[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
హేయ్, పరుగులు తీయాలి, ఓ గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్, బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి
మన ఊరు చేరాలి
ఓ.. హోరుగాలి కారుమబ్బులు, ముసిరేలాగా మూగేలోగా
ఊరు చేరాలి, మన ఊరు చేరాలి.
సినిమా ఒక మాయ! ఎన్ని కళలు, ఎన్ని ప్రక్రియలు, ఎన్ని శబ్దాలు, ఎన్ని దృశ్యాలు. సినిమాలో ఉపయోగిస్తారో, అవన్నీ కలగలసేది అద్భుతమైన మాయను సృష్టించే ఏకైక లక్ష్యం తోటే. ఈ ప్రపంచం కూడా ఒక మాయ. ఇంద్రియాలు చూపించే దృశ్యం, మెదడు ఆడించే ఆట అంటారు వేదాంతులు. ఈ ప్రపంచం ఒక అభాస. ఇది కేవలం ఒక projection అంటుంది తత్వం. సినిమా కూడా ఒక పెద్ద అభాస. తెరపైకి దృశ్యాలు project అవుతాయి. ఆ తెరపై లేని దృశ్యాలు చూస్తాము. కదలని బొమ్మలు కదలుతున్నట్టు భావిస్తాము. మనవి కాని భావనలను అనుభవిస్తాము. మనకు తెలియని ప్రపంచంలో జీవిస్తాము. మనకు సంబంధం లేని వ్యక్తుల ఆవేదనలను, ఆనందాలను మనవిగా చేసుకుని అనుభవిస్తాము. సినిమా అయిపోయిన తరువాత తెర ఖాళీ. అన్నీ అదృశ్యం. అభాసను గ్రహించి, అసలు లోకానికి వస్తాము. కాని ఆ మాయ ప్రభావం పోదు. ఎంతటి గొప్ప మాయను కళాకారులు సృష్టిస్తే అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. అలా కళాకారులందరూ చిత్తశుద్ధితో, పట్టుదలతో శాయశక్తులా కృషి చేసి సృజించే అపూర్వమైన సంపూర్ణమైన మాయకు చక్కటి నిదర్శనం, ‘మల్లీశ్వరి’ (1951) సినిమాలో ‘పరుగులు తీయాలి’ పాట.
‘మల్లీశ్వరి’ సినిమాలో ‘పరుగులు తీయాలి’ పాట కోసం చక్కటి సందర్భాన్ని ఎంచుకోవటమే కాదు, పాటను సినిమాలో విడదీయరాని రీతిలో భాగం చేస్తుంది స్క్రిప్టు.
మల్లి, నాగరాజులు తిరునాళ్లకు వెళ్తారు. అక్కడ పనయిపోయిన తరువాత ఇంటికి తిరిగి వస్తూంటారు. ఆడుతూ పాడుతూ వస్తున్న వారికి ఆకాశం మేఘావృతం అవటం తెలుస్తుంది. పెద్ద వర్షం వచ్చే సూచనలు కనిపిస్తాయి. దాంతో వర్షం వచ్చేలోగా ఊరు చేరాలని వేగం పెంచుతారు. ఆ సందర్భంగా ప్రకృతిని చూస్తూ, మార్పులను గమనిస్తూ, ఆనందిస్తూ, త్వరత్వరగా వెళ్లాలని ఎడ్లను పరుగుపెట్టిస్తూ పాడే పాట ఇది.
