Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-47

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

ఓ సజీవ శిల్ప సుందరీ
నా జీవన రాగ మంజరీ

‘పునర్జన్మ’ సినిమాలో ఈ పాట సినిమా మొత్తానికీ కీలకం. ఈ పాట లేకపోతే సినిమా కథ ముందుకు పోదు. అందుకే సినిమా ఆరంభయిన మొదటి పది నిమిషాలలో పాట వచ్చేస్తుంది. కథ ఆరంభమైపోతుంది.

హీరో శిల్పి, గాయకుడు. అతడో అందమైన అమ్మాయి శిల్పం రూపొందిస్తాడు. ఆ శిల్పం ఎంత అందంగా ఉంటుందంటే, ఆ శిల్పం ప్రేమలో పడతాడు. అది ప్రాణం పోసుకుని సజీవంగా ఒక్కసారి కదలి వస్తే బాగుంటుందని తపిస్తాడు. సంగీతానికి రాళ్లు కరుగుతాయి. కాబట్టి సంగీతంతో ఆ శిల్పానికి ప్రాణం పోయాలనుకుంటాడు. సితార్ తీసుకుని శిల్పం ఎదురుగా కూర్చుని పాడటం ఆరంభిస్తాడు.

‘పునర్జన్మ’ సినిమా గుల్షన్ నందా నవల ‘పత్థర్ కే హోంఠ్’ ఆధారంగా నిర్మించినది. హీరో కళాకారుడు. సున్నిత మనస్కుడు. అతడు సృష్టించిన స్త్రీ శిల్పం సౌందర్యానికి పరమావధిగా భావిస్తాడు. ఈ పాత్ర గ్రీకు పురాణాల్లో ‘పిగ్మాలియన్’ను పోలి ఉంటుంది. తన చుట్టు ఉన్న మహిళల  పట్ల నిరాశ కలిగి అతను ఆదర్శ స్త్రీ శిల్పం సృష్టించి, దాని ప్రేమలో పడతాడు. ఆ శిల్పాన్ని సజీవమూర్తిగా భావిస్తాడు. ‘అఫ్రొడైట్’ దేవతను ప్రార్థిస్తే, ఆమె ఆ శిల్పానికి ప్రాణం వచ్చేట్టు చేస్తుంది. ‘పునర్జన్మ’లో సంగీతం ద్వారా శిల్పానికి ప్రాణం పోయాలని హీరో ప్రయత్నిస్తాడు. కానీ, అంతకు ముందు తాగి పారేసిన సిగరెట్ వల్ల గదికి నిప్పుంటుకుంటుంది. శిల్పానికి ప్రాణం పోయాలన్న తీవ్ర తపనలో, గానంలో సర్వం మరచిన హీరోకు తెలివి వచ్చేసరికి శిల్పం ముక్కలయి ఉంటుంది. దాంతో అతడి మతి భ్రమిస్తుంది. మిగతా కథంతా వేరే.

శిల్పానికి ప్రాణం పోయాలని తపిస్తూ హీరో పాడే పాట ఇది. అందుకే ఆమెను ‘సజీవ శిల్ప సుందరీ’ అన్నాడు. ‘నా జీవన రాగ మంజరీ’ అన్నాడు. ఇలాగే నాయకుడి భ్రమను అందమైన పదబంధాలతో ఇమిడ్చి, ప్రేక్షకుడు అమోదించేట్టు చేశాడు గేయ రచయిత.

పాట చిత్రీకరణలో పెద్ద విశేషం ఏమీ లేదు. ఎందుకంటే సందర్భం తెలిసి పోయింది. హీరో శిల్పం ముందు కూర్చుని ‘సితార్’ వాయిస్తూ పాట పాడతాడు.

శిల్పాన్ని హీరో సజీవమూర్తిగా భావిస్తున్నాడు. కాబట్టి శిల్పం ప్రాణం పోసుకుని వచ్చి నృత్యం చేయటం తప్పదు.నృత్యానికి తగ్గట్టు, భంగిమలననుసరించి కెమేరా కదలితే పనయిపోతుంది. తరువాతపనంతా ఎడిటర్ దే.   పాట చివరికి వచ్చేసరికి అంతా కాలిపోవాలి కాబట్టి పారేసిన సిగరెట్టు వల్ల శిల్పం అంటుకోవటం, మంట పెరిగి పోతున్నా, హీరో తన్మయుడై మైమరచిపోయి గానం చేస్తూండటం వంటివి సందర్భోచితంగా చూపిస్తే సరిపోతుంది. ఉద్విగ్నత అన్నది సన్నివేశంలోనే ఉంది. కాబట్టి పాట అధికంగా ఆధారపడేది బాణీ పైన, బాణీలో ఒదిగే సాహిత్యం పైన. ఘంటసాల గానం ఎలాగో అత్యుత్తుమ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో బెంగ అనవసరం.

