[‘మహాకవి డా. సి. నారాయణరెడ్డి గారి జ్ఞాపకాలలో’ అనే రచనని అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]
మన జీవితంలో ఎందరో గురువులను, మహనీయులను చూస్తాం. వారి మాటల వల్ల రచనల వల్ల ప్రభావితమవుతాం. అవి మన జీవన గమనానికి మార్గదర్శనంగా దారిదీపాల్లా నిలుస్తాయి. కొందరితో పరిచయం కేవలం పరిచయంగానే ఉంటుంది. కొందరిని చూస్తూనే వింటూనే అభిమానిస్తాం. కొందరిని చూడకపోయినా కేవలం వెండితెర మీద చూసి, లేదా వారి రచనలు చదివి, వారి గురించి ఎవరి ద్వారానో విని అభిమానిస్తాం. అలాంటి ఎందరో పెద్దలు ప్రత్యక్షంగా పరోక్షంగా నా అక్షరప్రయాణాన్ని ప్రభావితం చేశారు. అప్రయత్నంగా మనం వారికి అభిమానులుగా మారిపోతాం. ఆ పెద్దలకు మనలాంటి ఎందరో అభిమానులు ఉంటారు. అయినా ఎవరికివాళ్లు ఆ మహనీయుడిని ఆత్మీయుడుగా భావిస్తారు. అలాంటి సహృదయ మహాకవి డాక్టర్ సి నారాయణరెడ్డిగారు. జాతీయస్థాయిలో అత్యున్నత ప్రభుత్వ పురస్కారాలు, సాహిత్య స్థాయిలో జ్ఞానపీఠం వంటి మహోన్నత పురస్కారం అందుకున్న ఈ సాహితీమూర్తి జీవించినకాలంలో నేను కూడా వారిని చూస్తూ, వింటూ, చదువుతూ జీవించడం మరపురాని అదృష్టం. ఇది ఎంతో మందితోపాటు నాకుకూడా లభించిన ఒక మహత్తర అవకాశం. హైదరాబాదులో పుట్టి బాపట్లలో విద్యాభ్యాసం చేసిన నేను వెలగపూడి సరస్వతి మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజుల్లో మా తెలుగుటీచర్ల ఉత్తమ బోధన వల్ల నేను అనేకమంది కవుల రచయితల రచనలు అర్థం అయినా కాకపోయినా చదువుతూ ఉండేదాన్ని. పాఠశాలలో తెలుగు సాహితీసంస్థకు కార్యదర్శిగా అనేకమంది సాహితీమూర్తులను మా పాఠశాల కార్యక్రమాలకు ఆహ్వానించి వారితో ఉపన్యాసాలు ఇప్పించటం, విద్యార్థులకు తెలుగు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతి ప్రదానానికి న్యాయనిర్ణేతల నాహ్వానించి సభ జరిపించడం వంటి అనేక బాధ్యతలను నిర్వర్తిస్తుండేదాన్ని. వీటన్నిటికీ ప్రేరణ మా తెలుగు టీచర్లైన వెలగపూడి వైదేహి, నగరాజ కుమారి, అన్నపూర్ణ గార్లు ప్రథమ కారణం. ఇంతేకాక మా నాన్నగారు శ్రీ కోటంరాజు సత్యనారాయణశర్మగారు స్వయంగా పద్యకవి, వ్యాసరచయిత, నాటకకర్తగా నాటి ప్రఖ్యాత పత్రికలు భారతి, కృష్ణాపత్రిక, ఆంధ్రవాణి, తెలుగు స్వతంత్ర, మొదలైన అనేక పత్రికల్లో తమ రచనలను వెలువరిస్తుండేవారు. వారు బాపట్లలో లాయర్‌గా, ఇన్కమ్ టాక్స్ ప్రాక్టీషనర్‌గా, రెండు వృత్తులను నిర్వహిస్తూనే సాహిత్యాభిమానం వల్ల 1968వ సంవత్సరంలో ‘ కళాభారతి’ అనే సాహితీ సాంస్కృతిక సంస్థను స్థాపించి అనేక మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహించేవారు. ఈ సంస్థకు నాటి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ శ్రీ ఊటుకూరు గోపాలరావుగారు స్థాపక అధ్యక్షులుగా వ్యవహరించారు. గౌ. కరుణశ్రీ, జమ్మలమడక, ధారా రామనాథశాస్త్రి, ధకనకుధరం, మొవ్వ వృషాద్రిపతి, ఎస్వీ జోగారావు, జాషువా, డా. