వదలి వేరొక్క తనువు ప్రవేశించు నాత్మ

గమనిస్తే ఘంటసాల స్వరంలో ‘తనువుతో కలుగు’ అప్పటి కోమలత్వం ఉండదు. ఒక్కో వాక్యం పలుకుతున్న కొద్దీ స్వరం స్థాయి పెరగటమే కాదు, పలికే విధానం, భావ ప్రదర్శనా విధానం మారుతుంటుంది. గొప్ప గాన సంవిధానం ఇది. ‘వేరొక్క తనువు’ అన్న విధానానికి చివరికి ‘ప్రవేశించు’ దగ్గరకు వచ్చేసరికి మంద్రంగా, మృదువుగా అయి ‘ఆత్మ’ అని పలకటంలో ఒక పవిత్ర భావన ప్రదర్శిస్తుంది ఘంటసాల స్వరం. తగ్గట్టుగా ఉంటుంది ఎన్టీయార్ నటన.

ఆత్మకు అదియు అంతమ్ము లేదు
అది గాలి కెండదు అమ్ముతో తెగదు
నీట నానదు, అగ్ని నీరైపోదు
కరుణా విషాదాలు కలిగించునట్టి
అహమును మమకారము నావల నెట్టి
మోహమ్ము వీడి ప్రబుద్ధుడవగుమా!

ఒక్కో వాక్యం,  ప్రతిపదం పలికే విధానంలో సున్నితమైన మార్పుంటుంది. ‘ప్రబుద్ధుడు’ అన్న పదానికి సమాజంలో ‘చెడు’ అర్థం చలామణిలో ఉంది. కానీ ‘ప్రబుద్ధుడు’ అంటే విజ్ఞానవంతుడు అన్న అర్థం. వివేకానంద స్థాపించిన పత్రిక పేరు ‘ప్రబుద్ధ భారతి’. ఏ రకంగా మనం గౌరవంగా, పవిత్రంగా  వాడే పదాలు తప్పుడు అర్థాలతో సమాజంలో పద్ధతిప్రకారం దుష్ట పదాలుగా  ప్రచారంలోకి వచ్చాయో చూపిస్తుందీ పవిత్ర  ‘పద ప్రయోగం’.

ఒక్కడు చంపు, వేరొక్కడు చచ్చునను మాట పొరపాటు
ఆ భ్రాంతి విడువుము

ఇక్కడ ఎన్టీయార్ నిజంగా తానే భగవద్గీత చెప్పే కృష్ణుడన్న, భ్రమ కలిగిస్తాడు. నడుం పై రెండు చేతులు ఆనించి ‘పురుషుల ఉత్తమ పురుండ నేనే’ అనటం గొప్ప ఎఫెక్టునిస్తుంది. ఘంటసాల స్వరంలో ఆ అధికారం, తిరుగులేని విశ్వాసం ధ్వనిస్తుంది.

పురుషుల ఉత్తమ పురుషుండ నేనే
కనులకు దోచు జగమ్మును నేనే,
జగదాత్మయు నేనే,
జగమ్మును సృజించి, పోషించి, లయమొందింతు నేనే

‘భగవద్గీత’ సారాన్ని చిన్న చిన్న వాక్యాలలో అద్భుతంగా పొదిగిన కవికి జోహార్లు అర్పించాలనిపిస్తుంది. ఎక్కడా కఠిన పదం లేదు. అర్థం కాని భావం లేదు. అత్యంత లోతైన తాత్విక భావాన్ని సామాన్య పదాలలో   వ్యక్తపరచాడు కవి.

‘పురుషుల’ అనటం ఆరంభించినప్పటి నుంచీ కెమెరా కదలిక ఆరంభమవుతుంది. నెమ్మదిగా దగ్గరకు వస్తుంటుంది. చివరికి ‘జగము సృజంచి’ నుంచి కృష్ణుడు అహంకారం మచ్చుకయినా కనబడని విశ్వాసంతో కెమెరా వైపు చూస్తూంటే అక్కడే ఆగిపోతుంది కెమెరా. తెరపై శ్రీకృష్ణుడు, ప్రకాశం అనంతమైన ఆకాశం కనిపిస్తాయి.

స్వార్ధానికి  ధర్మమాహుతి చేసి
మదమత్తులై తేలు మానవకోటి
నాశము చేయ సంకల్పించిన నాడ
ఈ రణ యజ్ఞమ్ము నెవ్వరు ఆపలేరు
మృత్యు ముఖమ్ములో మిడుకుచున్న రాజలోకమ్మును రక్షింపలేరు.

