Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-50

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళ లోన
కలికి వెన్నెల కెరటాల పైన
తేలి వస్తాడు నా రాజు ఈ రోజు

కొన్ని పాటలుంటాయి, ఎందుకో తెలియదు, ఏమి మాయనో తెలియదు కానీ ఆ పాటలు విన్న వెంటనే పట్టేస్తాయి మనసుకు. జీవితాంతం వెంటనే ఉంటాయి. తలపుకు వస్తూ ఆనందం కలిగిస్తుంటాయి.  కానీ కొన్ని పాటలు వింటుంటే ఆనందం పెరుగుతుంది. పెరుగుతూనే ఉంటుంది. అలాంటి పాట ఇది. కానీ విషాదంలో అంతం అవని ఆనందం మానవ ప్రపంచంలో ఉండనే ఉండదు. ఈపాటా అంతే.  ఈ పాట మామూలు ప్రేయసి ప్రియుడి కోసం ఎదురు చూసే స్థాయిని దాటి ఇంకా అలవి కాని అందని  అంతస్తుకు చేరుతుంది. వినటానికే కాదు చూసేందుకూ చక్కగా ఉండి, చూస్తూ విన్నా, దృశ్యం లేకుండా కళ్లు మూసుకుని మాధుర్యాన్ని అనుభవిస్తున్నా అమితానందాన్ని, సంతృప్తిని అనుభవానికి తెస్తుందీ పాట.

‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోనిదీ పాట. పాట సందర్భం మామూలుదే. నాయకుడు కార్తీక పౌర్ణమి రోజు వచ్చి కలుస్తానని నాయికకు వాగ్దానం చేస్తాడు. కార్తీక పౌర్ణిమ రోజు నాయిక ఆందంగా అలంకరించుకుని నాయకుడి కోసం నిర్ణీత స్థలంలో ఎదురు చూస్తూ పాట పాడుతుంది. అంతే అయితే, ఇంతగా గుర్తు ఉండేది కాదు.

అల్లూరి సీతారామరాజు దేశం కోసం జీవితం అంకితం చేసినవాడు. తాను అల్లూరి సీతారామరాజుకు సంపూర్ణంగా సమర్పించుకున్నదీ అమ్మాయి. అతని కోసం సర్వస్వం ధారపోసేందుకు సిద్ధం. ఆ సంపూర్ణ సమర్పణ భావనను ఈ పాట ప్రతిబింబిస్తుంది. ఈ పాట ఇంతగా మనసును మురిపించేందుకు ప్రధాన కారణం బాణీనా? గేయ రచనా? గాయని స్వరమా? నిర్ణయించటం కష్టం.

ముందుగా సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు గురించి చెప్పుకోవాలి. తెలుగు సంగీత దర్శకులలో హిందుస్తానీ సంగీతంపై పట్టు కల సంగీత దర్శకుడు ఆయన. హిందీ సంగీత దర్శకులు సైతం ఈయన కర్ణాటక సంగీతంలో కుదిర్చిన బాణీలు, హిందుస్తానీ సంగీత ఆధారిత హిందీ సినిమా పాటలను మించిన మాధుర్యాన్ని, లాలిత్యాన్ని, కలిగి ఉండటం అనుభవించి ఆశ్చర్యపోయారు. అందులో లలిత శృంగార భావనలను ప్రతిబింబించే హిందోళ రాగంలో కూర్చిన ఈ పాట హిందుస్థానీ రాగ ఆధారిత పాటల కన్నా లాలిత్యాన్ని ప్రదర్శిస్తుంది. పైగా సితార్‌ను మృదువుగా, మధురంగా వాడటం పాట లాలిత్యాన్ని ఇనుమడింప చేసింది. పాట ఆరంభం ముందు వినిపించే సితార్ స్వరాలు మనసును దోచేస్తాయి. ఆ ప్రిల్యూడ్ సంగీతమే ఒక ప్రశాంత భావనను కలిగిస్తుంది.  అది నృత్య సంగీతం. ఆమె హృదయ నృత్య సంగీతం.  ఇక పాట సాంతం సితార్, బాన్సురీ, వయెలిన్లు, గిటార్లు, తబలా స్వరాలు కలగలసి పాటను వినటం ఒక పరమాద్భుతమైన స్థాయికి చేరుస్తాయి. ముఖ్యంగా సితార్లు అయిదు స్వరాలను వెంటవెంటనే వినిపిస్తూ (దీన్ని ‘స్వీపింగ్’ అంటారు) అలవికాని మాధుర్యాన్ని చిలుకుతాయి.  పాటలో ప్రతి సంగీతం బిట్టు అటు గాయనితో, ఇటు గేయంలోని పదాలతో పోటీ పడుతూ ‘నేనంటే నేనన్నట్టు’ భావాలు చిలికిస్తుంటుంది. చెవుల ద్వారా మనస్సు చేరిన సంగీత తరంగాలు దృశ్యాలు సృజిస్తూంటాయి.

