[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
తదిగిణ తకజను
తదిగిణ తకజను
తరికిట తదరిన
తదీందీంతం ఆనందం
పాట ఆరంభంలో కోరస్ పాడే లయబద్ధమైన నృత్య సూచక స్వరాలు వినగానే ఈ పాట ఏమిటో, ఏ సినిమా లోదో, నటీనటులెవరెవరో సులభంగా చెప్పేయవచ్చు. అంతే కాదు, పాట సందర్భం, చిత్రీకరణ వంటి విషయాలు కూడా వెంటనే గుర్తు వచ్చేస్తాయి. ఇటీవలి కాలంలో ‘గీత గోవిందం’ సినిమాలో పాటలంతగా ‘హిట్’ అయిన పాటలు అరుదు. ఎన్నో హిట్ పాటలున్నాయా కాలంలో. కానీ ఇలా చూడటానికి, పాట వినటానికీ, ‘హమ్’ చేసుకోవటానికీ వీలున్న అరుదైన పాటలు ఈ సినిమాలో ఉన్నాయి.
నాయకుడు తప్పు చేస్తూ పట్టుబడతాడు.( ఈ సన్నివేశానికి లాజిక్ గీజిక్ అడకకూడదు. బస్సులో నిద్ర పోతున్న అమ్మాయితో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నిస్తే, అల్లరి చేసి అక్కడే బస్సులో ఉన్న వాళ్ళతో తన్నించి పోలీసులకప్పచెప్పక అన్నకు ఫోన్ చేయటమేమిటి అని అడగకూడదు. అదే అడిగితే సినిమానేలేదు.) అది తెలిస్తే నాయిక బంధువులు నాయకుడిని తంతారు. అసలు మెలిక ఎక్కడంటే నాయకుడి చెల్లెలు, నాయిక అన్నను పెళ్లి చేసుకుంటుంది. కాబట్టి, ‘అన్నకు చెప్తా’ అని బెదిరించి నాయిక, నాయకుడిని వెంట తిప్పుకుంటుంటుంది. ఆమె చెప్పినట్టు చేస్తూంటాడు. ఆ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక. అయితే, ఇలా నాయికకు నాయకుడు ఒదిగి ఉండటం అన్నది ఇంకా పడుతుంది. ఎందుకంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో, ఎవరి మాటా వినని తలపొగరు ఇమేజ్ విజయ్‌కి వచ్చింది. అలాంటివాడు, అందంగా కనిపిచటమే కాదు, కళ్లతో, వదనంతో నటించటం తెలిసి మంచి ఇమేజ్ ఉన్న అల్లరి పిల్ల రష్మిక చెప్పినట్టు చేయటం సినిమాను మరింత నచ్చేట్టు చేస్తుంది. దీనికి తోడు ద్వంద్వార్థాల పాటలు, మాటలు, చేష్టలు, గుంపుల నృత్యాలు, జాకీలు, పీకిపాకాన పెట్టే డిజేలు, వాయిద్యాలు మ్రోతలు, జోరులు లేకుండా ఎంతో కాలం తరువాత కేవలం నాయిక, నాయకుడు ఇద్దరూ మాత్రమే ప్రేమ పాటల్లో అదీ గెంతులు వేయకుండా మర్యాదగా కనిపించటం, సినిమాకూ విలువ పెరగటంలో, ప్రేక్షకులు మెచ్చటంలో ఎంతగానో తోడ్పడింది. నాయికను ‘ఏమే పోవే’ అంటూ; నాయిక నాయకుడి కోసం పడి చచ్చిపోయి, అడగబట్టినట్టు, మెహం వాచిపోయి ప్రేక్షకులు సిగ్గుతో చచ్చేట్టు ప్రవర్తించటం అనవాయితీ అయిన కాలంలో పొరపాటున కూడా చేయి తగిలితే కాల్చి పడేస్తా అన్నట్టు, చూపులతోనే హీరోను ఆమడ దూరంలో నిలబెట్టే అరుదయిన, మర్యాదకరమైన, గౌరవప్రదమైన, సభ్యతా హద్దులు తెలిసిన నాయిక పాత్ర తెలుగు సినిమాలో కనిపిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టరా? ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అని బాగా తెలిసిన సమాజంలో ‘తెలుసుకొనవే చెల్లీ’ పాటలోలా నడచుకొనే యువతి తెరపై కనిపిస్తే ప్రేక్షకులు మెచ్చకుండా ఉంటారా?
