[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
మాంగల్యం తంతునానేనా
మమ జీవన హేతునా
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం
అందరికీ తెలుసు ఇవి పెళ్లి మంత్రాలని. ఈ పెళ్లి మంత్రాలను ఒక పాటకు గుర్తింపు సంతకంగా మలచాడు సంగీత దర్శకుడు ‘థమన్’. దాంతోటి అర్థం తెలిసినా తెలియకున్నా, అసలివేం మంత్రాలో కూడా తెలియకున్నా, పిల్లలు కూడా ముద్దు ముద్దు మాటలతో పాడుకునే వీలు చిక్కింది.
‘సర్కారు వారి పాట’ అనగానే ఈ పాట గుర్తుకు వస్తుంది. ఈ పాట వినబడగానే ఆ సినిమా గుర్తుకు వస్తుంది. ఇటీవలి కాలంలో ఇంతగా హిట్ అయిన పాట మరొకటి లేదు. ఈ పాట విడుదలయిన 24 గంటల్లోగా 14.84 మిలియన్ల మంది చూశారు. ఇప్పటికి 100 మిలియన్లపై సంఖ్యలో ఈ పాటను చూశారు. ఇది ‘పుష్ప’ సినిమాలోని సూపర్ హిట్ పాట ‘ఊ అంటావా మామ’ కన్నా ఎక్కువ. ఆ పాట ఆడియో ఎంత ఆకర్షించిందో, వీడియో అంత నిరాశ పరచింది. కానీ ఈ పాట ఆడియో, వీడియో రెండూ ప్రేక్షకులను అలరించటంలో భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేమికులంతా ఇప్పటికే ఈ పాటను చూసి ఆనందిస్తున్నారు.
‘సర్కారు వారి పాట’ సినిమాలో ఈ పాట సందర్భం పాతదే. అలవాటయినదే. ఇక్కడ అంతగా అలవాటు లేనిదేమిటంటే పాత్రల వ్యక్తిత్వాలు. ఈ సినిమాలో నాయిక అందరినీ మోసం చేస్తుంటుంది. ఆమె ధనవంతురాలయినా, తండ్రి శక్తివంతుడయినా ఇది ఆమెకో ఆట. హీరో డబ్బు దగ్గర కచ్చితంగా ఉంటాడు. అలాంటి వాడు ఈ అమ్మాయి వలలో పడతాడు. నాయిక, హీరోని మోసం చేస్తున్నదని ప్రేక్షకులకు తెలుస్తూంటుంది. కాని హీరో మాత్రం ఆమె అందం చూసి అంధుడై, ఆమె ఏం చెప్తే అది నమ్మేసి, ఆమె ఏది అడిగితే అది ఇచ్చేస్తూ, కలల్లో తేలిపోతూంటాడు. నాయిక ‘అతను తప్ప తనకు ప్రపంచంలో ఎవరూ లేరని’ అనగానే, నాయకుడు ఆమెని పెళ్లి చేసేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. అతడు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగానే పెళ్లి మంత్రాలు వినిపించటం మొదలైపోతుంది.
ఈ పాటలో ముందుగా చెప్పుకోవాల్సింది కెమెరా పనితనం గురించి. ఇటీవలి కాలంలో పాటలను అందంగా ప్యాకేజీ చేయటం అనవాయితీ అయింది. ముఖ్యంగా పెద్ద హీరోలుంటే పాటల చిత్రీకరణ పద్ధతులు వేరుగా ఉంటున్నాయి. ‘మాస్’ హీరోలలో పెద్ద హీరోలు ‘క్లాస్’ హీరోలన్నమాట! కెమెరా దర్శకుడికీ, కోరియోగ్రాఫర్కీ నడుమ చక్కని అవగాహన ఉంటే పాట సగం విజయం సాధించినట్టే. అది ఈ పాటలో కనిపిస్తుంది.