సినీ గేయ రచనకు అవసరమైన ప్రతిభ వేరు. భాష తెలిసిన వాడు పాటను సులభంగా, జనరంజకంగా రాస్తాడు. కానీ సినిమా పాట రాసేందుకు అవసరమైన ప్రజ్ఞ వేరు. భాష, భావంతో పాటు, పాటను దృశ్యాత్మకం చేయటం సినీగేయ రచయితకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. పాట దృశ్యాన్ని సృజించేందుకు అనువుగా ఉండాలి. సంగీతం ఆ దృశ్యాన్ని అనుభవింప చేయాలి. అప్పుడు తెరపై కనబడే దృశ్యం, పాట భావం, నటీనటుల నటన నడుమ అవినాభవ సంబంధం ఏర్పడుతుంది. ఒకటి లేకుండా మరొక దాన్ని ఊహించలేము. పాటను ఏదో ఒక వాయిద్యంపై విన్నా, దృశ్యం లేకుండా పాట విన్నా బాగానే ఉన్నా దృశ్యం లేని లోటు తెలుస్తుంది అసలైన సినిమా పాటలో. ‘వస్తాడు నా రాజు’ అసలైన సినిమా పాట.

డాక్టర్ సి. నారాయణ రెడ్డి గేయరచన గమనిస్తే పాటలో అటు దర్శకుడికి సూచన  ఉంది. ఇటు నటికి సూచన  ఉంది. ఈ సూచనలు సంగీత దర్శకుడికి మార్గదర్శనం చేస్తాయి. చివరికి శ్రోత కళ్ళు మూసుకుని పాట వింటూన్నా, మూసిన కళ్ళవెనుక దృశ్యాలను సృష్టిస్తుందీ పాట.

కార్తీక పున్నమి వేళలోన, కలికి వెన్నెల కెరటాల పైన.

‘కలికి వెన్నెల కెరటాలు’.  అతి చక్కని పద ప్రయోగం. కార్తీక పున్నమి వెన్నెల అనగానే కళ్ళముందు వెన్నెలలో తడిసి సంబరపడుతున్న జగతి నిలుస్తుంది. కలికి వెన్నెల కెరటాలనగానే, వెన్నెల వెండి రంగుపులుముకుని ఎగసి పడుతున్న పాల సముద్రపు అలల సోయగం ప్రత్యక్షమవుతుంది. అతి చక్కని దృశ్యం మనసు తెరపై ప్రదర్శితమవుతుంది.

 ఈ పాటకు వేసిన సెట్ కూడా కార్తీక పున్నమి వేళను  తలపుకు తెస్తుంది. వెన్నెల వెలుగు, పచ్చని గడ్డి, సరస్సు, జారి పడే నీరు, అలంకరించుకుని ఆశగా ఎదురు చూస్తున్న నాయిక, ఆహ్లాదకరమైన పవిత్ర  శృంగార భావనలలో, తీవ్రమైన ప్రేమ భావనలోని  మృదువైన ఆనందాన్ని వినిపించే సంగీతం.. ఇవన్నీ కలగలసి ఒక మరపురాని మధుర భావనను కలిగిస్తాయి.

వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను
ఆతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాద ధూళికై అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను..