వారు ఎంత తొందరపడినా వర్షంలో చిక్కుకుంటారు. ఓ చోట తలదాచుకుంటారు. అల్లరిగా నాయిక ‘పిలిచిన బిగువటరా?’ అని నృత్యం చేస్తూ పాడుతుంది. ఆమె నృత్యాన్ని అభినందించిన మారువేషంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు, రాణీవాసానికి పిలిపించమని అల్లరిగా అడిగిన ఆమె కోరిక నెరవేరుస్తాడు. కథ సాగుతుంది. అంటే, వారు పాడుతూ ప్రయాణం చేస్తూ వర్షంలో చిక్కుకోకపోతే కథ లేదన్నమాట. అంత కీలకం ఈ పాట. ఈ సందర్భంలో ఈ పాట సినీ ‘మాయ’ ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. నిజానికి ఇక్కడ పాట అవసరం లేదు. వారు ప్రయాణం చేస్తూంటే, వర్షం వచ్చినట్టు చూపవచ్చు. కానీ, ఇక్కడ పాట ఉండటం వల్ల, సినిమా మరింత ఆకర్షణీయమైంది. కళాకారులు అత్యంత ఆకర్షణీయమైన పాటను రూపొందించటం వల్ల, ప్రేక్షకుడి ఆనందం పెరిగింది, పాట మరపురాని మధురానుభవంలా మిగిలింది. తరతరాలు విని, చూసి ఆనందించే వీలు కలిగింది.
ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించింది సాలూరి రాజేశ్వరరావు. సందర్భానుసారం ఆయన పాటను విభిన్నమైన రాగాల మేళవింపుగా సృజించాడు. అదీ ఎంత గొప్పగా అంటే, మూడు రాగాలూ ఒకదానితో ఒకటి పాలూ, చెక్కర, నీళ్లలా కలిసిపోతాయి. మధ్యమావతి, బృందావని, సారంగ మూడు రాగాల సమ్మిశ్రమ రాగమాలిక ఈ పాట.
మధ్యమావతి రాగం ఆనందం కలిగించే రాగం. ఉత్సాహం కలిగిస్తుందీ రాగం. కాస్త శృంగారం, కాస్త చిలిపితనం, అల్లరిలు కూడకున్న మాధుర్యాన్ని కలిగిస్తుంది బృందావని రాగం. సాయంత్రం పూట, వర్ష ఋతువులో కృష్ణడు చేసే అల్లరిని సారంగ రాగం ప్రతిబింబిస్తుంది. అందుకే వేటూరి ‘కృష్ణా తరంగాల సారంగ రాగాలు’ అన్న వెంటనే ‘కృష్ణలీలా తరంగిణీ భక్తి గీతాలు’ అంటాడు. హిందుస్థానీ సంగీతంలో బృందావన సారంగ రాగం అంటారు. బృందావనం కృష్ణుడి లీలలను తలపింపచేస్తుంది. అంటే, ఈ పాటను ఎంచుకున్న మూడు రాగాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, వేగాన్ని ఆనందాన్ని, అల్లరినీ ఆటలను ధ్వనింప చేసే రాగాలే అన్నమాట.
ఈ మూడు రాగాలు ఎలాంటి తేడా తెలియకుండా ఒకదానిలో ఒకటి కలసిపోయే రీతిలో ఈ పాటలో ఆలాపనలు ఏర్పాటు చేశాడు సంగీత దర్శకుడు. పాట పాడే ఘంటసాల, భానుమతి లిద్దరూ శాస్త్రీయ సంగీతం తెలిసినవారు. అలవోకగా క్లిష్టమైన అలాపనలను కూడా ఆడుతూ పాడుతూ ఆనందంగా పాడేయగలవారు. నిజానికి ఈ పాటలో ఆలాపనలు ‘జుగల్బందీ’లా అనిపిస్తాయి. ఒక పక్షి కూతకు మరో పక్షి సమాధానం ఇచ్చినట్టు ఒకరి ఆలాపనకు మరొకరు ప్రతిస్పందిస్తారు. ఇద్దరూ కలిసి ఆలపిస్తారు. వారి ఆలాపనలు కూడా మారుతున్న పాట మూడ్, టెంపోలను బట్టి ఉంటుంది. ఆరంభంలోని తీరిక, అల్లరితనం, చివరికి వేగం, గాంభీర్యంగా మారతాయి. అంటే మారే పాత్రల భావాలను ఆనందాన్ని తొందరను వర్షంలో చిక్కుకుపోతామన్న ఆందోళనను ఈ ఆలాపనలు ప్రతిబింబిస్తాయి. ఇదొక అద్భుతమైన ప్రయోగం. ఈ ఆలాపనలు ఎంత సహజంగా ఉండి పాటలో విడదీయరాని భాగాలయిపోతాయంటే, ఆలాపనలు లేకుండా పాటను ఊహించలేము.