నేపథ్యంలో పెళ్లి మంత్రాలు వినిపిస్తన్నప్పుడే హీరో ముఖంలో ఆశ్చర్యం, ఆనందం అపనమ్మకం కలగలిపిన భావాలు ప్రదర్శిస్తున్నప్పుడే కెమెరా తన పని మొదలు పెట్టేస్తుంది. నాయకుడి నడకే ఒక నాట్యం అన్నట్టు స్లో మోషన్లో చూపించటం, సాఫ్ట్ లైట్‌ను వాడటంతో నేపథ్యం అంతా అస్పష్టమై, నాయకుడి వెనుక నుంచి వెలుతురు పడుతూ ఒక కలలాంటి భావన కలుగుతుంది. ఎంతయినా పాట నిజం కాదు, కల లాంటిదే కదా! తెరపై దృశ్యాలు స్పష్టంగా, శుభ్రంగా చక్కటి రంగులలో కనిపిస్తూ చక్కటి భావనను కలిగిస్తాయి.
వందో ఒక వెయ్యో ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయ
పోయిందే సోయ
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటి నాకీ తడబాటసలేందే
గుండె దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే
పెద్ద పల్లవి. చక్కటి బాణీ. గేయ రచయిత సందర్భోచిత భావం కన్నా బాణీలో ఒదిగే రిథమిక్ పదాలను కూర్చటంపై దృష్టి పెట్టాడు. లయ కుదిరింది. ప్రాస కుదిరింది. పెళ్లి కలల్లో తేలుతూ పాట పాడుతాడనుకుంటే హీరో, పెళ్లి మంత్రాల నేపథ్యంలో, పెళ్లి కాక ముందే నిందలు, నిష్ఠూరాలు, ఫిర్యాదులు అన్నీ ప్రేమలో భాగంగానే మొదలుపెట్టేశాడు.
అయితే ఇప్పటి పాటల్లో భావం కన్నా దృశ్యానికి ప్రాధాన్యం. బాణీకి, పదాలకు, చిత్రీకరణకు నడుమ ఉన్న సున్నితమైన సంబంధాన్ని ఆధునిక సినీ గీతాలు త్రోసిరాజంటున్నాయి. బాణీలో పదాలు సులభంగా ఒదిగితే చాలు, కెమెరామేన్ కొరియోగ్రాఫర్లు బాణీని హీరో ఇమేజ్‌ని అర్థం చేసుకుని తమ పనిని సక్రమంగా నిర్వర్తిస్తే చాలు, సాహిత్యం ఔచిత్యం పెద్దగా అవసరం లేదు.
వందో, వెయ్యో, లక్షో అంటూ పాట ఆరంభమయ్యే సరికి పదో ఇరవయ్యో అందమైన యువతులు సితార్లు పట్టుకుని ఓ గుంపులా తెరపైకి వస్తారు. లయబద్దంగా ఊగుతుంటారు. సితార్ వాయించరు. నేపథ్యంలో వినిపించే సంగీతంలో గిటార్లు, వయొలిన్లు వినిపిస్తాయి తప్ప సితార్ వినబడదు. వారి నడుమ హీరో తన ఇమేజ్‌కి తగ్గట్టు ‘ఈజ్’తో నటిస్తూ, సమ్మేహనంగా నవ్వుతూ పాట పాడేస్తాడు. ‘గుండె’ల పదాలొచ్చినప్పుడు నాయిక చేయితో గుండె మీద కొట్టుకుంటాడు. ఈ పాటలో అత్యంత ఆకర్షణీయమైన వాక్యం (refrain) క్యాచీ పదం, ఆకర్షణీయమైన నృత్యం ఇక్కడి నుంచి మొదలవుతుంది. సితార్లు పట్టుకుని వాయించని అమ్మాయిలంతా, సితార్ వదలి, రంగురంగుల దుస్తులు ధరించి పాగాలు పెట్టుకుని వచ్చేస్తారు. నాయకుడు కూడా డ్రస్సు మార్చేస్తాడు. రిథమిక్‌గా స్లో డాన్స్ చేస్తాడు.
కమాన్ కమాన్ కళావతి
నువ్వే గతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువు లేకుంటే అధోగతి
ఈ ‘కమాన్ కమాన్ కళావతి’ అని అతడు నాయికను పిలుస్తున్నాడు. కానీ దుస్తుల డిజైనర్, కోరియోగ్రఫర్, కెమెరామెన్లు పరుగెత్తుకు వచ్చారు. నయనానందకరంగా దృశ్యాన్ని రూపొందించారు. ఇక్కడ నాయకుడి ఇమేజీని దృష్టిలో పెట్టుకుని చక్కటి కాళ్ల కదలికలతో, చిలిపి నృత్యంతో ‘హుక్ స్టెప్’ ను సృష్టించారు.