సంగీత దర్శకుడు కళ్యాణి రాగం ఎంచుకున్నాడు ఈ సందర్భానికి.  కళ్యాణి రాగాన్ని ‘రాగాలకు రాణి’ అంటారు. శాంతిని, ప్రశాంతతను, దైవత్వ భావనను కలిగిస్తుందీ రాగం. అందుకే ఈ పాట వింటుంటే ప్రశాంతత మనసుని ఆవరిస్తుంది. తెలియకుండానే మనసులో పవిత్ర భావన నిండుతుంది. ఈ భావన కలగటానికి గేయ రచయిత శ్రీశ్రీ పదాలు కలిగించే భావనలు ఎంతో  తోడ్పడతాయి. ఆ భావనలకు ప్రాణం పోసిన ఘంటసాల స్వరం అంతగా తోడ్పడుతుంది. నటుడు చేయాల్సిందేమీ లేదు. సితార్ పట్టుకుని కూర్చుని తన్మయుడై సర్వం మరచినట్టు నటించాలి.

ఎవరివో నీవెవరివో
ఎవరివో నీవెవరివో
నా భావనలో.. నా సాధనలో
నాట్యము చేసే రాణివో
ఎవరివో.. ఎవరివో..

ఇంత చాలు.. ప్రేక్షకుడికి నాయకుడి మనస్తత్వం బోధపడటానికి, సందర్భ తీవ్రత అర్థమయేందుకు. ‘నా భావన, నా సాధన’ అద్భుతమైన పదాలు. కళాసృజన ఒక రకమైన తపస్సు. సృజన ప్రక్రియ లోతులు చవిచూసిన కవి, ఎత్తులు అధిరోహించిన కవి  మాత్రమే ఇలా రాయగలడు.  క్లిష్టమైన లోతయిన భావనలను, సామాన్యుడు అనుభవించని భావనలను  ఇంత అలతి పదాలతో అంత లోతయిన అర్థం స్ఫురించేలా రాయటం అదరికీ సాధ్యం కాదు. అర్థం చేసుకున్న వాడు అత్యంత క్లిష్టమైన అంశాన్ని కూడా అతి సరళంగా వివరిస్తాడు. అర్థం కాని వాడు సులువైన అంశాన్ని కూడా సంక్లిష్టం చేస్తాడు.

అతని భావనలో, సాధనలో ఆమెనే నాట్యం చేస్తుందనటం అతని సృజన ఆమె పరంగా సాగిందని, ఆమె అతని తపస్సుకు కేంద్రం అనీ, ఆమెనే అతనికి ప్రేరణ అనీ పలు రకాల లోతైన ఆలోచనలు కలిగిస్తాయి. కళాకారుడికి ప్రేరణ కలగించాలంటే అతనిలో మథనానికి కారణమవ్వాలి. ఆ మథనం నుంచి జనించే హాలాహలాన్ని భరించి, అమృతాన్ని సృజన రూపంలో కళాకారుడు ప్రకటించేందుకు మార్గదర్శనం చేయాలి. ఇదంతా ఆమె చేస్తున్నది. కానీ ఆమె ఎవరో అతడికి తెలియదు. అపరిచిత అయి, అజ్ఞాత అయి కూడా ఇంత ప్రేరణ కలగిస్తున్నదంటే ఆమె ఈ లోకానికి చెందినది కాదు. అత్యున్నత ఉన్మత్త విశృంఖల ఊహశాలిలో కదలిక కలిగించిన దైవ సమానురాలు.

ఈ పాట వినగానే ముఖ్యంగా ‘ఎవరివో, నీ వెవరివో’ వినగానే, శాంతారాం సినిమా ‘స్త్రీ’ లో ‘కౌన్ హో తుమ్, కౌన్ హో’ మనసులో మెదులుతుంది. శకుంతలను చూసిన దుష్యంతుడి మదిలో కలిగిన అలజడి ఆ పాట. ఆమె దివ్యరూపం అతని మదిలో కలిగించిన దివ్యభావనల ప్రకటన ఆ పాట.