దర్శకుడు విశ్వనాథ్ ‘వెన్నెల్లో బృందావనం చూపిస్తాన’ని, చూపించలేకపోయాడు. ఇక్కడ ఏమీ చెప్పకుండా ఆలాపనలు సంగీతాలతో బండి పరుగును, మేఘాలు అలముకోవటాన్ని, వర్షం వచ్చేలోగా ఊరు చేరాలన్న ఆరాటాలను ప్రదర్శించాడు సంగీత దర్శకుడు పాటలో. పాటలో పదాలు వినకున్నా, సంగీతం, ఆలాపనలతో దృశ్యం ఊహకు అందుతుంది.
సంగీత దర్శకుడు కూడా సంగీత ధ్వనులు దృశ్యాన్ని శ్రోతల మనస్సులో ప్రదర్శితమయ్యే రీతిలో బాణీని రూపొందించటమే కాదు వాయిద్యాల ఎంపిక వాటి కదలికలను అద్భుతంగా వాడుకున్నాడు. కొమ్ము, గజ్జలు, తబలా, ఢోలక్, వయెలిన్లు, హార్మోనియం, వేణువు వంటి వాయిద్యాలతో హోరుగాలిని, కారు మబ్బులను, కొమ్ముల గజ్జల గలగలలను, మెళ్లో గంటల ఖణఖణలను, గుంపులు గుంపులు దట్టమైన మబ్బులను, ఎగిరే తెల్లటి కొంగలను. విభిన్న పూలను, కోయిలల కుహూకుహూలను, తుమ్మెద గుంపుల ఝంకారాన్ని సర్వం ధ్వనింప చేశాడు. ధ్వని ద్వారా దృశ్యాన్ని స్ఫురింప చేశాడు. అద్భుతమైన ప్రతిభా ప్రదర్శన ఇది.
ఇక్కడే గేయ రచయిత ప్రతిభాపాటవాలు ప్రస్ఫుటమవుతాయి. సందర్భాన్ని, బాణీని, సినిమా కథను సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, పాత్రల పరిధిని, మనస్సులను అవగాహన చేసుకుని, పరుగెత్తే బండి వేగాన్ని నిర్దేశిస్తూ, చిత్రీకరణకు సూచనలను గేయంలో పొందుపరుస్తూ, సంగీతం చూపించే దృశ్యాన్ని అక్షరాలలో ఇమిడ్చి, పదాలలో పొదిగి చిత్రించాడు గేయ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. అంతే కాదు ధ్వన్యనుకరణ అనే అనుకరణాత్మక పదాలతో (Onomatopoeia) పాటకు వేగాన్ని ఉద్వేగాన్ని, దృశ్యానికి భావాన్ని, అర్థాన్ని అద్దాడు. ఈ పదాల వల్ల పాటకు వచ్చిన ఊపు, ఉత్సాహాలు మామూలు స్థాయివి కావు.
గిత్తలు ఉరకలు వేయాలి. అవి ఉరకలు వేస్తుంటే బిరబిర, జరజర, పరుగున పరుగున.. పదాలు పలుకుతూంటేనే దృశ్యం కళ్లముందు నిలుస్తుంది. వారి ప్రయాణ వేగం మనసు గ్రహిస్తుంది. సంగీతం, సాహిత్యం సృష్టించిన దృశ్యాన్ని మనస్సులో దర్శిస్తూ, అనుభవిస్తున్న ప్రేక్షకుడికి తెరపై తగ్గ దృశ్యం కనబడాలి. సినీమాయ సంపూర్ణమవటంలో ఇప్పుడు దృశ్యం తన వంతు పాత్ర నిర్వహించాలి. ఇక్కడ నటీనటుల ప్రాధాన్యం తెలుస్తుంది.