కంటి చూపుతో కొన్ని మైళ్ల దూరం పెట్టే యువతి ‘ఉదయం గుడికి వెళ్లాలి, వచ్చి పికప్ చేసుకో’మని ఆజ్ఞలు జారీ చేస్తే, హీరో యువ హృదయం ఎంత ఆనందిస్తుందో ప్రేక్షకుడూ అంత సంతోషిస్తాడు. కారు బదులు కావాలని ద్విచక్ర వాహనం తీసుకు వెళ్లి, దొంగ చూపులు చూస్తూ పట్టుబడి, తడబాటులో ‘ఇగ్నిషన్ కీ ఆన్’ చేయటం మరచిపోయి కిక్కులు కొడుతున్న హీరోను ‘కీ’ ఆన్ చేసి, చీత్కరింపుగా చూసి, తిట్టుకుంటూ అమ్మాయి బండి ఎక్కినందుకే సంతోషిస్తూ కలలు గంటున్న హీరో.. ఒక అందమైన ప్రేమ కథను అంతే అందంగా compatible అయిన నటీనటులతో ఆహ్లదకరమైన సన్నివేశం సృష్టించటంలో స్క్రిప్టు ఘన విజయం సాధించింది. నిజానికి సందర్భం గొప్పది కాదు. కానీ, పాత్రల వ్యక్తిత్వాలు, వారి నడుమ సంఘర్షణ, హీరోయిన్ కోపం, హీరో తడబాటు అన్నీ చక్కలిగింతలు పెట్టే లక్షణాన్ని సందర్భానికి ఆపాదించాయి. ఈ సందర్భంలో హీరో, నాయికను స్కూటర్ మీద ఎక్కించుకుని పోతుంటే, నేపధ్యంలో ‘తదిగిణ’ అంటూ పాట ఆరంభమవుతుంది.
నిజానికి నాయిక తిట్టుకుంటూ బండి వెనుక కూర్చోగానే హీరో అపాలజిటిక్‌గా అయినా సంతోషంగా అక్కడ ఉన్న నాట్య కళాకారిణుల వైపు చూస్తుండగా ఆనంద భైరవి రాగంలో వీణ హోయలు పోతూ పలుకుతుంది. ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు నిలుస్తుంది. ఈ ‘వీణ బీట్’ పాటకు సంకేతంలా ఎదిగింది.
సంగీత దర్శకుడు ‘గోపీ సుందర్’ అభినందనీయుడు. ఈ పాటకే కాదు, సినిమాలోని ఇతర హిట్ పాటలు, ‘యేంటీ యేంటీ ఈ కొత్త వరస’ను ‘రేవతి’ రాగంలో, ‘వచ్చిండమ్మా’ పాటను ‘హంసధ్వని’ రాగంలో రూపొందించినందుకు కూడా అభినందనీయుడు. ఈ పాటల ఆకర్షణ, శాస్త్రీయ రాగాల ఆధారంగా, ఎంతో కాలానికి రూపొందటమే అనిపిస్తుంది. వాయిద్యాలు కూడా పాశ్చాత్య వాయిద్యాలు వాడినా, సాంప్రదాయిక వాయిద్యాలకు అధికంగా ప్రాధాన్యం ఇవ్వటం కనిపిస్తుంది. నేపథ్య సంగీతంలో కూడా ఇది కనిపిస్తుంది.
తలవని తలపుగ, ఎదలను కలుపగ
మొదలిక మొదలిక, మళ్లీ గీత గోవిందం
ఇదంతా కోరస్ పాడుతుంది. పాటలో పదాలు వాటి అర్ధాలు, సందర్భానికి అన్వయించుకునే తర్కాన్ని వదలి, పాట బాగుంది, వాడిన పదాలేవో లయబద్దంగా ఉండి బాణీలో ఒదిగాయని సంతోషించాలి. పైగా, ఎలాంటి అశుభ్రమైన అర్థాలు లేకుండా చక్కని పదాలను వాడినందుకు గేయ రచయితను అభినందించాలి. భావం ఎటు పోయినా పదాలను బాగా కూర్చాడనుకోవాలి.