‘స్వార్థానికి’ నుంచి ఘంటసాల గొంతులో పెరగుతున్న గాంభీర్యం, ‘ఈ రణ యజ్ఞం’ దగ్గరకు వచ్చేసరికి రౌద్రరసం చిలికిస్తూ ఆవేశం ప్రదర్శిస్తుంది. దాన్ని రామారావు నటన ప్రతిబింబిస్తుంది. కెమెరా కూడా క్లోజపుకు వచ్చి చూపిస్తుంది. ‘రాజ లోకమ్ము’ లో ‘రా’ దగ్గర వొత్తి పలకటం గొప్పగా అనిపిస్తుంది. కళ్లు పెద్దవి చేసి చూస్తూ ‘రక్షింపలేరు’ దగ్గరకు వచ్చే సరికి కనిపించీ కనిపించని నవ్వుతో లాలిత్యం కృష్ణుడి వదనంలో కనిపిస్తుంది.

క్రోధం, ద్వేషం లేక ధర్మరక్షణ కోసం జరిపే సాత్విక హింస భావన పలికే ఘంటసాల గొంతులోని భావనను శ్రీకృష్ణుడి వదనం ప్రతిబింబిస్తుంది.

నా చేత హతులైన నర నాయకుల
నిందింపగ నిమిత్ర మాత్రుండ వీవు
భీష్మాది కౌరవ వీరలోకము
నా గర్భమున మహానల కీలలందు గాలుచున్నారు
ఇదే.. కనుము కౌంతేయా!

రాను రాను ఘంటసాల స్వరంలో గాంభీర్యం పెరుగుతోంది. ‘పిచ్’ పెరుగుతోంది. ‘ఇదే’ దగ్గర శిఖర స్థాయి చేరుకుటుంది. వెంటనే ‘కనుము కౌంతేయా’ అని దిగి వచ్చేస్తుంది. ‘నిమిత్త మాత్రుండవు’ దగ్గర చిన్న నవ్వు ‘అద్భుతం’. స్వరం ద్వారా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటం ఇది. ధ్వనితో దృశ్యాన్ని చూపించటం. ఈ చరణంలో ఘంటసాల గాన ప్రతిభ విశ్వరూప బింబం చూడవచ్చు. నిజంగా భగవంతుడు పలుకుతున్నట్టే అనిపిస్తుంది. అందుకే ఈ పాట చూస్తుంటే కనబడే దృశ్యం, కళ్ళు మూసుకని పాటను విన్నా కనిపిస్తుంది. అంత గొప్పగా అన్నీ అమరాయి పాటకు.

ఇక శ్రీకృష్ణుడు విష్ణువుగా ఎదిగి విశ్వరూపం చూపించటం గొప్ప దృశ్యం. ఆ కాలంలోని పరిమిత సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో అద్భతంగా గొప్పగా చిత్రీకరించారు. భగవద్గీత సారాన్ని అయిదు నిమిషాలలో ప్రదర్శించటం, దాన్ని భగవంతుడే పాడేడన్నభావన కలిగించేట్టు పాడటం, నటించటం చిత్రీకరణ, సంగీతం స్వరం కలసి భగవద్గీత చదివే ఓపిక, తీరిక లేనివారికి, ఫాస్ట్ ఫుడ్ తరం కోసం తయారు చేసినట్టు 1967లోనే మినీ భగవద్గీత సమాజానికి దృశ్య, శ్రవణ రూపంలో అందించిన ఆ తరం కళాకారులకు జోహార్లు అర్చించడం తప్పు కాదు. అంతే కాదు, ఈ సన్నివేశం చూస్తూంటే, అసలు మిగతా ప్రపంచాన్ని మరచిపోతాం. సినిమాను మరచిపోతాం. మనం మహాభారత యుద్ధం కోసం ఎదురుచూస్తున్నామన్న విషయం మరచిపోతాం. భగవద్గీత పూర్తయిన తరువాత దీర్ఘ నిట్టూర్పు విడిచి మళ్ళీ సినిమా చూడటం ఆరంభిస్తాం. ఇదీ కళాకారుల ఘన విజయం. అసలు కథా గమనానికి అడ్డొచ్చేటటువంటి   సన్నివేశాన్ని , సినిమానే మరపించే అత్యద్భుతమైన సన్నివేశంగా మలచిన కళాకారుల ప్రతిభకు జోహార్లర్పించాలనిపిస్తుంది. ఎందుకంటే, యుద్ధానికి సిధ్ధంగా ఉన్న సమయంలో పద్ధెనిమిది అధ్యాయాల భగవద్గీత చెప్పటం సాధ్యమా? అని ప్రశ్నించేవారికి, చెప్పే అంశాలు, చెప్పే విధంగా చెప్తే, పద్ధెనిమిది అధ్యాయాలేమిటి, సంవత్సరాలతరబడి చెప్పినా మైమరచి, సర్వం విస్మరించి వింటారని నిరూపించారు.

(‘శ్రీకృష్ణావతారం’ సినిమాలో ‘తనువుతో కలుగు’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=L9Irm_hKjKg )

(మళ్ళీ కలుద్దాం).

 

Exit mobile version