తెరపై ఎన్టీరామారావు, భానుమతులు ఎంతో స్వాభావికంగా ఒకరి సాంగత్యంలో మరొకరు ఎంతో హాయిగా, ఎన్నెన్నో యేళ్ల స్నేహం వల్ల కలిగే చనువు, ఒకరొకరికి అలవాటయిన స్వేచ్ఛ, సౌకర్యం, అలవోకగా ప్రదర్శిస్తారు. ఎంతో సహజంగా అనిపిస్తుంది వారి ప్రవర్తన. ఇప్పుడు మాయ సంపూర్ణమయింది. ప్రేక్షకుడికి తెరపై కనిపించేదంతా ప్రొజెక్షన్ అన్న భావన అదృశ్యమైపోతుంది. తెరపై అతడికి సజీవ జీవితం కనిపిస్తుంది. ఆ కనబడే జీవిత దృశ్యాలతో ప్రేక్షకుడు మమేకమైపోతాడు. తానూ ఓ పాత్ర అయిపోతాడు. సంపూర్ణంగా మాయాలోకంలో చిక్కుకుంటాడు. ఇక్కడ మాయ ఏమిటంటే, బండి పరుగెత్తటం వంటి దృశ్యాల షూటింగ్ మంచి ఎండలో జరిగి ఉంటుంది. ఈ దృశ్యాలకు, నల్ల మేఘాలు నిండిన ఆకాశం దృశ్యాలను జోడించటంవల్ల వర్షం ముంచుకొస్తున్న భావన కలుగుతుంది. పచ్చని పైరులు, విచ్చిన పూవులు, తెల్లని కొంగలు అన్నీ, ఎక్కడి దృశ్యాలో పాటకనుగుణంగా ఎడిట్ చేసి పెట్టి చూపటంతో, ప్రయాణంలో ఇవన్నీ వారు చూస్తున్నభ్రమ కలుగుతుంది. అందుకే, మానవుడు తన సృజనాత్మకతతో సృష్టించుకున్న అతి గొప్ప ఆకర్షణీయమైన మాయ సినిమా!
పాట ఆరంభంలోనే ఎడ్లబండి పరుగిడే లయతో పోటీ పడుతూ భానుమతి ఆలాపన మొదలవుతుంది. లాంగ్ షాట్లో కనబడే ఈ దృశ్యం పాట వేగం, బండి వేగం ఒకటేగా కనిపిస్తుంది. ఇక పాటంతా బండి వేగానికీ, పాట వేగానికీ నడుమ ‘పోటీ’గా సాగుతుంది. ఆమె ఆలాపన అవుతూనే ‘హేయ్’ అంటూ పాట ఆరంభిస్తాడు హీరో. అప్పుడు తెరపై హాయిగా నవ్వుతూ, ఆనందిస్తూ నటీనటులు కనిపిస్తారు. ఎన్టీరామారావు స్వచ్ఛమైన చిరునవ్వు, హాయిగా జారగిలబడి, నిర్లక్ష్యంగా, ఓ రకమైన రాచరికంలా అనిపించే comfort తో నవ్వుతూ భానుమతి కనిపిస్తుంది. ప్రేక్షకులు పాటలో లీనమైపోతారు. తాము పాటలో దృశ్యంలో భాగమైపోతారు.
‘పరుగులు తీయాలి, ఉరకలు వేయాలి’ అన్న తరువాత వయోలిన్లూ పరుగుతీస్తూ వచ్చే సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఆ లయ బండి వేగం లయ. అందుకే బండితో పాట పరుగుపెడుతుందన్న భావననిస్తూ పరుగులిడే బండి చక్రాన్ని క్లోజప్‌లో చూపిస్తాడు. ‘హేయ్’ అంటు నాయిక పాట ఆరంభించే సరికి ఆమె క్లోజప్. ఆమె ఎంతో సులువుగా, హాయిగా, ఆనందంగా పాడుతుంది. ఒకరు నవ్వితే, చూసేవారు నవ్వుతారు. అలా ఈ ఉత్సాహం, వేగం ప్రేక్షకుడి మనసునూ పరుగులు తీయిస్తాయి ఆనందంతో. పల్లవిలోనే హోరుగాలి, కారు మబ్బులు ముసిరేలోగా, మూగేలోగా ఊరు చేరాలని ప్రతిపాదించేశాడు కవి. పాటంతా ఆ మబ్బులు మూగి వర్షం వచ్చేలోగా ఊరు చేరటం కోసం బండి పెట్టే పరుగు, వారిని ముంచెత్తాలనే వర్షం తొందర నడుమ పోటీ అవుతుంది.