ఈమధ్య ప్రతి పాటలో కోరియోగ్రఫర్లు ఏదో ఒక కొత్త స్టెప్పు సృష్టించాల్సి వస్తోంది. ఈ హుక్ స్టెప్ కోసం ఎడమ కాలు ఎత్తి పట్టుకుని, ఎడమ చేయి తల వెనుక పెట్టి, కుడి చేయి జేబులో పెట్టి, ఎడమ మడమ కొద్దిగా ఎత్తి పెట్టి నిలబడాలి. నేలను ఎడమ మడమతో వరుసగా నాలుగు సార్లు బాది, బీట్‌కి తగ్గట్టు చేతులతో కొడుతూ, ఎదురుగా చూస్తుండాలి. వెంటనే ఎడమ కాలును వెనక్కు పక్కకు తిప్పాలి. కాళ్లు తిప్పుతున్నప్పుడు చేతి వ్రేళ్ళు అటు ఇటు తిప్పుతూ చేతులు విశాలంగా తెరవాలి. ఆ బీట్ అయిపోయే సమయానికి చేతులు నెమ్మదిగా తల పైకి తేవాలి. ఇదీ ఈ పాటకు ప్రాణం లాంటి ‘హుక్ స్టెప్’. అధోగతి అన్నప్పుడు మాత్రం చేతితో నుదురు కొట్టుకోవాలి.
ఈ పాటలో కెమెరా పనితనం, ఎడిటింగ్, సెట్టింగ్‌లు అద్భుతంగా ఉంటాయి. నాయికా నాయకులు ఆకర్షణీయమైన దృస్తులతో అందంగా కనిపిస్తారు కాబట్టి అప్పుడప్పుడు క్లోజప్పులు అవసరం. అందమైన అమ్మాయిలతో, అందమయిన రంగులతో తెరపై వసంతం విరిసినట్టుంటుంది.
కెమెరా లైటింగ్‌ను ఎంతో సృజనాత్మకంగా వాడేరు. పాట మెలోడీ తగ్గెట్టు లైటింగ్ వాడటంతో పాటు bright colors, ఎండ ఉన్నట్టు అనిపించే రీతిలో వాడటం పాటకు sunny feeling ఇస్తుంది. కెమెరా sweeping wide shots తో వెనుక సెట్లో వేసిన బిల్డింగ్లు, రోడ్లు చక్కగా చూపిస్తుంది. వెంటనే ఇద్దరి సాన్నిహిత్యం చూపే క్లోజప్‌లు, eye level shots కు మారుతుంది. అప్పడుప్పుడూ స్లో మోషన్లు వాడుతుంది. కెమెరా వాడిన కోణాలు పాటను అద్భుతమైన దృశ్య దర్శనానుభవంగా మారుస్తాయి. బాణీ ఎలాగూ శాస్త్రీయ సంగీత పోకడలుండటంతో హాయిగా ఉంటుంది. సెట్లు కూడా ఏర్పాటు చేశారు. నాయికా నాయకులు అందంగా ఉన్నారు. దాంతో ఒక చక్కని కవితను చూస్తున్నట్టు, అందమైన కలగంటున్నట్టుంటుంది పాటను చూస్తుంటే.
పాట మూడ్‌కు తగ్గ సెట్లు, ఔట్‌డోర్ లొకేషన్లను చక్కగా కలిపారు. సంగీతం కర్ణాటక సంగీతానికి పాశ్చాత్య పాప్ R&B లయను జోడించి మెప్పిస్తుంది. ముఖ్యంగా పాట మంద్రంగా ఆరంభించి, పాశ్చాత్య పద్ధతిలోని Dorian touch ఇవ్వటంతో పాట వింటూ గాలిలో ఎగుర్తూ దిగుతున్న భావన కలుగుతుంది. ‘డోరియన్ టచ్’ అన్నది పాశ్చాత్య సంగీత పద్ధతిలో ఒక చమత్కారం. పాట అంతా మైనర్ స్కేల్లో సాగుతుంటుంది. కానీ ఆరవ స్వరం మాత్రం అర స్థాయి పెంచి పలుకుతారు. దాంతో పాట పూర్తిగా విషాద గీతంలా కాక ఆశ, ఆనందాలు కలగలసిన మెలోడీగా మారిపోతుంది. అదీ ఈ పాట బాణీ చమత్కారం. ‘గీత గోవిందం’ పాట పంథాలోనే ఈ పాట మంత్రాలతో ఆరంభమై, అధునిక రిథమ్ లోకి మారిపోతుంది. అది పాట ఆకర్షణను పెంచుతుంది.