పాటలో పదాలు సరళమూ, తరళమూ సున్నితమైన భావ బంధురమూ. అంతకు ముందు అతడు కలికి వెన్నెల కెరటాలపై వస్తాడన్నది. అతి చక్కని ప్రయోగం. కలికి వెన్నెల కెరటాలు. ఇలాంటి పదాలు పడాలంటే భావనా బలంతో పాటు భాషా బలం కూడా ఉండాలి. భావనలలో సౌకుమార్యం ద్యోతకమవ్వాలన్నా, భాషపై పట్టు రావాలన్నా ప్రాచీన సాహిత్య అధ్యయనం తప్పని సరి. అది లేదనే ఈనాటి పాటల్లో ప్రేమికులు బురదలో దొర్లే వానపాములతో పోటీ  పడుతున్నారు. భావనలపై, భాషలపై పట్టు లేని  ఇప్పటి పాటల దారి ఒక వైపు అయితే, దృశ్యం మరొక వైపు పోతోంది. అలా కాకుండా ఔచిత్యం దెబ్బతినకుండా పాట, సంగీతం, నటన, దృశ్యాల నడుమ చక్కని సామరస్యాన్ని ప్రదర్శిస్తుందీ పాట.

నాయిక నృత్యం చేయలేదు. కానీ నేపథ్యంలో వినిపించే సంగీతం ఆనందంతో ఆమె హృదయం చేస్తున్న నృత్యాన్ని వినిపిస్తుంది.  ఆమెది ధీరగంభీరమైన పాత్ర. తొణకదు, బెణకదు. సంతోషాన్ని, బాధను కనబడనీయదు. అంతరంగం ఆనందతాండవాలు చేస్తున్నా, ముఖంలో చిరునవ్వు తప్ప మరొకటి కనబడదు.

అందుకని, తెరపై, ఆమె ఒక చోట కూర్చుని ఉంటే, ఆమె మనోఛాయ నృత్యం చేస్తుంది. ఆడుతుంది. పాడుతుంది. ఆమె అంతరంగంలో చెలరేగుతున్న భావాలను ఈ ఛాయాసుందరి ప్రతిబింబిస్తుంది. ప్రదర్శిస్తుంది. ఆమె నిశ్చలంగా కూర్చుని ఎదురుచూస్తూంటుంది. ఔచిత్యం అంటే ఇది. కల అనే ముసుగు వెనుక దాక్కుని నాయికా నాయకులతో అనుచిత పదాలు పలికించి, అసభ్య  నృత్యాలు చేయించకుండా చక్కగా దృశ్యాన్ని రూపొందించారు.

పాట ఆరంభంలో ముందు పూర్ణ చంద్రుడిని చూపిస్తాడు. గిటార్ తంత్రులు మ్రోగుతాయి. సితార్ ప్రవాహం ఆరంభమవుతుంది. ఎగసిపడే కెరటాలలాగా సితార్ మ్రోగటం ఆరంభమవుతుంది. కెమేరా దూకుతున్న నీటిని చూపిస్తుంది. ఆపై కదలుతూ, ఆనందంగా వెన్నెలవైపు చూస్తున్న నాయికను చూపిస్తుంది. తెల్లని దుస్తులలో నాయిక వెన్నెల వెలుగులా ఉంటుంది. నాయకుడు చంద్రుడు. ఆమె వెన్నెల. ‘వెన్నెలలెంతగా విరిసిన కానీ చంద్రుడినీ విడి పోలేవూ.’ అదీ గేయ రచయిత దర్శకుడికి ఇచ్చిన సూచన. ఆ సూచనను అందుకున్న దర్శకుడు, కళా దర్శకుడి సహాయంతో సృజించిన ఔచితీవంతమయిన అందమయిన దృశ్యం మనకు తెరపై కనిపించి కనువిందు చేస్తుంది. ఈ ఆరంభంలోని సితార్ బిట్ ను, కెమేరా కదలికలు, దృశ్యాలనడుమ ఉన్న సమన్వయం ఆనాటి పాటలను మనస్సులో చెరగరాని రీతిలో ముద్రిస్తాయి. అందుకే, ఎలాంటి భీభత్సమయిన నృత్యాలు, దృశ్యాలూ లేకున్నా ఆనాటి పాటలు, దృశ్యాలూ మరపురానివిగా నిలుస్తున్నాయి.