పాటల్లో చరణం ధ్వన్యనుకరణ పదాల వాడటానికి పాఠ్య పుస్తకం లాంటిది. ఎలాంటి కఠిన పదాలు లేకుండా, అతి సులువైన పదాలను లయానుగుణంగా వాడుతూ భావాన్ని స్ఫురింపచేసే పరమాద్భుతమైన, కానీ అతిక్లిష్టమైన గేయ రచనా నైపుణ్యాన్ని చరణంలో ప్రదర్శస్తాడు గేయ రచయిత.
గలగల గలగల కొమ్ముల గజ్జలు, ఖణఖణ ఖణఖణ మెళ్లో గంటలు
వాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి, మన ఊరు చేరాలి.
స్వచ్ఛమైన మంచి నీరు కొండల నుండి దూకుతూ, బండల నుండి ఎగురుతూ, తుళ్ళుతూ, సుళ్ళుతిరుగుతూ, పారుతూ ప్రవహిస్తున్నట్టనిపిస్తుందీ పదాలు వింటుంటే. అసలు వివరణ అవసరం లేదు. అటు సంగీత దర్శకుడికీ, ఇటు దర్శకుడికీ, కెమేరామేన్కీ సూచనలిస్తున్నాడు గేయ రచయిత. కృష్ణశాస్త్రి వాక్చిత్రనిర్మాణకౌశలానికి ఈ పాట మచ్చుతునక. గలగల అన్నప్పుడు పరుగిడే ఎడ్ల కొమ్ములు చూపాలి. ఆ వాక్యం పలకగానే కొమ్ముల గజ్జల శబ్దాన్ని సంగీత దర్శకుడు వినిపించాలి. తరువాత వాక్యం అవగానే మెళ్లో గంటలు శబ్దం వినిపించాలి. గంటలను చూపించాలి. గేయ రచయిత, సంగీత దర్శకుడు, కెమేరామేన్ల నడుమ అత్యద్భుతమైన సమన్వయం వల్ల కలిగే పరమాద్భుతమైన ‘మాయ’ను మనం అనుభవిస్తాం ఈ పాట వింటూ. ఇక్కడ నాయికానాయకులు కలసి చేసే ఆలాపన పాటని మరింత వేగవంతం చేస్తుంది. రిలాక్స్డ్ మూడ్‌లో హాయిగా పాడుతూ ప్రయాణం చేస్తున్నారు. గమ్మత్తయిన జుగల్బందీ ఇది.
అవిగో అవిగో
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో
పచ్చని తోటలు విచ్చిన పువ్వులు
ఊగే గాలుల తూగే తీగలు అవిగో
కొమ్మల మూగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో..
ఒక్క కఠిన పదం లేదు. కానీ లయబద్దంగా లలితమైన పదాల వాడకం అనితర సాధ్యం. కానీ పదాలతో దృశ్యం చిత్రించటం తెలుస్తున్నది. ఏమైపోయారు సరస్వతీ మాతకు పదాల పుష్పాలు అర్పిస్తూ, భావాల బంతులతో అల్లరిగా ఆడుకుంటూ, అందమైన గేయ సృజన నీరాజనాలర్పించే ఆ కళాకారులంతా? క్లిష్టమైన పదబంధాలు, అతి క్లిష్టమైన భావాలు, రైమింగ్ పదాల తంటాలే గేయ రచన అనుకునేవారు ఇలాంటి పాటలను అధ్యయనం చేయాలి. అతి సులువుగా అనిపించే ఇలాంటి పాటలు రాయటం ఎంతో కష్టం.
ఇప్పుడు సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందింది. జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కొమ్ముల గజ్జెలు, మెళ్లో గంటలు వినబడటం లేదు. జీవితంలోంచి చిన్న చిన్న ఆనందాలు అదృశ్యమైపోయినట్టే అమాయకత్వం కూడా అవిరైపోయింది. నల్లని మబ్బులను విభిన్న పూలను తుమ్మెదల గుంపులను చూసి ఆనందించేవారు లేరు. అవి కనబడటం లేదు. ప్రకృతిలో ఆ స్వచ్ఛత లేదు. మనిషి హృదయంలోనూ ఆ స్వచ్ఛత లేదు, ఆ సౌకుమార్యమూ లేదు.