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, డా. కొర్రపాటి గంగాధరరావు గారు, పోలాప్రగడ సత్యనారాయణమూర్తి, దేశరాజు భారతీదేవి, డా. ప్రసాదరాయ కులపతి, డాక్టర్ కెవిఎస్. తుమ్మల, కనుపర్తి వరలక్ష్మమ్మ, కొండవీటి వెంకటకవి, డా. బొడ్డుపల్లి పురుషోత్తం. బృందావనం రంగాచార్యులు గార్లు మొదలు ఎందరో పెద్దలు పాల్గొన్నారు. నాన్నగారికి ఉన్న సాహితీతృష్ణ వల్ల ఇంట్లో వ్యక్తిగత గ్రంథాలయంలో అనేక విలువైన, ప్రాచీన కావ్యాలు ఆధునిక కావ్యాలు, ప్రత్యేక సంచికలు హైదరాబాద్ యువభారతి ప్రచురణలు, ఎమెస్కో ఇంటింటి గ్రంథాలయం పుస్తకాలు లభ్యమయ్యేవి. ప్రతి సంవత్సరం స్కూల్‌కి వార్షిక సెలవులు ఇచ్చినప్పుడు చదవాల్సిన పుస్తకాలను ఒక సిలబస్ లాగా పక్కన ఉంచుకుని చదువుతుండేదాన్ని. బాపట్ల ప్రాంతీయ గ్రంధాలయంలో తెలుగు పుస్తకాలన్నీ దాదాపుగా చదివేశాను. అర్థమైనా కాకపోయినా తెలుగుభాష రుచి నాకు వంటబట్టింది. కళాభారతి పక్షాన ఏ కార్యక్రమం చేసినా బాపట్ల కాక ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన కవులు మా ఇంట్లోనే విడిది చేసేవారు. సాహితిగోష్ఠి, భోజనాలు కూడా మా ఇంట్లోనే జరుగుతుండేది. ఇవన్నీ నా విద్యార్థి దశ నుంచి నా మీద అమితంగా ప్రభావం చూపించాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కళాభారతి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనటానికి డా. బెజవాడ గోపాలరెడ్డి గారు తదితరులతో డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు బాపట్లకు రావడం జరిగింది. అప్పటివరకు వారి రచనలు నాగార్జునసాగరరం, కర్పూరవసంతరాయలు చదివి రేడియోలో వారి సినీగీతాలు వింటూ అభిమానాన్ని పెంచుకున్న నేను ప్రత్యక్షంగా నారాయణరెడ్డి గారిని మొదటిసారి చూశాను. కళాభారతి సత్కారం అందుకున్న తర్వాత ఆ కవి మాట్లాడిన అంశాలు, ధీర గంభీరమైన ఆ స్వరం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ రోజు సాయంత్రం డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు మా నాన్నగారితో తనకు అప్పికట్లలో నివసిస్తున్న గాంధీకవి తుమ్మలవారిని కలవాలని ఉన్నదని చెపారు. మా నాన్నగారు ఒక టాక్సీ పిలిపించి నారాయణరెడ్డి గారితో 20 నిమిషాల దూరంలో ఉన్న అప్పికట్ల గ్రామానికి బయలుదేరారు. తుమ్మలగారు మా ఇంటికి తరచూ వస్తుండేవారు. వారిని చూడటం నాకు కొత్తకాదు కానీ నారాయణరెడ్డి గారితో కలిసి ప్రయాణంచేసే అవకాశం వాడులుకోలేక నేను కూడా అప్పికట్ల వస్తానని నాన్నగారితో అన్నాను. “పెద్దవాళ్లు వెళ్తుంటే నువ్వెందుకు” అని మా అమ్మ నన్ను నిరుత్సాహపరిచింది. కానీ నాన్నగారు నన్ను ప్రోత్సహించి తమతో తీసుకెళ్లారు. అలా నేను నారాయణరెడ్డి గారు, నాన్నగారితో కలిసి ప్రయాణంచేసి తుమ్మలగారి ఇంటికివెళ్ళాను. దారి పొడుగునా నాన్నగారు, నారాయణరెడ్డి గారి సంభాషణ వినటం చాలా ఆసక్తికరంగా ఉంది. తుమ్మలగారి ఇంట్లోనివారు సినారెని గౌరవించిన తీరు, మహాకవికి తనకన్నా ముందుతరం కవులపట్ల ఉన్న గౌరవం నేను మర్చిపోలేనిది.