ఆమె దృష్టిలో అతడు దేవుడు. దేవుడు వస్తుంటే ప్రకృతి సర్వం అతడిని  అహ్వానించాలి. దర్శించేందుకు తపన పడాలి. అందుకని గేయ రచయిత ఆమె మనస్సులోని భావనలను ప్రకృతిపై ఆరోపించి రచించాడు. కఠినమైన పదం లేదు. సామాన్యుడికి కూడా అర్థమైపోతుంది. కానీ మామూలు భావనలు కావివి. అత్యత్తుమము, అత్యున్నతము, అత్యంత సంస్కారవంతమైన ఊహలు. ‘అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించేను’ పాట వింటుంటే శ్రోత మనసు ఆనంద సాగరమై ఆనందిస్తుంది. ఆనంద తాండవం చేస్తుంది.

ఇదీ ఈ పాటను మరింత మరపురానిదిగా చేసే అంశం. ఆమెది సంపూర్ణ సమర్పణ.”ఆతని పావన పాధ ధూళికై అవని అణువణువు కలవరించేను”.  అతడు ఆమెకి దేవుడు. కానీ అతడు తనని తాను దేశానికి సమర్పించుకున్నాడు.  ఇంత తీవ్రమైన ఆమె  ప్రేమ ఫలవంతం కాదు. ఎవరి కోసమై పాలసంద్రమై ఆమె పరవశిస్తోందో, అతడు ఆమెని తిరస్కరిస్తాడు. ఇది ఆమెకు తెలియదు. ప్రేక్షకుడికి తెలుస్తుంది. అంతకు ముందు కొన్ని సంభాషణలు ప్రేక్షకుడు ఈ విషయం గ్రహించేట్టు చేస్తాయి, దాంతో పాట మరింత ప్రీతిపాత్రమవుతుంది. ఇంత తీవ్రమైన ప్రేమ, ఇంత తీవ్రమైన తపన అతని తిరస్కృతికి ఏమైపోతుంది అన్న బాధ కలుగుతుంది. దాంతో ఈ ఆనందకరమైన క్షణాలను ఇంకాస్సేపు అనుభవించాలనిపిస్తుంది. అత్యంత విలువైన ఆనందమయమైన  ఘడియలు ఇవి.  ‘చూపులకన్నా ఎదురు చూపులే తీయన’ అంటాడో కవి. ఆ తీయని ఘడియలు ఇంకాస్సేపు పొడిగించాలనిపిస్తుంది. ఎందుకంటే, ఈ పాటలోనే విషాదం ఇమిడివుంది.

ఇక్కడే గేయ రచయిత గొప్పతనం తెలుస్తుంది. అవే భావాలు, అవే పదాలు ఇప్పుడు వింటే వారి గాఢమైన అనుబంధాన్ని సూచిస్తాయి. ఈ పాట తరువాత హీరో వచ్చి,  తాను దేశానికి అంకితం అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంట్లో వాళ్లు ఆ అమ్మాయికి  ఎవరితోనో   పెళ్లి నిశ్చయిస్తారు. మళ్లీ ఇవే పదాలు, ఇదే భావంతో పాట వస్తుంది. కానీ అవే పదాలు అప్పుడు కలిగించే భావనలు, స్పందనలు వేరు.

వెన్నెలలెంతగా విరిసిన గానీ చంద్రుడినీ విడిపోలేవు
కెరటాలెంతగా పొంగిన గానీ కడలిని విడిపోలేవూ
కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే
తనువులు వేరైనా, దారులు వేరైనా ఆ బంధాలే నిలిచేనులే..

ఎదురు చూస్తున్నప్పుడు వింటే  ఓ రకంగా అర్థమైనది, ఆమె మరణించిన తరువాత వింటే మరో రకంగా  అర్థమవుతుంది. మొదటిసారి మురిపించి, ఉప్పొంగింపచేసిన పదాలే, తరువాత వింటే కన్నీళ్లు తెప్పిస్తాయి. గుండెను బరువెక్కిస్తాయి. అద్భుతమైన గేయ రచనా  సంవిధానం ఇది. వీళ్ళూ అసలయిన గేయ రచయితలు. బాణీలో కుదిరే పదాలు కూర్చి,పేర్చి,తీర్చి,ఆర్చి,మార్చి,మార్చి పాటను మార్చురీకి పంపి,   గొప్ప గేయరచయితలమని డప్పు కొట్టుకునేవారూ, వారిచుట్టూ తిరుగుతూ, ఇదే గేయరచన అని పొగిడేవారూ, ఇలాంటి పాటలను అధ్యయనం చేస్తూ గేయరచనలో ‘అచ్చులు’ నేర్చుకోవాలి.