కవి కీ మధుర్ కల్పనా హో తుమ్
యా గాయక్ కీ మధురిమ్ తాన్
యా సరితా జల్ కీ తరంగ్ హో
అరుణ్ కమల్ కీ మధు ముస్కాన్
కౌన్ హో తుమ్, కౌన్ హో?

నాయికను అతి శుద్ధమూ అతి సుందరము, పవిత్రమూ, అద్వితీయము అయిన భావాలతో వర్ణించాడు కవి. మధుర కల్పన, గాయకుడి మధుర గానం, స్వచ్ఛమైన నీటి తరంగం, ఎర్రతామర మకరందమయమైన చిరునవ్వు. ఎంత శుద్ధ హిందీ పదాలు! ఎంత పవిత్రమైన భావనలు! ప్రాచీన సాహిత్యంపై మక్కువ, అభిమానంతో పాటూ తీవ్రమైన అధ్యయనం, ప్రేమలున్న కవి మాత్రమే ఇలాంటి పదాలు, ఇలాంటి భావనలు అంత సరళంగా, సులువుగా వ్యక్తపరచగలడు.

దివినే వదలి భువికేతెంచిన తేనెల వెన్నెల సోనవో
కవితావేశమే కలవై అలవై కురిసిన పువ్వుల వానవో..
ఎవరివో.. నీ వెవరివో..

స్త్రీని వంటింటి కుందేలును చేసి, స్త్రీని  మనిషిగా గౌరవించని కాలంగా మేధావులు  భావించే కాలంలో స్త్రీని ఆకాశం వదలి భూమికి వచ్చిన తేనెల వెన్నెల సోనగా అభివర్ణించారు. ఇప్పటి కాలంలో నాయిక, ‘సిల్కుచీర కట్టుకుని చిల్డ్ బీర్ మెరిసినట్టుందం’టాడు హీరో. లేకపోతే, ‘తూనీగ నడుములోన తూటాలెట్టి తుపాకీ పేల్చినావే తింగరి చిట్టీ’ అని ఎంతో  గౌరవంగా, ఆప్యాయంగా  లిబెరేటెడ్  యువతి,  నాయికను వర్ణిస్తాడు ,  హీరో. ఇంకా అనుకున్న స్థాయి అందమైన పిల్ల కనబడకపోతే ‘సూడగానే దిమ్మెత్తిపోయే బుజ్జిపండు ఇంకా పుట్టనేలేదా?’ అంటూ వాపోతాడు.  స్త్రీని దేవకన్యగా భావించి ఒక పీఠంపై ఉంచి ఆరాధిస్తే, ఆమె శారీరక సౌఖ్యానికి దూరమవుతున్నదన్న  సిద్ధాంతాలు లేవదీసి,  సానుభూతి కురిపించి, అసంతృప్తులు రెచ్చగొట్టి, రాద్ధాంతాలు చేసి, పీఠం నుంచి నిర్దాక్షిణ్యంగా క్రిందకు లాగిపారేసి, స్త్రీని ‘శారీరక సౌఖ్యాలందించే బొమ్మ’  అన్న భావనకు పరిమితం చేసిన ఆధునిక సిద్ధాంతాల ఫలితాలీవర్ణనలు.

ప్రణయ్ గీత్ కీ ప్రథమ్ పంక్తి హో
యా మను కీ పహలీ సంతాన్
నవ యౌవన్ కీ ప్రథమ్ దృష్టి హో
నయనోం కీ పహలీ పహచాన్
కౌన్ హో తుమ్, కౌన్ హో

భరత్ వ్యాస్ ఎంత శుద్ధమైన హిందీ పదాలు వాడతాడంటే భాష రాని వారికి కూడా సులభంగా అర్థమైపోతుంది కవి భావన.

ప్రణయ గీతంలో ప్రథమ పంక్తి ఆమె. మనువు తొలి సంతానం. మనువు తొలి సంతానం ‘ఆకృతి’. ఆకృతి వివాహం రుచి ప్రజాపతితో జరిగింది. వీరి సంతానమే మనష్య సంతానం. ‘ఆకృతి’ అంటే మానవ జాతి ఆవిర్భావానికి ఆద్యురాలన్న మాట. అతని ప్రేయసి. నవ యువకుడి ప్రథమ దృష్టి. అంటే నవయువకుడి మనసుకి నచ్చిన స్త్రీ, ప్రథమ దర్శనం. అతని కళ్లు తొలిసారిగా చూసిన సౌందర్యం.

అయినా ‘నీవెవరు?’ అని హిందీలో అడుగుతున్నాడు కవి.