ఈ పాట చిత్రీకరణ బాగుంటుంది. సినీ కళాకారులందరూ కలసి చమత్కారభరితమైన feel good ప్రేమ కథను తీయాలని నిశ్చయించుకున్నట్టున్నారు.
ఇది ప్రతి ఫ్రేమ్ లోనూ కనబడుతుంది.
నాయిక తిట్టుకుంటూ వెనుక కూర్చుంటుంది. బండి ఆరంభించే ముందు నవ్వుతూ హీరో బండికున్న సైడ్ మిర్రర్‌లో కోపంగా ఉన్న అమ్మయి ముఖం చూస్తాడు. ఆమె కోపంగా ఉన్నా హీరో నవ్వు కానీ ఆనందం కానీ తరగదు. ‘అమ్మాయి’ ఎంత కోపం ప్రదర్శించినా తనపై ‘ఏదో’ ఉందన్న భావన హీరో ప్రదర్శిస్తాడు.
బండి నడపటం కూడా నెమ్మదిగా పాట లయకు తగ్గట్టుంటుంది. సంగీతం చక్కటి భావనను ఒక ‘స్వప్నం’ దర్శిస్తున్న భావనను కలిగిస్తుంది. హీరో కలను, ప్రేక్షకుడు అనుభవిస్తాడు.
ఇంకా ‘కోరస్’ పాడుతూండగానే గుడి చేరుకుంటారు. హీరో ఓవరాక్షన్ అలరిస్తుంది. ఓ పెద్ద ఆఫీసర్ వచ్చినట్టు అందరినీ దారి నుంచి పక్కకు తొలగించటం, అడుగులకు మడుగులొత్తటం అలరిస్తాయి.
ఇంకేం ఇంకే ఇంకేం కావాలే..
చాలే ఇది చాలే..
నీకై నువ్వే వచ్చి వాలాలే..
ఇక పై తిరణాళ్లే..
గుండెల్లోన వేగం పెంచావే..
గుమ్మంలోని హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే..
నాకొక్కగంట ఒక్కో జన్మై
మళ్లీ పుట్టి చస్తున్నానే..
పాటలో పదాలతో, భావాలతో సంబంధం లేకుండా తెరపై కనబడే దృశ్యాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. బాణీ బాగుంది. అర్థం, అన్వయం వెనుకబడి అవసరమైన విషయాల గురించి అలోచించటం వ్యర్థం.
తెరపై వాళ్లు బట్టలు కొనటం, తన ఫోటో తీశాడని నాయిక అనుమానించటం, ఓ దండం పెట్టి హీరో మరో వైపు నడవటం, బండి పాడయితే హీరో తోసుకుంటూ వెళ్తే తాను ఎక్కి కూర్చోవటం, లైసెన్సు లేదని పోలీసులు బండిని తీసుకుపోవటం, ఇలా ఒకో సంఘటన ప్రేక్షకుడిని తెరవైపు చూస్తూ ఆనందించేట్టు చేస్తాయి. నాయిక కళ్లతోనే హీరోను శాసించటం, చాలా కాలం తరువాత హీరోను చూడగానే ఒళ్లు పై మరిచిపోయి, సిగ్గు లజ్జ వదిలేసి, పుట్టిందే అందుకోసమన్నట్టు (అంతా అభ్యుదయం అనుకోండి) ఆత్రంగా అసహ్యంగా ప్రవర్తించే నాయికలు (ఈ నటి కూడా అదేదో సినిమాలో పెళ్లి చేసుకోమని హీరో వెంటపడి మెదడు ఎదగని, శరీరం ఎదిగిపోయిన వికృతపు పాత్ర పోషించింది) అలవాటయిన తరుణంలో ఇలా కళ్లలో శాసించి, అద్దం పట్టుకునేట్టు చేసే నాయిక పాత్రను అభినందించకుండా ఉండలేము.
