చంపకమాల-
మనసున నున్నమాటలను మక్కువతోడవినంగనెప్పుడున్
మనిషికి మంచి తోడొకరు మాయలఁజేయని మిత్రమై,సుభా
వనలను కల్గి యున్నపుడు, పాయని శాంతియు సాంత్వనల్ మనో
వనమున పువ్వులై విరియు, వంతలు చింతలు దూరమౌనికన్.
పనులను మున్గియుండగ నపార్థములెవ్వియు లేని యొద్దికల్
ఘనముగ నుండగానచట గాఢతఁ బెంపుగ నుండునెప్పుడున్.
తనిసిన మానసమ్ములను ధన్యత నొందును మైత్రిభావనల్!
చనువులు హెచ్చుగా నగును, సంతసమెప్పుడు నిండుచుండగా.
ఉత్పలమాల-
బాల్యమునందు, యౌవనము, వార్ధకమందుననెప్పుడైన, చా
పల్యములుండు సాజమది ,వంచన మానసమందులేనిచో
తుల్యములేని స్నేహమున దోషములెంచుట, దూరుటేల? కై
వల్యము నిచ్చువాడెఱుగు, భావ్యమభావ్యములన్నిటిన్ గదా!
పిల్లల మధ్య, పెద్దలను, పెండ్లినిఁ గోరిన జంటలందునన్,
తల్లులు తండ్రులందు, పలు దారులఁ జేరెడు బాటసారులన్,
చెల్లును చెల్మి యెక్కుడుగ చిక్కులఁ జిక్కక నుండనోపు, శో
భిల్లును పృథ్వి, మైత్రియును ప్రేమలు నెల్లెడ నిండు నాళులన్.
కోమలమైన మానసము కుందకనుండగ, నిర్మలమ్ముగా
తామర పుష్పమై యడుసుఁ దాకక నిల్చిన భంగిగా నిటన్
వేమరు బాధలన్ నిలిచి వెల్గును మేదిని మైత్రి దీపమై
యామము తోడ నిశ్చలత నర్మిలి నిండిన మానసమ్ములన్.
బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి విమర్శకులు, అనువాదకురాలు. అత్యంత లోతైన రీతిలో విమర్శలు చేయగల అరుదైన విమర్శకులు.