ఈ పాటను సుశీల అద్భుతంగా పాడిందనటం, సరిగ్గా వర్ణించే పదాలు దొరకక. సంగీత నృత్యంలాంటి ప్రెల్యూడ్ సంగీతం ఆగగానే ‘వస్తాడు’ అంటూ సుశీల పాటను అందుకోగానే గుండె ఝల్లు మంటుంది.  ‘వస్తాడు, రానే వస్తాడు’ అనటంలో ఆరంభంలోనే తేడా చూపిస్తుంది. పెద్దగా అలంకారాలు వేస్తున్నట్టు తెలియకుండానే, గమకాలు, దీర్ఘాలు, రాగాలు అలవోకగా పలికిస్తూ ఆనందసాగరకెరటాలపై నిలుపుతుంది.  ఒక్కో  పదాన్ని పలికిన తీరు, భావాన్ని ధ్వనింప చేసిన తీరు పాటను మామూలు ప్రపంచం దాటించి గంధర్వ గానం అనిపించేట్టు  చేస్తుంది. ముఖ్యంగా, జాగ్రత్తగా వింటే, ఆమె ప్రతి పదంలో ఆ పదం వర్ణించిన ప్రకృతి దృశ్యాన్ని ధ్వనింప చేస్తుంది. కళ్ల ముందు కదలుతున్న దృశ్యాన్ని, మనో యవనికపై ప్రదర్శింప చేస్తుంది.

“కలసిన ఆత్మల అనుబంధాలూ ఏజన్మకూ విడిపోలేవులే”. నాయిక మరణ సమయంలో వినిపించే సుశీల గొంతుక, అంతకు ముందు పాటలో వినిపించిన  సుశీల గొంతుకూ ఎంతో తేడా ఉంటుంది. అది ఆనందం. ఇది దుఃఖం. కానీ పదాల ఉచ్చారణ, వాటిని పలికే విధానం, వాటి ద్వారా ధ్వనింప చేసే దృశ్యం,  ఆమె స్వరం సంపూర్ణంగా రూపాంతరం చెందుతుంది.

ఇది ఈ పాటను ప్రత్యేకం చేస్తుంది. ‘వస్తాడు నా రాజు’ పాట వింటున్నప్పుడల్లా ఈ విషాదపు ‘వెన్నెల లెంతగా’ అన్న విషాద బిట్,  విన్నా వినకున్నా మనసులో మెదలుతుంది. అవే పదాలు సందర్భాన్ని బట్టి ఎంత విభిన్నమైన అర్థాన్ని సంతరించుకుంటాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.’తనువులు వేరైనా, దారులు వేరైనా’ అన్న పదాలలో దాగివున్న భావం ఇప్పుడు బోధపడుతుంది.

పదాల శక్తి తెలిసిన గేయ రచయిత, సంగీత శక్తి తెలిసిన సంగీత దర్శకుడు, దృశ్య ప్రభావం తెలిసిన దర్శకులు, గానం లోలోతులు తెలిసిన గాయని కలసి సృజించిన నెలరాజుకే వెన్నెల  రారాజు లాంటి గీతం ‘వస్తాడు నా రాజు ఈ రోజు’.

(‘వస్తాడు నా రాజు ఈ రోజు’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=hejZkMalXEA )

చిత్రీకరణలో  అప్పటి సాంకేతిక స్థాయిని అనుసరించి నక్షత్రాలు, అవీ ఇప్పుడు హస్యాస్పదంగా అనిపించినా, పాట దర్శనానుభూతిపై అది ఏ మాత్రం ప్రభావం చూపించదు. స్వచ్ఛమైన ప్రేమ, త్యాగం, అంకిత భావన, సమర్పణ వంటి ఇప్పటి లోకానికి చెందని ఉన్నత భావనలను తరతరాలకూ తాజాగా గుర్తు చేస్తూ, ప్రేరణనిస్తూంటుందీ పాట.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version