ఇలా తెరలో ఓ వైపు సంఘటనలు సాగిపోతూంటాయి. పాట ధోరణిలో పాట సాగిపోతుంటుంది. కానీ దాంతో పాట శ్రావ్యంగా ఉండటం వల్ల పరవశిస్తూ తెరపై దృశ్యాలను ఆనందిస్తూ గడిపేస్తారు ప్రేక్షకులు. పాట అయిపోయే సరికి ఎంతో హాయిగా ఫీలవుతారు. సినిమా మొత్తం ఇలా హాయిగా, అడుతూ పాడుతూ గడిచిపోతుంది.
సంగీత దర్శకుడు పాటలకు చక్కటి బాణీలను సృజించాడు. వాటికి సంగీత వాయిద్యాలను ఎంతో సృజనాత్మకంగా అమర్చాడు. ప్రతి పాట ఆకర్షణీయంగా ఉన్నా, పాటలో ఏదో ఒక అంశం కొట్టొచ్చిన్టటు కనబడి ఆకర్షిస్తుంది. గుర్తుండిపోతుంది. ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటలో కీబోర్డు, గిటార్, డ్రమ్స్, వయోలిన్లు వాడినా ‘వీణ’ గుర్తుండిపోతుంది. అలాగే పాటలో పాశ్చాత్య గీత ప్రక్రియలైన ‘ఆర్ అండ్ బి’ సంగీతం ‘పాప్’ లను వాడినా కర్ణాటక సంగీత రాగాలయిన ఆనందభైరవి, కాపీ రాగాలను మేళవించిన విధానం ఆకట్టుకుంటుంది. కొట్టొచ్చినట్టు వినబడి పాటకు ఒక ‘సెమీ క్లాసికల్’ స్థాయిని ఆపాదిస్తుంది.
ఇటీవలి కాలంలో ఇంత సృజనాత్మకంగా, ప్రయోగాత్మకంగా, ఇంతగా మనసు పెట్టి రూపొందిస్తున్న పాటలు అరుదుగా వినిపిస్తాయి. హిట్ పాటలు, సూపర్ హిట్ పాటలు ఉన్నా, పాట వింటుంటే, పాటను రూపొందించటంలో సంగీత దర్శకుడి శ్రమ తెలిసిపోతుంటుంది. ఇక్కడ ‘శ్రమ’ అంటే గంటల తరబడి శ్రమించటం కాదు. మనసు పెట్టటం, ఆలోచించటం.
ఇలా సృజనాత్మకంగా పాటలను రూపొందించటం. వాటికి ఆకర్షణీయమైన, తగిన చిత్రీకరణ తోడవటం ఈ సినిమాలోని ఇతర పాటలలో కూడా కనిపిస్తుంది. పాటల సందర్భాలలో కొత్తదనం లేకపోయినా, పాత్రల వ్యక్తిత్వాలతో ప్రేక్షకుడు మమేకం చెందటం వల్ల తెరపై కనబడే ఆయా సంఘటనలకు ప్రేక్షకుడు స్పందిస్తాడు.
ఏ సినిమా అయినా సూపర్ హిట్ కావాలంటే, ఆకాశం పట్టనంత కథ, విశ్వం పట్టనంత నటీనటులు అవసరం లేదు. పాత్రల వ్యక్తిత్వాల ఆధారంగా చక్కటి స్క్రిప్టు తయారు చేసుకుని, తగ్గ నటీనటులను ఎంచుకుని మంచి సంగీతం (అదరగొట్టే పాశ్చాత్య సంగీతం అవసరం లేదు) జోడించి, చక్కటి పాటలను రూపొందిస్తే, అందమైన ఆహ్లదకరమైన సినిమా తయారవుతుంది. ప్రేక్షకులు పదే పదే చూసి ఆనందిస్తారు. పేరుకు పేరు వస్తుంది. బాక్సాఫీసు బద్దలవుతుంది.
సినీ కళాకారులకు ఇంతకన్నా ఏం కావాలి?
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..
చాలే ఇది చాలే..
~
(‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=LPeZOE8ZIHI )
(మళ్ళీ కలుద్దాం)