నవవసంతమున నందన వనమున కోయిల పాడిన పాటవో
వలపు కొలనులో కలకల విరిసిన కలువల కన్నుల కాంతివో..

ఇలాంటి భావనలు ఇంత  సరళంగా వ్రాయాలంటే, కవికి ప్రాచీన సాహిత్యంపై పట్టు ఉండాలి. ప్రాచీన సాహిత్యంలో ప్రదర్శితమైన ఉత్కృష్ట భావనలలోతులు తెలిసిఉండాలి. పదాల శక్తి గ్రహించి ఉండాలి. ఔచిత్యం అవగతమై ఉండాలి. సాహిత్య సంస్కారం, భాషా సుగంధాలు తెలిసి ఉండాలి. ఔచిత్య సౌందర్యం గ్రహించి ఉండాలి.  అప్పుడే ఇలా, తరాల అంతరాలను దాటి, కాలాన్ని జయించి నిలవగలిగే రచనలు సృజించగలుగుతారు. తమతో పాటూ సమాజ సంస్కారాన్ని, మానసిక స్థాయిని ఒకమెట్టు పైకి ఎక్కిస్తారు. లేకపోతే కుర్చీలు మడతబెడతారు. బీరుకు సిల్కు చీర చుడతారు.   ప్రేయసి బిర్యానీకి బొట్టుపెట్టినట్టుండే  చందమామ అంటారు.  నవ వసంతాలు, నందనవనాలు, వలపుకొలనులు అన్నీ పాత బ్రాహ్మణ  వాసనలు, పురాణాల చింతకాయ పచ్చళ్ళు అవుతాయి ప్రాచీన సాహిత్యంతో పరిచయం లేకపోవటమే పాటలు రాసేందుకు అర్హతగా భావించేవారికి. కిక్కురాదు ఆభావనలతో. ఇందువల్ల నష్టం సాహిత్యానికి, సమాజానికి, రాబోయే తరాలకు…పైగా, ఇప్పటి హీరోలు ఫైటర్లు, లైటర్లు, కైటర్లు..వాళ్ళు శిల్పం చెక్కే ప్రసక్తే లేదు. చెక్కినా దానితో ప్రేమలో పడే చాన్స్ లేదు. ఉన్నా సితార్ పట్టుకుని పాడే అవకాశంలేదు. సితార్ పట్టుకుని పాడే అవకాశం ఉన్నా, శ్రీశ్రీ లేడు, ఘంటసాల లేడు, చలపతిరావూ లేడు ఇలాంటి పాట సృజించేందుకు. అది ఆ కాలం. ఇది ఈ కాలం. సున్నితమనస్కుల  మనసుకాలే వికల  కలికాలం.

హిందీలో మరో చరణం ఉంది.

ఋతు బసంత్ కీ ప్రథమ్ కలీ హో,
సావన్ కీ పహెలీ బర్సాత్
యా చిర్ విరహీ దో హృదయోం కే
మధుర్ మిలన్ కీ పహలీ రాత్

వసంత ఋతువులో విరిసిన ప్రథమ పుష్పమో, వర్ష ఋతువులో తొలి వర్షమో, చిరవిరహంతో తపిస్తున్న రెండు హృదయల మధురమైన కలయిక రాత్రి. అసలు ఇలాంటి సుందరమైన భావాలు తట్టాలంటే కవులు ఎన్ని జన్మల తపస్సులు చేసి ఉంటే ఈ జన్మలో ఇలాంటి పాండిత్యంతో, ఇంతటి సుందరమైన భావ వ్యక్తీకరణ కల కవులుగా జన్మిస్తారు.

(‘కౌన్ హో తుమ్, కౌన్ హో’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=48aUq0iPwkk )