పాట అకౌస్టిక్ గిటార్, స్లో పియోనోలతో ఆరంభమై, కోరస్, తీగ వాయిద్యాలతో కలగలసి, పక్షి ఒక్కసారిగా రెక్కలు విదుల్చుకుని ఆకాశానికి ఎగిరినట్టు ఎగురుతుంది.
దీనికి తోడు గేయ రచయిత అందమైన రొమాంటిక్ పాట రాసే బదులు, సుందరమైన భావాలు మధురంగా పొదిగే బదులు ‘చించి, అతికించి, ఇరికించి, వదిలించి నా బతుకును చెడగొతివి కదవే’ అని ఇదే శృంగారం పొమ్మన్నాడు. ఇది ఈ కాలం నాటి శృంగారం అనుకోమన్నాడు. అయితే పదాలు rhyming గా ఉండటం, తెరపై నాయికా నాయికలు అందంగా విన్యాసాలు చేయటం, దృశ్యం చక్కగా ఉండటం బాణీ గొప్పగా ఉండటంతో తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం ‘ఈనాడు’ పత్రికలో సాహిత్య పేజీలా అయిపోయింది.
గతంలోలా పాట సినిమాలో విడదీయరాని అంగంలా, సినిమాలో ప్రతి పాట ఒక ప్రత్యేక కథలా చెప్పినా సినిమాకు ఊపునిచ్చేట్టు ఇప్పటి పాటలను గురించి ఆశించటం తగదు. ఇప్పటి పాటలు అందమైన దృశ్యాల సంకలనాలు. ఒక పాటలో ఎన్నెన్నో మినీ దృశ్యాలు. ఏ దృశ్యానికి ఆ దృశ్యమే. ఏ షాట్‌కి ఆ షాటే. తెరపై కనబడే దృశ్యాలు హీరోల అభిమానులకు ఎంత ఆనందం కలిగిస్తే అంత హిట్.
‘కళావతి’ పాటలో నాయిక గౌన్ జిప్పును పైకి లాగి హీరో గొప్పగా భావించటం, ఆమె పుస్తకాలకు అతను అట్టలేస్తుంటే పుస్తకంలో ముఖం దాచుకుని నాయిక ఏడవటం.. ఇలాంటి దృశ్యాలు చూస్తూ మురిసిపోయే ప్రేక్షకులకు నేపథ్యంలో వినిపించే పాట, అందులోని పదాలు భావాలు పెద్దగా పట్టవు. బాణీ బాగుంది అంతే! దృశ్యం అందంగా ఉంది, ఇంకా అంతే, అంతే!
చిత్రీకరణలో కూడా, గాయకుడు నేపథ్యంలో చించేస్తుంటే ఇక్కడ నాయకుడు నాయికను దగ్గర లాక్కుని తన ఆధిక్యం చాటుకుంటాడు. ప్రేక్షకుడికి తెరపై నాయికా నాయకుల పైనే దృష్టి ఉండటంతో పాటా ఏం పాడుతున్నాడో పట్టించుకోడు.
అందుకే ఇప్పటి పాటల గురించి చర్చించే సమయంలో మనం మధుర బాణీలు అతి మనోహరమైన దృశ్యాల గురించి చర్చంచుకోవాల్సి ఉంటుంది.
‘కమాన్ కమాన్ కళావతి’ పాట సాహిత్యంపై పెద్దగా పట్టింపు లేని తరం, చూడటం, వినటానికి తప్ప చదవటానికి ప్రాధాన్యం ఇవ్వని తరానికి నచ్చటంలో ఆశ్చర్యం లేదు. ఏ కళ్లతో చూసినా అందంగా, ఏ చెవులతో విన్నా అద్భుతంగా అనిపిస్తుందీ పాట. మెదడు ప్రసక్తి వదిలేస్తే మంచిది.
(‘కమాన్ కమాన్ కళావతి’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=SfDA33y38GE )
(మళ్ళీ కలుద్దాం)