1978వ సంవత్సరంలో ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే అనేక సాహిత్యకార్యక్రమాల్లో నారాయణరెడ్డిగారిని చూడడం జరిగింది. కొన్ని సందర్భాలలో వారు పాల్గొన్న కవిసమ్మేళనాలలో నేను కూడా అదే వేదికమీద పాల్గొనడం నాకు ఇప్పటికీ అమితానందం కలిగిస్తుంది. నేను వనస్థలిపురంలాంటి దూరప్రాంతం నుండి కూడా ఆఫీసు తర్వాత నారాయణరెడ్డి గారి సందేశం వినడానికి రవీంద్రభారతి, శ్రీ త్యాగరాయ గానసభ వంటి ప్రాంగణాలలో జరిగే కార్యక్రమాలకు హాజరయి మళ్ళీ మూడు బస్సులు మారి రాత్రి ఏ పదింటికో ఇల్లుచేరేదాన్ని. అప్పటికి నా పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు.
నా తొలికథ 1972వ సం.లో బహుమతి పొంది 1973వ సం.లో స్వాతి మాసపత్రికలో ప్రచురితమైనప్పుడు నేను బి.ఏ. రెండవ సంవత్సరం చదువుతున్నాను. అదే సంవత్సరం ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా తొలి కవిత ప్రచురితమైంది. అనేక కవితలు, కథలు వివిధ పత్రికల్లో వెలువడుతుందేవి. మా నాన్నగారి ప్రోత్సాహంతో 1986 సం.లో నా తొలి కవితాసంపుటి ‘నాలోని నాదాలు’ ప్రచురితమైనప్పుడు నారాయణరెడ్డిగారు ఓపెన్ యూనివర్సిటీ వి.సి.గా ఉన్నారు. వారిని కలిసి ఆ కవితాసంపుటికి ముందుమాటగా ఆశీస్సులు కోరాను. వారు రాస్తూ మరింత సాంద్రతను పెంచుకోవాలని సూచించారు. ఆ సూచన నాకు ఎప్పటికీ శిరోధార్యమే. క్రమంగా నా కవితటా సంపుటాలు (14), సమగ్ర కవిత్వం (2) వెలువడ్డాయి. నా ప్రతి కవితాసంపుటిని నారాయణరెడ్డి గారే ఆవిష్కరించాలని కోరుకునేదాన్ని. వారు అంతే వాత్సల్యంతో నా కవిత్వాన్ని ఆవిష్కరించి అందులో వారికి నచ్చిన, మెచ్చిన మెచ్చిన కవితా పంక్తులు ఉదహరిస్తూ ఉత్సాహపరుస్తూ ప్రసంగించేవారు. క్రమంగా మా కుటుంబం అంతా వారి కుటుంబంలో భాగ్యమయ్యాము. మా అమ్మాయి హిమబిందును వారు మనవరాలుగా సంబోధిస్తూ ఉండేవారు. మా పిల్లలు కూడా నారాయణరెడ్డిగారి పట్ల ఎంతో గౌరవంగా ఉండేవారు. వారు సాహితీప్రపంచంతో, సంస్థలతో అంతే ప్రేమగా మసలేవారు. ఎవరికి వాళ్ళు సినారెను తమ ఆత్మీయుడుగా భావించటానికి కారణం వారి సహృదయ వ్యక్తిత్వం. ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో వారి కవితాపంక్తులు గుర్తొస్తూ జీవితానికి అన్వయం అవుతుంటాయి.