హీందీ పాటలో భావాలకు ప్రేరణగా తీసుకుని తెలుగులో అతి సుందరమైన గేయ రచన చేశాడు శ్రీశ్రీ. హిందీ పాట, తెలుగు పాట సాహిత్యంలో, బాణీలో ఒకదానికొకటి తీసిపోని స్థాయిలో ఉన్నా, రెంటి నడుమ భేదం కలిగించి తెలుగు పాటను హిందీ పాట కన్నా ఓ పైమెట్టున ఉంచేది ఘంటసాల గానం. పాట ఆరంభం నుంచీ చివరి వరకూ ఘంటసాల స్వరంలో తపస్సు చేస్తున్న పవిత్ర భావం, అలవి కాని ఆనందానుభూతి, అతిలోక దివ్య సౌందర్యాన్ని దర్శిస్తున్న అనుభూతి, ఒక ఉద్వేగం, శృంగారం, శాంతం  సర్వం తొణికిసలాడుతుంటాయి. ‘ఎవరివో’ నుంచి ఆరంభించి తీసిన రాగాలు, దీర్ఘాలు, గమకాలు ఘంటసాల స్వరం పోయిన సోయగాలు.. సంగీత సాహిత్య స్వర సమ్మేళనం బ్రహ్మానంద కారకం అనటానికి తిరుగులేని ఋజువు ఈ పాట. తన పరిధిలో హిందీలో మహేంద్ర కపూర్ అద్భుతంగా పాడేడు. సరస్వతీ దేవి కచ్ఛపి వీణ ముందు మానవులు సృజించిన ఎంతటి అత్యత్తమైన వీణ అయినా ఎలాగో, ఘంటసాల ముందు మహేంద్ర కపూర్ అలాగ.

నీ కర కంకణ నిక్వణమా
అది వాణీ వీణా నినాదమా
నీ పద నూపుర నిస్వనమా
అది జలధి తరంగ మృదంగ నాదమా
రావే మోహన రూపమా
రావే నూతన తేజమా
రావే.. రావే..

గదిలో పెరుగుతున్న జ్వాలకనుగుణంగా పాట వేగం పెరుగుతుంది. ఉద్వేగం పెరుగుతుంది. పాటలో పదాలు పర్వతం నుండి జారే జలపాత ధారలా పరుగులు తీస్తాయి.

పాట ఆరంభంలో వినిపించిన సితార్ పాట చివరికి వచ్చేసరికి వేగవంతమై,  ఉద్వేగ భరితమై  ఉద్విగ్నతామయమౌతుంది. పాట చివరకు వచ్చేసరికి సితార్ వాయిద్యం వేగవంతమవుతుంది. ఓ వైపు ఎగసిపడుతున్న జ్వాలలు, మరోవైపు, మైమరచి సితార్ వాయిస్తున్న హీరో…దృశ్యం గొప్పగా అనిపిస్తుంది.

దృశ్యం అద్భుతంగా పండుతుంది.

ఇక్కడ గమనించవలసిందేమిటంటే, ఒక కళాకారుడు తాను సృష్టించిన శిల్పం నిర్జీవం అని మరచిపోయి, దాన్ని సజీవ సుందరిలా భవించి, అది ముక్కలయిపోతే పిచ్చివాడయిపోవటం ఆ కాలం నాటి ప్రేక్షకులే కాదు ఈ కాలం ప్రేక్షకులు కూడా ఈ పాట చూస్తే ఆమోదిస్తారు. అతని సున్నిత హృదయంలో ఒదిగిన తీవ్ర ప్రేమ తుఫాను ప్రేక్షకులకు సులభంగా అర్థమౌతుంది.

(‘ఎవరివో నీవెవరివో’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=B5spbpXVk-I )

కానీ ఇదే సినిమాను 1970లో హిందీలో ‘ఖిలోనా’గా నిర్మించినప్పుడు, ఇలా శిల్పం విరిగిపోతే పిచ్చివాడవటాన్ని ప్రేక్షకులు ఆమోదించరేమోనన్న భయంతో హీరో ప్రేయసి మరొకరిని పెళ్లి చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే హీరో పిచ్చివాడయ్యాడని మార్చారు. ఇక్కడ గమనించాల్సిందేమింటంటే ప్రేక్షకులు ఆమోదించరన్న దానికన్నా తెలుగులోలా ప్రేక్షకులు ఆమోదించేటట్టు చేసే శక్తి తమకు లేదని హిందీ కళాకారులు గ్రహించారు. ఎందుకంటే ‘ఎవరివో నీ వెవరివో’ లాంటి పాట రూపొందించటం ఆషామాషీ వ్యవహారం కాదు. అది అందరికీ సాధ్యం కాదు. ఈ కళాకారులకే  మళ్లీ అలాంటి పాట సృజించమంటే సృజించటం వీలుపడదు. సూర్యకిరణం వల్ల ఇంద్రధనస్సు లేర్పడటం సాధారణం. కానీ చంద్ర కిరణం వల్ల ఏర్పడే ఇంద్రధనస్సు అరుదు కన్నా అరుదు. అలా అతి అరుదుగా రూపొందుతాయి ఇలాంటి పాటలు. భావితరాల ముందు ఎవరెస్టు శిఖరంలా నిలబడి సవాళ్లు విసురుతూంటాయి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version