ఇలాంటి పాటలు మనం కోల్పోయిన వాటన్నిటినీ గుర్తు చేస్తాయి. మన మనస్సు లోతుల్లో ఏ మారుమూలనో నిద్రాణ స్థితిలో ఉన్న సౌకుమార్యాన్ని, సున్నితత్వాన్ని సౌందర్యారాధనను, చిన్న చిన్న ఆనందాలను అనుభవించి పరవశించే పసిపిల్లవాడినీ తట్టి లేపుతాయి, మన జీవనంలోని లాలిత్యాన్ని దర్శింపచేస్తాయి. ‘మాయ’లో పడి తనని తాను మరచి ‘మర’లా మారుతున్న మనిషికి మరలా మానవత్వాన్ని మనిషితనాన్ని గుర్తుచేస్తాయి. ముల్లును ముల్లుతో తీసినట్టు మాయను మాయతోనే తొలగించాలి. అందుకు కళాకారులు సృజించే ఈ పరమాద్భుతమైన ‘మాయ’ దోహదం చేస్తుంది.
అందుకే అనాటి కళాకారులు సృజించిన పరమ ఆకర్షణీయమూ శక్తివంతమైన సమ్మోహనమైన ‘మాయ’ను దాటి ఈనాటి కళాకారులు ఏమీ సాధించలేకపోతున్నారు. పాత తరం సృజన భవంతికి కొత్త అంతస్తును జోడించలేకపోతున్నారు. పాతను అనుకరించి ఆకర్షించాలని ప్రయత్నిస్తూ అభాసుపాలవుతున్నారు.
‘ఫిదా’ అనే సినిమాలో ‘పరుగులు తీయాలి’ అనే పాట లయను వాడుకుని ఒక పాటను సృజించారు. ‘ఏయ్ పిలగాడా ‘ అంటూ మొదలయ్యే ఆ పాట ప్రజలను ఆకర్షించింది. కానీ, అమాయకత్వం, సున్నితత్వం, లాలిత్యం, సహజత్వం లోపించిన ఆ పాట వింటూంటే, దానికే పొంగిపోయే ప్రజలను చూస్తూంటే, సినిమా మాయ తీవ్రత అర్ధమవుతుంది. ‘పరుగులు తీయాలి’ లాంటి పాటలు రాయటం ఎంత కష్టమో అర్ధమవుతుంది. పదాలతో దృశ్యాలు సృష్టించటం ఎంత క్లిష్టమైనపనో, దానిని ఆనాటి కళాకారులు, సందర్భంలో ఒదిగి, ఔచితీభంగం కానీయకుండా, ఎంత సరళంగా సాధించారో బోధపడుతుంది. పదాలు పలుకుతూంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. వాటిలోని నడక, లయ ఉచ్చరిస్తూంటే, ఇంకా ఇంకా పలకాలనిపిస్తుంది. పచ్చనితోటలు, విచ్చిన పూవులు/ఊగే గాలుల తూగే తీగలు…….ఇలా రాయాలంటే మామూలు కవులకు సాధ్యం కాదు. నీరు పారినంత సులువుగా నూనె నడవదు. జారిపడే అవకాశాలు మెండు.
హేయ్ పిల్లగాడ పాట లింకు క్రింద
అందుకే ఈనాటికీ మనకు మాయాబజార్, మల్లీశ్వరి వంటి సినిమాలు, పాటలు అత్యుత్తమ కళాసృజనకు ప్రామాణికాలు. అప్పుడప్పుడు మెరుపులా మెరిసే చక్కటి సినిమా పాటల కోసం చూస్తూ, ‘అవిగో అవిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో’ అని పాడుకుంటూనే ఉన్నాం ఆనాటి మధురగీతాలు, మనోహర దృశ్యాలను తలచుకుంటూ.
~
(‘పరుగులు తీయాలి’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=74c8uBH0uyQ)
(మళ్ళీ కలుద్దాం)