నా కవిత్వం గురించి వారు మాట్లాడిన ప్రతిమాట నన్ను ముందుకు నడిపించింది. సముద్ర కెరటం లాగా పడినా లేవాలనీ, ఎవరూ అసూయ పడకపోతే మన జీవితానికి అర్థం లేదనీ ఎన్నో చెప్పారు. సభా సాంప్రదాయాలు, కాలం విలువ వారి దగ్గరే నేర్చుకున్నాను. నారాయణరెడ్డి గారు ఎంత గొప్ప పదవులు నిర్వహించినా ఆ పదవులకే వన్నె తెచ్చారు. సాహిత్యకారుల జీవితాలు వారి చుట్టూ అల్లుకునే ఉండేవి.
ఆం.ప్ర.కల్చరల్ కౌన్సిల్ అధ్యక్షులుగా వారు నిర్వహించిన ‘నవలా కార్యశాల’లో నేను కూడా పాల్గొన్నాను. ఎక్కడ కనిపించినా ప్రతి ఒక్కరినీ పలకరించటం, యువకవులను కూడా వెన్నుదట్టి ప్రోత్సహించేవారు. తర్వాతి తరాల సాహిత్యకారులను తయారు చేయడంలో వారి పాత్ర విశిష్టమైనది. సచివాలయ సాంస్కృతిక సంఘ కార్యక్రమాల్లో కూడా అనేకసార్లు వారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే వారి కుటుంబం నిర్వహించే సుశీలా నారాయణరెడ్డి సాహితీపురస్కార సభల్లో ప్రేక్షకురాలిగా ఉత్సాహంగా పాల్గొన్నాను. వారు ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా నేను అప్పుడప్పుడు కలిసేదాన్ని. స్వయంగా కొన్ని కవితలను చదివి వినిపించేవారు. వారికి ఎటువంటి ప్రాంతీయ కుల వివక్షతలు లేవు. పార్లమెంట్లో తెలుగువారి ప్రత్యేక అంశాలను లేవనెత్తిన విధానం పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పటికీ సభలు జరుగుతుంటే ప్రతి అంశంలో నారాయణరెడ్డి గారు గుర్తొస్తారు. నిర్దిష్టమైన విలువల కోసం నిలబడిన వ్యక్తి వారు. మా ఇంట్లో జరిగిన రెండు పెళ్ళిళ్ళకి ప్రత్యేకంగా విచ్చేసి పిల్లల్ని ఆశీర్వదించటం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
వారికి లిఫ్టు ప్రమాదం జరిగి హాస్పిటల్లో చేరారని తెలిసి బాధపడి వెళ్ళాను. అలా వారిని చూసి వచ్చాక నా మనసు చాలా కలవరపడింది. అప్పుడు నేను ‘అక్షరం పడుకుంటుందా’ అనే కవిత రాశాను. ఆ తర్వాత కాలంలో నేను కోరుకున్నట్లుగానే కోలుకొని సభలకు రావడం మొదలుపెట్టారు. ఒకసారి రవీంద్రభారతి మెట్లు ఎక్కుతూ నాకు ఆ కవితలోని కొన్ని పంక్తులు వినిపిస్తూ “భవానీ ఏం రాశావ్” అన్నారు.
నాకు చాలామంది సాహిత్యవేత్తలతో పరిచయం ఉంది. అయినా ఇంతగా జీవితానికి దగ్గరగా అనుకున్న వ్యక్తి, పితృ సమానులు మరెవరూ లేరు. నిరంతరకవిగా కవిత్వాన్ని శ్వాసించి, మన కళ్ళముందే నడిచే కవిత్వంగా కదలాడి, మనతో ప్రేమగా మాట్లాడి, మనల్ని ముందుకు నడిపించిన మహనీయుడు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు. వారికి ఎన్నో గౌరవాలు అవార్డులు ఇవ్వబడ్డాయి. అన్నిటికంటే డాక్టర్ సినారే అనేపేరే ఎంతో గొప్పదిగా అనిపిస్తుంది. “పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ” ఇటువంటి జీవన సత్యాలు పాటల రూపంలో అందించి అడుగడుగునా మన జీవితానికి దారిదీపాలు చూపి వెళ్లారు. నేను కవిత్వం రాసినా, వ్యాఖ్యానం చెప్పినా, సంస్థల నిర్వాహకురాలుగా కార్యక్రమాలు చేసినా చాలాసార్లు వారే నాకు మార్గదర్శి. ఒక సందర్భం గుర్తొస్తున్నది. వ్యాఖ్యాతగా ఒక కార్యక్రమానికి ఆఫీస్ నుంచే రవీంద్రభారతికి చాలా హడావిడిగా వెళ్లాను. ఆ కార్యక్రమానికి సాంస్కృతికశాఖా మంత్రి, నారాయణరెడ్డిగారు తదితర అతిధులందరూ వచ్చేశారు. నిర్వాహకులు మాత్రం ఎంతకీ రాలేదు. నారాయణరెడ్డిగారు నన్ను పిలిచి కార్యక్రమం మొదలుపెట్టి నిర్వహించమన్నారు. నేను “నిర్వాహకులు రాలేదండి” అన్నాను. “వాళ్ళకోసం చూస్తామా.. నువ్వు నిర్వహించు” అని ఆదేశించారు. అలా నేను నిర్వాహకులు లేకుండానే ఆ సభను నిర్వహించాను. ఇది నాకు చాలా చిత్రమైన అనుభవం.


ఒక వక్త ఎలా మాట్లాడాలి, ఆడియన్స్‌ని లేదా ప్రేక్షకులను ఇలా మమేకం చేసుకోవాలి, వాళ్లతో ఎలా సంభాషించాలి, మన భాష ఎలా ఉండాలి? జనరంజకత్వం.. ఇవన్నీ వారినుండే నేర్చుకోవాలి. భావకవులకు కట్టుబొట్టు ప్రత్యేకమని చెప్తారు. నారాయణరెడ్డి గారు కూడా ప్రత్యేకమైన పంచకట్టుతో తెలుగుతనానికి నిదర్శనంగా అనుకరించలేని వ్యక్తిత్వంతో కనిపిస్తారు. అందులో వారు సృష్టించిన సాహిత్యం కూడా ముఖ్యభాగమే. వారికి చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చిందని అందరికీ తెలుసు. “నా శరీరంలో ఒక దొంగ ఉన్నాడు” అంటూ ఆ షుగర్ వ్యాధి గురించి రాసిన ఒక కవిత నేను బాగా అన్వయం చేసుకుంటుంటాను. ఆరోగ్యశ్రద్ధ కూడా వారిని చూసే నేర్చుకోవాలి.
2014 సంవత్సరంలో నా ‘నాలుగు దశాబ్దాల సాహితీ ఉత్సవం’ జరిగినప్పుడు జరిగిన సన్మానకార్యక్రమంలో డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా నాకు ‘స్వర్ణకంకణం’ , ‘సృజనధుని’ బిరుదు ప్రదానం చేశారు. ఇది ఒక అదృష్టం. ఇలా రాస్తుంటే ఎన్నో జ్ఞాపకాల పుటలు రెక్కలు విప్పుకుంటున్నాయి. ప్రతి మనిషి ఒక జ్ఞాపకాల సంపుటి అయితే నా జ్ఞాపకాల సంపుటిలో సినారె ఒక బంగారు పేజీ. వారు ఈ లోకం వదిలి వెళ్ళిపోయినప్పుడు నాకు మా నాన్నగారిని మళ్ళీ ఒకసారి పోగొట్టుకున్నంత బాధ కలిగింది. కొన్ని తరాలదాకా తెలుగు సాహిత్యం మీద వారు వేసిన ముద్ర చెరిగిపోదు. అందుకే సినారె అక్షరాలా అక్షరజీవి. అమృతజీవి.
1 Comments
అల్లూరి Gouri Lakshmi
సినారె గారి పై తనకు గల గురు భావాన్నీ,ఆయన తనను ఇన్ని రచనలు చేసేటట్టు ప్రభావితం చేయడాన్ని విశదీకరిస్తూ ఆయనతో తనకు గల సాన్నిహిత్యాన్ని చక్కగా వివరించారు భవానీదేవి గారు.అవన్నీ అక్షర సత్యాలు అన్నవి సమకాలికులుగా మాకు తెలుసు.కొత్త కవులను గౌరవంతో ప్రోత్సహించడం సినారె గారి లోని ప్రత్యేకత.వారి గురించి జ్ఞాపకం చేసిన మీకు అభినందనలు భవానీ గారూ !